కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 3/15 పేజీలు 15-20
  • యథార్థతా సవాలునెదుర్కోవడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యథార్థతా సవాలునెదుర్కోవడం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాను సమర్థించడం
  • యెహోవా సంస్థ ఎడల యథార్థత
  • యథార్థవంతులైన పెద్దల ఎడల యథార్థత
  • వివాహ బంధంలో యథార్థత
  • యథార్థంగా ఉండడానికి సహాయకాలు
  • యథార్థవంతున్ని చూడండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • “నువ్వు మాత్రమే విశ్వసనీయుడివి”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • యథార్థత ఏ మూల్యముతో?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • మీరు ఎవరికి విశ్వసనీయంగా ఉండాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 3/15 పేజీలు 15-20

యథార్థతా సవాలునెదుర్కోవడం

“నీతియు యథార్థమైన భక్తియు [“యథార్థత,” NW] గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.”—ఎఫెసీయులు 4:24.

1. మనం యెహోవా దేవుని ఎడల ఎందుకు యథార్థంగా ఉండాలి?

యథార్థతా సవాలునెదుర్కోవడంలో అనేక అంశాలున్నాయి. అత్యంత ప్రాముఖ్యమైనది, యెహోవా దేవుని ఎడల యథార్థంగా ఉండడమనే సవాలునెదుర్కోవడం. నిజంగా, యెహోవా ఏమైవున్నాడు, ఆయన మన కొరకు ఏమి చేశాడు అనేదాని దృష్ట్యా మరియు మనం ఆయనకు చేసుకున్న సమర్పణనుబట్టి, మనం ఆయన ఎడల యథార్థంగా ఉండాలి. మనం యెహోవా దేవుని ఎడల యథార్థతను ఎలా చూపించగలము? ఒక ప్రాథమికమైన విధానమేమిటంటే, యెహోవా యొక్క నీతియుక్తమైన కట్టడల ఎడల యథార్థంగా ఉండడం.

2, 3. యథార్థతకు నీతికి మధ్యన ఏ సంబంధం ఉంది?

2 ఆ సవాలునెదుర్కొనేందుకు, 1 పేతురు 1:14-16నందున్న ఈ మాటలను మనం వినాలి: “నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా . . . మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.” యెహోవా దేవుని ఎడల యథార్థంగా ఉండడం, మనం ఆయనకు ఎల్లప్పుడూ విధేయులమై, మన తలంపులను మాటలను చర్యలను ఆయన చిత్తానికి అనుగుణంగా మలచుకొనేలా చేస్తుంది. అంటే, “[సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలు లక్ష్యపెట్టవద్దనియు చేయబడిన] ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే” అని 1 తిమోతి 1:3-5 నందు మనకు ఆజ్ఞాపించబడినట్లుగా మంచి మనస్సాక్షిని కాపాడుకోవడమన్నది దాని భావం. నిజమే, మనలో ఎవ్వరమూ పరిపూర్ణులము కాదు గాని, మనం మనకు సాధ్యమైనంత శ్రేష్ఠమైనది చేయడానికి ప్రయత్నించాలి, కాదంటారా?

3 యెహోవా ఎడల యథార్థంగా ఉండడం, స్వార్థపూరితంగా నీతి సూత్రాలతో రాజీ పడకుండా మనల్ని కాపాడుతుంది. వాస్తవానికి, యథార్థత మనం లోపల ఒక విధంగా బయట మరో విధంగా ఉండకుండా కాపాడుతుంది. “యెహోవా, నేను నీ సత్యము ననుసరించి నడచుకొనునట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము” అని పాడినప్పుడు కీర్తనల గ్రంథకర్త మనస్సులో యథార్థతనే ఉండింది. (కీర్తన 86:11) యథార్థంగా ఉండడానికి, “అమలుపరచదగని వాటికి విధేయత చూపడం” అని తగినట్లుగానే వర్ణించబడినది అవసరం.

4, 5. మనం ఏది చేయకుండా యథార్థత మనల్ని కాపాడుతుంది?

4 యెహోవా దేవుని ఎడల యథార్థంగా ఉండడం ఆయన నామంపైకి మరియు రాజ్యంపైకి అపనింద తీసుకురాగల దేనినైనా చేయకుండా కూడా మనల్ని కాపాడుతుంది. ఉదాహరణకు, ఒకసారి ఇద్దరు క్రైస్తవులు తాము అసమంజసంగా లోకసంబంధమైన న్యాయస్థానాన్ని ఆశ్రయించేంతగా ఒక సమస్యలో చిక్కుకున్నారు. జడ్జి ఇలా అడిగాడు, ‘మీరిద్దరూ యెహోవా సాక్షులేనా?’ వాళ్లిద్దరూ కోర్టులో ఎందుకున్నారో ఆయనకు అర్థం కాలేదన్నది స్పష్టమౌతుంది. అదెంతటి అపనింద! యెహోవా దేవుని ఎడల యథార్థంగా ఉండడం, ఆ ఇద్దరు సహోదరులు పౌలు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని వినేలా చేసివుండేది: “ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తులనపహరింపబడనిచ్చుట మేలు కాదా?” (1 కొరింధీయులు కొరింథీయులు 6:7) కచ్చితంగా, యెహోవా దేవుని ఎడల యథార్థంగా ఉండడమంటే, యెహోవాపైకి ఆయన సంస్థపైకి అపనింద తీసుకువచ్చే బదులు వ్యక్తిగత నష్టాన్ని సహించడమే.

5 యెహోవా దేవుని ఎడల యథార్థంగా ఉండడంలో, మనుష్య భయానికి లొంగిపోకుండా ఉండడం కూడా చేరివుంది. “భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును. యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును.” (సామెతలు 29:25) కాబట్టి, హింసను ఎదుర్కొనేటప్పుడు మనం రాజీ పడము కాని మునుపటి సోవియట్‌ రష్యా, మలావీ, ఇతియోపియా మరియు ఇతర అనేక దేశాల్లోని యెహోవాసాక్షులు చూపించిన మాదిరిని మనం అనుసరిస్తాము.

6. యథార్థత మనం ఎవరితో సహవసించకుండా కాపాడుతుంది?

6 మనం యెహోవా దేవుని ఎడల యథార్థంగా ఉంటే, ఆయనకు శత్రువులైన వారందరితో మనం స్నేహం చేయము. అందుకే శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.” (యాకోబు 4:4) “యెహోవా, నిన్ను ద్వేషించువారిని నేనును ద్వేషించుచున్నాను గదా? నీ మీద లేచువారిని నేను అసహ్యించుకొనుచున్నాను గదా! వారియందు నాకు పూర్ణద్వేషము కలదు. వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను” అని చెప్పినప్పుడు రాజైన దావీదు చూపించినటువంటి యథార్థతను మనం కల్గివుండాలని కోరుకుంటాము. (కీర్తన 139:21, 22) ఉద్దేశపూర్వకంగా పాపం చేసేవారితో మనకు ఏ పొత్తూ లేదు గనుక మనం వారితో సహవసించాలని కోరుకోము. దేవుని ఎడల యథార్థంగా ఉండడం, మనం యెహోవా యొక్క అలాంటి శత్రువులతో ప్రత్యక్షంగా గాని లేక దూరదర్శిని మాధ్యమం ద్వారాగాని సహవసించకుండా చేయదా?

యెహోవాను సమర్థించడం

7. యెహోవా గురించి ఏమి చేయడానికి యథార్థత మనకు సహాయం చేస్తుంది, దాన్ని ఎలీహు ఎలా చేశాడు?

7 యథార్థత మనం యెహోవా దేవున్ని సమర్థించేలా పురికొల్పుతుంది. ఆ విషయంలో ఎలీహు మనకు ఎంత చక్కని ఉదాహరణ! యోబు 32:2, 3 మనకిలా తెలియజేస్తుంది: “అప్పుడు . . . ఎలీహు, యోబు దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతనిమీద బహుగా కోపగించెను. మరియు యోబుయొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తర మేమియు చెప్పకయే యోబుమీద దోషము మోపినందుకు వారిమీద కూడ అతడు బహుగా కోపగించెను.” యోబు 32 నుండి 37 అధ్యాయాలలో, ఎలీహు యెహోవాను సమర్థిస్తాడు. ఉదాహరణకు, ఆయనిలా చెప్పాడు: “కొంతసేపు నన్ను ఓర్చుకొనుము ఈ సంగతి నీకు తెలియజేసెదను. ఏలయనగా దేవునిపక్షముగా నేనింకను మాటలాడవలసి యున్నది. . . . నన్ను సృజించినవానికి నీతిని ఆరోపించెదను. . . . నీతిమంతులను ఆయన చూడకపోడు.”—యోబు 36:2-7.

8. మనం యెహోవాను ఎందుకు సమర్థించాలి?

8 యెహోవాను సమర్థించవలసిన అవసరం ఎందుకుంది? నేడు, మన దేవుడైన యెహోవా అనేక విధాలుగా నిందించబడుతున్నాడు. ఆయన ఉనికిలో లేడని, త్రిత్వంలో ఒక భాగమని, మండుతున్న అగ్నిలో ప్రజలను నిరంతరం హింసిస్తాడని, ప్రపంచాన్ని మార్చాలని విఫల యత్నం చేస్తున్నాడని, మానవజాతి గురించి పట్టించుకోడని, ఇలాంటి తదితర ఆరోపణలు చేయబడుతున్నాయి. యెహోవా ఉనికిలో ఉన్నాడని; ఆయన జ్ఞానము, న్యాయము, ప్రేమగల సర్వోన్నతమైన దేవుడని; ప్రతి దానికీ ఆయనకొక సమయం ఉందని; తన నిర్ణీత సమయం వచ్చినప్పుడు దుష్టత్వాన్నంతటినీ నిర్మూలించి మొత్తం భూమిని పరదైసుగా మారుస్తాడని ఆయనను సమర్థించి, నిరూపించడం ద్వారా ఆయన ఎడల మనకు గల యథార్థతను ప్రదర్శిస్తాము. (ప్రసంగి 3:1) యెహోవా నామాన్ని గూర్చీ రాజ్యాన్ని గూర్చీ సాక్ష్యమిచ్చేందుకు మనం ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడం అవసరం.

యెహోవా సంస్థ ఎడల యథార్థత

9. ఏ విషయాల్లో కొందరు తమ యథార్థత లేనితనాన్ని చూపించారు?

9 ఇప్పుడు మనం యెహోవా యొక్క దృశ్య సంస్థ ఎడల యథార్థంగా ఉండడం అనే విషయానికి వస్తున్నాము. క్రైస్తవ సంఘాన్ని ఆత్మీయంగా పోషిస్తున్న “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు”నితో సహా మనం దాని ఎడల కచ్చితంగా యథార్థంగా ఉండాలి. (మత్తయి 24:45-47) ఆ సమయానికి మనకు అర్థంకానిది లేక మనం అంగీకరించనిది ఒకవేళ కావలికోటలో వచ్చిందనుకోండి. మనమేమి చేస్తాము? అభ్యంతరపడి సంస్థను విడిచిపెడతామా? అనేక సంవత్సరాల క్రితం, కావలికోట నూతన నిబంధనను వెయ్యేండ్ల పరిపాలనకు అన్వయించినప్పుడు కొంతమంది చేసినదదే. తటస్థత అనే అంశంపై ఒకసారి కావలికోట చెప్పినదాన్నిబట్టి ఇతరులు అభ్యంతరపడ్డారు. ఈ విషయాల గురించి అభ్యంతరపడినవారు సంస్థ ఎడల, తమ సహోదరుల ఎడల యథార్థంగా ఉండివుంటే, ఈ విషయాలు స్పష్టపరిచేందుకు వారు యెహోవా కొరకు వేచివుండేవారు, ఆయన తన నిర్ణీత సమయంలో అలాగే స్పష్టపరిచాడు. గనుక, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిచే అదనపు అవగాహన ప్రచురించబడేంత వరకూ సహనంతో వేచివుండడం కూడా యథార్థతలో ఒక భాగమే.

10. యథార్థత మనం దేని గురించి ఉత్సుకత కలిగి ఉండకుండా కాపాడుతుంది?

10 యెహోవా యొక్క దృశ్య సంస్థ ఎడల యథార్థంగా ఉండడమంటే మతభ్రష్టులను నిరాకరించడమని కూడా భావం. అలాంటి ప్రజలు ఏమి చెబుతారనే దాని గురించి యథార్థ క్రైస్తవులు ఉత్సుకత కలిగి ఉండరు. నిజమే, భూమిపై తన పనిని చేయించుకోవడానికి యెహోవా దేవుడు ఉపయోగించుకుంటున్న వారు పరిపూర్ణులు కాదు. కాని దేవుని వాక్యం ఏమి చేయమని మనకు చెబుతుంది? దేవుని సంస్థను విడిచిపెట్టమనా? కాదు. సహోదర ప్రేమ మనం దాని ఎడల యథార్థంగా ఉండేలా చేయాలి, మనం ‘ఒకరినొకరం హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించడంలో’ కొనసాగాలి.—1 పేతురు 1:22, 23.

యథార్థవంతులైన పెద్దల ఎడల యథార్థత

11. యథార్థత ఏ ప్రతికూల దృక్పథాన్నుండి మనల్ని దూరంగా ఉంచుతుంది?

11 మనం అర్థం చేసుకోవడానికి కష్టమైనదేదైనా సంఘంలో చెప్పబడినప్పుడు లేక చేయబడినప్పుడు, మనం విమర్శించే వారిగా ఉండకుండా యథార్థత మనల్ని కాపాడుతుంది మరియు బహుశా అది వ్యక్తిగతంగా నిర్ణయించుకోవలసిన విషయం కావచ్చునని భావించడానికి యథార్థత మనకు సహాయం చేస్తుంది. నియమిత పెద్దల మరియు ఇతర తోటి సాక్షుల బలహీనతల గురించి కంటే వారి మంచి లక్షణాల గురించి తలంచడం ఎంతో మంచిది కాదంటారా? అవును, మనం అలాంటి ప్రతికూల ఆలోచనా విధానం గురించి జాగ్రత్త కలిగివుండడం మంచిది, ఎందుకంటే అది యథార్థంగా లేకపోవడం వంటిదే! “ఎవనిని దూషింపక” ఉండమని పౌలు ఇచ్చిన సలహాను పాటించడానికి కూడా యథార్థత మనకు సహాయం చేస్తుంది.—తీతు 3:1, 2.

12, 13. పెద్దలు ఏ ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది?

12 యథార్థత పెద్దలకు ప్రత్యేకమైన సవాళ్లను కలుగజేస్తుంది. ఈ సవాళ్లలో ఒకటేమిటంటే విశ్వాస్యతను కాపాడడం. సంఘంలోని ఒక సభ్యుడు ఒక పెద్దను నమ్మి ఏదైనా చెప్పి ఉండవచ్చు. పెద్ద అతని ఎడల యథార్థత కల్గివుంటే, రహస్యాన్ని కాపాడడమనే సూత్రాన్ని మీరకుండా ఉంటాడు. సామెతలు 25:9 నందలి ఈ ఉపదేశాన్ని ఆయన వింటాడు: “పరునిగుట్టు బయటపెట్టకుము.” అంటే తన స్వంత భార్యకు కూడా చెప్పకూడదని భావం!

13 పెద్దలు యథార్థతకు సంబంధించిన ఇతర సవాళ్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. వారు మనుష్యులను ప్రీతిపర్చేవారిగా ఉంటారా, లేక సరిదిద్దడం అవసరమైనప్పుడు రక్తసంబంధీకులైనా లేదా సన్నిహిత స్నేహితులైనా వారికి ధైర్యంగా మరియు సాత్వికంగా సహాయం చేస్తారా? యెహోవా సంస్థ ఎడల యథార్థత కలిగివుండడం, మనలో పెద్దలుగా ఉన్నవారు ఆత్మీయ సహాయం అవసరమైన ఎవరికైనా తోడ్పడేందుకు ప్రయత్నించేలా చేస్తుంది. (గలతీయులు 6:1, 2) యథార్థత, పౌలు అపొస్తలుడైన పేతురుతో నిష్కపటంగా మాట్లాడినట్లుగానే మనం దయగా ఉన్నప్పటికీ, మన తోటి పెద్దలతో నిష్కపటంగా ఉండేలా చేస్తుంది. (గలతీయులు 2:11-14) మరోవైపున, అధ్యక్షులు జాగ్రత్తగలవారై ఉండాలి, ఎందుకంటే వారు జ్ఞానయుక్తంగా ప్రవర్తించకపోతే లేక పక్షపాతం చూపితే లేక తమ అధికారాన్ని మరో విధంగా దుర్వినియోగం చేస్తే, తమ సంరక్షణలో ఉన్నవారికి దేవుని సంస్థ ఎడల యథార్థంగా ఉండడాన్ని కష్టతరం చేస్తారు.—ఫిలిప్పీయులు 4:5.

14, 15. సంఘ సభ్యుల యథార్థతను ఏ కారణాలు పరీక్షించవచ్చు?

14 సంఘం ఎడల, దాని పెద్దల ఎడల యథార్థంగా ఉండడం అనే సవాలునెదుర్కోవడమనే విషయానికి ఇతర అంశాలున్నాయి. సంఘంలో ఒక విధమైన కష్టతరమైన పరిస్థితులుంటే, ఇది యెహోవా ఎడల ఆయన సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారి ఎడల యథార్థతను చూపించడానికి మనకు అవకాశాన్నిస్తుంది. (1987 జూన్‌ 15, కావలికోట [ఆంగ్లం] 15-17 పేజీలను చూడండి.) యథార్థంగా ఉండాలంటే, ఎవరైనా సంఘం నుండి బహిష్కరించబడినప్పుడు, అలా తీసుకోబడిన నిర్ణయానికి తగినన్ని కారణాలున్నాయా లేదా అని ఊహించడానికి ప్రయత్నించకుండా పెద్దలను సమర్థించాలి.

15 సంఘం ఎడల యథార్థంగా ఉండాలంటే, మన పరిస్థితులు మరియు సామర్థ్యం అనుమతించినంత మేరకు వారపు కూటాలు ఐదింటికీ మద్దతునివ్వవలసిన అవసరం కూడా ఉంది. యథార్థంగా ఉండడానికి, మనం వాటికి క్రమంగా హాజరవ్వడమే కాదు, వాటి కొరకు సిద్ధపడి అవకాశం లభించినప్పుడు నిర్మాణాత్మకమైన వ్యాఖ్యానాలు చేయడం కూడా అవసరం.—హెబ్రీయులు 10:24, 25.

వివాహ బంధంలో యథార్థత

16, 17. వివాహిత క్రైస్తవులు ఏ యథార్థతా సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది?

16 ఇంకా ఎవరి ఎడల యథార్థంగా ఉండాలి? మనం వివాహితులమైతే, మన వివాహ ప్రమాణాల దృష్ట్యా, మనం మన వివాహ జత ఎడల యథార్థంగా ఉండడమనే సవాలును ఎదుర్కోవలసి ఉంటుంది. మన స్వంత భార్యను లేక భర్తను ప్రీతిపర్చడం కంటే ఇతర స్త్రీ పురుషులను ప్రీతిపర్చే పొరపాటు చేయకుండా, మన జత ఎడల యథార్థత మనల్ని కాపాడుతుంది. మన జత ఎడల యథార్థంగా ఉండడానికి, మన జత యొక్క బలహీనతలను లేక లోపాలను బయటి వారికి బయల్పర్చకుండా ఉండడం అవసరం. బంగారు సూత్రానికి అనుగుణంగా, మన జతతో సరైన విధంగా సంభాషించేలాంటి సంబంధాలను కలిగివుండడానికి కష్టపడే బదులు ఇతరులకు ఫిర్యాదు చేయడం సులభం. (మత్తయి 7:12) నిజంగా, వివాహ స్థితి మన క్రైస్తవ యథార్థతకు నిజమైన సవాలు అవుతుంది.

17 ఈ యథార్థతా సవాలునెదుర్కొనేందుకు మనం గంభీరమైన దుష్‌ప్రవర్తనను విసర్జించడమే కాకుండా, మనం మన తలంపులను, భావాలను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. (కీర్తన 19:14) ఉదాహరణకు, మన మోసకరమైన హృదయాలు ఆనందం కొరకు, ఉత్తేజం కొరకు ఆశపడుతుంటే, మనం స్వార్థపూరితంగా ఆశించడం నుండి కోరుకునే వరకు వెళ్లడం ఎంతో సులభమౌతుంది. వివాహ విశ్వాస్యతను కోరుతూ, ‘మీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుడని’ రాజైన సొలొమోను భర్తలకు సూచనార్థకంగా ఉపదేశమిస్తున్నాడు. (సామెతలు 5:15) యేసు ఇలా చెప్పాడు: “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.” (మత్తయి 5:28) అశ్లీల సాహిత్యాన్ని చదివే భర్తలు వ్యభిచారం చేసే ప్రమాదంలో పడిపోతారు, తద్వారా తమ భార్యలను లైంగిక విషయాల్లో మోసగించి, వారి ఎడల యథార్థత లేనివారిగా తయారౌతారు. అదే కారణం చేత, వ్యభిచారానికి సంబంధించిన నాటకాలను చూడడంలో నిమగ్నమై ఉండే భార్య తన భర్త ఎడల యథార్థత లేనిదిగా తయారయ్యేందుకు శోధింపబడగలదు. అయితే, మన జత ఎడల నిజంగా యథార్థంగా ఉండడం ద్వారా మనం వివాహ బంధాన్ని పటిష్ఠపరచుకొని, యెహోవా దేవుని ప్రీతిపర్చడానికి చేసే ప్రయత్నాలలో ఒకరికొకరం సహాయం చేసుకుంటాము.

యథార్థంగా ఉండడానికి సహాయకాలు

18. దేన్ని గుణగ్రహించడం యథార్థంగా ఉండడానికి మనకు సహాయం చేస్తుంది?

18 యెహోవా ఎడల, ఆయన సంస్థ ఎడల, సంఘం ఎడల, మన వివాహజత ఎడల యథార్థత కలిగివుండడమనే ఈ నాలుగు అంశాల్లో, యథార్థతా సవాలునెదుర్కోవడానికి మనకు ఏది సహాయం చేస్తుంది? ఒక సహాయకం ఏమిటంటే, యథార్థతా సవాలునెదుర్కోవడమనేది యెహోవా సర్వోన్నతాధిపత్యాన్ని ఉన్నతపర్చడంతో సన్నిహిత సంబంధాన్ని కలిగివుందనేదాన్ని గుణగ్రహించడం. అవును, యథార్థంగా ఉండడం ద్వారా మనం యెహోవాను విశ్వసర్వాధిపతిగా దృష్టిస్తున్నామని చూపిస్తాము. తద్వారా మనం స్వాభిమానాన్ని, యెహోవా నూతన లోకంలో నిత్యజీవ నిరీక్షణను కూడా పొందగలము. యెహోవా మొదలుకొని బైబిలునందు మరియు వార్షిక పుస్తకంతో (ఆంగ్లం) సహా మన కావలికోట ప్రచురణలయందు ప్రస్తావించబడిన యథార్థతకు సంబంధించిన చక్కని ఉదాహరణలను పరిశీలించడం ద్వారా యథార్థంగా ఉండడానికి మనకు మనం సహాయం చేసుకోగలము.

19. మనం యథార్థంగా ఉండడంలో విశ్వాసం ఏ పాత్ర నిర్వహిస్తుంది?

19 యెహోవా దేవునియందు దృఢవిశ్వాసం, ఆయనను అప్రీతిపర్చకూడదనే భయం మనం యథార్థతా సవాలునెదుర్కొనేందుకు మనకు సహాయం చేస్తాయి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పఠించడం ద్వారా, క్రైస్తవ పరిచర్యలో నిమగ్నమై ఉండడం ద్వారా మనం యెహోవాయందలి మన విశ్వాసాన్ని, భయాన్ని మనం బలపర్చుకుంటాము. ఇది, ఎఫెసీయులు 4:23, 24 నందు వ్రాయబడి ఉన్న, పౌలు ఇచ్చిన ఈ ఉపదేశానికి అనుగుణంగా ప్రవర్తించడానికి మనకు సహాయం చేస్తుంది: “మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.”

20. అన్నిటికి పైగా, యెహోవా ఎడల మరియు మనం ఎవరికైతే యథార్థత చూపించవలసి ఉందో వారందరి ఎడల యథార్థత కలిగివుండడానికి మనకు ఏ లక్షణం సహాయం చేస్తుంది?

20 యెహోవా లక్షణాలను గుణగ్రహించడం మనం యథార్థంగా ఉండడానికి సహాయం చేస్తుంది. అన్నిటి కన్నా పైగా, మన పరలోక తండ్రి ఎడల నిస్వార్థమైన ప్రేమ మరియు ఆయన మన కొరకు చేసిన వాటన్నిటి ఎడల కృతజ్ఞత, ఆయనను మన పూర్ణ హృదయముతోను, ప్రాణముతోను, మనస్సుతోను, బలముతోను ప్రేమించడం ఆయన ఎడల యథార్థంగా ఉండడానికి మనకు సహాయం చేస్తాయి. అంతేగాక, తన అనుచరులుగా గుర్తిస్తుందని యేసు చెప్పినటువంటి ప్రేమను కలిగివుండడం సంఘంలోని మరియు మన కుటుంబంలోని క్రైస్తవులందరి ఎడల యథార్థంగా ఉండడానికి మనకు సహాయం చేస్తుంది. వేరే మాటల్లో చెప్పాలంటే, అది వాస్తవానికి స్వార్థపూరితంగా ఉండడానికి లేక నిస్వార్థంగా ఉండడానికి సంబంధించిన విషయం. యథార్థంగా లేకపోవడం అంటే స్వార్థపూరితంగా ఉండడమని భావం. యథార్థంగా ఉండడమంటే నిస్వార్థంగా ఉండడమని భావం.—మార్కు 12:30, 31; యోహాను 13:34, 35.

21. యథార్థతా సవాలునెదుర్కోవడమనే విషయాన్ని టూకీగా ఎలా చెప్పవచ్చు?

21 టూకీగా చెప్పాలంటే, యథార్థత యెహోవా దేవుడు, యేసు క్రీస్తు, యెహోవా నిజ సేవకులందరూ ప్రదర్శించిన ఉత్కృష్టమైన స్వభావము. యెహోవా దేవునితో మంచి సంబంధం కలిగి ఉండడానికి, ఆయన నైతిక కట్టడలకు తగినట్లు జీవించడం ద్వారా, ఆయన శత్రువులతో ఏవిధమైన జోక్యం లేకుండా ఉండడం ద్వారా, నియతంగా మరియు అనియతంగా సాక్ష్యమివ్వడంలో యెహోవాను సమర్థించడం ద్వారా మనం ఆయన ఎడల మన యథార్థతా సవాలును ఎదుర్కోవాలి. యెహోవా దృశ్య సంస్థ ఎడల యథార్థంగా ఉండడమనే సవాలును కూడా మనం ఎదుర్కోవాలి. మనం మన సంఘాల ఎడల యథార్థంగా ఉండాలి, మన వివాహ జతల ఎడల యథార్థంగా ఉండాలి. యథార్థతా సవాలును విజయవంతంగా ఎదుర్కోవడం ద్వారా, మనం యెహోవా సర్వోన్నతాధిపత్యాన్ని ఉన్నతపర్చడమే కాకుండా వివాదాంశంలో ఆయన పక్షాన ఉంటాము. తద్వారా మనం ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకొని, నిత్యజీవ బహుమానాన్ని పొందుతాము. దైవ భక్తి గురించి అపొస్తలుడైన పౌలు చెప్పినదాన్ని మనం యథార్థతా సవాలునెదుర్కోవడానికి కూడా అన్వయించవచ్చు. అది ఇప్పటి జీవితానికి, రాబోవు జీవితానికి కూడా ప్రయోజనకరమైనదే.—కీర్తన 18:25; 1 తిమోతి 4:8.

మీరెలా సమాధానమిస్తారు?

◻ దేవుని ఎడల యథార్థంగా ఉండడమనే సవాలును మనం ఏ యే విధాలుగా ఎదుర్కోగలము?

◻ యెహోవా సంస్థ ఎడల యథార్థంగా ఉండాలంటే మనం ఏమి చేయాలి?

◻ పెద్దలు యథార్థతా సవాలును ఎలా ఎదుర్కొంటారు?

◻ వివాహిత క్రైస్తవులు యథార్థతకు సంబంధించిన ఏ సవాలునెదుర్కోవాలి?

◻ యథార్థతా సవాలునెదుర్కోవడానికి ఏ లక్షణాలు మనకు సహాయం చేస్తాయి?

[17వ పేజీలోని చిత్రం]

పెద్దలు సంఘ సభ్యుల ఎడల యథార్థంగా ఉండడం వారు రహస్యమైన విషయాలను వెల్లడి చేయకుండా కాపాడుతుంది

[18వ పేజీలోని చిత్రం]

ఒకరు తమ జత ఎడల యథార్థంగా ఉండడం వివాహ బంధాన్ని పటిష్ఠపరుస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి