కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g94 9/8 పేజీలు 10-13
  • పాలిచ్చేటప్పుడు తీసుకోవలసిన కనీస జాగ్రత్తలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాలిచ్చేటప్పుడు తీసుకోవలసిన కనీస జాగ్రత్తలు
  • తేజరిల్లు!—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బిడ్డ పుట్టక ముందు
  • తొలిరోజులు
  • ఎప్పుడు ఆపాలి
  • ప్రేమగల సృష్టికర్తను గూర్చిన సాక్ష్యాధారం
  • తల్లిపాలకు అనుకూలమైన సాక్ష్యం
    తేజరిల్లు!—1994
  • సంతానం కలిగియుండుట—ఒక బాధ్యత, ఒక బహుమానం
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
  • పిల్లలు పుట్టాక వైవాహిక బంధంలో వచ్చే మార్పులతో ఎలా వ్యవహరించాలి?
    ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం
  • పసిపిల్లలకు అవసరమైనదేమిటి, వాళ్ళు కోరుకునేదేమిటి?
    తేజరిల్లు!—2004
మరిన్ని
తేజరిల్లు!—1994
g94 9/8 పేజీలు 10-13

పాలిచ్చేటప్పుడు తీసుకోవలసిన కనీస జాగ్రత్తలు

నైజీరియాలోని అవేక్‌! ప్రతినిధి

అనేకమంది తల్లులవలె, మీ బిడ్డకు మీ పాలివ్వాలని మీరు తీర్మానించుకున్నట్లయితే, మానవుల సృష్టికర్త ప్రేమతో చేసిన ఏర్పాటును ఉపయోగించుకోవాలని మీరు నిర్ణయించుకున్నారన్నమాట. మీ శరీరం ఉత్పత్తి చేసే పాలు, బిడ్డ ఆరోగ్యకరమైన పెరుగుదలకు, వికాసానికి దోహదపడుతూ మీ బిడ్డకు అవసరమైన పోషకాహారాన్ని సరిగ్గా అందజేస్తాయి. అలాగే అవి మీ బిడ్డను సాధారణమైన రోగాల బారి నుండి కాపాడతాయి. సహేతుకంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ యిలా పేర్కొంటుంది: “[తల్లి పాలు] బిడ్డ తీసుకోబోయే ఏ ఆహారానికన్నా శ్రేష్ఠమైనవి. ఆవు పాలు, పాలపొడి కలిపిన ద్రావకాలు ధాన్యంతో చేసే జావలతో సహా అన్ని ప్రత్యామ్నాయాలు దిగదుడుపే.”

పాలివ్వడం మీకు కూడా ప్రయోజనాన్ని తెస్తుంది. సీసాలు కడగనవసరం లేదు లేదా శుభ్రం చేయనవసరం లేదు, అర్ధరాత్రి వంటగదికి వెళ్ళి మీ బిడ్డకోసం ఆహారం తయారు చేయనవసరం లేదు. పాలివ్వడం మీకు శారీరకంగా కూడా ప్రయోజనాన్నిస్తుంది, ఎలాగంటే, గర్భధారణ సమయంలో మీకు పెరిగిన బరువు తగ్గడానికి, మీ గర్భాశయము తిరిగి మామూలు పరిమాణానికి వచ్చేందుకు సహాయపడుతుంది. తమ పిల్లలకు పాలిచ్చే స్త్రీలకు రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం కూడా తక్కువేనని అధ్యయనాలు చెబుతున్నాయి.

“వాస్తవానికి ప్రతి తల్లి తన బిడ్డకు పాలివ్వగలదు,” అని ఐక్యరాజ్యసమితి బాలల నిధి హామీ యిస్తుంది. మీరు కూడా యివ్వగలరు. అయినప్పటికీ, పాలివ్వడం అనుకున్నంత సులభం కాదని ముఖ్యంగా మీరు మొదటిసారిగా పాలివ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే, మీరు కనుగొనవచ్చు. ఎందుకంటే పాలివ్వడం సహజమే అయినప్పటికీ, అది సహజంగా వచ్చే పని కాదు; అది మీరు నేర్చుకోవలసిన ఒక నైపుణ్యం. మీకు, మీ బిడ్డకు సుఖప్రదమైన, ఆస్వాద్యమైన దినచర్యను ఏర్పరచుకోడానికి కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు పడుతుందని మీరు కనుగొనవచ్చు.

బిడ్డ పుట్టక ముందు

మీరు యింతకు ముందు బిడ్డకు సరైన విధంగా పాలివ్వనట్లయితే, అలా యిచ్చిన తల్లులతో మాట్లాడండి. సమస్యలను దూరం చేయడానికి, లేదా అధిగమించడానికి వారు మీకు సహాయం చేయగలరు. మీరు మీ బిడ్డకు విజయవంతంగా పాలిచ్చేందుకు మీకున్న సామర్థ్యాన్ని గూర్చి, మీలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి వారు మీకు సహాయపడగలరు.

గర్భధారణ సమయంలోను, ఆ తర్వాత, మీరు తగినంత విశ్రాంతి తీసుకోవడం ప్రాముఖ్యమైవున్నది. అంతేకాక, మీరు తగినంత ఆహారాన్ని భుజించేలా చూసుకోండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన బ్రెస్ట్‌ఫీడింగ్‌ అనే బ్రోషూర్‌ యిలా చెబుతుంది: “గర్భధారణ సమయంలో లేదా అంతకు ముందు, సరైన ఆహారం తీసుకోకపోవడం, గర్భాశయంలోని బిడ్డ సరిగ్గా పెరగకపోవడానికి కారణమౌతుంది. అలాగే అటు తర్వాత తగినన్ని పాలు తయారు కావడానికి అవసరమైన కొవ్వును తన తల్లి శరీరంలో నిలువ చేయలేకపోడానికి కారణమౌతుంది. కాబట్టి, గర్భధారణ సమయంలోను, పాలిస్తున్న కాలంలోను వివిధ రకాల పదార్థాలు గల సమతుల్య ఆహారాన్ని తీసుకోవలసిన అవసరం ఉంది.”

స్తనాలను జాగ్రత్తగా ఉంచుకోవడం కూడా ప్రాముఖ్యమైయున్నది. గర్భంతోవున్న చివరి నెలల్లో, స్నానం చేసేటప్పుడు మీ స్తనాలను శుభ్రం చేయాలి, కాని సబ్బు రుద్దకూడదు. చనుమొనల చుట్టూవున్న నల్లటి భాగంలోవున్న గ్రంథులు, సూక్ష్మజీవులను నశింపజేసి, రోగం సోకకుండా కాపాడి, చను మొనలను తడిగా ఉంచే, చమురును ఉత్పత్తి చేస్తాయి. సబ్బు చనుమొనలను శుష్కింపజేస్తుంది, చమురును తొలగిస్తుంది, లేదా పనిచేయకుండా చేస్తుంది. మీ రొమ్ము శుష్కించినట్లయితే లేదా దురదపుట్టినట్లయితే మీరు ఉపశమనాన్నిచ్చే క్రీమ్‌ని గాని, లోషన్‌గాని పూయాలని కోరుకుంటారు. కాని, చనుమొనల పైన లేదా దాని చుట్టూవున్న నల్లని భాగంలో పూయకుండా ఉండాలి.

గర్భంతోవున్న సమయంలో చనుమొనలను వడివడిగా రుద్దుతూ వాటిని “గట్టిగా చేయాలని” ఒకప్పుడు డాక్టర్లు సలహా యిచ్చారు. పాలిచ్చే సమయంలో కురుపులు రాకుండా ఉండేందుకు యిలా సలహా యివ్వబడినప్పటికీ, యిలాంటి వ్యాయామాలు ఏమంత సహాయకరంగా ఉండవు. పాలు తాగే బాబును స్తనంవద్ద సరైన విధంగా పడుకోబెట్టనందువల్లే కురుపులు వస్తాయి.

సరైనవిధంగా పాలివ్వడానికి స్తనపరిమాణం, ఆకారం కారకాలు కావు, చనుమొనలు లోపలికున్నా లేదా తప్పడగావున్నా, బిడ్డ వాటిని పట్టుకోలేడు. మీరు ఒక్కో స్తనాన్ని, బొటనవ్రేలు, చూపుడువ్రేలుతో చనుమొనల వెనక పట్టుకొని మృదువుగా నొక్కడం ద్వారా చనుమొనలు వెలుపలికి వస్తున్నాయో లేదో చూడడానికి మీకు మీరే పరీక్షించుకోవచ్చు. అలా రాకపోతే డాక్టరును సంప్రదించండి. గర్భధారణ సమయంలో లేదా పాలివ్వని విరామ సమయాల్లో స్తనానికి ధరించడానికి ఒక తొడుగును ఆయన సిఫారసు చేయవచ్చు. ఆ తొడుగు తప్పడగావున్న లేదా లోపలికివున్న చనుమొనల ఆకారాన్ని మెరుగుపరుస్తుంది.

తొలిరోజులు

ప్రసవించిన గంటలోపల మీ బిడ్డకు పాలివ్వడం మొదలుపెడితే మీకు మంచిది. బిడ్డ పుట్టిన వెంటనే తల్లి, బిడ్డ బాగా అలసిపోతారు కాబట్టి, ఒకరితోనొకరు, వెంటనే వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండలేరని కొందరు తలంచవచ్చు. కాని తల్లి ఆ సమయంలోనే నూతన చైతన్యాన్ని పొందుతుంది, బిడ్డ తల్లి కడుపులో నుండి వచ్చి, బయటి వాతావరణంతో సర్దుకుపోడానికి కొన్ని నిమిషాలు తీసుకొని, తర్వాత రొమ్ము సుఖాన్ని పొందాలని ప్రయత్నం చేస్తుంది.

తల్లులు అప్పుడే పుట్టిన తమ బిడ్డలకు పసుపు రంగులోని స్వచ్ఛమైన కొలొస్ట్రమ్‌ అనే పదార్థాన్ని యివ్వగలరు. ఈ “పసుపు రంగు ద్రావకం” బిడ్డకు నిజంగా ప్రయోజనకరమైనది. హానికరమైన బాక్టీరీయాను ఎదిరించే అంశీభాగాలు యిందులో ఉన్నాయి. దీనిలో ప్రొటీన్లు ఎక్కువ మోతాదులోను, పంచదార, కొవ్వు పదార్థాలు తక్కువ మోతాదులోను ఉంటాయి. అది జీవితంలోని తొలి రోజుల్లో సంపూర్ణ ఆహారం. అనారోగ్య సమస్యలు ఏమీ లేనట్లయితే, బిడ్డకు వేరే ఆహారమో పానీయమో అవసరం లేదు. అదనంగా సీసా పాలు పట్టడం, బిడ్డను తల్లి పాలు తాగకుండా నిరుత్సాహపరుస్తుంది, ఎందుకంటే సీసా పాలు తాగడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు.

సాధారణంగా ప్రసవించిన రెండు నుండి ఐదు రోజుల తర్వాత తల్లులు కొలోస్ట్రమ్‌ లేకుండా పాలనుత్పత్తి చేయడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో స్తనానికి రక్తం ఎక్కువగా ప్రసరించడం మీ స్తనాలను పెద్దగాను మృదువుగాను చేస్తుంది. అది సహజమే. పాలివ్వడం సాధారణంగా అసౌకర్యాన్ని తొలగిస్తుంది. స్తనాలు పెద్దవవడం వలన కొన్నిసార్లు, చనుమొనలు లోపలికి వెళ్ళడానికి కారణమౌతుంది. అలాగవడం వలన బిడ్డ పాలు తాగడానికి కష్టమౌతుంది, గనుక మీరు కొంత పాలు చేతితో పిండి పారవేయాలి. మీరు రెండు చేతులు ఉపయోగించి ఒక్కో స్తనాన్ని పైభాగం నుండి చనుమొన వరకు మర్దనా చేయాలి.

మీ బాబు ఎంత పాలు తాగుతాడో అంచనా వేయలేరు, అయినా కంగారు పడనవసరం లేదు, మీకు కవల పిల్లలు పుట్టినా బిడ్డలకవసరమైన పాలు మీ శరీరం ఉత్పత్తి చేయడానికి సన్నద్ధమైవుంది. మీరు పాలిస్తున్న కొలది, ఎక్కువ పాలనుత్పత్తి చేయగలరు. చనుపాలు కాకుండా, సీసాపాలు, పాలపొడి కలిపిన ద్రావకాలు లేదా ఆవుపాలు పట్టకూడదనడానికి యిది ఒక కారణం. వాటిని మీ బిడ్డకు పడితే, బిడ్డ మీ పాలను ఎక్కువ తాగడు. చివరికి, మీరు తక్కువ పాలను ఉత్పత్తి చేస్తారు.

ది పోలిటిక్స్‌ ఆఫ్‌ బ్రెస్ట్‌ఫీడింగ్‌ అనే పుస్తకంలో గబ్రియేల్‌ పామెర్‌ యిలా వ్రాశారు: “నెలలు నిండి పుట్టిన ఆరోగ్యంగావున్న బిడ్డలు నిస్సహాయులు కాక, తమకు, తమ తల్లుల శరీరాలకు అనుకూలమైన విధంగా తమ ఆహారాన్ని వ్యవస్థీకరించుకోడానికి యితరులు అనుమతిస్తే, అలా చేయగలరు,” అవసరాన్నిబట్టి, సరఫరా ఉంటుందన్నది సూత్రం—మీ బిడ్డకు అవసరమైనప్పుడు (సాధారణంగా ఏడ్చినప్పుడు), పాలివ్వండి. మొదట్లో, ప్రతి రెండు మూడు గంటలకొకసారి పాలివ్వవలసి వస్తుంది. మీ బిడ్డ పాలు త్రాగే ప్రతిసారి, రెండు స్తనాల నుండి మీ బిడ్డను పాలు తాగనివ్వాలి. కొందరు బిడ్డలు విశ్రాంతి సమయాల్లో, విరామమిస్తూ తాగడానికి యిష్టపడుతున్నప్పటికీ, చాలా మంది బిడ్డలు 20 నుండి 40 నిమిషాల్లోగా పాలు తాగడం పూర్తి చేస్తారు. నెమ్మదిగా తాగే బిడ్డలు ఆహారం తీసుకోవడం పూర్తిచేయడానికి 60 నిమిషాల వరకు తీసుకుంటారు. సాధారణంగా, 24 గంటల్లో ఎనిమిది సార్లు బిడ్డ పాలు తాగుతున్నట్లయితే, వాడు పాలు తాగేటప్పుడు, గుటకలు వేయడం మీరు విన్నట్లయితే, ఐదవ రోజు తర్వాత ఎనిమిది లేదా అంతకన్నా ఎక్కువ పొత్తిగుడ్డలను తడిపినట్లయితే, వాడు కావలసినంత ఆహారం తీసుకుంటున్నట్లే.

బిడ్డను స్తనంవద్ద సరైన విధంగా ఎలా పట్టుకోవాలో నేర్చుకోవడమే, పాలివ్వడంలో మీకవసరమైన ముఖ్యమైన నైపుణ్యము. మీరు సరైన విధంగా పడుకోబెట్టకపోవడం బిడ్డ సరిగ్గా పాలు తాగలేకపోవడానికి కారణమౌతుంది. కొంతమంది బిడ్డలు తాగడానికి కూడా వెనకాడుతారు.

సరైన విధంగా పడుకోబెట్టకపోవడం వలన సాధారణంగా వచ్చే మరో సమస్య ఏమిటంటే, చనుమొనలు శుష్కించడం లేదా కురుపులు రావడం. బ్రెస్ట్‌ఫీడింగ్‌ సోర్స్‌ బుక్‌ యిలా చెబుతుంది: “అనేక కారణాల వలన చనుమొనలపై పుండ్లు ఏర్పడుతాయి. బిడ్డ ఏ విధంగా, ముఖ్యంగా ఎంత దగ్గరగా ‘ఆనుకుని పడుకొని ఉన్నాడు,’ అలాగే వాడి తల స్తనానికి ఏ వైపుగా పడుకోబెట్టి ఉందన్నది ముఖ్యం. సరైన విధంగా పడుకోబెట్టడానికి, మీ బిడ్డ స్తనానికి అతి దగ్గరగా, తల చక్కగా (పైకి గాని, కిందికి గాని, పక్కకు గాని కాకుండా) చనుమొనలను ఒకవైపుకు గుంజకుండా, నేరుగా ఉండాలి.”

మామూలుగా, బిడ్డ పెదవులు చనుమొనల నుండి దాదాపు మూడు సెంటీమీటర్లు స్తనాన్ని గట్టిగా కరుచుకొని ఉంటాయి. మీ బిడ్డ శరీరమంతా మీ వైపుకు ఒరిగి, సుదీర్ఘంగా పీల్చుకుంటున్నట్లయితే, విశ్రాంతిగా, సంతోషంగా ఉన్నట్లయితే, మీ చనుమొనలకు నొప్పి లేకున్నట్లయితే, మీరు సరైన విధంగా పడుకోబెట్టారని తెలుసుకోవచ్చు.

ఎప్పుడు ఆపాలి

కొన్ని వారాల తర్వాత, మీరు, మీ బిడ్డ పరస్పరం సన్నిహితులౌతారు. బహుశా, మీరు సుఖప్రదమైన, సంతోషకరమైన దినచర్యను కలిగివుంటారు. ఆ తర్వాత నాలుగు నుండి ఆరు నెలల వరకు మీ బిడ్డకు తల్లిపాలు తప్ప మరే ఆహారము, పానీయము అవసరం లేదు. దాని తర్వాత, క్రమేణా వేరే ఆహారాలను, సన్నగా తరిగిన కూరగాయలను, పండ్లను, పొడి చేసిన ధాన్యాలను, తినిపించవచ్చు. అయినప్పటికీ, మీ బిడ్డకు తొమ్మిది లేదా పది నెలలు వచ్చే వరకు, అతనికి కావలసిన ముఖ్య పోషకాహారం మీ పాలనుండే లభిస్తుంది; గట్టి ఆహార పదార్థాలను యిచ్చే ముందు మీ బిడ్డకు పాలివ్వడం ఎల్లవేళలా శ్రేయస్కరము.

మీరెంత కాలం పాలిస్తూ ఉండాలి? సాధ్యమైనంత కాలమివ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేస్తుంది. బిడ్డకు ఎంత వయస్సుందని చూడకుండా, వాని క్షేమం కోరి, ఎందరో తల్లులు రెండవ సంవత్సరం కూడా పాలిస్తూనే ఉన్నారు. మదరింగ్‌ యువర్‌ నర్సింగ్‌ టాడ్లర్‌ అనే పుస్తకం యిలా చెబుతుంది: “పిల్లలు పాలు తాగుతూ ఉండవలసిన అవసరాన్ని—పాలు తాగుతున్నప్పటి వారి సంతోషాన్ని, పాలివ్వనప్పటి వారి నిరాశను గ్రహించడం అంత కష్టమేమీ కాదు. బిడ్డకు పాలివ్వాలని బలవంతపెట్టే, సహజమైన కారణమేదంటే, బిడ్డను సంతోషపెట్టాలనేదే.”

ప్రేమగల సృష్టికర్తను గూర్చిన సాక్ష్యాధారం

అర్థరాత్రి, మిగిలిన కుటుంబ సభ్యులందరూ నిద్రిస్తున్నవేళలో, మీరు మీ బిడ్డకు పాలిస్తుండగా, యీ ఏర్పాటు చేసిన సృష్టికర్తను తలంచండి. దాన్ని సాధ్యం చేసే సంకీర్ణమైన శరీర ధర్మాలను అర్థం చేసుకోడానికి కష్టమైనప్పటికీ, పాలివ్వడమనే అద్భుతం, దేవుని జ్ఞానాన్ని, ప్రేమను గూర్చి తెలుసుకోడానికి మీకు సహాయపడగలదు.

తల్లిపాలకన్నా, పిల్లలకు శ్రేష్ఠమైన వేరే ఆహారం లేదన్న విషయాన్ని యోచించండి. అది బిడ్డ జీవితంలోని తొలి నెలల్లోని ఆహార పానీయాల అవసరతను పూర్తిగా తీరుస్తుంది. అదే సమయంలో, అది రోగాల బారి నుండి కాపాడే ఒక అద్భుతమైన మందు. అది సురక్షితమైనది, ఆరోగ్యాన్ని సంరక్షించేది, సిద్ధపాటు ఏమీ అవసరం లేనిది, ఖర్చు లేనిది. అది సార్వజనికంగా లభ్యమయ్యేది, శిశువు ఎదుగుతున్న కొలది, దాని ఉత్పత్తి ఎక్కువవుతుంది.

పాలివ్వడం అనేది తల్లి, బిడ్డ సంతోషించదగిన అనుభవమన్న విషయాన్ని గురించి తలంచండి. మాట్లాడుతూ, ఒంటిని తాకుతూ పాలిచ్చేటప్పుడు శారీరకంగా వెచ్చదనం లభిస్తూ ఉండడం తల్లికి బిడ్డకు మధ్య గల బలమైన అనురాగ బంధాన్ని, సన్నిహితత్వాన్ని వృద్ధి చేయడానికి సహాయపడుతుంది.

నిజంగా, యీ అద్భుతమైన ఏర్పాటును చేసిన సృష్టికర్త ఎంతో స్తుతించబడాలి. దావీదు చెప్పిన మాటలను మీరు తిరిగి ఉచ్చరిస్తారనడంలో సందేహం లేదు: “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు.”—కీర్తన 139:14. (g94 8/22)

[12వ పేజీలోని బాక్సు]

భర్తలు ఎలా సహాయం చేయగలరు

• మీ భార్య బిడ్డకు పాలివ్వడాన్ని మీరంగీకరిస్తున్నారని ఆమెకు తెలియనివ్వండి. ఆమెకు హామి యివ్వండి, ఆప్యాయతతో ఆమెకు మద్దతునివ్వండి.

• మీ భార్య గర్భిణిగా ఉన్నప్పుడు, పాలిచ్చే సమయంలోను సమతుల్య ఆహారాన్ని తీసుకోడానికి సహాయం చేయండి.

• ఆమెకు కావలసినంత విశ్రాంతి లభించేలా చూడండి. స్త్రీ అలసిపోతే, కావలసినంత పాలు ఉత్పత్తి కావడం కష్టం కావచ్చు. మిగిలిన పిల్లలను చూసుకుంటూ, యితర యింటి పనులను చూసుకుంటూ ఆమె మోస్తున్న బరువులను తగ్గించడానికి మీరు సహాయపడగలరా?

• మీ భార్య విశ్రాంతి తీసుకొని సంతోషంగా ఉంటే ఆమెకు పాలు కూడా బాగా తయారవుతాయి. మీకు సాధ్యమైనంత మట్టుకు ఆమెను సంతోషంగా ఉంచండి. ఆమె సమస్యలను విని, పరిష్కరించడానికి సహాయం చేయండి.

[13వ పేజీలోని బాక్సు]

తల్లిపాలు, సీసాపాలు

“తల్లిపాలు, మరింత పోషక గుణము కలవి, అవి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి, సాధారణ రోగాల నుండి బిడ్డను కాపాడతాయి. తల్లులకు రొమ్ము, అండాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాలను తగ్గిస్తాయి. శిశు ఆహారం మరింత ఖరీదయినదే కాకుండా, తరచూ దానిలో అపరిశుభ్రమైన నీళ్ళు ఎక్కువగా కలుస్తాయి. కడగని సీసాలో పిల్లలకు యివ్వబడుతూ ఉంటాయి. పేద వర్గాల్లోని, పరిస్థితుల్లో వ్యత్యాసం ఎంత ఎక్కువ ఉందంటే, మళ్ళీ లోకంలోని తల్లులందరూ తమ పిల్లలకు మొదటి నాలుగు నుండి ఆరు నెలల వరకు, తమపాలు మాత్రమే యిచ్చినట్లయితే, ప్రతి సంవత్సరం పది లక్షల మంది శిశువుల ప్రాణాలను రక్షించవచ్చు.”—యునైటెడ్‌ నేషన్స్‌ చిల్డ్రన్స్‌ ఫండ్‌ ప్రచురించిన ప్రచురణయైన ది స్టేట్‌ ఆఫ్‌ ది వర్ల్‌డ్స్‌ చిల్డ్రన్‌ 1993.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి