విద్యాభ్యాసాన్ని దాని స్థానంలో ఉంచుట
నైపుణ్యం గల కళాకారునికి తన కళను కంటికింపుగా ఎలా సృష్టించాలో బాగా తెలుసు. మధ్యభాగాన, లోపలి భాగాన ఉండేదానికన్నా పైకి కనిపించే దాని గురించిన వివరాలకే ఎక్కువ ప్రాముఖ్యత యివ్వబడుతుంది. మన జీవితాల్లో ప్రాముఖ్యమైన వాటి విషయంలో కూడా అంతే. వాటిలో కొన్ని మిగిలిన వాటికన్నా ఎక్కువ ప్రాధాన్యతను పొందుతాయి.
“తమ ఆత్మీయ అవసరతలందు శ్రద్ధగలవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది,” అని యేసుక్రీస్తు చెప్పాడు. (మత్తయి 5:3) కాబట్టి ఆత్మీయ విషయాలను మరింత ప్రాముఖ్యమైనవిగా ఎంచాలి. దానికి విరుద్ధంగా భౌతిక వస్తువులకు తక్కువ ప్రాధాన్యతనివ్వాలి.
మిగిలిన విషయాల మాటకొస్తే, విద్యాభ్యాసానికి ఎంత ప్రాధాన్యత ఉంది? క్రైస్తవునికి అది నిరర్థకమైనది కాదు. అపొస్తలుడైన పౌలు అప్పజెప్పిన లేఖనాధారిత బాధ్యతను నెరవేర్చడానికి, కొంత మేరకు చదువుకోవడం అవసరమే: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.” (1 తిమోతి 5:8) అంతేకాక, ‘తాను ఆజ్ఞాపించిన వాటినన్నింటిని గైకొనవలెనని బోధిస్తూ’ శిష్యులను తయారు చేయాలని యేసు ఆజ్ఞాపించిన అనుచరులు, ‘జ్ఞానమును సంపాదించి,’ యితరులకు ఫలవంతంగా ఉపదేశించవలసిన అవసరముంది.—మత్తయి 28:19, 20; యోహాను 17:3; అపొస్తలుల కార్యములు 17:11; 1 తిమోతి 4:13.
అయినప్పటికీ, విద్యాభ్యాసాన్ని దాని స్థానంలో ఉంచాలి. పాండిత్య ప్రాబల్యముతో శోభించాలని, లేదా ఆకర్షణీయమైన డిగ్రీలను పొందాలనే ఉద్దేశంతో విద్యనభ్యసించకూడదు. విద్యకు అనవసరమైన ప్రాధాన్యతనివ్వడం నిరాశకు గురి చేస్తుంది. నిజమే, తాత్కాలికంగా వస్తుదాయకమైన ప్రయోజనాలను అది అందజేయవచ్చు. “నీవు నీ జ్ఞానముతోను తెలివితోను నైపుణ్యంతోను ప్రయాసపడి ఏదో ఒక పని చేస్తావు; అయితే దానికొరకు ప్రయాసపడని వానికి నీవు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసివస్తుంది;” అని జ్ఞానియైన సొలొమోను గ్రహించాడు.—ప్రసంగి 2:21. టుడేస్ ఇంగ్లీష్ వెర్షన్.
యెహోవాసాక్షులు విద్యను కేవలం అభ్యసించడంలో మాత్రమే కాక, దేవుని సేవలో తాము ఎక్కువగా చేయగలిగేందుకు, తమ కాళ్ళపై తాము నిలబడగలిగేందుకు చదువు మీద శ్రద్ధ చూపిస్తారు. తమ పరిచర్య లాభార్జన లేని పని కనుక, అనేకులు తమ జీవనం కొరకు ఉద్యోగంపై ఆధారపడవలసి ఉంది. ఇది ముఖ్యంగా, పయినీర్లని పిలువబడే, పూర్తికాల పరిచారకులైన యెహోవాసాక్షులకు సవాలు కాగలదు. ఒకవేళ వాళ్ళు వివాహితులైతే తమను, తమ కుటుంబాన్ని పోషించుకోడానికి కావలసినంత సంపాదిస్తూనే, విస్తృతపర్చిన తమ పరిచర్య పట్టిక ప్రకారం వారు చేస్తూ ఉండాలి.a—సామెతలు 10:4.
ఇమిడి ఉన్న అనేక విషయాలను సమాలోచించిన తరువాత కొంతమంది యెహోవాసాక్షులు అదనపు విద్యనభ్యసించడానికి తీర్మానించుకున్నారు. నిజమే, వాళ్ళు విద్యాభ్యాసాన్ని దాని స్థానంలో ఉంచవలసిన అవసరం ఉంది. ఇలా చేయడంలో వారికి ఏది సహాయం చేసింది? జాన్ అనే పేరు గల బ్రెజిల్ దేశ యౌవనస్థుడు యిలా అన్నాడు: “అనేక విషయాలు నాకు సహాయం చేశాయి, నేను రాత్రుల్లో చదువుకున్నప్పటికీ, క్రైస్తవ కూటాలను మానుకోలేదు. మొదట్లోనే, నా తోటి విద్యార్థులతో నేను యెహోవాసాక్షుల్లో ఒకడినని స్పష్టంగా చెప్పాను.”
బ్రెజిల్ దేశస్థుడైన ఎరిక్ కూడా పైచదువులకు వెళ్తూ, యితరులతో తన విశ్వాసాలను గూర్చి మాట్లాడడానికి లభించే అవకాశాలను ఉపయోగించుకున్నాడు. అతడు యిలా అంటున్నాడు: “నేను మా పాఠశాలను ప్రకటించే స్థలంగా పరిగణించాను. నేను ఎంతో మంది ఉపాధ్యాయులతోను, విద్యార్థులతోను బైబిలు పఠనాలు నిర్వహించగల్గాను, యిప్పుడు వారిలో ఐదుగురు బాప్తిస్మం తీసుకున్నారు, వారిలో యిద్దరు పెద్దలుగా సేవ చేస్తున్నారు.”
రిచర్డ్ డ్రాఫ్టింగ్‌లో డిగ్రీ సంపాదించేందుకు ఒక పూట క్లాసుల కొరకు, మళ్ళీ స్కూల్‌కి వెళ్ళాడు. “నా విద్యాభ్యాసం నాకు ఉద్యోగం సంపాదించి పెట్టింది, నన్ను, నా భార్యను పోషించుకునేందుకు సహాయం చేసింది. అయితే, అది ఒక అవకాశాన్ని కూడా తెరిచింది. త్వరగా రాజ్యమందిరాన్ని నిర్మించే ప్రాజెక్టులకు నేను వెళ్ళినప్పుడు, దాన్ని పర్యవేక్షిస్తున్నవారితో మాట్లాడినప్పుడు, అక్కడ డ్రాఫ్ట్స్‌మ్యాన్ అవసరముందని తెలుసుకున్నాను.b నా చదువు యిప్పుడు యీ నిర్మాణ పథకాల్లో చక్కగా ఉపయోగపడింది. అంతేకాక, నేను, నా భార్య ఎప్పటికైనా ప్రపంచ ప్రధాన కార్యాలయంలో లేదా యెహోవాసాక్షుల అంతర్జాతీయ నిర్మాణ పథకాల్లో సేవ చేయాలని కోరుకుంటున్నాము,” అని ఆయన అంటున్నారు.
అదే సమయంలో, యెహోవాసాక్షుల్లో అనేకులు అదనపు చదువు లేకుండానే, తమను తమ కుటుంబాన్ని పోషించాలనే సవాలును ఎదుర్కొన్నారు. “నేను వారంలో రెండు రోజులు యిండ్లలో పని చేసి, నన్ను నేను పోషించుకొనేదాన్ని విచిత్రమేమంటే, నేను యితరుల వద్ద పనిచేసినదానికన్నా ఎక్కువ డబ్బును ఒక్కో గంటకు సంపాదించేదాన్ని. కాని నా పనిని ఆదాయమిచ్చేదానిగానే దృష్టించాను. అది నన్ను పయినీరు సేవలో కొనసాగడానికి సహాయం చేసింది, నేను ఎన్నడూ విచారించలేదు,” అని మేరి వివరిస్తుంది.
స్టీవ్ కూడా యిలాగే భావిస్తున్నాడు. “నేను పయినీరింగ్ మొదలు పెట్టినప్పుడు, ‘నీకు పెళ్ళయి, కుటుంబమేర్పడినప్పుడు నువ్వేమి చేస్తావు? ఆర్థిక అవసరాలను తీర్చుకోగలవా?’ అని కొందరు నన్నడిగారు. చివరికది సంభవించినప్పుడు, అనేక రకాల పనులు చేసి, మీరూహించగల్గిన పనులన్నింటిలో నేను అనుభవాన్ని సంపాదించాను. ఇప్పుడు నాకు పోషించుకోవలసిన భార్య ఉంది, నేను పని చేస్తున్న ఏజెన్సీలోవున్న కాలేజీ పట్టభద్రులకన్నా, యిప్పుడు నేనే ఎక్కువ సంపాదిస్తున్నానని గ్రహించాను,” అని ఆయన అంటున్నారు.
అవిశ్వాసులైన తండ్రులు, మైనరులైన తమ పిల్లలు తప్పనిసరిగా అదనపు విద్యనభ్యసించాలని చెప్పివుండవచ్చు. వాళ్ళు అలా చేయడానికి లేఖనాధారితమైన అధికారం వారికుంది. అయినప్పటికీ, యిలాంటి సందర్భాల్లో, మత్తయి 6:33 ప్రకారం, యౌవనస్థులు యెహోవా సేవలో మరింత ఎక్కువగా చేయడానికి సహాయపడే కోర్సులను లేదా పాఠశాలకు వెళ్తూనే పూర్తికాల పరిచర్య చేయడానికి అనుమతించే విద్యను చేపట్టవచ్చును.
మహోన్నత విద్య
యెహోవాసాక్షుల్లోని అందరూ, తాము ఎలాంటి విద్యాభ్యాస స్థాయిల్లో ఉన్నా, వాళ్ళందరూ అభ్యసించే ఒక విద్యవుంది. బైబిలులోని దేవుని వాక్యంలో నేడు అతి ప్రాముఖ్యమైన విద్యాభ్యాసం లభిస్తుందని, వాళ్ళు గుర్తిస్తారు. యోహాను 17:3 యిలా చెబుతుంది: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.” క్రైస్తవుడు ఎంత విద్యను అభ్యసించినా, యెహోవాను, ఆయన కుమారుడైన యేసును గూర్చిన జ్ఞానాన్ని పొందడానికే ప్రాధాన్యతనివ్వాలి.
ఇది మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు చూపిన మాదిరి. మనయేను, ‘చతుర్థాధిపతియైన హేరోదుతోపాటు విద్యను ఆర్జించాడు,’ అయినప్పటికీ, ఆయన అంతియొకయలోనున్న ప్రవక్తలు, బోధకుల మధ్య ఉండి, చురుకుగా పని చేశాడు. (అపొస్తలుల కార్యములు 13:1) అదేవిధంగా, పౌలు అభ్యసించిన విద్యాభ్యాసాన్ని, నేటి యూనివర్సిటీ విద్యాభ్యాసంతో పోల్చవచ్చు. అయినప్పటికీ, క్రైస్తవుడయిన తర్వాత, ఆయన తాను పొందిన తర్ఫీదును దాని స్థానంలో ఉంచాడు. ఆయన యితరులను భయపెట్టడానికి దాన్ని ఉపయోగించే బదులు, మానవ సమాజ శాస్త్రం, చట్టం, చరిత్రను గూర్చిన తన జ్ఞానాన్ని సకల జనములకు ప్రకటించడానికి ఉపయోగించాడు.—అపొస్తలుల కార్యములు 16:37-40; 22:3; 25:11, 12; 1 కొరింథీయులు 9:19-23; ఫిలిప్పీయులు 1:7.
మొదటి శతాబ్దపు క్రైస్తవులు ముఖ్యంగా వారి విద్యాభ్యాస స్థాయిని బట్టి ప్రసిద్ధులు కాలేదు. చాలామంది, గురువుల పాఠశాలల్లో తర్ఫీదును పొందని, “విద్యలేని పామరులు.” కాని దాని అర్థం వాళ్ళకు చదువు రాదని కాదు. దానికి భిన్నంగా, యీ స్త్రీపురుషులు తమ విశ్వాసాన్ని గూర్చి తర్కించడానికి సంసిద్ధులు కావడానికి వారికి గల సామర్థ్యం వారు సరైన ఆధారాలతో విద్యనేర్చుకున్నారనే దానికి నిదర్శనమిస్తుంది.—అపొస్తలుల కార్యములు 4:13.
కాబట్టి, క్రైస్తవులందరు విద్యాభ్యాసం యెడల బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో, వాళ్ళు విద్యాభ్యాసాన్నైనా, మరి దేనినైనా ఆయా స్థానాల్లో ఉంచుతూ, “శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు” ప్రయత్నం చేస్తారు.—ఫిలిప్పీయులు 1:9, 10. (g94 8/22)
[అధస్సూచీలు]
a ఉన్నత విద్యను అభ్యసించిన అపొస్తలుడైన పౌలు పరిచర్య చేయడానికి తన కాళ్ళపై తాను నిలబడేందుకు, తన తండ్రి ద్వారా నేర్చుకున్న డేరాలు కుట్టేపనిని చేపట్టాడన్నది గమనించదగిన విషయం. డేరాలు కుట్టడం సులభమైన పని కాదు. మేక వెంట్రుకలతో చేసిన సిలిస్యమ్ అని పిలువబడే వస్త్రం, కత్తిరించడానికి, కుట్టడానికి కష్టంగా ఉండేంత గట్టిగాను మందంగాను ఉంటుంది.—అపొస్తలుల కార్యములు 18:1-3; 22:3; ఫిలిప్పీయులు 3:—7, 8.
b “త్వరగా నిర్మించుట” అనే పదం, యెహోవాసాక్షులు స్థాపించిన ఉన్నతంగా వ్యవస్థీకరించబడిన, నిర్మాణ పద్ధతిని సూచిస్తుంది. ఈ కార్యక్రమంలో సేవ చేసేవారికి జీతం యివ్వడం లేదు; వాళ్ళు స్వయంగా తమ పేర్లను, ఆస్తులను యిచ్చారు. అమెరికాలో ప్రతి సంవత్సరం, దాదాపు 200 కొత్త రాజ్యమందిరాలు నిర్మించబడుతున్నాయి, యీ పద్ధతిని ఉపయోగించి మరో 200 రాజ్యమందిరాలు పునర్నిర్మించబడుతున్నాయి.
[7వ పేజీలోని బాక్సు]
ఒక చక్కని సిఫారసు
మాత్యూ ఉన్నత పాఠశాల నుండి చదువు పూర్తయిన తర్వాత, యెహోవాసాక్షులలో పూర్తికాల సేవకునిగా పనిచేస్తూనే, తన కాళ్ళపై తానెలా నిలబడగలనో అనే దాని గూర్చి తీవ్రంగా ఆలోచించాడు. విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా విచారణలోకి తీసుకున్న తర్వాత, మాత్యూ మరియు అతని తల్లిదండ్రులు అతని లక్ష్యాన్ని సాధించడానికి అదనపు విద్యాభ్యాసం అవసరమని భావించారు. అలా, అతడు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేశాడు. మాత్యూ చదువుకున్న పాఠశాల సలహాదారుడు యీ విధంగా సిఫారసు చేస్తూ ఒక లేఖ రాశాడు:
“గత రెండున్నర సంవత్సరాల్లో, నేను మాత్యూకు సలహాదారునిగాను స్నేహితునిగాను ఉండడంలో సంతోషించాను. మాత్యూ క్రమశిక్షణగల వ్యక్తి . . . అతడు దృఢమైన విశ్వాసము, బలమైన నమ్మకము గలవాడు, అవి అతని సంబంధాలలోను, పనులలోను స్ఫురిస్తాయి.
“కొన్ని సంవత్సరాలుగా, మాత్యూ పరిచర్యకు తర్ఫీదు పొందుతూ వచ్చాడు. అతడు మత పరిచారకుడుగా సేవ చేస్తున్నందుకు అతనికి ఆర్థికంగా ప్రతిఫలం లభించదు. నిజంగా, అతడు ప్రేమ అనే గుణం ఉండడం వలన ఆ పని చేస్తున్నాడు. మాత్యూ నిస్వార్థపరుడైన యౌవనస్థుడు, ఆలోచనాపరుడు, వివేకము గలవాడు. దేవుని సేవకు తనను తాను అర్పించుకున్న యితడు తన శిక్షణను, స్వచ్ఛంద సేవను కొనసాగించడానికి యీ స్కాలర్‌షిప్ సహాయపడుతుంది.
“స్వచ్ఛంద సేవ, సాంఘిక సేవల మాటకొస్తే మాత్యూ యింటింటికి ప్రకటించడానికి వారాంతాల్లో, పాఠశాల తర్వాత, వేసవిలో లెక్కలేనన్ని గంటలు గడిపాడు. అతడు సమాజంలోనే అనేక రకాల ప్రజల మధ్య పని చేస్తున్నాడు. యౌవనస్థులకు, వృద్ధులకు బైబిలు పఠనాలను నిర్వహించడంలో మాత్యూ నాయకత్వ సామర్థ్యాలను, నైపుణ్యాలను ప్రదర్శించాడు. . . . అతడు తరగతి గదిలో పిల్లలను ప్రేరేపించగల్గాడు, వారి సామర్థ్యాలను గ్రహించడానికి సహాయం చేయగల్గాడు. అతడు ఎప్పుడూ అనుకూలంగానే ప్రభావితం చేశాడని ఉపాధ్యాయులు వ్యాఖ్యానించారు. అతడు తరగతిలో చర్చలను నిర్వహిస్తాడు, సామర్థ్యముతో వాదించగలడు. . . .
“నేను సలహా యివ్వడంలో సంతోషించిన మంచి యౌవనస్థుల్లో మాత్యూ ఒకడు. తోటివారు, ఉపాధ్యాయులు అతడిని యిష్టపడేవారు, గౌరవించేవారు. అతని యథార్థతే అతనికున్న ముఖ్య యోగ్యత.”
[9వ పేజీలోని చిత్రాలు]
యెహోవాసాక్షులు ముఖ్యంగా మరింత ప్రతిభావంతులైన దేవుని సేవకులయ్యేందుకు, విద్యాభ్యాసంలో ఆసక్తి చూపిస్తారు