లక్షలాది ప్రాణాలు పొగలోనే కలిసిపోతున్నాయి
అది ప్రపంచంలోనే అత్యంత అధికంగా అమ్ముడుబోయే వినిమయ వస్తువు. దాన్ని నమ్మకంగా కొనేవారు కోకొల్లలుగా ఉన్నారు, శీఘ్రగతిన పెరిగే మార్కెట్ దానికుంది. దాన్ని ఉత్పత్తిచేసే కంపెనీలు అధిక లాభాలు, రాజకీయ పరపతి, గౌరవం కలిగివున్నట్లు మిడిసిపడుతున్నాయి. అయితే, దాని మంచి ఖాతాదారులు చనిపోతూ ఉంటారన్నదే సమస్య!
ది ఎకానమిస్ట్ ఇలా అంటుంది: “సిగరెట్లు ప్రపంచంలో అత్యంత లాభసాటిగా అమ్ముడుబోయే వినిమయ వస్తువులు. అవి మాత్రమే (చట్టబద్ధంగా) తన వినియోగదారుల్లో అనేకులను వ్యసనపరులనుగా చేసి తరచూ వారిని చంపుతాయి.” అంటే పొగాకు కంపెనీలకు అపార లాభాలు, వాటి ఖాతాదారులకు అపార నష్టాలు. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, ప్రతి సంవత్సరం పొగత్రాగే అమెరికావారి ఆయుష్కాలం దాదాపు 50 లక్షల సంవత్సరాలకు అంటే పొగత్రాగడానికి వెచ్చిస్తున్న ప్రతినిమిషానికి సుమారు ఒకనిమిషం ఆయుష్షు తగ్గిపోతుంది. “ధూమపానం ఏటా 4,20,000 మంది అమెరికన్లను చంపుతోంది, అంటే చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల మూలంగా చనిపోయేవారికంటే దాని సంఖ్య 50 రెట్లు ఎక్కువ,” అని న్యూస్ వీక్ పత్రిక నివేదిస్తుంది.
బ్రిటన్స్ ఇంపీరియల్ క్యానర్ రీసర్చ్ ఫండ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ది అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రచురించిన మోర్టాలిటి ఫ స్మోకింగ్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ 1950-2000 అనే పుస్తకం ప్రకారం, పొగత్రాగడం మూలంగా ప్రపంచమంతటా ప్రతి నిమిషానికి ఆరుగురు చొప్పున ఏటా 30 లక్షలమంది మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్త ధూమపాన ధోరణులను గూర్చిన అత్యంత విపులమైన ఈ విశ్లేషణలో ఇప్పటివరకు 45 దేశాలు చేరివున్నాయి. “అనేక దేశాల్లో పరిస్థితి ఇంకా విషమించనైవుంది, ప్రస్తుత ధూమపాన పద్ధతులు ఇలాగే కొనసాగితే ఈనాటి పొగత్రాగే యౌవనతరం మధ్యవయస్సుకి లేక వృద్ధాప్యానికి చేరుకునేటప్పటికి, పొగాకు మూలంగా ప్రతి మూడుసెకండ్లకు ఒకరు చొప్పున ఏటా ఒకకోటి మంది మరణిస్తారు.” ఇంపీరియల్ క్యాన్సర్ రీసర్చ్ ఫండ్‌కు సంబంధించిన రిచర్డ్ పీటో హెచ్చరిస్తున్నాడు.
“పొగత్రాగడం మరే ఇతర ఆపదల వంటిదికాదు, అది తుదకు పొగత్రాగే ఇద్దరిలో ఒకరిని చంపుతుంది” అని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన డా. అలెన్ లోపెజ్ అంటున్నాడు. అదేవిధంగా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు సంబంధించిన మార్టిన్ వెసి ఇలా అంటున్నాడు: “నలభై సంవత్సరాలుగా జరిపిన ఈ పరిశోధనలు, పొగత్రాగే వారిలో సగంమంది చివరకు వారి అలవాటు మూలంగా మరణిస్తారనే భయంకరమైన నిర్ధారణకు నడిపాయి—ఇది నిజంగా భీతికల్గించే తలంపే.” మరి 1950వ పడి నుండి పొగత్రాగడం మూలంగా ఆరుకోట్లమంది చనిపోయారు.
పొగాకు కంపెనీలకు కూడ నిజంగా అది భీతికల్గించే తలంపే. మరి ధూమపాన-సంబంధిత కారణాలవల్ల ప్రతి సంవత్సరం 30 లక్షలమంది ఇప్పుడు చనిపోతూవుండగా, మరియు ఇతరులనేకులు పొగత్రాగడాన్ని మానివేస్తుండగా, ప్రతిసంవత్సరం 30 లక్షలమంది క్రొత్తగా పొగత్రాగేవారిని కనుగొనాల్సివుంటుంది.
స్త్రీ విమోచనా నినాదాన్ని పొగాకు కంపెనీలు లేవనెత్తినందున మరోగుంపు ఉద్భవించింది. స్త్రీలు ధూమపానం చేయడమనేది పాశ్చాత్యదేశాల్లో కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న వాస్తవం, ఇప్పుడైతే ఆడవారు పొగతాగడాన్ని అవమానకరంగా పరిగణించే దేశాలకు అది పాకిపోతోంది. పొగాకు కంపెనీలు దానినంతా మార్చాలని ఉద్దేశిస్తున్నాయి. స్త్రీలకు కొత్తగా సంక్రమించిన ఈ హోదాను విమోచనను చాటిచెప్పడంలో వారికి సహాయపడాలని అవి ఆశిస్తున్నాయి. తక్కువ మోతాదుల్లో తారు, నికోటిన్ ఉన్నాయని చెప్పుబడుతున్న ప్రత్యేక తరహా సిగరెట్టు బ్రాండ్లు, పొగ త్రాగే స్త్రీలను, అవి అంత ఘాటైనవి కావని భావించేవారిని ఆకర్షిస్తున్నాయి. వేరే సిగరెట్లు సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటాయి లేక సన్నగా, పొడవుగా ఉంటాయి—పొగత్రాగడం ద్వారా స్త్రీలు పొందాలని అపేక్షించే రూపం. ఆసియాలోని ధూమపాన ప్రకటనలు పాశ్చాత్య శైలిలో మరులుకొల్పేలా దుస్తులు ధరించిన చురుకైన ఆసియా దేశస్థులైన యౌవన మోడళ్ళను చూపిస్తున్నాయి.
అయిననూ, ధూమపాన సంబంధిత మరణాల రేటు స్త్రీ “విమోచన” అభివృద్ధి స్థాయితో సమానంగా ఉంది. బ్రిటన్, జపాన్, నార్వే, పోలాండ్, మరియు స్వీడన్లలో గత 20 సంవత్సరాల్లో స్త్రీలలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గురైనవారి సంఖ్య రెండింతలైంది. అమెరికాలోను కెనడాలోను ఆ సంఖ్య 300 శాతం పెరిగింది. “నీవెంతో అభివృద్ధిని సాధించావు, పాపా!” అని అంటోంది ఒక సిగరెట్ ప్రకటన.
కొన్ని పొగాకు ఉత్పత్తి సంస్థలకు వాటి స్వంత వ్యూహరచనలున్నాయి. ముఖ్యంగా కాథోలిక్కులు అధికంగావున్న ఫిలిప్పీయన్ దేశంలోని ఒక కంపెనీ కన్య మరియ బొమ్మ, దానిక్రింద సిగరెట్ బ్రాండుకు సంబంధించిన వ్రాతలున్న క్యాలండర్లను ఉచితంగా పంచిపెట్టింది. “అటువంటిదేదీ నేను ముందెన్నడూ చూడలేదు. ఫిలిప్పీదేశ మహిళలు సిగరెట్ త్రాగడం ఆనందకరమని తలంచేలా ఆ బొమ్మను దాని క్రిందవున్న పొగాకుకు సంబంధించిన వ్యాపార చిహ్నానికి ముడిపెట్టడానికి ప్రయత్నించారని” ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఆసియా దేశాల ఆరోగ్య సలహాదారిణి డాక్టర్ రోజ్మేరి ఎర్బన్ అన్నది.
చైనాలో పురుషుల్లో 61 శాతంమంది సిగరెట్ త్రాగితే, స్త్రీలలో 7 శాతం మంది మాత్రమే సిగరెట్ త్రాగుతున్నారని అంచనా వేయబడింది. పాశ్చాత్య పొగాకు కంపెనీల కన్నంతా, ఇంతకాలం అందమైన తమ పాశ్చాత్య సహోదరీల “సంతోషాలను” కాదన్న ఈ తూర్పుదేశ ముద్దుగుమ్మల “విమోచన” పైనే ఉంది. అయితే, ఒక న్యూనత ఏమంటే, ప్రభుత్వ యాజమాన్యం క్రిందవున్న పొగాకు కంపెనీలే అధికంగా సిగరెట్లను సరఫరా చేస్తున్నాయి.
అయినా, పాశ్చాత్య కంపెనీలు క్రమేపి వాటి వ్యాపారాన్ని పుంజుకుంటున్నాయి. కొద్దిపాటి వ్యాపార ప్రకటనలు చేసే అవకాశాలు గల కొన్ని కంపెనీలు తమ భవిష్యత్ వినిమయదారులను రహస్యంగా చేజిక్కించుకోవాలని చూస్తున్నాయి. చైనా హాంకాంగ్నుండి సినిమాలను దిగుమతి చేసుకుంటోంది, మరి వాటిలో నటులకు పొగత్రాగడానికి డబ్బు ఇవ్వబడుతుంది—ఇది సులభమైన అమ్మకపు పద్ధతి!
స్వదేశంలో ధూమపాన వ్యతిరేకత పెరుగుతున్నందున, వర్ధిల్లుతున్న అమెరికా పొగాకు కంపెనీలు కొత్తవారిని ప్రలోభపెట్టడానికి వాటి వ్యాపారాన్ని విస్తృతపరుస్తున్నాయి. అవి అభివృద్ధిచెందుతున్న దేశాలమీదకు వినాశకరమైన గురులను ఎక్కుపెట్టివుంచారని వాస్తవాలు చూపిస్తున్నాయి.
ఆరోగ్యాధికారులు ప్రపంచమంతా హెచ్చరికలు చేస్తున్నారు. వార్తా శీర్షికలు ఇలా ప్రకటిస్తున్నాయి: “సిగరెట్ త్రాగడమనే ఓ క్రొత్త తెగులుతో ఆఫ్రికా పోరాడుతోంది.” “ఆసియాలో సిగరెట్ విపణి విస్తృతమవుతుండగా పొగ అగ్నిగా మారుతోంది.” “ఆసియాలో ధూమపాన రేటు క్యాన్సర్ మహమ్మారి వైపుకు దారితీస్తుంది.” “అభివృద్ధిచెందని క్రొత్త దేశాల పోరాటం పొగాకుపై.”
ఆఫ్రికా ఖండం కరవు, అంతర్యుద్ధం మరియు ఎయిడ్స్ తెగులుతో అతలాకుతలమయ్యింది. అయినా, బ్రిటీష్ హృద్రోగనిపుణుడు డాక్టర్ కేత్ బాల్ ఏమంటున్నాడంటే, “అణుయుద్ధం లేక కరవు మినహా, ఆఫ్రికావారి భవిష్యత్ ఆరోగ్యానికి సిగరెట్టు త్రాగడమే అత్యంత హానికరమైనది.”
పలుదేశాల్లో వ్యాపారమున్న కంపెనీలు పొగాకు పండించడానికి స్ధానిక రైతులను బాడుగకు తీసుకుంటున్నాయి. వారు వంటకు, చలికాచుకోవడానికి, ఇండ్ల నిర్మాణాలకు ఎంతో అవసరమయ్యే చెట్లను నరికి, వాటిని పొగాకును నిల్వ చేయడానికి ఇంధనంగా ఉపయోగిస్తారు. వారు తక్కువ లాభాలున్న ఆహారధాన్యాలను పండించేబదులు అధికలాభాలున్న పొగాకు పంటను పండిస్తున్నారు. పేదరికంలో మగ్గుతున్న ఆఫ్రికా ప్రజలు వారికొచ్చే స్వల్ప ఆదాయంలో అధికభాగాన్ని సామాన్యంగా సిగరెట్లకే ఖర్చుపెడుతున్నారు. గనుక వచ్చేలాభాలవల్ల పాశ్చాత్య పొగాకు కంపెనీల డబ్బు సంచీలు మెండుగా నిండిపోతూంటే, ఆఫ్రికా కుటుంబాలు కుపోషణవల్ల కృశించిపోతున్నాయి.
పాశ్చాత్య పొగాకు కంపెనీలు ఆఫ్రికా, తూర్పు ఐరోపా, లాటిన్ అమెరికా దేశాలను గురిగాపెట్టుకున్నాయి, ఈ అభివృద్ధిచెందుతున్న దేశాలు పెద్ద వ్యాపార అనుకూలతకు దోహదపడతాయని అవి భావిస్తున్నాయి. అయితే వీటన్నింటిలోనూ అధికజనాభాగల ఆసియా పెద్ద బంగారుగనివంటిది. ఒక్క చైనాలోనే ప్రస్తుతం అమెరికాలోని మొత్తం జనాబాకంటె ఎక్కువే—అంటే 30 కోట్లమంది సిగరెట్ తాగుతున్నారు. వారు ఏటా మొత్తం 1 లక్ష 60 వేల కోట్ల సిగరెట్లను అంటే ప్రపంచంలో త్రాగే సిగరెట్లలో మూడవభాగం తాగుతున్నారు!
“ఆసియాలో పొగతాగడంవల్ల వచ్చే ఆరోగ్యసమస్యలు భయంకరంగా ఉన్నాయని వైద్యులంటున్నారు,” అని ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంటుంది. రానైయున్న రెండుమూడు దశాబ్దాలలో పొగతాగడంవల్ల ప్రతి సంవత్సరం సంభవిస్తాయనుకుంటున్న కోటి మరణాల్లో, 20 లక్షల మరణాలు చైనాలోనే సంభవిస్తాయని రిచర్డ్ పీటో అంచనావేస్తున్నాడు. చైనాలో ఇప్పుడు జీవిస్తున్న ఐదుకోట్లమంది పిల్లలు పొగతాగడంవల్ల వచ్చే రోగాలమూలంగా చనిపోవచ్చునని పీటో అంటున్నాడు.
డాక్టర్ నైజల్ గ్రే దాన్ని ఇలా క్లుప్తీకరించాడు: “చైనా, తూర్పు ఐరోపాలలో పొగతాగడంలోవున్న గత ఐదు దశాబ్దాల చరిత్ర, ఆ దేశాల్లో పొగాకువల్ల గొప్ప తెగులు వస్తుందని నిరూపిస్తుంది.”
“అమెరికాలో ప్రతి సంవత్సరం 4,00,000 అకాల మరణాలకు కారణమౌతున్న ఉత్పత్తిని తన పౌరులు మానుకోవడంలో సహాయపడేందుకు అమెరికా ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తుండగా, హఠాత్తుగా అదే ఉత్పత్తి అమెరికా సరిహద్దులకవతల ఎలా నిరపాయకరమైనదిగా కాగలదు? అదే ఉత్పత్తి ఇతరదేశాలకు ఎగుమతియైతే ఆరోగ్యం అసంగతమౌతుందా?” అని థాయ్‌లాండ్ యొక్క ధూమపాన-వ్యతిరేక ప్రచార సభ్యుడైన డాక్టర్ ప్రాకిట్ వాటీసటోకిట్ అడిగాడు.
అభివృద్ధి చెందుతున్న పొగాకు వ్యాపారాలు అమెరికా ప్రభుత్వంతో శక్తివంతమైన మైత్రిని కలిగివున్నాయి. అవి విదేశీ విపణుల్లో ముఖ్యంగా ఆసియా విపణుల్లో బాగా వేళ్లూనుకు పోవడానికి కలిసి పోరాడాయి. జపాన్, తైవాన్, థాయ్‌లాండ్, మరితర దేశాల్లో కొన్ని సంవత్సరాలవరకు అమెరికా దేశపు సిగరెట్లు అమ్మడానికి అనుమతిలేకుండేది, వాటిలో కొన్ని ప్రభుత్వాలకు తమ స్వదేశీ పొగాకు ఉత్పత్తులమీద గట్టిపట్టు ఉండేది. ధూమపాన వ్యతిరేకగుంపులు దిగుమతులను వ్యతిరేకించాయి గానీ, అమెరికా అధికారులు వాణిజ్య అనుమతులపై కోత అనే ఒప్పింపజేసే ఓ ఆయుధాన్ని సంధించారు.
అమెరికా ప్రభుత్వంనుండి వచ్చిన తీవ్రమైన ఒత్తిడివల్ల 1985 నుండి అనేక ఆసియాదేశాలు దిగుమతులకు ద్వారాలు తెరిచాయి, అప్పుడు అమెరికా సిగరెట్లు కుప్పతెప్పలుగా వచ్చిపడ్డాయి. ఆసియాకు అమెరికా సిగరెట్ ఎగుమతులు 1988లో 75 శాతం పెరిగాయి.
సిగరెట్ల అమ్మకానికి జరిగే పోరాటంలో అత్యంత విషాదకరంగా బాధితులైనవారు బహుశ పిల్లలే. “క్రొత్తగా సిగరెట్ త్రాగేవారిలో 90% మంది పిల్లలు, యౌవనులేనని” ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోషియేషన్‌లో నివేదించబడిన అధ్యయనం తెల్పుతోంది.
యు.యస్.న్యూస్ & వరల్డ్ రిపోర్ట్ నందలి ఓ శీర్షిక, అమెరికాలో 31 లక్షలమంది యౌవనులు సిగరెట్ తాగుతున్నట్లు అంచనావేసింది. ప్రతిరోజూ 3,000 మంది క్రొత్తవారు చొప్పున ఒక సంవత్సరానికి 10,00,000 మంది పొగ తాగనారంభిస్తున్నారు.
ఒక కంపెనీ సిగరెట్ ప్రకటనలో ఎప్పుడూ తమషాగా, సంతోషంగా ఉండే కార్టూన్ ఒంటె పెదాలమధ్య తరచూ ఓ సిగరెట్ వేలాడుతూంటుంది. యౌవనులు తమ ఆరోగ్య అపాయాలనుగూర్చి తలంచేలోపే, ఈ కార్టూన్ ఒంటె వారిని నికోటిన్‌కు బానిసలనుగా చేస్తుందని ఆరోపించబడుతోంది. ఆ ప్రకటనను ఉపయోగించిన మూడేండ్లలోపే, ఆ కంపెనీ యౌవనస్థులకు చేసిన అమ్మకంలో 64 శాతం పెరుగుదలను సాధించింది. ది మెడికల్ కాలేజ్ ఆఫ్ జార్జియా (అమెరికా) నందలి ఒక అధ్యయనం, పరిశీలించబడిన ఆరేండ్ల వయస్సున్న పిల్లల్లో 91 శాతం మంది పొగతాగుతున్న ఈ కార్టూన్ బొమ్మను గుర్తించినట్లు తెల్పింది.
మరో పేరుపొందిన సిగరెట్ బొమ్మ ఏమంటే స్వేచ్ఛగా తిరుగుతున్న దారుఢ్యంగల కౌబోయ్ బొమ్మ. ఒక యౌవనస్థుడు చెప్పినదాని ప్రకారం, ఈ బొమ్మ అందించే సమాచారమేమంటే, “నీవు పొగ త్రాగుతుంటే నిన్నాపేవాడే లేడు.” ఈ సిగరెట్టు ప్రపంచంలోనే అత్యంత విరివిగా అమ్ముడుబోయే వినిమయ వస్తువని, ఇది పొగత్రాగే యౌవనస్థుల మధ్యనే 69 శాతం అమ్మకాలు జరుపుకుంటోందని, మరి ఇది అత్యంత విస్తృతంగా ప్రకటనలు చేయబడిన బ్రాండని చెప్పబడుతోంది. అధిక ఆకర్షణ కొరకు, ప్రతి ప్యాక్‌తో పాటు కూపన్లు ఇవ్వబడతాయి, వాటిని పొందేవారు వాటిని తిరిగి ఇచ్చి, యౌవనుల మధ్య పేరెన్నికగల జీన్స్‌లను, టోపీలను, మరియు క్రీడా వస్తువులను పొందవచ్చు.
ప్రకటనలకున్న అమోఘమైన శక్తిని గుర్తించి, ధూమపాన వ్యతిరేకగుంపులు అనేక దేశాల్లో దూరదర్శిని, రేడియోలనుండి చేసే సిగరెట్ ప్రకటనలను నిషేధించేలా చేయడంలో కృతకృత్యులయ్యారు. అయినా, తెలివిగల ఈ సిగరెట్ ప్రకటనదారులు క్రీడలు జరిగేటప్పుడు ప్రకటనలున్న పెద్దబోర్డులను అక్కడ యుక్తిగా పెట్టడం ద్వారా చట్టాన్ని వంచించారు. అందుకే, యౌవనుల గొప్ప ప్రేక్షక సమూహానికి దూరదర్శినిలో చూపబడే ఆటలో ఆడడానికి సిద్ధపడుతున్న వారి అభిమాన ఆటగాడిని తెరపై చూపిస్తారు, ఆయనకు వెనుకగా ఎత్తైన సిగరెట్ ప్రకటనా బోర్డు కనబడుతూ ఉంటుంది.
జోరుగా వ్యాపారం జరిగే స్థలాల్లో లేక పాఠశాల ఎదురుగా, తెలివిగా మినిస్కర్ట్లు లేక కౌబోయ్ దుస్తులు లేదా సఫారి వస్త్రాలు ధరించిన వనితలు ఆశతో ఎదురుచూసే యువతకు సిగరెట్లను ఉచితంగా పంచిపెడుతుంటారు. వీడియో ఆర్కేడ్లు, డిస్కోలు, రాక్ సంగీత కచేరీల వద్ద సిగరెట్లు ఉచితంగా పంచిపెట్టబడుతాయి. కెనడాలోని ఒక బ్రాండు 12 నుండి 17 ఏండ్లలోపున్న ఫ్రెంచ్ భాష మాట్లాడే యువతమీద కన్ను వేసిందని వార్తాపత్రికలకు బయల్పడిన ఒక కంపెనీ మార్కెటింగ్ పథకం తెలిపింది.
ధూమపానం సుఖాన్ని, సౌష్టవాన్ని, పురుషత్వాన్ని, ప్రజాదరణను ఇస్తుందన్నదే ఆకర్షణీయమైన సమాచారం. “నేను పనిచేసేచోట 14 ఏండ్ల పిల్లలు సిగరెట్ త్రాగడానికారంభించేలా వారిని ప్రభావితం చేయడానికి మేమెంతో కృషిచేస్తున్నామని” ఒక ప్రకటన సలహాదారుడు అన్నాడు. పాశ్చాత్య దేశీయులైన ఆరోగ్యవంతులగు యౌవన క్రీడాకారులవంటివారు బీచ్‌ల్లో, మైదానాల్లో సిగరెట్ తాగుతున్నట్లు ఆసియాదేశ ప్రకటనలు చూపిస్తున్నాయి. “పాశ్చాత్య మోడల్స్, జీవనశైలి అనుకరణకు ఆకర్షణీయంగా ఉన్నాయని, ఆసియాలోని ధూమపాన ప్రియులు అలా అనుకరించకుండా ఉండలేరని” వాణిజ్య పత్రిక వాపోయింది.
కొన్ని కోట్ల డాలర్లు ప్రకటనలమీద ఖర్చుచేసిన తర్వాత పొగాకు వ్యాపారస్థులు అపారలాభాల నార్జించారు. రీడర్స్ డైజెస్ట్ ప్రత్యేక నివేదిక పొగత్రాగే యౌవనుల సంఖ్య పెరగడం భయంకల్గిస్తుందని చూపింది. “ప్రస్తుతం ఫిలిప్పియన్స్లో 18 ఏండ్లలోపువారిలో 22.7 శాతం మంది ఇప్పుడు పొగత్రాగుతున్నారు. కొన్ని లాటిన్ అమెరికా పట్టణాల్లో ఆశ్చర్యంకల్గించే విధంగా యౌవనస్థుల్లో 50 శాతం మంది పొగత్రాగుతున్నారు. హాంకాంగ్‌లో ఏడేండ్ల ప్రాయంగల వారు కూడ పొగత్రాగుతున్నారు,” అని ఆ నివేదిక తెల్పుతోంది.
అయితే, పొగాకు విదేశాల్లో ఇలా విజయోత్సవాలు చేసుకోగలుగుతున్నప్పటికీ, తమ స్వదేశంలో కలుగనున్న సంక్షోభాలను గూర్చి పొగాకు కంపెనీలకు బాగా తెలుసు. సంక్షోభాన్ని తట్టుకునే అవకాశాలు పొగాకుకు ఎంత మేరకున్నాయి?
[3వ పేజీలోని చిత్రం]
దాని మంచి ఖాతాదారులు చనిపోతూనే ఉంటారు
[5వ పేజీలోని చిత్రం]
ఆసియా, పొగాకుయొక్క సరికొత్త మరుభూమి
[6వ పేజీలోని చిత్రం]
కొత్తగా పొగత్రాగేవారిలో 90 శాతం—పిల్లలు, యౌవనస్థులే!
[4వ పేజీలోని బాక్సు]
మరణకరమైన తయారీ—సిగరెట్లో ఏముంది?
సిగరెట్ ఉత్పత్తిదారులు దాదాపు 700 వేర్వేరు రసాయన పదార్ధాలను ఉపయోగించినప్పటికిని, కంపెనీలు ఆ పట్టికను రహస్యంగా ఉంచడానికి చట్టం అనుమతిస్తుంది. అయినా, ఆ పట్టికల్లో అధిక సాంద్రతగల లోహాలు, చీడపురుగుల మందులు, క్రిమిసంహారకాలు చేరివున్నాయి. కొన్ని మిశ్రమాలు ఎంత విషపూరితమైనవంటే వాటిని చెత్తకుండీల్లో వేయడం కూడ చట్టవిరుద్ధమే. ఆ ఇంపైన సిగరెట్ దమ్ములో 4,000 మిశ్రమాలుంటాయి, వాటిల్లో ఆసిటోన్, తాలికామ్లము, బ్యూటేన్, కార్బన్ మోనాక్సైడ్, మరియు సైనైడ్ చేరివుంటాయి. పొగతాగేవారి ఊపిరితిత్తులు, మరియు వారికి దగ్గర్లోవున్నవారి ఊపిరితిత్తులు క్యాన్సర్‌కు కారణమయ్యే కనీసం 43 విషపదార్ధాలకు గురవుతున్నాయి.
[5వ పేజీలోని బాక్సు]
పొగతాగనివారు ప్రమాదంలో ఉన్నారు
మీరు అధికంగా సిగరెట్లు తాగేవారితో కలిసి జీవిస్తున్నారా, పని చేస్తున్నారా లేక ప్రయాణిస్తున్నారా? అలాగైతే మీరు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు, హృద్రోగానికి ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉంది. అమెరికా పర్యావరణ పరిరక్షణా సంస్థ (ఇపిఎ) 1993 లో జరిపిన అధ్యయనంలో తేలిందేమంటే పర్యావరణాన్ని కలుషితంజేసే కార్సినోజన్ అనే గ్రూప్ ఎ రసాయన పదార్ధంగల సిగరెట్పొగ అత్యంత అపాయకరమైనది. సిగరెట్ చివరి భాగంనుండి రింగులురింగులుగా వెలువడేపొగను గూర్చి, పీల్చి వదిలే పొగనుగూర్చి చేసిన 30 అధ్యయనాల ఫలితాలను ఆ పెద్ద నివేదిక విశ్లేషించింది.
అమెరికాలో ఏటా 3,000 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోవడానికి కారణం ఈ పొగేనని పర్యావరణ పరిరక్షణా సంస్థ నిందిస్తుంది. ఎన్నడూ సిగరెట్ త్రాగకపోయిననూ, పర్యావరణాన్ని కలుషితం చేసే పొగను పీల్చుకోవలసి వస్తున్న స్త్రీలు, జీవితంలో అసలే పొగతాగని ఇతరులకంటె 30 రెట్లు ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సరు వచ్చే అపాయంలో ఉన్నారని 1994 జూన్‌లో ప్రచురించిన అధ్యయనంలో తేలిన విషయాలను అమెరికన్ మెడికల్ అసోషియేషన్ ధృవీకరించింది.
పొగ పీల్చుకునే చిన్నపిల్లలు, సంవత్సరానికి 1,50,000 నుండి 3,00,000 వరకు రొమ్ముపడిసెము, నిమోనియా జాడ్యములకు గురౌతున్నారు. పొగ మూలంగా అమెరికాలో ఏటా 2,00,000 నుండి 10,00,000 మంది పిల్లల్లో ఉబ్బసవ్యాధి లక్షణాలు వృద్ధిచెందుతున్నాయి.
పర్యావరణాన్ని కలుషితం చేసే పొగవల్ల హృద్రోగం మరియు రక్తనాళాల రోగాల మూలంగా ప్రతి సంవత్సరం సుమారు 40,000 మరణాలు సంభవిస్తాయని ది అమెరికన్ హార్ట్ అసోషియేషన్ అంచనావేస్తుంది.
[7వ పేజీలోని చిత్రాలు]
ఆసియా మోడల్ ముద్దుగుమ్మలు మరియు వారికి గురయ్యేవారు