మీరు అనియత సాక్ష్యం ఇవ్వగలరు!
1. (ఎ) అనియత సాక్ష్యమంటే ఏమిటి? (బి) ఈ రోజు కూటానికి హాజరైన వాళ్లలో ఎంతమంది అనియత సాక్ష్యం ద్వారా సత్యంలోకి వచ్చారు?
1 మీ సంఘంలో ఎంతమందికి అనియత సాక్ష్యం ద్వారా సత్యం తెలిసింది? జవాబు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మనం రోజువారీ పనులు చేసుకునేటప్పుడు కలిసే ప్రజలతో రాజ్య సువార్త గురించి మాట్లాడడాన్నే అనియత సాక్ష్యం అంటారు. మనం ప్రయాణించేటప్పుడు, బంధువుల దగ్గరకు లేదా పొరుగువాళ్ల దగ్గరకు వెళ్లినప్పుడు లేదా షాపింగ్ చేసేటప్పుడు, అలాగే స్కూల్లో, మనం పనిచేసే స్థలంలో, ఇంకా మిగతా స్థలాల్లో ఇలా ప్రకటించవచ్చు. బాప్తిస్మం తీసుకున్న సాక్షులు 200 కన్నా ఎక్కువమంది ఉన్న ఒక గుంపులో 40 శాతం మంది అనియత సాక్ష్యం ద్వారా సత్యంలోకి వచ్చారు! కాబట్టి, ఈ పద్ధతిలో ప్రకటించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
2. అనియత సాక్ష్యం గురించిన ఏ ఉదాహరణలు లేఖనాల్లో ఉన్నాయి?
2 మొదటి శతాబ్దంలోని సువార్తికులు తరచూ అనియత సాక్ష్యమిచ్చేవాళ్లు. ఉదాహరణకు, యేసు ఒకసారి సమరయగుండా వెళ్తున్నప్పుడు, యాకోబు బావిలో నీళ్లు చేదుకుంటున్న ఒక స్త్రీకి సాక్ష్యమిచ్చాడు. (యోహా. 4:6-26) ఫిలిప్పు, యెషయా గ్రంథాన్ని చదువుకుంటున్న ఐతియోపీయుడైన ఒక అధికారిని “నీవు చదువునది గ్రహించుచున్నావా?” అని అడిగి సంభాషణ మొదలుపెట్టాడు. (అపొ. 8:26-38) అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఖైదీగా ఉన్నప్పుడు, అక్కడున్న చెరసాల నాయకుడికి సాక్ష్యమిచ్చాడు. (అపొ. 16:23-34) ఆ తర్వాత, పౌలు ఒక ఇంట్లో నిర్భంధించబడి ఉన్నప్పుడు ఆయన, ‘తనవద్దకు వచ్చువారినందరినీ సన్మానించి, దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన సంగతులు బోధించుచుండెను.’ (అపొ. 28:30, 31) ఎంతో సిగ్గుపడేవాళ్లు కూడా అనియత సాక్ష్యమివ్వవచ్చు. ఎలా?
3. సిగ్గుపడకుండా ప్రజలతో మాట్లాడడానికి మనకేది సహాయం చేస్తుంది?
3 ఎలా మొదలుపెట్టాలి? మనలో చాలామందికి కొత్తవాళ్లతో మాట్లాడాలంటే చాలా కష్టమనిపిస్తుంది. అంతెందుకు, పరిచయస్థులతో సత్యం గురించి మాట్లాడాలంటే కూడా మొహమాటపడుతుంటాం. అయితే, యెహోవా మంచితనం గురించి, ఆయన తన సేవకులకు ఇచ్చిన ఆధ్యాత్మిక సంపద గురించి, లోకంలో ప్రజలు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితుల గురించి ఆలోచిస్తే మనకు మాట్లాడాలనిపిస్తుంది. (యోనా 4:11; కీర్త. 40:5; మత్త. 13:52) అంతేకాదు, ‘ధైర్యం తెచ్చుకోవడానికి’ సహాయం చేయమని యెహోవాకు ప్రార్థన కూడా చేయవచ్చు. (1 థెస్స. 2:2) ఒక గిలియడ్ విద్యార్థి ఇలా చెప్పాడు, “ప్రజలతో మాట్లాడడం కష్టమనిపించినప్పుడు, ప్రార్థన చేసుకుంటే ధైర్యం వస్తుందని నేను చాలాసార్లు గమనించాను.” మీకు ప్రజలతో మాట్లాడడానికి భయమనిపిస్తే, మౌనంగా ఒక చిన్న ప్రార్థన చేసుకోండి.—నెహె. 2:4.
4. మొదట్లో మనం ఏంచేయాలని నిర్ణయించుకోవాలి, ఎందుకు?
4 అనియత సాక్ష్యం అనే పదం సూచిస్తున్నట్లుగా, మనం దాన్ని ఒక ఉపోద్ఘాతంతో లేదా ఒక లేఖనంతో మొదలుపెట్టాల్సిన అవసరం లేదు. వెంటనే సాక్ష్యమిచ్చేయాలనే ఉద్దేశంతో కాకుండా సంభాషణ మొదలుపెట్టాలనే ఉద్దేశంతో పలకరించడం సహాయకరంగా ఉంటుంది. ఇలా చేయడంవల్ల, సువార్త గురించి చెప్పడానికి ధైర్యాన్ని కూడగట్టుకోగలిగామని చాలామంది ప్రచారకులు నివేదించారు. ఒకవేళ అవతలి వ్యక్తి మాట్లాడడానికి సుముఖత చూపించకపోతే ఎలాగైనా సంభాషణను కొనసాగించాలని ప్రయత్నించకండి. మీ సంభాషణను అంతటితో సున్నితంగా ఆపేసి అక్కడ నుండి వెళ్లిపొండి.
5. బిడియస్థురాలైన ఒక సహోదరి అనియత సాక్ష్యమివ్వడానికి ఎలా ధైర్యాన్ని కూడగట్టుకుంది?
5 బిడియస్థురాలైన ఒక సహోదరి మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వైపు చూసి చిన్నగా నవ్వుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి కూడా నవ్వితే మన సహోదరి పలకరిస్తుంది. దానికి ఆ వ్యక్తి చక్కగా స్పందిస్తే, ఆమె ఆ వ్యక్తితో మాట్లాడడానికి ధైర్యం కూడగట్టుకుంటుంది. ఆమె జాగ్రత్తగా వింటూ, సువార్తకు సంబంధించి ఏ విషయం చెప్తే ఆ వ్యక్తికి నచ్చుతుందో గ్రహించడానికి ప్రయత్నిస్తుంది. ఇలా చేసి, ఆమె చాలా సాహిత్యాలు ఇచ్చింది. అంతేకాదు, ఒక బైబిలు అధ్యయనం కూడా మొదలుపెట్టగలిగింది.
6. అనియత సాక్ష్యమివ్వడానికి సంభాషణ ఎలా మొదలుపెట్టవచ్చు?
6 ఏమి మాట్లాడాలి? సంభాషణ మొదలుపెట్టడానికి మనం ముందుగా ఏ విషయాల గురించి మాట్లాడవచ్చు? యేసు తాగడానికి నీళ్లు ఇమ్మని అడగడం ద్వారా బావి దగ్గర ఉన్న స్త్రీతో సంభాషణ మొదలుపెట్టాడు. (యోహా. 4:7) కాబట్టి మనం కూడా ఎవరినైనా స్నేహపూర్వకంగా పలకరించడం ద్వారా, లేదా వారిని ఏదైనా అడగడం ద్వారా సంభాషణ మొదలుపెట్టవచ్చు. మనం వెంటనే దేవుని రాజ్యం గురించి మాట్లాడాలని, బైబిలు వచనం చూపించాలని అనుకోనవసరం లేదు. ముఖ్యంగా పక్షపాతవైఖరి ఉన్న ప్రజలతో, స్నేహపూర్వకంగా సంభాషణ కొనసాగించాలనే లక్ష్యం పెట్టుకోవాలి. అలా మీరు మాట్లాడుతున్నప్పుడు, మాటల మధ్యలో లేఖనాల నుండి ఏదైనా ఒక విషయాన్ని చెప్పి, సత్య విత్తనం వాళ్ల హృదయంలో నాటే అవకాశం కూడా దొరకవచ్చు. (ప్రసం. 11:6) ఆసక్తి రేకెత్తించి, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే కుతూహలం కలిగించే వాటి గురించి ప్రస్తావించడం ద్వారా చక్కని ఫలితాలు వచ్చాయని కొంతమంది అంటున్నారు. ఉదాహరణకు, డాక్టరు కోసం ఎదురుచూస్తున్నప్పుడు, “ఏ రోగాలూ ఉండని రోజు త్వరగా వస్తే బావుంటుంది” అంటూ సంభాషణ మొదలుపెట్టవచ్చు.
7. జాగ్రత్తగా గమనిస్తూ ఉండడం ద్వారా అనియత సాక్ష్యం ఎలా ఇవ్వవచ్చు?
7 జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే కూడా మనం సంభాషణ మొదలుపెట్టగలుగుతాం. ఒక తల్లిని, మర్యాదగా ప్రవర్తించే ఆమె పిల్లల్ని చూశారనుకోండి, అప్పుడు మీరు తల్లిని మెచ్చుకోవచ్చు, “ఇంత చక్కగా పిల్లల్ని ఎలా పెంచగలిగారండి?” అని కూడా ఆమెను అడగవచ్చు. ఒక సహోదరి తన సహోద్యోగులు మాట్లాడుకునే విషయాలను గమనిస్తూ ఉంటుంది. వాళ్లకు ఏ విషయాల్లో ఆసక్తి ఉందో గ్రహించి, ఆ తర్వాత వాటి గురించే వాళ్లతో మాట్లాడేది. ఆ సహోదరి, తన సహోద్యోగి పెళ్లి చేసుకోబోతుందని తెలిసినప్పుడు పెళ్లి ఏర్పాట్లు ఎలా చేసుకోవాలో వివరించే తేజరిల్లు! పత్రికను ఆమెకు ఇచ్చింది. దానితో, వాళ్లు బైబిలు విషయాల గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకోగలిగారు.
8. సంభాషణ మొదలుపెట్టడానికి మనం మన సాహిత్యాలను ఎలా ఉపయోగించవచ్చు?
8 ఇతరులకు కనబడేటట్టు మన సాహిత్యాలను చదవడం ద్వారా కూడా సంభాషణను మొదలుపెట్టవచ్చు. ఒక సహోదరుడు ఆసక్తి రేకెత్తించే శీర్షికతో ఉన్న కావలికోట లేదా తేజరిల్లు! తీసి, మెల్లగా చదవడం మొదలుపెడతాడు. తను చదువుతున్న పత్రికను ఎవరైనా చూస్తున్నట్టు గమనిస్తే, వాళ్లను ఏదైనా ఒక ప్రశ్న అడుగుతాడు లేదా ఆ ఆర్టికల్ గురించి క్లుప్తంగా వివరిస్తాడు. అలా, సంభాషణ మొదలుపెట్టి, సాక్ష్యమిచ్చే అవకాశం కూడా దొరుకుతుంది. మన ప్రచురణల్లో ఏదో ఒకటి అందరికీ కనిపించేలా పెడితే, సహోద్యోగుల్లో లేదా తోటి విద్యార్థుల్లో ఆసక్తి కలగవచ్చు, వాళ్లు దాని గురించి తెలుసుకోవాలని కూడా అనుకోవచ్చు.
9, 10. (ఎ) అనియతంగా సాక్ష్యమివ్వడానికి మనం అవకాశాలను ఎలా కల్పించుకోవచ్చు? (బి) మీరు ఏవిధంగా అలా సాక్ష్యమివ్వగలిగారు?
9 అవకాశాలను కల్పించుకోండి: ప్రకటనా పని చేయడం ఇప్పుడు చాలా ప్రాముఖ్యం కాబట్టి, అవకాశం దొరికినప్పుడు అనియత సాక్ష్యం ఇవ్వవచ్చులే అనుకోకూడదు. కానీ, రోజువారీ పనుల మీద మనం బయటకు వెళ్లినప్పుడు సాక్ష్యమిచ్చేందుకు మనమే అవకాశాలను కల్పించుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఎవరిని కలిసే అవకాశం ఉందో ముందే ఆలోచించుకుని, వాళ్లతో స్నేహపూర్వకంగా ఎలా మాట్లాడవచ్చో ఆలోచించండి. ఆసక్తి కనబర్చినవాళ్లకు చూపించడానికి బైబిలు, వాళ్లకు ఇవ్వడానికి సాహిత్యాలు మీ దగ్గర ఉంచుకోండి. (1 పేతు. 3:15) “కరపత్రాల సెట్టు” తమ దగ్గర ఉంచుకోవడం బాగా ఉపయోగపడుతుందని కొంతమందికి అనిపించింది.—km, 6/07 3వ పేజీ.
10 చాలామంది ప్రచారకులు సమర్థవంతంగా వ్యవహరించడం ద్వారా అనియత సాక్ష్యం ఇవ్వడానికి అవకాశాలను కల్పించుకోగలిగారు. భద్రత ఎక్కువగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఒక సహోదరి, ఆ అపార్ట్‌మెంట్‌లోనే అందరూ సరదాగా గడిపే స్థలానికి వెళ్లి అక్కడ, చిన్న చిన్న అట్టముక్కలను ఒక పద్ధతిలో పేర్చి, అందమైన ప్రకృతి దృశ్యాలను తయారుచేస్తుంది. ప్రజలు అక్కడ ఆగి, ఆ అందమైన దృశ్యాన్ని చూసి, దాని గురించి ఆమెతో మాట్లాడినప్పుడు, ఆమె సంభాషణ మొదలుపెట్టడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని, “క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి” వస్తాయని బైబిలు చేసిన వాగ్ధానం గురించి వాళ్లకు చెప్తుంది. (ప్రక. 21:1-4) అనియతంగా సాక్ష్యమివ్వడానికి మీరు అవకాశాలను ఎలా కల్పించుకోవచ్చో ఆలోచించండి.
11. అనియత సాక్ష్యమిస్తున్నప్పుడు మనం కలిసిన వాళ్లు ఆసక్తి చూపిస్తే, వాళ్లను మళ్లీ కలుసుకోవడానికి ఏమి చేయవచ్చు?
11 ఆసక్తివున్న వాళ్లను మళ్లీ కలుసుకోండి: మీరు చెప్పేది చక్కగా విన్న వ్యక్తిని మళ్లీ కలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ వ్యక్తిని ఇలా అడిగితే ఫర్వాలేదని మీకు అనిపిస్తే, “మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ విషయాల గురించి మాట్లాడాలంటే, మళ్లీ మిమ్మల్ని ఎక్కడ కలవాలి?” అని అడగవచ్చు. కొన్ని ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ప్రజలకు నిజంగా ఆసక్తివుందో లేదో గ్రహించాలి. కొంతమంది ప్రచారకులు ఆసక్తివున్నట్టు నటించిన వ్యక్తుల మూలంగా చిక్కుల్లో ఇరుక్కున్నారు. మీరు వాళ్లను మళ్లీ కలుసుకునే అవకాశం లేకపోతే, దగ్గర్లోని సంఘంలోని వాళ్లు వాళ్లను కలుసుకునేలా ప్లీజ్ ఫాలో అప్ (S-43) ఫారమ్‌ను నింపి వెంటనే మీ సంఘ కార్యదర్శికి ఇవ్వండి.
12. (ఎ) అనియత సాక్ష్యమిచ్చిన సమయాన్ని ఎందుకు రాసిపెట్టుకుని రిపోర్ట్ ఇవ్వాలి? (బి) అనియత సాక్ష్యమివ్వడం వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి? (“అనియత సాక్ష్యంతో మంచి ఫలితాలు పొందవచ్చు!” అనే బాక్సు చూడండి)
12 అనియతంగా సాక్ష్యమిచ్చిన సమయాన్ని మనం రిపోర్ట్ చేయాలి. కాబట్టి, రోజులో కొన్ని నిమిషాలపాటు అనియత సాక్ష్యమిచ్చినా దానిని తప్పకుండా రాసిపెట్టుకోండి. ఈ విషయాన్ని పరిశీలించండి: ప్రతి ప్రచారకుడు రోజుకు ఐదు నిమిషాలు అనియత సాక్ష్యమిచ్చాడనుకోండి, అది మొత్తం కలిపితే ప్రతి నెలా 1,70,00,000 గంటలు అవుతాయి!
13. అనియత సాక్ష్యమివ్వడానికి మనకేది స్ఫూర్తినిస్తుంది?
13 మనం అనియత సాక్ష్యమివ్వడానికి చాలా ప్రాముఖ్యమైన కారణముంది, అదే దేవుని మీద, పొరుగువాళ్ల మీద ప్రేమ. (మత్త. 22:37-39) యెహోవా లక్షణాలను, ఆయన సంకల్పాలను మనం హృదయపూర్వకంగా గౌరవిస్తుంటే, మనం ‘ఆయన రాజ్య ప్రభావం’ గురించి తప్పకుండా మాట్లాడతాం. (కీర్త. 145:7, 10-12) మన పొరుగువాళ్లమీద మనకు నిజంగా శ్రద్ధ ఉంటే, దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ, సమయం దాటిపోక ముందే వాళ్లతో సువార్త గురించి మాట్లాడతాం. (రోమా. 10:13, 14) కొంచెం ముందాలోచన, ముందు జాగ్రత్త, సిద్ధపాటు ఉంటే మనందరం అనియత సాక్ష్యం ఇవ్వవచ్చు. అంతేకాదు, మంచి మనసున్న వాళ్లకు సత్యం గురించి చెప్పినప్పుడు కలిగే ఆనందాన్ని కూడా చవిచూడవచ్చు.
[4వ పేజీలోని బ్లర్బ్]
ఊరికే ప్రజలను కలుసుకుని, వాళ్లతో సంభాషణ మొదలుపెట్టాలనే లక్ష్యం పెట్టుకుంటే సహాయకరంగా ఉంటుంది
[5వ పేజీలోని బ్లర్బ్]
చాలామంది ప్రచారకులు సమర్థవంతంగా వ్యవహరించడం ద్వారా అనియత సాక్ష్యం ఇవ్వడానికి అవకాశాలను కల్పించుకోగలిగారు
[5వ పేజీలోని బాక్సు]
సంభాషణ మొదలుపెట్టడానికి సలహాలు
▪ సంభాషణ మొదలుపెట్టడానికి సహాయం కోసం ప్రార్థన చేసుకోండి
▪ చక్కగా స్పందిస్తారు అనుకున్నవాళ్లతో, తీరిగ్గా ఉన్నవాళ్లతో మాట్లాడండి
▪ వ్యక్తివైపు చూసి నవ్వుతూ పలకరించండి, ఇద్దరికీ ఆసక్తి ఉన్న విషయాల గురించి మాట్లాడండి
▪ వాళ్లు చెప్తున్నది శ్రద్ధగా వినండి
[6వ పేజీలోని బాక్సు]
అనియత సాక్ష్యంతో మంచి ఫలితాలు పొందవచ్చు!
• ఒక సహోదరుడు తన కారు రిపేరు చేయించుకోవడానికి గ్యారేజీవద్ద ఎదురుచూస్తున్నప్పుడు, ఆయన తన చుట్టుపక్కల ఉన్నవాళ్లకు సాక్ష్యమిచ్చి, జిల్లా సమావేశంలో ఇవ్వబడే బహిరంగ ప్రసంగానికి రమ్మని ఆహ్వానిస్తూ వాళ్లకు హ్యాండ్‌బిల్లులను ఇచ్చాడు. సంవత్సరం తర్వాత, ఒక జిల్లా సమావేశంలో ఈ సహోదరుని దగ్గరకు ఒక సహోదరుడు వచ్చి చక్కగా పలకరించాడు, కానీ అతన్ని ఈ సహోదరుడు గుర్తుపట్టలేదు. ఆ పలకరించిన సహోదరుడు, సంవత్సరం క్రితం గ్యారేజీవద్ద మన సహోదరుడు హ్యాండ్‌బిల్లు ఇచ్చినవాళ్లలో ఒక వ్యక్తి! ఆ వ్యక్తి బహిరంగ ప్రసంగాన్ని వినడానికి వెళ్లాడు, తనతో కూడా బైబిలు అధ్యయనం చేయమని అడిగాడు. ఆ తర్వాత ఆయన, ఆయన భార్య బాప్తిస్మం తీసుకున్నారు.
• అనియత సాక్ష్యంద్వారా సత్యం నేర్చుకున్న ఒక సహోదరి తన ముగ్గురు పిల్లల ద్వారా తాను కలిసేవాళ్లనే తన క్షేత్రంగా చేసుకుంది. ఆమె స్కూల్లో, అలాగే అక్కడ పిల్లల తల్లిదండ్రుల కోసం జరిగే మీటింగుల్లో కలిసే పొరుగువాళ్లు, తల్లిదండ్రులే ఆమె క్షేత్రం. ఆమె తన గురించి చెప్పుకున్నప్పుడల్లా, తన పిల్లల పెంపకంలో బైబిలు చాలా చక్కగా సహాయం చేసిందని చిన్నమాటల్లోనే అయినా మనస్ఫూర్తిగా చెప్తుంది, తర్వాత వేరే విషయం గురించి మాట్లాడడం మొదలుపెడుతుంది. ఆమె అప్పటికే బైబిలు గురించి ప్రస్తావించింది కాబట్టి, ఆ తర్వాత జరిగే చర్చల్లో బైబిలు గురించి మాట్లాడడం కష్టమనిపించదు. ఈ పద్ధతిని ఉపయోగించి, ఆమె 12 మంది బాప్తిస్మం తీసుకోవడానికి సహాయం చేసింది.
• ఒక సహోదరి ఇంటికి ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆమె దాన్ని ఒక అవకాశంగా తీసుకుని అతనికి సాక్ష్యమిచ్చింది. మంచి ఆరోగ్యం, సంతోషం, శాశ్వత జీవితం దొరుకుతాయని ఎవరైనా హామీ ఇస్తే మీకు ఎలా అనిపిస్తుందని ఆమె అతనిని అడిగింది. దానికి అతను చాలా బాగుంటుందని చెప్పి, ఏ ఇన్సూరెన్సు పాలసీ గురించి మాట్లాడుతున్నారని సహోదరిని అడిగాడు. ఆ సహోదరి బైబిలు చేసిన వాగ్ధానాలను చూపిస్తూ, మన ప్రచురణల్లో ఒకదాన్ని ఆయనకు ఇచ్చింది. ఆయన దాన్ని ఒక సాయంత్రంలోనే చదివేశాడు. ఆయన కోసం బైబిలు అధ్యయనం ఏర్పాటు చేయబడింది. ఆయన కూటాలకు హాజరవడం మొదలుపెట్టి, ఆ తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడు.
• ఒక సహోదరి ప్రయాణిస్తున్నప్పుడు, తన పక్కన కూర్చున్న ఒక స్త్రీతో మాట్లాడడం మొదలుపెట్టి ఆమెకు సాక్ష్యమిచ్చింది. తను దిగాల్సిన సమయం దగ్గర పడినప్పుడు సహోదరి ఆమెకు తన అడ్రస్, ఫోన్ నెంబరు ఇచ్చి, యెహోవాసాక్షులు ఇంటికి వస్తే బైబిలు అధ్యయనం కోసం అడగమని చెప్పింది. ఆ మరుసటి రోజే ఇద్దరు సాక్షులు ఆ స్త్రీ ఇంటికి వెళ్లారు. ఆమెతో బైబిలు అధ్యయనం మొదలైంది, ఆమె చాలా త్వరగా అభివృద్ధి సాధించి, బాప్తిస్మం తీసుకుంది. ఆ వెంటనే వేరేవాళ్లతో మూడు బైబిలు అధ్యయనాలు చేయడం కూడా మొదలుపెట్టింది.
• నర్సింగ్ హోమ్‌లో ఉంటున్న వంద సంవత్సరాల వయసున్న, కళ్లులేని ఒక సహోదరుడు “మనకు రాజ్యం అవసరం” అని ఎప్పుడూ అంటూవుండేవాడు. దాంతో, అక్కడున్న నర్సులు, రోగులు దాని గురించి ఆయనను అడిగేవాళ్లు, అప్పుడు ఆయన రాజ్యమంటే ఏమిటో వాళ్లకు వివరించేవాడు. అక్కడ పనిచేసే ఒక స్త్రీ పరదైసులో మీరేం చేస్తారని సహోదరుణ్ణి అడిగింది. దానికి ఆయన, “నేను నా కళ్లతో చూస్తాను, నా కాళ్లతో నడుస్తాను, నా చక్రాల కుర్చీని కాల్చేస్తాను” అన్నాడు. ఆయనకు కళ్లులేవు కాబట్టి పత్రికలు చదివి వినిపించమని ఆమెను అడిగేవాడు. ఆ సహోదరుని కూతురు వచ్చినప్పుడు ఆ స్త్రీ ఆ పత్రికలను ఇంటికి తీసుకు వెళ్లొచ్చా అని అడిగింది. ఒక నర్సు ఆ సహోదరుని కూతురుతో, “నర్సింగ్ హోమ్‌లో ఇప్పుడు కొత్త అంశం, ‘మనకు రాజ్యం అవసరం’ అని చెప్పింది.”
• ఒక హోటల్‌లో క్యూలో నిలబడివున్న ఒక సహోదరి దగ్గర్లో కూర్చునివున్న కొంతమంది వృద్ధులు రాజకీయాల గురించి మాట్లాడుకోవడం వింది. వాళ్లలో ఒకాయన, ప్రభుత్వం మన సమస్యలను పరిష్కరించలేదని అన్నాడు. ఆ సహోదరి, ‘మాట్లాడడానికి ఇదే మంచి అవకాశం’ అని మనసులో అనుకుంది. క్లుప్తంగా ప్రార్థన చేసుకుని వాళ్ల దగ్గరకు వెళ్లింది. తనను తాను పరిచయం చేసుకున్నాక, మానవజాతి సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం గురించి, అంటే దేవుని రాజ్యం గురించి చెప్పి, తన దగ్గరున్న ఒక బ్రోషుర్‌ను వాళ్లకిచ్చింది. అప్పుడే మేనేజరు అక్కడికి వచ్చాడు. ఆ మేనేజరు తనను అక్కడి నుండి వెళ్లిపొమ్మంటాడని ఆ సహోదరి అనుకుంది. కానీ, ఆయన తానంతా విన్నానని చెప్పి, తనకు కూడా ఒక బ్రోషుర్ ఇవ్వమని అడిగాడు. అక్కడ పనిచేసే ఒక అమ్మాయి కూడా ఆ సహోదరి చెప్పేది విని తన కళ్లల్లో నీళ్లతో సహోదరి దగ్గరకు వచ్చింది. ఒకప్పుడు ఆమె బైబిలు అధ్యయనం చేసేది, ఆమె మళ్లీ బైబిలు అధ్యయనం మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది.