బైబిలు కాలములలో విద్య
“వాటిని మీ పిల్లలకు నేర్పించవలెను.”—ద్వితీయోపదేశకాండము 11:19.
1. తన సేవకుల విద్యయందు యెహోవా శ్రద్ధ కలిగియున్నాడని ఏది సూచిస్తున్నది?
యెహోవా గొప్ప విద్యాబోధకుడు. ఆయనెన్నడు తన సేవకులను అజ్ఞానమందు వదిలివేయలేదు. ఆయన వారికి తన చిత్తాన్ని, తన మార్గాలను బోధిస్తాడు. ఆయన అద్వితీయ కుమారుడు ఆయన ప్రక్కనేవుండి దేవుని “ప్రధాన శిల్పిగా” వేవేల సంవత్సరాలు తదేకంగా నేర్చుకున్నాడు. (సామెతలు 8:30) భూమిపై ఉన్నప్పుడు యేసు ఇలా చెప్పాడు: “తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాను.” (యోహాను 8:28) సాటిలేని విద్యాబోధకునిగా దేవున్ని సూచిస్తూ, ఎలీహు యిలా ప్రశ్నించాడు: “ఆయనను పోలిన బోధకుడెవడు?” (యోబు 36:22) యెహోవా తన ప్రజలకు ‘మహాగొప్ప బోధకుడని’ మాట్లాడుచు ప్రవక్తయగు యెషయా యిలా ప్రవచించాడు: “నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.” (యెషయా 30:20; 54:13) నిస్సంకోచముగా, తన తెలివిగల సృష్టిప్రాణులందరు వివేకవంతులుగా, విద్యావంతులుగా ఉండాలని యెహోవా కోరుచున్నాడు.
పితరుల కాలమునాటి విద్య
2, 3. (ఎ) తమ పిల్లల విద్యను నమ్మకమైన పితరులు ఎలా దృష్టించారు, యెహోవా అబ్రాహాముకు ఏ ఉపదేశాన్నిచ్చాడు? (బి) అబ్రాహాము సంతానానికి విద్య నేర్పించవలెనను ఉపదేశం వెనుక ఏ గొప్ప సంకల్పముండెను?
2 పితరుల కాలములలో కుటుంబ యజమానికి తన పిల్లలకు, తన కుటుంబానికి బోధించుట ఒక ప్రాథమిక బాధ్యత. తమ పిల్లలకు విద్య నభ్యసింపజేయుట దేవుని సేవకుల మత ధర్మము. తన సేవకుడైన అబ్రాహామును గూర్చి యెహోవా యిలా చెప్పాడు: “యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటివారును నీతిన్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించునట్లు నేనతని నెరిగియున్నాను.”—ఆదికాండము 18:19.
3 విద్య చాలా ప్రాముఖ్యమైనదని యెహోవా పరిగణించినట్లు ఈ దైవిక వ్యాఖ్యానం చూపిస్తున్నది. భావితరాలవారు యెహోవా మార్గాన్ని అనుసరించునట్లు తమ కుటుంబాలకు నీతిన్యాయములను గూర్చి బోధించాలని దేవుడు అబ్రాహాము, ఇస్సాకు యాకోబులను కోరాడు. ఆ విధంగాచేస్తే, యెహోవా అబ్రాహాము సంతానమును గూర్చి, “భూమిలోని సమస్త జనములను” ఆశీర్వదించుటను గూర్చి చేసిన వాగ్దానములను నెరవేర్చును.—ఆదికాండము 18:18; 22:17, 18.
ఇశ్రాయేలీయులలో విద్యా విధానం
4, 5. (ఎ) ఇతర జనాంగములనుండి ఇశ్రాయేలీయుల విద్యా విధానాన్ని ఏది భిన్నంగా చూపింది? (బి) ఎన్‌సైక్లోపీడియా జూడైకా లో ఏ ప్రాముఖ్యమైన భేదము వ్రాయబడింది, నిస్సందేహముగా ఏది ఈ భేదానికి దోహదపడింది?
4 ఎన్‌సైక్లోపీడియా జూడైకా ఇలా అంటుంది: “ప్రాచీన ఇశ్రాయేలునందలి విద్యా విధానాన్ని అర్థం చేసుకునేందుకు బైబిలు ప్రాథమిక మూలమై యున్నది.” యెహోవా ఇశ్రాయేలీయుల ప్రథమ మానవ బోధకునిగా మోషేను ఉపయోగించాడు. (ద్వితీయోపదేశకాండము 1:3, 5; 4:5) యెహోవా తనకు చెప్పిన మాటలనే మోషే వారికి అందజేసాడు. (నిర్గమకాండము 24:3) కాబట్టి, నిజంచెప్పాలంటే దేవుడే ఇశ్రాయేలీయుల ప్రాథమిక విద్యా బోధకుడు. ఈ ఇశ్రాయేలీయుల విద్యా విధానమే వారిని ఇతర జనాంగముల నుండి వేరుచేసింది.
5 అదే గ్రంథము యిలా ప్రకటిస్తున్నది: “మెసపుటోమియా, ఐగుప్తులలో ఉన్నతవిద్య లేదా పుస్తకాల్ని చదవడం సాంప్రదాయబద్ధమై, శాస్త్రుల తరగతికే పరిమితమై యుండేది, కానీ ఈ పద్ధతి ఇశ్రాయేలీయులలో ఉన్నట్లు కన్పించదు. హెబ్రీయులు వ్రాయుటకు ఉపయోగించిన సరళమైన అక్షర విధానం కారణంగానే నిస్సందేహముగా ఈ భేదమున్నది. . . . విద్యా చరిత్రకు అక్షర రచనా ప్రాముఖ్యతను నిర్లక్ష్యము చేయకూడదు. ఐగుప్తు, మెసపుటోమియ, రెండువేల సంవత్సరముల నాటి కనానుయొక్క సంప్రదాయ శాస్త్రుల సంస్కృతుల నిష్క్రమణతో అది ప్రవేశించింది. క్లిష్టమైన కీలలిపి, గూఢలిపి వ్రాతల్లో ప్రవీణులై వృత్తిరీత్యా శాస్త్రులు, యాజక తరగతికి మాత్రమే ఉన్న గుర్తింపు ఇక ఎంతమాత్రం చదువుకొనుటకు ఒక ప్రత్యేక లక్షణంగా ఉండనక్కరలేదు.”
6. వారి చరిత్రారంభము నుండే ఇశ్రాయేలీయులు చదువుకున్న ప్రజలనుటకు బైబిలునందు ఏ రుజువుకలదు?
6 ఇశ్రాయేలీయులు అక్షరాస్యులైన ప్రజలని బైబిలు రుజువునిస్తున్నది. వారు వాగ్దాన దేశంలో ప్రవేశించకముందే, తమ ద్వారబంధముల మీద, తలుపుల మీద యెహోవా కట్టడలు వ్రాయవలెనని వారికి ఆజ్ఞాపింపబడింది. (ద్వితీయోపదేశకాండము 6:1, 9; 11:20; 27:1-3) ఈ ఆజ్ఞ నిస్సందేహముగా అలంకారార్థమై యున్నను, సగటు ఇశ్రాయేలీయునికి చదువను, వ్రాయను తెలియకపోతే దానివలన ప్రయోజనముండేది కాదు. ఇశ్రాయేలునందు రాజ్యస్థాపన జరుగుటకు ఎంతోకాలం ముందే మోషే, యెహోషువ వంటి నాయకులతోపాటు ఇతరులును వ్రాసే విధానాన్ని ఎరిగియుండిరని యెహోషువ 18:9, న్యాయాధిపతులు 8:14 వంటి లేఖనాలు చూపిస్తున్నవి.—నిర్గమకాండము 34:27; యెహోషువ 24:26.
బోధనా పద్ధతులు
7. (ఎ) లేఖనముల ప్రకారం, ఇశ్రాయేలీయుల పిల్లలకు వారి ప్రాథమిక విద్యను ఎవరందించారు? (బి) ఒక ఫ్రెంచి బైబిలు విద్వాంసుడు ఏ సమాచారమిచ్చాడు?
7 ఇశ్రాయేలీయులలో, తలిదండ్రులిద్దరు పిల్లలకు శిశుప్రాయం నుండే బోధించేవారు. (ద్వితీయోపదేశకాండము 11:18, 19; సామెతలు 1:8; 31:26) ఫ్రెంచ్ డిక్షనెయిర్ డి లా బైబిల్ నందు, బైబిలు విద్వాంసుడైన ఇ. మాంజెనోట్ యిలా వ్రాశాడు: “పిల్లవాడు మాట్లాడుట ప్రారంభించిన వెంటనే, అతడు ధర్మశాస్త్రమందలి కొన్ని వాక్యాలు నేర్చుకుంటాడు. అతని తల్లి ఒక వచనాన్ని పదేపదే చెబుతూ ఉంటుంది; అతడు దానిని నేర్చుకున్న తర్వాత ఆమె మరొకటి నేర్పిస్తుంది. ఆ పిదప, పిల్లవాడు జ్ఞాపకం పెట్టుకొని వల్లించగల్గే వచనాల్ని వ్రాతప్రతి రూపంలో వాని చేతికిచ్చేవారు. ఆ విధంగా, వారికి చదవడం పరిచయం చేయబడి, వారు పెద్దవారైనప్పుడు ప్రభువు ధర్మశాస్త్రాన్ని చదివి, ధ్యానించడం ద్వారా వారు తమ మత ఉపదేశంలో కొనసాగగల్గేవారు.”
8. (ఎ) ఇశ్రాయేలీయులలో ఏ ప్రాథమిక విద్యా పద్ధతి ఉపయోగింపబడింది, అయితే ఏ ప్రాముఖ్యమైన ప్రత్యేకతతో చేయబడెను? (బి) ఏ జ్ఞాపక సహాయకములు ఉపయోగింపబడెను?
8 ఉపయోగించబడిన ప్రాథమిక విద్యా పద్ధతి కంఠస్థంచేసి నేర్చుకొనుటయని ఇది తెలియజేస్తున్నది. యెహోవా నియమాలను గూర్చి, తన ప్రజలతో ఆయన వ్యహారాలను గూర్చి వారు నేర్చుకున్న విషయాలు వారి హృదయంలోకి చొచ్చుకుపోవాలి. (ద్వితీయోపదేశకాండము 6:6, 7) వారు వాటిని ధ్యానించాలి. (కీర్తన 77:11, 12) జ్ఞాపకముంచుకొనుటలో యౌవనులు, వృద్ధులకు సహాయపడుటకు వివిధ రకాల సహాయక పద్ధతులు ఉపయోగింపబడేవి. వీటిలో అక్షరముల ప్రథమాక్షరములను, భిన్నాక్షరముతో ఆరంభమయ్యే కీర్తనలోని వెనువెంటవచ్చు వచనములను, అక్షరమాలలను (సామెతలు 31:10-31 నందున్నటువంటివి) వృత్యనుప్రాస క్రమమును (ఒకే విధమైన అక్షరముతో లేదా శబ్దముగల పదములను); సామెతలు 30వ అధ్యాయమందలి రెండవ అర్థభాగములో ఉపయోగింపబడిన వాటిని పోలిన అంకెలను ఉపయోగించుట చేరియున్నవి. చిత్రమైన విషయమేమంటే, ప్రాచీన హెబ్రీ వ్రాతలలో అతిపురాతనమైన వాటిలో ఒకటైన గెజెరు క్యాలెండరును పాఠశాల విద్యార్థి కంఠస్థం కొరకు ఉపయోగించారని కొంతమంది విద్వాంసులు తలంచారు.
నిర్ణీత పాఠ్యక్రమం
9. (ఎ) ఇశ్రాయేలీయుల పిల్లల పఠన కార్యక్రమమందు ఏది ప్రాముఖ్యమైన భాగమై యుండెను? (బి) వార్షిక పండుగల సంబంధముగా జరిగింపబడే విద్యా బోధనగూర్చి ఒక బైబిలు సర్వసంగ్రహ నిఘంటువు ఏమని చెప్పుచున్నది?
9 ఇశ్రాయేలీయులలో విద్య కేవలం చదవను వ్రాయను నేర్చుకోవడానికే పరిమితం కాలేదు. చరిత్ర వారికి ఒక ప్రాముఖ్యమైన బోధనాంశముగా బోధింపబడెను. తన ప్రజల పక్షముగా యెహోవా చేసిన ఆశ్చర్యకార్యములను గూర్చి నేర్చుకొనుట విద్యాకార్యక్రమంలో ఒక మూల భాగమై యుండెను. ఈ చరిత్రాత్మక వాస్తవాలు తరతరాలు బోధించబడవలసి యుండెను. (ద్వితీయోపదేశకాండము 4:9, 10; కీర్తన 78:1-7) వార్షిక పండుగల ఆచరణ కుటుంబ యజమాని తన పిల్లలకు బోధించే చక్కని అవకాశాన్నిచ్చేవి. (నిర్గమకాండము 13:14; లేవీయకాండము 23:37-43) ఈ విషయాన్ని గూర్చి ది ఇంటర్నేషనల్ స్టాండార్డ్ బైబిల్ ఎన్‌సైక్లోపీడియా ఇట్లనుచున్నది: “గృహములో తండ్రి ఉపదేశము మరియు పండుగల విశేషతను గూర్చిన అతని వివరణల ద్వారా గతంలో దేవుడెట్లు తనను ప్రత్యక్షపరచుకున్నాడు, ప్రస్తుతమందు వారెట్లు జీవించాలి, తన ప్రజల భవిష్యత్తును గూర్చి దేవుని వాగ్దానములు ఏమైయున్నవి అనే విషయాలలో హెబ్రీ పిల్లలు బోధింపబడేవారు.”
10. ఆడపిల్లలకు, మగపిల్లలకు ఎటువంటి ప్రయోగాత్మక శిక్షణ యివ్వబడేది?
10 తలిదండ్రులిచ్చే విద్యలో ప్రయోగాత్మక శిక్షణ యిమిడియుండేది. ఆడపిల్లలకు ఇంటిపనులలో నైపుణ్యత నేర్పింపబడేది. అవి అనేకమని, వైవిధ్యము గలవని సామెతలు చివరి అధ్యాయము చూపిస్తున్నది. వాటిలో నూలు వడకుట, నేతపని, వంట, బజారు పనులు, సాధారణమైన ఇంటిపనులు యిమిడియున్నవి. మగపిల్లలకు సాధారణంగా వారి తండ్రిచేసే వృత్తి అనగా వ్యవసాయము లేదా ఏదైనా చేతివృత్తి లేదా హస్తకళ నేర్పింపబడేది. ఆ తర్వాతి కాలాలలో యూదుల రబ్బీలు వాడుకగా, “తన కుమారునికి పనికివచ్చే వృత్తి నేర్పని వాడు అతన్ని దొంగగా తయారగుటకే పెంచుతున్నాడు” అని అనేవారు.
11. ఇశ్రాయేలీయుల విద్యలోగల సంకల్పాన్ని ఏది చూపిస్తున్నది, ఈనాటి యౌవనులకు ఇది ఏ పాఠమును కలిగియున్నది?
11 ఇశ్రాయేలీయులలో ఉపయోగింపబడిన బోధనా పద్ధతుల ఆత్మీయ లోతు సామెతల గ్రంథమంతా స్పష్టముగా ఉన్నది. “యెహోవాయందు భయభక్తులతో” వివేచన, క్రమశిక్షణ, అవగాహన, వివేకము, బుద్ధికుశలత, తెలివి, జ్ఞానము, ఆలోచనాశక్తివంటి ఉన్నతమైన విషయాలు “జ్ఞానములేని వారికి” బోధించే సంకల్పాన్ని అది చూపిస్తున్నది. (సామెతలు 1:1-7; 2:1-14) ఈనాడు దేవుని సేవకులు తమ విద్యనభివృద్ధి చేసికొనుటకు ఆమెను లేదా అతన్ని పురికొల్పే ఉద్దేశాలను అది నొక్కితెల్పుచున్నది.
యాజకులు, లేవీయులు, ప్రవక్తలు
12. ఇశ్రాయేలీయులకు విద్య నేర్పించుటలో తలిదండ్రులే కాకుండ ఇంకెవరు కూడ భాగము వహించారు, “ధర్మశాస్త్రమని” అనువదించబడిన హెబ్రీ పదమునకు మూలభావమేమై యున్నది?
12 ప్రాథమిక విద్యను తలిదండ్రులిచ్చినను, యాజకులు, యాజకులుకాని లేవీయులు, ప్రవక్తల ద్వారా యెహోవా తన ప్రజలకు మరింత విద్య నభ్యసింపచేశాడు. లేవీ గోత్రముపై తన చివరి ఆశీర్వచనమందు, మోషే ఇలా అన్నాడు: “వారు యాకోబుకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు.” (ద్వితీయోపదేశకాండము 33:8, 10) విశేషముగా, హెబ్రీలో “ధర్మశాస్త్రము” (తోరా) అనే పదం “చూపించు,” “బోధించు,” “ఉపదేశించు” అనే అర్థాలున్న క్రియాపూర్వక పదమూలము నుండి వచ్చినదై యున్నది. ఎన్‌సైక్లోపీడియా జూడైకా ఇలా అంటుంది: “కాబట్టి ఆ పదమునకు [తోరా] కు ‘బోధించుట,’ ‘సిద్ధాంతము,’ లేదా ‘ఉపదేశము’ అని అర్థము.”
13. ఇతర జనాంగముల చట్ట విధానముల నుండి ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రము ఎందుకు భిన్నమై యుండెను?
13 ఇది ఇతర జనాంగముల నుండి మరియు ఆధునిక దిన జనాంగముల నుండి సహితము ఇశ్రాయేలీయులను వేరుగా ఉంచింది. సాధారణ ప్రజానీకము కేవలము కొద్దిగా మాత్రమే ఎరిగియున్న చట్టాలను ఈనాడు రాజకీయ జనాంగములు కలిగియున్నవి. ప్రజలు నియమం తప్పినప్పుడు, తమ పక్షమై వాదించుటకు వారు న్యాయవాదులకు తలకుమించిన రుసుము చెల్లించుకోవాలి. న్యాయ పాఠశాలలు నిపుణుల కొరకే. కానీ ఇశ్రాయేలీయులలో తనను ఎలా ఆరాధించవలెనని, తన చిత్తాని కనుగుణ్యముగా ఎలా జీవించవలెనని తాను కోరుచున్నాడో తెలియజేయుటకు ధర్మశాస్త్రము దేవుని మూలమై యుండెను. ఇతర న్యాయ సూత్రాలవలె కాక, దానియందు దేవుని యెడల, పొరుగువారి యెడల ప్రేమ ఇమిడియుండెను. (లేవీయకాండము 19:18; ద్వితీయోపదేశకాండము 6:5) ధర్మశాస్త్రము నిర్జీవమైన చట్ట గ్రంథముగా లేకుండెను. నేర్చుకోవాల్సిన జీవన విధానమందు అది సిద్ధాంతమును, బోధను, ఉపదేశమును సమకూర్చింది.
14. లేవీయుల యాజకత్వమును యెహోవా తృణీకరించుటకుగల ఒక కారణమేమై యుండెను? (మలాకీ 2:7, 8)
14 నమ్మకముగా ఉన్నప్పుడు, యాజకులు, లేవీయులు ప్రజలకు బోధించే తమ బాధ్యతను నిర్వర్తించారు. అయితే పూర్తిగా కాకపోయిననూ, తరచు యాజకులు జనాంగానికి విద్య నభ్యసింపజేసే తమ కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుని ధర్మశాస్త్రమందలి ఈ విద్యాలేమి ఇటు యాజకులకు అటు ప్రజలకు తీవ్ర పరిణామములను తెచ్చింది. సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో యెహోవా యిలా ప్రవచించాడు: “నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును; నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును.”—హోషేయ 4:6.
15. (ఎ) యాజకులకు తోడుగా, ఇశ్రాయేలీయులలో బోధకులుగా ఉండుటకు యెహోవా ఎవరిని కూడ నియమించాడు, విద్యాకర్తలుగా వారి పాత్రనుగూర్చి ఒక బైబిలు విద్వాంసుడు ఏమి వ్రాశాడు? (బి) యెహోవా జ్ఞానాన్ని, ఆయన మార్గాల్ని నిరాకరించినందుకు చివరకు ఇశ్రాయేలుకు, యూదాకు ఏమి సంభవించెను?
15 యాజకులతోపాటు, విద్యాకర్తలుగా యెహోవా ప్రవక్తలనూ నియమించాడు. మనమిలా చదువుదుము: “మీ దుర్మార్గములను విడిచిపెట్టి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు, నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీ కప్పగించినట్టియు ధర్మశాస్త్రమునుబట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి, ప్రవక్తలందరిద్వారాను దీర్ఘదర్శులద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించెను.” (2 రాజులు 17:13) విద్యాకర్తలుగా ప్రవక్తల పాత్రనుగూర్చి ఫ్రెంచి బైబిలు విద్వాంసుడగు రొలాన్ డి వో యిలా వ్రాశాడు: “ప్రజలకు ఉపదేశించు పనిని ప్రవక్తలును కలిగియుండిరి; ఇది భవిష్యత్తును గూర్చి వారు ప్రవచించేంత ప్రాముఖ్యమైన భాగమై యుండెను. మరియు ప్రవచనార్థక ప్రేరణ దేవుని వాక్యాన్ని బోధించే అధికారాన్ని వారికిచ్చింది. రాజ్యపాలన క్రింద ప్రవక్తలు మత, నైతిక విషయాల బోధకులై యున్నారనుట నిశ్చయము; మనమింకా ఏమి చెప్పవచ్చంటే, అనేకులు వారిని ఎల్లవేళల లక్ష్యపెట్టకపోయినను, వారి బోధకులందరిలో వారు ఉత్తమమైనవారు.” యాజకులు, లేవీయులు సరియైన విద్య నేర్పకపోవుట, దానితోపాటు యెహోవా ప్రవక్తల మాట వినకపోవుట ద్వారా ఇశ్రాయేలీయులు యెహోవా మార్గాల్ని మరిచారు. సా.శ.పూ. 740లో అష్షూరీయులు షోమ్రోనును జయించగా, యెరూషలేమును, దాని ఆలయాన్ని సా.శ.పూ. 607లో బబులోనీయులు నాశనం చేసిరి.
బంధీలుగా ఉన్న కాలములోను, ఆ తర్వాతను విద్య
16, 17. (ఎ) దానియేలు, అతని ముగ్గురు సహవాసులకు ఎలాంటి విద్యా కార్యక్రమం వత్తిడి చేయబడింది? (బి) యెహోవాకు విధేయులుగానే వుంటూ ఈ బబులోను విద్య నభ్యసించుటకు వారిని ఏది బలపర్చింది?
16 యెరూషలేము నాశనానికి దాదాపు పది సంవత్సరాల పూర్వం, రాజైన నెబుకద్నెజరు రాజైన యెహోయాకీనును, ఒక గుంపు యువరాజులను, వివేకవంతులను బబులోనుకు బంధీలుగా తీసుకొనిపోయాడు. (2 రాజులు 24:15) వారిలో దానియేలు, మరి ముగ్గురు వివేకవంతులును ఉండిరి. (దానియేలు 1:3, 6) ఆ నలుగురు “కల్దీయుల విద్యను, భాషను నేర్చుకొనుటకు” ప్రత్యేకమైన మూడు సంవత్సరాల ఒక విద్యా కార్యక్రమాన్ని నెబుకద్నెజరు ఆజ్ఞాపించాడు. అంతేకాదు, “రాజు . . . భుజించు ఆహారములో నుండియు . . . ద్రాక్షారసములో నుండియు అనుదినము భాగము వారికి నియమించెను.” (దానియేలు 1:4, 5) ఇదనేక కారణములను బట్టి ప్రమాదకరమై యుండెను. ఆ నిర్ణీత విద్యావిధానం కేవలం మూడు సంవత్సరాల భాషా విద్యా కార్యక్రమం మాత్రమే కాదు. ఈ వాక్యమందలి “కల్దీయులు” అను మాట “బబులోనీయులను ఒక ప్రజగా కాక, పండితుల తరగతిగా” చూపించుటయని కొందరు అభిప్రాయపడుచున్నారు. (ది సాన్‌సినో బుక్స్ ఆఫ్ ది బైబిల్) దానియేలు గ్రంథంపై తాను చేసిన వ్యాఖ్యానమందు కె. ఎఫ్. కీ యిలా అంటున్నాడు: “దానియేలు అతని సహవాసులు బబులోను పాఠశాలల్లో బోధింపబడే కల్దీయుల యాజకుల, పండితుల జ్ఞానమందు విద్యనభ్యసించవలసి యుండిరి.” రాజు భుజించే ఆహారములో వారికివ్వబడే భాగము మోషే ధర్మశాస్త్రముంచిన ఆహార నిషేధములను ఉల్లంఘించేటట్లు చేసింది. అయితే వారా పరీక్షనెట్లు ఎదుర్కొన్నారు?
17 ఆ నలుగురు యూదయ వివేకవంతుల తరపున మాట్లాడుచు, తమ మనస్సాక్షికి వ్యతిరేకముగా తాము తినబోమని, త్రాగబోమని దానియేలు ప్రారంభం నుండే స్పష్టం చేశాడు. (దానియేలు 1:8, 11-13) యెహోవా వారి ఈ స్థిరత్వమును ఆశీర్వదించి, బబులోను భోజనశాల అధికారి హృదయాన్ని మెత్తబరిచాడు. (దానియేలు 1:9, 14-16) వారి చదువు, ఆ తర్వాత ఈ నలుగురు హెబ్రీయుల జీవితాలలో జరిగిన సంఘటనలు బబులోను సంస్కృతియందలి వారి నిర్బంధ విద్యాకార్యక్రమం యెహోవాతో, ఆయన పవిత్రారాధనతో వారికున్న బలమైన సంబంధము నుండి వారు వైదొలగలేదని నిశ్చయంగా నిరూపించినవి. (దానియేలు 3, 6 అధ్యాయములు) బబులోనులో ఈ మూడు సంవత్సరాల నిర్బంధ ఉన్నత విద్యనుండి వారు నిరపాయముగా బయటకు వచ్చుటకు యెహోవా వారిని బలపర్చాడు. “ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకలశాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై యుండెను. రాజు వీరియొద్ద విచారణచేయగా జ్ఞానవివేకముల సంబంధమైన ప్రతి విషయములోను వీరు తన రాజ్యమందంతట నుండు శకునగాండ్రకంటెను గారడీ విద్యగల వారందరి కంటెను పదియంతలు శ్రేష్ఠులని తెలియబడెను.”—దానియేలు 1:17, 20.
18. బబులోను చెర తర్వాత యూదాలో ఎలాంటి విద్యా కార్యక్రమం నిర్వహించబడింది?
18 బబులోను చెర తర్వాత, ఎజ్రా ఒక గొప్ప విద్యాపనిని నెరవేర్చాడు, ఈయన యాజకుడై యుండి “యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దానిచొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసికొనెను.” (ఎజ్రా 7:10) ఈ విషయంలో ఆయనకు “ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యము” వివరించు నమ్మకమైన లేవీయులు సహాయము చేశారు. (నెహె. 8:7) ఎజ్రా బైబిలు విద్వాంసునిగాను, ‘నకలు వ్రాయుటలో ప్రవీణతగలవానిగాను’ లేదా శాస్త్రిగాను ఉండెను. (ఎజ్రా 7:6) ఈయన కాలములోనే శాస్త్రులు ఒక ప్రముఖమైన తరగతిగా తయారయ్యారు.
రబ్బీల పాఠశాలలు
19. యేసు భూమికి వచ్చే కాలము నాటికి ఇశ్రాయేలీయులలో ఎలాంటి విద్యాకర్తల తరగతి ప్రత్యక్షమైంది, ఏ ప్రత్యేక కారణములనుబట్టి తాను, తన శిష్యులు యూదా ఉన్నత విద్య నభ్యసించలేదు?
19 యేసు భూమికి వచ్చేనాటికి, శాస్త్రులు బోధకులలో ఉన్నతవర్గ తరగతిగా తయారై, దేవుని వాక్యపు నిజమైన బోధలకంటె ఎక్కువగా పారంపర్యాచారములకు హత్తుకొనియుండిరి. “మహానుభావా (శ్రేష్ఠుడా)” అనే అర్థంగల గౌరవార్థ బిరుదుగా తయారయిన “రబ్బీ” అని పిలువబడడానికి వారు ఇష్టపడేవారు. (మత్తయి 23:6, 7, NW అథస్చూచి) క్రైస్తవ గ్రీకు లేఖనములలో, శాస్త్రులు తరచు పరిసయ్యులతో జతపర్చబడ్డారు, ఈ పరిసయ్యులలో కొందరు ధర్మశాస్త్రోపదేశకులుగా ఉండిరి. (అపొ. కార్యములు 5:34) వారి పారంపర్యాచారమునుబట్టి, “మనుష్యులు కల్పించిన పద్ధతలను దైవోపదేశములని” వారు బోధించుటనుబట్టి దేవుని వాక్యమును నిరర్థకము చేస్తున్నారని యేసు ఈ రెండు గుంపులవారిని నిందించాడు. (మత్తయి 15:1, 6, 9) యేసుగాని, ఆయన శిష్యులలో అత్యధికులుగాని ఆ రబ్బీల పాఠశాలల్లో విద్యనభ్యసించలేదనుటలో ఆశ్చర్యం లేదు.—యోహాను 7:14, 15; అపొ. కార్యములు 4:13; 22:3.
20. బైబిలు కాలములలోని విద్యను గూర్చిన ఈ పునఃసమీక్ష మనకేమి చూపించింది, మరియు యెహోవా సేవకులకు విద్య అవసరమని ఏది సూచిస్తున్నది?
20 బైబిలు కాలాల్లోని విద్యను గూర్చిన ఈ పరిశీలన యెహోవా తన ప్రజలకు మహాగొప్ప ఉపదేశకుడని చూపింది. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలునందు సమర్థవంతమైన విద్యావిధానాన్ని వ్యవస్థీకరించాడు. అయితే బహుకాలమైన తర్వాత, దేవుని వాక్యానికి భిన్నంగా బోధించిన యూదామత ఉన్నత విద్య వృద్ధిచెందింది. యేసు అటువంటి పాఠశాలలకు హాజరుకానప్పటికిని, ఆయన అసమానమైన బోధకుడై యుండెను. (మత్తయి 7:28, 29; 23:8; యోహాను 13:13) యుగసమాప్తి వరకు బోధించుడని కూడ ఆయన తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. (మత్తయి 28:19, 20) దీనిని చేయుటకు, వారు మంచి బోధకులై యుండాలి, అందుకు వారికి విద్య అవసరము. కావున ఈనాడు విద్యను నిజమైన క్రైస్తవులెట్లు దృష్టించాలి? తర్వాతి శీర్షికలో ఈ ప్రశ్న పరిశీలించబడును.
జ్ఞాపకానికో పరీక్ష
◻ తన సేవకుల విద్యయందు యెహోవా శ్రద్ధ కలిగియున్నాడని మనమెందుకు నిశ్చయత కలిగియుండగలము?
◻ ఏయే విషయములలో ఇశ్రాయేలీయుల విద్యా విధానం ఇతర జనాంగములకు భిన్నమై యుండెను?
◻ ఇశ్రాయేలీయుల పిల్లలు ఎలాంటి విద్యాబోధను పొందారు?
◻ ఇశ్రాయేలీయులలో ఎలాంటి బోధనా పద్ధతులు ఉపయోగింపబడెను?
◻ యేసు, ఆయన శిష్యులు ఎందుకు యూదా ఉన్నత విద్య పాఠశాలలకు వెళ్లలేదు?
[14వ పేజీలోని చిత్రం]
బబులోనులో నిర్బంధ విద్య దానియేలును, ఆయన సహవాసులను యెహోవా నుండి మరల్చలేదు