భూమిపైనున్న అత్యంత సంతోషభరితులైన ప్రజలు
1 ‘యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు [“సంతోషభరితులు,” NW].’ (కీర్త. 144:15) ఆ మాటలు భూమిపైనున్న అత్యంత సంతోషభరితులైన ప్రజలుగా యెహోవా సాక్షులను వర్ణిస్తాయి. అద్వితీయ సత్య దేవుడు, సజీవుడు అయిన యెహోవా సేవ చేయడం ద్వారా లభించేదాని కంటే గొప్ప ఆనందం మరేదీ లేదు. ఆయన “సంతోషంగల దేవుడు” గనుక ఆయనను ఆరాధించేవారు ఆయన ఆనందాన్ని ప్రతిఫలింపజేస్తారు. (1 తిమో. 1:11, NW) మనం అంత సంతోషంగా ఉండడానికి దోహదపడే, మన ఆరాధనలోని కొన్ని అంశాలేవి?
2 సంతోషంగా ఉండడానికి కారణాలు: ‘మన ఆధ్యాత్మిక అవసరతను గుర్తించడం,’ సంతోషాన్ని తీసుకువస్తుందని యేసు మనకు హామీ ఇచ్చాడు. (మత్త. 5:3, NW) క్రమంగా బైబిలు అధ్యయనం చేయడమూ, మన క్రైస్తవ కూటాలన్నిటికీ హాజరవ్వడమూ ఆ అవసరతను తీరుస్తాయి. దేవుని వాక్య సత్యాన్ని తెలుసుకోవడం దోషమునుండి మతసంబంధమైన అసత్యాలనుండి మనల్ని స్వతంత్రులను చేసింది. (యోహా. 8:32) లేఖనాలు మనకు అతి శ్రేష్ఠమైన జీవన విధానాన్ని కూడా బోధించాయి. (యెష. 48:17) దాని మూలంగా, మనం మన సహోదరుల సంతోషభరితమైన సాంగత్యంలో ఆరోగ్యదాయకమైన క్రైస్తవ సహవాసాన్ని ఆనందిస్తాము.—1 థెస్స. 2:19, 20; 1 పేతు. 2:17.
3 దేవుని ఉన్నత నైతిక ప్రమాణాలకు మనం విధేయులమవ్వడం మనల్ని కాపాడుతుందనీ, యెహోవాను సంతోషపరుస్తుందనీ మనకు తెలుసు గనుక, అలా చేయడం ద్వారా మనం గొప్ప సంతృప్తిని పొందుతాము. (సామె. 27:11) ఒక వార్తాపత్రిక రిపోర్టరు ఇలా పేర్కొన్నాడు: “యెహోవా సాక్షులకు ఎంతో ఖచ్చితమైన ప్రమాణాలు ఉన్నప్పటికీ, వారు అసంతోషంగా ఉన్నట్లు కనిపించరు. దానికి భిన్నంగా, వారు ఎంతో సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు. చిన్నవారు, అలాగే [వారిలో ఉన్న] పెద్దవారు అసాధారణమైన రీతిలో ఆనందంగా ఉన్నట్లు, ఎంతో సమతూకం కలిగి ఉన్నట్లు కనిపిస్తారు.” మనకున్న సంతోషభరితమైన జీవన విధానాన్ని ఇతరులు కూడా పొందడానికి మనం వారికెలా సహాయం చేయవచ్చు?
4 ఇతరులు సంతోషాన్ని కనుగొనడానికి సహాయం చేయండి: లోకం అసంతోషంతో నిండి ఉంది, ప్రజలకు సాధారణంగా భవిష్యత్తు గురించి నిరాశాపూరితమైన దృక్కోణం ఉంటుంది. అయితే, ఏదో ఒక రోజున విచారమంతా గతించిన విషయమై ఉంటుందని తెలుసుకోవడం వల్ల మనం తేజోవంతమైన దృక్కోణం కలిగివున్నాము. (ప్రక. 21:3, 4) కాబట్టి, మన నిరీక్షణను, యెహోవాను గురించిన మన నమ్మకాలను యథార్థహృదయులతో పంచుకునేందుకు వారి కోసం వెదుకుతూ మనం అత్యాసక్తితో పరిచర్యలో పాల్గొంటాము.—యెహె. 9:4.
5 ఒక పయినీరు సహోదరి ఇలా చెప్పింది: “ప్రజలకు యెహోవాను గూర్చి, ఆయన సత్యాన్ని గూర్చి తెలుసుకోవడానికి సహాయపడడంకన్నా ఎక్కువ తృప్తినిచ్చేది మరొకటి లేదు.” ఇంకా అనేకులు గృహ బైబిలు అధ్యయనాలను అంగీకరించేందుకు వారిని ప్రోత్సహించడానికి మనం చేయగలిగినదంతా చేద్దాము. యెహోవా సేవ చేయడము, ఆయన సేవ చేయడానికి ఇతరులకు సహాయం చేసేందుకు మన శక్తి మేరకు కృషి చేయడము అత్యంత గొప్ప సంతోషాన్ని ఇస్తాయి.—అపొ. 20:35.