విద్య—యెహోవాను స్తుతించేందుకు దానిని వినియోగించండి
“తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయనయందు ఏ దుర్నీతియులేదు.”—యోహాను 7:18.
1. విద్యాభ్యాసం ఎప్పుడు, ఏవిధంగా ప్రారంభమైంది?
విద్యాభ్యాసం చాలా కాలం క్రిందటే ప్రారంభమైంది. గొప్ప విద్యాబోధకుడు ఉపదేశకుడునైన యెహోవా దేవుడు తన ఆదిసంభూతుడగు కుమారుని సృష్టించిన వెంటనే విద్యాభ్యాసం ఆరంభమైంది. (యెషయా 30:20, NW; కొలొస్సయులు 1:15) గొప్ప విద్యాబోధకుని నుండి ప్రత్యక్షంగా నేర్చుకొనగల్గిన వాడొకడున్నాడు! తండ్రితో అన్యోన్య సహవాసం కల్గివున్న కోటానుకోట్ల సంవత్సరాల కాలంలో, ఆ కుమారుడు—యేసు క్రీస్తుగా ప్రసిద్ధిగాంచిన వాడు—యెహోవా దేవుని లక్షణాలను, క్రియలను సంకల్పాలను గూర్చిన అమూల్యమైన విద్యను పొందాడు. ఆ తరువాత, భూమిపై మానవునిగా ఉన్నప్పుడు యేసు, “నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాన”ని చెప్పగలిగాడు.—(ఇటాలిక్కులు మావి.) యోహాను 8:28.
2-4. (ఎ) యోహాను 7వ అధ్యాయం ప్రకారం, సా.శ. 32లో జరిగిన పర్ణశాలల పండుగకు యేసు హాజరైనప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? (బి) యేసు బోధనా సామర్థ్యాన్ని గూర్చి యూదులు ఎందుకు ఆశ్చర్యపడ్డారు?
2 తాను పొందిన విద్యను యేసు ఎలా వినియోగించాడు? మూడున్నర సంవత్సరాల తన భూపరిచర్య కాలమంతటిలో తాను నేర్చుకొనిన దానిని, ఆయన ఇతరులతో అలయక పంచుకున్నాడు. అయితే, ఒక ప్రధానమైన సంకల్పాన్ని మనస్సులో ఉంచుకొనే దీనిని చేశాడు. మరి అదేమిటి? యోహాను 7వ అధ్యాయంలోని యేసు మాటలను మనం పరిశీలిద్దాం. ఆ అధ్యాయంలో ఆయన తన బోధల మూలాన్ని సంకల్పాన్ని వివరించాడు.
3 సందర్భాన్ని పరిశీలించండి. అది యేసు బాప్తిస్మం తీసుకొన్న దాదాపు మూడు సంవత్సరాల తర్వాత అంటే సా.శ. 32 శరదృతు కాలం. యూదులు పర్ణశాలల పండుగ నిమిత్తం యెరూషలేములో సమకూడారు. ఆ పండుగ మొదటి కొన్ని దినాలలో యేసును గురించి అందరూ చర్చించుకోవడం జరిగింది. సగము పండగైనప్పుడు, యేసు ఆలయంలోనికి వెళ్లి బోధించనారంభించాడు. (యోహాను 7:2, 10-14) ఎప్పటివలెనే ఆయన తనను తాను ఒక గొప్ప బోధకునిగా రుజువు చేసుకున్నాడు.—మత్తయి 13:53, 54; లూకా 4:22.
4 యోహాను 7వ అధ్యాయంలోని 15వ వచనం వచనమిలా చెబుతోంది: “యూదులు అందుకు ఆశ్చర్యపడి—[పాఠశాలల్లో] చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి.” వారెందుకు అలా ఆశ్చర్యపడ్డారో మీరు గ్రహించగలరా? యేసు రబ్బీయుల ఏ పాఠశాలకూ వెళ్లలేదు గనుక ఆయన విద్యావిహీనుడు—లేక వారలా తలంచారు! అయినా, యేసు పరిశుద్ధ లేఖనాల నుండి భాగాలను సులభంగా కనుగొని చదవగలిగాడు. (లూకా 4:16-21) గలిలయవాడైన ఈ వడ్రంగి, మోషే ధర్మశాస్త్రమందు వారికి ఉపదేశించాడు కూడా! (యోహాను 7:19-23) ఇదెలా సాధ్యమయ్యింది?
5, 6. (ఎ) తన బోధ యొక్క మూలాన్ని యేసు ఎలా వివరించాడు? (బి) యేసు తన విద్యను ఏ రీతిలో వినియోగించాడు?
5 మరి యోహాను 7:16, 17వచనాల్లో మనం చదువుతున్నట్లుగా, యేసు ఇలా వివరించాడు: “నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించుచున్నానో, వాడు తెలిసికొనును.” యేసును విద్యావంతునిగా చేసినదెవరో తెలుసుకోవాలని వారు అనుకున్నారు, ఆయన తాను దేవుని నుండే బోధింపబడ్డానని స్పష్టంగా వారికి జవాబిచ్చాడు!—యోహాను 12:49; 14:10.
6 యేసు తన విద్యను ఎలా వినియోగించాడు? యోహాను 7:18లో వ్రాయబడినట్లుగా, ఆయన ఇలా జవాబిచ్చాడు: “తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయనయందు ఏ దుర్నీతియు లేదు.” (ఇటాలిక్కులు మావి.) “పరిపూర్ణజ్ఞానము గలవా”డైన యెహోవాకు మహిమను తేవడానికి, యేసు తన విద్యను వినియోగించడం ఎంత సమంజసమో కదా!—యోబు 37:16.
7, 8. (ఎ) విద్య ఎలా వినియోగించబడాలి? (బి) సమతూకమైన విద్యకుగల నాల్గు ప్రధానమైన లక్ష్యాలు ఏవి?
7 ఆవిధంగా, విద్యను మనల్ని మహిమపర్చుకోవడానికి కాదుగాని యెహోవాను స్తుతించేందుకు వినియోగించాలని, మనం యేసు నుండి ఒక అమూల్యమైన పాఠాన్ని నేర్చుకుంటాము. విద్యను వినియోగించడానికి, అంతకన్నా శ్రేష్ఠమైన మార్గమేమీ లేదు. అయితే, యెహోవాకు స్తుతిని తెచ్చేందుకు విద్యను మీరెలా వినియోగించగలరు?
8 విద్యనభ్యసించడం అంటే “విశే[షంగా] ఒక నిపుణత, వర్తకం లేక వృత్తిలో, క్రమమైన ఉపదేశం ద్వారా మరియు పర్యవేక్షణతో కూడిన అభ్యాసం ద్వారా తర్ఫీదు ఇవ్వడమే.” ఒక సమతూకమైన విద్యాభ్యాసానికి ఉండాల్సిన నాల్గు ప్రధానమైన లక్ష్యాలను మరియు వీటిలో ప్రతీది యెహోవాను స్తుతించేందుకు ఎలా వినియోగింపబడగలదో మనం ఇప్పుడు పరిశీలిద్దాము. ఒక సమతూకమైన విద్య (1) బాగా చదవడానికి (2) స్పష్టంగా వ్రాయడానికి (3) మానసికంగా నైతికంగా ఎదగడానికి మరియు (4) దైనందిన జీవితానికి అవసరమైన ఆచరణాత్మకమైన తర్ఫీదును పొందడానికి మనకు సహాయపడాలి.
బాగా చదవడానికి నేర్చుకోవడం
9. మంచి చదువరిగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?
9 పేర్కొనబడిన వాటిలో మొదటిది, బాగా చదవడానికి నేర్చుకోవడం. మంచి చదువరిగా ఉండడమెందుకు అంత ప్రాముఖ్యం? ది వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా ఇలా వివరిస్తోంది: “చదవడం . . . నేర్చుకోవడానికి ఆధారం. మరి ప్రతిదిన జీవితంలోని అతి ప్రాముఖ్యమైన నైపుణ్యాలలో ఒకటి . . . ప్రతిభావంతులైన చదువరులు ఫలభరితమగు సర్వతోముఖాభివృద్ధిచెందే సమాజాన్ని నిర్మించడానికి తోడ్పడతారు. అదే సమయంలో, తమంతట తాముగా సంపూర్ణమైన మరింత సంతుష్టి సహితమైన జీవితాలను అనుభవిస్తారు.”
10. దేవుని వాక్యాన్ని చదవడం సంతృప్తిదాయకమైన జీవితాలను అనుభవించడానికి మనకెలా సహాయపడ్తుంది?
10 సర్వసాధారణమైన చదువే మనల్ని “సంపూర్ణమైన, మరింత సంతుష్టి సహితమైన జీవితాలను” అనుభవించేలా చేయగల్గితే, దేవుని వాక్యాన్ని చదవడంలో ఇది మరెంత నిజమో కదా! అలా చదవడం యెహోవా ఆలోచనలకు సంకల్పాలకు మన మనస్సుల్ని తెరుస్తుంది మరి వీటిని స్పష్టంగా అర్థం చేసుకోవడం మన జీవితాలకు అర్థాన్ని ఇస్తుంది. అంతేకాకుండా, “దేవుని వాక్యము సజీవమై బలముగల”దని హెబ్రీయులు 4:12 చెబుతుంది. మనం దేవుని వాక్యాన్ని చదివి దానిని ధ్యానిస్తుండగా, దాని రచయితకు మనం సన్నిహితమౌతాం, ఆయనను మరింత ప్రీతిపర్చేవారిగా అవ్వడానికి మన జీవితాలలో మార్పులు చేసుకొనేందుకు మనం ప్రేరేపించబడతాము. (గలతీయులు 5:22, 23; ఎఫెసీయులు 4:22-24) మనం చదివిన అమూల్యమైన సత్యాలను ఇతరులతో పంచుకొనేందుకు కూడా మనం కదిలింపబడతాము. ఇదంతా గొప్ప విద్యాబోధకుడైన యెహోవా దేవునికి స్తుతులను తెస్తుంది. మన చదివే సామర్థ్యాన్ని వినియోగించేందుకు కచ్చితంగా ఇంతకంటే శ్రేష్ఠమైన మార్గమేదీ లేదు!
11. సమతూకమైన వ్యక్తిగత పఠన కార్యక్రమంలో ఏవి చేర్చబడాలి?
11 యౌవనులైనా వృద్ధులైనా, చదవడం మన క్రైస్తవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన భాగాన్ని నిర్వహిస్తున్నందున మనం బాగా చదవడాన్ని నేర్చుకోవాలి. సమతూకమైన వ్యక్తిగత పఠన కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని క్రమంగా చదవడంతోపాటు, ప్రతిదినము లేఖనములను పరిశీలించుట నుండి బైబిలు వచనాన్ని తలపోయడం, కావలికోట, తేజరిల్లు!లను చదవడం మరి క్రైస్తవ కూటాలకు సిద్ధపడడం వంటివి చేరి ఉండాలి. క్రైస్తవ పరిచర్య విషయమేమిటి? బహిరంగంగా ప్రకటించడం, ఆసక్తిగల వ్యక్తులను పునర్దర్శించడం మరి గృహ బైబిలు పఠనాలను నిర్వహించడం వంటి వాటన్నిటికీ, బాగా చదివే సామర్థ్యం అవసరమని తేటతెల్లమవుతుంది.
స్పష్టంగా వ్రాయడాన్ని నేర్చుకోవడం
12. (ఎ) స్పష్టంగా వ్రాయడాన్ని నేర్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) అన్ని వ్రాతలకన్నా గొప్ప వ్రాత ఏది?
12 సమతూకమైన విద్య, స్పష్టంగా వ్రాయడాన్ని నేర్చుకోవడానికి మనకు సహాయపడాలన్నదే రెండవ సంకల్పం. వ్రాయడం, ఇతరులకు మన మాటలను అభిప్రాయాలను తెలియజేయడం మాత్రమే కాదుగాని వాటిని పరిరక్షిస్తుంది కూడా. అనేక శతాబ్దాల క్రిందట ప్రేరేపిత లేఖనాలుగా రూపొందింపబడిన మాటలను దాదాపు 40 మంది యూదులు పపైరస్పై లేక పల్చని చర్మపు కాగితంపై లిఖించారు. (2 తిమోతి 3:16) నిశ్చయంగా అన్ని వ్రాతలకన్నా ఇది గొప్ప వ్రాత! శతాబ్దాల కాలంలో ఆ పరిశుద్ధ లేఖనాలను, నకలు ప్రతినకలు చేయడానికి యెహోవా నిశ్చయంగా నడిపించినందున నమ్మదగినరూపంలో వాటిని మనం పొందాము. మౌఖిక ప్రసారంపై ఆధారపడడానికి బదులు తన వాక్యాలు వ్రాయబడేలా చేసినందుకు యెహోవాకు మనం కృతజ్ఞులం కామా?—నిర్గమకాండము 34:27, 28, పోల్చండి.
13. ఇశ్రాయేలీయులకు వ్రాయడం తెలుసుననే దానిని ఏది సూచిస్తుంది?
13 ప్రాచీన కాలాల్లో, మెసొపొటేమియా మరియు ఐగుప్తులలోని లేఖికులలాంటి ప్రత్యేక ఆధిక్యతలుగల తరగతుల వారు మాత్రమే విద్యావంతులై ఉండిరి. ఆ దేశాలకు భిన్నంగా ఇశ్రాయేలీయులలోని అందరూ విద్యావంతులై ఉండాలని ప్రోత్సహించబడ్డారు. ఇశ్రాయేలీయులు, తమ ఇండ్ల ద్వారబంధాలపై వ్రాసుకోవాలని ద్వితీయోపదేశకాండము 6:8, 9లలో ఇవ్వబడిన ఆజ్ఞ స్పష్టంగా అలంకారికమైనదే అయినా, వారికి వ్రాయడమెలాగో తెలుసుననే భావాన్నిస్తుంది. చిన్న వయస్సులోనే, ఎలా వ్రాయాలో పిల్లలకు నేర్పించబడేది. ప్రాచీన హెబ్రీ వ్రాతల అతిపురాతనమైన వాటిలో ఒకటైన గెజెరు క్యాలెండరును పాఠశాల విద్యార్థి కంఠస్థం కొరకు ఉపయోగించారని కొంతమంది విద్వాంసులు తలంచారు.
14, 15. వ్రాసే సామర్థ్యాన్ని ఉపయోగించడానికి కొన్ని అనుకూలమైన, హితకరమైన మార్గాలు ఏవి?
14 అయితే వ్రాసే సామర్థ్యాన్ని అనుకూలమైన, హితకరమైన రీతిలో మనమెలా వినియోగించగలము? కచ్చితంగా కూటాలలో, సమావేశాలలో, జిల్లా సమావేశాలలో వ్రాసుకోవడం ద్వారా అలా చేయగలం. “కొన్ని మాటలే” వ్రాసినప్పటికి ఒక ఉత్తరం రోగగ్రస్థుడైన వానికి ప్రోత్సాహాన్ని ఇవ్వగలదు లేదా మన ఎడల దయగావున్న లేక మనకు ఆతిథ్యాన్నిచ్చిన ఒక సహోదరునికి లేదా ఒక సహోదరికి మన కృతజ్ఞతను తెలియజేయగలదు. (1 పేతురు 5:12, NW) సంఘంలో ఉన్న ఒకరు తమ ప్రియమైన వారిని మరణమందు కోల్పోతే, ఓ క్లుప్తమైన ఉత్తరమో కార్డో మన తరపున “ధైర్యపర”స్తూ ఆ వ్యక్తితో మాట్లాడగలదు. (1 థెస్సలొనీకయులు 5:14) క్యాన్సర్ మూలంగా తన తల్లిని కోల్పోయిన ఒక సహోదరి ఇలా వివరిస్తోంది: “ఒక స్నేహితురాలు మంచి ఉత్తరమొకటి వ్రాసింది. అది నిజంగా సహాయపడింది ఎందుకంటే దానిని నేను పదేపదే చదవగలిగాను.”
15 యెహోవాకు స్తుతులు తెచ్చేందుకు వ్రాసే సామర్థ్యాన్ని ఉపయోగించడానికి ఒక శ్రేష్ఠమైన విధానమేమంటే రాజ్యసాక్ష్యాన్ని ఇవ్వడానికి ఒక ఉత్తరాన్ని వ్రాయడమే. దూర ప్రాంతాలలో నివసిస్తున్న ఆసక్తికలిగిన క్రొత్త వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం కొన్నిసార్లు అవసరమైవుండవచ్చు. అస్వస్థత మిమ్మల్ని ఇంటింటి పరిచర్యకు వెళ్లకుండా తాత్కాలికంగా ఆటంకపర్చవచ్చు. అలాంటప్పుడు బహుశ ఒక ఉత్తరం, మీరు సాధారణంగా ముఖాముఖిగా చెప్పే దానినే వ్రాత పూర్వకంగా తెలియజేయగలదు.
16, 17. (ఎ) రాజ్య సాక్ష్యాన్నిచ్చేందుకు ఉత్తరం వ్రాయడం యొక్క విలువను ఏ అనుభవం చూపిస్తోంది? (బి) అలాంటి అనుభవాన్ని మీరు తెలియజేయగలరా?
16 ఒక అనుభవాన్ని పరిశీలించండి. చాలా సంవత్సరాల క్రిందట, ఒకవ్యక్తి మరణవార్త స్థానిక వార్తాపత్రికలో ప్రకటింపబడింది, మరణమందు అతనిని కోల్పోయిన ఆ విధవరాలికి రాజ్య సాక్ష్యాన్నిస్తూ ఒక సహోదరి ఒక ఉత్తరాన్ని వ్రాసింది. దానికి ప్రత్యుత్తరం లేదు. మరి 21 కంటే ఎక్కువ సంవత్సరాలు గడిచిపోయిన తరువాత అంటే నవంబరు 1994లో ఆ స్త్రీ యొక్క కుమార్తె నుండి సహోదరికొక ఉత్తరం వచ్చింది. ఆ కుమార్తె ఇలా వ్రాసింది:
17 “నా తండ్రి మరణానంతరం నా తల్లిని ఓదార్చేందుకు ఏప్రిల్ 1973లో మీరు ఆమెకు ఒక ఉత్తరం వ్రాశారు. అప్పుడు నాకు తొమ్మిదేండ్లు. నా తల్లి బైబిల్ని పఠించినా ఆమె ఇప్పటికీ యెహోవా సేవకురాలు కాలేకపోయింది. అయితే, ఆమె పఠనం చివరకు సత్యంతో నేను సహవసించడానికి నడిపింది. ఆ ఉత్తరాన్ని పొందిన 15 సంవత్సరాలకు అంటే 1988లో నేను బైబిలు పఠనాన్ని ప్రారంభించాను. మార్చి 9, 1990న నేను బాప్తిస్మం పొందాను. చాలా సంవత్సరాల క్రిందట మీరు వ్రాసిన ఉత్తరానికి నేనెంతో కృతజ్ఞురాలిని మరి మీరు విత్తిన ఆ విత్తనాలు యెహోవా సహాయంతో మొలకెత్తాయని మీకు తెలియజేయడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. మీరు వ్రాసిన ఉత్తరాన్ని దాచుకోమని మా అమ్మ నాకిచ్చింది మరి మీరెవరో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఈ ఉత్తరం మీకు అందుతుందని నేను నిరీక్షిస్తున్నాను.” తన చిరునామా మరి ఫోను నెంబరు వ్రాసివున్న ఆ కుమార్తె ఉత్తరం, చాలా సంవత్సరాల క్రిందట తన తల్లికి ఉత్తరం వ్రాసిన సహోదరికి నిశ్చయంగా చేరింది. ఇతరులతో రాజ్య నిరీక్షణను పంచుకోవడానికి ఇప్పటికీ ఉత్తరాలు వ్రాస్తున్న—ఆ సహోదరి నుండి ఆ యౌవన స్త్రీకి ఫోనుకాల్ రావడం ఆమెను ఎంతగా ఆశ్చర్యపర్చిందో ఊహించండి!
మానసికంగా నైతికంగా ఆత్మీయంగా ఎదగడం
18. బైబిలు కాలాల్లో, తమ పిల్లల యొక్క మానసిక నైతిక విద్యాభ్యాసం విషయంలో తలిదండ్రులు ఎలా శ్రద్ధ తీసుకునేవారు?
18 సమతూకమైన విద్య మానసికంగా నైతికంగా ఎదగడానికి మనకు సహాయపడాలన్నదే మూడవ లక్ష్యం. బైబిలు కాలాల్లో, పిల్లలకు మానసిక మరియు నైతిక విద్యను అభ్యసింపజేయడం అనేది తలిదండ్రుల ప్రథమ కర్తవ్యాలలో ఒకటిగా పరిగణించబడేది. పిల్లలకు చదవడం, వ్రాయడం నేర్పించడం మాత్రమే కాదుగాని, మరి ప్రాముఖ్యంగా వారి జీవిత కార్యక్రమాలన్నీ చేరివున్న దేవుని ధర్మశాస్త్రమందు బోధించడం జరిగేది. ఆవిధంగా, విద్యాభ్యాసమందు, వారి మతపరమైన కర్తవ్యాలు, వివాహం, కుటుంబ బాంధవ్యాలు, మరి లైంగిక నైతికత వంటి వాటిని నియంత్రించే సూత్రాల్ని గూర్చిన, అలాగే తమ తోటిమానవుల ఎడల వారికిగల కర్తవ్యాలను గూర్చిన ఉపదేశాలు చేరివుండేవి. అలాంటి విద్యాభ్యాసం, వారు మానసికంగా నైతికంగా మాత్రమే కాదుగాని ఆత్మీయంగా కూడా ఎదగడానికి వారికి తోడ్పడింది.—ద్వితీయోపదేశకాండము 6:4-9, 20, 21; 11:18-21.
19. శ్రేష్ఠమైన నైతిక విలువలకు అనుగుణ్యంగా జీవించేలా మనకు చూపించే మరియు ఆత్మీయంగా ఎదగడానికి మనకు తోడ్పడే విద్యను మనమెక్కడ కనుగొనగలము?
19 మరి నేటి విషయమేమిటి? మంచి లౌకిక విద్య ప్రాముఖ్యం. అది మనం మానసికంగా ఎదగడానికి సహాయపడుతుంది. కాని శ్రేష్ఠమైన నైతిక విలువలకు అనుగుణ్యంగా జీవించేలా మనకు చూపించే మరియు ఆత్మీయంగా ఎదగడానికి మనకు తోడ్పడే విద్యను మనమెక్కడ కనుగొనగలము? భూమిపై మరెక్కడా లభ్యమవ్వని దైవపరిపాలనా విద్యా కార్యక్రమం క్రైస్తవ సంఘంలోనే మనకు లభ్యమౌతున్నది. మనం వ్యక్తిగతంగా బైబిలును మరి బైబిలు ఆధారిత ప్రచురణలను పఠించడం ద్వారా అలాగే క్రైస్తవ కూటాల్లో, సమావేశాల్లో, జిల్లా సమావేశాల్లో అందించబడుతున్న ఉపదేశం ద్వారా మనం ఈ అమూల్యమైన, ఎల్లప్పుడూ కొనసాగే విద్యను—దైవిక విద్యను—ఉచితంగా పొందగలము! మనకు అదేమి బోధిస్తుంది?
20. దైవిక విద్య మనకు ఏమి బోధిస్తుంది, దాని నుండి వచ్చే ఫలితాలు ఏమిటి?
20 మనం బైబిల్ని పఠించడం ప్రారంభించినప్పుడు, ‘మూలోపదేశములైన’ ప్రాథమిక బోధలను మనం నేర్చుకుంటాం. (హెబ్రీయులు 6:1) మనం కొనసాగిస్తుండగా, “బలమైన ఆహారము”—అంటే లోతైన సత్యాలను మనం తీసుకుంటాం. (హెబ్రీయులు 5:14) అయితే అంతకన్నా ఎక్కువగా, దేవుడు మనం ఎలా జీవించాలని కోరుతున్నాడో అలా జీవించడాన్ని మనకు బోధించే దైవిక సూత్రాలను మనం నేర్చుకుంటాం. ఉదాహరణకు, ‘శరీరానికి కల్మషము’ కలుగజేసే అలవాట్లను అభ్యాసాలను విడనాడాలని అధికారుల ఎడల వ్యక్తుల ఎడల మరి ఇతరుల ఆస్తుల ఎడల గౌరవాన్ని కల్గివుండాలని మనం నేర్చుకుంటాం. (2 కొరింథీయులు 7:1; తీతు 3:1, 2; హెబ్రీయులు 13:4) అంతేగాక, మనం మన పనిలో నిజాయితీగా ఉండడం మరియు కష్టపడడం యొక్క ప్రాముఖ్యతను అలాగే లైంగిక నైతికత విషయంలో బైబిలు ఆజ్ఞలకు అనుగుణ్యంగా జీవించడంలోని విలువను ప్రశంసించ నేర్చుకుంటాం. (1 కొరింథీయులు 6:9, 10; ఎఫెసీయులు 4:28) మన జీవితాల్లో ఈ సూత్రాలను అన్వయించుకోవడంలో మనం పురోభివృద్ధి సాధిస్తుండగా, మనం ఆత్మీయంగా ఎదుగుతాం మరి దేవునితో మన సంబంధం పటిష్ఠమౌతుంది. అంతేకాకుండా, మనమెక్కడ జీవించినప్పటికీ మన దైవిక ప్రవర్తన మనల్ని మంచి పౌరులుగా చేస్తుంది. మరది దైవిక విద్యకు ఆధారభూతుడైన—యెహోవా దేవునికి స్తుతులను చెల్లించేలా ఇతరుల్ని కదిలించవచ్చు.—1 పేతురు 2:12.
దైనందిన జీవితం కొరకైన ఆచరణాత్మకమైన తర్ఫీదు
21. బైబిలు కాలాల్లో పిల్లలు ఏ ఆచరణాత్మకమైన తర్ఫీదును పొందేవారు?
21 సమతూకమైన విద్య యొక్క నాల్గవ లక్ష్యం ఏమంటే దైనందిన జీవితానికి అవసరమైన ఆచరణాత్మకమైన తర్ఫీదును ఒకవ్యక్తికి ఇవ్వడమే. బైబిలు కాలాల్లో తలిదండ్రులు ఇచ్చే విద్యాభ్యాసంలో ఆచరణాత్మకమైన తర్ఫీదు చేరివుండేది. బాలికలకు గృహ నైపుణ్యాలు బోధింపబడేవి. ఇవి అనేకమైనవి మరి విభిన్నమైనవి అయ్యుండవచ్చని సామెతలు 31:10-31 పుస్తకంలోని ఆఖరి అధ్యాయం చూపిస్తుంది. అలా, బాలికలు నూలు వడకడం, నేత నేయడం, వండడం, మరి సాధారణ గృహ నిర్వహణ, వర్తకం, స్థిరాస్తి వ్యవహారాలను నిర్వహించడం వంటి వాటిని చేయడానికి సిద్ధపడేవారు. బాలురకు సాధారణంగా తమ తండ్రి చేసే లౌకిక వృత్తి, వ్యవసాయమైనా లేక ఏదోక వ్యాపారమో లేక వృత్తి విద్యో బోధింపబడేది. యేసు, తనని పెంచిన తండ్రియైన యోసేపు నుండి వడ్రంగి పనిని నేర్చుకున్నాడు; అందుకే ఆయన “వడ్లవాని కుమారుడు” అనే కాక “వడ్లవాడు” అని కూడా పిలువబడ్డాడు.—మత్తయి 13:55; మార్కు 6:3.
22, 23. (ఎ) విద్య పిల్లల్ని దేనికొరకు సిద్ధం చెయ్యాలి? (బి) అదనపు విద్య అవసరమని అన్పించినప్పుడు దానిని ఎన్నుకోవడంలో మన దృక్పథం ఏమై ఉండాలి?
22 నేడు కూడా సమతూకమైన విద్యయందు, ఏదో ఒకనాడు కుటుంబ అవసరతల్ని తీర్చడానికి సంసిద్ధం కావడం చేరివుంది. 1 తిమోతి 5:8నందు కనుగొనబడే అపొస్తలుడైన పౌలు మాటలు, ఒకని కుటుంబాన్ని పోషించడమనేది ఓ పవిత్రమైన కర్తవ్యమని తెలియజేస్తున్నాయి. ఆయన ఇలా వ్రాశాడు: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.” కాబట్టి విద్య, జీవితంలో వారు చేపట్టాల్సిన బాధ్యతల కొరకు పిల్లల్ని సిద్ధపర్చాలి, అలాగే వారు సమాజంలో కష్టించి పనిచేసే సభ్యులుగా తయారు కావడానికి సంసిద్ధపర్చాలి.
23 మనం లౌకిక విద్యను ఎంత మట్టుకు ఆర్జించాలి? ఇది ఒక దేశానికి మరో దేశానికి భిన్నంగా ఉండవచ్చు. అయినా చట్టం కోరేదానికన్నా ఉద్యోగ విపణి అదనపు తర్ఫీదును అడిగితే, అనుబంధ విద్య లేక తర్ఫీదును గురించి, అటువంటి అదనపు చదువుల వల్ల వచ్చే సంభావ్య ప్రయోజనాల్ని, అవరోధాల్ని తూచి చూసుకుంటూ ఒక నిర్ణయం తీసుకోవడానికి తలిదండ్రులు తమ పిల్లలకు మార్గ నిర్దేశాన్నివ్వాలి. అయితే, అదనపు విద్య అవసరమని అన్పించినప్పుడు దానిని ఎన్నుకోవడంలో ఒకని దృక్పథం ఏమై ఉండాలి? కచ్చితంగా ఐశ్వర్యమో స్వయం ఘనతో లేక పొగడ్తలో కాదు. (సామెతలు 15:25; 1 తిమోతి 6:17) విద్య యెహోవాకు స్తుతిని తెచ్చేందుకే వినియోగించబడాలి అని యేసు మాదిరి నుండి మనం నేర్చుకొనిన పాఠాన్ని గుర్తుంచుకోండి. మనం అదనపు విద్యను ఎంచుకుంటే క్రైస్తవ పరిచర్యలో సాధ్యమైనంత పూర్తిగా యెహోవాను మనం సేవించగలిగేలా తగిన రీతిలో మనకు మనం ఆర్థిక మద్దతును ఇచ్చుకోవడమనే కోరికే మన దృక్పథమై ఉండాలి.—కొలొస్సయులు 3:23, 24.
24. యేసు నుండి నేర్చుకొనిన ఏ పాఠాన్ని మనమెన్నడూ మర్చిపోకూడదు?
24 కాబట్టి, సమతూకమైన లౌకిక విద్యను పొందడానికి చేసే మన ప్రయత్నాలలో పట్టుదల కలిగివుందాం. యెహోవా సంస్థలోనే ఎల్లప్పుడూ కొనసాగే దైవిక విద్యా కార్యక్రమం నుండి పూర్తి ప్రయోజనాన్ని మనం పొందుదము గాక. ఈ భూనివాసులలోకెల్లా అత్యంత గొప్ప విద్యావేత్తయైన యేసు క్రీస్తు నుండి మనం నేర్చుకొనిన అమూల్యమైన పాఠాన్ని మనమెన్నడూ మర్చిపోకూడదు—విద్య మనల్ని ఘనపర్చుకోవడానికి కాదుగాని అందరికన్నా అత్యంత గొప్ప విద్యాబోధకుడైన యెహోవా దేవునికి స్తుతులను తేవడానికి వినియోగింపబడాలి!
మీ జవాబు ఏమిటి?
◻ యేసు తన విద్యను ఏవిధంగా వినియోగించాడు?
◻ బాగా చదవడాన్ని నేర్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
◻ యెహోవాకు స్తుతుల్ని తెచ్చేందుకు వ్రాసే సామర్థ్యాన్ని మనమెలా వినియోగించవచ్చు?
◻ నైతికంగానూ ఆత్మీయంగానూ పురోభివృద్ధి చెందడానికి దైవిక విద్య మనకు ఎలా తోడ్పడ్తుంది?
◻ సమతూకమైన విద్యలో ఏ ఆచరణాత్మకమైన తర్ఫీదు చేర్చబడాలి?
[13వ పేజీలోని బాక్సు]
విద్యాబోధకులకు అభ్యాసదాయకమైన సహాయం
వాచ్‌టవర్ సొసైటీ 1995/96 “ఆనందమయ స్తుతికర్తలు” జిల్లా సమావేశంలో, యెహోవాసాక్షులు మరియు విద్య (ఆంగ్లం) అనే పేరుగల ఒక క్రొత్త బ్రోషూరును విడుదల చేసింది. ఈ 32-పేజీల పూర్తి రంగులతోనున్న బ్రోషూరు ప్రత్యేకంగా విద్యాబోధకుల కొరకు ప్రచురించబడింది. ఇంతవరకూ అది 58 భాషల్లోనికి అనువదించబడింది.
విద్యాబోధకుల కొరకు ఒక బ్రోషూరు ఎందుకు? యెహోవాసాక్షుల పిల్లలైన విద్యార్థుల నమ్మకాల్ని వారు బాగా అవగాహన చేసుకొనేందుకు తోడ్పడడానికే. బ్రోషూరు ఏమి కల్గివున్నది? అది అదనపు విద్య, జన్మదినాలు, క్రిస్టమస్ మరియు జెండా వందనం వంటి విషయాల్లో మన దృక్పథాలను స్పష్టంగానూ నిర్మాణాత్మకమైన రీతిలోనూ వివరిస్తోంది. తమ పాఠశాల విద్య నుండి మన పిల్లలు మంచి ప్రయోజనాన్ని పొందాలని మనం కోరుకుంటున్నామని మరియు మన పిల్లల విద్య విషయంలో చురుకైన ఆసక్తిని తీసుకోవడం ద్వారా విద్యాబోధకులతో మనం యథార్థంగా సహకరిస్తామని కూడా ఈ బ్రోషూరు హామీ ఇస్తుంది.
విద్య అనే ఈ బ్రోషూరును ఎలా ఉపయోగించవచ్చు? ఇది విద్యాబోధకుల కొరకు సిద్ధపర్చబడింది గనుక దీనిని మనం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు మరితర పాఠశాల అధికారులతో పంచుకుందాం. అటువంటి విద్యాబోధకులు అందరూ మన దృక్పథాలను నమ్మకాలను మరి వేరుగా ఉండే హక్కు ఉందని మనమెందుకు కొన్నిసార్లు చెబుతామో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడవచ్చు. తలిదండ్రులు, తమ పిల్లలకు బోధించే విద్యాబోధకులతో వ్యక్తిగతమైన చర్చ కొరకొక ఆధారంగా ఈ బ్రోషూరుని ఉపయోగించాలని ప్రోత్సహించబడ్తున్నారు.
[10వ పేజీలోని చిత్రం]
ప్రాచీన ఇశ్రాయేలులో విద్య ఉన్నతంగా ఆదరించబడింది