సాక్ష్యాన్నిచ్చే వీడియోల ప్రభావం
1 “మా కుమారుడు నడక నేర్వక ముందు నుండే ఆ వీడియోను చూస్తున్నాడు. వాడు దాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తుంటాడు. మన పిల్లల మనస్సుల్లో యెహోవా పట్ల ప్రేమను నాటే ఉపకరణాలు ఉండడం ఎంత ఆనందకరమైన విషయమో కదా!” క్రైస్తవురాలైన ఈ తల్లి ఏ వీడియో గురించి చెప్తోంది? అది, నోవహు—ఆయన దేవునితోకూడ నడిచాడు (ఆంగ్లం) అనే పేరుగల వీడియో. యెహోవాసాక్షి కాని ఒక స్త్రీ కొడుకు వేరేవాళ్ళ ఇంట్లో నోవహు వీడియోను చూశాడు. అప్పుడామె, బ్రాంచి కార్యాలయానికి 4,000 రూపాయలకు పైగా చందా పంపించి, పిల్లల కోసం ఇతర వీడియోలు ఏమైనా ఉన్నాయేమో తెలుపమని కోరింది. యెహోవా సంస్థ రూపొందించిన వీడియోలు యౌవనస్థులపైనా, పెద్దవారిపైనా శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
2 కుటుంబంలో: సాక్షుల కుటుంబం ఒకటి, యెహోవాసాక్షులు నాజీ దాడి సమయంలో స్థిరంగా నిలబడ్డారు (ఆంగ్లం) అనే వీడియోను చూసిన తర్వాత, తల్లి ఇలా తెలియజేస్తోంది: “అసాధారణమైన వాటిని సహించడానికి సాధారణ ప్రజలకు యెహోవా ఎలా సహాయం చేశాడనేదానిపై నేను రోజంతా మననం చేశాను! దాని గురించి ఆలోచించడం, నా స్వంత సమస్యలు వాటి ముందు ఎంత అల్పమైనవో నాకు గుర్తు చేసింది. ఈ వీడియోను మా పిల్లలతో కలిసి చూడడం, వారు యెహోవాపై ఆధారపడవలసిన అవసరాన్ని మరింత స్పష్టంగా గ్రహించడానికి వారికి సహాయం చేసింది. ఆ తర్వాత దాని గురించి మా అమ్మాయిలతో చర్చించడం ద్వారా, వారికి ఎలాంటి ఒత్తిళ్ళు, హింసలు ఎదురైనా వాటితో వ్యవహరించడానికి వారు మరింత చక్కగా సంసిద్ధులై ఉండడానికి సహాయం చేశాము.”
3 స్కూలులో: ఒక నివేదికలో భాగంగా, ఒక యౌవనస్థుడు తన తరగతికి, స్థిరంగా నిలబడ్డారు అనే వీడియోలోని కొంతభాగాన్ని చూపించగలిగాడు. అంతకు ముందు, తనకు సాక్షులంటే ఇష్టంలేదని ఆ తరగతి ఉపాధ్యాయురాలు చెప్పింది. ఆ వీడియో చూసిన తర్వాత ఆమె ఇలా అన్నది: “ఇది, యెహోవాసాక్షుల గురించి నా దృక్కోణాన్ని పూర్తిగా మార్చివేసింది. ఈ సారి వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు నేను వాళ్ళు చెప్పేది విని, వారితో బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభిస్తానని వాగ్దానం చేస్తున్నాను!” మనపై ఆమెకున్న అభిప్రాయాన్ని మార్చినదేమిటి? అది, మన “నిజమైన ప్రేమ, యథార్థత” అని ఆమె చెప్పింది.
4 పరిచర్యలో: ఒక సహోదరి ఒక స్త్రీని కలిసింది, ఆమె మన గురించి, మన నమ్మకాల గురించి తనకు కొన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ మన సాహిత్యాలను తీసుకోవడానికి సంకోచించింది. ఆ సహోదరి యెహోవాసాక్షులు—ఆ పేరు వెనుకనున్న సంస్థ (ఆంగ్లం) అనే వీడియోతో తిరిగి వచ్చి, ఆ స్త్రీకి ఆమె భర్తకు దాన్ని వేసి చూపించింది. ఇద్దరూ ఎంతో ప్రభావితులై, బైబిలు అధ్యయనం చేయడానికి అంగీకరించారు. వారికివ్వబడిన చక్కని సాక్ష్యం మూలంగా వారు తమ జీవితాలను దేవుని చిత్తానికి అనుగుణంగా మార్చుకోవడం ప్రారంభించారు.
5 మీరు మన వీడియోల నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందుతున్నారా?