యథార్థతతో యెహోవా సంస్థతోపాటూ సేవ చేయడం
“యథార్థవంతులయెడల నీవు యథార్థవంతుడవుగా నుందువు.”—2 సమూయేలు 22:26.
1, 2. సంఘంలో మనందరం చూసే యథార్థత యొక్క కొన్ని ఉదాహరణలు ఏవి?
ఒక పెద్ద, క్రైస్తవ కూటం కొరకు చాలా పొద్దుపోయేంతవరకు తన ప్రసంగం కొరకు సిద్ధపడతాడు. ఆయనకు కొంచెం సేపు ఆగి విశ్రాంతి తీసుకోవాలనే వుంటుంది; కాని ఆయన, హృదయాలను చేరుకునే మరియు మందను ప్రోత్సహించే లేఖనాధార ఉదాహరణలనూ, ఉపమానాలనూ వెదుకుతూ పని చేస్తూనే ఉంటాడు. కూటం జరిగే రోజు సాయంత్రం, అదే సంఘంలో తలిదండ్రులుగా వున్న ఓ జంట బాగా అలసిపోయినందున ఆ సాయంత్రం ఇంట్లో ఉండిపోవాలనే అనుకున్నా, వారు ఓపికగా తమ పిల్లలను సిద్ధం చేసి కూటాలకు తీసుకుపోతారు. ఆ కూటం తర్వాత, కొందరు క్రైస్తవులు గుంపుగా చేరి ఆ పెద్ద ఇచ్చిన ప్రసంగాన్ని గురించి చర్చిస్తారు. అదే పెద్ద ఒకసారి తన భావాలను గాయపరిచిన విషయాన్ని ప్రస్తావించేందుకు ఒక సహోదరి శోధించబడినా, ఆయన ప్రసంగించిన ఒక అంశాన్ని గురించి ఆమె ఉత్సాహంగా మాట్లాడుతుంది. ఈ దృశ్యాలన్నింటిలోనూ ఉన్న ఒక సాధారణమైన అంశాన్ని మీరు గమనించారా?
2 ఆ అంశమే యథార్థత. ఆ పెద్ద దేవుని మందకు సేవ చేసేందుకు యథార్థతతో పని చేశాడు; ఆ తలిదండ్రులు యథార్థతతో సంఘ కూటాలకు హాజరయ్యారు; ఆ సహోదరి యథార్థతతో పెద్దలకు మద్దతునిచ్చింది. (హెబ్రీయులు 10:24, 25; 13:17; 1 పేతురు 5:2) అవును, జీవితమందలి ప్రతి ఆకృతిలో, దేవుని ప్రజలు యథార్థతతో యెహోవా సంస్థతోపాటూ సేవ చేసేందుకు తీర్మానించుకుని ఉండటాన్ని మనం చూస్తాం.
3. యెహోవా యొక్క భూ సంస్థ ఎడల మనం యథార్థతతో ఉండాలన్నది ఎందుకంత ప్రాముఖ్యం?
3 యెహోవా ఈ కుళ్లిన ప్రపంచాన్ని చూసినప్పుడు ఆయనకు యథార్థత చాలా తక్కువగా కనిపిస్తుంది. (మీకా 7:2) తన ప్రజల యథార్థతను గమనించినప్పుడు ఆయన హృదయం ఆనందంతో ఎంతగా ప్రతిస్పందిస్తుందో కదా! అవును, మీ స్వంత యథార్థత ఆయనకు సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే, అది ఆదిమ తిరుగుబాటుదారుడైన సాతానుకు కోపాన్ని తెప్పించి, అతన్ని అబద్ధీకునిగా నిరూపిస్తుంది. (సామెతలు 27:11; యోహాను 8:44) యెహోవా ఎడలా ఆయన భూ సంస్థ ఎడలా మీ యథార్థతను బలహీనపర్చాలని సాతాను ప్రయత్నిస్తాడని మీరు ఎదురుచూడవచ్చు. సాతాను అలా చేసే కొన్ని మార్గాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాము. అలా మనం తుది వరకూ ఎలా యథార్థతతో ఉండగలమో శ్రేష్ఠంగా చూడవచ్చు.—2 కొరింథీయులు 2:11.
అసంపూర్ణతలపై దృష్టి కేంద్రీకరించడం యథార్థతను తరిగిపోజేయగలదు
4. (ఎ) అధికారంలో ఉన్న వారి ఎడల ప్రతికూల దృక్కోణాన్ని ఏర్పరచుకోవడం ఎందుకంత సులభం? (బి) కోరహు యెహోవా సంస్థ ఎడల ఎలా యథార్థతారాహిత్యానికి పాల్పడ్డాడు?
4 ఒక సహోదరుడు ఒకానొక బాధ్యతాయుత స్థానంలో ఉన్నప్పుడు అతని తప్పులు మరింత స్పష్టంగా కనిపించవచ్చు. మన ‘కంటిలోనున్న దూలాన్ని అలక్ష్యం చేస్తూ మన సహోదరుని కంటిలోనున్న నలుసును చూడటం’ ఎంత సులభమో కదా! (మత్తయి 7:1-5) కావున, తప్పిదాలపై అవధానముంచడం యథార్థతారాహిత్యానికి దారి తీయగలదు. ఉదాహరణకు, కోరహు మరియు దావీదుల మధ్యగల వ్యత్యాసాన్ని పరిశీలించండి. కోరహు ఎంతో బాధ్యతను కలిగి ఉన్నాడు, బహుశ అతడు అనేక సంవత్సరాల పాటూ యథార్థతతో కూడా ఉండి ఉండవచ్చు, అయితే అతడు అత్యాశకు లోనయ్యాడు. తన పినతండ్రి కుమారులైన మోషే అహరోనుల అధికారం ఎడల అతడు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ప్రారంభించాడు. మోషే భూమిపైనున్న వారందరిలోకీ దీనుడైన వ్యక్తి అయినప్పటికీ, ఆయనను కూడా కోరహు విమర్శనాత్మకంగా దృష్టించడం ప్రారంభించాడు. అతడు బహుశ మోషేలో లోపాలను చూసి వుంటాడు. అయితే, ఈ లోపాలు, యెహోవా సంస్థ యెడల కోరహు చూపిన యథార్థతారాహిత్యాన్ని సమర్థించలేదు. అతడు సమాజం మధ్యనుండి నిర్మూలించబడ్డాడు.—సంఖ్యాకాండము 12:3; 16:11, 31-33.
5. సౌలుకు విరుద్ధంగా తిరుగుబాటు చేసేందుకు శోధింపబడినట్లు దావీదు ఎందుకు భావించి ఉండవచ్చు?
5 మరో వైపు దావీదు, రాజైన సౌలు క్రింద సేవ చేశాడు. ఒకప్పుడు మంచి రాజైనప్పటికీ, సౌలు వాస్తవమందు దుష్టుడైపోయాడు. అసూయగల సౌలు యొక్క దాడులను తప్పించుకునేందుకు దావీదుకు విశ్వాసం, సహనం, మరి కొంత చాతుర్యం కూడా కావలసి వచ్చాయి. అయినప్పటికీ, పగ తీర్చుకునే అవకాశం దావీదుకు లభించినప్పుడు, యెహోవా అభిషేకించిన వానికి విరుద్ధంగా యథార్థహీనత చూపడం ‘యెహోవా దృష్టిలో తనకు అసాధ్యమని’ ఆయన అన్నాడు.—1 సమూయేలు 26:11.
6. మనం పెద్దలలో బలహీనతలనూ తప్పిదాలనూ గమనించినప్పటికీ, మనం ఏది ఎన్నడూ చేయకూడదు?
6 నడిపింపునిస్తున్న వారు ఎవరైనా తీర్పు తీర్చడంలో తప్పిదం చేస్తే, కఠినమైన మాటలు మాట్లాడితే, లేక స్వజనాభిమానం చూపిస్తున్నట్లు అనిపిస్తే, బహుశ సంఘంలో విమర్శనాత్మక స్ఫూర్తిని వృద్ధి చేస్తూ మనం వారి గురించి ఫిర్యాదు చేస్తామా? అసమ్మతి వ్యక్తం చేసే విధానంగా క్రైస్తవ కూటాలకు హాజరవ్వకుండా ఉంటామా? అలా ఎంతమాత్రం చేయము! దావీదు వలె, ఇతరుల తప్పిదాలు మనం యెహోవాకూ ఆయన సంస్థకూ యథార్థతారాహిత్యాన్ని చూపేలా మనలను పురికొల్పనివ్వకుండా ఉందాము!—కీర్తన 119:165.
7. యెరూషలేములోని ఆలయానికి సంబంధించి వృద్ధి చెందిన భ్రష్టమైన అలవాట్లు కొన్ని ఏవి, వాటి గురించి యేసు ఎలా భావించాడు?
7 యథార్థతకుగల అత్యంత గొప్ప మానవ ఉదాహరణ యేసుక్రీస్తు, ఆయన యెహోవా యొక్క ‘యథార్థవంతునిగా’ ప్రవచనార్థకంగా వర్ణించబడ్డాడు. (కీర్తన 16:10) యెరూషలేములోని ఆలయాన్ని అవినీతికరమైన విషయాల నిమిత్తం దుర్వినియోగపర్చడం యథార్థతతో ఉండటాన్ని ఒక సవాలుగా చేసి ఉండవచ్చు. ప్రధాన యాజకుని పనీ బలులూ ఈ రెండూ, తన స్వంత పరిచర్యనూ మరియు బలి మరణాన్నీ సూచించాయని యేసుకు తెలుసు, మరియు వాటి నుండి ప్రజలు నేర్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆ దేవాలయం “దొంగల గుహగా” మారినప్పుడు ఆయన నీతియుక్తమైన ఆగ్రహంతో నిండిపోయాడు. దేవుడిచ్చిన అధికారంతో, ఆయన దాన్ని శుభ్రపర్చేందుకు రెండుసార్లు చర్యలు తీసుకున్నాడు.a—మత్తయి 21:12, 13; యోహాను 2:15-17.
8. (ఎ) ఆలయ ఏర్పాటుకు యేసు యథార్థతను ఎలా కనుపర్చాడు? (బి) యెహోవాను ఆయన పరిశుభ్రమైన సంస్థతో పాటు ఆరాధించడాన్ని మనం మెప్పుదలతో చూస్తున్నామని మనం ఎలా చూపగలం?
8 అయినప్పటికీ, యేసు దేవాలయ ఏర్పాటుకు యథార్థతతో మద్దతునిచ్చాడు. చిన్నతనం నుండి, ఆయన దేవాలయంలో పండుగలకు హాజరయ్యాడు మరియు అక్కడ తరచూ బోధించాడు. ఆయన పన్ను చెల్లించవలసిన అవసరం లేకున్నా ఆయన దేవాలయ పన్ను కూడా చెల్లించాడు. (మత్తయి 17:24-27) దేవాలయ కానుకపెట్టెలో “తన జీవనమంతయు” వేసిన బీద విధవరాలిని యేసు మెచ్చుకున్నాడు. అది జరిగిన కొంత కాలానికే, ఆ దేవాలయాన్ని యెహోవా శాశ్వతంగా నిరాకరించాడు. అయితే అంత వరకూ, యేసు దాని ఎడల యథార్థతతో ఉన్నాడు. (మార్కు 12:41-44; మత్తయి 23:38) నేడు దేవుని భూ సంస్థ, యూదా వ్యవస్థ దాని ఆలయంతో పాటూ ఉన్నదానికంటే ఎంతో ఉన్నత స్థితిలో ఉంది. అయితే అది పరిపూర్ణమైనది కాదనే విషయం వాస్తవమే; అందుకే అప్పుడప్పుడూ సవరణలు చేయబడుతున్నాయి. అయితే అది భ్రష్టత్వంతో చెడిపోలేదు, లేదా యెహోవా దేవుడు దాని స్థానంలో మరో దాన్ని పెట్టేందుకు సిద్ధంగా లేడు. దానిలో మనం గమనించే ఎలాంటి అపరిపూర్ణతలు కూడా మనలో చేదు భావాలను వృద్ధి చేసేందుకూ లేక విమర్శనాత్మక, ప్రతికూల స్ఫూర్తిని మనం అలవర్చుకునేందుకూ మనలను నడపనీయ కూడదు. బదులుగా, మనం యేసుక్రీస్తు యొక్క యథార్థతను అనుకరిద్దాము.—1 పేతురు 2:21.
మన స్వంత అపరిపూర్ణతలు
9, 10. (ఎ) మనలను యథార్థతారాహిత్య ప్రవర్తనకు నడిపించేందుకు సాతాను యొక్క వ్యవస్థ మన అపరిపూర్ణతలను ఎలా సొమ్ము చేసుకుంటుంది? (బి) గంభీరమైన పాపాన్ని చేసిన వ్యక్తి ఏమి చేయాలి?
9 మన అపరిపూర్ణతలను సొమ్ము చేసుకోవడం ద్వారా సాతాను కూడా యథార్థతారాహిత్యాన్ని పురికొల్పుతాడు. అతడి దుష్ట విధానం, యెహోవా దృష్టికి తప్పైనదాన్ని చేసేలా మనలను శోధించడం ద్వారా మన బలహీనతలనుండి లాభం పొందుతుంది. దుఃఖకరంగా, ప్రతి సంవత్సరం వేలాదిమంది అనైతికతకు పాల్పడుతున్నారు. కొందరు చెడు ప్రవర్తనలో కొనసాగుతూ నమ్మకమైన క్రైస్తవులుగా ఉంటున్నట్లు నటించడం ద్వారా ద్వంద్వ జీవితాన్ని జీవిస్తూ ఈ యథార్థతారాహిత్యాన్ని రెండంతలు చేస్తారు. ఈ అంశానికి సంబంధించి తేజరిల్లు!లోని “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . ” అనే శీర్షికలకు ప్రతిస్పందనగా, ఒక యౌవనస్థురాలు ఇలా వ్రాసింది: “ఆ శీర్షికలు నా జీవిత చరిత్రను చూపాయి.” యెహోవాను ప్రేమించని యౌవనులతో ఆమె రహస్యంగా స్నేహాన్ని పెంపొందించుకుంది. దాని ఫలితం? ఆమె ఇలా వ్రాస్తుంది: “నా జీవితం అధమస్థితికి దిగజారిపోయింది, నేను అనైతికతకు పాల్పడ్డాను మరి నాకు గద్దింపు అవసరమైంది. యెహోవాతో నాకుగల బాంధవ్యం పాడైపోయింది, మరి నా తలిదండ్రులకూ పెద్దలకూ నాపై ఉన్న నమ్మకం పోయింది.”b
10 ఈ యౌవనస్థురాలు పెద్దలనుండి సహాయాన్ని పొందింది మరియు యెహోవాకు యథార్థతతో సేవ చేయడం ప్రారంభించింది. దుఃఖకరంగా, అనేకులు మరింత తీవ్రమైన పరిస్థితులను అనుభవిస్తారు, కొందరు సంఘంలోనికి ఎన్నడూ తిరిగిరారు. మనం యథార్థంగా ఉండి ఈ దుష్ట విధానంలోని శోధనలను ఎదిరించడం ఎంత మంచిదో కదా! లోకసంబంధ సహవాసం మరియు నీచమైన వినోదం వంటి అంశాలపై కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలు అందించే హెచ్చరికలను లక్ష్యపెట్టండి. మీరు యథార్థతారాహిత్య ప్రవర్తనలో ఎన్నడూ పడిపోకుండా ఉందురు గాక. అయితే మీరలా ఒకవేళ పడిపోతే, మీ అసలు రూపం దాచిపెడుతూ నటించకండి. (కీర్తన 26:4) బదులుగా, సహాయాన్ని పొందండి. క్రైస్తవ తలిదండ్రులూ పెద్దలూ ఉన్నది అందుకే.—యాకోబు 5:14.
11. మనలను మనం అత్యంత దుష్టులనుగా దృష్టించుకోవడం ఎందుకు తప్పు అవుతుంది, మరియు మన దృక్కోణాన్ని సరి చేసుకునేందుకు బైబిలులోని ఏ ఉదాహరణ మనకు సహాయం చేస్తుంది?
11 మన అపరిపూర్ణతలు మనలను మరో విధంగా ప్రమాదంలో పడవేయవచ్చు. యథార్థాతారాహిత్య క్రియ చేసిన వారు, యెహోవాను ప్రీతిపర్చాలనే ప్రయత్నాలను విరమించుకుంటారు. జ్ఞాపకం చేసుకోండి, దావీదు ఎంతో గంభీరమైన పాపాలను చేశాడు. అయినప్పటికీ, దావీదు మరణించిన చాలాకాలం తర్వాత కూడా, యెహోవా ఆయనను నమ్మకమైన సేవకునిగా జ్ఞాపకం చేసుకున్నాడు. (హెబ్రీయులు 11:32; 12:1) ఎందుకు? ఎందుకంటే ఆయన యెహోవాను ప్రీతిపర్చడానికి ప్రయత్నించడాన్ని ఎన్నడూ మానుకోలేదు. సామెతలు 24:16 ఇలా చెబుతుంది: “నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును.” మనం పోరాడుతున్న ఏదైనా బలహీనత మూలంగా మనం చిన్న పాపాల్లో, మళ్లీ మళ్లీ పడిపోయినా కూడా, మనం ‘తిరిగి లేస్తూ’ ఉంటే, అంటే మనం నిజాయితీగా పశ్చాత్తాపం చెంది యథార్థ సేవా మార్గంలో కొనసాగితే యెహోవా దృష్టిలో ఇంకా నీతియుక్తంగానే ఉండవచ్చు.—2 కొరింథీయులు 2:7 పోల్చండి.
యథార్థతారాహిత్యం యొక్క మోసకరమైన రూపాల విషయమై జాగ్రత్త!
12. పరిసయ్యుల విషయంలో, కఠినమైన, కర్కశ దృక్కోణం యథార్థతారాహిత్యానికి ఎలా నడిపించింది?
12 యథార్థతారాహిత్యం అనేది మోసకరమైన రూపాలను కూడా కలిగి ఉంటుంది. అది యథార్థత అనే ముసుగును ధరించవచ్చు కూడా! ఉదాహరణకు, యేసు కాలంలోని పరిసయ్యులు తామే అత్యంత యథార్థవంతులమని బహుశ భావించి ఉండవచ్చు.c అయితే వారు యథార్థతతో ఉండడానికీ, మానవులు రూపొందించిన నియమాలకు నిరంకుశంగా హత్తుకొని ఉండడానికీ మధ్యగల వ్యత్యాసాన్ని చూడటంలో విఫలమయ్యారు, ఎందుకంటే వారు కఠినంగానూ కర్కశ తీర్పరులుగానూ ఉన్నారు. (ప్రసంగి 7:16 పోల్చండి.) ఈ విషయంలో వారు, తాము ఎవరికి సేవ చేయవలసి ఉండిరో వారి ఎడలా తాము బోధిస్తున్నామని చెప్పుకునే ధర్మశాస్త్రమందలి స్ఫూర్తి ఎడలా యెహోవా దేవుని ఎడలా వాస్తవంగా యథార్థతారాహిత్యాన్ని కనుపర్చారు. దానికి భిన్నంగా, యేసు ప్రేమపై ఆధారపడిన ధర్మశాస్త్రం యొక్క స్ఫూర్తికి యథార్థతతో ఉన్నాడు. అలా మెస్సీయను గురించిన ప్రవచనాలు ముందుగానే చెప్పిన విధంగా ఆయన ప్రజలను దృఢపరచి వారిని ప్రోత్సహించాడు.—యెషయా 42:3; 50:4; 61:1, 2.
13. (ఎ) క్రైస్తవ తలిదండ్రులు యథార్థతారహితంగా ఎలా ఉండగలరు? (బి) తలిదండ్రులు తమ పిలల్లకు క్రమశిక్షణనిచ్చే విషయంలో మరీ కఠినంగా, విమర్శనాత్మకంగా లేక ప్రతికూలంగా ఉండటాన్ని ఎందుకు నివారించాలి?
13 కొంత అధికారాన్ని కలిగి ఉన్న క్రైస్తవులు ఈ విషయంలో యేసు మాదిరి నుండి ఎంతో గొప్పగా ప్రయోజనం పొందుతారు. ఉదాహరణకు, తమ పిల్లలకు శిక్షణనివ్వాలని యథార్థవంతులైన తలిదండ్రులకు తెలుసు. (సామెతలు 13:24) అయినప్పటికీ, వారు కోపంతో ఇవ్వబడిన కఠినమైన శిక్షణను లేక వారిని ఎడతెగక విమర్శించడం ద్వారా వారిని విసిగించరు. తాము తమ తలిదండ్రులను ఎన్నడూ ప్రీతిపర్చలేమని భావించే పిల్లలు, లేక తమ తలిదండ్రుల మతం వారిని ప్రతికూల మరియు విమర్శనాత్మక ప్రజలనుగా చేస్తుందని భావించే పిల్లలు కృంగిపోవచ్చు, దాని ఫలితంగా వారు నిజమైన విశ్వాసానికి దూరం కావచ్చు.—కొలొస్సయులు 3:21.
14. తాము సేవ చేసే మంద ఎడల క్రైస్తవ మంద కాపరులు యథార్థతతో ఎలా ఉండవచ్చు?
14 అదే విధంగా, క్రైస్తవ పెద్దలు మరియు ప్రయాణ పైవిచారణకర్తలు మంద ఎదుర్కొనే సమస్యలు మరియు ప్రమాదాల వైపు అవధానాన్నిస్తారు. యథార్థతగల మంద కాపరులుగా, తాము మొదట అన్ని వాస్తవాలనూ తెలుసుకుని తాము చెప్పే విషయాలు బైబిలు ఆధారంగా మరియు సంస్థ యొక్క ప్రచురణల ఆధారంగా ఉన్నాయో లేదో చూసుకుని అవసరమైనప్పుడు వారు సలహాలను ఇస్తారు. (కీర్తన 119:105; సామెతలు 18:13) ఆత్మీయ ప్రోత్సాహం మరియు పోషణ విషయమై గొర్రెలు తమ వైపు చూస్తారని కూడా వారికి తెలుసు. కాబట్టి వారు మంచి కాపరియైన యేసుక్రీస్తును అనుకరించేందుకు ప్రయత్నిస్తారు. కూలద్రోసేందుకు బదులు వారు గొర్రెలను దృఢపర్చి వారి విశ్వాసాన్ని బలపర్చడం ద్వారా ప్రతీవారం క్రైస్తవ కూటాల్లో యథార్థతతో పరిచర్య చేస్తారు.—మత్తయి 20:28; ఎఫెసీయులు 4:11, 12; హెబ్రీయులు 13:20, 21.
15. మొదటి శతాబ్దంలోని కొందరు అనుచితమైన యథార్థతను కలిగి ఉన్నట్లు ఎలా చూపారు?
15 యథార్థతారాహిత్యం యొక్క మరొక మోసకరమైన రూపం అనుచితమైన యథార్థత. బైబిలు భావంలో నిజమైన యథార్థత, మనం ఎలాంటి విధమైన భక్తినీ కూడా యెహోవా దేవునికి మనం చూపే యథార్థతకు ముందు ఉంచేందుకు అనుమతించదు. మొదటి శతాబ్దంలో అనేకమంది యూదులు మొండిపట్టుతో మోషే ధర్మశాస్త్రానికీ యూదా మత విధానానికీ హత్తుకుపోయారు. అయితే యెహోవా, తిరుగుబాటు చేసిన ఆ జనాంగం నుండి ఆత్మీయ ఇశ్రాయేలీయుల జనాంగానికి తన దీవెనలను మార్చేందుకు సమయం ఆసన్నమయ్యింది. కేవలం కొద్దిమంది మాత్రమే యెహోవాకు యథార్థతను చూపి, ఈ అత్యంత గొప్ప మార్పును స్వీకరించారు. నిజమైన క్రైస్తవుల్లో కూడా, క్రీస్తు విషయంలో నెరవేరిన మోషే ధర్మశాస్త్రం యొక్క “బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన” వాటి వైపుకు మళ్లీ వెళ్లాలని పట్టుబట్టిన యూదుల ఆచారవ్యవహారాలను పాటించే వారు కూడా కొందరు ఉండిరి.—గలతీయులు 4:9; 5:6-12; ఫిలిప్పీయులు 3:2, 3.
16. యెహోవా యొక్క యథార్థతగల సేవకులు సవరణలకు ఎలా ప్రతిస్పందిస్తారు?
16 దానికి భిన్నంగా, ఆధునిక కాలాల్లోని యెహోవా ప్రజలు మార్పు కలిగిన కాలాల్లో కూడా తమను తాము యథార్థతగల ప్రజలుగా నిరూపించుకున్నారు. బయల్పర్చబడిన సత్యపు వెలుగు తేజరిల్లుతూ ఉండగా, సవరణలు చేయబడ్డాయి. (సామెతలు 4:18) ఇటీవలనే, మత్తయి 24:34 నందు ఉపయోగించబడిన “తరము” అనే పదానికి సంబంధించిన, మత్తయి 25:31-46 నందు ప్రస్తావించబడిన “గొఱ్ఱెలు” మరియు “మేకల”కు జరిగే తీర్పు యొక్క సమయాన్ని గురించిన, అలాగే కొన్ని విధాలైన పౌర సేవలను గురించిన మన అవగాహనను మెరుగుపర్చుకునేందుకు ‘నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ మనకు సహాయం చేశాడు. (మత్తయి 24:45) యెహోవాసాక్షుల్లో అనేకులు, అలాంటి అంశాలను గురించిన తమ పూర్వపు అవగాహనలకు మూర్ఖంగా హత్తుకుపోయి పురోగమించేందుకు నిరాకరించి వుంటే, మతభ్రష్టులు ఎంతో ఆనందించి ఉండేవారు. అయితే అలాంటిదేమీ సంభవించలేదు. ఎందుకని? యెహోవా ప్రజలు యథార్థతగలవారు.
17. కొన్నిసార్లు మన ప్రియమైన వారు ఎలా మన యథార్థత పరీక్షకు గురయ్యేలా చేయవచ్చు?
17 అయితే అనుచితమైన యథార్థత మనలను వ్యక్తిగతంగా ప్రభావితం చేయవచ్చు. ఒక ప్రియమైన స్నేహితుడు లేక కుటుంబ సభ్యుడు కూడా బైబిలు సూత్రాలను ఉల్లంఘించే మార్గాన్ని చేపడితే, మనం యథార్థతల మధ్య విభాగింపబడుతున్నట్లు భావించవచ్చు. సహజంగానే, మనం మన కుటుంబ సభ్యుల ఎడల యథార్థంగా ఉండాలని భావిస్తాము. అయితే యెహోవాకు చూపే యథార్థతకంటే మనం వారికి ఎన్నడూ ఎక్కువ ప్రాముఖ్యతనివ్వకూడదు! (1 సమూయేలు 23:16-18 పోల్చండి.) ఒక గంభీరమైన పాపాన్ని కప్పిపుచ్చేందుకు మనం తప్పిదస్థునికి సహాయపడము, అలాగే “సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని [రావడానికి]” ప్రయత్నిస్తున్న పెద్దలకు విరుద్ధంగా, తప్పిదస్థుని పక్షమూ వహించం. (గలతీయులు 6:1) అలా చేయడం యెహోవా ఎడల, ఆయన సంస్థ ఎడల మరియు మన ప్రియమైన వారి ఎడల యథార్థతారాహిత్యంగా ఉన్నట్లు అవుతుంది. ఎంతైనా, ఒక పాపికీ అతనికి అవసరమైన క్రమశిక్షణకూ మధ్య మనం అడ్డుగోడగా నిలవడం, అతని ఎడల యెహోవా చూపుతున్న ప్రేమ యొక్క వ్యక్తీకరణను అడ్డగించినట్లే అవుతుంది. (హెబ్రీయులు 12:5-7) “మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును” అనే విషయాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి. (సామెతలు 27:6) దేవుని వాక్యంపై ఆధారపడిన దాపరికంలేని, ప్రేమపూర్వకమైన సలహా మీ ప్రియమైన వారి అహాన్ని దెబ్బతీయవచ్చు, అయితే మున్ముందు అది జీవాన్ని రక్షించేదిగా ఉండవచ్చు!
యథార్థత హింస వచ్చినా తట్టుకుంటుంది
18, 19. (ఎ) నాబోతును ఆహాబు ఏమి కోరాడు, నాబోతు ఎందుకు నిరాకరించాడు? (బి) నాబోతు యొక్క యథార్థత యోగ్యమైనదేనా? వివరించండి.
18 కొన్నిసార్లు సాతాను మన యథార్థతపై సూటిగా దాడి చేస్తాడు. నాబోతు విషయాన్ని పరిశీలించండి. ఆయనకున్న ద్రాక్ష తోటను తనకు అమ్మమని రాజైన ఆహాబు ఆయనపై వత్తిడి తెచ్చినప్పుడు, ఆయనిలా సమాధానమిచ్చాడు: ‘నా పిత్రార్జితమును నీ కిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదు.’ (1 రాజులు 21:3) నాబోతు మొండిపట్టు పట్టలేదు; ఆయన యథార్థతతో ఉన్నాడు. ఏ ఇశ్రాయేలీయుడు కూడా తన వారసత్వ స్వాస్థ్యాన్ని శాశ్వతంగా అమ్ముకోకూడదని మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞాపించింది. (లేవీయకాండము 25:23-28) ఈ దుర్మార్గపు రాజు తనను చంపిస్తాడని నాబోతుకు తప్పకుండా తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఆహాబు తన భార్యయైన యెజెబెలు యెహోవా యొక్క ప్రవక్తలనేకులను చంపించేందుకు ఇప్పటికే అనుమతించాడు! అయినప్పటికీ నాబోతు దృఢంగా నిలిచాడు.—1 రాజులు 18:4.
19 కొన్నిసార్లు యథార్థత విషయమై మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. కొంతమంది “పనికిమాలిన . . . మనుష్యుల” సహాయంతో యెజెబెలు నాబోతు చేయని తప్పుకు ఆయనకు శిక్షపడేలా పన్నాగాన్ని పన్నింది. దాని ఫలితంగా ఆయనా ఆయన కుమారులూ చంపబడ్డారు. (1 రాజులు 21:7-16; 2 రాజులు 9:26) నాబోతు అనుచితమైన యథార్థత కనపర్చాడని దాని భావమా? లేదు! పునరుత్థాన సమయం వరకూ సమాధిలో సురక్షితంగా నిద్రిస్తూ, ప్రస్తుతం యెహోవా యొక్క జ్ఞాపకంలో ‘సజీవంగా’ ఉన్న అనేకమంది యథార్థవంతులైన స్త్రీపురుషుల్లో నాబోతు కూడా ఒకడు.—లూకా 20:38; అపొస్తలుల కార్యములు 24:15.
20. మన యథార్థతను కాపాడుకునేందుకు నిరీక్షణ మనకు ఎలా సహాయం చేయగలదు?
20 నేడు యెహోవా యొక్క యథార్థవంతులకు అదే వాగ్దానం నిశ్చయతనిస్తుంది. ఈ లోకంలో మన యథార్థత మూలంగా మనం ఎంతో మూల్యాన్ని చెల్లించాల్సి రావచ్చు అని మనకు తెలుసు. యేసుక్రీస్తు తన యథార్థత విషయమై తన జీవాన్ని మూల్యంగా ఇచ్చాడు, మరి తన అనుచరులకూ అదే జరుగుతుందని ఆయన వారికి చెప్పాడు. (యోహాను 15:20) భవిష్యత్తును గురించిన ఆయన నిరీక్షణ ఆయనను బలపర్చింది, అలాగే మన నిరీక్షణ ద్వారా మనం బలపర్చబడ్డాం. (హెబ్రీయులు 12:2) అలా మనం ఏ విధమైన హింస వచ్చినప్పటికీ యథార్థతతో ఉండగలము.
21. తన యథార్థవంతులకు యెహోవా ఏ నిశ్చయతలను అందిస్తున్నాడు?
21 నిజమే, నేడు తులనాత్మకంగా మనలో చాలా తక్కువ మంది యొక్క యథార్థత సూటిగా దాడి చేయబడుతుంది. అయితే దేవుని ప్రజలు అంతం రాకముందు ఇంకా ఎక్కువ హింసను సహించాల్సి రావచ్చు. మన యథార్థతను కాపాడుకునేందుకు మనం ఎలా నిశ్చయతను కలిగి ఉండవచ్చు? ఇప్పుడు మన యథార్థతను నిలుపుకోవడం ద్వారానే. యెహోవా తన రాజ్యాన్ని గురించి ప్రకటించి, బోధించడమనే గొప్ప ఆజ్ఞను మనకిచ్చాడు. ఈ ప్రాముఖ్యమైన పనిని ఎల్లప్పుడూ యథార్థతతో చేద్దాము. (1 కొరింథీయులు 15:58) యెహోవా సంస్థ ఎడల మనకున్న యథార్థతను మానవ అపరిపూర్ణతలు క్షీణింపజేసేందుకు అనుమతించకపోతే మరియు అనుచితమైన యథార్థత వంటి యథార్థతారాహిత్యం యొక్క మోసకరమైన రూపాలకు విరుద్ధంగా మనల్ని కాపాడుకుంటే, అప్పుడు మన యథార్థత ఒకవేళ ఎక్కువ తీవ్రంగా పరీక్షింపబడినప్పటికీ మనం దాని కొరకు మరింత సంసిద్ధతతో ఉంటాము. ఏది ఏమైనప్పటికీ, తన యథార్థవంతులైన సేవకుల ఎడల యెహోవా విఫలంకాని యథార్థతను ప్రదర్శిస్తాడని మనం ఎల్లప్పుడూ నిశ్చయతను కలిగి ఉండవచ్చు. (2 సమూయేలు 22:26) అవును, ఆయన తన యథార్థవంతులను కాపాడతాడు!—కీర్తన 97:10.
[అధస్సూచీలు]
a అలాంటి లాభాపేక్ష వ్యాపార వ్యవహారంపై దాడి చేయగలిగేందుకు యేసుకు ధైర్యం ఉండినది. ఒక చరిత్రకారుని ప్రకారం, ఆలయ పన్నుగా ఒక ప్రత్యేక ప్రాచీన యూదా నాణేన్నే చెల్లించాలి. దేవాలయానికి వచ్చిన అనేకమంది సందర్శకులు పన్ను చెల్లించేందుకు తమ డబ్బును మార్చుకోవలసి వచ్చేది. అలా మార్పిడి చేస్తున్నందుకు మార్పిడిదారులు కొంత నిర్ధారిత రుసుము వసూలు చేయడానికి అనుమతించబడే వారు, అది వారికి చాలా ఎక్కువ డబ్బును తెచ్చిపెట్టింది.
b డిశంబరు 22, 1993; జనవరి 8, 1994; మరియు జనవరి 22, 1994 తేజరిల్లు!లను (ఆంగ్లం) చూడండి.
c వారి మత సంఘం హసీడిమ్ నుండి సంతరించుకున్నది, హసీడిమ్ అనేది శతాబ్దాల క్రితం గ్రీకు ప్రభావాన్ని ఎదురాడేందుకు పైకి లేచిన ఒక గుంపు. హసీడిమ్ తమ పేరును “యథార్థవంతులు” లేక “భక్తిగల వారు” అనే అర్థాలుగల ఛాసిడిమ్ అనే హెబ్రీ పదం నుండి తీసుకున్నారు. యెహోవా యొక్క ‘యథార్థవంతులను’ సూచించే లేఖనాలు ఏదో ప్రత్యేక భావంలో తమకు అన్వయిస్తాయని వారు బహుశ భావించి ఉండవచ్చు. (కీర్తన 50:5, NW) వారు, వారి తర్వాత పరిసయ్యులు ధర్మశాస్త్రం యొక్క మత ఛాందసత్వ స్వయం నియుక్త రక్షకులుగా ప్రవర్తించారు.
మీరు ఎలా సమాధానమిస్తారు?
▫ ఇతరుల అపరిపూర్ణతలు మనలను యథార్థతారాహిత్యానికి నడిపించడాన్ని మనం ఎలా నివారించవచ్చు?
▫ మన స్వంత అపరిపూర్ణతలు మనలను ఏయే మార్గాల్లో యథార్థతారాహిత్య ప్రవర్తనకు నడిపేలా చేయవచ్చు?
▫ మనం అనుచితమైన యథార్థతను చూపడమనే ప్రవృత్తిని ఎలా నివారించగలము?
▫ హింసా సమయాల్లో కూడా మనం యథార్థతతో ఉండేందుకు మనకు ఏది సహాయపడుతుంది?
[9వ పేజీలోని బాక్సు]
బేతేలులో యథార్థతతో సేవ చేయడం
“సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి.” ఆలాగని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 14:40) ఒక సంఘం పని చేయాలంటే, “క్రమము,” అంటే సంస్థీకరణ అవసరమని పౌలుకు తెలుసు. అదే విధంగా నేడు, సంఘ సభ్యులను వేర్వేరు పుస్తక పఠన స్థానాలకు నియమించడం, క్షేత్ర సేవ కొరకు కూటాలను ఏర్పాటు చేయడం మరియు క్షేత్రమందు ఎంతవరకు సేవ జరిగిందనే విషయాలను పరిశీలించడం వంటి ఆచరణాత్మక విషయాల్లో పెద్దలు నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అలాంటి ఏర్పాట్లు కొన్నిసార్లు యథార్థతను పరీక్షించవచ్చు. అవి దైవికంగా ప్రేరేపింపబడిన ఆజ్ఞలు కావు, అవి అందరి ఇష్టానికీ అనుగుణంగా ఉండలేవు.
క్రైస్తవ సంఘంలో చేయబడిన ఆచరణాత్మక ఏర్పాట్లలో కొన్నిటి ఎడల యథార్థతతో ఉండటం మీకు కొన్నిసార్లు సవాలుగా ఉన్నట్లు మీకు అనిపిస్తుందా? అలాగైతే, బేతేలు యొక్క ఉదాహరణ మీకు సహాయకరంగా ఉంటుందని మీరు కనుగొనవచ్చు. “దేవుని గృహము” అనే అర్థమున్న హెబ్రీ పదమైన బేతేలు అనే పేరు, అమెరికా నందలి ముఖ్య కార్యాలయంతోపాటూ వాచ్ టవర్ సొసైటీ యొక్క 104 బ్రాంచిలన్నింటికీ ఇవ్వబడింది.d బేతేలు భవన సముదాయాల్లో నివసిస్తూ, అక్కడ పని చేసే స్వచ్ఛంద సేవకులు, ఈ స్థలాలు యెహోవా ఎడలగల భయమునూ భక్తినీ ప్రతిబింబించాలని కోరుకుంటారు. అందుకు ప్రతి ఒక్కరూ యథార్థంగా ఉండవలసిన అవసరముంది.
బేతేలుకు వచ్చే సందర్శకులు, అక్కడ తాము చూసే క్రమబద్ధతను మరియు పరిశుభ్రతను గురించి తరచూ మెచ్చుకుంటారు. అక్కడ పని చేసేవారు సంస్థీకరించబడి ఉన్నారు మరియు ఆనందంగా ఉంటారు; వారి సంభాషణ, మర్యాద చివరికి వారి ప్రవర్తన మరియు వేషభాషలు కూడా వారు పరిణతిగల, బైబిలు శిక్షిత క్రైస్తవ మనస్సాక్షిగల వారనే విషయాన్ని సూచిస్తాయి. బేతేలు కుటుంబంలోని సభ్యులందరూ దేవుని వాక్యమందలి ప్రమాణాలను యథార్థతతో హత్తుకుంటారు.
దానికి తోడు, పరిపాలక సభ ఐక్యంగా కలిసి నివసించడం (ఆంగ్లం) అనే పేరుగల మాన్యువల్‌ను వారికి అందిస్తుంది, అంత పెద్ద కుటుంబం కలిసి పని చేసేందుకు అవసరమయ్యే కొన్ని ఆచరణాత్మక ఏర్పాట్లు అందులో దయాపూర్వకంగా పొందుపర్చబడ్డాయి. (కీర్తన 133:1) ఉదాహరణకు, ఆ పుస్తకం నివాసం, భోజనం, పరిశుభ్రత, వస్త్రధారణ, కేశాలంకరణ, మరితర విషయాలను గురించి చర్చిస్తుంది. బేతేలు కుటుంబ సభ్యులు అలాంటి ఏర్పాట్లకు యథార్థంగా మద్దతునిస్తారు, మరి వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అవి భిన్నంగా ఉన్నప్పుడు కూడా వారు అలాగే చేస్తారు. వారు ఈ మాన్యువల్‌ను కఠోరమైన నియమాలూ కట్టడల సముదాయంగా పరిగణించరు, బదులుగా ఐక్యతనూ సామరస్యాన్నీ పురికొల్పే ఉపయోగకరమైన నియమాలుగా వారు పరిగణిస్తారు. ఈ బైబిలు ఆధారిత పద్ధతులను సమర్థించడంలో పైవిచారణకర్తలు యథార్థతతో ఉంటారు, మరియు బేతేలు కుటుంబం తమ పవిత్రమైన బేతేలు సేవను కొనసాగించడంలో వారిని పురికొల్పి ప్రోత్సహించేందుకు వారు వాటిని ఉపయోగిస్తారు.
[అధస్సూచీలు]
d ఈ ఫ్యాక్టరీ, కార్యాలయ మరియు నివాస భవన సముదాయాలు దేవుని గొప్ప ఆత్మీయ ఆలయాన్నీ లేక గృహాన్నీ సూచించవు. దేవుని ఆత్మీయ ఆలయము, పవిత్ర ఆరాధన కొరకైన ఆయన ఏర్పాటు. (మీకా 4:1) అలా, అది భూమిపైని ఎలాంటి భౌతిక కట్టడానికీ పరిమితం కాలేదు.
[10వ పేజీలోని బాక్సు]
యథార్థతగలవాడు మరియు శాసనబద్ధుడు
వెనుకటికి 1916లో, “యథార్థవంతునికీ మరియు శాసనబద్ధునికీ మధ్యగల ఈ వ్యత్యాసాన్ని అన్ని సమయాల్లోనూ అన్ని స్థలాల్లోనూ కనుగొనవచ్చు” అని ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ అండ్ ఎథిక్స్ పేర్కొన్నది. అదిలా వివరించింది: “శాసనబద్ధుడు తనకు చెప్పబడిన దాన్ని ఏ నియమాలనూ ఉల్లంఘించకుండా చేస్తాడు; వ్రాయబడిన మాటకు, చదువబడగల దానికి ఆయన విశ్వసనీయంగా ఉంటాడు. యథార్థవంతుడు కూడా ఇవి చేస్తాడు కానీ ఆయన నుండి . . . ఇంకా ఎక్కువనే అపేక్షించవచ్చు, ఆయన తన నియామకంలో తన పూర్తి మనస్సును నిలుపుతాడు, తాను చేయవలసిన దానికి హత్తుకుని ఉండి దానికి అనుగుణంగా ఉంటాడు.” తర్వాత, అదే ఎన్‌సైక్లోపీడియా ఇలా అభిప్రాయపడింది: “యథార్థంగా ఉండటం అంటే శాసనాలకు లోబడటం కంటే ఎంతో ఎక్కువే. . . . యథార్థతగల మనిషి శాసనబద్ధుని నుండి భిన్నంగా ఉంటాడు, అతడు పూర్ణ హృదయంతోనూ మనస్సుతోనూ సేవ చేస్తాడు . . . అతడు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, అలక్ష్యం చేయడం లేక ఉపేక్షించడం వంటి పాపాలను చేయడు.”