ఫిలిప్పు—ఉత్సాహవంతుడైన సువార్తికుడు
అనుకరణయోగ్యమైన విశ్వాసంగల స్త్రీపురుషుల అనేకానేక వృత్తాంతాలు లేఖనాల్లో ఉన్నాయి. మొదటి శతాబ్దపు క్రైస్తవ మిషనరీ అయిన ఫిలిప్పును పరిశీలించండి. ఆయన అపొస్తలుడు కాదు, అయినప్పటికీ, రాజ్య సందేశాన్ని వ్యాప్తి చేయడంలో ఆయన శక్తివంతంగా ఉపయోగించుకోబడ్డాడు. వాస్తవానికి, ఫిలిప్పు “సువార్తికుడు” అని పేరుపొందాడు. (అపొస్తలుల కార్యములు 21:8) ఫిలిప్పు ఎందుకా పేరును పొందాడు? ఆయన నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత వెంటనే ఫిలిప్పు పేరు బైబిల్లో కనిపిస్తుంది. ఆ సమయంలో, అనుదిన ఆహార పంపిణీ విషయంలో తమ విధవరాండ్రు చిన్నచూపు చూడబడుతున్నారని ఆరోపిస్తూ గ్రీకు భాష మాట్లాడే యూదులు, హెబ్రీ భాష మాట్లాడే యూదులపై సణగడం మొదలుపెట్టారు. ఆ విషయాన్ని పరిశీలించడానికి, అపొస్తలులు “మంచి పేరు పొందిన యేడుగురు మనుష్యులను” నియమించారు. అలా ఎంపిక చేయబడినవారిలో ఫిలిప్పు ఉన్నాడు.—అపొస్తలుల కార్యములు 6:1-6.
ఈ ఏడుగురు మనుష్యులు “మంచి పేరు పొందిన” వారు. వారు నియమించబడే సమయానికే వారు ఆచరణాత్మకమైన ఆలోచనా సామర్థ్యంగల ఆధ్యాత్మిక పురుషులుగా పేరు పొందారు. నేడు క్రైస్తవ పైవిచారణకర్తలుగా సేవ చేసేవారి విషయంలో కూడా ఇది వాస్తవమైయుంది. అలాంటి పురుషులు తొందరపాటుతో నియమించబడరు. (1 తిమోతి 5:22) వారు “సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందినవా[రై]” ఉండాలి, వారు సహేతుకమైనవారనీ, స్వస్థబుద్ధిగలవారనీ తోటి క్రైస్తవులకు తెలిసివుండాలి.—1 తిమోతి 3:2, 3, 7; ఫిలిప్పీయులు 4:5.
ఫిలిప్పు యెరూషలేములోని తన నియామకం పట్ల ఎంతో శ్రద్ధ వహించాడని స్పష్టమౌతుంది. అయితే, త్వరలోనే విపరీతమైన ఒక హింసాజ్వాల చెలరేగి క్రీస్తు అనుచరులను చెదరగొట్టేసింది. ఇతరుల్లాగే, ఫిలిప్పు నగరాన్ని వదలి వెళ్లిపోయాడు, కాని ఆయన పరిచర్య మాత్రం ముగిసిపోలేదు. త్వరలోనే, ఆయన తన క్రొత్త ప్రాంతమైన సమరయలో ప్రకటించడంలో బిజీ అయిపోయాడు.—అపొస్తలుల కార్యములు 8:1-5.
క్రొత్త ప్రాంతాల్లో ప్రకటనా పనిని
తన శిష్యులు “యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును” ప్రకటిస్తారని యేసు ప్రవచించాడు. (అపొస్తలుల కార్యములు 1:8) సమరయలో ప్రకటిస్తూ, ఫిలిప్పు ఆ మాటల నెరవేర్పులో భాగం వహించాడు. యూదులకు సమరయులపట్ల అసలు గౌరవం ఉండేది కాదు. కాని ఫిలిప్పు ఈ ప్రజల గురించి ముందే ఒక అభిప్రాయానికి రాలేదు, ఆయన చూపించిన నిష్పక్షపాత వైఖరి ఆశీర్వదించబడింది. వాస్తవానికి, మునుపు గారడీ చేసేవాడైన సీమోను అనే పేరుగల వ్యక్తితో సహా అనేకమంది సమరయులు బాప్తిస్మం పొందారు.—అపొస్తలుల కార్యములు 8:6-13.
కొంతకాలానికి, యెరూషలేము నుండి గాజాకు వెళ్లే అరణ్య మార్గానికి వెళ్లమని యెహోవా దూత ఫిలిప్పుకు నిర్దేశించాడు. అక్కడ, యెషయా ప్రవచనంలో నుండి బిగ్గరగా చదువుతున్న ఐతియోపీయుడైన అధికారి కూర్చుని వెళ్తున్న రథం ఫిలిప్పుకు కనిపించింది. ఫిలిప్పు రథం వెంబడి పరుగెత్తి సంభాషణ ప్రారంభించాడు. ఐతియోపీయుడు దేవుని గురించి లేఖనాల గురించి కొంత జ్ఞానం ఉన్న మతప్రవిష్టుడే అయినప్పటికీ, తాను చదువుతున్న దాన్ని అర్థం చేసుకోవడానికి తనకు సహాయం అవసరమని వినయంగా అంగీకరించాడు. కాబట్టి, రథం ఎక్కి తనతో కూర్చోమని ఆయన ఫిలిప్పును ఆహ్వానించాడు. సాక్ష్యం ఇవ్వబడిన తర్వాత, వాళ్లు నీళ్లున్న ప్రదేశానికి వచ్చారు. “ఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని” ఐతియోపీయుడు అడిగాడు. ఫిలిప్పు వెంటనే అతనికి బాప్తిస్మం ఇచ్చాడు, ఐతియోపీయుడు ఆనందంగా తన మార్గాన వెళ్లిపోయాడు. బహుశ ఈ క్రొత్త శిష్యుడు తన స్వదేశంలో సువార్తను వ్యాప్తి చేసివుంటాడు.—అపొస్తలుల కార్యములు 8:26-39.
సమరయులకు, ఐతియోపీయుడైన అధికారికి ఫిలిప్పు చేసిన పరిచర్య నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఫలానా దేశానికి, జాతికి, లేక సాంఘిక హోదాకు చెందిన వ్యక్తులు సువార్త విషయమై ఆసక్తి కల్గివుండరని మనం ఎన్నడూ తలంచకూడదు. బదులుగా, మనం రాజ్య సందేశాన్ని “అందరికి” ప్రకటించాలి. (1 కొరింథీయులు 9:19-23) అందరికీ ప్రకటించడం ద్వారా మనల్ని మనం అందుబాటులో ఉంచుకుంటే, ఈ దుష్ట విధానాంతం రాకముందు “సమస్త జనులను శిష్యులనుగా” చేసే పనిలో యెహోవా మనల్ని ఉపయోగించుకోల్గుతాడు.—మత్తయి 28:19, 20.
ఫిలిప్పుకు లభించిన ఇతర ఆధిక్యతలు
ఐతియోపీయుడైన అధికారికి ప్రకటించిన తర్వాత, ఫిలిప్పు అజోతులో సాక్ష్యమిచ్చి, “అక్కడనుండి కైసరయకు వచ్చువరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను.” (అపొస్తలుల కార్యములు 8:40) మొదటి శతాబ్దంలో, ఈ రెండు నగరాల్లో అన్యులు ఎక్కువగానే ఉండేవారు. ఉత్తరంగా కైసరయకు వెళ్తూ, ఫిలిప్పు లుద్ద మరియు యొప్పే వంటి ప్రముఖ యూదా కేంద్రాల్లో ప్రకటించి ఉంటాడు. బహుశా అందుకే ఆ తర్వాత శిష్యులను ఈ ప్రాంతాల్లో కనుగొనడం జరిగింది.—అపొస్తలుల కార్యములు 9:32-43.
దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఫిలిప్పు గురించి చివరి సారిగా ప్రస్తావించబడింది. తన మూడవ మిషనరీ యాత్ర ముగింపులో, పౌలు తొలెమాయిలో దిగాడు. “మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి, యేడుగురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి” అని పౌలు సహ ప్రయాణికుడైన లూకా చెప్తున్నాడు. ఈ సమయానికల్లా, ఫిలిప్పుకు, “కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు” ఉన్నారు, “వారు ప్రవచించువారు.”—అపొస్తలుల కార్యములు 21:8, 9.
ఫిలిప్పు కైసరయలో స్థిరపడ్డాడని స్పష్టమౌతుంది. అయినా ఆయన తన మిషనరీ స్ఫూర్తిని కోల్పోలేదు, ఎందుకంటే లూకా ఆయనను, “సువార్తికుడు” అని పిలుస్తున్నాడు. తరచూ ఈ పదం, పనిచేయని ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి తన గృహాన్ని వదిలి వెళ్లే వ్యక్తిని సూచిస్తుంది. ప్రవచించే నలుగురు కుమార్తెలు ఫిలిప్పుకు ఉన్నారన్న వాస్తవం, వారు ఉత్సాహవంతుడైన తమ తండ్రి అడుగుజాడలను అనుసరించారన్న విషయాన్ని సూచిస్తుంది.
తమ పిల్లలే తమ అత్యంత ప్రాముఖ్యమైన శిష్యులని ప్రస్తుత దిన క్రైస్తవ తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. అలాంటి తల్లిదండ్రులు కుటుంబ బాధ్యతలను బట్టి కొన్ని దైవపరిపాలనా ఆధిక్యతలను వదులుకోవలసి వచ్చినప్పటికీ, ఫిలిప్పు వలే వాళ్లు హృదయపూర్వకంగా దేవుని సేవచేసే సేవకులుగా, మాదిరికరమైన తల్లిదండ్రులుగా ఉండవచ్చు.—ఎఫెసీయులు 6:4.
పౌలు, ఆయన సహవాసులు చేసిన సందర్శనం, ఆతిథ్యాన్నివ్వడానికి ఫిలిప్పు కుటుంబానికి ఒక చక్కని అవకాశాన్నిచ్చింది. వాళ్లు పరస్పరం ఎంతగా ప్రోత్సహించుకుని ఉంటారో ఊహించండి ! బహుశ ఈ సందర్భంలోనే లూకా ఫిలిప్పు కార్యకలాపాలను గురించిన వివరాలను సేకరించి, ఆ తర్వాత అపొస్తలుల కార్యములు 6, 8 అధ్యాయాలలో ఇమిడ్చి ఉంటాడు.
రాజ్యాసక్తులను వృద్ధి చేయడానికి యెహోవా దేవుడు ఫిలిప్పును విస్తృతంగా ఉపయోగించుకున్నాడు. ఫిలిప్పుకున్న ఆసక్తి, క్రొత్త ప్రాంతాల్లో సువార్తను వ్యాప్తి చేయడానికీ, తన ఇంట్లో ఆరోగ్యదాయకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందింపజేయడానికీ ఆయనకు దోహదపడింది. అలాంటి ఆధిక్యతలనూ, ఆశీర్వాదాలనూ అనుభవించాలని మీరూ అపేక్షిస్తున్నారా? అయితే, సువార్తికుడైన ఫిలిప్పు ప్రదర్శించిన లక్షణాలను మీరు అనుకరించడం మంచిది.