వారు యెహోవా చిత్తాన్ని చేశారు
ఫిలిప్పు ఐతియొపీయుడైన అధికారికి బాప్తిస్మమివ్వడం
ఒక ఐతియొపీయుడు తన రథంలో వెళుతూ తన సమయాన్ని జ్ఞానవంతంగా ఉపయోగించుకున్నాడు. ఆయన బిగ్గరగా చదువుతున్నాడు—అది మొదటి శతాబ్దపు ప్రయాణికుల్లో ఒక సాధారణ వాడుక. ఈయన “ఐతియొపీయుల రాణియైన కందాకేక్రింద మంత్రి”గా ఉన్న అధికారి.a ఆయన “ఆమెయొక్క ధనాగారమంతటి మీద” అధికారిగా ఉండేవాడు అంటే ఆయన ఆర్థిక మంత్రిగా ఉండేవాడు. ఈ అధికారి జ్ఞానం పొందడానికి దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు.—అపొస్తలుల కార్యములు 8:27, 28.
సమీపంలోనే సువార్తికుడైన ఫిలిప్పు ఉన్నాడు. ఒక దేవదూత ఆయనను ఈ స్థలానికి నడిపించి, “నీవు ఆ రథము దగ్గరకుపోయి దానిని కలిసికొనుమని” ఆయనకు చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 8:26, 29) ఫిలిప్పు తనను తానిలా ప్రశ్నించుకోవడాన్ని మనం ఊహించవచ్చు, ‘ఈ మనిషి ఎవరు? ఆయనేమి చదువుతున్నాడు? నన్నెందుకు ఆయన దగ్గరికి పంపుతున్నట్లు?’
ఫిలిప్పు రథం ప్రక్కగా పరుగెత్తుతూ ఐతియొపీయుడు ఇలా చదవడం ఆయన విన్నాడు: “ఆయన గొఱ్ఱెవలె వధకు తేబడెను బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరువకుండెను. ఆయన దీనత్వమునుబట్టి ఆయనకు న్యాయవిమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమిమీదనుండి తీసివేయబడినది.”—అపొస్తలుల కార్యములు 8:32, 33.
ఫిలిప్పు ఆ ప్రకరణాన్ని వెంటనే గుర్తించాడు. అది యెషయా గ్రంథంలోనిది. (యెషయా 53:7, 8) తాను చదువుతున్నదాన్నిబట్టి ఐతియొపీయుడు అయోమయంలో పడ్డాడు. ఫిలిప్పు ఇలా అడిగి సంభాషణ ప్రారంభించాడు: “నీవు చదువునది గ్రహించుచున్నావా?” దానికి ఐతియొపీయుడు, “ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని” సమాధానమిచ్చాడు. ఆ తర్వాత ఆయన తనతోపాటు తన రథం ఎక్కమని ఫిలిప్పును కోరాడు.—అపొస్తలుల కార్యములు 8:30, 31.
‘నాకు బాప్తిస్మమివ్వడానికి ఆటంకమేమిటి?’
ఐతియొపీయుడు, “ప్రవక్త యెవనినిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని” ఫిలిప్పునడిగాడు. (అపొస్తలుల కార్యములు 8:34) ఐతియొపీయుని అయోమయం ఆశ్చర్యకరమైనదేమి కాదు, ఎందుకంటే యెషయా ప్రవచనంలోని “గొఱ్ఱెపిల్ల” లేక “సేవకుడు” ఎవరనేది చాలాకాలం వరకు మర్మంగానే ఉండిపోయింది. (యెషయా 53:11) ఫిలిప్పు ఐతియొపీయునికి “యేసునుగూర్చిన సువార్త” ప్రకటించినప్పుడు ఇది ఎంత స్పష్టమైవుండవచ్చు! కొంతసేపటి తర్వాత, “ఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని” ఐతియొపీయుడు అన్నాడు. కాబట్టి ఫిలిప్పు అప్పటికప్పుడు అక్కడే ఆయనకు బాప్తిస్మమిచ్చాడు.—అపొస్తలుల కార్యములు 8:35-38.
ఇది తొందరపాటు చర్యనా? ఎంతమాత్రం కాదు! ఐతియొపీయుడు యూదా మతప్రవిష్ఠుడు.b కాబట్టి ఆయన అప్పటికే, మెస్సీయ సంబంధ ప్రవచనాలతో సహా లేఖనాల యందు జ్ఞానంగల యెహోవా ఆరాధికుడే. అయితే, ఆయన జ్ఞానం అపరిపూర్ణమైనది. ఐతియొపీయుడు ఇప్పుడు యేసుక్రీస్తు పాత్రను గూర్చిన ఈ ముఖ్యమైన సమాచారాన్ని పొందాడు గనుక, దేవుడు తననుండి ఏమి కోరుతున్నాడో గ్రహించి, తదనుగుణంగా మార్పు చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. బాప్తిస్మం తగినదే.—మత్తయి 28:18-20; 1 పేతురు 3:21.
ఆ తర్వాత, “ప్రభువు [“యెహోవా,” NW] ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను.” ఆయన మరో పనిమీద వెళ్లిపోయాడు. ఐతియొపీయుడు “సంతోషించుచు తన త్రోవను వెళ్లెను.”—అపొస్తలుల కార్యములు 8:39, 40.
మనకు పాఠం
యెహోవా ప్రస్తుతదిన సేవకులుగా మనకు, యథార్థ హృదయంగల వ్యక్తులు దేవుని వాక్య సత్యాన్ని తెలుసుకునేందుకు వారికి సహాయం చేసే బాధ్యత ఉంది. ప్రయాణించేటప్పుడు లేక మరితర అనియత సందర్భాల్లో ఇతరులకు సువార్తను అందించడంలో అనేకులు సఫలమయ్యారు. రాజ్యప్రకటన పని ఫలితంగా, ప్రతి సంవత్సరం లక్షలాదిమంది బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యెహోవా దేవునికి తమ సమర్పణను తెలియజేస్తున్నారు.
అయితే, క్రొత్తవారికి బాప్తిస్మమిచ్చేందుకు తొందరపడకూడదు. మొదట వారు యెహోవా దేవుని గురించి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు గురించి కచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. (యోహాను 17:3) ఆ తర్వాత వారు పశ్చాత్తాపపడి చెడు స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని కట్టడలకనుగుణ్యంగా ఉండేలా మార్పులు చేసుకోవాలి. (అపొస్తలుల కార్యములు 3:19) ప్రాముఖ్యంగా తప్పుడు ఆలోచనా విధానం మరియు ప్రవర్తన లోతుగా పాతుకొని ఉన్నప్పుడు దీనికి సమయం అవసరమౌతుంది. క్రొత్తవారు క్రైస్తవ శిష్యరికంలోని లోతుపాతులను గుర్తెరిగినట్లయితే, వారు యెహోవా దేవునితో సమర్పిత సంబంధంలోకి ప్రవేశించడం ద్వారా వచ్చే గొప్ప ఆశీర్వాదాల కొరకు ఎదురుచూడవచ్చు. (లూకా 9:23; 14:25-33 పోల్చండి.) యెహోవాసాక్షులు అలాంటి క్రొత్తవారిని, తన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఉపయోగించుకుంటున్న సంస్థవైపు ఉత్సాహంగా నడిపిస్తారు. (మత్తయి 24:45-47) ఐతియొపీయుని వలె వీరు, దేవుడు తమనుండి ఏమి కోరుతున్నాడనేది తెలుసుకొని దానికి తగినట్లు ఉండడంలో ఆనందాన్ని పొందుతారు.
[అధస్సూచీలు]
a “కందాకే” అన్నది ఐతియొపీయుల రాణీ వారసులకు అనువర్తించే (“ఫరో” మరియు “కైసరు” వంటివాటిలా) బిరుదేగాని పేరు కాదు.
b మతప్రవిష్ఠులంటే, మోషే ధర్మశాస్త్రాన్ని హత్తుకొని ఉండాలని తీర్మానించుకున్న ఇశ్రాయేలీయులు కానివారు.—లేవీయకాండము 24:22.
[8వ పేజీలోని బాక్సు]
నపుంసకుడని ఎందుకు పిలువబడ్డాడు?
అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయమంతటిలోనూ ఐతియొపీయుడు “నపుంసకుడు” అని పిలువబడ్డాడు. అయితే, మోషే ధర్మశాస్త్రం వీర్యహరణము గావించబడిన వ్యక్తిని సంఘంలోకి అనుమతించేది కాదు గనుక ఈ వ్యక్తి అక్షరార్థంగా నపుంసకుడు కాదన్నది స్పష్టమౌతుంది. (ద్వితీయోపదేశకాండము 23:1) “నపుంసకుడు” అనే గ్రీకు పదం ఉన్నత స్థానంలోవున్న వ్యక్తిని సూచించవచ్చు. కాబట్టి, ఐతియొపీయుడు ఐతియొపీయుల రాణి క్రింద పనిచేసే అధికారి.