సువార్త అప్పగించబడింది
1 దేవుని సువార్త మనకు అప్పగించబడడం ఎంత గొప్ప ఆధిక్యతో కదా! (1 థెస్స. 2:4) ఈ శక్తివంతమైన సందేశాన్ని కొందరు తిరస్కరించవచ్చు, కానీ యథార్థహృదయులు మాత్రం మనోహరమైన పరిమళానికి ఆకర్షించబడినట్లు ఈ సందేశానికి ఆకర్షించబడతారు. (2 కొరిం. 2:14-16) సువార్తను అంగీకరించి దానికి విధేయులుగా ఉండేవారికి అది రక్షణ కల్పిస్తుంది. (రోమా. 1:16) మనకు అప్పగించబడిన ఈ సువార్తతో మనమేమి చేయాలి?
2 యేసు, అపొస్తలులు: యేసు సువార్త ప్రకటించడానికే మొదటి స్థానమిచ్చాడు. (లూకా 4:18, 43) ఆయన అలసిపోయి ఆకలితో ఉన్నప్పుడు కూడా, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, సందేశం పట్ల ఆయనకున్న గౌరవం ఆ సందేశాన్ని ఇతరులతో పంచుకునేలా ఆయనను ప్రేరేపించాయి. (మార్కు 6:30-34) ఆయన తన మాటల ద్వారా చేతల ద్వారా రాజ్య ప్రకటనా పని ప్రాముఖ్యత తన శిష్యుల హృదయాల్లో ముద్రించుకుపోయేలా చేశాడు.—మత్త. 28:18-20; మార్కు 13:10.
3 అపొస్తలులు యేసును అనుకరిస్తూ రాజ్య సందేశాన్ని ఆసక్తితో ప్రకటించారు. వారిని కొట్టి సువార్త ప్రకటించడం ఆపేయమని ఆజ్ఞాపించినా కూడా, వారు ‘మానకుండా బోధించుచు, ప్రకటించారు.’ (అపొ. 5:40-42) అపొస్తలుడైన పౌలు ఈ పనిలో అలసట అన్నదే లేకుండా పనిచేశాడు. (1 కొరిం. 15:9, 10; కొలొ. 1:29) ఆయన సువార్త పంచుకునే ఆధిక్యతను, తోటివారికి రుణపడి ఉండడంతో పోల్చాడు, అంతేగాక ఆయన ఆ రుణాన్ని తీర్చుకోవడానికి తన సొంత సౌకర్యాలను కూడా పక్కన పెట్టడానికి ఇష్టపడ్డాడు.—అపొ. 20:24; రోమా. 1:14-16.
4 నేడు మన ఆధిక్యత: మనకు అప్పగించబడిన పవిత్రమైన కర్తవ్యం పట్ల ఉండే గౌరవం, మనం ప్రకటనా పనిని విస్తరింపజేయడానికి మార్గాలను వెదికేలా మనల్ని ప్రేరేపిస్తుంది. (రోమా. 15:15, 16) అంగవైకల్యం వల్ల చక్రాల కుర్చీకే పరిమితమైన ఎడ్వర్డ్, ఒక హోటల్ ద్వారం దగ్గర కూర్చొని ఆ హోటల్‌కు వచ్చేవారితో తన విశ్వాసం గురించి మాట్లాడేవాడు. అయితే ఆయన తన సేవను విస్తృతపరచుకోవాలన్న కోరికతో, ఒక పికప్ ట్రక్కు మీద నివసించడానికి ప్రత్యేకమైన కుటీరం లాంటిది నిర్మించుకొని ఆ వాహనం ద్వారా ఆయన అనేక సంవత్సరాలు పయినీరు సేవ చేశాడు, ఆ పనిలో ఆయన వేలాది మైళ్ళు ప్రయాణించాడు. ఎడ్వర్డ్‌లాగే నేడు సువార్తను వ్యాపింపజేయడంలో మరింత ఎక్కువగా పాల్గొనేందుకు చాలామంది తమ తమ పరిస్థితులను సర్దుబాటు చేసుకున్నారు.
5 నేడు యేసును, అపొస్తలులను అనుకరిస్తూ మనం ప్రకటనా పనికి మన జీవితాల్లో ఎల్లప్పుడూ మొదటిస్థానం ఇద్దాం. అలా చేయడం ద్వారా ప్రజల పట్ల ఉన్న ప్రేమతోపాటు మనకు అప్పగించబడిన సువార్త పట్ల ఉన్న గౌరవాన్ని కూడా మనం చూపిస్తాం.