కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • bt అధ్యా. 8 పేజీలు 60-67
  • “సంఘమంతా కొంతకాలంపాటు ప్రశాంతతను అనుభవించింది”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “సంఘమంతా కొంతకాలంపాటు ప్రశాంతతను అనుభవించింది”
  • “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “నన్నెందుకు హింసిస్తున్నావు?” (అపొ. 9:1-5)
  • ‘సౌలా, సహోదరుడా, ప్రభువైన యేసు నన్ను పంపాడు’ (అపొ. 9:6-17)
  • సౌలు యేసు గురించి “ప్రకటించడం మొదలుపెట్టాడు” (అపొ. 9:18-30)
  • “చాలామంది . . . విశ్వాసముంచారు” (అపొ. 9:31-43)
  • యేసు సౌలును ఎన్నుకున్నాడు
    నా బైబిలు పుస్తకం
  • హింసకుడు గొప్ప వెలుగును చూశాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • కొత్త వ్యక్తిలా మారాడు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • దమస్కుకు వెళ్లే మార్గంలో
    నా బైబిలు కథల పుస్తకము
మరిన్ని
“దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
bt అధ్యా. 8 పేజీలు 60-67

అధ్యాయం 8

“సంఘమంతా కొంతకాలంపాటు ప్రశాంతతను అనుభవించింది”

సంఘాన్ని క్రూరంగా హింసించిన సౌలు, ఉత్సాహంగా ప్రకటించే క్రైస్తవుడు అయ్యాడు

అపొస్తలుల కార్యాలు 9:1-43 ఆధారంగా

1, 2. సౌలు దమస్కుకు ఎందుకు వెళ్తున్నాడు?

కోపంతో ఊగిపోతున్న కొంతమంది దమస్కుకు బయల్దేరి, దాదాపు దగ్గరికి వచ్చేశారు. సంఘాన్ని హింసించాలన్నదే వాళ్ల ఆలోచన. యేసు శిష్యుల్ని ఇళ్లలో నుండి బయటికి లాక్కొచ్చి, బంధించి, అవమానించి, యెరూషలేముకు తీసుకెళ్లి మహాసభ ముందు నిలబెట్టాలని వాళ్లు అనుకుంటున్నారు.

2 వాళ్ల నాయకుడి పేరు సౌలు.a ఇప్పటికే అతని చేతులు రక్తంతో తడిశాయి. ఈమధ్యే, యేసును నమ్మకంగా అనుసరించిన స్తెఫనును యూదులు రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు, సౌలు వాళ్లకు మద్దతు తెలిపాడు. (అపొ. 7:57–8:1) సౌలు యెరూషలేములోని యేసు అనుచరుల మీద కోపంతో విరుచుకుపడ్డాడు. అంతటితో ఆగకుండా, ఇప్పుడు వేరే నగరాల్లో ఉన్న శిష్యుల్ని కూడా హింసించాలని బయల్దేరాడు. “ప్రభువు మార్గానికి” చెందిన క్రైస్తవులు చీడపురుగులని, వాళ్లను తుడిచిపెట్టేయాలని అతను అనుకున్నాడు.—అపొ. 9:1, 2; “దమస్కులో సౌలు పొందిన అధికారం” అనే బాక్సు చూడండి.

3, 4. (ఎ) సౌలుకు ఏమైంది? (బి) మనం ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటాం?

3 ఉన్నట్టుండి, ఒక వెలుగు సౌలు చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతనితోపాటు ప్రయాణిస్తున్న వాళ్లకు ఏం జరుగుతుందో అర్థంకాక, నోట మాట రాలేదు. ఆ వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉందంటే, దానివల్ల సౌలు కంటి చూపు పోయి నేలమీద పడ్డాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం “సౌలా, సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు?” అని అనడం అతను విన్నాడు. సౌలు ఉలిక్కిపడి “ప్రభువా, నువ్వెవరు?” అని అడిగాడు. అప్పుడు ఆ స్వరం “నేను నువ్వు హింసిస్తున్న యేసును” అని చెప్పేసరికి సౌలు ఖంగుతిన్నాడు.—అపొ. 9:3-5; 22:9.

4 యేసు సౌలుతో అన్న ఆ మాటల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? సౌలు క్రైస్తవునిగా మారినప్పుడు జరిగిన విషయాల్ని పరిశీలించడం ఎందుకు మంచిది? సౌలు క్రైస్తవునిగా మారిన తర్వాత, ప్రశాంతంగా ఉన్న సమయాన్ని సంఘం ఉపయోగించిన తీరు నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

దమస్కులో సౌలు పొందిన అధికారం

వేరే దేశంలోని నగరంలో ఉన్న క్రైస్తవుల్ని బంధించే అధికారం సౌలుకు ఎలా వచ్చింది? మహాసభకు అలాగే ప్రధానయాజకుడికి, ఎక్కడున్న యూదుల మీదైనా సరే అధికారం ఉండేది. అంతేకాదు, నేరస్తుల్ని విచారణ కోసం యెరూషలేముకు పంపించమని ఆదేశించే అధికారం ప్రధానయాజకుడికి ఉండేదని తెలుస్తుంది. కాబట్టి ప్రధానయాజకుడి నుండి ఉత్తరాలు అందినప్పుడు, దమస్కు సమాజమందిరాల్లోని పెద్దలు వెంటనే ఆ ఉత్తరంలో ఉన్నట్టు చేయాలి.—అపొ. 9:1, 2.

అంతేకాదు, యూదులు తమ సొంత న్యాయపరమైన విషయాల్లో తీర్పు తీర్చుకునేలా రోమన్లు కొంతవరకు స్వేచ్ఛ ఇచ్చారు. యూదులు అపొస్తలుడైన పౌలును “ఒకటి తక్కువ 40 దెబ్బలు” ఎలా కొట్టగలిగారో దీన్నిబట్టి అర్థమౌతుంది. (2 కొరిం. 11:24) యూదులకు రోమన్లు ఇచ్చిన అధికారం గురించి 1 మక్కబీయులు పుస్తకం కూడా చెప్తుంది. క్రీస్తు పూర్వం 138లో, ఒక రోమా నాయకుడు ఐగుప్తు రాజైన ప్టోలమీ VIIIకి ఉత్తరం రాస్తూ ఇలా ఆదేశించాడు: కాబట్టి యూదయా దేశం నుండి దుర్మార్గులెవరైన పారిపోయి మీ దగ్గరికి వచ్చి ఆశ్రయం పొందితే, మీరు వాళ్లను ప్రధానయాజకుడైన సీమోనుకు అప్పగించాలి. అతడు వాళ్లను వాళ్ల నియమాల ప్రకారం శిక్షిస్తాడు. (1 మక్కబీయులు 15:21) క్రీస్తు పూర్వం 47లో, యూదుల ఆచారాల విషయంలో తలెత్తే ఏ సమస్యనైనా పరిష్కరించే హక్కుతో పాటు, ప్రధానయాజకుడికి ఇంతకుముందున్న అధికారాలు అలాగే కొనసాగుతాయని జూలియస్‌ సీజర్‌ నిర్ధారించాడు.

“నన్నెందుకు హింసిస్తున్నావు?” (అపొ. 9:1-5)

5, 6. యేసు సౌలుతో అన్న మాటల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

5 దమస్కుకు వెళ్తున్న దారిలో యేసు సౌలును అడ్డుకున్నప్పుడు, “నా శిష్యుల్ని ఎందుకు హింసిస్తున్నావు?” అని అనలేదు గానీ, “నన్నెందుకు హింసిస్తున్నావు?” అని అన్నాడు. (అపొ. 9:4) అంటే, తన శిష్యులకు ఏదైనా కష్టం వస్తే, అది తనకే వచ్చినట్టు యేసుకు అనిపిస్తుంది.—మత్త. 25:34-40, 45.

6 క్రీస్తు శిష్యులైనందుకు మీకు హింసలు వస్తుంటే యెహోవాకు, యేసుకు మీ పరిస్థితి పూర్తిగా తెలుసు అనే నమ్మకంతో మీరు ఉండవచ్చు. (మత్త. 10:22, 28-31) యెహోవా మీ కష్టాన్ని ఇప్పటికిప్పుడు తీసేయకపోవచ్చు. ఉదాహరణకు, సౌలు స్తెఫను హత్యకు మద్దతు తెలపడం, యెరూషలేములో శిష్యుల్ని ఇళ్లలో నుండి లాక్కొని రావడం యేసు చూశాడు. (అపొ. 8:3) అయినా ఆ సమయంలో యేసు వాటిని ఆపలేదు. కానీ నమ్మకంగా ఉండడానికి కావాల్సిన బలాన్ని యెహోవా యేసు ద్వారా స్తెఫనుకు, ఇతర శిష్యులకు ఇచ్చాడు.

7. హింసల్ని సహించాలంటే మీరు ఏ నాలుగు పనులు చేయాలి?

7 ఈ నాలుగు పనులు చేస్తే మీరు కూడా హింసల్ని సహించగలరు: (1) ఏం జరిగినా సరే, యెహోవాకు విశ్వసనీయంగా ఉండాలని నిర్ణయించుకోండి. (2) యెహోవా సహాయం అడగండి. (ఫిలి. 4:6, 7) (3) పగ తీర్చుకునే పని యెహోవాకు వదిలేయండి. (రోమా. 12:17-21) (4) యెహోవా మీ కష్టాన్ని తీసేసే వరకు, దాన్ని తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడని నమ్మండి.—ఫిలి. 4:12, 13.

‘సౌలా, సహోదరుడా, ప్రభువైన యేసు నన్ను పంపాడు’ (అపొ. 9:6-17)

8, 9. యేసు అప్పగించిన పని గురించి అననీయకు ఎలా అనిపించి ఉంటుంది?

8 “ప్రభువా, నువ్వెవరు?” అని సౌలు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన తర్వాత, యేసు ఇలా అన్నాడు: “నువ్వు లేచి దమస్కు నగరానికి వెళ్లు. నువ్వు ఏంచేయాలో అక్కడ ఒక వ్యక్తి నీకు చెప్తాడు.” (అపొ. 9:6) సౌలు చూపు పోయింది కాబట్టి, అతనితో ఉన్న మనుషులు అతన్ని దమస్కుకు తీసుకెళ్లారు. అక్కడ సౌలు మూడు రోజులు ఏమీ తినకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ లోపు యేసు, దమస్కులో “యూదులందరి మధ్య మంచిపేరు ఉన్న” అననీయ అనే శిష్యుడితో సౌలు గురించి మాట్లాడాడు.—అపొ. 22:12.

9 అప్పుడు అననీయ మనసులో ఎన్ని ఆలోచనలు మెదిలి ఉంటాయో ఊహించండి! సంఘానికి శిరస్సయిన, తిరిగి బ్రతికిన యేసుక్రీస్తే స్వయంగా తనతో మాట్లాడుతూ ఒక ప్రత్యేకమైన పని అప్పగిస్తున్నాడు. అది ఎంత గొప్ప గౌరవమో కదా! గౌరవం మాట అటుంచితే, యేసు అప్పగించిన పని గుండెల్లో దడ పుట్టిస్తుంది. అందుకే సౌలుతో మాట్లాడమన్నప్పుడు అననీయ ఇలా అన్నాడు: “ప్రభువా, అతని గురించి, యెరూషలేములో ఉన్న నీ పవిత్రులకు అతను చేసిన హాని అంతటి గురించి చాలామంది చెప్తుంటే విన్నాను. ఇప్పుడతను ముఖ్య యాజకులు ఇచ్చిన అధికారంతో, నీ పేరు మీద నమ్మకముంచే వాళ్లందర్నీ బంధించడానికి ఇక్కడికి వచ్చాడు.”—అపొ. 9:13, 14.

10. యేసు అననీయతో మాట్లాడిన విధానం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

10 అననీయ తన భయాల్ని చెప్పినప్పుడు యేసు ఆయన్ని కోప్పడలేదు గానీ తను ఏం చేయాలో స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు, ఈ అసాధారణమైన పని అప్పగించడానికి గల కారణాన్ని కూడా చెప్పడం ద్వారా యేసు నిజానికి అననీయను గౌరవించాడు. సౌలు గురించి యేసు ఇలా అన్నాడు: “అన్యజనులకు, రాజులకు, ఇశ్రాయేలు ప్రజలకు నా పేరు గురించి సాక్ష్యమివ్వడానికి నేను ఎంచుకున్న వ్యక్తి అతను. నా పేరు కోసం అతను ఎన్ని బాధలు పడాలో నేను అతనికి చూపిస్తాను.” (అపొ. 9:15, 16) అననీయ వెంటనే యేసు చెప్పినట్టు చేశాడు. క్రైస్తవుల్ని హింసించిన సౌలును వెతుక్కుంటూ వెళ్లి అతనితో ఇలా అన్నాడు: “సౌలా, సహోదరుడా, నువ్వు వస్తున్న దారిలో నీకు కనిపించిన ప్రభువైన యేసే నువ్వు చూపు పొందేలా, పవిత్రశక్తితో నింపబడేలా నన్ను నీ దగ్గరికి పంపాడు.”—అపొ. 9:17.

11, 12. యేసు, అననీయ, సౌలు మధ్య జరిగిన సంఘటనల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

11 యేసు, అననీయ, సౌలు మధ్య జరిగిన సంఘటనల నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఒకటేంటంటే, మాటిచ్చినట్టుగానే యేసు ప్రకటనా పనిని నిర్దేశించడంలో చురుగ్గా పని చేస్తున్నాడు. (మత్త. 28:20) యేసు ఇప్పుడు ఎవరితోనూ నేరుగా మాట్లాడట్లేదు గానీ, నమ్మకమైన దాసుని ద్వారా ప్రకటనా పనిని నిర్దేశిస్తున్నాడు. యేసు ఆ దాసుణ్ణి తన ఇంట్లోని సేవకుల మీద నియమించాడు. (మత్త. 24:45-47) పరిపాలక సభ నిర్దేశం కింద ప్రచారకులు, పయినీర్లు క్రీస్తు గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకునే వాళ్లను వెతకడానికి వెళ్తున్నారు. తమ దగ్గరికి ఎవరినైనా పంపించమని ప్రార్థించిన చాలామందిని యెహోవాసాక్షులు కలిశారని మనం ముందటి అధ్యాయంలో చూశాం.—అపొ. 9:11.

12 అననీయ యేసుకు లోబడి ఆయన అప్పగించిన పని చేశాడు, దీవెనలు పొందాడు. మీరు కూడా కాస్త భయం అనిపించినా, పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇవ్వాలనే ఆజ్ఞకు లోబడతారా? ఇంటింటికి వెళ్లి తెలియనివాళ్లతో మాట్లాడడం అంటే కొంతమందికి భయం. ఇంకొంతమందికి వ్యాపార క్షేత్రాల్లో ప్రకటించడం, వీధుల్లో ప్రజలతో మాట్లాడడం, టెలిఫోన్‌ సాక్ష్యం చేయడం, లేదా ఉత్తరాలు రాయడం అంటే భయం. అననీయ తన భయాన్ని తీసేసుకున్నాడు, పవిత్రశక్తిని పొందేలా సౌలుకు సహాయం చేసే గొప్ప అవకాశాన్ని దక్కించుకున్నాడు.b అననీయ యేసు మీద నమ్మకం ఉంచాడు, సౌలును సహోదరుడిలా చూశాడు కాబట్టే తన పనిని బాగా చేయగలిగాడు. మనం కూడా ప్రకటనా పనిని యేసు నిర్దేశిస్తున్నాడని నమ్మి, ప్రజల పరిస్థితిని అర్థం చేసుకుంటే అననీయలాగే భయాల్ని తీసేసుకుంటాం. పరిచర్యలో కొంతమందిని చూస్తే మనకు భయంగా అనిపించవచ్చు, కానీ అలాంటివాళ్లను కూడా కాబోయే సహోదరుల్లా చూస్తే వాళ్లకు ధైర్యంగా ప్రకటించగలుగుతాం.—మత్త. 9:36.

సౌలు యేసు గురించి “ప్రకటించడం మొదలుపెట్టాడు” (అపొ. 9:18-30)

13, 14. మీరు బైబిలు స్టడీ తీసుకుంటున్నప్పటికీ ఇంకా బాప్తిస్మం తీసుకోకపోతే, సౌలులాగే మీరు ఏం చేయవచ్చు?

13 నేర్చుకున్న వాటి ప్రకారం సౌలు వెంటనే మార్పులు చేసుకున్నాడు. కంటిచూపు తిరిగి రాగానే అతను బాప్తిస్మం తీసుకున్నాడు, దమస్కులో ఉన్న శిష్యులతో కలవడం మొదలుపెట్టాడు. అంతేకాదు, “వెంటనే అతను, యేసే దేవుని కుమారుడని సమాజమందిరాల్లో ప్రకటించడం మొదలుపెట్టాడు.”—అపొ. 9:20.

14 మీరు బైబిలు స్టడీ తీసుకుంటున్నప్పటికీ ఇంకా బాప్తిస్మం తీసుకోలేదా? అలాగైతే సౌలులాగే మీరు కూడా నేర్చుకున్నవాటి ప్రకారం వెంటనే చర్య తీసుకోగలరా? నిజమే, క్రీస్తు చేసిన అద్భుతాన్ని సౌలు కళ్లారా చూశాడు, అది బాప్తిస్మం తీసుకునేలా ఆయన్ని కదిలించింది. అయితే, వేరేవాళ్లు కూడా యేసు చేసిన అద్భుతాల్ని కళ్లారా చూశారు. ఉదాహరణకు, చెయ్యి ఎండిపోయిన వ్యక్తిని యేసు బాగుచేయడం కొంతమంది పరిసయ్యులు కళ్లారా చూశారు. చనిపోయిన లాజరును యేసు బ్రతికించడం గురించి చాలామంది యూదులకు తెలుసు. అయినా చాలామంది ఏమీ పట్టనట్టు ఉన్నారు, ఇంకొంతమందైతే యేసును వ్యతిరేకించారు కూడా. (మార్కు 3:1-6; యోహా. 12:9, 10) కానీ వాళ్లలా కాకుండా సౌలు మార్పులు చేసుకున్నాడు. మిగతావాళ్లు మార్పులు చేసుకోనప్పుడు సౌలు మాత్రమే ఎందుకు అలా చేసుకోగలిగాడు? ఎందుకంటే, ఆయన మనుషుల కన్నా ఎక్కువగా దేవునికే భయపడ్డాడు, క్రీస్తు తనమీద కరుణ చూపించినందుకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నాడు. (ఫిలి. 3:8) మీరు కూడా సౌలు ఆదర్శాన్ని పాటిస్తే, ప్రకటనా పనిలో పాల్గొనకుండా, బాప్తిస్మం తీసుకోకుండా ఏదీ మిమ్మల్ని ఆపలేదు.

15, 16. సమాజమందిరాల్లో సౌలు ఏం చేశాడు? అప్పుడు దమస్కులోని యూదులు ఏం చేశారు?

15 సౌలు యేసు గురించి సమాజమందిరాల్లో ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు ప్రజలకు ఎలా అనిపించి ఉంటుందో ఊహించండి! కొంతమంది ఆశ్చర్యపోయారు, అవాక్కయ్యారు. ఇంకొంతమందికైతే కోపం కూడా వచ్చింది. వాళ్లు, “యెరూషలేములో యేసు పేరు మీద నమ్మకముంచిన వాళ్లను ఘోరంగా హింసించిన వ్యక్తి ఇతను కాదా?” అని మాట్లాడుకున్నారు. (అపొ. 9:21) యేసు విషయంలో తన అభిప్రాయం ఎందుకు మార్చుకున్నాడో వివరిస్తూ సౌలు, “యేసే క్రీస్తని రుజువులతో” నిరూపించాడు. (అపొ. 9:22) కానీ రుజువులు ఉన్నంత మాత్రాన అందరూ నమ్మరు. ఆచారాల వల్ల లేదా గర్వం వల్ల కళ్లు మూసుకుపోయిన వాళ్లు ఎన్ని రుజువులు చూపించినా నమ్మరు. అయినాసరే, సౌలు ప్రకటించడం ఆపలేదు.

16 మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా, దమస్కులో యూదులు సౌలును వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చివరికి వాళ్లు అతన్ని చంపడానికి కుట్ర పన్నారు. (అపొ. 9:23; 2 కొరిం. 11:32, 33; గల. 1:13-18) దాని గురించి తెలిసిన వెంటనే సౌలు తెలివిగా ఆ నగరం నుండి తప్పించుకున్నాడు. తనను ఒక గంపలో పెట్టి, నగర ప్రాకారానికి ఉన్న కిటికీలో నుండి కిందకు దించమని కొంతమంది శిష్యులకు చెప్పాడు. లూకా ఈ సందర్భంలో, సౌలు తప్పించుకోవడానికి సహాయం చేసినవాళ్లను “అతని శిష్యులు,” అంటే సౌలు శిష్యులు అని అన్నాడు. (అపొ. 9:25) ఆ పదాన్ని బట్టి దమస్కులో సౌలు ప్రకటించినప్పుడు, కనీసం కొంతమందైనా విని క్రైస్తవులుగా మారి ఉంటారని అర్థమౌతుంది.

17. (ఎ) మీరు బైబిలు సత్యాల్ని చెప్పినప్పుడు అందరూ వింటారా? (బి) మనం ఏం చేస్తూ ఉండాలి, ఎందుకు?

17 మీరు నేర్చుకుంటున్న మంచి విషయాల్ని మీ ఇంట్లోవాళ్లకు, స్నేహితులకు, వేరేవాళ్లకు రుజువులతో సహా చెప్పినప్పుడు, అందరూ బైబిలు సత్యాన్ని వింటారని మీరు అనుకుని ఉంటారు. అయితే కొంతమంది వినుంటారు గానీ ఎక్కువమంది విని ఉండకపోవచ్చు. నిజానికి, మీ ఇంట్లోవాళ్లే మిమ్మల్ని ఒక శత్రువులా చూసి ఉండవచ్చు. (మత్త. 10:32-38) అయితే లేఖనాల నుండి ఒప్పించేలా మాట్లాడే సామర్థ్యాన్ని మీరు పెంచుకుంటూ ఉంటే, మంచి ప్రవర్తనను కాపాడుకుంటే మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లే ఏదోక రోజు మనసు మార్చుకోవచ్చు.—అపొ. 17:2; 1 పేతు. 2:12; 3:1, 2, 7.

18, 19. (ఎ) సౌలు తరఫున బర్నబా మాట్లాడినప్పుడు ఏం జరిగింది? (బి) బర్నబాలా, సౌలులా మనం కూడా ఏం చేయవచ్చు?

18 సౌలు యెరూషలేముకు వచ్చినప్పుడు, అతను నిజంగా క్రైస్తవుడిగా మారాడో లేదో అని శిష్యులు భయపడ్డారు. వాళ్ల భయం అర్థం చేసుకోదగినదే. అయితే సౌలు తరఫున బర్నబా మాట్లాడినప్పుడు, అపొస్తలులు అతన్ని చేర్చుకున్నారు. సౌలు కొంతకాలం అపొస్తలులతోనే ఉండిపోయాడు. (అపొ. 9:26-28) సౌలు వివేచన ఉపయోగించాడు, అదేసమయంలో మంచివార్త ప్రకటించడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు. (రోమా. 1:16) అతను ఎక్కడైతే క్రీస్తు శిష్యుల్ని క్రూరంగా హింసించడం మొదలుపెట్టాడో, ఆ యెరూషలేములోనే ధైర్యంగా ప్రకటించాడు. తమ నాయకుడిగా ఉంటాడనుకున్న సౌలు ఇలా మారిపోయే సరికి, యెరూషలేములో ఉన్న యూదులు కోపంతో అతన్ని చంపడానికి ప్రయత్నించారు. “ఆ విషయం సహోదరులకు తెలిసినప్పుడు, వాళ్లు అతన్ని కైసరయకు తీసుకొచ్చి అక్కడి నుండి తార్సుకు పంపించేశారు.” (అపొ. 9:30) సంఘం ద్వారా యేసు ఇచ్చిన నిర్దేశానికి సౌలు లోబడ్డాడు. దానివల్ల సౌలు ప్రయోజనం పొందాడు, సంఘం కూడా ప్రయోజనం పొందింది.

19 సౌలుకు సహాయం చేయడానికి బర్నబా సొంతగా చొరవ తీసుకున్నాడని గమనించండి. ఆయన దయతో చేసిన ఈ పని వల్ల, ఉత్సాహవంతులైన ఈ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. మీరు కూడా బర్నబాలాగే, మీ సంఘంలోని కొత్తవాళ్లకు సహాయం చేయడానికి చొరవ తీసుకుంటారా? బహుశా మీరు వాళ్లతో కలిసి పరిచర్య చేయవచ్చు, యెహోవాకు ఇంకా దగ్గరవ్వడానికి వాళ్లకు సహాయం చేయవచ్చు. అలాచేస్తే, మీకు ఎన్నో దీవెనలు వస్తాయి. ఒకవేళ మీరు కొత్త ప్రచారకులైతే, వేరేవాళ్లు మీకు చేస్తున్న సహాయాన్ని సౌలులాగే తీసుకుంటారా? ఎక్కువ అనుభవం ఉన్న ప్రచారకులతో పని చేయడం వల్ల పరిచర్యలో మీ నైపుణ్యం పెరుగుతుంది, సంతోషం రెట్టింపు అవుతుంది, అలాగే చిరకాల స్నేహితులు దొరుకుతారు.

“చాలామంది . . . విశ్వాసముంచారు” (అపొ. 9:31-43)

20, 21. గతంలో, అలాగే మన కాలంలో ‘ప్రశాంతంగా’ ఉన్న సమయాన్ని దేవుని సేవకులు ఎలా ఉపయోగించుకున్నారు?

20 సౌలు క్రైస్తవునిగా మారి యెరూషలేము నుండి సురక్షితంగా వెళ్లిపోయిన తర్వాత “యూదయలో, గలిలయలో, సమరయలో ఉన్న సంఘమంతా కొంతకాలంపాటు ప్రశాంతతను అనుభవించింది.” (అపొ. 9:31) అనుకూలంగా ఉన్న ఆ సమయాన్ని శిష్యులు ఎలా ఉపయోగించుకున్నారు? (2 తిమో. 4:2) ‘సంఘమంతా బలపడుతూ వచ్చింది’ అని బైబిలు చెప్తుంది. అపొస్తలులు, బాధ్యతల్లో ఉన్న ఇతర సహోదరులు శిష్యుల విశ్వాసాన్ని బలపర్చారు. అంతేకాదు “యెహోవా మార్గంలో నడుస్తూ, పవిత్రశక్తి ద్వారా కలిగే ఆదరణకు అనుగుణంగా జీవిస్తూ” ఉండేలా సంఘాన్ని నడిపించారు. ఉదాహరణకు పేతురు ఆ సమయాన్ని, షారోను మైదానంలోని లుద్ద నగరంలో ఉన్న శిష్యుల్ని బలపర్చడానికి ఉపయోగించాడు. ఆయన చేసిన కృషి వల్ల, ఆ ప్రాంతంలోని చాలామంది “ప్రభువు మీద విశ్వాసముంచారు.” (అపొ. 9:32-35) ప్రశాంతంగా ఉన్న ఆ సమయంలో శిష్యుల దృష్టి పక్కకు మళ్లలేదు. బదులుగా ఒకరి మీద ఒకరు శ్రద్ధ చూపించుకోవడంలో, మంచివార్త ప్రకటించడంలో వాళ్లు తీవ్రంగా కృషిచేశారు. దానివల్ల, సంఘంలోని వాళ్ల సంఖ్య “పెరుగుతూ వచ్చింది.”

21 దాదాపు 1990లో, చాలా దేశాల్లోని యెహోవాసాక్షులు అలాంటి ‘ప్రశాంతతనే’ అనుభవించారు. ఎన్నో సంవత్సరాలుగా దేవుని ప్రజల్ని అణగదొక్కుతున్న ప్రభుత్వాలు హఠాత్తుగా పడిపోయాయి, ప్రకటనా పని మీద ఉన్న కొన్ని నిషేధాల్ని సడలించారు లేదా పూర్తిగా ఎత్తేశారు. ఎన్నో వేలమంది సాక్షులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని బహిరంగంగా ప్రకటించారు, అద్భుతమైన ఫలితాల్ని చూశారు.

22. మీకున్న స్వేచ్ఛను ఎలా చక్కగా ఉపయోగించవచ్చు?

22 మీకున్న స్వేచ్ఛను మీరు చక్కగా ఉపయోగించుకుంటున్నారా? ఒకవేళ మీరు ఉంటున్న దేశంలో మతపరమైన స్వేచ్ఛ ఉంటే, సాతాను వస్తుపరమైన విషయాల్ని ఆశ చూపించి మిమ్మల్ని బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. (మత్త. 13:22) కాబట్టి మీ దృష్టి పక్కకు మళ్లకుండా చూసుకోండి. మీ ప్రాంతంలో ఏ కాస్త ప్రశాంతత ఉన్నా, ఆ సమయాన్ని చక్కగా ఉపయోగించుకోండి. పూర్తిస్థాయిలో సాక్ష్యం ఇవ్వడానికి, సంఘాన్ని బలపర్చడానికి దాన్ని ఒక అవకాశంగా చూడండి. ఎందుకంటే, మీ పరిస్థితులు క్షణంలో మారిపోవచ్చు.

23, 24. (ఎ) తబితా ఉదాహరణ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (బి) మనం ఏమని నిర్ణయించుకోవాలి?

23 తబితా లేదా దొర్కా అనే శిష్యురాలికి ఏం జరిగిందో గమనించండి. ఆమె లుద్దకు దగ్గర్లో ఉన్న యొప్పేలో ఉండేది. ఈ నమ్మకమైన సహోదరి తన సమయాన్ని, తనకున్న వాటిని తెలివిగా ఉపయోగించి “ఎన్నో మంచి పనులు చేసేది, పేదవాళ్లకు ఎంతో సహాయం చేసేది.” అయితే, ఉన్నట్టుండి ఆమెకు జబ్బు చేసి చనిపోయింది.c దాంతో యొప్పేలో ఉన్న శిష్యులు, ముఖ్యంగా ఆమె దయతో చేసిన సహాయాన్ని పొందిన విధవరాళ్లు దుఃఖంలో మునిగిపోయారు. సమాధి చేసే ముందు ఆమె శరీరాన్ని ఒక మేడగదిలో ఉంచారు. పేతురు ఆ ఇంటికి వచ్చాడు. యేసు అపొస్తలుల్లో ఇంతవరకు ఎవ్వరూ చేయని ఒక అద్భుతాన్ని పేతురు చేశాడు. ఆయన ప్రార్థన చేసి, చనిపోయిన తబితాను తిరిగి లేపాడు! ఆయన ఆ విధవరాళ్లను, ఇతర శిష్యుల్ని తిరిగి గదిలోకి పిలిచి, తబితాను ప్రాణాలతో అప్పగించినప్పుడు వాళ్లు ఎంత ఆనందపడి ఉంటారో ఊహించండి! ఈ సంఘటనలన్నీ, ముందుముందు రాబోయే కష్టాలకు శిష్యుల్ని సిద్ధం చేసి ఉంటాయి. ఇంత గొప్ప అద్భుతం జరిగే సరికి, ఆ సంగతి “యొప్పే అంతటా తెలిసిపోయింది. దాంతో చాలామంది ప్రభువు మీద విశ్వాసముంచారు.”—అపొ. 9:36-42.

ఒక సహోదరి, ఒంట్లో బాలేని ఒక పెద్దవయసు సహోదరికి పువ్వులు ఇస్తుంది.

తబితాలాగే మీరు కూడా ఏం చేయవచ్చు?

24 తబితా ఉదాహరణ నుండి మనం రెండు ముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు. (1) జీవితం నీటిబుడగ లాంటిది. కాబట్టి, ప్రాణాలతో ఉన్నప్పుడే దేవుని దగ్గర మంచి పేరు సంపాదించుకోవడం ప్రాముఖ్యం! (ప్రసం. 7:1) (2) పునరుత్థాన నిరీక్షణ పగటి కల కాదు, అది నిజంగా జరుగుతుంది. తబితా దయతో చేసిన ఎన్నో పనుల్ని యెహోవా గమనించాడు, ఆమెకు ప్రతిఫలం ఇచ్చాడు. మనం చేసే కృషిని కూడా ఆయన గుర్తుంచుకుంటాడు, ఒకవేళ హార్‌మెగిద్దోనుకు ముందే మనం చనిపోయినా మనల్ని తిరిగి బ్రతికిస్తాడు. (హెబ్రీ. 6:10) కాబట్టి మనం ఇప్పుడు “కష్టమైన సమయాల్లో” ఉన్నా, లేక “ప్రశాంతతను” అనుభవిస్తున్నా క్రీస్తు గురించి పూర్తిస్థాయిలో సాక్ష్యమిస్తూ ఉందాం.—2 తిమో. 4:2.

పరిసయ్యుడైన సౌలు

అపొస్తలుల కార్యాలు పుస్తకంలో, స్తెఫనును రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు అక్కడే ఉన్న ‘సౌలు అనే యువకుడు’ తార్సుకు చెందినవాడు. తార్సు రోమా ప్రాంతమైన కిలికియకు రాజధాని. అది ఇప్పటి టర్కీలో దక్షిణాన ఉంది. (అపొ. 7:58) తార్సు నగరంలో చాలామంది యూదులు ఉండేవాళ్లు. సౌలు తన గురించి ఇలా రాశాడు: “నేను ఎనిమిదో రోజున సున్నతి పొందాను, ఇశ్రాయేలీయుణ్ణి, బెన్యామీను గోత్రం వాణ్ణి, అసలైన హెబ్రీయుణ్ణి, ధర్మశాస్త్రం పాటించే విషయానికొస్తే, పరిసయ్యుణ్ణి.” ఈ కారణాల్ని బట్టి, అతనికి యూదుల్లో చాలా గౌరవం ఉండి ఉంటుంది!—ఫిలి. 3:5.

పరిసయ్యుడైన సౌలు.

తార్సు నగరం చాలా పెద్దది, అక్కడ వ్యాపారం బాగా జరిగేది, అది గ్రీకు సంస్కృతికి కేంద్రంగా ఉండేది. తార్సులో పెరగడం వల్ల సౌలుకు గ్రీకు భాష తెలుసు. బహుశా అతను చిన్నప్పుడు యూదుల పాఠశాలలో చదువుకొని ఉంటాడు. సౌలు తన ప్రాంతంలోని మిగతా వాళ్లలాగే డేరాలు తయారుచేసే వృత్తిని నేర్చుకున్నాడు. బహుశా, చిన్నప్పుడే వాళ్ల నాన్న దగ్గర దాన్ని నేర్చుకుని ఉంటాడు.—అపొ. 18:2, 3.

సౌలుకు పుట్టుకతోనే రోమా పౌరసత్వం ఉందని కూడా అపొస్తలుల కార్యాలు పుస్తకం చెప్తుంది. (అపొ. 22:25-28) అంటే, అతని పూర్వీకుల్లో ఎవరో ఒకరికి రోమా పౌరసత్వం వచ్చి ఉంటుంది. అదెలా వచ్చిందో మనకు తెలీదు. ఏదేమైనా, రోమా పౌరసత్వం ఉన్నవాళ్లకు సమాజంలో చాలా ప్రత్యేక గౌరవం ఉండేది. సౌలు పుట్టి పెరిగిన పరిస్థితుల్ని బట్టి, చదువును బట్టి అతనికి యూదా, గ్రీకు, రోమా సంస్కృతుల గురించి బాగా తెలుసు.

దాదాపు 13 ఏళ్ల వయసులో, పైచదువుల కోసం సౌలు 840 కిలోమీటర్ల దూరంలో ఉన్న యెరూషలేముకు వెళ్లాడు. అక్కడ సౌలు గమలీయేలు పాదాల దగ్గర చదువు నేర్చుకున్నాడు. పరిసయ్యుల సంప్రదాయాల్ని బోధించే గమలీయేలుకు చాలా గౌరవం ఉండేది.—అపొ. 22:3.

ఆ పైచదువుల్ని, ఈరోజుల్లోని యూనివర్సిటీ చదువులతో పోల్చవచ్చు. అక్కడ లేఖనాల్ని, యూదుల సంప్రదాయాల్ని నేర్పించేవాళ్లు అలాగే కంఠస్తం చేయించేవాళ్లు. గమలీయేలు దగ్గర బాగా చదువుకునే విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉండేది. సౌలు కూడా అలాంటి విద్యార్థే అని తెలుస్తోంది. తర్వాతి కాలంలో సౌలు ఇలా రాశాడు: “నా పూర్వీకుల సంప్రదాయాల పట్ల నేను ఎంతో ఉత్సాహం చూపించేవాణ్ణి. అందువల్ల యూదా మతాన్ని అనుసరించే విషయంలో నా వయసు ఉన్న చాలామంది యూదుల కన్నా నేను ఎంతో ముందుండేవాణ్ణి.” (గల. 1:14) యూదుల సంప్రదాయాల విషయంలో తనకున్న ఆ ఉత్సాహం వల్లే, అప్పుడప్పుడే ఎదుగుతున్న క్రైస్తవ సంఘాన్ని సౌలు అణచివేయాలనుకున్నాడు.

తబితా “ఎన్నో మంచిపనులు చేసేది”

సహాయం అడుగుతున్న ఒకరికి తబితా బహుమతి ఇస్తుంది.

తబితా ఒక క్రైస్తవురాలు. ఆమె యొప్పే అనే రేవు పట్టణంలో ఉండేది. “ఆమె ఎన్నో మంచిపనులు చేసేది, పేదవాళ్లకు ఎంతో సహాయం చేసేది” కాబట్టి, సంఘంలోని వాళ్లు ఆమెను ఎంతో ఇష్టపడేవాళ్లు. (అపొ. 9:36) సాధారణంగా యూదులు-అన్యజనులు కలిసి ఉన్న ప్రాంతాల్లో, యూదులకు రెండు పేర్లు ఉండేవి. ఒకటి హీబ్రూ లేదా అరామిక్‌ పేరు, ఇంకొకటి గ్రీకు లేదా లాటిన్‌ పేరు. అందుకే తబితాకి రెండు పేర్లు ఉన్నాయి: దొర్కా అనే గ్రీకు పేరు, “తబితా” అనే అరామిక్‌ పేరు. ఆ రెండు పేర్లకు “కొండజింక” అనే అర్థం ఉంది.

బహుశా జబ్బు చేయడం వల్ల తబితా హఠాత్తుగా చనిపోయింది. ఆచారం ప్రకారం, ఆమె శరీరాన్ని సమాధికి సిద్ధం చేయడానికి ముందు స్నానం చేయించారు. తర్వాత ఆమె శరీరాన్ని, బహుశా ఆమె ఇంటి పైనున్న మేడగదిలో ఉంచారు. ఆ ప్రాంతంలో వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి, ఎవరైనా చనిపోయినప్పుడు అదే రోజున లేదా మరుసటి రోజున సమాధి చేసేవాళ్లు. దగ్గర్లో ఉన్న లుద్ద నగరంలో అపొస్తలుడైన పేతురు ఉన్నాడని యొప్పేలోని క్రైస్తవులకు తెలిసింది. తబితాను సమాధి చేసేలోపే పేతురు రాగలడు. ఎందుకంటే, లుద్ద యొప్పే నుండి కేవలం 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంది, అంటే కాలినడకన దాదాపు నాలుగు గంటల ప్రయాణం. కాబట్టి, పేతురును త్వరగా రమ్మని చెప్పడానికి సంఘంలోని వాళ్లు ఇద్దరు వ్యక్తుల్ని పంపించారు. (అపొ. 9:37, 38) దాని గురించి ఒక బైబిలు పండితుడు ఇలా చెప్తున్నాడు: “సాధారణంగా యూదులు, ఒక విషయం గురించి కబురు చెప్పడానికి ఇద్దర్ని పంపించేవాళ్లు. అలా, ఒక వ్యక్తి చెప్పేది నిజం అనడానికి రెండో వ్యక్తి సాక్షిగా ఉండేవాడు.”

పేతురు వచ్చాక ఏం జరిగింది? బైబిలు ఇలా చెప్తుంది: “వాళ్లు అతన్ని మేడ మీది గదిలోకి తీసుకెళ్లారు. విధవరాళ్లందరూ అతని దగ్గరికి వచ్చి ఏడుస్తూ, దొర్కా తమతో ఉన్నప్పుడు చేసిన వస్త్రాల్ని చూపించారు.” (అపొ. 9:39) తబితాను ఆమె సంఘం వాళ్లు ప్రేమించడానికి ఒక కారణం, ఆమెకు బట్టలు కుట్టి ఇచ్చే అలవాటు ఉండేది. ఆమె చాలారకాల బట్టల్ని కుట్టేది. ఆమే సొంతగా బట్టల్ని కొని, వాటిని కుట్టి ఇచ్చేదో, లేక ఎవరైనా బట్టలు ఇస్తే కేవలం వాటిని కుట్టి ఇచ్చేదో బైబిలు చెప్పట్లేదు. ఏదేమైనా, ఆమె దయతో చేసిన ‘మంచిపనుల్ని’ బట్టి, ఆమె చేసిన ‘సహాయాన్ని’ బట్టి అందరూ ఆమెను ప్రేమించేవాళ్లు.

మేడగదిలో విధవరాళ్లందరూ ఏడ్వడం చూసి, పేతురు గుండె తరుక్కుపోయి ఉంటుంది. తబితా ఇంట్లో ఉన్న పరిస్థితికి, యాయీరు ఇంట్లో ఉన్న పరిస్థితికి తేడాను వివరిస్తూ, రిచర్డ్‌ లెన్స్‌కి అనే పండితుడు ఇలా చెప్పాడు: “యాయీరు ఇంట్లో కిరాయికి తెచ్చుకున్న స్త్రీలు బోరుబోరున ఏడుస్తున్నారు, కొంతమంది పిల్లనగ్రోవి ఊదుతున్నారు. దానివల్ల అక్కడంతా గోలగోలగా ఉంది. కానీ ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది.” (మత్త. 9:23) ఇక్కడ అందరూ ఆమెను ఇష్టపడేవాళ్లే ఉన్నారు, వాళ్లు నిజంగా బాధపడుతున్నారు. తబితాకు పెళ్లి అవ్వలేదని చాలామంది అంటారు, ఎందుకంటే ఆమె భర్త గురించి బైబిల్లో ఎక్కడా లేదు.

అపొస్తలుల్ని ప్రకటించడానికి పంపించినప్పుడు, యేసు వాళ్లకు ‘చనిపోయినవాళ్లను బ్రతికించే’ శక్తిని ఇచ్చాడు. (మత్త. 10:8) యేసు చనిపోయినవాళ్లను బ్రతికించడం, ముఖ్యంగా యాయీరు కూతుర్ని బ్రతికించడం పేతురు చూశాడు. కానీ తనకు తానుగా ఎప్పుడూ పునరుత్థానం చేయలేదు. (మార్కు 5:21-24, 35-43) ఇప్పుడు పేతురు అందర్నీ మేడగదిలో నుండి పంపించేసి, పట్టుదలగా ప్రార్థించాడు. దాంతో తబితా కళ్లు తెరిచి, లేచి కూర్చుంది. వాళ్లు ఎంతో ఇష్టపడే తబితాను, పేతురు మళ్లీ ప్రాణాలతో వాళ్ల ముందు ఉంచినప్పుడు, యొప్పేలోని క్రైస్తవులు ఎంత సంతోషించి ఉంటారో మనం ఊహించుకోవచ్చు!—అపొ. 9:40-42.

a “పరిసయ్యుడైన సౌలు” అనే బాక్సు చూడండి.

b సాధారణంగా, వేరేవాళ్లకు పవిత్రశక్తి వరాల్ని ఇచ్చే అధికారం అపొస్తలులకు మాత్రమే ఉండేది. కానీ ఈ అరుదైన సందర్భంలో మాత్రం, యేసు అననీయ ద్వారా సౌలుకు పవిత్రశక్తి వరాల్ని ఇచ్చినట్టు తెలుస్తుంది. క్రైస్తవుడిగా మారిన తర్వాత సౌలు 12 మంది అపొస్తలుల్ని కలవడానికి చాలాకాలం పట్టింది. అయితే ఆ సమయంలో ఆయన ఖాళీగా లేడు గానీ, ప్రకటనా పనిని ఉత్సాహంగా చేశాడని అర్థమౌతుంది. అందుకే ప్రకటనా పని చేయడానికి కావాల్సిన బలాన్ని ఇవ్వడం కోసం, యేసు అననీయ ద్వారా సౌలుకు పవిత్రశక్తిని ఇచ్చినట్టు తెలుస్తుంది.

c “తబితా ‘ఎన్నో మంచి పనులు చేసేది’” అనే బాక్సు చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి