‘పూర్తిగా సాక్ష్యమివ్వడానికి’ కష్టపడి పనిచెయ్యండి
1, 2.సువార్త ప్రకటించడంలో పౌలుకున్న ఏ మనోవైఖరి మిమ్మల్ని ఆకట్టుకుంది, ‘పూర్తిగా సాక్ష్యమివ్వడంలో’ ఆయన మాదిరిని మనమెలా అనుకరించగలం?
1 యేసువలే, ప్రాచీనకాలంలోని నమ్మకస్థులైన అనేకమంది ఇతర సేవకులవలే అపొస్తలుడైన పౌలు పరిస్థితులెట్లున్నా ‘పూర్తిగా సాక్ష్యమివ్వడానికి’ ఆసక్తితో సువార్త ప్రకటించాడు. గృహనిర్బంధంలో ఉన్నప్పటికీ ఆయన “తనయొద్దకు వచ్చువారినందరిని సన్మానించి ఏ ఆటంకమునులేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన సంగతులు బోధించుచు ఉండెను.”—అపొ. 28:16-31.
2 మనంకూడా అన్ని సందర్భాల్లో ‘పూర్తిగా సాక్ష్యమివ్వడానికి’ కష్టపడి పనిచేయవచ్చు. అందులో సమావేశాలకు మనం చేసే ప్రయాణాల్లో ప్రజలకు సాక్ష్యమివ్వడంకూడా చేరివుంటుంది.—అపొ. 28:23; కీర్త. 145:10-13.
3. మన అనియత సాక్ష్యం కేవలం తటస్థ ప్రయత్నంలా ఉండకుండా ఎలా నివారించగలం?
3 తటస్థసాక్ష్యమా, అనియత సాక్ష్యమా? వీటిలో తేడావుందా? ఉంది. తటస్థం అంటే కార్యప్రణాళికలేని, అంత ప్రాముఖ్యం కానిదన్నట్టు యాదృచ్ఛికంగా, అనుకోకుండా జరిగేది. నిశ్చయంగా ఆ వర్ణన మన పరిచర్యకు సరిపోదు. సాక్ష్యమిచ్చి దేవున్ని మహిమపర్చడం పౌలువలెనే మనకూ ముఖ్యం. ఈ సంవత్సరం చేసే ప్రయాణాలందు తగిన ప్రతి సందర్భంలో సాక్ష్యమివ్వడం మన లక్ష్యమైయుండాలి. అయితే, మనం ప్రజల్ని కలిసిమాట్లాడే ఈ విధానం నిశ్చయంగా అనియతమని వర్ణించబడగలదు. ఎందుకంటే అది అలసటలేని వాతావరణంలో, స్నేహపూర్వకంగా, సహజరీతిలో ఉంటుంది. ఇలా కలిసిమాట్లాడడం సత్ఫలితాలు తీసుకురాగలదు.
4. సత్రంలో సాక్ష్యమిచ్చేందుకు పౌలుకు ఏది శక్తినిచ్చింది?
4 సాక్ష్యమిచ్చేందుకు సిద్ధపడండి: రోములో పౌలు గృహనిర్బంధంలో ఉన్నప్పుడు సాక్ష్యమిచ్చేందుకు అవకాశాల్ని కల్పించుకొనేవాడు. ఆయన చొరవ తీసుకుని తానున్న సత్రానికి రమ్మని స్థానిక యూదా నాయకులను ఆహ్వానించాడు. (అపొ. 28:17) రోములో క్రైస్తవ సంఘమున్నా, ఆ నగర యూదా సమాజానికి అంతవరకూ క్రైస్తవ విశ్వాసాన్ని గూర్చి ఎవరూ చెప్పలేదని పౌలు గ్రహించాడు. (అపొ. 28:22; రోమా. 1:1-7) యేసుక్రీస్తును గూర్చి, దేవుని రాజ్యాన్నిగూర్చి ‘పూర్తిగా సాక్ష్యమివ్వడానికి’ ఆయన వెనుదీయలేదు.
5, 6. అనియత సాక్ష్యమివ్వడానికి మనకెలాంటి అవకాశాలు రావచ్చు, మరింత ఫలవంతంగా చేసేందుకు మనమెలా సిద్ధపడగలం?
5 మీరు చేసే ప్రయాణాల్లో మీకు తారసపడే వారందరిని గూర్చి ముందుగానే ఆలోచించండి, వారికి బహుశ యెహోవాసాక్షుల గురించి కేవలం కొద్దిగానే తెలిసియుండవచ్చు. మనం ఉచితంగా గృహ బైబిలు అధ్యయనాలు ప్రతిపాదిస్తామని కూడా బహుశ వారికి తెలియకపోవచ్చు. మీరు ప్రయాణించేటప్పుడు, సేదదీర్చుకోవడానికి ఆగినప్పుడు, పెట్రోలు కోసం ఆగినప్పుడు, షాపులో కొనేటప్పుడు, హోటల్లో బసచేసినప్పుడు, రెస్టారెంట్లో భోజనం చేసేటప్పుడు, ప్రజా రవాణా వాహనాల్లో వెళ్తున్నప్పుడు వగైరా సందర్భాల్లో సాక్ష్యమిచ్చే అవకాశాల కొరకు అప్రమత్తంగా ఉండండి. సంభాషణ ప్రారంభించి క్లుప్తంగా సాక్ష్యమిచ్చేందుకు మీరేం చెప్పాలో ముందే తీర్మానించుకోండి. అంతకుముందే బహుశ మీరు పొరుగువారికి, బంధువులకు, తోటిపనివారికి, తెలిసిన ఇతరులకు అనియత సాక్ష్యమిస్తూ దీనిని అభ్యాసం చేయవచ్చు.
6 అనియత సాక్ష్యమిచ్చేటప్పుడు మీకు సాహిత్యాలు అవసరమౌతాయి. ఎలాంటి సాహిత్యాలు? మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని మీరు ఉపయోగించవచ్చు. బైబిలు చదవడానికి వివిధ కారణాలున్న మొదటి ఐదు పేరాలు చూపించండి. ఉచిత గృహ బైబిలు అధ్యయనం కావాలంటే, దానివెనుకున్న కూపన్ చూపండి. స్పందించే వ్యక్తి మీకు తారసపడితే, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను ఇవ్వండి. వేరొక భాష మాట్లాడే వ్యక్తి తారసపడవచ్చనే ముందుచూపుతో గుడ్‌న్యూస్ ఫర్ ఆల్ నేషన్స్ అనే చిన్న పుస్తకం మీ వెంట తీసుకెళ్ళండి. సాక్ష్యమిచ్చేందుకు దాన్నెలా ఉపయోగించాలో 2వ పేజీలో వివరించబడింది. ఒకవేళ కారులో వెళుతుంటే, రాజ్య సందేశమందు నిజమైన ఆసక్తి చూపే వారికోసం ఇతర ప్రాథమిక సాహిత్యాలు కొన్ని మీ వెంట తీసుకెళ్ళవచ్చు.
7, 8. ప్రయాణాలప్పుడు, విశ్రాంతిగా ఉన్నప్పుడు కనబడే తీరు, ప్రవర్తన విషయంలో ఏ హెచ్చరికను మనం లక్ష్యపెట్టాలి?
7 మీ కనబడే తీరు, ప్రవర్తనపై శ్రద్ధనిల్పండి: మన ప్రవర్తన అలాగే మన వస్త్రాల, శిరోజాల అలంకరణ ఇతరులు అపార్థం చేసుకోవడానికి, యెహోవా సంస్థను ‘ఆక్షేపించడానికి’ తావివ్వకుండా చూసుకోవాలి. (అపొ. 28:22) ఇది సభలు, సమావేశాలకు హాజరైనప్పుడు మాత్రమే కాదు ప్రయాణాలప్పుడు, విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా అన్వయిస్తుంది. ఆగస్టు 1, 2002 కావలికోట 18వ పేజీ, 14వ పేరా ఇలా హెచ్చరించింది: “మన వస్త్రధారణ ఆడంబరంగా, అనాగరికంగా, రెచ్చగొడుతున్నట్లుగా, అంగ ప్రదర్శన చేస్తున్నట్లుగా, లేదా అతి ఫ్యాషన్‌గా కనబడకూడదు. అంతేగాక ‘దైవభక్తి’ వ్యక్తమయ్యే విధంగా మన వస్త్రధారణ ఉండాలి. ఇది మనం ఆలోచించాల్సిన విషయం, కాదంటారా? ఇది కేవలం సంఘ కూటాలకు [లేదా సమావేశాలకు] హాజరైనప్పుడు సరైన బట్టలు వేసుకోవడం, మిగతా సమయాల్లో సూచనలన్నింటినీ గాలికి వదిలేయడం కాదు. మనం కనబడే తీరు ఎల్లప్పుడూ భక్తి గౌరవాలను వ్యక్తం చేయాలి, ఎందుకంటే మనం రోజులోని 24 గంటలూ క్రైస్తవులమే, పరిచారకులమే.”—1 తిమో. 2:9, 10.
8 మన వస్త్రాలంకరణ మర్యాదగా హూందాగా ఉండాలి. మనం కనబడే తీరు, ప్రవర్తన అన్ని సందర్భాల్లో దేవునియందున్న మన నమ్మకాన్ని ప్రతిబింబిస్తే, మన ఆకారాన్నిబట్టి అనియత సాక్ష్యమిచ్చే అవకాశాన్ని మనమెన్నటికీ జారవిడుచుకోము.—1 పేతు. 3:15.
9. రోమ్‌నందు సాక్ష్యమివ్వడంలో పౌలు ఏ విజయం సాధించాడు?
9 అనియత సాక్ష్యం ఫలదాయకం: పౌలు రోమ్‌లో గృహనిర్బంధంలో ఉన్న రెండు సంవత్సరాల కాలంలో, సాక్ష్యమిచ్చే తన ప్రయత్నానికి మంచి ఫలితాలు రావడం చూశాడు. “అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి” అని లూకా నివేదించాడు. (అపొ. 28:24) పౌలు తాను “పూర్తిగా సాక్ష్యమిచ్చు”టకున్న విలువను స్వయంగా గ్రహించి, ఇలా వ్రాశాడు: “నాకు సంభవించినవి సువార్త మరి యెక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలిసికొనగోరుచున్నాను. ఏలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారి కందరికిని తక్కినవారి కందరికిని స్పష్టమాయెను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువమంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషధైర్యము తెచ్చుకొనిరి.”—ఫిలి. 1:12-14.
10. గత సంవత్సరం ఓ దంపతులకు సాక్ష్యపు పనిలో ఎలాంటి విజయం లభించింది?
10 గత సంవత్సరం, జిల్లా సమావేశంలో ఒకరోజు గడిపిన తర్వాత తమ సమావేశ బ్యాడ్జ్ కార్డుల్ని గూర్చి అడిగిన వెయిట్రెస్‌కు అనియత సాక్ష్యమిచ్చిన దంపతులకు ఒక మంచి అనుభవం కలిగింది. వారామెకు సమావేశం గురించి చెప్పడమే కాకుండా, మానవజాతి భవిష్యత్తును గూర్చి బైబిలిచ్చే నిరీక్షణను తెలియజేశారు. మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్నిచ్చి ఉచిత గృహ బైబిలు అధ్యయన ఏర్పాటు గురించి వివరించారు. ఎవరైనా తనను సందర్శించాలని ఇష్టపడుతూ, తగిన ఏర్పాట్లు చేయమని ఆ దంపతులనడిగి కరపత్రం వెనుక ఆమె తన పేరు, చిరునామా వ్రాసియిచ్చింది. ‘పూర్తిగా సాక్ష్యమివ్వడానికి’ కష్టపడి పనిచెయ్యడం ద్వారా ఈ సంవత్సరం మీరెలాంటి విజయం సాధించవచ్చు?
11. ‘పూర్తిగా సాక్ష్యమివ్వడం’ ద్వారా సువార్తను పురోగమింపజేయడానికి మనమే లక్షణాలు వృద్ధిచేసుకోవాలి?
11 సువార్తను సంపూర్ణంగా పురోగమింపజేయండి: తోటి క్రైస్తవులు తన ఆసక్తికర మాదిరిని అనుకరిస్తున్నారని పౌలు విన్నప్పుడు ఆయనెంత సంతోషించి ఉంటాడో ఊహించండి! మన బైబిలు ఆధారిత నమ్మకాల్నిగూర్చి అనియత సాక్ష్యమివ్వడం ద్వారా సువార్తను పురోగమింపజేయడానికి మనకు సాధ్యమైనదంతా మనం చేద్దాం.
[3వ పేజీలోని బాక్సు]
అనియత సాక్ష్యానికి కావల్సిన సాహిత్యాలు
■ మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? (కరపత్రం)
■ దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు? (బ్రోషుర్)
■ గుడ్‌న్యూస్ ఫర్ ఆల్ నేషన్స్ (చిన్న పుస్తకం)
■ ఇతర ప్రాథమిక సాహిత్యాలు
[4వ పేజీలోని బాక్సు]
వారిని మర్చిపోకండి!
ఎవరిని? క్రీస్తు మరణ జ్ఞాపకార్థానికి లేదా ప్రత్యేక ప్రసంగానికి హాజరైన ఆసక్తిగల వారెవరినీ మర్చిపోకండి. ఈ సంవత్సరపు సమావేశాలకు వారిని మనం ఆహ్వానించామా? దయాపూర్వక ప్రోత్సాహమిస్తే వారిలో చాలామంది హాజరయ్యే అవకాశముంది. ఈ సమావేశాల్లో క్షేమాభివృద్ధికర సహవాసాన్ని, ప్రోత్సాహకరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఆస్వాదించేకొలది, వారు యెహోవాకు, ఆయన సంస్థకు మరింత చేరువౌతారు. ఒకసారి ఆహ్వానించి ఏంజరుగుతుందో ఎందుకు చూడకూడదు? మన సమావేశాల తేదీలు, అక్కడికి వారెలా చేరుకోవాలో ఆ వివరాలు, కార్యక్రమ ఆరంభ ముగింపు సమయాలు తెలియజేయడంతోపాటు, ఫిబ్రవరి 2003 మన రాజ్య పరిచర్య, జూన్ 8, 2003 తేజరిల్లు! (ఆంగ్లం) చివరి పేజీలో ముందే ఇవ్వబడిన కార్యక్రమ అంశాల వివరాలన్నింటిని వారికివ్వండి.