జూలై 20-26, 2026
పాట 133 యౌవనకాలంలో యెహోవాను ఆరాధించండి
అదనపు విద్య విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోండి
“వివేకం గలవాడు ఆచితూచి అడుగులు వేస్తాడు.”—సామె. 14:15.
ముఖ్యాంశం
స్కూల్ చదువులు పూర్తయ్యాక అదనంగా చదవాలనుకునే వాళ్లు ఏ విషయాల గురించి, ఏ బైబిలు సూత్రాల గురించి ఆలోచించాలో చూస్తాం.
1-2. (ఎ) పిల్లలు దేని గురించి ఆలోచిస్తుంటారు? (బి) “ఇంకా చదవడం” లేదా “అదనపు విద్య” అంటే ఏంటి? (“పదాల వివరణ” చూడండి.)
“నువ్వు పెద్దయ్యాక ఏమౌతావు?” పిల్లలారా, మిమ్మల్ని చాలామంది ఈ ప్రశ్న అడిగే ఉంటారు కదా! మీరు పెద్దయ్యాక ఏం చేయాలో, ఇప్పటికే ఎంతోకొంత ఆలోచించి ఉంటారు. చెప్పాలంటే, పూర్తికాల సేవ చేయడమే అన్నిటికన్నా బెస్ట్. కానీ, మీ అవసరాల్ని తీర్చుకోవడానికి మీ కాళ్ల మీద మీరు నిలబడడం కూడా ముఖ్యం.—2 థెస్స. 3:10.
2 కొన్ని ప్రాంతాల్లో, స్కూల్ చదువు అయిపోయాక కొంతమంది పిల్లలు ఉద్యోగం సంపాదించడానికి “ఇంకా చదవాలని” లేదా “అదనపు విద్యను” ఎంచుకోవాలని అనుకోవచ్చు.a ఈ విషయంలో మామూలుగా అమ్మానాన్నలు వాళ్లకు సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే మీకు కూడా అలా చదవాలనే ఆలోచన ఉందా? ఉంటే, ఏం చదవాలి? ఈ ఆర్టికల్‌లో, అదనంగా చదవడం గురించి తెలివిగా ఆలోచించేలా సహాయం చేసే కొన్ని బైబిలు సూత్రాల గురించి చూస్తాం. తెలివిగా ఆలోచిస్తే తెలివైన నిర్ణయాలు తీసుకుంటాం. అయితే, ఈ ఆర్టికల్ ముఖ్యంగా పిల్లల కోసమే అయినా ఇందులోని సలహాలు మాత్రం అదనంగా చదవాలని అనుకుంటున్న ప్రతీఒక్కరికీ పనికొస్తాయి. ఇందులో ఉన్న సూత్రాలను ఉపయోగించి అమ్మనాన్నలు కూడా పిల్లలకు సలహా ఇవ్వవచ్చు.
మీరు అదనంగా చదవాలా?
3. కొంతమంది క్రైస్తవులు అదనంగా చదవాలని ఎందుకు అనుకుంటారు?
3 స్కూల్ చదువు పూర్తయ్యాక అదనంగా చదవకపోయినా కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగాలు దొరుకుతాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో అదనంగా చదివితేనే ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాలు దొరుకుతాయి, పని గంటలు కూడా తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఒక క్రైస్తవుడుb ప్రీచింగ్‌కి, యెహోవా సేవలో వేరే పనులకు ఎక్కువ టైం పెట్టగలుగుతాడు. కానీ, అదనంగా చదవాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది, కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి.
4. ఒక వ్యక్తి అదనంగా చదవాలా వద్దా అని ఎవరు నిర్ణయించాలి? (అధస్సూచి కూడా చూడండి.)
4 “ప్రతీ వ్యక్తి తన బరువు తానే మోసుకోవాలి” అని బైబిలు చెప్తుంది. (గల. 6:5) కాబట్టి, పెద్దవాళ్లు అయితే అదనంగా చదవాలా వద్దా అని సొంతగా నిర్ణయించుకోవాలి.c అదే పిల్లలు అయితే, వాళ్ల చదువుల గురించి నిర్ణయాలు తీసుకునే బాధ్యత వాళ్ల అమ్మానాన్నలకు కూడా ఉంటుంది. (ఎఫె. 6:1) అమ్మానాన్నలు ఇచ్చే సలహా వల్ల పిల్లలు పెద్దయ్యాక కూడా చదువుల గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.—సామె. 22:6.
5. అదనంగా చదవడం గురించి ఆలోచించడం ఒకవ్యక్తి ఎప్పుడు మొదలుపెట్టవచ్చు, ఎందుకు? ( చిత్రం కూడా చూడండి.)
5 సాధారణంగా పిల్లల స్కూల్ చదువు పూర్తవ్వక ముందే అదనంగా చదవాలో వద్దో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం గురించి పిల్లలు అమ్మానాన్నలతో ముందే మాట్లాడడం మంచిది. అలా చేస్తే వేర్వేరు కోర్సుల గురించి పరిశోధన చేసే టైం ఉంటుంది. అలాగే, అదనంగా చదివేటప్పుడు లేదా ఉద్యోగం చేసేటప్పుడు పనికొచ్చే నైపుణ్యాలు స్కూల్లో ఉన్నప్పుడే నేర్చుకోవడానికి వీలౌతుంది. అంటే, స్కూల్ చదువు అయిపోకముందే పిల్లలు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలా? అలాగని ఏం లేదు. (సామె. 21:5) కొంతమంది కాస్త టైం తీసుకొని ఆలోచించాలనుకుంటారు. వాళ్లు స్కూల్ చదువు పూర్తయ్యాక ఏదైనా ఉద్యోగం చేస్తూ పయినీరింగ్ చేయాలనుకోవచ్చు. ఇవన్నీ చేస్తూనే అదనంగా చదవడం గురించి కూడా ఆలోచిస్తారు. ఏ వయసులోనైనా ఈ నిర్ణయం తీసుకోవచ్చు.
అదనంగా చదివే విషయంలో తెలివైన నిర్ణయాలు తీసుకునేలా అమ్మానాన్నలు వాళ్ల పాపకు సహాయం చేస్తున్నారు (5వ పేరా చూడండి)
6. అదనంగా చదివే విషయంలో తెలివైన నిర్ణయం తీసుకోవాలంటే ఏం చేయాలి?
6 అదనంగా చదవడం గురించి తెలివైన నిర్ణయం తీసుకోవడానికి మీరు ఏం చేయవచ్చు? దాని గురించి ప్రార్థన చేయడం అస్సలు మర్చిపోకండి. (యాకో. 1:5) అలాగే ఈ పనులు కూడా చేయండి: ఒకటి, మీ ఉద్దేశాలను నిజాయితీగా పరిశీలించుకోండి. (కీర్త. 26:2) రెండు, మీరు చదవాలనుకుంటున్న కోర్సులో ఉండే లాభనష్టాల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. (సామె. 14:15) ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం.
మీ ఉద్దేశాలను నిజాయితీగా పరిశీలించుకోండి
7. అదనంగా చదవాలని అనుకుంటున్న వాళ్లు ఏం ఆలోచించుకోవాలి?
7 మీరు అదనంగా చదవాలి అనుకుంటున్నారా? అయితే, మీరు ఈ ముఖ్యమైన ప్రశ్న గురించి ఆలోచించాలి: ‘నేను అలా ఎందుకు చదవాలని అనుకుంటున్నాను?’ చాలామంది తమకు నచ్చిన ఉద్యోగం చేయాలి, బాగా జీతం వచ్చే ఉద్యోగం చేయాలి అనే ఉద్దేశంతో అలా చదువుతారు. అది తప్పేం కాదు. (1 తిమో. 5:8) కానీ, బాగా ఆస్తిపాస్తులు సంపాదించాలి అనుకోవడం, డబ్బు ఉంటేనే ఈ లోకంలో బ్రతకగలం అనుకోవడంలో ఉన్న ప్రమాదాల గురించి బైబిలు హెచ్చరిస్తుంది. (సామె. 23:4, 5; 1 తిమో. 6:8-10; 1 యోహా. 2:17) ఒకవేళ బాగా ధనవంతులు అవ్వడం లేదా గొప్ప పేరు సంపాదించడమే మీ ఉద్దేశం అయితే మీ జీవితంలో ఎప్పటికీ సంతృప్తి ఉండదు. అంతేకాదు మీరు యెహోవాకు కూడా మెల్లమెల్లగా దూరం అయిపోవచ్చు.
8-9. (ఎ) క్రైస్తవులు చదువును ఎలా చూడాలి? (మత్తయి 6:33) (బి) జోసెఫినా, మోరిన్, ఐరిస్ చెప్పిన దాన్నుండి మీరు ఏం నేర్చుకున్నారు?
8 అయితే చదువును మనం ఎలా చూడాలి? యెహోవా సేవను మనస్ఫూర్తిగా చేస్తూ మన కాళ్లమీద మనం నిలబడడానికి సహాయం చేసే దానిలాగే చూడాలి. (మత్తయి 6:33 చదవండి.) ఎందుకంటే, మనకు యెహోవా సేవ చేయడమే అన్నిటికన్నా ముఖ్యం.—మత్త. 22:37, 38; ఫిలి. 3:8.
9 అదనంగా చదవడం గురించి సరిగ్గా ఆలోచించడానికి కొంతమంది క్రైస్తవులకు ఏది సహాయం చేసిందో గమనించండి. చిలీలో ఉంటున్న జోసెఫినా ఇలా చెప్తుంది: “నా చదువు యెహోవా సేవ ఎక్కువ చేసేలా సహాయం చేసింది. నా చదువు నేను పెట్టుకున్న ఆధ్యాత్మిక లక్ష్యాల్ని రెండవ స్థానంలోకి నెట్టేయకుండా చూసుకున్నాను, ఎందుకంటే యెహోవా కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు.” మోరిన్ అనే సిస్టర్ హెయిర్ స్టయిలిస్ట్‌గా ఒక సంవత్సరం పాటు ఉండే కోర్సు చేసింది. ఆ కోర్సు ఎందుకు ఎంచుకుందో చెప్తూ ఆమె ఇలా అంటుంది: “నేను అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవ చేయాలనుకున్నాను. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడే కోర్సుల కోసం వెతికాను. అలా నేను హెయిర్ స్టయిలిస్ట్ కోర్సు చేశాను, అది పూర్తయిన తర్వాత ఉద్యోగం చేస్తూ కొంత డబ్బు కూడబెట్టుకున్నాను. అంతేకాదు, అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లాక కూడా నన్ను నేను పోషించుకోవడానికి ఈ కోర్సు సహాయం చేసింది.” ఐరిస్ అనే సిస్టర్, డెంటిస్ట్ అవ్వడానికి ట్రైనింగ్ తీసుకుంది, అది కొంచెం పెద్ద కోర్సే. దాని గురించి ఆమె ఇలా చెప్తుంది: “అదనంగా చదవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉండొచ్చు కానీ అవి నిజమైన సంతృప్తి-సంతోషం ఇవ్వలేవు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలి: జీవితంలో అన్నిటికన్నా ఎక్కువగా యెహోవాకే ముఖ్యమైన స్థానాన్ని ఇస్తే సంతృప్తి-సంతోషం గ్యారంటీ.” ఆ మాట అక్షరాలా నిజం. అది గుర్తుపెట్టుకుంటే ఎప్పటికీ సంతోషంగా ఉండేలా మంచి నిర్ణయాలు తీసుకుంటాం.
లాభనష్టాల గురించి ఆలోచించండి
10. అదనంగా చదవాలా వద్దా అని నిర్ణయించుకుంటున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 32:29 లో ఉన్న సూత్రాన్ని ఎలా పాటించవచ్చు?
10 మీ మనసులో ఒక కోర్సు ఉండొచ్చు. కానీ అదే చేయాలని పట్టుబట్టకుండా ఇంకా వేరే వాటి గురించి కూడా ఆలోచించవచ్చు. (సామెతలు 18:17 పోల్చండి.) నిజం చెప్పాలంటే, చదువుకు సంబంధించి ఒకప్పుడు లేనన్ని ఆప్షన్లు ఇప్పుడు ఉన్నాయి, ఉదాహరణకు ఆన్లైన్ కోర్సులు లాంటివి. అసలు ఇవేవి కాకుండా, అదనంగా చదవకుండానే మిమ్మల్ని మీరు పోషించుకోగలరేమో కూడా ఆలోచించండి. ఉదాహరణకు, ఫిన్లాండ్లో ఉన్న యోహన్నా అదనంగా ఏం చదవలేదు. ఆమె ఇలా చెప్తుంది: “నా స్కూల్ చదువు అయిపోయిన తర్వాత నేను పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ పయినీరింగ్ చేసేదాన్ని. నేను రకరకాల ఉద్యోగాలు చేశాను, మన అవసరాలు చూసుకుంటానని యెహోవా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నేను ప్రతీసారి చూశాను.” అయితే, అదనంగా చదివే విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి అని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను ఈ నిర్ణయం తీసుకుంటే లాభాలు ఎక్కువ ఉంటాయా? నష్టాలు ఎక్కువ ఉంటాయా? ఆ నష్టాల్ని నేను భరించగలనా?’ (ద్వితీయోపదేశకాండం 32:29 చదవండి; 1 కొరిం. 10:23) ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చే కొన్ని విషయాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
11. మీ కోర్సుకు ప్రతీవారం ఎంత టైం పెట్టాలో ఆలోచించడం ఎందుకు ప్రాముఖ్యం? (చిత్రాలు కూడా చూడండి.)
11 ఎంత టైం పెట్టాలి? ప్రతీవారం క్లాసుల కోసం, హోమ్‌వర్కుల కోసం ఎంత టైం పెట్టాల్సి వస్తుందో ఆలోచించండి. ఇంట్లో పనులు చేయడానికి, మిమ్మల్ని యెహోవాకు దగ్గర చేసే పనులు చేయడానికి మీకు సమయం మిగులుతుందా? (ఫిలి. 1:10) మీటింగ్‌కి సిద్ధపడడానికి, వ్యక్తిగత అధ్యయనం చేయడానికి ఓపిక లేనంతగా మీ చదువులు మిమ్మల్ని పిండేస్తున్నాయా? ఇండియాలో ఉంటున్న జెరోజ్ పరిస్థితి కూడా అదే. అతను ఇలా చెప్తున్నాడు: “యెహోవాకు దగ్గర చేసే పనుల్లో నేను వెనకపడిపోయాను. కొన్నిసార్లు మీటింగ్స్ కూడా మిస్ అయ్యేవాడిని. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అంత టైం, శక్తి ఆ కోర్సు మీద అనవసరంగా పెట్టాను అనిపిస్తుంది.” అయితే అన్ని కోర్సులు అలా ఉండవు, కొన్ని తక్కువ టైంలోనే అయిపోవచ్చు, ఇంకొన్నిటికి హోమ్‌వర్క్ తక్కువ ఉండవచ్చు. ఉదాహరణకు, మొజాంబిక్‌లో ఉంటున్న రెబెకా తను తీసుకున్న కోర్సు వల్ల హ్యాపీగా ఉంది. ఆమె ఇలా చెప్తుంది: “నేను తీసుకున్న కోర్సు రోజుకి రెండు గంటలే ఉండేది. అది నా క్రమ పయినీరింగ్కి కూడా ఏం అడ్డు రాలేదు.”
ఒకవేళ మీరు అదనంగా చదవాలనుకుంటే మీ పనులకు, బాధ్యతలకు తగినంత సమయం ఉండేలా చూసుకోండి (11వ పేరా చూడండి)
12. సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి మీరు వేటి గురించి ఆలోచించాలి? (ప్రసంగి 12:1)
12 ఎంత కాలం పడుతుంది? మీ కోర్సు పూర్తవ్వడానికి ఎన్ని నెలలు లేదా ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఆలోచించండి. ఈ కోర్సు చేయడం వల్ల మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించినట్టు అవుతుందా? (ఎఫె. 5:15-17) మీరు పిల్లలైతే, యౌవనంలోనే యెహోవాకు మీ బెస్ట్ ఇవ్వడానికి, పూర్తికాల సేవ చేయడానికి ఆ కోర్సు సహాయం చేస్తుందా? (ప్రసంగి 12:1 చదవండి.) మీకు నచ్చిన ఉద్యోగం చేయడానికి తక్కువ టైంలో పూర్తయ్యే కోర్సులు కూడా ఉన్నాయేమో చూడండి. ఉదాహరణకు, డిప్లొమా కోర్సులు లేదా టెక్నికల్ కోర్సులు యూనివర్సిటీతో పోలిస్తే తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో అయిపోతాయి. చిలీలో ఉంటున్న మారియో ఇలా అంటున్నాడు: “నేను రెండు సంవత్సరాల్లో పూర్తయ్యే టెక్నికల్ కోర్సు తీసుకున్నాను, యూనివర్సిటీతో పోలిస్తే అది తక్కువ ఖర్చుతోనే అయిపోయింది. పైగా వారంలో నాలుగు రోజులే క్లాసులు ఉండేవి. దానివల్ల నేను పయినీరింగ్ కూడా చేయగలిగాను.”
13. ఇంటికి దూరంగా ఉంటూ చదువుకుంటే ఏం జరగవచ్చు?
13 ఎంత దూరం వెళ్లాలి? కొన్నిసార్లు మీ ఇంటికి దగ్గర్లోనే ఒక కోర్సు దొరకవచ్చు. కానీ ఒకవేళ చదువు కోసం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే లేదా మీరు హాస్టల్లో ఉండాల్సి వస్తే ఏం జరగవచ్చు? మీ కుటుంబానికి దూరంగా ఉంటారు. అంతేకాదు, యెహోవాసాక్షులుకాని వాళ్లతో ఒకే రూమ్‌లో ఉండాల్సి రావచ్చు. దానివల్ల ఆధ్యాత్మికంగా చాలా పెద్ద ప్రమాదంలో పడతారని దయచేసి గుర్తుంచుకోండి. (సామె. 22:3; 1 కొరిం. 15:33) మొజాంబిక్‌లో ఉంటున్న మటీయాస్ తక్కువ ఖర్చుతోనే ఒక సంవత్సరంలో పూర్తయ్యే కోర్సు చేశాడు. కానీ ఆ కోర్సు చేసినందుకు అతను బాధపడుతున్నాడు. దానికి కారణం ఏంటో చెప్తూ ఇలా అంటున్నాడు: “నేను మా ఇంటికి చాలా దూరంగా, హాస్టల్లో ఉండి చదువుకోవాల్సి వచ్చింది. నేను ఎక్కువ టైం అక్కడే ఉండేవాడిని కాబట్టి ప్రతీరోజు ఏదోక తప్పు చేయాలన్న ప్రలోభం వచ్చేది. నా సలహా ఏంటంటే, మీరు ఏ కోర్సు తీసుకున్నా, మీ కుటుంబంతోనే ఉండేలా చూసుకోండి.” రష్యాలో ఉంటున్న ఒక సిస్టర్ ఇలా చెప్తుంది: “నేను హాస్టల్లోనో లేదా ఒక రూమ్‌లోనో ఉండి చదువుకునే బదులు మా అమ్మానాన్నలతో పాటే ఉండి చదువుకునే కోర్సు తీసుకోవడం వల్ల కొన్ని ప్రమాదాల్ని, ప్రలోభాల్ని తప్పించుకున్నాను.” మీకు కుదిరితే ఆన్లైన్ కోర్సు తీసుకోగలరేమో ఆలోచించండి.
14. అదనంగా చదవడం గురించి ఆలోచిస్తున్నప్పుడు లూకా 14:28 లో ఉన్న సూత్రాన్ని ఎలా పాటించవచ్చు?
14 ఎంత ఖర్చు అవుతుంది? కొన్ని కోర్సులు తక్కువ ఖర్చులోనే అయిపోవచ్చు. ఇంకొన్నిటికి ప్రభుత్వమే ఖర్చంతా భరిస్తుంది. అప్పుడు ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాల్ని, అర్హతల్ని తక్కువ ఖర్చుతోనే సంపాదించుకోవచ్చు. ప్రభుత్వ సహాయం లేకపోతే, కొన్నిసార్లు అదనంగా చదవడానికి చాలా ఖర్చు అవ్వొచ్చు. ఉదాహరణకు, సీటు రావడానికి ట్యూషన్లు, కోచింగ్‌లు అంటూ కంటికి కనిపించని ఖర్చులు చాలానే అవుతాయి. సీటు వచ్చాక, ఆ కోర్సు ఫీజు కట్టడానికి అప్పు కూడా చేయాల్సి రావచ్చు. పైగా, దాన్ని తీర్చాలంటే చాలా సంవత్సరాలు పట్టొచ్చు. మొజాంబిక్‌లో ఉంటున్న ఆడిల్సన్ చదువుల విషయంలో తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చాలా బాధపడుతున్నాడు. అతను ఇలా అంటున్నాడు: “నాది నాలుగేళ్ల కోర్సు. దాని ఫీజు కట్టడానికి నేను, నా కుటుంబం కనీస అవసరాల్ని కూడా పక్కన పెట్టేసి బ్రతికాం, కొన్నిసార్లు తిండిని కూడా త్యాగం చేశాం.” కాబట్టి, మీరు ఏదైనా కోర్సు గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఇలా ప్రశ్నించుకోండి: ‘దీనికి ఎంత ఖర్చు అవుతుంది? నేను, నా కుటుంబం దీన్ని భరించగలమా? దీనికన్నా తక్కువ ఖర్చులో అయ్యే కోర్సు ఏమైనా ఉందా?’ (లూకా 14:28 చదవండి.) ‘ఒకవేళ నేను అప్పు చేస్తే, దాన్ని తీర్చడానికి ఎంత టైం పడుతుంది? భవిష్యత్తులో నాకొచ్చే ఉద్యోగంతో, ఒకపక్క నా అవసరాల్ని తీర్చుకుంటూ, మరోపక్క లోన్ కూడా కట్టుకోగలనా?’—సామె. 22:7.
15. ఏదైనా కోర్సు చేయడానికి ముందు, దానికి సంబంధించి ఉద్యోగాలు దొరుకుతాయో లేదో ఆలోచించడం ఎందుకు మంచిది?
15 ఉద్యోగాలు దొరుకుతాయా లేదా? మీరు ఉంటున్న ప్రాంతంలో గానీ, మీరు వెళ్లాలనుకుంటున్న ప్రాంతంలో గానీ ఏ ఉద్యోగాలు దొరుకుతాయో ఆలోచించండి. మీ చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరుకుతాయా? కొన్ని కోర్సుల్లో, కేవలం పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని మాత్రమే అందిస్తారు కానీ, ఉద్యోగానికి పనికొచ్చే నైపుణ్యాల్ని పెద్దగా నేర్పించరు. (కొలొ. 2:8) ఇండియాలో ఉంటున్న ఒక సిస్టర్ ఇలా చెప్తుంది: “నేను చేసిన కోర్సు వల్ల ఉద్యోగానికి పనికొచ్చే ఏ నైపుణ్యమూ నాకు రాలేదు. దానివల్ల నాకు జాబ్ రావడం చాలా కష్టమైంది.” కొన్ని కోర్సులు చేసినా, దానికి సంబంధించిన ఉద్యోగాలు అంతగా దొరక్కపోవచ్చు. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో ఉంటున్న ఒక బ్రదర్, ఏసీలు బాగుచేసే కోర్సు చేశాడు. అతను ఇలా చెప్తున్నాడు: “మేము ఉంటున్న ప్రాంతంలో చాలామంది ఎవరి రిపేర్లు వాళ్లే చేసుకుంటారు. కాబట్టి నాకు పెద్దగా పని ఉండదు.”
16. మీరు చదివే చదువు వల్ల ఎలాంటి ఉద్యోగాలు దొరుకుతాయో ఆలోచించడం ఎందుకు మంచిది?
16 మీకు ఎలాంటి ఉద్యోగాలు దొరకవచ్చో కూడా ఆలోచించండి. ఆ ఉద్యోగం మీకు నచ్చుతుందా? (ప్రసం. 3:12, 13) మీరు పనిచేసే చోట పరిస్థితి ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉంటారు? మీరు ఉద్యోగం చేయాలనుకుంటున్న రంగంలో చాలా పోటీ ఉంటుందా? ఉద్యోగాలు పోతాయేమో అనే భయం ఉంటుందా? లేదా చాలా ఒత్తిడి ఉంటుందా? ఆ ఉద్యోగం వల్ల మీరు ఎంత సంపాదించగలరు? దాంతో మిమ్మల్ని మీరు పోషించుకోగలుగుతారా? ఆ ఉద్యోగం నిలుపుకోవాలంటే ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతూనే ఉండాలా? అన్నిటికన్నా ముఖ్యంగా, ఆ ఉద్యోగం చేస్తూ యెహోవాకు మొదటి స్థానం ఇవ్వగలరా? (ప్రసం. 12:13) అయితే, అసలు ఉద్యోగాలే దొరకనప్పుడు, నచ్చిన ఉద్యోగమే చేస్తానని పట్టుబట్టలేం. కానీ, భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు దొరుకుతాయో ఆలోచించి, దానికి తగ్గట్టు ఏం చదవాలో నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇండియాలో ఉంటున్న టబితా ఆరు నెలల టైలరింగ్ కోర్సు చేసింది. ఆమె ఇలా చెప్తుంది: “నేను టైలరింగ్ చేస్తూనే పయినీరింగ్ కూడా చేయవచ్చు అనుకున్నా. ఎందుకంటే, ఈ పని ఎప్పటికీ ఉంటుంది. పైగా నేను నచ్చినప్పుడు చేసుకోవచ్చు. ఈ పని చేయడానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.” టైలరింగ్ కోర్సు చేయడం వల్ల టబితా తనను తాను పోషించుకుంటూనే పయినీరింగ్ కూడా చేయగలుగుతుంది.
17. (ఎ) చదువు గురించి తెలివైన నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన సమాచారం ఎక్కడ దొరుకుతుంది? (బి) మంచి నిర్ణయం తీసుకోవడానికి ఏ బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి? (“మీకు పనికొచ్చే బైబిలు సూత్రాలు” బాక్సు కూడా చూడండి)
17 అదనంగా చదవడం గురించి మనం ఏమేం ఆలోచించాలో ఇప్పటివరకు చర్చించుకున్నాం. అయితే, మీరు తెలివైన నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన సమాచారం ఎక్కడ దొరుకుతుంది? మీకు కావాల్సిన కోర్సులున్న ఇన్స్టిట్యూట్కి వెళ్లి కనుక్కోవచ్చు లేదా దాని వెబ్సైట్లో చూడొచ్చు లేదా, ఆ కోర్సుకు సంబంధించి ప్రస్తుతం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో చెక్ చేసుకోండి. (సామె. 13:10) ఇంతకుముందు ఆ కోర్సు చేసినవాళ్లతో గానీ, ఆ రంగంలో పని చేస్తున్నవాళ్లతో గానీ మాట్లాడండి. అందులో ఉన్న లాభనష్టాల్ని అడిగి తెలుసుకోండి. అలాగే, యెహోవా సేవను సంతోషంగా చేస్తున్న వాళ్లతో కూడా మాట్లాడండి. (సామె. 15:22) వాళ్లు ఏ కోర్సు లేదా ఏ ఉద్యోగం చేస్తే మంచిదని అంటారో చూడండి. బహుశా మీరు ఇప్పటివరకూ ఆలోచించని ఒక కోర్సు లేదా ఉద్యోగం గురించి వాళ్లు మీకు చెప్పొచ్చు.
18. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి?
18 ఇప్పటివరకూ మనం చూసినట్టు అదనంగా చదివితే లాభాలు ఉంటాయి, నష్టాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రార్థన చేసుకుని మీకున్న ఆప్షన్ల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి: అదనంగా చదవడం వల్ల మీ జేబులో డబ్బులు ఉండొచ్చు గానీ మీ మనసులో నిజమైన సంతోషం ఉండాలంటే యెహోవాతో దగ్గరి స్నేహం కావాలి! (కీర్త. 16:9, 11) యెహోవా తన సేవకులందరి బాగోగుల్ని తప్పకుండా చూసుకుంటాడు, దానికి చదువుతో సంబంధం లేదు. (హెబ్రీ. 13:5) అయితే, మీరు అదనంగా చదవాలని నిర్ణయించుకుంటే అప్పుడేంటి? అలా చదువుకుంటూనే యెహోవాకు ఎలా దగ్గరగా ఉండొచ్చు? దీనిగురించి తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.
పాట 45 నా హృదయ ధ్యానం
a పదాల వివరణ: ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో “అదనపు విద్య” లేదా “ఇంకా చదవడం” అనే మాటలు ఉపయోగించాం. అంటే స్కూల్ చదువులు పూర్తయ్యాక చదివేవి ఏవైనా, చేసే కోర్సులు ఏవైనా దాని కిందికి వస్తాయి. ఉదాహరణకు ఇంటర్, డిప్లొమా, వోకేషనల్ కోర్సులు, వృత్తివిద్యా కోర్సులు, సర్టిఫికేట్ కోర్సులు, అప్రెంటిస్‌షిప్, యూనివర్సిటీల్లో-కాలేజీల్లో చదివే ఉన్నత విద్య లాంటివి.
b ఈ సమాచారం సిస్టర్స్‌కు కూడా వర్తిస్తుంది.
c మన ప్రచురణలు గతంలో ఉన్నత విద్యను లేదా పైచదువులు చదవడాన్ని ప్రోత్సహించలేదు. ఉదాహరణకు, కావలికోట, 2005 అక్టోబరు 1 సంచికలో వచ్చిన “తల్లిదండ్రులారా—మీరు మీ పిల్లలకు ఎలాంటి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారు?” అనే ఆర్టికల్ ఉన్నత విద్యలో ఉన్న ప్రమాదాల గురించి వివరించింది. అయితే ఆ ప్రమాదాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ అదనంగా చదవాలా వద్దా అనేది ఎవరికి వాళ్లు తీసుకోవాల్సిన నిర్ణయం. ప్రతీ క్రైస్తవుడు, ఒకవేళ మైనర్ పిల్లలైతే ఆ కుటుంబ పెద్ద, ఈ విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంటే ప్రార్థన చేసి, బైబిలు సూత్రాలు పరిశీలించి, లాభనష్టాల గురించి ఆలోచించాలి. ఆ నిర్ణయాన్ని ఎవ్వరూ, చివరికి సంఘ పెద్దలు కూడా తప్పుబట్టకూడదు.—యాకో. 4:12.