పయినీరు స్ఫూర్తిని ప్రదర్శించండి
1. పయినీరు స్ఫూర్తిని మీరెలా వర్ణిస్తారు?
1 రాజ్య ప్రచారకులందరూ ప్రస్తుతం పయినీరు సేవ చేయగలిగినా చేయలేకపోయినా, పయినీరు స్ఫూర్తిని ప్రదర్శించవచ్చు. ప్రకటించి, శిష్యులను చేయండనే ఆజ్ఞకు విధేయత చూపించాలన్నదే వారి ప్రగాఢ కోరిక. (మత్త. 28:19, 20; అపొ. 18:5) వారు ప్రజల పట్ల శ్రద్ధతో ఉంటారు, తమ పరిచర్యను నెరవేర్చడానికి త్యాగాలు కూడా చేస్తారు. (మత్త. 9:36; అపొ. 20:24) ఇతరులు సత్యం నేర్చుకోవడానికి ఏమి అవసరమైతే అది చేయడానికి యెహోవా సేవకులు సంసిద్ధంగా ఉంటారు. (1 కొరిం. 9:19-23) అలాంటి స్ఫూర్తి చూపించిన ఫిలిప్పు అనే సువార్తికుని ఉదాహరణను మనం పరిశీలిద్దాం.
2. పెద్దలు, పరిచర్య సేవకులు పరిచర్యపై ఆసక్తి చూపించడం విషయంలో ఫిలిప్పును ఎలా అనుకరించవచ్చు?
2 ప్రకటించడం, బోధించడం: ఫిలిప్పు మొదటి శతాబ్దపు సంఘంలో బరువైన బాధ్యతలను స్వీకరించాడు. (అపొ. 6:1-6) అయినా సువార్తను ఆసక్తితో ప్రకటించడంలో అగ్రగామిగా ఉండేవాడు. (అపొ. 8:40) అదేవిధంగా నేడు పెద్దలు, పరిచర్య సేవకులు తమ నియమిత విధులను నిర్వహిస్తూ, పరిచర్యలో ఉత్సాహంగా ముందుండడం ద్వారా పయినీరు స్ఫూర్తిని ప్రదర్శించవచ్చు. అది సంఘపు స్ఫూర్తికి ఎంతో చైతన్యం కలిగిస్తుంది!—రోమా. 12:11.
3. మనకు శోధనలు ఎదురైనప్పుడు పయినీరు స్ఫూర్తిని ఎలా ప్రదర్శించవచ్చు?
3 స్తెఫను మరణం తర్వాత చెలరేగిన హింస తాకిడికి శిష్యులు చెల్లాచెదురయ్యారు. అయినప్పటికీ ఫిలిప్పు ప్రకటనా పనిలో కొనసాగాడు, సమరయులకు ప్రకటించడాన్ని ప్రారంభించడంలో ఆయన ప్రధాన భూమిక వహించాడు. (అపొ. 8:1, 4-6, 12, 14-17) మనకు శోధనలు ఎదురైనా సువార్తను తెలియజేయడంలో కొనసాగడం ద్వారా, మనకు తారసపడిన వారందరికీ నిష్పక్షపాతంగా ప్రకటించడం ద్వారా మనం ఆయన మాదిరిని అనుకరించవచ్చు.—యోహా. 4:9.
4. బోధకునిగా ఫిలిప్పు ఎలాంటి మాదిరి ఉంచాడు?
4 దేవుని వాక్య బోధకునిగా ఫిలిప్పుకున్న ప్రావీణ్యత, ఐతియొపీయుడైన నపుంసకుడిని ఒప్పించడానికి సంబంధించిన వృత్తాంతంలో కనబడుతుంది. (అపొ. 8:26-38) పయినీరు స్ఫూర్తిని ప్రదర్శించే మరో విధానం ఏమిటంటే, బైబిల్ని ఉపయోగించడానికి, ‘లేఖనములతో తర్కించడానికి’ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం. (అపొ. 17:2, 3) ఫిలిప్పులాగే మనమూ ప్రజలు కనబడ్డ ప్రతిచోట, సముచితమైన ప్రతి సందర్భంలో సువార్తను పంచుకోవడానికి ప్రయత్నిస్తాం.
5. తమ పిల్లల మనస్సుల్లో పయినీరు స్ఫూర్తిని పెంపొందించడానికి క్రైస్తవ తల్లిదండ్రులకు ఏది సహాయం చేయవచ్చు?
5 కుటుంబం, సంఘం: ఫిలిప్పు వైఖరి, మాదిరి ఆయన కూతుర్లపై సానుకూల ప్రభావం చూపించిందనడంలో సందేహం లేదు. (అపొ. 21:9) అదేవిధంగా తమ జీవితాలను రాజ్య సంబంధిత విషయాలపై కేంద్రీకృతం చేసే క్రైస్తవ తల్లిదండ్రులు, తమ పిల్లలు కూడా అలా చేసేలా ప్రోత్సహిస్తారు. వారమంతా తీరిక లేకుండా పనిచేసి అలసిపోయినప్పటికీ, ఇతరులకు ఉత్సాహంగా ప్రకటించే తల్లిదండ్రులు తమ పిల్లల మనస్సుల్లో చెరగని ముద్ర వేయగలుగుతారు.—సామె. 22:6.
6. మన సంఘంలోని పయినీర్లకు మన కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు?
6 ఫిలిప్పు, యెహోవా సేవలో కష్టపడి పనిచేస్తూ ఉత్సాహంగా ఉండే క్రైస్తవులైన పౌలు, లూకాలకు ఆతిథ్యం ఇచ్చాడు. (అపొ. 21:8, 10) నేడు ఉత్సాహంగల వారికి మన కృతజ్ఞతను, మద్దతును ఎలా చూపించవచ్చు? బహుశా పరిచర్యలో తక్కువ మంది ఉన్నప్పుడు మనం పయినీర్లతో కలిసి ఒక ఉదయం లేదా మధ్యాహ్నం పని చేయడానికి సంసిద్ధతను తెలపవచ్చు. (ఫిలి. 2:4) క్షేమాభివృద్ధికరమైన సహవాసం కోసం వారిని మన ఇండ్లకు కూడా ఆహ్వానించవచ్చు. మన పరిస్థితులు ఎలా ఉన్నా, పయినీరు స్ఫూర్తిని ప్రదర్శించేందుకు మనమందరం కృషి చేద్దాం.