రాజ్య ప్రచారకుల నివేదిక
ఆయన “అమూల్యమైన యొక ముత్యమును” కనుగొన్నాడు
“పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును.” దేవుని రాజ్యంయొక్క అపారమైన విలువను యేసు ఆ మాటలతో దృష్టాంతపర్చాడు. (మత్తయి 13:45, 46) రాజ్య విలువను గుర్తించినవారు దాన్ని పొందడానికిగాను తరచూ గొప్ప వ్యక్తిగత త్యాగాల్ని చేస్తారు. ఇది, తైవాన్‌లోని పింగ్డాంగ్ కౌంటీనుండి వచ్చిన క్రింది అనుభవంద్వారా దృష్టాంతపర్చబడింది.
1991లో, మిస్టర్ లిన్, మిసెస్ లిన్ యెహోవాసాక్షులతో బైబిలు పఠనం చేయడం ప్రారంభించారు. స్థానిక పాదిరి దీనిగురించి తెల్సుకున్నప్పుడు వారిని తన చర్చిలో చేరేలా చేయడానికి ప్రయత్నించాడు. లిన్ దంపతులకు స్థానిక బజారులో పందుల రక్తమూ, బాతుల రక్తమూ అమ్మే ఒక వ్యాపారం ఉండేది గనుక, వారు ఈ విషయంపై పాదిరి అభిప్రాయాన్ని తెలుసుకుందామని నిర్ణయించుకున్నారు. “దేవుడు చేసిన ప్రతీదీ మానవునికి ఆహారంగా పనికొస్తుంది” అని ఆయన ప్రత్యుత్తరమిచ్చాడు. అయితే మరోవైపు దేవుని వాక్యమేమంటోందో పరిశీలించమని సాక్షులు వారిని ప్రోత్సహించారు. “ఒక ప్రాణి జీవం రక్తమే” గనుక యెహోవా దేవుడు రక్తాన్ని పవిత్రంగా దృష్టిస్తాడని వారు తెల్సుకున్నారు. (లేవీయకాండము 17:10, 11, ద న్యూ ఇంగ్లీష్ బైబిల్) అందుకని నిజ క్రైస్తవులు ‘రక్తాన్ని విసర్జించాలి.’ (అపొస్తలుల కార్యములు 15:20) ఈ విషయంపైన లేఖనాలను పరిశీలించడం ఫలితంగా, తమ ఆదాయంలో ఎక్కువభాగం రక్తాన్ని అమ్మడం ద్వారానే వచ్చినా అలా రక్తాన్ని అమ్మడం ఆపివేయాలని లిన్ దంపతులు నిర్ణయించుకున్నారు. అయితే కొంతకాలానికే వారు మరింత గొప్ప పరీక్షను ఎదుర్కొన్నారు.
సత్యాన్ని నేర్చుకోవడానికి ముందు లిన్ దంపతులు తమ పొలంలో 1,300 పోకచెట్లు నాటారు. ఆ చెట్లు పెరిగి లాభాలు తెచ్చే సరికి ఐదు సంవత్సరాలు పట్టినా, ఒకసారి అవి పూర్తి ఉత్పత్తిని ఇవ్వడం మొదలుపెట్టాయంటే లిన్ దంపతులు సంవత్సరానికి 77,000 డాలర్లు సంపాదించవచ్చు. మొదటి కోత సమయం దగ్గరపడుతుండగా, లిన్ దంపతులు ఒక ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవల్సివచ్చింది. పొగ త్రాగడం, మాదకద్రవ్యాల దుర్వినియోగం, పోకచెక్క నమలడంవంటి అపరిశుభ్రమైన అలవాట్లను మానుకోవడం ద్వారా లేక ఆ అలవాట్లను పెంపొందించడాన్ని ఆపివేయడం ద్వారా క్రైస్తవులు “శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి” తమనుతాము పరిశుభ్రం చేసుకోవాలని వారు తమ బైబిలు పఠనం ద్వారా నేర్చుకున్నారు. (2 కొరింథీయులు 7:1) మరిప్పుడు వారేం చేస్తారు?
కలతచెందిన మనస్సాక్షితో ఒత్తిడికిలోనై మిస్టర్ లిన్ తన పఠనాన్ని ఆపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈలోగా, మిసెస్ లిన్ కాస్త పెద్ద పోకచెట్లనుండి పోకచెక్కలను అమ్మి 3,000 డాలర్లకుపైగా లాభాన్ని సంపాదించింది. వాళ్లు తమ చెట్లను అలాగే ఉంచితే త్వరలోనే రాబోయే లాభాలకు ఇది కేవలం పూర్వానుభవం మాత్రమే. అయితే, లిన్ మనస్సాక్షి ఆయనను మొత్తసాగింది.
ఆయన ఈ విషయంతో చాలా పెనుగులాడాడు, చివరికి స్థానిక సాక్షులను తనకోసం తన పోకచెట్లను నరికివేయమని అడిగాడు. ఈ నిర్ణయం చేయవల్సింది ఆయనే అని సాక్షులు వివరించారు; అందుకని ఆయన ‘తన బరువు తానే భరించుకుని’ చెట్లను తానే నరికివేయాల్సివుంటుంది. (గలతీయులు 6:4, 5) 1 కొరింథీయులు 10:13లోని వాగ్దానాన్ని గుర్తుంచుకోమని వారు ఆయనను ప్రోత్సహించారు, అక్కడిలా ఉంది: “సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.” “మేము గనుక మీకోసం మీ చెట్లను నరికేస్తే, మీరు బహుశ విచారించి, వచ్చిన నష్టానికి మమ్మల్ని నిందించవచ్చు” అని అంటూ సాక్షులు ఆయనతో తర్కించారు కూడా. కొన్ని రోజుల తర్వాత, మిసెస్ లిన్ ఒక ఉదయం నిద్రలేవగానే, కరెంటుతో నడిచే రంపం శబ్దం ఆమెకు వినపడింది. ఆమె భర్తా, పిల్లలు కల్సి పోకచెట్లను నరికేస్తున్నారు!
యెహోవా తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని మిస్టర్ లిన్ కనుగొన్నాడు. తన మనస్సాక్షిని నిర్మలంగా ఉంచే పనిని ఆయన సంపాదించుకున్నాడు, ఇది ఆయనను యెహోవాను స్తుతించే వ్యక్తిగా చేసింది. ఆయన 1996 ఏప్రిల్‌లో యెహోవాసాక్షుల ఒక సర్క్యూట్ సమావేశంలో బాప్తిస్మంపొందాడు.
అవును, చెప్పాలంటే మిస్టర్ లిన్ “తనకు కలిగినదంతయు అమ్మి,” “అమూల్యమైన యొక ముత్యమును” కొన్నాడు. యెహోవా దేవునితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని కలిగివుండి, ఆయన రాజ్యాసక్తులను పెంపొందింపజేసే ఉత్కృష్టమైన ఆధిక్యత ఇప్పుడాయనకు ఉంది.