అధ్యాయం 6
‘స్తెఫను దేవుని అనుగ్రహంతో, శక్తితో నిండిపోయాడు’
స్తెఫను మహాసభ ముందు ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడం, దాన్నుండి మనం నేర్చుకునే పాఠాలు
అపొస్తలుల కార్యాలు 6:8–8:3 ఆధారంగా
1-3. (ఎ) స్తెఫను ఎలాంటి కష్టమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది? అయినా ఆయన ఎలా ఉన్నాడు? (బి) ఇప్పుడు మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?
స్తెఫను, యూదుల ఉన్నత న్యాయస్థానం ముందు ఉన్నాడు. అది బహుశా యెరూషలేము ఆలయానికి దగ్గర్లో ఉండి ఉంటుంది. సాధారణంగా ఆ న్యాయస్థానాన్ని చూస్తేనే దడ పుడుతుంది. స్తెఫను చుట్టూ అర్ధ చంద్రాకారంలో 71 మంది మహాసభ నాయకులు కూర్చున్నారు. ఇప్పుడు వాళ్లు ఆయన్ని విచారణ చేయబోతున్నారు. ఆ మహాసభ నాయకులు అధికారం, పలుకుబడి ఉన్నవాళ్లు. వాళ్లలో చాలామంది యేసు శిష్యుడైన స్తెఫనును పురుగును చూసినట్టు చూస్తున్నారు. ప్రధానయాజకుడైన కయప ప్రస్తుతం ఈ మహాసభకు అధ్యక్షుడు. కొన్ని నెలల క్రితం ఈయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మహాసభ యేసుకు మరణశిక్ష వేసింది. మరి వాళ్లందర్నీ చూసి స్తెఫను భయంతో వణికిపోయాడా?
2 ఆ సమయంలో స్తెఫను ముఖం ఎలా కనిపించింది అనేదాని గురించి బైబిలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్తుంది. మహాసభ నాయకులకు స్తెఫను ముఖం, “దేవదూత ముఖంలా కనిపించింది.” (అపొ. 6:15) దేవదూతలు యెహోవా సందేశాన్ని చెప్తుంటారు కాబట్టి భయపడకుండా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంటారు. స్తెఫను కూడా అలాగే ఉన్నాడు. స్తెఫను మీద పీకల దాకా కోపం ఉన్న మహాసభ నాయకులు కూడా దాన్ని చూడగలిగారు. మరి ఆయన అంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగాడు?
3 ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకుంటే, మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. అసలు స్తెఫను ఇంత కష్టమైన పరిస్థితిని ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందో కూడా మనం తెలుసుకోవాలి. మహాసభకు రావడానికి ముందు స్తెఫను తన విశ్వాసం గురించి ఎలా మాట్లాడాడు? ఆయన్ని మనం ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?
“వాళ్లు ప్రజల్ని . . . రెచ్చగొట్టారు” (అపొ. 6:8-15)
4, 5. (ఎ) స్తెఫను సంఘంలో ఎలా చురుగ్గా పనిచేశాడు? (బి) స్తెఫను ‘దేవుని అనుగ్రహంతో, శక్తితో నిండిపోయాడు’ అనే మాటకు అర్థమేంటి?
4 కొత్తగా ఏర్పడిన క్రైస్తవ సంఘంలో స్తెఫను చాలా చురుగ్గా పని చేస్తున్నాడని మనం ఇప్పటికే చూశాం. ఒక ముఖ్యమైన పనిలో అపొస్తలులకు సహాయం చేసిన ఏడుగురు వినయంగల పురుషుల్లో స్తెఫను కూడా ఉన్నాడని ముందటి అధ్యాయంలో చూశాం. దేవుడు ఆయనకు ఇచ్చిన ప్రత్యేకమైన వరాల్ని బట్టి కూడా ఆయన ఎంత వినయస్థుడో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది అపొస్తలుల్లాగే స్తెఫను కూడా, దేవుని సహాయంతో “గొప్ప అద్భుతాల్ని, సూచనల్ని” చేస్తూ ఉన్నాడని అపొస్తలుల కార్యాలు 6:8 లో చూస్తాం. అంతేకాదు స్తెఫను ‘దేవుని అనుగ్రహంతో, శక్తితో నిండిపోయాడని’ బైబిలు చెప్తుంది. దాని అర్థమేంటి?
5 “దేవుని అనుగ్రహం” అని అనువదించిన గ్రీకు పదాన్ని “దయ” అని కూడా అనువదించవచ్చు. అంటే స్తెఫను దయగా, మృదువుగా, ప్రజల మనసుల్ని చేరుకునేలా మాట్లాడి ఉంటాడు. తన మాటల్లో నిజాయితీ ఉందని, తను చెప్పే సత్యాలు వాళ్ల మంచి కోసమే అని ప్రజలు గ్రహించేలా స్తెఫను మాట్లాడేవాడు. ఆయన ‘శక్తితో నిండిపోయాడు’ అని ఎందుకు చెప్పవచ్చంటే, యెహోవా పవిత్రశక్తి ఆయన మీద పనిచేస్తుంది, దాని నిర్దేశానికి ఆయన వినయంగా లోబడుతున్నాడు. తనకున్న వరాల్ని, సామర్థ్యాల్ని బట్టి స్తెఫను పొంగిపోలేదు కానీ ఘనతంతా యెహోవాకే ఇచ్చాడు. తను మాట్లాడే ప్రజల మీద ప్రేమ, శ్రద్ధ చూపించాడు. అందుకే, స్తెఫను తమకు ఒక ముప్పులా మారిపోతాడేమో అని వ్యతిరేకులు భయపడ్డారు!
6-8. (ఎ) వ్యతిరేకులు స్తెఫను మీద ఏ రెండు ఆరోపణలు చేశారు? ఎందుకు? (బి) మనం స్తెఫను ఉదాహరణను పరిశీలించడం ఎందుకు మంచిది?
6 కొంతమంది స్తెఫనుతో వాదనకు దిగారు. అయితే “స్తెఫను తెలివితో, పవిత్రశక్తితో మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్లు అతని ముందు నిలవలేకపోయారు.”a దాంతో వాళ్లకు కోపమొచ్చి, ఏ తప్పూ చేయని ఈ యేసు శిష్యుని మీద అబద్ధ ఆరోపణలు చెప్పమని “కొంతమందిని రహస్యంగా ఉసిగొల్పారు.” వాళ్లు ప్రజల్ని, పెద్దల్ని, శాస్త్రుల్ని కూడా ‘రెచ్చగొట్టడంతో,’ ఆయన్ని బలవంతంగా లాక్కొచ్చి మహాసభ ముందు నిలబెట్టారు. (అపొ. 6:9-12) వ్యతిరేకులు ఆయన మీద రెండు ఆరోపణలు చేశారు. ఒకటి, ఆయన దేవుణ్ణి దూషిస్తున్నాడు. రెండు, మోషేను దూషిస్తున్నాడు. ఎలా?
7 స్తెఫను యెరూషలేములో ఉన్న “దేవుని ఆలయానికి” వ్యతిరేకంగా మాట్లాడాడని, అలా ఆయన ఏకంగా దేవుణ్ణే దూషించాడని వ్యతిరేకులు అబద్ధ ఆరోపణ చేశారు. (అపొ. 6:13) అంతేకాదు స్తెఫను మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మోషే ఇచ్చిన సంప్రదాయాల్ని మార్చేస్తున్నాడని, అలా ఏకంగా మోషేనే దూషిస్తున్నాడని నింద వేశారు. అవి చాలా తీవ్రమైన ఆరోపణలు! ఎందుకంటే ఆలయాన్ని గానీ, మోషే ధర్మశాస్త్రాన్ని గానీ, దానికి చేర్చిన ఇతర నియమాల్ని, సంప్రదాయాల్ని గానీ ఎవరైనా ఏమైనా అంటే యూదులు అస్సలు ఊరుకునేవాళ్లు కాదు. ఒకవిధంగా, స్తెఫను ప్రమాదకరమైనవాడు అని, ఆయనకు మరణశిక్ష విధించాలి అని ఆ వ్యతిరేకులు అంటున్నారు!
8 బాధాకరమైన విషయం ఏంటంటే, మతనాయకులు ఇప్పుడు కూడా దేవుని సేవకుల్ని ఇబ్బందుల్లోకి నెట్టడానికి అలాంటి పన్నాగాల్నే ఉపయోగిస్తున్నారు. ఈ రోజుల్లో యెహోవాసాక్షుల మీదికి హింసను తీసుకురావడానికి కొంతమంది మతనాయకులు ప్రభుత్వాల్ని ఉసిగొల్పుతున్నారు. ఎవరైనా మనమీద అబద్ధ ఆరోపణలు చేసినప్పుడు, మనం ఏం చేయాలి? దానికి జవాబు, స్తెఫను ఉదాహరణ నుండి నేర్చుకోవచ్చు.
“మహిమగల దేవుడి” గురించి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు (అపొ. 7:1-53)
9, 10. స్తెఫను వాదన గురించి కొంతమంది ఏమని విమర్శిస్తారు? మనం ఏం గుర్తుచేసుకోవాలి?
9 తనమీద అబద్ధ ఆరోపణలు చేస్తున్నా, స్తెఫను ముఖం దేవదూత ముఖంలా ప్రశాంతంగా ఉందని మనం చూశాం. ఇప్పుడు కయప స్తెఫను వైపు తిరిగి, “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు. (అపొ. 7:1) దాంతో స్తెఫనుకు మాట్లాడే అవకాశం వచ్చింది. ఆయన తన వాదనను ధైర్యంగా వినిపించాడు!
10 స్తెఫను తన వాదనను వినిపిస్తూ చాలా విషయాలు చెప్పాడు గానీ, ఆయన మీద వేసిన ఆరోపణలకు మాత్రం జవాబు ఇవ్వలేదని కొంతమంది విమర్శిస్తారు. కానీ నిజం చెప్పాలంటే, మంచివార్త విషయంలో మనల్ని ప్రశ్నించే ప్రతీ ఒక్కరికి ఎలా ‘జవాబు ఇవ్వాలో’ స్తెఫను చాలా చక్కగా చూపించాడు. (1 పేతు. 3:15) స్తెఫను మీద చేసిన ఆరోపణల్ని ఒకసారి గుర్తుచేసుకోండి: ఆలయానికి వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా దేవుణ్ణి దూషించాడని, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా మోషేను దూషించాడని ఆరోపించారు. ఆ ఆరోపణలకు జవాబుగా, స్తెఫను తన వాదనను వినిపిస్తూ ఇశ్రాయేలీయుల చరిత్రలోని మూడు కాలాల్ని వివరించాడు. అందులో కొన్ని విషయాల్ని చాలా నేర్పుగా, జాగ్రత్తగా చెప్పాడు. ఇప్పుడు ఆ మూడు కాలాల్లో ఒక్కోదాన్ని పరిశీలిద్దాం.
11, 12. (ఎ) అబ్రాహాము గురించి మాట్లాడుతూ, స్తెఫను తన వాదనను ఎలా చక్కగా వినిపించాడు? (బి) స్తెఫను యోసేపు గురించి ఎందుకు మాట్లాడాడు?
11 పూర్వీకుల కాలం. (అపొ. 7:1-16) స్తెఫను అబ్రాహాము గురించి మాట్లాడుతూ తన వాదన మొదలుపెట్టాడు. అబ్రాహాము చూపించిన గొప్ప విశ్వాసాన్ని బట్టి యూదులు ఆయన్ని ఎంతో గౌరవించేవాళ్లు. యూదులతో పాటు తను కూడా అంగీకరించే ఒక ముఖ్యమైన విషయంతో స్తెఫను తన వాదన మొదలుపెట్టాడు. “మహిమగల దేవుడు” అబ్రాహాముకు మొదట్లో మెసొపొతమియలో కనిపించాడు అనే విషయాన్ని స్తెఫను నొక్కిచెప్పాడు. (అపొ. 7:2) నిజానికి, అబ్రాహాము వాగ్దాన దేశంలో పరదేశిగా ఉన్నాడు. అబ్రాహాము కాలంలో ఆలయం గానీ, ధర్మశాస్త్రం గానీ లేవు. ఆ రెండూ లేకపోయినా, అబ్రాహాము దేవునికి నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి, అవి ఉంటేనే దేవునికి నమ్మకంగా ఉండగలమని ఎవరైనా అనగలరా?
12 అబ్రాహాము వంశస్థుడైన యోసేపును కూడా యూదులు ఎంతో గౌరవించేవాళ్లు. అయితే, యోసేపు అన్నలే అంటే ఇశ్రాయేలు గోత్రాలకు మూలమైన వాళ్లే, నీతిమంతుడైన యోసేపును హింసించి దాసునిగా అమ్మేశారని స్తెఫను గుర్తుచేశాడు. కానీ దేవుడు, యోసేపును ఉపయోగించే ఇశ్రాయేలీయుల్ని కరువు నుండి కాపాడాడు. యేసుక్రీస్తు జీవితానికి, యోసేపు జీవితానికి చాలా పోలికలు ఉన్నాయని స్తెఫనుకు తెలుసు. కానీ, వాటి గురించి చెప్తే యూదులు ఇక తన వాదన వినరని స్తెఫను వాటిని చెప్పలేదు.
13. మోషే గురించి స్తెఫను చెప్పిన మాటలు ఆయన మీద వేసిన ఆరోపణకు ఎలా జవాబు ఇచ్చాయి? స్తెఫను మెల్లమెల్లగా ఏ ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశాడు?
13 మోషే కాలం. (అపొ. 7:17-43) స్తెఫను తెలివిగా, మోషే గురించి ఎక్కువగా మాట్లాడాడు. ఎందుకంటే, మహాసభ సభ్యుల్లో ఎక్కువ శాతం మంది సద్దూకయ్యులు. వాళ్లు మోషే రాసిన పుస్తకాల్ని తప్ప, మిగతా బైబిలు పుస్తకాల్ని నమ్మేవాళ్లు కాదు. స్తెఫను మోషేను దూషించాడు అనే రెండో ఆరోపణను గుర్తుచేసుకోండి. స్తెఫను చెప్పిన మాటలు ఆ ఆరోపణకు సూటిగా జవాబు ఇచ్చాయి: మోషే మీద, ధర్మశాస్త్రం మీద ఆయనకు ఎంత గౌరవం ఉందో నిరూపించాయి. (అపొ. 7:38) మోషే కూడా తన సొంత ప్రజల నుండే వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. మోషే ఇశ్రాయేలీయుల్ని కాపాడాలనుకున్నాడు కానీ, ఆయనకు 40 ఏళ్లు ఉన్నప్పుడు వాళ్లు ఆయన్ని వద్దనుకున్నారు. మళ్లీ 40 కంటే ఎక్కువ ఏళ్ల తర్వాత, వాళ్లు ఆయన నాయకత్వాన్ని పదేపదే ప్రశ్నించారు.b అలా స్తెఫను మెల్లమెల్లగా ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశాడు. అదేంటంటే, దేవుని ప్రజలు యెహోవా నియమించిన వాళ్లను పదేపదే వ్యతిరేకించారు.
14. మోషే గురించి మాట్లాడుతూ స్తెఫను ఇంకా ఏ విషయాన్ని స్పష్టం చేశాడు?
14 ‘దేవుడు ఇశ్రాయేలీయుల్లో నుండి నాలాంటి ఇంకో ప్రవక్తను రప్పిస్తాడు’ అని మోషే చెప్పిన మాటల్ని స్తెఫను గుర్తుచేశాడు. ఆ ప్రవక్త ఎవరు? ప్రజలు ఆయన్ని అంగీకరిస్తారా? ఆ ప్రశ్నలకు జవాబుల్ని, స్తెఫను ముగింపులో చెప్పాలనుకున్నాడు. ముందుగా ఆయన ఇంకో ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశాడు: మండుతున్న పొద దగ్గర యెహోవా మోషేతో మాట్లాడినప్పుడు, దేవుడు ఏ ప్రాంతాన్నైనా పవిత్రం చేయగలడని మోషే తెలుసుకున్నాడు. మరి అలాంటప్పుడు, యెహోవా ఆరాధన ఒక్క భవనానికే అంటే యెరూషలేములో ఉన్న ఆలయానికే పరిమితం అయిపోతుందా? దాని గురించి ఇప్పుడు చూద్దాం.
15, 16. (ఎ) గుడారం గురించి స్తెఫను ఎందుకు మాట్లాడాడు? (బి) సొలొమోను కట్టించిన ఆలయం గురించి స్తెఫను ఎందుకు మాట్లాడాడు?
15 గుడారం, ఆలయం. (అపొ. 7:44-50) యెరూషలేములో ఆలయం కట్టడానికి ముందు, దేవుడు మోషే ద్వారా ఆరాధన కోసం ఒక గుడారాన్ని కట్టించాడని స్తెఫను చెప్పాడు. దాన్ని ఒకచోట నుండి ఇంకోచోటికి మార్చేవాళ్లు. స్వయంగా మోషేనే గుడారంలో ఆరాధించినప్పుడు, ఆ గుడారం ఆలయం కంటే తక్కువని ఎవరైనా అనగలరా?
16 యెరూషలేములో ఆలయం కట్టిన తర్వాత, సొలొమోను ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేశాడు. దాని గురించి స్తెఫను ఇలా చెప్పాడు: “చేతులతో చేసిన మందిరాల్లో సర్వోన్నతుడు నివసించడు.” (అపొ. 7:48; 2 దిన. 6:18) యెహోవా తను అనుకున్నది చేయడానికి ఆలయాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఆలయం లేకపోయినా, ఆయన తను అనుకున్నదాన్ని చేయగలడు. మరి అలాంటప్పుడు మనుషులు కట్టిన ఒక భవనంలో, అంటే ఆలయంలో మాత్రమే యెహోవాను ఆరాధించగలమని ఎందుకు అనుకోవాలి? స్తెఫను యెషయా పుస్తకంలోని మాటల్ని ఉపయోగిస్తూ, తన వాదనను ఇలా ముగించాడు: “యెహోవా ఇలా అంటున్నాడు: ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కోసం ఎలాంటి మందిరం కడతారు? నా విశ్రాంతి స్థలం ఎక్కడ? వీటన్నిటినీ చేసింది నా చేతులే కదా?”—అపొ. 7:49, 50; యెష. 66:1, 2.
17. (ఎ) తనమీద ఆరోపణలు చేసినవాళ్ల తప్పుడు ఆలోచనల్ని స్తెఫను ఎలా బయటపెట్టాడు? (బి) స్తెఫను ఏ తప్పూ చేయలేదని ఆయన వాదన ఎలా నిరూపించింది?
17 స్తెఫను వాదనను పరిశీలిస్తే, తనమీద ఆరోపణలు చేసినవాళ్ల తప్పుడు ఆలోచనల్ని నేర్పుగా బయటపెట్టాడని అర్థమౌతుంది. పరిస్థితులు గానీ, కట్టుబాట్లు గానీ యెహోవా అనుకున్నది జరగకుండా ఆపలేవు; తను అనుకున్నదాన్ని యెహోవా ఏవిధంగానైనా చేస్తాడు. స్తెఫను మాటల్ని వింటున్నవాళ్లు అందమైన యెరూషలేము ఆలయాన్ని, ధర్మశాస్త్రం చుట్టూ అల్లుకున్న సంప్రదాయాల్ని చూసి తెగ మురిసిపోతున్నారు. కానీ ధర్మశాస్త్రాన్ని అసలు యెహోవా ఎందుకు ఇచ్చాడో, ఆలయాన్ని ఎందుకు కట్టించాడో అర్థం చేసుకోలేకపోతున్నారు! ఒకవిధంగా, స్తెఫను ఈ ముఖ్యమైన ప్రశ్నను వాళ్ల ముందు ఉంచాడు: ధర్మశాస్త్రం పట్ల, ఆలయం పట్ల గౌరవం చూపించడానికి అత్యుత్తమ మార్గం, యెహోవాకు లోబడడం కాదా? స్తెఫను ఏ తప్పూ చేయలేదని ఆయన వాదన నిరూపించింది. ఎందుకంటే, యెహోవాకు లోబడడానికి ఏం చేయాలో స్తెఫను అదే చేశాడు.
18. స్తెఫనులాగే మనం కూడా ఏం చేయవచ్చు?
18 స్తెఫను వాదన నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? ఆయనకు లేఖనాల మీద మంచి పట్టు ఉందని ఆయన మాటల్లో మనకు అర్థమౌతుంది. ఆయనలాగే మనం కూడా బైబిల్ని శ్రద్ధగా చదివితే, “సత్యవాక్యాన్ని సరిగ్గా” ఉపయోగించగలుగుతాం. (2 తిమో. 2:15) స్తెఫను నుండి మనం దయగా, నేర్పుగా మాట్లాడడం కూడా నేర్చుకోవచ్చు. ఆయన చెప్పేది వినేవాళ్లకు ఆయన మీద పీకల దాకా కోపం ఉంది. అయినా స్తెఫను వీలైనంత వరకు వాళ్లు, ఆయన అంగీకరించే విషయాల్ని; అలాగే వాళ్లు ఎక్కువగా గౌరవించే విషయాల్ని మాట్లాడాడు. ఆయన్ని విచారిస్తున్న వాళ్లను గౌరవిస్తూ, “తండ్రులారా” అని పిలిచాడు. (అపొ. 7:2) మనం కూడా దేవుని వాక్యంలోని సత్యాల్ని “సౌమ్యంగా, ప్రగాఢ గౌరవంతో” చెప్పాలి.—1 పేతు. 3:15.
19. స్తెఫను మహాసభ నాయకులకు యెహోవా తీర్పు సందేశాన్ని ధైర్యంగా ఎలా ప్రకటించాడు?
19 అయితే, ప్రజల్ని నొప్పించకూడదు అనే ఉద్దేశంతో మనం దేవుని వాక్యంలోని సత్యాల్ని చెప్పడం మానేయం, యెహోవా తీర్పు సందేశాల్ని నీరుగార్చం. ఈ విషయంలో స్తెఫను మనకు మంచి ఆదర్శం ఉంచాడు. అన్ని రుజువులు చూపించినా, మొండివాళ్లయిన ఆ మహాసభ నాయకులకు చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదని స్తెఫను అర్థం చేసుకున్నాడు. కాబట్టి, స్తెఫను పవిత్రశక్తి సహాయంతో తన వాదనను ముగిస్తూ యోసేపును, మోషేను, ప్రవక్తలందర్నీ ఎదిరించిన తమ పూర్వీకుల్లాగే మహాసభ నాయకులు ఉన్నారని ధైర్యంగా చెప్పాడు. (అపొ. 7:51-53) నిజానికి మోషే, అలాగే ప్రవక్తలందరూ ఎవరి గురించైతే ప్రకటించారో, ఆ మెస్సీయను ఈ మహాసభ నాయకులు చంపేశారు. అలా, ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తామని చెప్పుకునే మహాసభ నాయకులు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు!
“యేసు ప్రభువా, నా ప్రాణాన్ని నీకు అప్పగిస్తున్నాను” (అపొ. 7:54–8:3)
“ఆ మాటలు విన్నప్పుడు వాళ్లకు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో వాళ్లు స్తెఫనును చూస్తూ పళ్లు కొరకడం మొదలుపెట్టారు.”—అపొస్తలుల కార్యాలు 7:54
20, 21. స్తెఫను మాటలు విన్న తర్వాత, మహాసభ నాయకులు ఏం చేశారు? యెహోవా స్తెఫనుకు ఎలా బలాన్ని ఇచ్చాడు?
20 స్తెఫను చెప్పినవి తిరుగులేని నిజాలు. వాటికి జవాబు ఎలా ఇవ్వాలో మహాసభ నాయకులకు అర్థం కాలేదు. దాంతో వాళ్ల కోపం కట్టలు తెంచుకుని, స్తెఫనును చూసి పళ్లు కొరకడం మొదలుపెట్టారు. ఇక వాళ్లు తనమీద ఏమాత్రం జాలి చూపించరని స్తెఫనుకు అర్థమైపోయి ఉంటుంది. ప్రభువైన యేసునే వాళ్లు విడిచిపెట్టలేదు, ఇక ఆయన్ని ఎలా విడిచిపెడతారు?
21 ఇప్పుడు జరగబోయే దాన్ని ఎదుర్కోవడానికి స్తెఫనుకు ధైర్యం చాలా అవసరం. అందుకే యెహోవా కనికరంతో ఆయనకు ఒక దర్శనం చూపించి, ఆయనకు కావాల్సిన ప్రోత్సాహాన్ని, బలాన్ని ఇచ్చాడు. స్తెఫను ఆ దర్శనంలో దేవుని మహిమను, దేవుని కుడిపక్కన యేసు నిలబడి ఉండడాన్ని చూశాడు! స్తెఫను ఆ దర్శనాన్ని వివరిస్తున్నప్పుడు, మహాసభ నాయకులు తమ చెవులు మూసుకున్నారు. ఎందుకు? ఇదివరకు యేసు ఇదే మహాసభ ముందు తాను మెస్సీయనని, త్వరలో తన తండ్రి కుడిపక్కన కూర్చుంటానని చెప్పాడు. (మార్కు 14:62) యేసు చెప్పింది అక్షరాలా నిజమని స్తెఫనుకు వచ్చిన దర్శనం నిరూపించింది. నిజానికి ఆ మహాసభ మెస్సీయకు ద్రోహం చేసి, ఆయన్ని హత్య చేసింది! ఇప్పుడేమో వాళ్లందరూ ఒక్కసారిగా స్తెఫను మీదికి వచ్చి, ఆయన్ని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు.c
22, 23. తన ప్రభువైన యేసులాగే స్తెఫను ఎలా చనిపోయాడు? స్తెఫనులాగే నేడు క్రైస్తవులు యెహోవా మీద ఎందుకు నమ్మకం ఉంచవచ్చు?
22 తన ప్రభువైన యేసులాగే స్తెఫను కూడా, చనిపోతున్నప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు, యెహోవాపై పూర్తి నమ్మకం ఉంచాడు, తనను చంపుతున్న వాళ్లను క్షమించాడు. ఆయన ఇలా అన్నాడు: “యేసు ప్రభువా, నా ప్రాణాన్ని నీకు అప్పగిస్తున్నాను.” బహుశా దర్శనంలో యెహోవా పక్కన యేసు కనిపిస్తున్నాడు కాబట్టి, స్తెఫను ఆ మాట అని ఉంటాడు. “చనిపోయినవాళ్లను బ్రతికించేది, జీవాన్ని ఇచ్చేది నేనే” అని యేసు చెప్పిన మాటలు కూడా ఆయనకు తెలిసే ఉంటాయి. (యోహా. 11:25) చివరికి, స్తెఫను దేవునికి బిగ్గరగా ఇలా ప్రార్థించాడు: “యెహోవా, ఈ పాపానికి వాళ్లను బాధ్యులుగా ఎంచకు.” ఆ మాట అన్నాక, స్తెఫను చనిపోయాడు.—అపొ. 7:59, 60.
23 అలా స్తెఫను, క్రైస్తవుల్లో మొట్టమొదటి హతసాక్షి అయ్యాడు. (“స్తెఫను—సాక్షా లేక హతసాక్షా?” అనే బాక్సు చూడండి.) అయితే, ఆయనే చివరివాడు కాదు. ఈ రోజుల్లో కూడా మతోన్మాదులు, రాజకీయ నాయకులు, క్రూరమైన వ్యతిరేకులు కొంతమంది నమ్మకమైన యెహోవా సేవకుల్ని చంపేస్తున్నారు. అయినాసరే, స్తెఫనులాగే మనం యెహోవా మీద నమ్మకం ఉంచవచ్చు. ఎందుకంటే, తండ్రి ఇచ్చిన గొప్ప అధికారంతో యేసు ఇప్పుడు రాజుగా పరిపాలిస్తున్నాడు. తన నమ్మకమైన అనుచరుల్ని తిరిగి బ్రతికించకుండా ఆయన్ని ఏదీ ఆపలేదు.—యోహా. 5:28, 29.
24. స్తెఫను హత్యకు సౌలు ఎలా మద్దతిచ్చాడు? స్తెఫను మరణం చాలామంది మీద ఎలా ఒక చెరగని ముద్ర వేసింది?
24 ఇదంతా సౌలు అనే యువకుడు గమనిస్తున్నాడు. అతను స్తెఫను హత్యకు మద్దతు తెలిపాడు, చివరికి ఆయన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నవాళ్ల పైవస్త్రాలకు కాపలాగా కూడా ఉన్నాడు. తర్వాత కొంతకాలానికే, అతను యేసు శిష్యుల్ని క్రూరంగా హింసించడం మొదలుపెట్టాడు. కానీ స్తెఫను మరణం చాలామంది మీద చెరగని ముద్ర వేసింది. ఆయన్ని చూసి చాలామంది క్రైస్తవులు, చనిపోయేంత వరకు నమ్మకంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు తర్వాతి రోజుల్లో, స్తెఫను హత్యకు మద్దతు తెలిపినందుకు సౌలు [పౌలు అని కూడా పిలవబడ్డాడు] ఎంతో బాధపడ్డాడు. (అపొ. 22:20) స్తెఫనును చంపడంలో సహాయం చేసిన సౌలు తన తప్పు తెలుసుకుని ఇలా అన్నాడు: “ఒకప్పుడు నేను దైవదూషణ చేసేవాణ్ణి, హింసించేవాణ్ణి, తలబిరుసుగా ప్రవర్తించేవాణ్ణి.” (1 తిమో. 1:13) స్తెఫనును, అలాగే ఆ రోజు ఆయన ధైర్యంగా చెప్పిన మాటల్ని పౌలు ఎప్పుడూ మర్చిపోలేదు అని చెప్పవచ్చు. నిజానికి, స్తెఫను తన వాదనలో చెప్పిన కొన్ని విషయాల్ని పౌలు తన ప్రసంగాల్లో, ఉత్తరాల్లో ఉపయోగించాడు. (అపొ. 7:48; 17:24; హెబ్రీ. 9:24) ‘దేవుని అనుగ్రహంతో, శక్తితో నిండిపోయిన’ స్తెఫను చూపించిన లాంటి విశ్వాసాన్ని, ధైర్యాన్ని చూపించడం పౌలు నేర్చుకున్నాడు. మరి మన సంగతేంటి?
a ఆ వ్యతిరేకుల్లో కొంతమంది “స్వతంత్రుల” లేదా “స్వతంత్రులుగా చేయబడినవాళ్ల” సమాజమందిరానికి చెందినవాళ్లు. వాళ్లు బహుశా రోమన్ల చెర నుండి విడుదలైన యూదులు అయ్యుంటారు, లేదా బానిసత్వం నుండి విడుదలై యూదా మతంలోకి మారిన అన్యజనులు అయ్యుంటారు. వాళ్లలో కొంతమంది కిలికియకు చెందిన వాళ్లు. తార్సుకు చెందిన సౌలు కూడా ఆ ప్రాంతం వాడే. అయితే, స్తెఫనుతో వాదనకు దిగి ఆయన ముందు నిలవలేకపోయిన కిలికియ వాళ్లలో సౌలు కూడా ఉన్నాడా లేదా అన్నది బైబిలు చెప్పట్లేదు.
b స్తెఫను చెప్పిన మాటల్లో కొన్ని విషయాలు బైబిల్లో ఇంకెక్కడా కనిపించవు. ఉదాహరణకు మోషే ఐగుప్తులో ఏమేం నేర్చుకున్నాడు, ఐగుప్తు నుండి పారిపోయినప్పుడు ఆయన వయసు ఎంత, మిద్యానులో ఆయన ఎంతకాలం ఉన్నాడు లాంటి వాస్తవాలు.
c రోమన్ల చట్టం ప్రకారం, మరణశిక్ష వేసే అధికారం మహాసభకు బహుశా లేదనే చెప్పవచ్చు. (యోహా. 18:31) ఏదేమైనా, స్తెఫను మరణం న్యాయపరమైన శిక్ష కాదుగానీ, ఒక గుంపు కోపంతో చేసిన హత్య అని తెలుస్తుంది.