అనియత సాక్ష్యంతో యెహోవాను స్తుతించండి
1 యెహోవా యథార్థ సేవకులు ఆయనను ప్రతిరోజూ స్తుతించడానికి అవకాశాల కోసం వెదకుతారు. (కీర్త. 96:2, 3; హెబ్రీ. 13:15) మనమలా స్తుతించడానికి ఒక మార్గం అనియత సాక్ష్యం. నేడు అనేకమంది యెహోవా ఆరాధకులు తమకు ఎవరో ఒకరు అనియత సాక్ష్యం ద్వారా రాజ్య సందేశాన్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞులుగా ఉన్నారు.
2 ఒక వ్యక్తికి ఇచ్చే అనియత సాక్ష్యం తరచుగా ఇతరులు రాజ్య సందేశం వినేందుకు మార్గాన్ని తెరుస్తుంది. ఉదాహరణకు యాకోబు బావి దగ్గర ఒక సమరయ స్త్రీతో యేసు మాట్లాడిన మాటలు, చాలామంది సువార్త పట్ల ఆసక్తి చూపించడానికి దారితీశాయి. (యోహా. 4:6-30, 39-42) పౌలు సీలలు ఫిలిప్పీలోని చెరసాలలో ఉన్నప్పుడు జైలు అధికారికి సాక్ష్యమిచ్చారు, ఆయనతోపాటు ఆయన ఇంటివారందరు సత్యాన్ని స్వీకరించారు.—అపొ. 16:25-34.
3 సదవకాశాలు: అనియత సాక్ష్యమివ్వడానికి మీకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? కొందరు బజారుకు వెళ్ళినప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు లేదా ఆస్పత్రుల్లో డాక్టరును కలవడానికి వేచివున్నప్పుడు అనియత సాక్ష్యమిస్తారు. మరికొందరు తమ ఉద్యోగస్థలంలో లేదా స్కూల్లో విరామ సమయంలో సాక్ష్యమివ్వగలుగుతున్నారు. కొన్నిసార్లు కేవలం మన బైబిలు ప్రచురణలలో ఒకదాన్ని పైకి కనబడేలా పెట్టినా ఇతరులు మన విశ్వాసాల గురించి వెంటనే అడిగేలా చేయవచ్చు.—1 పేతు. 3:15.
4 ఆరంభించే విధానం: బిడియస్థురాలైన ఒక ఏడేండ్ల అమ్మాయి అందరూ ప్రకటనా పని చేయడం చాలా ప్రాముఖ్యమని ఒక కూటమిలో విన్నది. ఆ తర్వాత ఆమె తన తల్లితో కలిసి బజారుకు వెళ్తున్నప్పుడు తన బ్యాగులో రెండు బ్రోషుర్లను పెట్టుకుంది. వాళ్ళ అమ్మ తనకు కావలసిన సరుకుల కోసం చూస్తుండగా ఈ అమ్మాయి ఒక స్త్రీకి ఒక బ్రోషుర్ను ప్రతిపాదించింది, ఆ స్త్రీ దాన్ని ఇష్టపూర్వకంగా స్వీకరించింది. ఆ స్త్రీకి బ్రోషుర్ ఇచ్చే ధైర్యం ఎలా వచ్చింది అని అడిగినప్పుడు, ఆ అమ్మాయి ఇలా జవాబిచ్చింది: “నేను రెడీ, వన్ టూ త్రీ! అనుకున్నాను, అంతే ముందుకు కదిలాను!”
5 అనియత సాక్ష్యమివ్వడానికి, ఆ చిన్న పాపకున్నటువంటి స్ఫూర్తి మనందరికీ ఉండాలి. అందుకు మనకు ఏమి సహాయపడగలదు? మాట్లాడే ధైర్యం కోసం ప్రార్థించండి. (1 థెస్స. 2:2) సంభాషణ ఆరంభించడానికి, ఆసక్తికరంగా ఉండే ఒక చర్చకు దారితీసే ప్రశ్నను లేదా వ్యాఖ్యానాన్ని మనసులో ఉంచుకోండి. ఆ తర్వాత మీ ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఉండండి.—లూకా 12:11, 12.
6 మనం ప్రతి దినం కలిసే ప్రజలకు అనియత సాక్ష్యమివ్వడం యెహోవాకు స్తుతిని తెస్తుంది, మనకు ఆనందాన్నిస్తుంది. ఎవరైనా నిత్యజీవానికి వెళ్ళే మార్గంలోకి రావడానికి కూడా అది సహాయపడవచ్చు.