ఉద్యోగవిరమణ—అధిక కార్యాలకు అనువైన కాలం
1 కష్టపడి పనిచేసే చాలామంది వృత్తిసంబంధ శ్రమ, వత్తిళ్ళనుండి విముక్తినిచ్చే ఉద్యోగవిరమణ కోరుకుంటారు. అయితే తరచూ, ఉద్యోగవిరమణ మానసిక అలసత్వాన్ని, చికాకును కలిగిస్తూ, ముందే వృద్ధాప్యం రావడానికి కారణమవుతుంది. ప్రయోజనార్థ పనులేవీ లేకపోవడంతో తమను గూర్చిన చింతాభావంతో వారికి మనశ్శాంతి లేకుండా పోతుంది. ఉద్యోగవిరమణ చేసిన ప్రభుత్వోద్యోగులు ‘అసంతృప్తి, చికాకు, అభద్రత, పనికిరామనే మానసిక వ్యధ, ఇక జీవితం వ్యర్థమనే’ సమస్యలతో బాధపడుతున్నారని ఒక బ్రెజిలియన్ వార్తాపత్రిక నివేదించింది.
2 దీనికి భిన్నంగా, అనేకమంది క్రైస్తవులు ఈ నూతన జీవనకాలాన్ని ఆధ్యాత్మిక అధిక కార్యాలకు అనువైన కాలంగా దృష్టిస్తున్నారు. 65 సంవత్సరాలు నిండిన రెండు వారాలకు పయినీరు సేవ ఆరంభించిన ఒక సహోదరుడు ఇలా అన్నాడు: “గడిచిన పది సంవత్సరాల పయినీరు సేవచూస్తే నా జీవితంలో ఇంత ఆశీర్వాదకర కాలాన్ని నేనెన్నడూ అనుభవించలేదు.” ఓ వివాహ దంపతులు ఇలా వ్రాశారు: “మా నిజమైన స్వర్ణ కాలం మా పయినీరు సేవతో మొదలయ్యింది.” అవును చాలామందికి, ఉద్యోగవిరమణ తమ పరిచర్యను విస్తృతపరచుకొని యెహోవానుండి అత్యధిక ఆశీర్వాదాలు పొందే సువర్ణావకాశమిస్తుంది.
3 పని రద్దీగా, ఫలదాయకంగా ఉండడం: ఇప్పుడు ఉద్యోగవిరమణ చేసిన అనేకులు నేటి సర్వసాధారణ సుఖజీవన వస్తువులేవీ లేకుండా చిన్నప్పటినుండే కష్టపడి పనిచేయడం నేర్చుకుని పెరిగి పెద్దవారయ్యారు. వారికిప్పుడు యౌవన బలం లేకపోయినా వారింకా ఫలవంతమైన మంచి పనివారిగా ఉన్నారు. ఒక బ్రాంచి సేవా ప్రాంతంలో ఉన్న పయినీర్లలో 22 శాతం మంది అంటే దాదాపు 20,000 మంది సహోదర సహోదరీలు కనీసం 60 సంవత్సరాల వయస్సువారే. వయసు మళ్ళిన వీరే ప్రకటనా పనికి అధికంగా సహాయం చేస్తున్నారు. వారి అనుభవం, వారి దైవిక లక్షణాలు వారు సేవచేస్తున్న సంఘాల్ని ఫలభరితం చేస్తున్నాయి.—యాకో. 3:17, 18.
4 క్రైస్తవ పరిచర్యలో పని రద్దీగా ఉండడం మంచి ఆరోగ్యానికి, మెరుగైన జీవన నాణ్యతకు సహాయం చేస్తుంది. ఉద్యోగవిరమణ చేసిన అనంతరం పయినీరు సేవ ప్రారంభించిన 84 సంవత్సరాల ఒక సహోదరి ఇలాచెప్పింది: “ఆసక్తిగలవారితో చాలా బైబిలు అధ్యయనాలు చేయడం నేను మానసికంగా చురుకుగా ఉండేందుకు సహాయం చేసింది. నాకు కారు లేదు, అందుకని నేను ఎక్కువగా నడుస్తాను. అది నన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది.” ఒక వృద్ధ పయినీరు దంపతులు ఇలా వ్యాఖ్యానించారు: “సేవ మమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. మేమెప్పుడూ కలిసేవుంటాం. నవ్వుతూ ఆనందంగా ఉంటాం.”
5 అవసరం ఎక్కువున్నచోట సేవచేయడం: ఉద్యోగవిరమణ చేసిన కొందరు క్రైస్తవులు వారికున్న మంచి ఆర్థికస్థితినిబట్టి రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువున్నచోట సేవచేసేందుకు తరలివెళ్ళారు. ఆసక్తిగల ఈ ప్రచారకులు అపొస్తలుడైన పౌలువలే, ‘సువార్తలో వారితో పాలివారగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నారు.’—1 కొరిం. 9:23.
6 ఓ దంపతులు వారి కుమారులిద్దరిని పెంచిపెద్దచేసి ఆ తర్వాత పయినీరు సేవ ఆరంభించారు. అలా చాలా సంవత్సరాలు పయినీరు సేవచేసిన తర్వాత వారు చైనీసు భాష నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు 70 ఏండ్లు పైబడిన వారిద్దరు వారు పనిచేసిన చైనీసు గుంపు ఇటీవల ఒక సంఘంగా మారడంచూసి ఎంతో ఆనందించారు. ఇలాంటి దంపతులు ఎంత ఆశీర్వాదకరమని నిరూపింపబడ్డారో గదా!
7 పరిచర్య నుండి విరమణ లేదు: అత్యధికులు చివరికి తమ లౌకిక ఉద్యోగాలనుండి విరమణ తీసుకుంటుండగా, ఏ క్రైస్తవునికి దేవుని సేవనుండి విరమణ లేదు. అందరూ “అంతమువరకు” నమ్మకంగా కొనసాగాల్సిందే. (మత్త. 24:13, 14) నిజమే, కొంతమంది వృద్ధులౌతున్నకొద్దీ ఇంతకుముందు యెహోవా సేవ చేసినంతగా ఇప్పుడు చేయలేకపోతున్నారు. అయితే హృదయపూర్వకంగా వారెంత చేయగల్గితే అంత చేయడం చూడ్డానికి ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో కదా! యెహోవా వారి పనిని, తన నామము యెడల వారు చూపిన ప్రేమను మర్చిపోడని దేవుని వాక్యం వారికి హామీ ఇస్తోంది.—లూకా 21:1-4; హెబ్రీ. 6:10.
8 మీరొకవేళ ఉద్యోగవిరమణ వయస్సుకు దగ్గరౌతుంటే, మారుతున్న మీ పరిస్థితుల్ని సంపూర్తిగా ఎలా ఉపయోగించుకోవచ్చో మీరు ప్రార్థనాపూర్వకంగా ఎందుకు ఆలోచించకూడదు? దైవిక సహాయంతో, మీ ఉద్యోగవిరమణ యెహోవాకు స్తుతిని, అనేక ఆశీర్వాదాల్ని తెచ్చే అధిక కార్యాలకు అనువైన కాలమని మీరు తెలుసుకుంటారు.—కీర్త. 148:12, 13.