బైబిలు ఉద్దేశము
బైబిలు విద్యాభ్యాసాన్ని నిరుత్సాహపరుస్తుందా?
“అజ్ఞాని మాత్రమే విద్యను తృణీకరిస్తాడు.”—సా. శ. పూ. మొదటి శతాబ్దంలో పూబ్లీయుస్ స్యూరుస్ వ్రాసిన మోరల్ సేయింగ్స్.
“ఆచరణాత్మకమైన జ్ఞానాన్నీ, ఆలోచనా సామర్థ్యాన్నీ భద్రపరచుకో” అని బైబిలు మనకు బోధిస్తుంది. (సామెతలు 3:21, NW) జ్ఞానియైన దేవుడైన యెహోవా తన ఆరాధకులు విద్యాభ్యాసం చేసిన ప్రజలై ఉండాలని కోరుకుంటున్నాడు. (1 సమూయేలు 2:3; సామెతలు 1:5, 22) అయితే, బైబిలులోని కొన్ని ప్రస్తావనల వల్ల సందేహాలు తలెత్తవచ్చు. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు తన ఉన్నత విద్యాభ్యాసంతో సహా తన మునుపటి వృత్తులను గురించి మాట్లాడుతూ, “వాటిని చెత్తగా పరిగణిస్తున్నాను,” అని వ్రాశాడు. (ఫిలిప్పీయులు 3:3-8, పరిశుద్ధ బైబల్) మరొక ప్రేరేపిత లేఖలో, ఆయనిలా నొక్కి చెప్పాడు: “ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే.”—1 కొరింథీయులు 3:19.
అయితే, బైబిలు విద్యాభ్యాసాన్ని నిరుత్సాహపరుస్తుందా? ఒక క్రైస్తవుడు ఎంతమేరకు లౌకిక విద్యాభ్యాసాన్ని పొందాలి? చట్టం కోరే కనీస విద్యాభ్యాసం సరిపోతుందా, లేక అదనపు విద్యాభ్యాసాన్ని చేపట్టాలా?
మొదటి శతాబ్దంలోని విద్యాభ్యాసం
మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లో, అనేక విభిన్న విద్యాభ్యాస నేపథ్యాలవారు ఉండేవారు. కొంతమంది ప్రముఖ వ్యక్తులు గలిలయులైన అపొస్తలులైన పేతురునూ, యోహానునూ “విద్యలేని పామరుల”న్నట్లు దృష్టించారు. (అపొస్తలుల కార్యములు 4:5, 6, 13) దానర్థం ఆ ఇద్దరు మనుష్యలూ నిరక్షరాస్యులనీ, విద్యాభ్యాసం చేయనివారనీ భావమా? కాదు. యెరూషలేములోని హెబ్రీయుల ఉన్నత విద్యాలయాలలో వాళ్ళు విద్యనభ్యసించలేదన్నదే దాని భావం. క్రైస్తవత్వాన్ని ధైర్యంగా సమర్థించిన ఈ ఇద్దరూ విద్యావంతులనీ, మేధావులనీ, అర్థమయ్యే విధంగా లేఖనాలను వివరించగల సామర్థ్యం గలవారనీ వాళ్ళ వ్రాతలు తర్వాత సాక్ష్యమిచ్చాయి. వారి విద్యాభ్యాసంలో తమ కుటుంబాల భౌతిక అవసరతలను తీర్చేందుకు అవసరమైన ఆచరణాత్మకమైన నిర్దేశం ఇమిడి ఉండేది. లాభదాయకమైన చేపలుపట్టే వ్యాపారంలో వాళ్ళు భాగస్వాములుగా ఉండేవారన్నది స్పష్టం.—మార్కు 1:16-21; లూకా 5:7, 10.
అందుకు భిన్నంగా, సువార్తల్లో ఒకదానినీ, అలాగే, అపొస్తలుల కార్యములు అనే పుస్తకాన్నీ వ్రాసిన లూకా అనే శిష్యుడు మరింత ఉన్నతస్థాయి విద్యాభ్యాసాన్ని పొందాడు. ఆయన ఒక వైద్యుడు. (కొలొస్సయులు 4:14) ఆయన వైద్య నేపథ్యం ఆయన వ్రాసిన ప్రేరేపిత వ్రాతలకు వ్యత్యస్తమైన శైలినిచ్చింది.—లూకా 4:38; 5:12; అపొస్తలుల కార్యములు 28:8 చూడండి.
అపొస్తలుడైన పౌలు తాను క్రైస్తవుడిగా కాకముందు, ఆ కాలంలో అత్యంత ప్రజ్ఞావంతులైన పండితుల్లో ఒకరైన గమలీయేలు సంరక్షణలో యూదుల ధర్మశాస్త్రంలో శిక్షణ పొందాడు. (అపొస్తలుల కార్యములు 22:3) పౌలు చేసిన విద్యాభ్యాసాన్ని నేటి విశ్వవిద్యాలయ విద్యాభ్యాసంతో పోల్చవచ్చు. అంతేకాక, యూదా సమాజంలో, యౌవనస్థులు తర్వాతి సంవత్సరాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేపట్టనున్నప్పటికీ, ఒక వృత్తిని నేర్చుకోవడం మాననీయమైనదిగా పరిగణించేవారు. పౌలు కుర్రవాడిగా ఉన్నప్పుడే గుడారాలను చేసే తర్ఫీదును పొందాడన్నది స్పష్టం. అలాంటి నైపుణ్యాలు ఆయన పూర్తికాల పరిచర్యలో తనను తాను పోషించుకునేందుకు సహాయపడ్డాయి.
అయితే, లౌకిక విద్యాభ్యాసం అవసరమే అయినప్పటికీ, దేవుని అతిశయకరమైన జ్ఞానం ముందు దాని విలువ పరిమితమైనదని పౌలు గుర్తించాడు. తదనుగుణంగా, దేవుని గురించీ, క్రీస్తు గురించీ జ్ఞానం సంపాదించడానికి బైబిలు అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. నేడు క్రైస్తవులు లౌకిక విద్యాభ్యాసాన్ని గురించిన ఈ వాస్తవిక దృక్పథాన్ని అలవరచుకోవడం మంచిది.—సామెతలు 2:1-5; యోహాను 17:3; కొలొస్సయులు 2:3.
ఈ విషయాన్ని జాగ్రత్తగా తూచిచూడడం
విశ్వవిద్యాలయ సంబంధమైన లేక ఉద్యోగానికి అవసరమైన అదనపు విద్యాభ్యాసాన్ని చేపట్టడం తమ కుటుంబం యొక్క భౌతిక అవసరాలను తీర్చడానికి సహాయపడినట్లు కొంతమంది క్రైస్తవులు కనుగొన్నారు. ఒకరు తన కుటుంబం ఎడల శ్రద్ధ వహించడం సముచితమైన పని, ఎందుకంటే, ‘తన యింటివారిని సంరక్షించడం’ పవిత్రమైన కర్తవ్యం. (1 తిమోతి 5:8) దీనిని చేయడానికి అవసరమైన నైపుణ్యాలను సంపాదించుకోవడమే ఆచరణాత్మక జ్ఞానం.
అయితే, ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకుగానూ, ప్రాథమిక విద్యాభ్యాసాని కన్నా ఎక్కువ విద్యాభ్యాసాన్ని సంపాదించవలసిన అవసరముందని భావించేవారు దానివలన కలిగే ప్రయోజనాలనూ, నష్టాలనూ బేరీజు వేసుకోవాలి. దానివల్ల కలిగే ప్రయోజనాల్లో, ఒక వ్యక్తి క్రైస్తవ పరిచర్యను ఎంతో ఆసక్తిగా చేపడ్తూనే, తనను తాను పోషించుకునేందుకు, అలాగే తన కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు సాధ్యంచేసే ఉద్యోగాన్ని పొందేందుకు సమర్థుడు కాగలగడం ఇమిడి ఉంది. అంతేకాక, ‘అక్కరగలవానికి పంచిపెట్టడానికి వీలు కలిగి’ భౌతిక విధాల్లో ఇతరులకు సహాయం చేయవచ్చు.—ఎఫెసీయులు 4:27.
కలగగల కొన్ని నష్టాలేవి? దేవుని మీదా, బైబిలు మీదా ఉన్న విశ్వాసాన్ని తుడిచిపెట్టే బోధల బారిన పడడం వాటిలో ఇమిడి ఉండవచ్చు. “జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన”వాటి విషయమై, “మనుష్యుల పారంపర్యాచారమును . . . అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము” విషయమై జాగ్రత్తపడమని పౌలు క్రైస్తవులకు సలహా ఇచ్చాడు. (1 తిమోతి 6:20, 21; కొలొస్సయులు 2:8) కొన్ని రకాల విద్యాభ్యాసాలను చేపట్టడం క్రైస్తవ విశ్వాసానికి హానికరం కాగలదన్నది కాదనలేని విషయం. అదనపు తర్ఫీదును లేదా చదువులను గురించి ఆలోచిస్తున్నవాళ్ళు, అలాంటి హానికరమైన ప్రభావాల వల్ల కలిగే అపాయాలను గురించి అప్రమత్తంగా ఉండాలి.
“ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి”న మోషే బహుదేవతారాధన సంబంధమైన, దేవుడ్ని అవమానపరచే విధమైన బోధలు నిస్సంశయంగా ఇమిడివున్న విద్యాభ్యాసాన్ని పొందినప్పటికీ తన దృఢమైన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 7:22) అలాగే, నేడు క్రైస్తవులు తాము ఎలాంటి పరిస్థితుల్లోవున్నప్పటికీ, అనారోగ్యకరమైన ప్రభావాలకు లోబడకుండా ఉండేందుకు జాగ్రత్తపడతారు.
అదనపు విద్యాభ్యాసాన్ని చేపట్టడం వల్ల రాగల మరో అపాయం ఏంటంటే, జ్ఞానం ఉప్పొంగిపోయేలా చేసి, డంబాన్ని పుట్టిస్తుంది. (1 కొరింథీయులు 8:1) అనేక మంది స్వార్థ కారణాల వల్లే విద్యాభ్యాసం ద్వారా జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. సరైన లక్ష్యం గల జ్ఞానాన్వేషణ కూడా, తనే ఉన్నతుడు, తనే ప్రముఖుడు అన్న అనుభూతులను కలిగించవచ్చు. అలాంటి మనోవైఖరులు దేవునికి అప్రీతిని కలిగిస్తాయి.—సామెతలు 8:13.
పరిసయ్యులనే తీసుకోండి. ప్రసిద్ధిగాంచిన ఈ మతవిభాగంలోని సభ్యులు తమ జ్ఞానము విషయమై, మరియు వాళ్ళు అతిగా భావిస్తున్న తమ న్యాయనిష్ట విషయమై అహంకరించారు. వాళ్ళు రబ్బీల సాంప్రదాయిక విషయాల పెద్ద గ్రంథసంచయంలో మంచి పరిజ్ఞానాన్ని పొందారు. వాళ్ళు తక్కువ విద్యాభ్యాసం గల సామాన్య ప్రజలను అజ్ఞానులుగా భావిస్తూ చిన్నచూపు చూశారు, వాళ్ళను శపించారు కూడా. (యోహాను 7:49) అంతేకాక, వాళ్ళు డబ్బును ప్రేమించారు. (లూకా 16:14) తప్పుడు లక్ష్యాలతో విద్యాభ్యాసం చేసినప్పుడు అది ఒక వ్యక్తిని అహంకారిగా చేయగలదనీ, లేదా అతనిని డబ్బు ప్రేమికుడుగా చేయగలదనీ వారి ఉదాహరణ చూపిస్తుంది. కనుక, ఒక క్రైస్తవుడు తాను ఏ చదువుకు వెళ్ళాలి, ఎంత చదవాలి అనే విషయాన్ని నిర్ణయించుకునేటప్పుడు, ‘నా లక్ష్యాలేమిటి?’ అని తనను తాను ప్రశ్నించుకోవడం మంచిది.
వ్యక్తిగతంగా ఎంపిక చేసుకోవలసిన విషయం
మొదటి శతాబ్దంలోలాగే, నేడు కూడా క్రైస్తవుల మధ్య వివిధ విద్యాభ్యాస నేపథ్యాలవారు ఉన్నారన్నది నిజం. కనీస విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన యౌవనస్థులు తమ తల్లిదండ్రుల మార్గనిర్దేశం క్రింద అదనపు లౌకిక విద్యాభ్యాసాన్ని చేపట్టాలని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే, తమ కుటుంబాన్ని పోషించుకునే మార్గాన్ని మెరుగుపర్చుకోవడంలో ఆసక్తిగల పెద్దవయస్కులు అలాంటి అదనపు చదువును తమ లక్ష్యానికి ఆచరణ సాధ్యమైన మాధ్యమంగా దృష్టించవచ్చు.a సాంప్రదాయిక విశ్వవిద్యాలయ విద్యాభ్యాసంలోని కొన్ని అంశాలు వృత్తి నైపుణ్యాలను లేదా ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను కాక, మొత్తం మీద మేధాశక్తి సంబంధమైన వికాసానికే ప్రాముఖ్యతనిస్తాయి. కనుక, అలాంటి విద్యాభ్యాసానికి ఎంతో సమయాన్ని వెచ్చించిన తర్వాత కూడా, ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు తనకు లేవని ఒక వ్యక్తి కనుగొనవచ్చు. ఈ కారణాన, ఉద్యోగ మార్కెట్లో అవసరమైన నిపుణతలను సంపాదించుకునే దృష్టితో కొందరు ఉద్యోగం సంపాదించేందుకు తర్ఫీదునిచ్చే ప్రోగ్రామ్‌లలో లేదా సాంకేతిక పాఠశాలలలో విద్యాభ్యాసం చేయడాన్ని ఎంచుకుంటారు.
ఏది ఏమైనా, అలాంటి నిర్ణయాలు వ్యక్తిగతమైనవే. ఈ విషయంలో క్రైస్తవులు ఒకరినొకరు విమర్శించుకోవడమో తీర్పు తీర్చడమో చేయకూడదు. “పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?” అని యాకోబు వ్రాశాడు. (యాకోబు 4:12) ఒక క్రైస్తవుడు అదనపు విద్యనభ్యసించడాన్ని గురించి ఆలోచిస్తున్నట్లయితే, తనను ప్రేరేపిస్తున్నది స్వార్థమో, భౌతిక ఆసక్తులో కాదని నిశ్చయించుకునేందుకుగానూ తన సొంత లక్ష్యాలను పరిశీలించుకుంటే మంచిది.
బైబిలు విద్యాభ్యాసం విషయంలో సమతుల్య దృక్కోణాన్ని కలిగివుండడానికి ప్రోత్సహిస్తుందన్నది స్పష్టం. దేవుని ప్రేరేపిత వాక్యం ఆధారమైన ఆధ్యాత్మిక విద్యాభ్యాసం యొక్క అతిశయకరమైన విలువను క్రైస్తవ తల్లిదండ్రులు గుర్తించి, అనుబంధ విద్యాభ్యాసం సంబంధించి తమ పిల్లలకు సమతుల్యమైన సలహానిస్తారు. (2 తిమోతి 3:16) వాళ్ళు జీవితాన్ని గురించి వాస్తవిక దృష్టి కలిగివుండి, ఎదిగిన తమ పిల్లలు తమను తాము పోషించుకునేందుకూ, తమ భావి కుటుంబాలను పోషించేందుకూ అవసరమైన నైపుణ్యాలను పొందడంలో లౌకిక విద్యాభ్యాసానికున్న విలువను గ్రహిస్తారు. కనుక, అనుబంధ విద్యనభ్యసించాలా, ఎంత మేరకు అభ్యసించాలి అని నిర్ణయించుకోవడంలో, ప్రతి క్రైస్తవుడు తాను యెహోవాకు చేసుకున్న సమర్పణ ఆధారంగా సరైన వ్యక్తిగత నిర్ణయాలను చేసుకోగలడు. యెహోవాకు చేసిన సమర్పణ “యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవు”తుంది.—1 తిమోతి 4:8.
[అధస్సూచి]
a ఈ విషయంపై మరింత విశదమైన వివరాల కోసం కావలికోట, నవంబరు 1, 1992, (ఆంగ్లం) 10-21 పేజీలనూ, జెహోవాస్ విట్నెసెస్ అండ్ ఎడ్యుకేషన్ అనే బ్రోషూర్నూ చూడండి. ఈ రెండింటినీ వాచ్‌టవర్ సొసైటీ ప్రచురించింది.
[26వ పేజీలోని చిత్రం]
“ఆచరణాత్మకమైన జ్ఞానాన్నీ, ఆలోచనా సామర్థ్యాన్నీ భద్రపరచుకో.”—సామెతలు 3:21, NW.
[27వ పేజీలోని చిత్రం]
అదనపు విద్యాభ్యాసానికి వెళ్ళాలా అని ఆలోచించేటప్పుడు, ‘నా లక్ష్యాలేమిటి?’ అని క్రైస్తవుడు తనకు తానుగా ప్రశ్నించుకుంటే మంచిది.