వాగ్దాన దేశమునుండి దృశ్యాలు
షిలోహుకు వెళ్లుట—మంచి పిల్లలు, చెడ్డ పిల్లలు
వాగ్దాన దేశమందలి నగరాలను, పట్టణాలను, లేదా ప్రాంతాలను గూర్చి నీవు ఆలోచించినప్పుడు, ప్రముఖులైన కొంతమంది పురుషులు, స్త్రీలు నీకు జ్ఞాపకం వస్తున్నారా? బహుశ అలా వస్తుండొచ్చు, ఎందుకంటే అనేక బైబిలు వృత్తాంతాలలో పెద్దవారు యిమిడియున్నారు. అయితే ఆ కాలమందలి పిల్లల విషయమేమి? ఆ దృశ్యాలలో నీవు వారిని ఊహించుకొందువా?
పైనున్న దృశ్యము, యౌవనులు చేరియున్న వృత్తాంతాలపై దృష్టి నిల్పుటకు మనకు సహాయపడగలదు. వారిలో కొందరు క్రైస్తవులకు మంచి మాదిరిగా వుంటే, మరికొందరు మనకు హెచ్చరికనిచ్చే మాదిరిగా వున్నారు. ఆ మధ్యలో గుండ్రంగావున్న కొండ షిలోహు ప్రాంతమై యుండవచ్చును.a
ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశములో ప్రవేశించినప్పుడు, వారు యెరికో సమీపమున గల గిల్గాలునందు మొదట దేవుని గుడారాన్ని నెలకొల్పారని నీకు జ్ఞాపకం ఉండవచ్చు. (యెహోషువ 4:19) అయితే ఆ దేశము పంచబడినప్పుడు, ఈ గుడారము—ఇశ్రాయేలీయుల ఆరాధనా కేంద్రము—షిలోహుకు మార్చబడింది. (యెహోషువ 18:1) ఇది యెరూషలేముకు తూర్పున ఎఫ్రాయిము పర్వత ప్రాంతమందున్నది. ఇశ్రాయేలీయుల అన్ని ప్రాంతములనుండి షిలోహుకు ప్రయాణమై వెళ్లేవారు; గుడారము బహుశ నెలకొల్పబడిన ప్రాంతానికి దక్షిణానవున్న లోయలో పెద్దపెద్ద గుంపులుగా ప్రజలు సమకూడగల్గేవారు. (యెహోషువ 22:12) పిల్లలు ఇక్కడకు రావడాన్ని నీవు ఊహించగలవా?
కొందరలా వచ్చేవారు. బహుగా గుర్తింపదగిన మాదిరిగావున్న బాలుడైన సమూయేలును గూర్చి మనం తెలుసుకోవాలి. అతని తలిదండ్రులగు ఎల్కానా, హన్నాలు పశ్చిమంగావున్న పర్వతప్రాంత పట్టణములో నివసిస్తూ వుండేవారు. వారు ప్రతి సంవత్సరం బహుశ ఎల్కానా వేరే భార్యకు చెందిన కొంతమంది పిల్లలను తీసుకొని ఇక్కడకు ప్రయాణమై వచ్చేవారు. చివరకు, యెహోవా హన్నాకు కూడ సమూయేలని పేరుపెట్టబడిన ఒక కుమారున్నిచ్చి ఆశీర్వదించాడు. ప్రధాన యాజకుడైన ఏలీతో కలిసి గుడారములో సేవచేయుటకు వీలుపడునట్లు యుక్తకాలమున తలిదండ్రులు ఆయనను షిలోహులో నివసించుటకు తీసుకువచ్చారు.—1 సమూయేలు 1:1–2:11.
దేవుని గృహమందు ఆ బాలునికి చేయాల్సిన పనులుండెను, ఆలాగే దగ్గర్లోవున్న కొండలనెక్కే అవకాశాలెన్నో అతని కుండెను. (1 సమూయేలు 3:1, 15) తొమ్మిదవ పేజీలోని చిత్రంలో ఉన్నట్లు వాటిలోకొన్ని మెట్లుమెట్లుగా, ఒలీవ వృక్షాలతో నిండియుండెను. రాయితో కట్టబడిన చిన్న కావలి బురుజును గమనించండి. అటువంటి కావలి బురుజు నుండి ఒంటరిగావున్న రైతులు లేదా గొర్రెలకాపరులు కావలికాయగల్గేవారు, అయితే చూద్దామని బాలుడైన సమూయేలు కూడా దానినెక్కి వుంటాడని మీరూహించవచ్చును. (2 దినవృత్తాంతములు 20:24 పోల్చుము.) అడవి మృగాలు వస్తున్నాయో లేదో చూడడానికి ఇది ఎంతో అనువుగా ఉండే ఒక చక్కని ప్రదేశము.
ఆ కాలంలో, ఇప్పటికంటే ఎక్కువ చెట్లు, అడవి మృగాలు తిరిగే అరణ్యాలు ఉండేవి. (యెహోషువ 17:15, 18) ఎలీషా, దేవుని ప్రధాన ప్రవక్తగా అయినప్పుడు జరిగిన ఒక సంఘటనను బట్టి మనం దీనిని గ్రహించగలం. ఎలీషా యెరికోనుండి ప్రయాణమై, షిలోహుకు దక్షిణాన 16 కిలోమీటర్ల దూరంలోగల బేతేలుకు వెళ్తున్నాడు. బంగారు దూడ ఆరాధనకు కేంద్రమైన బేతేలు ప్రజలనుండి ఆయనకు ఎలాంటి స్వాగతం లభించెను? (1 రాజులు 12:27-33; 2 రాజులు 10:29) ఆ వూళ్లోని పెద్దవాళ్లకు యెహోవా ప్రవక్త అంటే గిట్టదు, ఆ ప్రభావం వారి సంతానంపై కూడ రుద్దినట్లు కన్పిస్తుంది.
కొంతమంది కుర్రాళ్లు దేవుని ప్రవక్తను, “బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మని” అపహాస్యం చేసారని 2 రాజులు 2:23, 24 మనకు చెప్పుచున్నది. దానికి ప్రత్యుత్తరంగా ఎలీషా, “యెహోవా నామమునుబట్టి వారిని శపించెను. అప్పుడు రెండు ఆడు ఎలుగుబంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది యిద్దరు బాలురను చీల్చివేసెను.” అనుకోనిదేదైనా సంభవించినప్పుడు లేదా వాటి పిల్లలకు అపాయమేర్పడినప్పుడు అటువంటి సిరియాదేశపు గోధుమవర్ణ ఆడు ఎలుగుబంట్లు రోషంతో రెచ్చిపోతాయి. (2 సమూయేలు 17:8; సామెతలు 17:12; 28:15) తన ప్రతినిధిని తీవ్రంగా అవమానపరచి, అందు మూలంగా యెహోవానే అవమానపరచిన వారిపై దైవిక తీర్పును విధించుటకు దేవుడు వాటి నుపయోగించాడు.
షిలోహుకు చుట్టుప్రక్కలగల పర్వత ప్రాంతాలలో ఒక పిల్లవాడు అటువంటి కౄరజంతువుల బారినపడవచ్చుననే విషయాన్ని బట్టి గుడారంలో సేవచేయడానికి సమూయేలును అక్కడికి తెచ్చిన అతని తలిదండ్రుల విశ్వాసాన్ని మెచ్చుకోవడానికి అది మనకు సహాయం చేయాలి.
అంతకు పూర్వం మరొక సత్యారాధికుడు—న్యాయాధిపతియైన యెఫ్తా—అటువంటి విశ్వాసాన్ని, భక్తిని ప్రదర్శించాడు. ఆయన యొర్దానుకు తూర్పునగల పర్వతప్రాంత దేశమైన గిలాదులో నివసించేవాడు. శత్రువులైన అమ్మోనీయులకు యెహోవా వ్యతిరేకియైనందుకు ఉత్సాహంతో, యెఫ్తా తనను ఎదుర్కొనుటకు తన యింటినుండి మొదట వచ్చువారిని యెహోవాకు ప్రతిష్ఠిస్తానని ప్రమాణం చేసాడు. కన్య అయిన తన కుమార్తె అలా ఎదురువచ్చింది. కాబట్టి ఆయన తనకున్న ఒకే ఒక సంతానాన్ని షిలోహులోనున్న దేవుని ఆలయానికి తెచ్చాడు, కాగా ఆమె అక్కడే జీవించి అనేక సంవత్సరాలు నమ్మకంగా సేవచేసింది.—న్యాయాధిపతులు 11:30-40.
షిలోహులో సమూయేలు, యెఫ్తా కూతురు కనబరచిన నమ్మకమైన భక్తి అదే ప్రాంతంలో యెహోవా ప్రవక్తను అపహాస్యం చేసిన ఆ 42 మంది అపరాధుల ప్రతికూల మాదిరికి నిశ్చయంగా ఎంతో చక్కని వ్యత్యాసాన్ని కలిగియున్నది.—1 కొరింథీయులు 10:6, 11 పోల్చుము.
[అధస్సూచీలు]
a పెద్ద చిత్రం కొరకు, యెహోవాసాక్షుల 1992 క్యాలండరు చూడుము.
[8వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.
[9వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.
[9వ పేజీలోని చిత్రసౌజన్యం]
Safari Zoo, Ramat-Gan, Tel Aviv