కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 8/1 పేజీలు 14-19
  • మీ సహోదర ప్రేమ కొనసాగనివ్వండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ సహోదర ప్రేమ కొనసాగనివ్వండి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సానుభూతిని చూపండి
  • మెప్పుదలను చూపడం
  • ప్రేమ కనికరముతో కూడిన క్రియలు
  • సహోదర ప్రేమ చూపిస్తూ ఉండాలని నిశ్చయించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • సహోదర అనురాగానికి కీలకాన్ని కనుగొనుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • “ప్రేమతో నడుచుకుంటూ ఉండండి”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకుంటూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 8/1 పేజీలు 14-19

మీ సహోదర ప్రేమ కొనసాగనివ్వండి!

“సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి.”—హెబ్రీయులు 13:1.

1. చలిగా ఉన్న ఒక రాత్రిపూట మంట మండుతూనే ఉండాలంటే మీరేమి చేస్తారు, మరి మనందరికీ అదే విధమైన ఏ బాధ్యత ఉంది?

బయట చలి అంతకంతకూ తీవ్రమౌతుండగా ఉష్ణోగ్రత తగ్గిపోతున్న ఇంటిలో మీరున్నట్లుగా ఊహించుకోండి. మీ ఇంట్లో ఉన్న కుంపటిలో మండే మంట మాత్రమే మీకు వెచ్చదనాన్నివ్వగల ఏకైక మూలాధారం. ఆ మంట మండుతూ ఉండేలా చేయడం మీదనే మీ జీవితం ఆధారపడి ఉంది. ఆ మంట ఆరిపోతూ ఎర్రని నిప్పులు బూడిదగా మారిపోతుంటే మీరు అలా చూస్తూనే ఉంటారా? మీరెంతమాత్రం అలా చేయరు. అది అలా మండుతూనే ఉండేందుకు మీరు దానిలో చెక్కలు వేస్తూనే ఉంటారు. ఓ ప్రత్యేక భావంలో, మరి ప్రాముఖ్యమైన “మంట” అంటే మన హృదయాల్లో రగులుతూ వుండాల్సిన ప్రేమ విషయానికొస్తే మనందరము అదే విధమైన పనిని కలిగియున్నాము.

2. (ఎ) ఈ అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోయిందని ఎందుకు చెప్పవచ్చు? (బి) నిజ క్రైస్తవులకు ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనది?

2 యేసు చాలాకాలం క్రితమే ప్రవచించిన విధంగా, ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారి మధ్య ప్రేమ చల్లారిపోతుండే కాలంలో మనం జీవిస్తున్నాము. (మత్తయి 24:12) యేసు అత్యంత ప్రాముఖ్యమైన విధమైన ప్రేమను గురించి అంటే యెహోవా దేవుని ఎడలా మరియు ఆయన వాక్యమైన బైబిలు ఎడలా కలిగి ఉండవలసిన ప్రేమను సూచిస్తున్నాడు. ఇతర విధాలైన ప్రేమలు కూడా సన్నగిల్లుతున్నాయి. “అంత్యదినములలో” అనేకులు “అనురాగరహితులు”గా ఉంటారని బైబిలు ప్రవచించింది. (2 తిమోతి 3:1-5) అది ఎంత వాస్తవమో కదా! కుటుంబమనేది అనురాగానికి పుట్టినిల్లుగా ఉండాలి అయితే అక్కడ కూడా దౌర్జన్యము, దుష్‌ప్రవర్తన—కొన్నిసార్లు భీతి కలిగించేలా పాశవికంగా ప్రవర్తించడం—మామూలు విషయాలైపోయాయి. అయినప్పటికీ, ఈ ప్రపంచం యొక్క ప్రేమారహిత వాతావరణంలో, క్రైస్తవులు ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఉండటం మాత్రమే కాక ఇతరుల ఇష్టాయిష్టాలను ముందుంచుతూ స్వయంత్యాగపూరిత ప్రేమను కలిగి ఉండాలని ఆజ్ఞాపింపబడ్డారు. మనం ఈ ప్రేమను ఎంత స్పష్టమైన రీతిలో చూపాలంటే అది నిజమైన క్రైస్తవ సంఘం యొక్క గుర్తింపు చిహ్నంగా అందరికీ విదితమయ్యే విధంగా ఉండాలి.—యోహాను 13:34, 35.

3. సహోదర ప్రేమ అంటే ఏమిటి, మరి దానిని నిలువరముగా ఉండనివ్వడం అంటే ఏమిటి?

3 “సహోదరప్రేమ నిలువరముగా ఉండనీయుడి” అని ఆజ్ఞాపించేందుకు అపొస్తలుడైన పౌలు ప్రేరేపించబడ్డాడు. (హెబ్రీయులు 13:1) ఒక విద్యావిషయిక గ్రంథం ప్రకారం, ఇక్కడ “సహోదర ప్రేమ” (ఫిలడెల్‌ఫియా) అని అనువదించబడిన గ్రీకు పదం “ఆప్యాయతతో కూడిన ప్రేమను, దయా మరియు సానుభూతినీ చూపడాన్ని, సహాయాన్ని అందించడాన్ని సూచిస్తుంది.” అలాంటి ప్రేమ నిలువరముగా ఉండాలని పౌలు అనినప్పుడు ఆయన భావం ఏమై ఉంది? “అది ఎన్నడూ చల్లబడకూడదు” అని అదే గ్రంథం అభిప్రాయపడింది. కాబట్టి మన సహోదరుల ఎడల ప్రేమ భావాలను కలిగి ఉండటం మాత్రమే సరిపోదు; అవి కనిపించేలా మనం చూపాలి. అంతేకాకుండా, మనం ఈ ప్రేమ ఎల్లకాలం ఉండేలా, అది ఎన్నడూ చల్లబడకుండా ఉండేలా చూసుకోవాలి. సవాలుగా ఉంటుందా? అవును, అయితే మనం సహోదర ప్రేమను వృద్ధి చేసుకుని దాన్ని నిరంతరమూ కాపాడుకునేందుకు యెహోవా యొక్క ఆత్మ మనకు సహాయం చేస్తుంది. ఈ ప్రేమ జ్వాల మన హృదయాల్లో మండుతూ ఉండేలా చేసేందుకు మూడు మార్గాలను ఇప్పుడు పరిశీలిద్దాము.

సానుభూతిని చూపండి

4. సానుభూతి అంటే ఏమిటి?

4 మీ క్రైస్తవ సహోదర సహోదరీల ఎడల మీరు ఎక్కువ ప్రేమ కలిగి ఉండాలని ఇష్టపడితే, మీరు మొదట వారి ఎడల సానుభూతిని కలిగి ఉండాలి, వారు తమ జీవితంలో ఎదుర్కునే కష్టాలూ సవాళ్ల ఎడల మీరు సానుభూతి కలిగి ఉండాలి. అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాసినప్పుడు దీనినే సూచించాడు: “తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి [“సానుభూతిని చూపుతు,” NW], సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.” (1 పేతురు 3:8) ‘సానుభూతి’ చూపడం అని ఇక్కడ అనువదించబడిన గ్రీకు పదం “కలిసి బాధపడటం” అనే భావాన్ని కలిగివుంది. బైబిలు సంబంధిత గ్రీకు భాషను గూర్చిన ఓ అధికారిక గ్రంథం ఈ పదాన్ని గురించి ఇలా చెబుతుంది: “వేరే వాళ్ల భావాలు మన స్వంతవి అన్నట్లు మనం వారి భావాలలోకి ప్రవేశించినప్పుడు ఉండే మానసిక స్థితిని గురించి అది వివరిస్తుంది.” కావున, తదనుభూతి అవసరం. నమ్మకమైన, పెద్ద వయస్కుడైన ఒక యెహోవా సేవకుడు ఒకసారి ఇలా చెప్పాడు: “తదనుభూతి అంటే మీ బాధ నా హృదయంలో ఉంది అని.”

5. యెహోవాకు సానుభూతి ఉందని మనకెలా తెలుసు?

5 యెహోవాకు అలాంటి సానుభూతి ఉందా? తప్పకుండా వుంది. ఉదాహరణకు, తన ప్రజలైన ఇశ్రాయేలీయుల బాధలను గురించి మనం ఇలా చదువుతాము: “వారి యావద్బాధలో ఆయన బాధనొందెను.” (యెషయా 63:9) యెహోవా కేవలం వారి కష్టాలను చూడడం మాత్రమే కాదు; ఆయన వారి విషయమై చింతించాడు. ఆయన ఎంత తీవ్రంగా భావిస్తున్నాడో, యెహోవా తన స్వంత ప్రజలకు చెప్పిన మాటల్లోనే ఉదహరించబడుతుంది, అది జెకర్యా 2:8 నందు ‘మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడని’ నివేదించబడింది.a ఈ వచనాన్ని గురించి ఒక వ్యాఖ్యాత ఇలా పేర్కొన్నాడు: “మానవ శరీరంలోని ఎంతో సంక్లిష్టమైన మరియు సున్నితమైన అవయవాల్లో కన్ను ఒకటి; మరి దృష్టిని సాధ్యపర్చే ఆకాశంలోని వెలుగు అందులోకి ప్రవేశించేందుకు గల ద్వారం అయిన కనుపాప, కంటిలోని అత్యంత సున్నితమైనది తద్వారా అతి ప్రాముఖ్యమైన భాగం. యెహోవా తన ప్రియ జనుల యెడల కలిగియుండే అత్యంత సున్నితమైన శ్రద్ధను మరింకేదీ అంత చక్కగా వ్యక్తం చేయలేదు.”

6. యేసుక్రీస్తు సానుభూతిని ఎలా చూపాడు?

6 యేసు కూడా ఎల్లప్పుడూ అపారమైన సానుభూతిని చూపించాడు. అనారోగ్యంగా లేక కలతచెంది ఉన్న తన తోటి మానవుల దుఃఖాన్ని చూసి ఆయన చాలాసార్లు ‘కనికరపడ్డాడు.’ (మార్కు 1:41; 6:34) తన అభిషిక్త అనుచరుల ఎడల ఎవరైనా దయగా వ్యవహరించకపోతే, తానే అలాంటి అనాదరానికి గురైనట్లు భావిస్తానని ఆయన సూచించాడు. (మత్తయి 25:41-46) నేడు మన పరలోక ‘ప్రధాన యాజకునిగా’ ఆయన “మన బలహీనతలయందు మనతో సహానుభవము” కలిగి ఉన్నాడు.—హెబ్రీయులు 4:15.

7. ఒక సహోదరుడు లేక సహోదరి మనకు విసుగు పుట్టిస్తే సానుభూతి ఎలా మనకు సహాయం చేయవచ్చు?

7 ‘మన బలహీనతలయందు మనతో సహానుభవము కలిగి ఉండటం’—ఎంత ఆదరణకరమైన తలంపో కదా? కాబట్టి మనం కూడా నిశ్చయంగా ఒకరికొకరం అలానే కలిగివుండాలని కోరుకుంటాము. కానీ, ఇతరుల బలహీనతలను వెదకడం మరింత సులభంగా ఉంటుందన్నది నిజం. (మత్తయి 7:3-5) అయితే ఈసారి ఒక సహోదరుడు లేక సహోదరి మీకు విసుగు పుట్టిస్తే, ఇదెందుకు ప్రయత్నించకూడదు? మిమ్మల్ని మీరు ఆ వ్యక్తి యొక్క పరిస్థితుల్లో ఆ నేపథ్యం, వ్యక్తిత్వం, మరియు పోరాడవలసిన ఆ వ్యక్తిగత లోపాలతో ఉన్నట్లు ఊహించుకోండి. మీరు కూడా అదే తప్పిదాన్ని లేక అంతకంటే ఘోరమైన దాన్ని చేయరని మీరు కచ్చితంగా చెప్పగలరా? ఇతరుల నుండి ఎంతో ఎక్కువ అపేక్షించే బదులు, మనం సానుభూతిని కలిగి ఉండాలి, ‘మనము మంటివారమని . . . జ్ఞాపకముంచుకునే’ యెహోవా వలె మనం సహేతుకంగా ఉండేందుకు మనకు సహాయం చేయగల లక్షణం అది. (కీర్తన 103:14; యాకోబు 3:17) ఆయనకు మన పరిమితులు తెలుసు. మనం సహేతుకంగా చేయగల దానికంటే ఎక్కువ చేయాలని ఆయన ఎన్నడూ అపేక్షించడు. (1 రాజులు 19:5-7 పోల్చండి.) మనందరం ఇతరుల ఎడల అలాంటి సానుభూతిని ప్రదర్శిద్దాము.

8. ఒక సహోదరుడు లేక సహోదరి కష్టాలను అనుభవిస్తున్నప్పుడు మనం ఎలా ప్రతిస్పందించాలి?

8 సంఘం ఐకమత్యంతో కలిసి పని చేయవలసిన విభిన్న అవయవములుగల ఒక శరీరం వంటిదని పౌలు వ్రాశాడు. ఆయనింకా యిలా అన్నాడు: “ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును.” (1 కొరింథీయులు 12:12-26) కష్టాలను అనుభవిస్తున్న వారితో మనం కొంత కష్టాన్ని అనుభవించవలసిన లేక సహానుభూతి చూపవలసిన అవసరం ఉంది. అలా చేయడంలో పెద్దలు ముందుంటారు. పౌలు ఇలా కూడా వ్రాశాడు: “ఎవడైనను బలహీనుడాయెనా? నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడెనా? నాకును మంట కలుగదా?” (2 కొరింథీయులు 11:29) ఈ విషయంలో పెద్దలు మరియు ప్రయాణ పైవిచారణకర్తలు పౌలును అనుకరిస్తారు. తమ ప్రసంగాల్లో, మందను కాసే తమ పనిలో, చివరికి న్యాయ నిర్ణయ తీర్మానాలతో వ్యవహరించడంలో కూడా వారు సానుభూతిని చూపేందుకు కృషి చేస్తారు. పౌలు ఇలా సిఫారసు చేశాడు: “ఏడ్చువారితో ఏడువుడి.” (రోమీయులు 12:16) కాపరులు తమ ఎడల నిజంగా సానుభూతిని కలిగి ఉన్నారని, తమ పరిమితులను గ్రహించారని మరియు తాము ఎదుర్కునే కష్టాలనుబట్టి తమ ఎడల జాలి కలిగి ఉన్నారని గొర్రెలు గ్రహించినప్పుడు వారు సాధారణంగా సలహాను, నడిపింపును, క్రమశిక్షణను అంగీకరించేందుకు ఎక్కువ ఇష్టపూర్వకంగా ఉంటారు. ‘తమ ప్రాణములకు విశ్రాంతి దొరకుతుందనే’ విశ్వాసాన్ని కలిగి ఉండి వారు కూటాలకు మరింత ఆతురతతో హాజరౌతారు.—మత్తయి 11:29.

మెప్పుదలను చూపడం

9. మనలోని మంచిని తాను మెచ్చుకుంటున్నానని యెహోవా ఎలా చూపుతాడు?

9 రెండవ మార్గంగా మెప్పుదల ద్వారా సహోదర ప్రేమను రగిలించవచ్చు. ఇతరులను మెచ్చుకునేందుకు, మనం వారి మంచి లక్షణాలూ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరించాలి. మనం అలా చేసినప్పుడు, మనం యెహోవాను అనుకరిస్తాము. (ఎఫెసీయులు 5:1) అనుదినం ఆయన మన అనేక చిన్న చిన్న పాపాలను క్షమిస్తున్నాడు. మరి నిజమైన పశ్చాత్తాపం ఉన్నంత వరకూ ఆయన గంభీరమైన పాపాలను కూడా క్షమిస్తాడు. ఒకసారి ఆయన మన పాపాలను క్షమించిన తర్వాత, ఆయన వాటిని గురించి ఇక ఆలోచించడు. (యెహెజ్కేలు 33:14-16) కీర్తనల గ్రంథకర్త ఇలా అడిగాడు: “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?” (కీర్తన 130:3) ఆయన సేవలో మనం చేసే మంచి పనుల మీదే యెహోవా దృష్టి నిలుపుతాడు.—హెబ్రీయులు 6:10.

10. (ఎ) వివాహ దంపతులు ఒకరి ఎడల ఒకరు మెప్పుదలను కోల్పోవడం ఎందుకు ప్రమాదకరం? (బి) తన జత ఎడల మెప్పును కోల్పోతున్న వ్యక్తి ఏమి చేయాలి?

10 కుటుంబంలో ఈ మాదిరిని అనుసరించడం ప్రత్యేకంగా ప్రాముఖ్యం. తాము ఒకరిని ఒకరం మెచ్చుకుంటున్నామని తలిదండ్రులు చూపినప్పుడు, వారు కుటుంబం కొరకు చక్కని మాదిరిని స్థాపిస్తారు. వివాహాలు విచ్ఛిన్నమౌతున్న ఈ కాలంలో, తమ జతను తక్కువగా చూస్తూ వారి తప్పిదాలను పెద్దగా చూపించి వారి మంచి లక్షణాలను అలక్ష్యం చేయడం చాలా సులభం. అలాంటి ప్రతికూల ఆలోచన వివాహాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, దాన్ని ఆనందరహిత భారంగా మారుస్తుంది. మీ జత ఎడల మీకుగల గుణగ్రహణ తగ్గుముఖం పడితే, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘నా జతలో ఎలాంటి మంచి గుణాలూ లేవా?’ మీరు ప్రేమించి వివాహం చేసుకున్నందుకు గల కారణాలను మననం చేసుకోండి. ఈ ప్రత్యేక వ్యక్తిని ప్రేమించడానికి ఉండిన ఆ కారణాలన్నీ వాస్తవంగా అదృశ్యమయ్యాయా? నిశ్చయంగా కాదు; కాబట్టి మీ జతలో ఉన్న మంచిని మెచ్చుకునేందుకు ప్రయాసపడండి, మరి మీ మెప్పుదలను మాటల్లో వ్యక్తం చేయండి.—సామెతలు 31:28.

11. వైవాహిక ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలంటే, ఏ అలవాట్లను నివారించవలసి ఉంటుంది?

11 తమ ప్రేమను నిష్కపటంగా ఉంచుకునేందుకు కూడా మెప్పుదల వివాహ దంపతులకు సహాయం చేస్తుంది. (2 కొరింథీయులు 6:6; 1 పేతురు 1:22 పోల్చండి.) మనఃపూర్వకంగా మెచ్చుకోవడం ద్వారా రగిలించబడిన అటువంటి ప్రేమ, మూసిన తలుపుల వెనుక క్రూరత్వానికి తావివ్వదు, నొప్పించి, అవమానించే మాటలకు తావివ్వదు, ఎన్నో దినాలు గడుస్తున్నా ఎలాంటి స్నేహపూర్వక లేక మర్యాదతో కూడిన మాటా పలుకకుండా అలక్ష్యం చేయడానికీ తావివ్వదు, చేయి చేసుకుని హింసించడానికి అసలే ఎలాంటి తావూ ఇవ్వదు. (ఎఫెసీయులు 5:28, 29) ఒకరినొకరు నిజంగా గుణగ్రహించే భార్యాభర్తలు ఒకరినొకరు ఘనపర్చుకుంటారు. వారు నలుగురిలో ఉన్నప్పుడు మాత్రమే కాక వారు యెహోవా దృష్టిలో ఉన్నప్పుడు అంటే వేరే మాటల్లో చెప్పాలంటే అన్నివేళలా అలా చేస్తారు.—సామెతలు 5:21.

12. తమ పిల్లల్లోని మంచి ఎడల తలిదండ్రులు ఎందుకు మెప్పును వ్యక్తం చేయాలి?

12 పిల్లలు కూడా తాము మెచ్చుకోబడుతున్నామని భావించాల్సిన అవసరం ఉంది. తలిదండ్రులు వారిపై అర్థరహిత పొగడ్తలు కురిపించాలని దాని భావం కాదు, బదులుగా వారు తమ పిల్లల్లోని పొగడదగ్గ గుణాలను మరియు నిజమైన మంచిని మెచ్చుకోవాలి. యేసును తాను అంగీకరిస్తున్నానని చెప్పడంలో యెహోవా చూపిన మాదిరిని జ్ఞాపకం చేసుకోండి. (మార్కు 1:11) ఉపమానంలో “యజమాని”గా యేసు యొక్క మాదిరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇరువురికి ఇవ్వబడిన దానిలో మరియు వారు ఉత్పన్నం చేసిన ఫలితాల్లో కూడా వ్యత్యాసం ఉన్నప్పటికీ యేసు ఇద్దరు ‘మంచి మరియు నమ్మకమైన దాసులను’ మెచ్చుకున్నాడు. (మత్తయి 25:20-23; మత్తయి 13:23 పోల్చండి.) ప్రతి పిల్లవాని ప్రత్యేక లక్షణాలు, సామర్థ్యాలు మరియు సాధించిన కార్యాల విషయంలో తలిదండ్రులు కూడా అదే విధంగా మెప్పుదలను వ్యక్తం చేసే మార్గాలను కనుగొంటారు. అదే సమయంలో, వారు సాధించిన విషయాలను గురించి మరీ నొక్కి చెప్పకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు ఎందుకంటే అలా చేయడం వారి పిల్లలు ఎల్లవేళలా తాము ఇతరుల కంటే ఉన్నతంగా ఉండాలనే ఒత్తిడికి గురిచేస్తుంది. తమ పిల్లలు విసుగు చెందిన లేక కృంగిపోయిన వారిగా పెరగాలని వారు ఇష్టపడరు.—ఎఫెసీయులు 6:4; కొలొస్సయులు 3:21.

13. సంఘంలోని ప్రతి సభ్యుని ఎడల మెప్పును వ్యక్తం చేయడంలో ఎవరు ముందుంటారు?

13 క్రైస్తవ సంఘంలో, పెద్దలు మరియు ప్రయాణ పైవిచారణకర్తలు దేవుని మందలోని ప్రతి సభ్యుని ఎడలా మెప్పుదలను చూపించడంలో ముందుంటారు. నీతియందు శిక్షించడమనే, తప్పు చేసిన వారిని సాత్విక స్ఫూర్తితో సరిచేయడం, అవసరమైన వారికి దృఢమైన సలహాలను ఇవ్వడమనే బరువైన బాధ్యత వారికి ఉంటుంది గనుక, వారి స్థానం కష్టతరమైనది. ఈ విభిన్న బాధ్యతలను వారు సమతుల్యతతో ఎలా నిర్వహిస్తారు?—గలతీయులు 6:1; 2 తిమోతి 3:16.

14, 15. (ఎ) ఖండితమైన సలహాను ఇచ్చే విషయంలో పౌలు ఎలా సమతూకాన్ని చూపాడు? (బి) సరి చేయవలసిన అవసరతతో పాటూ మెచ్చుకోవలసిన అవసరతను క్రైస్తవ పైవిచారణకర్తలు ఎలా సమతూకం చేస్తారు? ఉదహరించండి.

14 పౌలు యొక్క మాదిరి గొప్ప సహాయంగా ఉంది. ఆయన అతి విశిష్టమైన బోధకుడు, పెద్ద మరియు మందకాపరి. తీవ్రమైన సమస్యలుగల సంఘాలతో ఆయన వ్యవహరించవలసి వచ్చింది, మరి అవసరమైనప్పుడు ఆయన గట్టి సలహాలను ఇవ్వకుండా భయంతో వెనక్కి తగ్గలేదు. (2 కొరింథీయులు 7:8-11) పౌలు యొక్క పరిచర్యను పరిశీలించి చూస్తే, ఆయన చాలా తక్కువసార్లు గద్దింపునిచ్చాడని మనకు తెలుస్తుంది, ఆయన ఆయా పరిస్థితుల్లో అది అవసరమైనప్పుడు లేక ఉచితమని అనుకున్నప్పుడు మాత్రమే గద్దింపునిచ్చాడు. ఈ విషయంలో ఆయన దైవిక జ్ఞానాన్ని చూపాడు.

15 సంఘంలో ఒక పెద్ద చేసే సేవను ఒక సంగీత కృతితో పోలిస్తే, ఆయన ఇచ్చే గద్దింపు లేక హెచ్చరిక ఆ సంగీతమంతటిలో అమరిపోయే ఒక స్వరం వలె ఉంటుంది. ఆ స్వరం దాని స్థానంలోనే చక్కగా ఉంటుంది. (లూకా 17:3; 2 తిమోతి 4:2) అయితే పాట మొత్తంలో ఆ ఒక్క స్వరం మాత్రమే పదే పదే వస్తుంటే అదెలా ఉంటుందో ఊహించండి. అది మీకు వెంటనే విసుగు పుట్టిస్తుంది. అదే విధంగా, క్రైస్తవ పెద్దలు తమ బోధను సంపూర్ణం చేసేందుకూ మరియు దాన్ని వైవిధ్యంతో మెరుగుపర్చేందుకూ ప్రయత్నిస్తారు. వారు దాన్ని సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే పరిమితం చేయరు. బదులుగా, దాని లక్ష్యం అంతా కూడా సకారాత్మకమైనది. యేసుక్రీస్తు వలె, ప్రేమగల పెద్దలు విమర్శించేందుకని తప్పిదాల్ని వెదకరు గానీ మొదట మెచ్చుకునేందుకు మంచిని వెదకుతారు. వారి తోటి క్రైస్తవులు కష్టించి పని చేయడాన్ని వారు గుణగ్రహిస్తారు. యెహోవాను సేవించడంలో ప్రతి ఒక్కరూ మొత్తంమీద శాయశక్తులా కృషి చేస్తున్నారని వారు నమ్మకంగా ఉంటారు. పెద్దలు ఆ నమ్మకాలను సంసిద్ధంగా మాటల్లో వ్యక్తం చేస్తారు.—2 థెస్సలొనీకయులు 3:4 పోల్చండి.

16. పౌలు యొక్క మెప్పుతో కూడిన మరియు సానుభూతి గల దృక్పధం ఆయన తోటి క్రైస్తవులపై ఏ ప్రభావాన్ని చూపింది?

16 పౌలు ఎవరికి సేవ చేశాడో ఆ క్రైస్తవుల్లో అనేకులు ఆయన తమ ఎడల మెప్పుదలను మరియు సానుభూతి కలిగి ఉన్నాడనే విషయాన్ని గ్రహించారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇది మనకెలా తెలుసు? వారు పౌలు గురించి ఎలా భావించారో గమనించండి. ఆయనకు ఎంతో గొప్ప అధికారం ఉన్నప్పటికీ వారు ఆయనంటే భయపడలేదు. ఆయన ఎంతో ప్రియమైన వానిగా సులభంగా సమీపించదగిన వానిగా ఉన్నాడు. అంతెందుకు, ఆయన ఒక స్థలాన్ని వదలి వెళ్లిపోతున్నప్పుడు, పెద్దలు ‘పౌలు మెడమీద పడి అతనిని ముద్దుపెట్టు’కున్నారు! (అపొస్తలుల కార్యములు 20:17, 38) అనుకరించేందుకు మనకు పౌలు యొక్క మాదిరి ఉన్నందున పెద్దలు మరియు మనందరమూ కూడా ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో కదా! అవును, మనం ఒకరి ఎడల ఒకరము గుణగ్రహణను చూపుకుందాము.

ప్రేమ కనికరముతో కూడిన క్రియలు

17. సంఘంలో కనికరంతో కూడిన క్రియల యొక్క కొన్ని మంచి ఫలితాలు ఏమిటి?

17 సహోదర ప్రేమ యొక్క అత్యంత ప్రభావవంతమైన ఇంధనం దయతో కూడిన ఒక చిన్న క్రియ. యేసు చెప్పిన విధంగా, “పుచ్చుకొనుట కంటె ఇచ్చుట ధన్యము.” (అపొస్తలుల కార్యములు 20:35) మనం ఆత్మీయంగా, వస్తురూపంగా ఇచ్చినా లేక మన సమయాన్నీ శక్తినీ ఇచ్చినా మనం ఇతరులను సంతోషపెట్టడం మాత్రమే కాక మనలను మనం కూడా సంతోషపెట్టుకున్న వారమౌతాము. సంఘంలో దయాగుణం సులభంగా వ్యాపించేదైయుంది. దయా గుణంతో కూడిన ఒక క్రియ అదే విధమైన క్రియలను ఉత్పన్నం చేస్తుంది. కొద్ది కాలానికే, సహోదర ప్రేమ వర్ధిల్లుతుంది!—లూకా 6:38.

18. మీకా 6:8 నందు ప్రస్తావించబడిన “కనికరము” యొక్క అర్థం ఏమిటి?

18 కనికరాన్ని ప్రదర్శించమని యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులను పురికొల్పాడు. మీకా 6:8 నందు మనమిలా చదువుతాము: “మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.” “కనికరమును ప్రేమించుట” అంటే దాని భావం ఏమిటి? “కనికరము” (ఛేషేద్‌) అనే పదానికి ఇక్కడ ఉపయోగించిన హెబ్రీ పదం ఆంగ్లంలోకి “mercy” (దయ) అని కూడా అనువదించబడింది. బైబిలు యొక్క సాన్సినో పుస్తకాలు (ఆంగ్లం) అనే గ్రంథం ప్రకారం, అది “ఆంగ్ల పదమైన mercy (దయ) అనే సంగ్రహమైన పదం కంటే మరింత క్రియాశీలమైన దాన్ని సూచిస్తుంది. దాని అర్థం ‘దయను కార్యాల్లోకి అనువదించడం,’ బీదలకూ అవసరతల్లో ఉన్న వారికి మాత్రమే కాక తన తోటి మానవులందరికీ ప్రేమతో కూడిన కనికరం గల వ్యక్తిగత క్రియలను చేయడమే.” అదే విధంగా మరొక పండితుడు, ఛేషేద్‌ అంటే “ప్రేమను క్రియల్లోకి అనువదించడం” అని చెప్పాడు.

19. (ఎ) సంఘంలోని ఇతరుల ఎడల కనికరాన్ని చూపే విషయంలో మనం ఏ మార్గాల్లో చొరవ తీసుకోవచ్చు? (బి) మీ ఎడల సహోదర ప్రేమ చూపబడిన సందర్భం యొక్క ఒక ఉదాహరణను ఇవ్వండి.

19 మన సహోదర ప్రేమ తాత్వికమైనది లేక అస్పష్టమైనది కాదు. అది వాస్తవికమైనది. కాబట్టి, మీ సహోదర సహోదరీల కొరకు కనికరంతో కూడిన పనులు చేసేందుకు మార్గాలను వెదకండి. యేసు వలె ఉండండి, తననుండి సహాయం కొరకు ప్రజలు తన వద్దకు వచ్చేంత వరకూ ఆయన ఆగలేదు, కానీ ఆయన తరచూ తానే చొరవ తీసుకున్నాడు. (లూకా 7:12-16) అత్యంత అవసరతల్లో ఉన్న వారిని గురించి ఎక్కువగా ఆలోచించండి. పెద్ద వయస్సులో ఉన్న వ్యక్తిని లేక అస్వస్థంగా ఉన్న ఒక వ్యక్తిని దర్శించాలా లేక వారి పనుల్లో సహాయం చేయాలా? ‘తండ్రి లేనివారికి’ ఎవరికైనా కొంత సమయం లేక అవధానం అవసరమా? కృంగిన వారి సమస్యలను వినవలసి ఉందా లేక వారికి కొన్ని ఓదార్పుకరమైన మాటలు అవసరమా? మనకు వీలైనంతగా మనం కనికరంతో కూడిన క్రియలను చేద్దాము. (యోబు 29:12; 1 థెస్సలొనీకయులు 5:14; యాకోబు 1:27) అపరిపూర్ణులతో నిండి ఉన్న సంఘంలో, కనికరంతో కూడిన అత్యంత ప్రాముఖ్యమైన క్రియ క్షమించడమే, అంటే ఫిర్యాదు చేసేందుకు సరైన కారణం ఉన్నప్పుడు కూడా విసుగును విడనాడటమని భావం. (కొలొస్సయులు 3:13) క్షమించేందుకు సిద్ధంగా ఉండటం, సహోదర ప్రేమ అనే మంటను ఆర్పేసే తడి దుప్పటి వంటి విభజనలు, సణుగుడు, కలహాలు వంటి వాటి నుండి సంఘాన్ని దూరంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

20. మనందరం మనలను మనం ఎలా పరీక్షించుకోవడంలో కొనసాగాలి?

20 ప్రేమ యొక్క ఈ ప్రాముఖ్యమైన మంట మన హృదయాల్లో మండుతూనే ఉండేలా చూసుకునేందుకు మనందరమూ తీర్మానించుకుందాము. మనలను మనం పరీక్షించుకుంటూ ఉందాము. మనం ఇతరుల ఎడల సానుభూతిని చూపుతున్నామా? ఇతరుల ఎడల మెప్పుదలను చూపుతున్నామా? మనం ఇతరుల ఎడల దయతో కూడిన క్రియలను చేస్తామా? మనం అలా చేస్తున్నంత కాలమూ, ఈ ప్రపంచం ఎంత మైత్రిలేనిదిగా మరియు భావరహితంగా ఉన్నప్పటికీ ప్రేమ అనే మంట మన సహోదరత్వాన్ని వెచ్చగా ఉంచుతుంది. కాబట్టి, అన్ని విధాలుగా, మీ “సహోదర ప్రేమ” ఇప్పుడూ, నిరంతరమూ “నిలువరముగా ఉండనీయుడి.”—హెబ్రీయులు 13:1.

[అధస్సూచీలు]

a కొన్ని అనువాదాలు ఇక్కడ దేవుని ప్రజలను ముట్టే వాడు దేవుని కన్ను కాక ఇశ్రాయేలీయుల కన్ను లేక తన స్వంత కన్నునే ముట్టుకుంటున్నాడనే భావం వచ్చేలా చేశాయి. ఈ తప్పిదం కొంతమంది మధ్యకాలీన శాస్త్రుల మూలంగా వచ్చింది, వారు అపవిత్రమని దృష్టించిన వాక్యభాగాలను సరి చేయాలనే తమ తప్పుద్రోవపట్టిన ప్రయత్నాల్లో ఈ వచనాన్ని మార్చారు. అలా చేయడం ద్వారా వారు యెహోవా యొక్క వ్యక్తిగత సానుభూతి యొక్క గాఢతను అస్పష్టపర్చారు.

మీరు ఎలా భావిస్తారు?

◻ సహోదర ప్రేమ అంటే ఏమిటి, మనం దానిని నిలువరముగా ఎందుకు ఉంచాలి?

◻ సానుభూతి కలిగి ఉండటం మనం సహోదర ప్రేమ కలిగి ఉండేందుకు మనకు ఎలా సహాయం చేయగలదు?

◻ సహోదర ప్రేమలో మెప్పుదల ఏ పాత్ర పోషిస్తుంది?

◻ క్రైస్తవ సంఘంలో కనికరంతో కూడిన క్రియలు సహోదర ప్రేమ వృద్ధి చెందేందుకు ఎలా సహాయం చేస్తాయి?

[16వ పేజీలోని బాక్సు]

క్రియల్లో కనిపించే ప్రేమ

కొన్ని సంవత్సరాల క్రితం, యెహోవాసాక్షులతో బైబిలు పఠించిన ఒక వ్యక్తి సహోదర ప్రేమ విషయంలో కొంత శంకిస్తూనే ఉండేవాడు. “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు” అని యేసు చెప్పాడని ఆయనకు తెలుసు. (యోహాను 13:35) అయితే ఆయన దాన్ని విశ్వసించడం కష్టంగా వున్నట్లు భావించాడు. ఒక రోజు ఆయన క్రైస్తవ ప్రేమను క్రియల్లో చూడగలిగాడు.

తాను చక్రాల కూర్చీకే పరిమితమైనప్పటికీ, ఈ వ్యక్తి ఇంటి నుండి చాలా దూరంలో ఉండే ప్రాంతానికి ప్రయాణిస్తున్నాడు. ఇజ్రాయెల్‌లోని బెత్లెహేమ్‌లో ఆయన ఒక సంఘ కూటానికి హాజరయ్యాడు. అక్కడ ఒక అరబ్బు సాక్షి, ప్రయాణంలో వున్న మరొక సాక్షిని తన కుటుంబంతో ఆ రాత్రి బస చేయమని పట్టుబట్టాడు, ఈ బైబిలు విద్యార్థి కూడా ఆహ్వానించబడ్డాడు. నిద్రకు ఉపక్రమించే ముందు, ఉదయం సూర్యోదయాన్ని తిలకించేందుకు తాను వరండాలోనికి వెళ్లేందుకు అనుమతి కొరకు ఆ విద్యార్థి తన అతిథేయిని అడిగాడు. అలా వెళ్లకూడదని ఆ అతిథేయి ఖండితంగా హెచ్చరించాడు. మర్నాడు ఆ అరబ్బు సహోదరుడు దానికిగల కారణాన్ని వివరించాడు. ఒక అనువాదకుని ద్వారా చెబుతూ, యూదా నేపథ్యంగల అతిథులను తాను తన వద్ద ఉంచుకున్నాడనే విషయం తన పొరుగువారికి తెలిస్తే వారు తననూ తన కుటుంబాన్నీ లోపలే ఉంచేసి ఇంటికి నిప్పంటించేస్తారని ఆయన చెప్పాడు. మరి ఆ బైబిలు విద్యార్థి కూడ గతంలో యూదుడే. కలవరపడిన ఆ బైబిలు విద్యార్థి ఇలా అడిగాడు, “మరి అలాంటప్పుడు మీరు అంత సాహసం ఎందుకు చేశారు?” అనువాదకుని అవసరం లేకుండానే, ఆ అరబ్బు సహోదరుడు ఆయనను సూటిగా చూసి, “యోహాను 13:35” అని అన్నాడు.

సహోదర ప్రేమ యొక్క వాస్తవికతను చూసిన ఆ బైబిలు విద్యార్థి చాలా ప్రభావితుడయ్యాడు. అది జరిగిన కొంత కాలానికే ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు.

[18వ పేజీలోని చిత్రం]

అపొస్తలుడైన పౌలు యొక్క మిత్రభావం మరియు మెచ్చుకునే ప్రవృత్తి ఆయనను సమీపించదగిన వానిగా చేసింది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి