ప్రపంచ పరిశీలన
వ్యాయామము, నిద్ర
ఆర్థరైటిస్ టు డే పత్రిక నివేదించేదేమంటే, “ముసలివాళ్లకు మంచిగా నిద్రపట్టాలంటే, వ్యాయామమే పరిష్కారం కావచ్చును.” అమెరికాలోని ఉత్తర కెరోలీనాలో ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో, 60 నుండి 70 సంవత్సరాల వయస్సున్న 24 మంది పురుషులను రెండు గుంపులుగా విభజించారు. కనీసం ఒక సంవత్సరం పాటు, ఒక గుంపు చాలా కష్టపడి వారానికి మూడుసార్లు లేదా ఎక్కువసార్లు వ్యాయామం చేశారు; మరొక గుంపు తగుమాత్రంగాను, క్రమంలేకుండా వ్యాయామం చేశారు. క్రమంగాను, కష్టపడి వ్యాయామం చేసిన పురుషులు, తగుమాత్రపు వ్యాయామం చేసిన వారికంటే రెట్టింపు, తొందరగా నిద్రపోయారని గమనించారు. వారు వ్యాయామం చేసిన రోజైనా లేదా చేయని మరొక రోజైనా యిది వాస్తవమని నిరూపించబడింది. ఈ పత్రిక యింకనూ యిలా చెబుతున్నది: “రాత్రివేళలో వారు మొదటి కునుకు తర్వాత, వారు నిద్రపోకుండా కొద్దిసమయం మాత్రమే మెలకువగావున్నారు.”
యౌవన త్రాగుబోతులు
“లండన్‌లో దాదాపు 90,000మంది పిల్లలు మితిమీరి త్రాగేవారని లెక్కించబడుతున్నారు” అని లండన్‌లోని సండే టైమ్స్ నివేదించింది. ఒక వారానికి మగవాళ్లైతే 21, ఆడవాళ్లైతే 14, యూనిట్ల మద్యం సేవిస్తారంటూ బ్రిటిష్ ప్రభుత్వం నిర్వచిస్తున్నది. ఒక యూనిట్ అంటే ఒక గ్లాసు వైన్ లేదా కొద్ది పరిమాణంలోనున్న సారా లేదా పావు లీటరు బీరుకు సమానం. ఇటీవల 18,000మంది బ్రిటీష్ పాఠశాల పిల్లలకు సంబంధించిన అధ్యయనం, 15 సంవత్సరాల వయస్సున్న వారిలో 11.5 శాతంమంది బాలురు, వయోజనులకు పెట్టిన పరిమితికంటే మించి త్రాగినట్లుగా గుర్తించింది. ఆడపిల్లలైతే, 14, 15 సంవత్సరాల వయస్సున్న 20మంది ఆడపిల్లల్లో ఒకరు వృద్ధస్త్రీలకు పెట్టిన పరిమితిని మించి త్రాగుతున్నట్లుగా ఒప్పుకున్నారు. గగుర్పాటు కల్గించే యీ లెక్కలు అసలు సమస్యను తక్కువ అంచనా వేస్తున్నవని పరిశోధకులు నమ్ముతున్నారు.
ప్రమాదకరమైన డ్రైవింగ్
రోడ్డు మేప్‌లను చదవటం, టేప్‌రికార్డర్లలో మాట్లాడటం, కదిలే టెలిఫోన్‌ల నుపయోగించటం, ఆడవాళ్లయితే బట్టలు మార్చుకోవడం. దక్షిణాఫ్రికాలోని ది స్టార్ అనే ఒక వార్తాపత్రిక చెప్పినట్లుగా, కొన్నిసార్లు గంటకు 100 కిలోమీటర్ల వేగంతోనున్నప్పుడు కూడ, డ్రైవింగ్ చేస్తూనే ప్రజలు చేసే పనులు ఇవే. తరుచూ ప్రజలు డ్రైవింగ్ చేస్తూనే, వారి రెండు చేతులతో (డెంటల్ ఫ్లోస్‌తో) వాళ్ల పళ్లను శుభ్రం చేసుకోవడం గమనించినట్లు ఒక సంరక్షక అధికారొకరు సూచిస్తున్నాడు! డ్రైవర్లు వాళ్ల పళ్లు తోముకుంటూ, శుభ్రం చేసుకుంటూ కూడ కన్పించారు. ఒక స్త్రీ తన బిడ్డను వాహనంలో స్కూలుకు తీసుకుపోతూనే అతనికి తల కత్తిరింపు చేసింది. ఒక తల్లి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వాహనం నడుపుతూనే తన బిడ్డకు నేప్‌కిన్ మార్చుతున్నట్లు పరిశీలించబడింది. వాహనాలు నడిపేవారు అలాంటి చిక్కును కొనితెచ్చుకుంటారెందుకు? ఒక అధికారి చెప్పేదేమంటే, దూర ప్రయాణం చేసేటప్పుడు, రవాణా స్తంభించినప్పుడు డ్రైవర్లు కారులో గడిపే సమయాన్ని “మంచిగా” ఉపయోగించుకోడానికి అలా చేస్తారు. అయినప్పటికి, ఇలాంటి ధ్యానభంగాలు గంభీరమైన ప్రమాదాలకు దారితీస్తాయని ఆయన నొక్కి తెల్పాడు.
శస్త్రచికిత్సద్వారా బిడ్డకు జన్మనివ్వడం క్షేమమేనా?
శస్త్రచికిత్స క్షేమమైనదని, తక్కువ బాధతో కూడినదని నమ్మి, చాలామంది స్త్రీలు శస్త్రచికిత్సద్వారానే బిడ్డకు జన్మనివ్వాలని ఎన్నుకుంటారు. జొర్నల్ డు బ్రేజిల్ వార్తాపత్రిక ప్రకారం, చాలామంది వైద్యులు కూడ శస్త్రచికిత్సద్వారా బిడ్డను తీయడానికి ఎన్నుకుంటారు, ఎందుకంటే సాధారణ “కాన్పు సాధారణంగా సరాసరి 8 నుండి 12 గంటలు పడుతుంది, అది జరగడానికి ఖచ్ఛితమైన తేదీ అంటూ ఏమీ ఉండదు, అదే సమయంలో శస్త్రచికిత్సద్వారా బిడ్డను తీయడానికి కేవలం ఒక గంట పడుతుంది, దీనిని అనుకున్న తారీఖున చేయవచ్చును.” అయినను, ప్రసూతిసాధకుడైన ఫెర్నాండో ఎస్టెల్లెటి లెంజ్ ఈవిధంగా చెప్పినట్లు వ్రాశారు: “శస్త్రచికిత్స వలన అంటువ్యాధులు, రక్తస్రావం సంభవించే మరణాల సంఖ్య, శస్త్రచికిత్స పొందిన స్త్రీలలో చాలా ఎక్కువ.” బ్రెజిలియన్ పరిశోధన చూపెట్టేదేమంటే, “స్త్రీ జననేంద్రియాల ద్వారా కలిగే కాన్పులద్వారా 100 వేలమందికి 43మంది చనిపోతుంటే శస్త్రచికిత్స ద్వారా చేసే కాన్పులలో 100 వేలమందికి 95మంది తల్లులు మరణిస్తున్నారు.” (g93 6/22)
యౌవనులు సంస్థీకరింపబడిన మతాన్ని తిరస్కరిస్తున్నారు
కెనడాలోని యౌవనులు మత నాయకులకు గంభీరమైన వ్యాఖ్యానాన్ని తెలియజేశారు: మతగురువులు దేవుని వాక్య బోధకులుగా వ్యవహరించుటలో విఫలులయ్యారు. ఇంతకు క్రితంకంటే ఈనాడు, సంస్థీకరింపబడిన మతాలకు చాలా కొద్దిమంది యౌవనులే మద్దతు నిస్తున్నారని ఇటీవల జరిగిన జాతీయ సర్వే విశదం చేసింది. మత సంబంధ గుంపుతో కలసిమెలసి యుండటమనేది వారి జీవితాల్లో ప్రాముఖ్యమని కేవలం 10 శాతం మంది మాత్రమే నమ్ముతున్నారు. అదేసమయంలో, “80 కంటే ఎక్కువ శాతం మంది పుట్టుక, వివాహం, మరణాలకు సంబంధించిన కార్యాలకు సంస్థీకరింపబడిన మతాలవైపు మరలుతారని” ది టొరొంటో స్టార్ నివేదిస్తున్నది. అంతేకాకుండా, 80 శాతంమంది దేవుని ఉనికిని నమ్ముతారు, అదేసమయంలో 60 శాతంమంది మరణానంతర జీవితాన్ని విశ్వసిస్తారు. స్టార్ వార్తాపత్రిక ఇంకనూ చెప్పేదేమంటే, “యౌవనులు మతగురువులకంటే, తోటివయస్కులు, అశ్లీల సాహిత్యాలు, చలనచిత్రాలు, ప్రఖ్యాత సంగీతంవల్ల ఎక్కువ ప్రభావితులౌతారని కనపడుతున్నది. జీవితంలో ప్రముఖ వివాదాలను గూర్చిన మార్గదర్శకం కొరకు కేవలం కొద్దిమంది యౌవనులు మాత్రమే చర్చి నాయకులవైపు చూస్తారు.
ప్రాణాంతకమైన గదులు
“మానవుడు సృష్టించిన యే యితర కలుషితం కంటే, వాతావరణంలో మిళితమైయున్న పొగాకు పొగ ఎక్కువగా మరణాలకు కారణమౌతున్నదని” దక్షిణాఫ్రికా, కేప్ టౌన్‌లో ఆరోగ్య వైద్యాధికారైన డా. మిఖాయెల్ పాప్‌కిస్ వివరిస్తున్నాడు. గాలి బయటకు పోడానికి సరియైన కిటికీలు అందుబాటులో లేకపోవడమే సమస్య అని చెబుతూ, దక్షిణాఫ్రికా టొబాకో ఇన్‌స్టిట్యూట్‌చే పంపిణీ చేసిన కరపత్రానికి ఆయన ప్రతిస్పందించాడు. డా. పాప్‌కిస్ వివరించేదేమంటే, “సాధారణంగా భవనాల్లో విడిచే పొగాకు పొగ స్వచ్ఛమైన గాలికి కావలసిన సరాసరి ప్రామాణిక లక్షణాలను మించివుంటుంది,” అది ఊపిరితిత్తుల క్యాన్సరు, హృద్రోగ మరణాలు, పిల్లల్లో ఊపిరితిత్తులు స్థంభించిపోవడానికి దారితీయవచ్చును. ఒక భవనంలోని గాలిని బయటకు పంపించి లేదా వడగట్టి, తద్వారా ఆ భవనంలో పొగాకు పొగ లేకుండా చేసే మార్గమేమీ లేదని ఆయన చెప్పాడు. ఇంకా ఆయనిలా అన్నాడు: “గాలిని స్వచ్ఛంగా ఉంచాలంటే, గాలిని కలుషితం చేసేవాళ్లకు హద్దులేర్పరచడమే అత్యంత ప్రభావవంతమైన పద్ధతి.”
చాగాస్ వ్యాధి రక్త మార్పిడి
వార్షికంగా, 20,000మంది బ్రెజిల్ దేశస్థులకు చాగాస్ వ్యాధి సోకుతుంది. అయినను, గ్లోబో సైయెన్సియా పత్రికలో నేషనల్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడైన జాయావొ కార్లస్ డయాస్ యిలా చెబుతున్నాడు: “ఈ పరిస్థితి యింకనూ విషమించగలదు, ఎందుకంటే విస్తృతంగా పల్లె ప్రాంతాలనుండి ప్రజలు పెద్ద పట్టణాలకు వలసపోతున్నారు, కాబట్టి ఈ వ్యాధి పట్టణ ప్రాంతాలకు కూడా వ్యాపించగలదు.” ఈ వ్యాధికి కారణమైన పరాన్నజీవి ‘గుండెతో సహా శరీరంలోని యే భాగంలోనైనా తిష్టవేయవచ్చు కాబట్టి, వ్యాధిగ్రస్థుడైన వ్యక్తి చివరకు హృద్రోగంతో మరణించవచ్చును.’ కేవలం నల్లులు కుట్టడం ద్వారా 8,000మంది మాత్రమే వ్యాధిగ్రస్థులయ్యారని వివరిస్తూ, ఈ పత్రిక యింకా యిలా చెబుతున్నది: “మరొక విధంగా, రక్త మార్పిడిద్వారా ఈ అంటువ్యాధి తరచుగా సోకుతుంది. నేరుగాచేసే మార్పిడిద్వారా (తల్లినుండి బిడ్డకు) లేదా మార్పిడిద్వారా వార్షికంగా వ్యాధిసోకినవారు 12,000మంది కన్పించినట్లు అంచనా వేయబడింది.” (g93 7/8)
ఫాక్స్ సందేశాలు దేవునికి పంపడమా?
ఫాక్స్ సందేశాల ద్వారా దేవుని చేరుకోవచ్చా? బెజెక్ అనే ఇజ్రాయెల్ టెలిఫోన్ కంపెనీ స్పష్టంగా దీని గూర్చి ఆలోచిస్తున్నది. జనవరిలో, బెజెక్ కంపెనీవారు జెరూసలెంలోని తమ ఫాక్స్ యంత్రానికి అమర్చిన నంబరు ద్వారా ప్రజలు దేవునికి సందేశాలు పంపేందుకు వీలుగా ఒక సేవా కార్యక్రమాన్ని తలపెట్టిందని ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నివేదించింది. ఫాక్స్ అందుకున్న తర్వాత, పనిచేసే సిబ్బందిలో ఒకరు ఆ సందేశాన్ని మడతపెట్టి, దానిని సా. శ. 70లో రోమా సైన్యాలచే నాశనం చేయబడ్డ యెహోవా ఆలయం యొక్క మిగిలిన భాగమని విశ్వసించే, పశ్చిమప్రాంత గోడలోని పగుళ్లలో ఉంచడానికి తీసుకుంటాడు. ట్రిబ్యూన్ ప్రకారంగా, వ్రాయబడిన ప్రార్థనలు గోడ పగుళ్లలో ఉంచడమనే ఆచారం, వివాహజత, మంచి ఆరోగ్యం, లేదా యితర లక్ష్యాలను సాధించుటలో దైవిక సహాయం కొరకు ఎదురుచూచే ఆరాధికులు “ఒక అదృష్ట కార్యంగా” చేసే ఆచారమే. ఫాక్స్ సేవాకార్యక్రమంలో మొదటి రోజున, 60 సందేశాలు చేరాయి.
ఖగోళశాస్త్రజ్ఞులు మరలా పొరబడ్డారు
జర్మనీలో వివిధ విజ్ఞానశాస్త్రాలకు సంబంధించిన వైజ్ఞానిక పరిశోధన అసోషియేషన్ 1992 ఆరంభంలో, ప్రపంచవ్యాప్తంగానున్న ఖగోళశాస్త్రజ్ఞులు భవిష్యత్తును గూర్చి చెప్పిన దాదాపు 50 జోస్యాలను సేకరించి, ఫలితాలను ఆ సంవత్సరాంతంలో పరిశీలించారు. ఈ అసోషియేషన్ 1991లో కూడ యిదేరకమైన పనిని చేసింది. (జూన్ 8, 1992 అవేక్! 29వ పేజి చూడండి.) పందొమ్మిది వందల తొంభైరెండులో చెప్పిన ఈ జోస్యాలు 1991లో చెప్పిన వాటికంటే కచ్ఛితమైనవా? కచ్ఛితమైనవి కావు. “పందొమ్మిది వందల తొంభైయొకటిలో చెప్పిన అనిశ్చితమైన జోస్యాలు కనీసం కొన్నైనా విజయాలను సాధించాయి, కాని ఈసారి చెప్పిన జోస్యాలు కనీసం ఒక్కటైనా విజయం సాధించలేకపోయాయని” సూడియిట్సి జెయిథంగ్ అనే వార్తాపత్రిక నివేదించింది. అమెరికా మాజీ అధ్యక్షుడైన జార్జి బుష్ తిరిగి ఎన్నుకోబడతాడని, అమెరికా అధ్యక్షుని భవనం (వైట్‌హౌస్) తగులబడి నాశనమౌతుందని 1992వ సంవత్సరానికి చెప్పిన జోస్యాల్లో చేర్చబడ్డాయి. పందొమ్మిది వందల తొంభైమూడవ సంవత్సరానికి ఎదురుచూస్తూ, ఈ అసోషియేషన్ సాహసించి ఈవిధంగా కూడ జోస్యం చెప్పింది: “రాబోయే సంవత్సరం ఖగోళశాస్త్రజ్ఞులు మరలా పొరబడతారు.”
అపాయకరంగా శ్వాసించుట
బ్యూనొస్ ఎయిర్స్ నుండి బెయిజింగ్ వరకూ, షియోల్ నుండి కలకత్తా, కైరోల వరకూ, ప్రపంచంలో అతిపెద్ద నగరాల్లోని గాలి మరింత అపాయకరమౌతున్నది. ఎన్నడూ లేనంతగా గాలిలో వ్యాపించియున్న విషపదార్థాల (కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఓజోను, లెడ్‌లాంటి వాయుపదార్థాల) విషస్థితి పెద్ద పట్టణప్రాంతాల్లో జీవిస్తున్న ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది, మరి అది నగరవాసుల్లో వయస్సురాకుండానే చనిపోయిన కొందరి మరణాలతో సంబంధం కలిగివుందని యుఎన్ ఎన్వయిరన్‌మెంట్ ప్రోగ్రామ్, ప్రపంచ ఆరోగ్యసంస్థల నివేదికలను ఎత్తివ్రాస్తూ, ఫ్రెంచి వార్తాపత్రికైన లీ ఫిగారొ చెబుతున్నది. ప్రపంచ నగరవాసుల ఆరోగ్యం కాపాడటానికి, కాలుష్యం తగ్గించడానికి ప్రస్తుతం అత్యవసర చర్యలు తీసుకోవాలని 20 నగరాల్లో, 15 సంవత్సరాల పాటు జరిపిన అధ్యయనంపై ఆధారపడిన సంయుక్త నివేదిక హెచ్చరిస్తున్నది. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం, 2000వ సంవత్సరానికెల్లా దాదాపు మానవజాతిలో సగం జనాబా పట్టణాల్లో నివసిస్తారు.
ఐరోపావారు సమయాన్నెలా గడుపుతారు
ఐరోపాలో అనుదిన జీవితం ఎలా కొనసాగుతుందోనని తెలుసుకొనేందుకు, 20 దేశాల్లో 9,700 కంటే ఎక్కువమంది 1991 సంవత్సరాంతంలో ఇన్‌ఫర్మేషన్ యీ పూబ్లెసేటా అనే గుంపుచే ప్రశ్నించబడ్డారు. అనుదిన కార్యక్రమాల్లో ఒకదేశం మరొక దేశంతో ఎలా భేదం కల్గివుంటుంది? గ్రీకులు చాలా ఆలస్యంగా (రాత్రి 12:40 గంటలకు) నిద్రపోతారు, కాని హంగేరియా ప్రజలు ఉదయాన్నే (ఉదయం 5:45 గంటలకు) నిద్రనుండి మేలుకునేవాళ్లలో ఒకరుగా పరిగణించబడుతున్నారని సెడియిట్స్ జెయిథంగ్ అనే వార్తాపత్రిక నివేదిస్తున్నది. జెక్, స్లొవాక్ భాషలు మాట్లాడే ప్రజలు, స్విట్జర్‌లాండ్ ప్రజలు టివీ చూడటానికి తక్కువ ప్రాముఖ్యతనిస్తారు, రోజుకు రెండు గంటలు మాత్రమే టివీ చూస్తారు, కాని బ్రిటన్‌లోనైతే “దాదాపు రోజుకు నాలుగు గంటలు టివీ నడుస్తూనేవుంటుంది.” స్వీడన్‌లో రోజుకు నాలుగు గంటలు రేడియో వినడానికి లేదా చదవడానికి గడిపితే, డెన్మార్క్ దేశీయులు చలనచిత్రాలు, థియేటర్లు, లేదా అదేరకమైన ప్రదేశాల్లో ఒకటిన్నర గంటలు విరామ సమయంలో గడుపుతారు. (g93 7/8)