యథార్థవంతున్ని చూడండి!
“నీవు మాత్రము పవిత్రుడవు [“యథార్థవంతుడవు,” NW], నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు?”—ప్రకటన 15:4.
1. తన పూర్వాధికారియైన సి. టి. రస్సెల్ యొక్క యథార్థత గురించి జె. ఎఫ్. రూథర్‌ఫోర్డ్ ఏమని సాక్ష్యమిచ్చాడు?
సి. టి. రస్సెల్ తర్వాత, 1917లో వాచ్ టవర్ సొసైటీ అధ్యక్షునిగా నియమితుడైన జోసెఫ్ ఎఫ్. రూథర్‌ఫోర్డ్ ఇలా చెబుతూ రస్సెల్ భూస్థాపన కార్యక్రమ ప్రసంగాన్ని ప్రారంభించాడు: “చార్లెస్ తేజ్ రస్సెల్ దేవుని ఎడల యథార్థంగా ఉన్నాడు, క్రీస్తు యేసు ఎడల యథార్థంగా ఉన్నాడు, మెస్సీయ రాజ్య కారణం ఎడల యథార్థంగా ఉన్నాడు. ఆయన అత్యంత యథార్థవంతుడు, అవును, చివరికి మరణం వరకు యథార్థంగా ఉన్నాడు.” నిజంగా, అది యెహోవా దేవుని నమ్మకమైన సేవకునికి అర్పించదగిన చక్కని నివాళి. ఒక వ్యక్తి యథార్థతా సవాలును ఎదుర్కొన్నాడని, యథార్థంగా—అత్యంత యథార్థంగా ఉన్నాడని చెప్పడం కంటే గొప్ప నివాళి మరొకటి మనం ఆయనకు అర్పించలేము.
2, 3. (ఎ) యథార్థంగా ఉండడం ఎందుకు సవాలుతో కూడినది? (బి) యథార్థంగా ఉండాలని నిజ క్రైస్తవులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డగించడంలో ఎవరు కూడా చేరి ఉన్నారు?
2 యథార్థంగా ఉండడం సవాలుతో కూడినది. ఎందుకు? ఎందుకంటే, యథార్థత మరియు స్వీయాసక్తి ఒకదానికొకటి వ్యతిరేకమైనవి. దేవుని ఎడల యథార్థంగా లేనివారిలో ప్రముఖులు క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు. అంతేకాకుండా, వివాహ బంధంలో నేడున్నంత విపరీతంగా నమ్మక ద్రోహం మరెన్నడూ లేదు. జారత్వం సర్వసాధారణమై పోయింది. వ్యాపార ప్రపంచంలో కూడా నమ్మక ద్రోహం పెచ్చుపెరిగిపోతోంది. దీని గురించి మనకిలా చెప్పబడుతోంది: “అమాయకులూ మూర్ఖులు మాత్రమే నేడు తమ కంపెనీల ఎడల యథార్థంగా ఉంటున్నారని అనేకమంది మేనేజర్లు, వ్యాపారవేత్తలు . . . నమ్ముతున్నారు.” “మరీ యథార్థంగా” ఉండేవారు హీనంగా చూడబడుతున్నారు. ఇతర కంపెనీలకు సలహాలిచ్చే సంస్థ అధ్యక్షుడు ఇలా చెబుతున్నాడు: “మీరు ప్రాముఖ్యంగా యథార్థంగా ఉండవలసింది మీకే.” తమ ఎడల తాము యథార్థంగా ఉండడం గురించి చెప్పాలంటే, ఆ పద భావాన్ని వికృతపర్చినట్లే. అది మనకు మీకా 7:2 నందు చెప్పబడిన దీన్ని గుర్తుకు తెస్తుంది: “భక్తుడు [“యథార్థవంతుడు,” NW] దేశములో లేకపోయెను.”
3 ఎంతో విశేషమైన పరిధిలో, సాతాను మరియు అతని దయ్యాలు మన చుట్టూ వ్యూహం పన్ని, మనం దేవుని ఎడల యథార్థంగా ఉండకుండా చేయాలని పట్టుదల కలిగివున్నారు. అందుకే ఎఫెసీయులు 6:12 నందు క్రైస్తవులకిలా చెప్పబడింది: “మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.” అవును, మనం ఈ హెచ్చరికను లక్ష్యపెట్టాలి: “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.”—1 పేతురు 5:8.
4. ఎలాంటి దృక్పథాలు యథార్థంగా ఉండడాన్ని కష్టతరం చేస్తాయి?
4 “నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది” మరియు స్వార్థపూరితమైనది అని ఆదికాండము 8:21 నందు చెప్పబడినట్లుగా, మన తలిదండ్రుల నుండి మనం వారసత్వంగా పొందిన స్వార్థపూరిత దృక్పథాలు కూడా మనం యథార్థంగా ఉండడాన్ని కష్టతరం చేస్తాయి. తనకు ఉందని అపొస్తలుడైన పౌలు అంగీకరించిన ఈ సమస్యే మనకందరికీ ఉంది: “నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను.”—రోమీయులు 7:19.
యథార్థత విశేషమైనది
5, 6. యథార్థత ఏమిటనే దాని గురించి ఏమి చెప్పవచ్చు, అది ఎలా నిర్వచించబడింది?
5 “యథార్థత” అన్నది ఎంతో ప్రత్యేకమైన పదం. అందుకే లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం) ఇలా తెలియజేస్తుంది: “హెబ్రీ మరియు గ్రీకు పదాల పూర్తి భావాన్ని కచ్చితంగా వ్యక్తపర్చగల ఆంగ్ల పదాలు ఏవీ లేనట్లు కనిపిస్తుంది, కాని దానిలో ఇమిడివున్న భక్తి మరియు విశ్వాస్యతలనే తలంపుతో సహా, దేవునికి ఆయన సేవకు సంబంధించి ఉపయోగింపబడినప్పుడు ‘యథార్థత’ సరైన భావాన్నే స్ఫురింపజేస్తుంది.”a “యథార్థత”కు సంబంధించి ఒకసారి కావలికోట ఇలా తెలియజేసింది: “విశ్వాస్యత, విధి, ప్రేమ, బాధ్యత, కర్తవ్యపాలన. ఈ పదాల్లో ఉన్న సారూప్యత ఏమిటి? అవి యథార్థత యొక్క వివిధ అంశాలు.” అవును, ఎన్నో సద్గుణాలు ఉన్నాయి, అవన్నీ యథార్థత యొక్క వివిధ అంశాలే. లేఖనాల్లో యథార్థత మరియు నీతి ఎంత తరచుగా జతచేయబడ్డాయన్నది వాస్తవానికి గమనించదగిన విషయం.
6 ఈ క్రింది నిర్వచనాలు కూడా సహాయకరమైనవి: ‘యథార్థత అన్నది ఒక కొనసాగే, తొణకకుండా ఉండే లేక శోధనను తాళుకొనే, నమ్మదగిన విశ్వాస్యతను మరియు కర్తవ్యపాలనను సూచించవచ్చు.’ ‘ఒకరు తాము చేసిన వాగ్దాన వచనం ఎడల విశ్వాసంగా ఉండడాన్ని లేక తాను నైతికంగా కట్టుబడి ఉన్నానని భావిస్తున్న సంస్థ ఎడల లేక సూత్రాల ఎడల నిరంతర భక్తిని సూచిస్తుంది; ఈ పదం కట్టుబడి ఉండడాన్నే కాదుగాని దానికి కట్టుబడి ఉండడం నుండి వైదొలగిపోవడం మరియు మోసగింపబడడం వంటివాటిని నిరోధించడాన్ని కూడా సూచిస్తుంది.’ కాబట్టి, పరీక్షలు, వ్యతిరేకత మరియు హింస ఎదురైనప్పటికీ విశ్వాసంగా కొనసాగే ప్రజలు “యథార్థవంతులుగా” పిలువబడడానికి అర్హులు.
7. యథార్థత మరియు విశ్వాస్యతల మధ్య ఏ తేడాను చూడగలము?
7 అయితే దీనికి సంబంధించి, యథార్థత మరియు విశ్వాస్యతల మధ్యనున్న తేడాను వివరించడం మంచిది. పశ్చిమ అమెరికాలో, దాదాపు ప్రతి గంటకు పొంగే తప్తఝరి ఒకటుంది. అది అలా ఎంత క్రమంగా పేలుతుందంటే, అది పాత నమ్మకస్థురాలు అని పిలువబడింది. చంద్రుడు ఆధారపడదగినట్లుగా ఉన్నందున బైబిలు అటువంటి నిర్జీవ వస్తువుల గురించి నమ్మకమైనవి అన్నట్లుగా చెబుతుంది. చంద్రుని గురించి కీర్తన 89:36, ‘నమ్మకముగానున్న మింటనుండు సాక్షి’ అని చెబుతుంది. దేవుని మాటలు నమ్మకమైనవని చెప్పబడుతుంది. ప్రకటన 21:5 ఇలా చెబుతుంది: “సింహాసనాసీనుడైయున్నవాడు—ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు—ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.” ఈ ఉదాహరణలన్నీ నమ్మకమైనవి, ఆధారపడదగినవి, కాని ఏ విధమైన వ్యక్తిగత సంబంధం కలిగివుండడానికి లేక యథార్థత వంటి నైతిక లక్షణాలను కలిగివుండడానికి అవి సామర్థ్యం గలవి కావు.
యెహోవా, అత్యంత యథార్థవంతుడు
8. ఏ లేఖనాధార రుజువు యథార్థత యొక్క చక్కని ఉదాహరణను తెలియజేస్తుంది?
8 నిస్సందేహంగా, యెహోవా దేవుడు యథార్థత విషయంలో అతిచక్కని ఉదాహరణ. చివరికి, మానవులు నిత్యజీవాన్ని పొందగలిగేలా తన కుమారున్ని ఇవ్వడం ద్వారా యెహోవా మానవజాతి ఎడల యథార్థంగా ఉన్నాడు. (యోహాను 3:16) యిర్మీయా 3:12 NW, నందు మనమిలా చదువుతాము: “ద్రోహినివగు ఇశ్రాయేలూ, తిరిగిరా; ఇదే యెహోవా వాక్కు. నేను యథార్థవంతున్ని కాబట్టి మీమీద నా కోపము పడనీయను.” “వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, [“యథార్థవంతుడా,” NW] . . . నీవు న్యాయవంతుడవని” ప్రకటన 16:5 నందు వ్రాయబడివున్న మాటలు యెహోవా యథార్థతకు మరింత రుజువునిస్తున్నాయి. మళ్లీ, కీర్తన 145:17 నందు మనకిలా చెప్పబడుతుంది: “యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు [“యథార్థవంతుడు,” NW].” వాస్తవానికి, యెహోవా తన యథార్థత విషయంలో ఎంతో అసమానుడు అందుకే ప్రకటన 15:4 ఇలా చెబుతుంది: “నీవు మాత్రము పవిత్రుడవు [“యథార్థవంతుడవు,” NW], నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు?” యెహోవా దేవుడు అత్యున్నతమైన స్థాయిలో యథార్థవంతుడు.
9, 10. ఇశ్రాయేలు జనాంగంతో తన వ్యవహారాలయందు యథార్థత యొక్క ఏ రికార్డును యెహోవా కలిగి ఉన్నాడు?
9 ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు జనాంగం యొక్క చరిత్ర యెహోవా తన ప్రజల ఎడల చూపిన యథార్థతను గూర్చిన విస్తృతమైన సాక్ష్యాన్ని కలిగివుంది. న్యాయాధిపతుల కాలంలో, ఇశ్రాయేలు అనేకసార్లు సత్యారాధన నుండి వైదొలగిపోయింది, కాని యెహోవా పదే పదే సంతాపపడి వారిని రక్షించాడు. (న్యాయాధిపతులు 2:15-22) ఇశ్రాయేలు రాజులను కలిగివున్న ఐదు శతాబ్దాలలోనూ యెహోవా ఆ జనాంగం ఎడల తన యథార్థతను చూపించాడు.
10 “వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచు వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింపశక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను” అని 2 దినవృత్తాంతములు 36:15, 16 నందు వ్రాయబడి ఉన్నట్లుగా, యెహోవా యొక్క యథార్థత ఆయన తన ప్రజల ఎడల సహనం కలిగివుండడానికి కారణమయ్యింది.
11. యెహోవా యొక్క యథార్థత మనకు ఏ నిశ్చయతను లేక ఓదార్పును ఇస్తుంది?
11 యెహోవా సర్వోన్నత యథార్థవంతుడు గనుక, రోమీయులు 8:38, 39 నందున్నట్లుగా పౌలు ఇలా వ్రాయగలిగాడు: “మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.” అవును, యెహోవా మనకిలా అభయమిస్తున్నాడు: “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను.” (హెబ్రీయులు 13:5) యెహోవా దేవుడు ఎల్లప్పుడూ యథార్థవంతుడేనన్నది తెలుసుకోవడం నిజంగా ఓదార్పుకరమైన విషయం!
యేసు క్రీస్తు, యథార్థవంతుడైన కుమారుడు
12, 13. దేవుని కుమారుని యథార్థతకు సంబంధించి ఏ రుజువు మనకుంది?
12 యథార్థతా సవాలును ఎదుర్కోవడంలో యెహోవాను పరిపూర్ణంగా అనుకరించింది, అనుకరించేది యేసు క్రీస్తే. అపొస్తలుడైన పేతురు కీర్తన 16:10ని ఉదాహరిస్తూ, అపొస్తలుల కార్యములు 2:27నందు దాన్ని తగినట్లుగానే యేసు క్రీస్తుకు ఇలా అన్వయించాడు: “నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని [“యథార్థవంతుని,” NW] కుళ్లుపట్టనియ్యవు.” యేసు క్రీస్తు తగినట్లుగానే “యథార్థవంతునిగా” పిలువబడ్డాడు. ఆయన తన తండ్రి ఎడల మరియు దేవుడు వాగ్దానం చేసిన రాజ్యం ఎడల అన్ని విధాలుగా యథార్థత చూపించాడు. సాతాను మొదట శోధనలను, స్వీయాసక్తికి సంబంధించిన విన్నపాలను ఉపయోగించి యేసు యథార్థతను పాడు చేయడానికి ప్రయత్నించాడు. అపవాది అలా చేయడంలో విఫలమై, హింసను చేపట్టి, చివరికి మరణదండన కొయ్యపై యేసు మరణించేలా చేశాడు. తన పరలోక తండ్రియైన యెహోవా దేవుని ఎడల తన యథార్థత విషయంలో యేసు ఎన్నడూ తప్పిపోలేదు.—మత్తయి 4:1-11.
13 “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని” మత్తయి 28:20నందు వ్రాయబడివున్న వాగ్దానానికి అనుగుణంగా ఉండడంలో యేసు క్రీస్తు తన అనుచరుల ఎడల యథార్థత చూపించాడు. ఆ వాగ్దాన నెరవేర్పుగా, సా.శ. 33 పెంతెకొస్తు నాటి నుండి నేటి వరకు తన సంఘంపై యథార్థంగా నాయకత్వం వహిస్తున్నాడు.
యథార్థంగా ఉండిన అపరిపూర్ణ మానవులు
14. యోబు, యథార్థత విషయంలో ఏ మాదిరినుంచాడు?
14 ఇప్పుడు, అపరిపూర్ణ మానవుల మాటేమిటి? వారు దేవుని ఎడల యథార్థంగా ఉండగలరా? మనకు యోబును గూర్చిన విశేషమైన ఉదాహరణ ఉంది. ఆయన విషయంలో సాతాను వివాదాంశాన్ని స్పష్టం చేశాడు. యోబు యెహోవా దేవుని ఎడల యథార్థంగా ఉన్నాడా, లేక కేవలం తన స్వీయాసక్తినిబట్టి మాత్రమే ఆయనను సేవించేవాడా? యోబుకు శ్రమ కలిగేలా చేయడం ద్వారా ఆయనను యెహోవా నుండి దూరం చేయగలనని సాతాను ప్రగల్భాలు పలికాడు. యోబు తన సంపదలన్నిటినీ, తన పిల్లలందరినీ, చివరికి తన ఆరోగ్యాన్నీ కోల్పోయినప్పుడు, “దేవుని దూషించి మరణము కమ్మ”ని ఆయన భార్య ఆయనను పురికొల్పింది. కాని యోబు యథార్థంగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన ఆమెతో, “మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటిమాటతోనైనను పాపము చేయలేదు.” (యోబు 2:9, 10) వాస్తవానికి, తనను ఓదార్చడానికి వచ్చిన వారితో యోబు ఇలా చెప్పాడు: “ఆయన [దేవుడు] నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను.” (యోబు 13:15) యోబు యెహోవా అనుగ్రహాన్ని పొందడంలో ఆశ్చర్యం లేదు! గనుక, తేమానీయుడైన ఎలీఫజుతో యెహోవా ఇలా చెప్పాడు: “నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితులమీదను మండుచున్నది.”—యోబు 42:7, 10-16; యాకోబు 5:11.
15. యెహోవా దేవుని యొక్క అనేకమంది సేవకుల యథార్థతకు సంబంధించి ఏ లేఖనాధార రుజువు మనకుంది?
15 హెబ్రీయులు 11వ అధ్యాయంలో వర్ణించబడిన స్త్రీ పురుషులందరూ యథార్థవంతులని చెప్పవచ్చు. వారు విశ్వాసంగా ఉండడమే కాదుగాని ఒత్తిళ్ల సమయంలో యథార్థంగా కూడా ఉన్నారు. అందుకే వారి గురించి మనమిలా చదువుతాము, “వారు విశ్వాసముద్వారా . . . సింహముల నోళ్లను మూసిరి; అగ్నిబలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; . . . మరికొందరు తిరస్కారములను కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొఱ్ఱెచర్మములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింస” పొందిరి.—హెబ్రీయులు 11:33-38.
16. యథార్థత విషయంలో అపొస్తలుడైన పౌలు ఏ మాదిరినుంచాడు?
16 క్రైస్తవ గ్రీకు లేఖనాలు అపొస్తలుడైన పౌలు యొక్క గమనార్హమైన ఉదాహరణను కూడా మనకు అందజేస్తున్నాయి. తగినట్లుగానే ఆయన తన పరిచర్య గురించి థెస్సలొనీకయ క్రైస్తవులకు ఇలా చెప్పగలిగాడు: “మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను [“యథార్థంగాను,” NW] నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి.” (1 థెస్సలొనీకయులు 2:10) 2 కొరింథీయులు 6:4-10 నందు వ్రాయబడివున్న పౌలు మాటల్లో ఆయన యథార్థతను గూర్చిన అదనపు రుజువు మనకు లభిస్తుంది. అక్కడ మనమిలా చదువుతాము: “శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను . . . దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము.” ఇదంతా కూడా అపొస్తలుడైన పౌలు తాను యథార్థంగా ఉన్నందున కలిగివున్న స్వాభిమానానికి నిదర్శనంగా ఉంది.
ఆధునిక కాలాల్లోని యథార్థవంతులు
17. జె. ఎఫ్. రూథర్‌ఫోర్డ్ పలికిన ఏ మాటలు యథార్థంగా ఉండాలన్న ఆయన నిశ్చయతను చూపించాయి?
17 ఆధునిక కాలాల్లో, మనం మొదటి పేరాలో ఇప్పటికే చూసినట్లుగా మంచి మాదిరి ఉంది. “సమాధానకర్తయగు అధిపతి” ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్త భద్రత (ఆంగ్లం) అనే పుస్తకం, 146 పేజీనందు “నిర్బంధంలోవున్న కాలంలో యథార్థత” అనే ఉపశీర్షిక క్రింద చెప్పబడిన దానిని గమనించండి. అక్కడిలా చెప్పబడింది: “వాచ్ టవర్ సొసైటీ అధ్యక్షుడైన జోసెఫ్ ఎఫ్. రూథర్‌ఫోర్డ్ తాను నిర్బంధంలో ఉన్న కాలంలో యెహోవా సంస్థ ఎడల యథార్థతను కనబరుస్తూ, 1918 డిశంబరు 25న ఇలా వ్రాశాడు: ‘మహాబబులోనుతో రాజీపడడానికి నేను నిరాకరించాను గాని నా ప్రభువును సేవించడానికి విశ్వసనీయంగా ప్రయత్నించాను గనుక నేను చెరసాలలో ఉన్నాను, దాని గురించి నేను కృతజ్ఞున్ని. . . . మృగంతో రాజీపడడం లేక దానికి లొంగిపోయి స్వతంత్రున్నై మొత్తం ప్రపంచం యొక్క హర్షధ్వానాలను పొందడం కంటే ఆయన అంగీకారాన్ని, అనుగ్రహాన్ని ఎంతగానో కోరుకుంటాను.’”b
18, 19. ఆధునిక కాలాల్లో యథార్థతకు సంబంధించిన ఏ మహత్తరమైన ఉదాహరణలు మనకున్నాయి?
18 హింసను సహించి యథార్థతను కాపాడుకున్న అనేకమంది ఇతర క్రైస్తవుల యొక్క చక్కని ఉదాహరణలు మనకున్నాయి. ఆంగ్ల భాషలో విరివిగా పంచిపెట్టబడిన ఊదారంగు త్రికోణాలు అనే వీడియోలో చూపబడినట్లుగా, అలాంటి యథార్థవంతులైన వ్యక్తుల్లో నాజీ పరిపాలనా కాలంలోని జర్మన్‌కు చెందిన యెహోవాసాక్షులు ఉన్నారు. మలావీనందలి సాక్షులవంటి, ఆఫ్రికాలోని యథార్థవంతులైన అనేకమంది యెహోవాసాక్షులు కూడా పరిగణనలోకి తీసుకొనదగినవారే. అక్కడ ఒక చెరసాల కాపలాదారుడు ఇలా చెబుతూ సాక్షుల యథార్థతకు సాక్ష్యమిచ్చాడు: “వాళ్లు ఎన్నడూ రాజీపడరు. వాళ్లు పెరిగిపోతూనే ఉంటారు.”
19 ఎవరైనా యెహోవాసాక్షుల వార్షిక పుస్తకాలను (ఆంగ్లం) చదివేటప్పుడు నిజక్రైస్తవులు ప్రదర్శించిన యథార్థతనుబట్టి ముగ్ధులు కాకుండా ఉండలేరు. గ్రీస్, మొజాంబిక్, పోలాండ్‌లలోని నిజ క్రైస్తవులు అటువంటి యథార్థతనే ప్రదర్శించారు. వారిలో అనేకులు వేదనాభరితమైన హింసను అనుభవించారు; ఇతరులు హత్య చేయబడ్డారు. హత్య చేయబడేంత వరకు కూడా యథార్థతా సవాలును ఎదుర్కొన్న, ఇతియోపియాకు చెందిన తొమ్మిది మంది క్రైస్తవుల చిత్రాలు 1992 వార్షిక పుస్తకం (ఆంగ్లం) నందలి 177 పేజీలో ఉన్నాయి. మనం యథార్థతా సవాలును ఎదుర్కొనేలా మనల్ని పురికొల్పేందుకు మనకు అనేకమంది యొక్క చక్కని ఉదాహరణలు ఉన్నందున యెహోవాసాక్షులుగా మనం ఆనందించడం లేదా?
20. మనం యథార్థంగా ఉంటే ఏమి జరుగుతుంది?
20 శోధనలను ఒత్తిళ్లను యథార్థంగా ఎదుర్కోవడం ద్వారా, మనం మన స్వాభిమానాన్ని పెంపొందింపజేసుకుంటాము. కాబట్టి, యథార్థతా వివాదాంశంలో మనం ఎవరి పక్షాన ఉన్నట్లు కనుగొనబడాలని ఇష్టపడతాము? యథార్థతా సవాలును ఎదుర్కోవడం ద్వారా, మనం వివాదాంశంలో యెహోవా దేవుని వైపు ఉండి అపవాదియగు సాతాను నీచ, నికృష్ట అబద్ధికుడని నిరూపిస్తాము, నిజంగా అతడు అటువంటి వాడే! తద్వారా మనం మన సృష్టికర్తయైన యెహోవా దేవుని అనుగ్రహాన్ని అలాగే సంతోషభరితమైన నిత్యజీవ ఆశీర్వాదాన్ని పొందుతాము. (కీర్తన 37:29; 144:15) యథార్థతా సవాలును ఎదుర్కోవడానికి ఏమి అవసరమనేది తరువాత పరిశీలించబడుతుంది.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన రెండు సంపుటిల బైబిలు సర్వసంగ్రహ నిఘంటువు.
b వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.
మీరెలా సమాధానమిస్తారు?
◻ యథార్థంగా ఉండడం ఎందుకు సవాలుతో కూడినది?
◻ “యథార్థత” అన్నది ఎంతో ప్రత్యేకమైన పదమని ఎందుకు చెప్పవచ్చు?
◻ యథార్థంగా ఉండిన అపరిపూర్ణ మానవులను గూర్చిన ఏ లేఖనాధార ఉదాహరణలు మనకున్నాయి?
◻ యథార్థత విషయంలో ఏ చక్కని ఆధునికదిన ఉదాహరణలు మనకున్నాయి?
[11వ పేజీలోని చిత్రం]
చార్లెస్ తేజ్ రస్సెల్
[12వ పేజీలోని చిత్రం]
యేసు నిజంగానే యెహోవాయొక్క “యథార్థవంతుడు”
[13వ పేజీలోని చిత్రం]
అపరిపూర్ణుడైనప్పటికీ, యోబు దేవుని ఎడల యథార్థంగా ఉన్నాడు
[14వ పేజీలోని చిత్రం]
యెహోవాఎడల యథార్థత విషయంలో పౌలు చక్కని మాదిరినుంచాడు