బైబిలు ఉద్దేశ్యము
మీ మనస్సాక్షినే మీకు మార్గదర్శకంగా అనుమతిస్తారా?
మీరు ఒక రద్దీగా ఉన్న వీధిలో నడుస్తూండగా, సొగసైన దుస్తులు ధరించిన ఒక స్త్రీ తనకు తెలియకుండానే డబ్బు కట్టనొకదానిని జారవిడిచింది. మీరు వంగి దానిని తీస్తుండగా, కనురెప్పపాటులో ఆమె తన లిమజీన్కారులో అడుగుపెడుతుండటం మీరు గమనిస్తారు. మీరేం చేస్తారు? ఆమెను బిగ్గరగా పిలుస్తారా లేక తొందరగా వాటిని మీ జేబులో కుక్కుకుంటారా?
జవాబు మీ మనస్సాక్షిపై ఆధారపడివుంటుంది. అది మీతో యేం చేయమని చెబుతుంది? మరీ ప్రాముఖ్యంగా, అది మీతో చెప్పేదానిని నమ్మగలరా? మీరు క్షేమంగా మీ మనస్సాక్షిని మీ మార్గదర్శకంగా అనుమతించగలరా?
మీ మనస్సాక్షి అంటే ఏమిటి
మంచిచెడులు, న్యాయాన్యాయాలు, నీతి అవినీతులు అంటే ఏమిటో తెలుసుకొనే సహజ వివేకమే మనస్సాక్షిగా వర్ణించబడింది. మనస్సాక్షి గుణాలను గూర్చి బైబిలు రోమీయులు 2:14, 15లో ఇలా వివరిస్తున్నది: “ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.” ఆవిధంగా, పరిస్థితులను నిర్ధారించడానికి, సరైన ఎంపిక చేసుకోడానికి, మీ ఎంపికలను గూర్చి మీకై మీరు ఆలోచించడానికి మీ మనస్సాక్షి రూపించబడింది. అయితే మీరు దాన్ని నమ్మగలరా?
అది షరతులపై ఆధారపడివుంటుంది. ఏమైనప్పటికి, వక్రమైన మనస్సాక్షి ఒకరిని చెడు ప్రవర్తనకు నడుపగలదని నిరూపించడానికి కావలసినంత ఆధారముంది. నిజానికి ఒకరి మనస్సాక్షి ఒక ప్రత్యేకమైన ప్రవర్తనను అనుమతిస్తున్నప్పటికి, దానిని దేవుడు క్షమిస్తాడని హామీలేదు. ఉదాహరణకు, తార్సువాడైన సౌలు క్రైస్తవుడుగా మారకముందు, ఆయన క్రైస్తవులను హింసించుటలో నాయకత్వం వహించాడు. ఆయన క్రైస్తవ హతసాక్షైన స్తెఫనును హత్య చేయుటకు అంగీకరించి, అందులో భాగం వహించాడు. దీనంతటికి కారణం తన మనస్సాక్షి ఆయన్ని ఖండించలేదు.—అపొస్తలుల కార్యములు 7:58, 59; గలతీయులు 1:13, 14; 1 తిమోతి 1:12-16.
రెండవ ప్రపంచయుద్ధ సమయంలో నాజీ జర్మనులో, హిట్లరు పోలీస్ సేనలు చాలామంది, హిట్లరు యొక్క కాన్సెంట్రేషన్ క్యాంపులలోనున్న లక్షలాది ప్రజలను హింసించి, చంపినప్పుడు కేవలం వారు తమకివ్వబడిన ఆజ్ఞలను మాత్రమే శిరసావహిస్తున్నామని చెప్పారు. వారలా చేయడానికి వారి మనస్సాక్షి అంగీకరించింది. కాని ప్రపంచ తీర్పు—అతి ప్రాముఖ్యంగా—దేవుని తీర్పు—వారి క్రియలకు శిక్షవిధించకుండా మానదు. న్యాయంగానే, వారు ఖండించబడ్డారు.
ఎందుకది సరైన విధంగా పనిచేయదు?
దేవుడు సృష్టించినది ఎందుకు సరిగ్గా పనిచేయదు? బైబిలు ఇలా వివరిస్తున్నది. ఆదాము అవిధేయతద్వారా మానవుడు పాపంలో పడినందున, పాపము దాని కోరికలకనుగుణంగా లోబడుటకు మానవున్ని బలవంతం చేస్తూ, “ఏలుచున్నట్లు” చెప్పబడింది. (రోమీయులు 5:12; 6:12) మొట్టమొదట పరిపూర్ణంగానున్న మానవుని మనస్సాక్షి, కుటిలమైనదిగా మారింది; పాపము యొక్క ప్రబలమైన శక్తి మనస్సాక్షితో పోటీపడుతున్నది. (రోమీయులు 7:18-20) ఈ సంఘర్షణ మనకు బాగా తెలిసినదే: “కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. . . . వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.”—రోమీయులు 7:21-23.
సంప్రాప్తమైన ఈ బలహీనతే కాకుండా, మన మనస్సాక్షి బాహ్య ప్రేరణలద్వారా కూడ ప్రభావితమౌతుంది. ఉదాహరణకు, స్పష్టంగా తోటివయస్కుల ఒత్తిడి అనేది, ముందు వివరించిన నాజీ సైన్యాల్లోని హిట్లరు పోలీస్ సేనల మనస్సాక్షిని వక్రీకరించింది, లేదా అణచివేసింది. (సామెతలు 29:25 పోల్చండి.) ఇంకనూ, చలనచిత్రాల్లోను, పుస్తకాల్లోను, టివీలోను ఉన్నటువంటి అవినీతి, దౌర్జన్యంవంటి హానికరమైన విషయాలపై మనస్సును కేంద్రీకరించినట్లైతే, అదేరీతిలో ప్రభావముంటుంది. ఒకవేళ మనం అలాంటి వాటిని క్రమంగా చూస్తున్నట్లైతే, అవి చివరకు అంత చెడుగా కన్పించవు, మరి మన మనస్సాక్షి బలహీనమౌతుంది. మరొకవిధంగా చెప్పాలంటే, “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.”—1 కొరింథీయులు 15:33.
దేవుని నియమాలను తెలుసుకుని, గౌరవించడానికి ఒక వ్యక్తి తర్ఫీదు పొందితే, అతని మనస్సాక్షి స్పష్టంగా మునుపటికంటే ఎక్కువ నమ్మదగిన మార్గదర్శకంగా పనిచేస్తుంది. అయినప్పటికి, దేవుని మార్గాలను గూర్చిన మంచి అవగాహన, మెండైన మెప్పుదలకల్గిన ఒక వ్యక్తి కూడా సంక్రమిత పాపము, అపరిపూర్ణతలనుబట్టి బహుశ బాహ్య ప్రభావాలవల్ల యింకనూ కొన్నిసార్లు తన మనస్సాక్షి నమ్మదగిన మార్గదర్శకం కాదని కనుగొనవచ్చును.
మనమేం చేయగలం?
మనస్సాక్షిని మంచి నియమాలకు ఎక్కువ స్పందించేదిగా మార్చవచ్చునా? ఔను. పౌలు క్రైస్తవులకు సలహా యిచ్చినదేమంటే, “వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు.” (హెబ్రీయులు 5:11-14) యేసుక్రీస్తు మనకొరకు ఉంచిన పరిపూర్ణమైన మాదిరికి ప్రత్యేకమైన అవధానమివ్వడం, బైబిలు అధ్యయనం చేయడమనేవి అలాంటి సాధకము, అభ్యాసంలో యిమిడియున్నవి. (1 పేతురు 2:21, 22) ఆ తర్వాత, నిర్ణయాలు తీసుకొనుటలో మనం మన జ్ఞానేంద్రియాలను సాధకం చేయడంద్వారా, మన మనస్సాక్షి మనలను చెడు ఆలోచనలనుండి, క్రియలనుండి బహుగా దూరం చేసి, మాన్యమైనవి, మంచివి చేయడానికి పురికొల్పుతుంది.
ఆవిధంగా చేసినప్పటికి, మనం ఎన్నడూ స్వనీతిపరులం కాకూడదు, లేదా ఏదైనా సరే దానికి “నా మనస్సాక్షి అంగీకరిస్తుంది” పర్వాలేదులే అని కూడ అనకూడదు. అపరిపూర్ణ మానవులు సరైనవిధంగా, జాగ్రత్తకల్గి ఉపయోగించే మనస్సాక్షిని జాగ్రత్తపరుడైన డ్రైవరు పాటించే హెచ్చరికలను పోల్చవచ్చును. డ్రైవరు తన మార్గాన్ని మార్చాలని తలంచితే, అతడు సహజంగా వెనుకవచ్చే కార్లను చూడటానికి తన ప్రక్కనున్న అద్దంలో చూస్తాడు. ఒకవేళ ఏదైనా కారు కనిపిస్తే, వేరే మార్గంలోకి కారును మరల్చడం ప్రమాదకరమని అతనికి తెలుసు. అయినను, ఏమీ చూడనప్పటికి, ఒక్కొక్కసారి తన కంటిదోషముంటుందని తెలివైన డ్రైవరు గుర్తిస్తాడు, అంటే అన్ని సమయాల్లోనూ ప్రతి వస్తువును కేవలం అద్దాన్ని ఆధారం చేసుకుని చూడలేమని గుర్తిస్తాడు. కాబట్టి, ఆయన కేవలం అద్దంలో మాత్రమే చూడడు. ఆయన తన తలను వెనక్కు త్రిప్పి, తాను కదిలేముందు మార్గం స్పష్టంగా ఉందా లేదాయని నిర్ధారించుకోడానికి చూస్తాడు. మనస్సాక్షి విషయంలో కూడ ఇది నిజమే. అది మిమ్మల్ని హెచ్చరిస్తే, దాన్ని ఆలకించండి! కాని అది ఒకవేళ మొదట మిమ్మల్ని హెచ్చరించక పోయినప్పటికి, వాహనం నడిపేవానివలే—ప్రమాదమేమీ లేదని రుజువుచేసుకొనడానికి యింకా మీరు పరీక్షించండి.
మీ ఆలోచన దేవుని ఆలోచనతో సరిపడుతుందా లేదాయని పరీక్షించుకోండి. మీ మనస్సాక్షిని అంచనా వేయడానికి దేవుని వాక్యాన్ని సలహాదారునిగా ఉపయోగించండి. సామెతలు 3:5, 6 జ్ఞానయుక్తంగా యిలా చెబుతున్నది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”
కాబట్టి మీ మనస్సాక్షి చెప్పేదానిని ఆలకించడం వివేకమైన పని. కాని దేవుని వాక్యంలో బయలుపర్చబడినట్లుగా దేవుని చిత్తంతో మనం చేసే ప్రతిదానిని పోల్చిచూడటం యింకా వివేకవంతమైనది. అప్పుడు మాత్రమే మనం, “మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముచున్నాము” అని నిశ్చయంగా చెప్పగలం.—హెబ్రీయులు 13:18; 2 కొరింథీయులు 1:12. (g93 7/8)
[26వ పేజీలోని చిత్రం]
“పరిశుద్ధుడైన పౌలు మారుట”
[క్రెడిట్ లైను]
Painting by Caravaggio: Scala/Art Resource, N.Y.