సవతి తలిదండ్రులకు సహాయపడే సమాచారం
అమెరికా జనాభా లెక్కల సంబంధిత శాఖ ఊహించేదేమంటే 1995 నాటికెల్లా సవతి తలిదండ్రులను గల్గిన కుటుంబాలు సాంప్రదాయిక కుటుంబాల సంఖ్యను మించిపోతాయి. అప్పటికి, ప్రతి 100మంది పిల్లల్లో 59మంది 18 సంవత్సరాల వయస్సు రాకముందే “సవతి తలిదండ్రులున్న కుటుంబాల్లో” జీవిస్తారు. పెరుగుతున్న సవతి తలిదండ్రులకు ఈ క్రింద కొన్ని సలహాలు మాత్రమే యివ్వబడ్డాయి.
సమయాన్ని అనుమతించండి: క్రొత్త తల్లినిగాని తండ్రినిగాని అంగీకరించడానికి సవతి పిల్లలకు సమయం పడుతుందని సవతి తలిదండ్రులు గుర్తుంచుకోవాలి. మొదట కొన్ని మాసాలు లేదా సంవత్సరాలెందుకు చాలా కష్టం కాగలవో, మానసిక ఆరోగ్య ప్రొఫెసరైన మావిస్ హెథెరింగ్టన్ వివరిస్తున్నది: “వివాహపు ఆరంభదశల్లో, కుమారులు, కుమార్తెలుకూడ వారి సవతి తండ్రియెడల మాత్రమే కాకుండా సవతి తల్లియెడలకూడ విరుద్ధంగా, చిరచిరలాడుతూ, వ్యతిరేకంగా, కోపంగా ఉంటారు. వారి తల్లి మరలా వివాహం చేసుకున్నందుకు . . . రోషంతో ఉంటారు.” అది కష్టమే అయినప్పటికి, సవతి తలిదండ్రులు వారి పిల్లల భావాలను అర్థంచేసుకోడానికి ప్రయత్నించాలి.—సామెతలు 19:11 చూడండి.
మొదట ఒక మంచి బంధాన్ని ఏర్పర్చుకోండి: స్టెప్ఫ్యామిలీస్ అనే తన పుస్తకంలో జాయ్ కానొల్, వివేకంగా హెచ్చరించేదేమంటే సవతి తలిదండ్రులు తమ సవతి పిల్లలతో మంచి బంధాన్ని ఏర్పర్చుకొన్న తర్వాత వారి ప్రవర్తనను సరిచేసే ఒక మంచి స్థాయిలో ఉంటారు. ఈలోపు అసలు తల్లి లేక తండ్రి వారికి అవసరమైన దిద్దుబాటును చేస్తే చాలా మంచిది. (సామెతలు 27:6 పోల్చండి.) మరొక వైపు, సవతి తలిదండ్రులు వారి పిల్లలతో కలిసి వారెంతోకాలంగా క్రమంగా ఆనందించే షికారుకు వెళ్లడం, ఆట్లాడడంవంటి వాటిలో సహకరించడంద్వారా వారు శాశ్వతంగా నిలిచే భావాన్ని వారిలో కల్గించవచ్చును. అయినను, సవతి తండ్రులు, భోజన సమయాలను కుటుంబానికి గద్దింపునిచ్చే సమయాలుగా ఉపయోగించకూడదు.
పక్షపాతవైఖరిని మానుకోండి: సాధ్యమైతే, సవతి తల్లి లేదా సవతి తండ్రి, ఆమె లేదా అతని మొదటి పిల్లల యెడల కొన్ని సమయాల్లో ఎంతో కష్టమైనప్పటికీ ఎలాంటి పక్షపాతంకూడ చూపించకూడదు.—రోమీయులు 2:11 పోల్చండి.
జాగ్రత్తగా సన్నిహితులవ్వండి: ప్రాముఖ్యంగా సవతి తండ్రులు, సవతి కుమార్తెలు ఒకరితోనొకరు సఖ్యతకల్గి జీవించడం కష్టమని, సవతి కుటుంబాలకు సంబంధించిన ఇటీవలి ఒక అధ్యయనంలో గమనించారు. ఒక రచయిత యీ విధంగా వ్రాశాడు: “సవతి తండ్రులు సంభాషించడానికి ప్రయత్నిస్తుండగా, ఆడపిల్లలు దానికి యిష్టపడరు. సవతి తండ్రులు ఏదో గద్దింపు యివ్వాలని ప్రయత్నిస్తే, ఆడపిల్లలు దాన్ని ప్రతిఘటిస్తారు.” ఈ రచయిత టూకీగా యిలా చెప్తున్నాడు: “ప్రాధమిక దశల్లో, సవతి తండ్రి ఆడపిల్లలతో విజయవంతమైనదంటూ ఏదీ చేయలేడన్నట్లు కన్పిస్తున్నది.” అందువల్ల సహనం, అర్థంచేసుకునే స్వభావం ఎంతో అవసరం. ఆడపిల్లలు వారి సవతి తండ్రి నోటితో పలికే పొగడ్తలను అభినందిస్తారు, అయితే కౌగిలించుకోవడంవంటి భౌతిక అభినయాలను తరచూ అసౌకర్యంగా భావిస్తారు. ఒక ఆడపిల్ల ఈవిధంగా భావిస్తుందని సవతి తండ్రి తెలుసుకోవాలి. ఆమె ఒకవేళ యిలా భావిస్తే, ఆయన ఆప్యాయతను భౌతికంగా ప్రదర్శించుటకంటే నోటిమాట ద్వారా పొగడటం, సంభాషించడం వంటివాటికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి.—సామెతలు 25:11 పోల్చండి.
ఈర్ష్య యెడల జాగ్రత్తపడండి: అనుభవం చెప్పేదేమంటే చాలామంది సవతి కుమార్తెలు సవతి తల్లిని ఒక ప్రత్యర్ధిగా చూస్తారు. ఒక సవతి తల్లి ఆడపిల్ల భావాలను ముందుగా తెలిసికొని, వాటికి ప్రాధాన్యమివ్వడం ద్వారా తెలివిగా అనవసరమైన పోటీ అవధానం లేకుండా కాపాడుకోవచ్చును. తండ్రి తన ప్రేమానురాగాలు ఎల్లప్పుడూ ఉంటాయని తన కుమార్తెకు రూఢిచేయడం ద్వారా ఉద్రేకాన్ని తొలగించవచ్చును. (సామెతలు 15:1) పరిశోధకులు హెచ్చరించేదేమంటే, సవతి తల్లులు తమ క్రొత్త సవతి కుమార్తెలతో అతి తొందరలోనే తల్లిగా వ్యవహరించాలని ఎంతో గట్టిగా కృషిచేస్తారు. అయితే, యిక్కడ కూడ సహనమే ప్రాముఖ్యం.
సవతి తల్లి లేదా తండ్రిగా ఉండటం అంత సులభం కాదు. కాని వేలకొలది విజయవంతమైన మాదిరిలు చూపెడుతున్నట్లుగా అది అంత కష్టమేమీ కాదు. గుర్తుంచుకోండి, కుటుంబ పరిస్థితి ఏదైనాసరే, విజయవంతం కావడానికి బైబిలు ఈ క్రింది శ్రేష్ఠమైన సలహానిస్తున్నది: “పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.”—కొలొస్సయులు 3:14. (g93 7/8)