అదనపు విద్యనభ్యసించాలా, వద్దా?
జీవించడానికి అవసరమైనంత సంపాదించడానికి ఎంత చదువు అవసరం? దీనికిచ్చే జవాబు ఒక దేశానికి మరొక దేశానికి వ్యత్యాసంగా ఉంటుంది. అనేక దేశాల్లో కొన్ని సంవత్సరాల పూర్వం, ఒకడు తన కాళ్ళపై తాను నిలబడడానికి అవసరమైన చదువుకన్నా యిప్పుడు ఎక్కువ చదువు అవసరమున్నట్లు కనిపిస్తుంది. కొన్నిసార్లు, చట్టం విధించిన కనీస చదువు చాలదు.
ఈ కారణం వల్లే ఎక్కువ మంది పట్టభద్రులు ఉద్యోగం కోసం వెతికే బదులు పైచదువులకు వెళ్తున్నారనడంలో సందేహం లేదు. నిజంగా, ఫలితాలు ఆకర్షణీయంగా ఉండవచ్చు. “ఉన్నత పాఠశాల డిప్లొమాలను పొందిన ఉద్యోగస్థులైన పురుషులు 1979 నుండి 1987 వరకు తమ వేతనంలో 7.4 శాతం వరకు కోల్పోయారని, అయితే కాలేజీ డిగ్రీలను పొందిన మగవారి వేతనం 7 శాతం పెరిగిందని,” కనుగొన్నామని, ఎకనామిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ చేసిన నివేదికను ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది.
కాలేజీ పట్టభద్రులు పొందే పట్టా ఉద్యోగం పొందే అవకాశాన్నివ్వగలదు. హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌లోని ఒక అనుభవజ్ఞుడైన పరిశోధకుడు విలియమ్ బి. జాన్‌స్టన్ యిలా అంటున్నాడు: “కాలేజీ డిగ్రీ పొంది ఉండడం లేదా కనీసం కాలేజీకి వెళ్ళాడన్న సాక్ష్యాధారం ఉండడం దేశంలో ఉద్యోగాన్ని పొందే ప్రధాన యోగ్యతగా మారింది.”
మరొకవైపు, చాలామంది పట్టభద్రులు పనికోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ, వారు నిరుద్యోగ సమస్య నుండి స్వతంత్రంగా లేరన్నది గమనించాలి. “నాతో పాటు పట్టభద్రులైన నా స్నేహితులలో అనేకులకు ఉద్యోగం లేదు,” అని 22 ఏండ్ల కార్ల్ అంటున్నాడు. యాభై అయిదు ఏండ్లు గల జిమ్ ఎన్నో అవార్డులతో ఒక ప్రసిద్ధమైన యూనివర్సిటీ నుండి పట్టభద్రుడయ్యాడు. కాని 1992 ఫిబ్రవరిలో ఉద్యోగం నుండి తొలగించబడ్డాడు. అతని డిప్లొమా ఉద్యోగాన్ని కోల్పోకుండా కాపాడలేకపోయింది, అంతేకాక, స్థిరమైన ఉద్యోగాన్ని కనుగొనడానికి అది సహాయపడలేదు. “మీ పునాది ఆధారపడజాలనిదిగా ఉంది,” అని ఆయన అంటున్నారు.
జిమ్‌లాగే, కళాశాల పట్టా పొందిన అనేకులు తమను తాము “సుఖప్రదమైన పాపప్రాయశ్చిత్త స్థలం” అని యు.ఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్టు దేనిని పిలుస్తుందో దానిలో ఉన్నట్లు కనుగొన్నారు—వారికి ఉద్యోగ విరమణ చేసే వయస్సు రాలేదు, వేరే కర్మాగారాల్లో పనికి చేరాలంటే కూడా వయస్సు దాటిపోయింది.
కాబట్టి, కాలేజీ చదువు వలన ప్రయోజనాలున్నప్పటికీ, అది పరిష్కారం కాదు. అదే ఏకైక మార్గమూ కాదు. ది క్వశ్చ్యన్ ఈజ్ కాలేజ్ అనే ప్రచురణలో హెర్బెర్ట్ కాల్ యిలా రాస్తున్నారు: “కాలేజీకి వెళ్ళకుండా ప్రగతిని సాధించిన వారెంతో మంది ఉన్నారు, కాలేజీ పట్టాలు అవసరం లేని, మంచి ఉద్యోగాలు ఎన్నోవున్నాయి.” ఉదాహరణకు, ఒక సంస్థ సాధారణంగా కాలేజీలో చదువుకున్న వారు నియమించబడే స్థానంలో కాలేజీ చదువు లేని వాళ్ళను తీసుకుంది. డిగ్రీలకోసం చూసేదానికన్నా, అప్పగించిన పనులను చేసే సామర్థ్యంగల వారికోసం వెదుకుతుంది. “మాకు అలాంటి వ్యక్తి దొరికినప్పుడు ఆ పని మెలకువలను మేము [అతనికి] నేర్పగలమని అనుకుంటాము” అని ఒక ప్రతినిధి అంటున్నాడు.
అవును, చాలా మంది కాలేజీ డిగ్రీ లేకుండానే తమకు, తమ కుటుంబానికి కావలసినంత డబ్బు సంపాదిస్తున్నారు. వీరిలో కొందరు వృత్తివిద్యా పాఠశాలల్లో, సాంకేతిక విద్యా పాఠశాలల్లో లేదా కమ్యూనిటీ కాలేజీలలో తక్కువ సమయము, తక్కువ ఖర్చుతో శిక్షణ పొందారు.a కొందరు ప్రత్యేకంగా దేనికి తర్ఫీదు పొందకుండానే ఏదో ఒక పనిని లేదా మరమ్మత్తు పనులను నేర్చుకొని, వాళ్ళకు గల మంచి పేరును బట్టి, స్థిరమైన ఒక ఉద్యోగాన్ని సంపాదించగల్గారు.
సమతుల్య దృష్టి
నిజమే, కాలేజీ లేదా మరితర అదనపు విద్యతో సహా ఏ విధమైన చదువైనా ఉద్యోగం తెచ్చిపెడుతుందన్న హామీ లేదు. అంతేకాకుండా, “ఈ లోకపు నటన గతించుచున్నది,” అని బైబిలు ఖచ్చితంగా చెబుతుంది. (1 కొరింథీయులు 7:31) ఈరోజు అవసరమైనది, రేపు అనవసరం కావచ్చు.
కాబట్టి, అదనపు విద్యాభ్యాసాన్ని గూర్చి తలంచే వారు దాని లాభనష్టాలను బేరీజు వేయవలసిన అవసరముంది. ‘నేను అంత ఖర్చు భరించగలనా? నేను ఎలాంటి పరిసరాలను, సహవాసులను ఎదుర్కోవలసి వస్తుంది? నేను నా కాళ్ళపై నిలబడడానికి అవి నాకు ఆచరణాత్మకమైన తర్ఫీదునిస్తాయా? నేనొకవేళ పెళ్ళి చేసుకుంటే, కుటుంబాన్ని పోషించడానికి అది సహాయపడుతుందా? మద్దతునిచ్చే తల్లిదండ్రులు బైబిలు వారిపై మోపే బాధ్యతననుసరించి వారికి అమూల్యమైన సలహాను యివ్వగలరు. (ద్వితీయోపదేశకాండము 4:10; 6:4-9; 11:18-21; సామెతలు 4:1, 2) అదనపు విద్యాభ్యాసం లేదా మరే యితర విధానము వలనైనా కలిగే ఆర్థిక ప్రయోజనాలను గూర్చి మీరు ఆలోచిస్తున్నట్లయితే, యేసు మాటలు సముచితమైనవి: “మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తనయొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదటి లెక్క చూచుకొనడా?”—లూకా 14:28.
వాస్తవానికి, అదనపు విద్యనభ్యసించాలా వద్దా అనేది జాగ్రత్తగా పరిశీలించవల్సిన తీర్మానం. ఒక క్రైస్తవుడు ఎల్లవేళలా మత్తయి 6:33లోని యేసు మాటలను మనస్సులో ఉంచుకోవాలి: “మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును” నిజక్రైస్తవుల మధ్య అదనపు విద్యలేని వారిని చిన్నచూపు చూడడం జరగదు లేదా తక్కువవారిగా ఎంచడమూ లేదు, ఎక్కువ విద్యనభ్యసించినవారిని బహిష్కరించడమూ ఉండదు లేదా వారు అహంభావం గలవారని అనుకోవడమనేది ఉండదు. అపొస్తలుడైన పౌలు యిలా రాశాడు: “పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతని నిలబెట్టుటకు శక్తిగలవాడు.”—రోమీయులు 14:4.
యేసు యీ సమతుల్య దృష్టిని ప్రతిబింబించాడు. ఆయన ‘విద్యలేని పామరులను’ నిందించనూ లేదు, శక్తిమంతమైన సువార్త ప్రకటనా పనిని నెరవేర్చడానికి బాగా చదువుకున్న పౌలును ఎన్నుకోడానికి వెనుకాడనూ లేదు. (అపొస్తలుల కార్యములు 4:13; 9:10-16) తర్వాతి శీర్షికలు చెబుతున్నట్లుగా, ఎటువంటి పరిస్థితిలోనైనా సరే విద్యాభ్యాసాన్ని దాని స్థానంలో ఉంచాలి.
[అధస్సూచీలు]
a అదనపు విద్యాకార్యక్రమాలు ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి వ్యత్యాసంగా ఉంటాయి. మీ ప్రాంతంలో లభ్యమౌతున్న కార్యక్రమాలను తెలుసుకునేందుకు పాఠశాలలు, గ్రంథాలయాలు, గవర్నమెంట్ ఎంప్లాయిమెంట్ సర్వీసులు అనేవి విలువైన మూలములు.
[5వ పేజీలోని బాక్సు]
అదనపు విద్యాభ్యాసం
ఫిబ్రవరి 1, 1993 కావలికోట యెహోవాసాక్షులను గూర్చి, పూర్తికాల పరిచర్యను గూర్చి యిలా రాసింది: “తగిన జీతం సంపాదించుట కొరకు కొన్ని సంవత్సరాల క్రితమున్న దానికంటె ఇప్పుడు ఎక్కువ చదువుకోవడం అవసరమనే సాధారణ భావన అనేక దేశాల్లో ఎక్కువగా ఉన్నట్లు కన్పిస్తుంది. . . . చట్టం ప్రకారం కనీస విద్యనభ్యసించిన తర్వాత కూడ తగిన జీతం లభించే ఉద్యోగాలు దొరకడం కష్టం . . .
““తగిన జీతం” అంటే అర్థమేమిటి? . . . వారు సంపాదించేది తగిన రీతిలో జీవించుటకు వారికి సరిపోతూ అదే సమయంలో వారి క్రైస్తవ పరిచర్యను నెరవేర్చుటకు కావల్సిన సమయాన్ని, బలాన్ని ఇస్తున్నట్లయిన, వారి జీతాలు “సరిపడునంతగా,” లేదా “సంతృప్తికరంగా” ఉన్నవని చెప్పవచ్చును.”
కాబట్టి, కావలికోట యిలా అన్నది: “అదనపు విద్యకు లేదా దానికి వ్యతిరేకంగా ఖచ్చితమైన నియమాలంటూ ఏమీ చేయకూడదు.”