అనియత సాక్ష్యమివ్వడానికి సిద్ధంగా ఉన్నారా?
1 ప్రజలు ఎక్కడుంటే అక్కడ సాక్ష్యమివ్వడం వల్ల మంచి ప్రయోజనాలుంటాయి. అలా సాక్ష్యమివ్వడం వల్ల మంచి ప్రయోజనాలుంటాయని చూపించే ఎన్నో ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. (యోహా. 4:7-15) ఇలా సాక్ష్యమివ్వాలంటే మనం ముందుగా ఏమి చేయాలి?
2 గౌరవప్రదంగా కనిపించాలి: మనం గౌరవప్రదంగా తయారైనప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేకుండా మన విశ్వాసాన్ని గురించి మాట్లాడగలుగుతాం. (1 తిమో. 2:9, 10) మనం కనిపించే తీరు బాలేదని మనకు అనిపిస్తే సాక్ష్యమివ్వడానికి ముందుకు వెళ్లలేం. అదే మనం శుభ్రంగా కనిపిస్తే మన గురించి తెలుసుకోవాలని ఇతరులకే అనిపిస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం, గౌరవప్రదంగా తయారైన ఒక యెహోవాసాక్షుల జంట ప్రయాణంలో ఒక ముస్లిం మతస్థుని పక్కన కూర్చున్నారు. వాళ్లు అలా చక్కగా ఉండడం చూసి ఆయన, “మీరు క్రైస్తవులా?” అని అడిగాడు. దాంతో బైబిలు గురించి మూడు గంటల పాటు మాట్లాడే అవకాశం వాళ్లకు దొరికింది.
3 సంభాషణ ఎలా మొదలుపెట్టాలి? యాకోబు బావి దగ్గరికి వచ్చిన సమరయ స్త్రీని, తాగడానికి నీళ్లు ఇవ్వమని అడిగి యేసు ఆమెతో సంభాషణ మొదలుపెట్టాడు. మనం కూడా అలాగే ఏదైనా చిన్న విషయం చెప్పి లేదా ఓ చిన్న ప్రశ్న అడిగి సంభాషణ మొదలుపెట్టవచ్చు. కొన్నిసార్లు మనం తటపటాయించినా, యెహోవా సహాయం చేస్తాడనే నమ్మకంతో, ‘ధైర్యం తెచ్చుకొని’ సంభాషణ ప్రారంభించవచ్చు. అవతలి వారు చెప్పే సమాధానం జాగ్రత్తగా వింటే వారికి ఆసక్తి ఉందా, వారితో ఇంకా మాట్లాడవచ్చా అనే విషయాలు తెలుస్తాయి.—1 థెస్స. 2:2.
4 అవకాశాలు కల్పించుకోండి: చాలామంది ప్రచారకులు ప్రజలు ఎక్కడుంటే అక్కడ సాక్ష్యమివ్వడానికి వేర్వేరు పద్ధతులను కనుగొన్నారు. మీ పరిస్థితులను బేరీజు వేసుకొని, రోజంతటిలో మీరు కలిసేవారి గురించి ఆలోచించండి. మీతో పాటు తగిన ప్రచురణలు, చిన్న బైబిలు తీసుకెళ్లండి. మీ చూట్టూవున్న వారిని గమనిస్తూ, వారి మీద ఆసక్తి చూపించండి. రోజంతటిలో మీకు దొరికే అవకాశాల గురించి ఆలోచించినప్పుడు మీరు చక్కని సాక్ష్యం ఇవ్వగలుగుతారు.—ఫిలి. 1:12-14; 1 పేతు. 3:15.
5 ప్రజలు ఎక్కడుంటే అక్కడ వారితో మాట్లాడడానికి మనకు రెండు చక్కని కారణాలున్నాయి. అవేమిటంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తాము, పొరుగువారిని ప్రేమిస్తాము. (మత్త. 22:37-39) ఇప్పుడున్న అత్యవసర పరిస్థితిని బట్టి మనం ప్రజలు ఎక్కడుంటే అక్కడ ప్రకటించడానికి ముందే ఆలోచించి పెట్టుకోవాలి. ఇంకా సమయం ఉన్నప్పుడే, రాజ్యసువార్త ప్రకటించడానికి మనకు దొరికే ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండాలి.—రోమా. 10:13, 14; 2 తిమో. 4:2.
[అధ్యయన ప్రశ్నలు]
1. ప్రజలు ఎక్కడుంటే అక్కడ సాక్ష్యమివ్వడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని ఏ ఉదాహరణ చూపిస్తుంది?
2. మనం కనిపించే తీరు సాక్ష్యమివ్వడానికి ఎలా తోడ్పడుతుంది?
3. యేసు ఉదాహరణను అనుసరిస్తూ మీరు సంభాషణ ఎలా మొదలుపెట్టారు?
4. ప్రజలు ఎక్కడుంటే అక్కడ సాక్ష్యమివ్వడానికి మనం ఏమి చేయవచ్చు?
5. ప్రజలు ఎక్కడుంటే అక్కడ ప్రకటించడానికి ఎందుకు ముందే ఆలోచించి పెట్టుకోవాలి?