కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • bt అధ్యా. 7 పేజీలు 52-59
  • “యేసు గురించిన మంచివార్త” ప్రకటించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “యేసు గురించిన మంచివార్త” ప్రకటించడం
  • “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “చెదిరిపోయినవాళ్లు” (అపొ. 8:4-8)
  • “ఈ అధికారం నాకు కూడా ఇవ్వండి” (అపొ. 8:9-25)
  • “నువ్వు చదువుతున్నది నీకు అర్థమౌతోందా?” (అపొ. 8:26-40)
  • ఫిలిప్పు—ఉత్సాహవంతుడైన సువార్తికుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఫిలిప్పు ఐతియొపీయుడైన అధికారికి బాప్తిస్మమివ్వడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • పయినీరు స్ఫూర్తిని ప్రదర్శించండి
    మన రాజ్య పరిచర్య—2004
  • మీకు తెలుసా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
మరిన్ని
“దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
bt అధ్యా. 7 పేజీలు 52-59

అధ్యాయం 7

“యేసు గురించిన మంచివార్త” ప్రకటించడం

మంచివార్త ప్రచారకుడిగా ఫిలిప్పు మనకు ఆదర్శం ఉంచాడు

అపొస్తలుల కార్యాలు 8:4-40 ఆధారంగా

1, 2. మొదటి శతాబ్దంలో, వ్యతిరేకులు శిష్యుల నోరు నొక్కేయాలని చూసినా ఏం జరిగింది?

హింస ఉప్పెనలా విరుచుకుపడింది. సౌలు, “సంఘం మీద క్రూరంగా దాడిచేయడం మొదలుపెట్టాడు.” (అపొ. 8:3) దాంతో శిష్యులు వేర్వేరు ప్రాంతాలకు చెదిరిపోయారు. క్రైస్తవత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలనే సౌలు కల నిజమౌతుందేమో అని కొంతమందికి అనిపించి ఉండవచ్చు. కానీ ఎవ్వరూ ఊహించనిది ఒకటి జరిగింది. ఏంటది?

2 చెదిరిపోయిన శిష్యులు, తాము వెళ్లిన ప్రాంతాలన్నిటిలో “వాక్యం గురించిన మంచివార్తను ప్రకటిస్తూ ఉన్నారు.” (అపొ. 8:4) ఒక్కసారి ఆలోచించండి! వ్యతిరేకులు హింసను తీసుకొచ్చి శిష్యుల నోరు నొక్కేయాలనుకున్నారు, కానీ నిజానికి మంచివార్త ఇంకా ఎక్కువగా వ్యాపించింది! శిష్యుల్ని చెదరగొట్టడం ద్వారా, వ్యతిరేకులు తమకు తెలీకుండానే రాజ్య ప్రకటనా పని సుదూర ప్రాంతాలకు వెళ్లేలా సహాయపడ్డారు. మనకాలంలో కూడా అలాంటి అనుభవాలే ఉన్నాయి.

“చెదిరిపోయినవాళ్లు” (అపొ. 8:4-8)

3. (ఎ) ఫిలిప్పు ఎవరు? (బి) సమరయలో చాలామందికి మంచివార్త ఎందుకు తెలీదు? అయితే, సమరయలో ఏం జరుగుతుందని యేసు చెప్పాడు?

3 అలా ‘చెదిరిపోయినవాళ్లలో’ ఒకరు ఫిలిప్పు.a (అపొ. 8:4; “‘మంచివార్త ప్రచారకుడైన’ ఫిలిప్పు” అనే బాక్సు చూడండి.) ఆయన సమరయ నగరానికి వెళ్లాడు. ఆ ప్రాంతంలో చాలామందికి అప్పటివరకు మంచివార్త తెలీదు. ఎందుకంటే యేసు మొదట్లో అపొస్తలులకు ఇలా చెప్పాడు: “సమరయులకు చెందిన ఏ నగరంలోకీ ప్రవేశించకండి. అయితే ఇశ్రాయేలు ప్రజల్లో తప్పిపోయిన గొర్రెల్లాంటి వాళ్ల దగ్గరికే వెళ్తూ ఉండండి.” (మత్త. 10:5, 6) త్వరలోనే, సమరయలో కూడా పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇవ్వబడుతుందని యేసుకు తెలుసు. కాబట్టి పరలోకానికి వెళ్లే ముందు, ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు: “యెరూషలేములో, యూదయ అంతటిలో, సమరయలో, భూమంతటా మీరు నా గురించి సాక్ష్యమిస్తారు.”—అపొ. 1:8.

4. ఫిలిప్పు చెప్పిన మంచివార్త విన్నప్పుడు, సమరయులకు ఎలా అనిపించింది? వాళ్లకు అలా అనిపించడానికి కారణం ఏమై ఉండవచ్చు?

4 ఫిలిప్పుకు సమరయ ప్రాంతం “కోతకు సిద్ధంగా” ఉన్న పొలంలా అనిపించింది. (యోహా. 4:35) ఆయన చెప్తున్న మంచివార్త, అక్కడి ప్రజలకు కొత్త ఊపిరి పోసింది. ఎందుకు? యూదులు సాధారణంగా సమరయులతో మాట్లాడరు, కొంతమందైతే వాళ్లను ఈసడించుకునే వాళ్లు. కానీ ఫిలిప్పు చెప్తున్న మంచివార్తలో యూదులు-సమరయులు అనే తేడా లేకపోవడం, పరిసయ్యుల ఆలోచనా విధానానికి అది చాలా వేరుగా ఉండడం అక్కడి ప్రజలు గమనించారు. ఉత్సాహంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా సమరయులకు ప్రకటించడం ద్వారా పరిసయ్యులకు ఉన్న వివక్ష తనకు ఏమాత్రం అంటలేదని ఫిలిప్పు చూపించాడు. అందుకే, ఫిలిప్పు మాటల్ని వినడానికి “ప్రజలు గుంపులుగుంపులుగా” రావడంలో ఎలాంటి ఆశ్చర్యంలేదు.—అపొ. 8:6.

5-7. క్రైస్తవులు వేర్వేరు చోట్లకు చెదిరిపోయినా, మంచివార్తను ఎలా ప్రకటించారో ఉదాహరణలు చెప్పండి.

5 మొదటి శతాబ్దంలోలాగే, ఇప్పుడు కూడా వ్యతిరేకులు హింస ద్వారా దేవుని ప్రజల నోరు నొక్కేయలేకపోయారు. వాళ్లు క్రైస్తవుల్ని జైలుకు పంపించినా లేదా వేరే దేశానికి పంపించినా, దానివల్ల నిజానికి రాజ్య సందేశం కొత్తకొత్త చోట్లకు చేరుకుంది. ఉదాహరణకు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, యెహోవాసాక్షులు నాజీ కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో అసాధారణ రీతిలో సాక్ష్యం ఇచ్చారు. అక్కడ సాక్షుల్ని కలిసిన ఒక యూదుడు ఇలా చెప్తున్నాడు: “ఖైదీలుగా ఉన్న యెహోవాసాక్షుల ధైర్యం చూశాక, వాళ్ల విశ్వాసం లేఖనాలపై ఆధారపడిందని నాకు నమ్మకం కలిగింది. అందుకే నేను కూడా యెహోవాసాక్షిని అయ్యాను.”

6 కొన్నిసార్లయితే, ఏకంగా హింసిస్తున్న వాళ్లకే యెహోవాసాక్షులు మంచివార్త ప్రకటించారు, వాళ్లు కూడా చక్కగా స్పందించారు. ఉదాహరణకు, ఫ్రాంజ్‌ డెష్‌ అనే సహోదరుణ్ణి ఆస్ట్రియాలోని గ్యూసెన్‌ కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుకు తరలించినప్పుడు, ఆయన అక్కడి అధికారుల్లో ఒకరితో బైబిలు స్టడీ చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత యెహోవాసాక్షుల సమావేశంలో వాళ్లిద్దరు కలుసుకున్నారు. ఇప్పుడు, వాళ్లిద్దరూ మంచివార్త ప్రచారకులే. వాళ్లకు ఎంత సంతోషంగా అనిపించి ఉంటుందో ఊహించండి!

7 హింస వల్ల క్రైస్తవులు ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్లిపోయినప్పుడు కూడా అలాంటిదే జరిగింది. ఉదాహరణకు 1970లలో, మలావీలోని చాలామంది సాక్షులు మొజాంబిక్‌కి వెళ్లిపోవాల్సి వచ్చింది. అప్పుడు వాళ్లు మొజాంబిక్‌లో ఉత్సాహంగా సాక్ష్యం ఇచ్చారు. ఆ తర్వాతి కాలంలో, మొజాంబిక్‌లో వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా ప్రకటనా పని ఆగకుండా కొనసాగింది. ఫ్రాన్సెస్కో కొయానా అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “నిజమే, మాలో కొంతమందిమి ప్రకటనా పని కారణంగా చాలాసార్లు అరెస్టు అయ్యాం. కానీ చాలామంది రాజ్య సందేశాన్ని చక్కగా వినడం మేము చూశాం. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు సహాయం చేసినట్టే, దేవుడు మాకు కూడా సహాయం చేస్తున్నాడని నమ్మకం కలిగింది.”

8. యుద్ధం, ఆర్థిక సంక్షోభం వంటివాటి వల్ల రాజ్య సందేశం ఎక్కువమందికి ఎలా చేరుకుంది?

8 అయితే క్రైస్తవత్వం సుదూర ప్రాంతాలకు చేరడానికి హింస ఒక్కటే కారణం కాదు. ఈమధ్య కాలంలో రాజకీయ మార్పులు, ఆర్థిక సంక్షోభం కారణంగా ఎన్నో దేశాల ప్రజలకు, రకరకాల భాషల వాళ్లకు మంచివార్త వినే అవకాశం దొరికింది. యుద్ధాల వల్ల, ఆర్థిక సంక్షోభం వల్ల కొంతమంది ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఆ కొత్త ప్రాంతంలో వాళ్లు బైబిలు స్టడీ తీసుకుంటున్నారు. అలా ఎక్కువమంది శరణార్థులు రావడం వల్ల వేరే భాషా క్షేత్రాలు తెరుచుకుంటున్నాయి. మీ ప్రాంతంలోని వేర్వేరు ‘దేశాల, గోత్రాల, జాతుల, భాషల’ ప్రజలకు ప్రకటించడానికి మీరు కృషి చేస్తున్నారా?—ప్రక. 7:9.

“ఈ అధికారం నాకు కూడా ఇవ్వండి” (అపొ. 8:9-25)

ఇదివరకు ఇంద్రజాలం చేసిన సీమోను డబ్బు సంచితో ఒక అపొస్తలుడి దగ్గరికి వస్తున్నాడు. ఆ అపొస్తలుడు ఒక క్రైస్తవుని భుజాల మీద చేతులు ఉంచుతున్నాడు. వెనకాల ఇంకో క్రైస్తవుడు ఒక కుంటి అమ్మాయిని బాగుచేస్తుంటే, చూసేవాళ్లంతా సంతోషిస్తున్నారు.

“అపొస్తలులు ఎవరి మీదైనా చేతులు ఉంచితే వాళ్లు పవిత్రశక్తి పొందుతున్నారని సీమోను చూశాడు, కాబట్టి అతను అపొస్తలులకు డబ్బు” ఇవ్వాలనుకున్నాడు.—అపొస్తలుల కార్యాలు 8:18

9. సీమోను ఎవరు? ఆయనకు ఫిలిప్పు చేసే పని ఎందుకు నచ్చి ఉండవచ్చు?

9 ఫిలిప్పు సమరయలో చాలా అద్భుతాలు చేశాడు. ఉదాహరణకు ఆయన రోగుల్ని బాగుచేశాడు, చెడ్డదూతల్ని వెళ్లగొట్టాడు. (అపొ. 8:6-8) ఫిలిప్పుకున్న ఈ అద్భుతమైన వరాలు సీమోను అనే వ్యక్తికి బాగా నచ్చాయి. అతను ఇంద్రజాలం చేసేవాడు. అతని మీద ప్రజలకు ఎంత గౌరవం ఉండేదంటే, వాళ్లు “ఇతను దేవుని శక్తి” అనేవాళ్లు. అయితే ఫిలిప్పు చేసిన అద్భుతాల్లో దేవుని అసలైన శక్తిని కళ్లారా చూశాక సీమోను విశ్వాసి అయ్యాడు. (అపొ. 8:9-13) అయితే, క్రైస్తవుడిగా మారిన సీమోనుకు ఒక పరీక్ష ఎదురైంది. ఏంటది?

10. (ఎ) పేతురు యోహానులు సమరయలో ఏం చేశారు? (బి) పేతురు, యోహాను చేతులు ఉంచినప్పుడు కొత్త శిష్యులు పవిత్రశక్తిని పొందడం చూసి, సీమోను ఏం చేశాడు?

10 సమరయలో చాలామంది దేవుని వాక్యాన్ని అంగీకరించారని అపొస్తలులు విన్నప్పుడు పేతురును, యోహానును అక్కడికి పంపించారు. (“పేతురు ‘పరలోక రాజ్యం తాళంచెవుల్ని’ ఉపయోగించాడు” అనే బాక్సు చూడండి.) పేతురు, యోహాను సమరయకు రాగానే కొత్త శిష్యుల మీద చేతులు ఉంచారు, అప్పుడు వాళ్లలో ప్రతీ ఒక్కరు పవిత్రశక్తిని పొందారు.b అది చూసి, సీమోను చాలా ఆశ్చర్యపోయాడు. అతను అపొస్తలులతో “నేను ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్లు పవిత్రశక్తి పొందేలా, ఈ అధికారం నాకు కూడా ఇవ్వండి” అన్నాడు. సీమోను ఈ పవిత్రమైన అవకాశాన్ని డబ్బుతో కొనుక్కోగలను అనుకున్నాడో ఏమో, దానికోసం డబ్బులు కూడా ఇవ్వబోయాడు.—అపొ. 8:14-19.

11. పేతురు సీమోనును ఏమని సరిదిద్దాడు? అప్పుడు సీమోను ఏం చేశాడు?

11 పేతురు సీమోనును గట్టిగానే సరిదిద్దాడు. ఆయన ఇలా అన్నాడు: “నీ వెండి నీతోపాటు నాశనమైపోవాలి. ఎందుకంటే, దేవుడు ఉచితంగా ఇచ్చే బహుమతిని నువ్వు డబ్బుతో కొనుక్కోగలనని అనుకున్నావు. ఈ విషయంతో నీకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే దేవుని ముందు నీ హృదయం సరిగ్గా లేదు.” పశ్చాత్తాపపడి, క్షమాపణ కోసం ప్రార్థించమని పేతురు సీమోనును ప్రోత్సహించాడు. పేతురు ఇలా అన్నాడు: “యెహోవాను పట్టుదలగా వేడుకో. బహుశా ఆయన నీ హృదయంలోని చెడ్డ ఆలోచనను క్షమిస్తాడేమో.” సీమోను చెడ్డవాడు కాదని తెలుస్తుంది. అతను సరైనదే చేయాలని కోరుకున్నాడు కానీ, ఆ క్షణంలో పక్కదారి పట్టాడు. అందుకే అతను అపొస్తలుల్ని ఇలా వేడుకున్నాడు: “మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుండా దయచేసి నా కోసం యెహోవాను వేడుకోండి.”—అపొ. 8:20-24.

12. అబద్ధ క్రైస్తవులు పదవుల కోసం ఏం చేస్తుంటారు?

12 పేతురు సీమోనుకు ఇచ్చిన సలహా నుండి ఇప్పుడున్న క్రైస్తవులందరూ ఒక పాఠం నేర్చుకోవచ్చు. సంఘంలో సేవావకాశాల్ని కొనుక్కోవడం లేదా అమ్మడం తప్పు అని అది గుర్తుచేస్తుంది. అబద్ధ క్రైస్తవుల్లో మాత్రం ఈ అలవాటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు, ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (1878) ఇలా చెప్తుంది: ‘పోప్‌లను ఎన్నుకునేటప్పుడు, ఆ పదవిని డబ్బులు ఇచ్చి కొనుక్కునేవాళ్లు అని తెలుస్తుంది. చాలామంది ఏమాత్రం సిగ్గుపడకుండా అలా కొనుక్కునేవాళ్లు. పైగా ఆ విషయాన్ని దాచిపెట్టేవాళ్లు కూడా కాదు.’

13. సంఘంలో సేవావకాశాలు అమ్మకుండా లేదా కొనకుండా క్రైస్తవులు ఎలా జాగ్రత్తపడాలి?

13 క్రైస్తవులు సంఘంలో సేవావకాశాల్ని అమ్మకుండా లేదా కొనకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు బాధ్యతల్లో ఉన్న వాళ్లను బహుమతులతో, పొగడ్తలతో ముంచెత్తి సేవావకాశాలు పొందడానికి ప్రయత్నించకూడదు. బాధ్యతల్లో ఉన్న వాళ్లు కూడా డబ్బున్న వాళ్లమీద పక్షపాతం చూపించకూడదు. అవి రెండూ తప్పే. నిజానికి, దేవుని సేవకుల్లో ప్రతీఒక్కరు “తక్కువవాడిలా” నడుచుకోవాలి, యెహోవా పవిత్రశక్తి తమకు సేవావకాశం ఇచ్చేంతవరకు వేచి ఉండాలి. (లూకా 9:48) “సొంత మహిమ” కోసం పాకులాడే వాళ్లకు దేవుని సంస్థలో చోటు లేదు.—సామె. 25:27.

పేతురు “పరలోక రాజ్యం తాళంచెవుల్ని” ఉపయోగించాడు

యేసు పేతురుతో, “పరలోక రాజ్యం తాళంచెవుల్ని నేను నీకు ఇస్తాను” అని అన్నాడు. (మత్త. 16:19) ఆ మాటకు అర్థం ఏంటి? మంచివార్తను తెలుసుకుని, యేసుతోపాటు పరలోక రాజ్యంలో పరిపాలించే అవకాశం వేర్వేరు గుంపుల ప్రజలకు తెరిచేది పేతురే అని అర్థం. పేతురు ఎప్పుడెప్పుడు ఈ తాళంచెవుల్ని ఉపయోగించాడు?

  • క్రీస్తు శకం 33, పెంతెకొస్తు రోజున యూదుల్ని, యూదులుగా మారిన అన్యజనుల్ని పశ్చాత్తాపపడి బాప్తిస్మం తీసుకోమని అడిగినప్పుడు పేతురు మొదటి తాళంచెవిని ఉపయోగించాడు. ఆరోజు దాదాపు 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు, దేవుని రాజ్యంలో రాజులుగా పరిపాలించే అవకాశం పొందారు.—అపొ. 2:1-41.

  • స్తెఫను చనిపోయిన కొంతకాలానికి, పేతురు రెండో తాళంచెవిని ఉపయోగించాడు. పేతురు యోహానులు కొత్తగా బాప్తిస్మం తీసుకున్న సమరయుల మీద చేతులుంచారు, అప్పుడు వాళ్లు పవిత్రశక్తిని పొందారు.—అపొ. 8:14-17.

  • క్రీస్తు శకం 36లో, పేతురు మూడో తాళంచెవిని ఉపయోగించాడు. అప్పుడు, పరలోకంలో పరిపాలించే అవకాశం సున్నతి పొందని అన్యజనులకు కూడా దొరికింది. పేతురు కొర్నేలికి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇది జరిగింది. సున్నతి పొందని అన్యజనుల్లో క్రీస్తు శిష్యుడిగా మారిన మొదటి వ్యక్తి, కొర్నేలే.—అపొ. 10:1-48.

“నువ్వు చదువుతున్నది నీకు అర్థమౌతోందా?” (అపొ. 8:26-40)

14, 15. (ఎ) ‘ఇతియోపీయుడైన అధికారి’ ఎవరు? ఫిలిప్పు అతన్ని ఎలా కలిశాడు? (బి) ఫిలిప్పు చెప్పింది విన్నాక అతను ఏం చేశాడు? అతను బాప్తిస్మం తీసుకోవడం ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదని ఎందుకు చెప్పవచ్చు? (అధస్సూచి చూడండి.)

14 యెహోవా దూత ఫిలిప్పుతో, యెరూషలేము నుండి గాజాకు వెళ్లే దారిలోకి వెళ్లమని చెప్పాడు. ‘ఎందుకు?’ అని ఫిలిప్పుకు అనిపించి ఉంటుంది. అయితే, ఇతియోపీయుడైన అధికారిని కలిసిన కాసేపటికే ఆ ప్రశ్నకు జవాబు దొరికింది. (“నిజంగానే ‘నపుంసకుడా’?” అనే బాక్సు చూడండి.) అతను రథంలో కూర్చుని “యెషయా ప్రవక్త గ్రంథాన్ని బిగ్గరగా” చదువుతున్నాడు. అతన్ని కలుసుకునేలా యెహోవా పవిత్రశక్తి ఫిలిప్పును నడిపించింది. ఫిలిప్పు అతని రథం పక్కనే పరుగెత్తుతూ, “నువ్వు చదువుతున్నది నీకు అర్థమౌతోందా?” అని అడిగాడు. అందుకు అతను, “ఎవరో ఒకరు విడమర్చి చెప్పకపోతే నాకెలా అర్థమౌతుంది?” అన్నాడు.—అపొ. 8:26-31.

15 ఆ ఇతియోపీయుడు తనతోపాటు రథం ఎక్కి కూర్చోమని ఫిలిప్పును అడిగాడు. వాళ్లిద్దరు ఏమేం మాట్లాడుకున్నారో ఆలోచించండి! యెషయా ప్రవచనంలో ఉన్న “గొర్రె” లేదా “సేవకుడు” ఎవరు అనేది చాలాకాలం పాటు రహస్యంగానే ఉండిపోయింది. (యెష. 53:1-12) అయితే, ఆ “గొర్రె” లేదా “సేవకుడు” యేసుక్రీస్తే అని ఫిలిప్పు ఆ ఇతియోపీయుడికి వివరించాడు. క్రీస్తు శకం 33, పెంతెకొస్తు రోజున బాప్తిస్మం తీసుకున్న వాళ్లలాగే, వెంటనే ఏం చేయాలో యూదుడిగా మారిన అన్యజనుడైన ఈ ఇతియోపీయుడికి అర్థమైంది. అతను ఫిలిప్పును, “ఇదిగో! ఇక్కడ నీళ్లు ఉన్నాయి; నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏంటి?” అని అడిగాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఫిలిప్పు ఆ ఇతియోపీయుడికి బాప్తిస్మం ఇచ్చాడు.c (“‘నీళ్లలో’ బాప్తిస్మం ఇవ్వడం” అనే బాక్సు చూడండి.) తర్వాత, పవిత్రశక్తి ఫిలిప్పును కొత్త నియామకం కోసం అష్డోదుకు నడిపించింది. అక్కడ కూడా ఆయన మంచివార్త ప్రకటిస్తూ ఉన్నాడు.—అపొ. 8:32-40.

నిజంగానే “నపుంసకుడా”?

యునౌఖోస్‌, అనే గ్రీకు పదాన్ని తెలుగులో “నపుంసకుడు” అని అనువదించవచ్చు. ఆ గ్రీకు పదానికి, పిల్లల్ని కనే సామర్థ్యం తొలగించబడిన పురుషుడు లేదా ఉన్నతస్థాయి ఆస్థాన అధికారి అనే అర్థం ఉంది. రాజు భార్యల్ని, ఉపపత్నుల్ని చూసుకునే సంరక్షకులకు సాధారణంగా పిల్లలు కనే సామర్థ్యాన్ని తీసేసేవాళ్లు. అయితే రాజుకు గిన్నె అందించడం, ఖజానాను చూసుకోవడం లాంటి పనులు చేసే అధికారులకు అలా చేసేవాళ్లు కాదు. ఫిలిప్పు దగ్గర బాప్తిస్మం తీసుకున్న ఇతియోపీయుడు కూడా అలాంటి అధికారే అయ్యుంటాడు. ఎందుకంటే ఆయన రాణి ఖజానాను చూసుకునేవాడు, నిజానికి ఆయన ఆర్థిక మంత్రి.

ఇతియోపీయుడైన ఈ అన్యజనుడు యూదుడిగా మారిన వ్యక్తి కూడా. చెప్పాలంటే, ఆయన యెహోవాను ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్లి తిరిగొస్తున్నాడు. (అపొ. 8:27) దీన్నిబట్టి, ఆయన నిజంగా ఒక సపుంసకుడు కాదు అని చెప్పవచ్చు. ఎందుకంటే, పిల్లల్ని కనే సామర్థ్యం తొలగించబడిన పురుషులు ఇశ్రాయేలు సమాజంలోకి రాకూడదని మోషే ధర్మశాస్త్రం స్పష్టంగా చెప్పింది.—ద్వితీ. 23:1.

“నీళ్లలో” బాప్తిస్మం ఇవ్వడం

క్రైస్తవులకు ఎలా బాప్తిస్మం ఇవ్వాలి? తలమీద నీళ్లు పోసినా లేదా చిలకరించినా సరిపోతుంది అని కొంతమంది అంటారు. కానీ ఇతియోపీయుడైన అధికారి “నీళ్లలో” బాప్తిస్మం తీసుకున్నాడు. “ఫిలిప్పు, ఆ అధికారి నీళ్లలోకి దిగారు” అని బైబిలు చెప్తుంది. (అపొ. 8:36, 38) ఒకవేళ తలమీద నీళ్లు పోయడం లేదా చిలకరించడం మాత్రమే సరిపోతే, ఆ అధికారి నీళ్లున్న చోటు చూసి రథాన్ని ఆపాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గరున్న తోలు సంచిలోని కొన్ని నీళ్లు కూడా సరిపోయేవే. నిజానికి, ఆయన ఎడారి దారిలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి, అలాంటి ఒక తోలు సంచి ఆయన దగ్గర ఉండే ఉంటుంది.—అపొ. 8:26.

“బాప్తిస్మం” అని అనువదించిన గ్రీకు పదానికి “ముంచడం” అనే అర్థం ఉందని ఒక డిక్షనరీ చెప్తుంది. బైబిల్లో బాప్తిస్మం గురించి చెప్తున్న సందర్భాలు కూడా అదే అర్థాన్ని ఇస్తున్నాయి. యోహాను 3:23 ఇలా చెప్తుంది: “యోహాను . . . సలీము దగ్గర ఉన్న ఐనోనులో బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు, ఎందుకంటే అక్కడ ఒక పెద్ద నీటిమడుగు ఉంది.” అదేవిధంగా, యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ‘ఆయన నీళ్లలో నుండి బయటికి రాగానే ఆకాశం తెరుచుకుంది’ అని బైబిలు చెప్తుంది. (మార్కు 1:9, 10) కాబట్టి నీళ్లలో పూర్తిగా ముంచి బాప్తిస్మం ఇవ్వడం సరైనదని నిజక్రైస్తవులు నమ్ముతారు.

16, 17. నేడు ప్రకటనా పనిలో దేవదూతలు ఎలా సహాయం చేస్తున్నారు?

16 ఫిలిప్పు చేసిన లాంటి పనినే చేసే గొప్ప అవకాశం నేడు క్రైస్తవులకు ఉంది. వాళ్లు ప్రయాణిస్తున్నప్పుడు గానీ, ఎవరినైనా అనుకోకుండా కలిసినప్పుడు గానీ రాజ్య సందేశాన్ని ప్రకటిస్తారు. చాలా సందర్భాల్లో, అలా మంచి మనసున్న వాళ్లను కలవడం అనేది అనుకోకుండా జరిగిందైతే కాదు. ఎందుకంటే “ప్రతీ దేశానికి, తెగకు, భాషకు, జాతికి చెందిన ప్రజలకు” సువార్త అందేలా దేవదూతలు ప్రకటనా పనిని నిర్దేశిస్తున్నారని బైబిలు స్పష్టంగా చెప్తుంది. (ప్రక. 14:6) ప్రకటనా పనిని నిర్దేశించడంలో దేవదూతల పాత్ర గురించి యేసు కూడా చెప్పాడు. గోధుమలు-గురుగుల ఉదాహరణలో, కోతకాలంలో అంటే ఈ వ్యవస్థ ముగింపులో దేవదూతలు కోత కోస్తారని యేసు చెప్పాడు. అంతేకాదు, ‘ఆ దూతలు ఇతరులు పాపం చేయడానికి కారణమయ్యేవాళ్లను, చెడ్డపనులు చేసేవాళ్లను ఆయన రాజ్యంలో నుండి తొలగిస్తారు’ అని కూడా యేసు చెప్పాడు. (మత్త. 13:37-41) అదేసమయంలో, యెహోవా దేవదూతల్ని ఉపయోగించి అభిషిక్తుల్ని, అలాగే ‘వేరే గొర్రెలకు’ చెందిన ‘గొప్పసమూహాన్ని’ ఆకర్షిస్తున్నాడు, సమకూరుస్తున్నాడు.—ప్రక. 7:9; యోహా. 6:44, 65; 10:16.

17 దేవదూతలు ప్రకటనా పనిని నిర్దేశిస్తున్నారు అనడానికి రుజువు ఏంటంటే, మనం పరిచర్యలో కలిసినప్పుడు కొంతమంది, ‘ఇప్పుడే దేవునికి ప్రార్థిస్తున్నాం ఇంతలో మీరు వచ్చారు’ అని చెప్తుంటారు. ఒక అనుభవం గమనించండి. ఇద్దరు సాక్షులు ఒక చిన్న పిల్లవాడితో కలిసి ఇంటింటి పరిచర్య చేస్తున్నారు. మధ్యాహ్నం అయినప్పుడు ఆ ఇద్దరు సాక్షులు ప్రకటనా పని ఆపేసి వెళ్లిపోదాం అనుకున్నారు. కానీ ఆ పిల్లవాడు ఉత్సాహంతో ఇంకో ఇంటికి వెళ్లి తలుపు కొట్టాడు. అప్పుడు ఒకామె తలుపు తీయడంతో, ఆ సాక్షులు ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ‘బైబిల్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేసేలా ఎవరో ఒకరిని పంపించమని ఇప్పుడే దేవునికి ప్రార్థిస్తున్నాను, ఇంతలో మీరు వచ్చారు’ అని ఆమె వివరించింది. వెంటనే బైబిలు స్టడీ మొదలైంది!

ఒకామె ఇంట్లో ప్రార్థిస్తోంది, అప్పుడే ఒక జంట పరిచర్యలో ఆమె ఇంటి బెల్‌ కొడుతున్నారు.

“దేవా! నువ్వు నిజంగా ఉంటే, దయచేసి నాకు సహాయం చేయి”

18. పరిచర్య చేసే అవకాశాన్ని మనం ఎందుకు తేలిగ్గా తీసుకోకూడదు?

18 మనకాలంలో ప్రకటనా పని కనీవినీ ఎరుగని స్థాయిలో జరుగుతోంది. దేవదూతలతో కలిసి ఆ పని చేసే గొప్ప అవకాశం క్రైస్తవులుగా మీకుంది. ఆ అవకాశాన్ని తేలిగ్గా తీసుకోకండి. “యేసు గురించిన మంచివార్త” ప్రకటించడంలో పట్టుదలగా కృషిచేస్తే, మీరు గొప్ప ఆనందం పొందుతారు.—అపొ. 8:35.

“మంచివార్త ప్రచారకుడైన” ఫిలిప్పు

హింస వల్ల క్రీస్తు అనుచరులు వేర్వేరు చోట్లకు చెదిరిపోయినప్పుడు, ఫిలిప్పు సమరయకు వెళ్లాడు. సమరయలో ప్రకటనా పని ఎలా జరుగుతుందో ఫిలిప్పు ఎప్పటికప్పుడు పరిపాలక సభకు చెప్పివుంటాడు. అందుకే “సమరయ ప్రజలు దేవుని వాక్యాన్ని అంగీకరించారని యెరూషలేములో ఉన్న అపొస్తలులు విన్నప్పుడు పేతురును, యోహానును వాళ్ల దగ్గరికి పంపించారు.” దానివల్ల, కొత్తగా విశ్వాసులైన వాళ్లు పవిత్రశక్తి అనే ఉచిత బహుమతి పొందారు.—అపొ. 8:14-17.

ఫిలిప్పు ఇతియోపీయుడైన అధికారితో పాటు రథంలో కూర్చున్నాడు.

అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో చెప్పిన సంఘటనలు జరిగిన తర్వాత, ఫిలిప్పు గురించి మళ్లీ ఇంకొక్కసారి మాత్రమే కనిపిస్తుంది. ఫిలిప్పు సమరయకు వెళ్లి ప్రకటించడం మొదలుపెట్టి, దాదాపు 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సమయంలో, అపొస్తలుడైన పౌలు తన మూడవ మిషనరీ యాత్రను ముగించుకుని, తన తోటివాళ్లతో కలిసి యెరూషలేముకు ప్రయాణమయ్యాడు. వాళ్లు దారి మధ్యలో తొలెమాయిలో ఓడ దిగారు. దాని గురించి లూకా ఇలా రాశాడు: “తర్వాతి రోజు మేము అక్కడి నుండి బయల్దేరి కైసరయకు చేరుకున్నాం. అక్కడ మేము మంచివార్త ప్రచారకుడైన ఫిలిప్పు ఇంట్లో బస చేశాం. అతను యెరూషలేములో అపొస్తలులు ఎంచుకున్న ఏడుగురిలో ఒకడు. అతనికి పెళ్లికాని నలుగురు కూతుళ్లు ఉన్నారు, వాళ్లు ప్రవచించేవాళ్లు.”—అపొ. 21:8, 9.

ఫిలిప్పు మంచివార్త ప్రకటించడానికి సమరయకు వెళ్లినప్పుడు, తన కుటుంబంతో కలిసి కైసరయలో స్థిరపడి ఉంటాడు. లూకా ఆయన్ని “మంచివార్త ప్రచారకుడు” అని అన్నాడని గమనించండి. మంచివార్త ప్రకటించడం కోసం తమ ఇళ్లను విడిచిపెట్టి, కొత్త ప్రాంతాలకు వెళ్లినవాళ్ల గురించి చెప్పడానికి బైబిల్లో ఈ పదాన్ని ఉపయోగించారు. సమరయకు వెళ్లి చాలా సంవత్సరాలైనా, పరిచర్య విషయంలో ఫిలిప్పు ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదని మనకు అర్థమౌతుంది. ఫిలిప్పు నలుగురు కూతుళ్లు ప్రవచించేవాళ్లు. దాన్నిబట్టి ఫిలిప్పు తన కుటుంబానికి యెహోవాను ప్రేమించడం, సేవించడం నేర్పించి ఉంటాడని స్పష్టంగా తెలుస్తుంది.

a ఈయన అపొస్తలుడైన ఫిలిప్పు కాదు. ఈ పుస్తకంలోని 5వ అధ్యాయంలో చూసినట్టు, యెరూషలేములో గ్రీకు మాట్లాడే విధవరాళ్లకు, హీబ్రూ మాట్లాడే విధవరాళ్లకు ప్రతీరోజు ఆహారం పంచిపెట్టడానికి నియమించబడిన ‘మంచిపేరు ఉన్న ఏడుగురు పురుషుల్లో’ ఈ ఫిలిప్పు ఒకడు.—అపొ. 6:1-6.

b సాధారణంగా ఆ కాలంలో, కొత్త శిష్యులు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పవిత్రశక్తితో అభిషేకించబడేవాళ్లు లేదా పవిత్రశక్తిని పొందేవాళ్లు అని తెలుస్తుంది. అలా, భవిష్యత్తులో యేసుతో కలిసి పరలోకంలో రాజులుగా, యాజకులుగా పరిపాలించే అవకాశం వాళ్లకు దొరికేది. (2 కొరిం. 1:21, 22; ప్రక. 5:9, 10; 20:6) అయితే సమరయలోని ఈ కొత్త శిష్యులు పవిత్రశక్తిని, దాని అద్భుతమైన వరాల్ని పొందడం బాప్తిస్మం తీసుకున్నప్పుడు జరగలేదు కానీ, పేతురు యోహానులు వచ్చి చేతులు ఉంచిన తర్వాతే జరిగింది.

c అది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు. అతను ఒక యూదుడిగా మారిన అన్యజనుడు. కాబట్టి లేఖనాల గురించి, ముఖ్యంగా మెస్సీయ ప్రవచనాల గురించి అతనికి ఇదివరకే తెలుసు. ఇప్పుడు దేవుని ఉద్దేశంలో యేసు పాత్ర ఏంటో తెలుసుకున్నాక, ఇక ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాప్తిస్మం తీసుకున్నాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి