సంకల్పముతో కూడిన విద్య
“జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునొందును.”—సామెతలు 9:9.
1. జ్ఞానం విషయంలో యెహోవా తన సేవకుల నుండి ఏమి అపేక్షిస్తున్నాడు?
యెహోవా “అనంత జ్ఞానియగు దేవుడు.” (1 సమూయేలు 2:3) ఆయన తన సేవకులను విద్యావంతులను చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులను గూర్చి సమకాలీన ప్రజలు యిలా అంటారని మోషే ప్రవచించాడు: “నిశ్చయముగా ఈ గొప్పజనము జ్ఞానవివేచనలుగల జనము.” (ద్వితీయోపదేశకాండము 4:6) అదేప్రకారం నిజ క్రైస్తవులు జ్ఞానవంతులై యుండాలి. వారు దేవుని వాక్యపు శ్రేష్ఠమైన విద్యార్థులై యుండాల్సిన అవసరముంది. అటువంటి పఠన సంకల్పాన్ని చూపిస్తూ, అపొస్తలుడైన పౌలు యిలా వ్రాశాడు: “మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టవలెనని . . . బతిమాలుచున్నాము.”—కొలొస్సయులు 1:9-12.
2. (ఎ) దేవుని గూర్చిన ఖచ్చితమైన జ్ఞానం సంపాదించుటకు ఏమి అవసరం? (బి) యెహోవాసాక్షుల పరిపాలక సభ ఈ విషయాన్ని ఎట్లు వివరించినది?
2 దేవుని గూర్చి, ఆయన సంకల్పములను గూర్చి, ఖచ్చితమైన జ్ఞానం సంపాదించాలనే దృష్టితోచేసే పఠనానికి మనకు కనీస విద్య అవసరం. అయితే దేవుని వాక్య సత్యాన్ని నేర్చుకున్న అనేకమంది ప్రజలు సరియైన విద్యనభ్యసించే అవకాశాలు స్వల్పంగా లేదా అసలే లేని దేశాలలో నివసిస్తున్నారు. వారు అననుకూల పరిస్థితిలో ఉన్నారు. ఈ సమస్య నధిగమించడానికి, ఇప్పటికి అనేక సంవత్సరాల నుండి యెహోవాసాక్షుల పరిపాలక సభ అవసరమున్న చోట సంఘాలలో అక్షరాభ్యాస తరగతులు నిర్వహించాలని ఉపదేశించింది. ముప్పైకి పైగా సంవత్సరాల క్రితం బ్రెజిల్ వార్తాపత్రికయగు డయారియో డి మోగీ “యెహోవాసాక్షులు నిరక్షరాస్యతకు వ్యతిరేకముగా పోరాడుచున్నారు” అనే శీర్షికను ప్రచురించింది. అది యిలా చెప్పింది: “ఇతరులకు చదువను వ్రాయను ఓపికగా బోధించుటకు . . . అర్హుడైన ఉపదేశకుడు నియమించబడతాడు. . . . దేవుని పరిచారకులుగా వారిపై ఒత్తిడితెచ్చే పరిస్థితులనుబట్టి, ప్రసంగాలివ్వడానికి వీలుగా ఆ విద్యార్థులు వారి భాషా పరిజ్ఞానాన్ని వృద్ధిచేసుకోవాలి.” ఆ విధంగా ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది ప్రజలు దేవుని వాక్యపు విద్యార్థులుగా తయారుకాగలిగారు. వారొక ఉన్నత సంకల్పాన్ని మదిలో ఉంచుకొని ఈ ప్రాథమిక విద్యను చేపట్టారు.
సమర్థవంతమైన పరిచారకులుగా ఉండుటకు నైపుణ్యతలు అవసరం
3, 4. (ఎ) నిజ క్రైస్తవులు విద్యయందు ఎందుకు శ్రద్ధ కలిగియున్నారు? (బి) ఇశ్రాయేలీయులలో పరిస్థితి ఏమైయుండెను, ఈనాడు మన సంఘాల్లోనే ఏ ప్రాథమిక విద్య అందించబడుతున్నది.
3 నిజ క్రైస్తవులు విద్యాభ్యాసమందు ఆసక్తి కలిగియున్నారు, తాము విద్యావంతులైయుండి ఆనందించుటకు కాదుగాని, యెహోవా యొక్క మరింత సమర్థవంతమైన సేవకులుగా ఉండుటకే. “మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; . . . నేను ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి” అనే ఆజ్ఞను క్రీస్తు క్రైస్తవులందరికి యిచ్చాడు. (మత్తయి 28:19, 20) ఇతరులకు బోధించుటకు మొదట వారు నేర్చుకొనవలెను, కాగా దీనికి మంచి పఠనా పద్ధతులు అవసరము. లేఖనములను జాగ్రత్తగా పరిశోధించు సామర్థ్యము వారికుండాలి. (అపొ. కార్యములు 17:11) వారికివ్వబడిన ఆజ్ఞను నెరవేర్చుటకు, అనర్గళముగా చదువగల్గు సామర్థ్యాన్ని వారు కలిగివుండాలి.—హబక్కూకు 2:2; 1 తిమోతి 4:13 చూడండి.
4 ముందు శీర్షికలో మనం గమనించినట్లు, ప్రాచీన ఇశ్రాయేలీయులలో పిల్లలతోసహా దాదాపు అందరికి చదువను వ్రాయను తెలుసని నమ్ముటకు మంచి కారణమున్నది. (న్యాయాధిపతులు 8:14; యెషయా 10:19) ఇంటింటికి సాక్ష్యమిస్తున్నప్పుడు క్రైస్తవులీనాడు విషయాల్ని చక్కగా వ్రాసుకొను అవసరమున్నది. వారు ఉత్తరాలు వ్రాస్తారు, కూటములలో ముఖ్యమైన విషయాలు వ్రాసుకుంటారు, వారి పఠించే సాహిత్యాలలో ప్రక్కన వ్యాఖ్యలు వ్రాసుకుంటారు. దీనియంతటికి స్పష్టమైన చేతివ్రాత అవసరం. క్రైస్తవ సంఘ రికార్డులు వ్రాయడానికి లెక్కల్లో కనీస జ్ఞానం అవసరం.
సరియైన పాఠశాల విద్యయొక్క ప్రయోజనాలు
5. (ఎ) “పాఠశాల” అనే పదం దేనినుండి వచ్చింది? (బి) యౌవనులు ఏ అవకాశం తీసుకోవాలి?
5 ఆసక్తికరమైన విషయమేమంటే, “పాఠశాల” అనే పదం గ్రీకు పదమగు స్కోలె నుండి వచ్చింది, దీనికి “తీరిక” లేదా నేర్చుకొనుట వంటి ఏదైన గంభీరమైన పనికి ఆ తీరిక సమయాన్ని ఉపయోగించుట అనే మూలార్థం ఉంది. ఆ తర్వాత అలా నేర్చుకొనే స్థలాన్ని ఆ పదంతో సూచించడం వాడుకలోకి వచ్చింది. ఒకప్పుడు గ్రీసులో, ఇంకా అనేక యితర దేశాల్లో కేవలం ఆధిక్యతగల వర్గమే నేర్చుకొనుటకు అటువంటి తీరికను కలిగియుండిరని ఇది సూచిస్తున్నది. శ్రామికులు సాధారణంగా అజ్ఞానులుగానే యుండిరి. ఈనాడు అనేక దేశాలలో పిల్లలకు, యౌవనులకు చదువుకోవడానికి సమయం ఇవ్వబడుతుంది. జ్ఞానము, సామర్థ్యమున్న యెహోవా సేవకులయ్యేందుకు యౌవనసాక్షులు నిశ్చయముగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.—ఎఫెసీయులు 5:15, 16.
6, 7. (ఎ) సరియైన పాఠశాల విద్యయొక్క కొన్ని ప్రయోజనాలేమి? (బి) మరో భాష నేర్చుకొనుట ఏయే విధాలుగా ఉపయోగకరము? (సి) నేడు పాఠశాల విద్య ముగించిన తరువాత అనేకమంది యౌవనుల పరిస్థితి ఎలావుంది?
6 చరిత్ర, భూగోళశాస్త్రము, సామాన్యశాస్త్రముల ప్రాథమిక జ్ఞానము యౌవనసాక్షులను సమతూకమైన పరిచారకులుగా చేస్తుంది. వారి పాఠశాల విద్య వారికి అనేకాంశములనే గాక నేర్చుకునే విధానాన్ని కూడ బోధిస్తుంది. నిజమైన క్రైస్తవులు పాఠశాల విద్యను ముగించిన తర్వాత నేర్చుకోవడాన్ని, పఠించడాన్ని మానివేయరు. అయితే వారి పఠనంద్వారా వారు పొందగల్గేది ఎక్కువగా ఎలా పఠించాలో అనే దానిని తెలుసుకొనుటపై ఆధారపడి ఉంటుంది. లౌకిక విద్య, సంఘ విద్య ఈ రెండును తమ ఆలోచనా సామర్థ్యములను వృద్ధిచేసికొనుటకు వారికి సహాయపడ గలవు. (సామెతలు 5:1, 2) వారు చదువునప్పుడు ఏది ప్రాముఖ్యమో, ఏది వ్రాసికొనవలెనో, ఏది కంఠస్థము చేయవలెనో బాగుగా వివేచింపగల్గుదురు.
7 ఉదాహరణకు, మరో భాష నేర్చుకొనుట యౌవనస్థుల మానసిక సామర్థ్యాన్ని పెంచుటయే గాకుండ యెహోవా సంస్థలో వారు మరింత ఉపయోగపడునట్లు చేస్తుంది. వాచ్‌టవర్ సొసైటియొక్క కొన్ని బ్రాంచి కార్యాలయాల్లో అనేకమంది యౌవన సహోదరులు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడగల్గడం, చదవ గల్గడం ఎంతో ప్రయోజనకరమని తెలుసుకున్నారు. అంతేకాదు, క్రైస్తవ పరిచారకులందరు తమ మాతృభాషలో స్పష్టంగా మాట్లాడుటకు కృషిచేయాలి. రాజ్యవర్తమానాన్ని స్పష్టంగా, వ్యాకరణ దోషం లేకుండా సరిగ్గా మాట్లాడాలి. ఈనాడు లోకంలో పాఠశాల విద్య అయిపోయిన తర్వాతకూడ అనేకమంది యౌవనులకు వ్రాయడానికి, మాట్లాడడానికి, అతి సులభమైన లెక్కల్ని సహితం చేయడానికి కష్టమౌతుందని; చరిత్రను గూర్చి, భూగోళశాస్త్రాన్ని గూర్చి వారు కేవలం కొద్దిపాటి జ్ఞానాన్ని మాత్రమే కలిగియున్నారని వాస్తవాలు చూపిస్తున్నవి.
తగినంత విద్య
8. లౌకిక విద్య మరియు తననుతాను పోషించుకోగల వ్యక్తి సామర్థ్యం అనే అంశంపై ఏ లేఖనాలు ప్రభావం చూపుతాయి?
8 కాబట్టి, లౌకిక విద్యయెడల క్రైస్తవ ఉద్దేశాన్ని గూర్చి ఇది ఆలోచించాల్సిన సమయమన్నట్లు కన్పిస్తున్నది. ఈ విషయంలో ఏ బైబిలు సూత్రాలు వర్తించును. మొదట, అనేక దేశాల్లో “కైసరుకు” సరియైన రీతిలో లోబడియుండుటకు క్రైస్తవ తలిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలకు పంపవలసి ఉంటుంది. (మార్కు 12:17; తీతు 3:1) యౌవన సాక్షులు తమ పాఠశాల విద్యలో వారు కొలొస్సయులు 3:23లో చెప్పబడిన దానిని గుర్తుంచుకొనవలెను. అక్కడిలా వుంది: “మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.” ఇందు యిమిడియున్న రెండవ సూత్రమేమనగా, వారు పూర్తికాల పయినీరు పరిచారకులైనను క్రైస్తవులు తమకాళ్లపై తాము నిలబడేవారై యుండాలి. (2 థెస్సలొనీకయులు 3:10-12) వివాహితుడైతే, పురుషుడు తన భార్యను, బహుశ పుట్టబోవు పిల్లలను సరిగా పోషించగల్గి, అవసరతలో ఉన్నవారికి కొంత సహాయం చేయగలిగి, స్థానికముగాను ప్రపంచ వ్యాప్తముగాను జరుగుచున్న ప్రకటన పనికి మద్దతునిచ్చేవాడై యుండగల్గాలి.—ఎఫెసీయులు 4:28; 1 తిమోతి 5:8.
9, 10. (ఎ) అనేక దేశాలలో ఏ ఆలోచనా ధోరణి ఉన్నట్లు కనబడుతుంది? (బి) సరిపడేంత జీతగానిగా ఉండడాన్ని ఒక పయినీరు పరిచారకుడు ఏమని ఆలోచించవచ్చును?
9 ఈ బైబిలు సూత్రాల్ని గౌరవించుటకు, క్రైస్తవ బాధ్యతలను తాను చేపట్టేందుకు ఒక క్రైస్తవ యౌవనునికి విద్య ఎంత అవసరం? ఇది దేశదేశానికి విభిన్నంగా ఉంటుంది. అయితే, తగిన జీతం సంపాదించుట కొరకు కొన్ని సంవత్సరాల క్రితమున్న దానికంటె ఇప్పుడు ఎక్కువ చదువుకోవడం అవసరమనే సాధారణ భావన అనేక దేశాల్లో ఎక్కువగా ఉన్నట్లు కన్పిస్తుంది. అనేక ప్రాంతాలలో ఆ దేశ చట్టం ప్రకారం కనీస విద్యనభ్యసించిన తర్వాత, ఆలాగే కొన్ని దేశాలలో మాధ్యమిక లేదా ఉన్నత విద్యనభ్యసించిన తర్వాత కూడ తగిన జీతం లభించే ఉద్యోగాలు దొరకడం కష్టంగా వుందని ప్రపంచంలోని వాచ్‌టవర్ సొసైటి వివిధ బ్రాంచి కార్యాలయాల నుండి వచ్చిన నివేదికలు సూచిస్తున్నవి.
10 “తగిన జీతం” అంటే అర్థమేమి? అది అధిక వేతనం దొరికే ఉద్యోగాల్ని సూచించదు. ఈ సందర్భంలో “తగిన” అంటే “సరిపడునంత, సంతృప్తికరమైన” అని వెబ్‌స్టర్స్ డిక్షనరీ నిర్వచిస్తున్నది. ఉదాహరణకు, సువార్త సేవచేయు పయినీర్ పరిచారకునిగా ఉండుటకు యిష్టపడు వారికి “సరిపడునంత” అనే మాట భావమేమి? అట్టివారు తమ సహోదరులకు లేదా తమ కుటుంబానికి “ఖర్చుతోకూడిన భారము” మోపకుండుటకు సాధారణంగా పార్ట్ టైం పని చేయాల్సి ఉంటుంది. (1 థెస్సలొనీకయులు 2:9) వారు సంపాదించేది తగినరీతిలో జీవించుటకు వారికి సరిపోతూ అదే సమయంలో వారి క్రైస్తవ పరిచర్యను నెరవేర్చుటకు కావల్సిన సమయాన్ని, బలాన్ని ఇస్తున్నట్లయిన, వారి జీతాలు “సరిపడునంతగా,” లేదా “సంతృప్తికరంగా” ఉన్నవని చెప్పవచ్చును.
11. కొంతమంది యౌవనులు ఎందుకు పయినీరు సేవను వదలుకున్నారు, ఏ ప్రశ్న ఉత్పన్నమైనది?
11 తరచు ఈనాడు ఎదుర్కొనే పరిస్థితి ఏమైయున్నది? కొన్ని దేశాలలో సదుద్దేశముగల యౌవనులు కనీస విద్యనభ్యసించిన తర్వాత పయినీర్లయ్యేందుకు పాఠశాలవిద్యకు స్వస్తి చెప్పారనే సమాచారమందినది. వారికి వృత్తిపరమైన లేదా లౌకిక అర్హతలేవి లేవు. తమ తలిదండ్రులు వారికి ఆర్థిక సహాయం చేయకపోతే వారు పార్ట్ టైం ఉద్యోగం చేయవలసి యుండిరి. వారిలో కొందరు జీవించడానికి సరిపడేంత డబ్బును సంపాదించడానికి ఎక్కువగంటలు పనిచేయాల్సిన ఉద్యోగాలు చేయడానికి ఒప్పుకోవలసివచ్చింది. వారు శరీరకంగా అలసిపోయి పయినీరు పరిచర్యను వదులుకొన్నారు. అలాంటి వారు ఆర్థికంగా నిలదొక్కుకొని తిరిగి పయినీరు సేవలోకి రావడానికి ఏంచేయవచ్చును?
విద్యను గూర్చిన సమతూకమైన దృష్టి
12. (ఎ) విద్య విషయంలో, తీవ్రమైన ఏ రెండు దృక్కోణాలను ఒక క్రైస్తవుడు విసర్జిస్తాడు? (బి) విద్య యెహోవాకు సమర్పించుకున్న సేవకులకు, వారి పిల్లలకు ఏ సంకల్పాన్ని నెరవేర్చాలి?
12 విద్యను గూర్చిన సమతూకమైన దృష్టి ఇందుకు సహాయపడ గలదు. లోకంలోని అనేకమంది యౌవనులకు విద్య హోదాకు చిహ్నంగా, సమాజంలో పైకెదగడానికి సహాయపడేదిగా, సౌభాగ్యవంతమైన, ఐశ్వర్యవంతమైన జీవన శైలికి కీలకమైనదిగా ఉంది. మరి కొందరికి, పాఠశాల విద్య సాధ్యమైనంత త్వరగా ముగించాల్సిన పనిగా ఉన్నది. ఈ రెండు దృక్పధాలలో ఏదియు నిజ క్రైస్తవులకు సరియైనది కాదు. కాబట్టి, “సమతూకమైన దృష్టి” అంటే ఏమిటి? కోరిన ఫలితం సంపాదించడానికి విద్యనొక మాధ్యమంగా క్రైస్తవులు దృష్టించాలి. ఈ అంత్యదినాలలో, సాధ్యమైనంత మేరకు సమర్థవంతంగా యెహోవాను సేవించాలనుట వారి సంకల్పము. తాము నివసించే దేశంలో కనీస లేదా ఉన్నత విద్య, పయినీర్లుగా తమ్మును పోషించుకొనుటకు చాలీచాలని జీతాన్నిచ్చే ఉద్యోగాలను పొందేందుకే అనుమతిస్తున్నట్లయితే, అప్పుడు వారు మరో అనుబంధ విద్యను లేదా శిక్షణను గూర్చి ఆలోచించాలి. ఇది ప్రత్యేకంగా పూర్తికాల సేవా గమ్యంతో చేసేదై యుంటుంది.
13. (ఎ) ఫిలిప్పీన్స్‌లోనున్న ఒక సహోదరి తన కుటుంబ బాధ్యతల్ని తీరుస్తూనే ఎట్లు తన పయినీరు సేవలో కొనసాగగల్గింది? (బి) ఏ హెచ్చరిక సమయానుసారమై యుంది?
13 కొంతమంది తాము పూర్తికాల సేవలో పాల్గొనునట్లు లేదా దానిని తిరిగి చేపట్టుటకు అవకాశాలిచ్చే శిక్షణా కోర్సులను తీసుకున్నారు. ఫిలిప్పీన్స్‌లోని ఒక సహోదరి తనే కుటుంబాన్ని పోషించాలి కాని తాను కూడ పయినీరు సేవచేయాలని కోరుకుంది. ఆ బ్రాంచి కార్యాలయం యిలా నివేదించింది: “ప్రభుత్వాధికార అక్కౌంటెంటుగా అర్హురాలగుటకై అదనంగా విద్యనభ్యసించినందున ఆమె దీన్ని చేయగల్గింది.” అదే బ్రాంచి కార్యాలయ నివేదిక యిలాచెప్పింది: “విద్యనభ్యసిస్తూ అదేసమయంలో పయినీరు సేవచేయుటకు పట్టిక వేసుకొనిన అనేకమందిని మేము కలిగియున్నాము. లోక సంబంధమైన ఉద్యోగాలకై అధికంగా ఆశపడకుండా ఉండి మంచి విద్యాసక్తి గలవారైతే సాధారణంగా మంచి ప్రచారకులౌతారు.” ధ్యానించడానికి ఆ చివరి మాట మనకు మంచి కారణమివ్వాలి. అదనపు పాఠశాల విద్య అవసరమని కన్పించే దేశాల్లో, అది దాని సంకల్పాన్ని మరువకూడదు లేదా ఐశ్వర్యాసక్తిగల గమ్యంగా మారకూడదు.
14, 15. (ఎ) విద్య విషయంలో ఖచ్చితమైన నియమాలు ఎందుకు చేయకూడదు? (బి) బాధ్యతగల కొంతమంది సహోదరులు ఎటువంటి లౌకిక విద్యను పొందారు, అయితే దీనిని ఏది పూరించింది?
14 పాఠశాల విద్య పూర్తయ్యేప్పటికి ఏదోక వృత్తి లేదా పనికి ఒక క్రైస్తవ యౌవనుని సంసిద్ధం చేయగల వృత్తిపరమైన శిక్షణను కొన్ని దేశాలలో, మాధ్యమిక పాఠశాలలు అందజేస్తున్నవి. అలాకాకపోయినను, కొన్ని దేశాలలో కేవలం ప్రాథమిక విద్యగల ఔత్సాహికులైన యౌవనులు పయినీర్ సేవచేయుటకు తమకు సరిపడే సంపాదనిచ్చే పార్ట్ టైం పనులు చేస్తున్నారు. కావున అదనపు విద్యకు లేదా దానికి వ్యతిరేకంగా ఖచ్చితమైన నియమాలంటూ ఏమీ చేయకూడదు.
15 సొసైటి కేంద్ర కార్యాలయమందు, లేదా దాని ఒకానొక బ్రాంచి కార్యాలయమందు ప్రయాణ కాపరులుగా బాధ్యతాయుతమైన స్థానాలలో ప్రస్తుతం సేవచేస్తున్న అనేకులు కేవలం ప్రాథమిక విద్య మాత్రమే కలిగియున్నారు. వారు నమ్మకమైన పయినీర్లుగా ఉండి, నేర్చుకోవడాన్ని, శిక్షణ పొందడాన్ని వారెన్నడు ఆపుజేయలేదు, కావున వారికి గొప్ప బాధ్యతలివ్వబడినవి. వారెంచుకున్న దాని విషయంలో వారు చింతించుట లేదు. మరోపక్షాన, విశ్వవిద్యాలయంలో చదవాలని ఎంపిక చేసికున్న తమ సమకాలికులలో కొందరు విశ్వాసాన్ని కూలద్రోసే తత్వాలకు, “ఈ లోక జ్ఞానము” నకు లొంగిపోయి, ఆత్మీయత విషయంలో పడిపోయారు.—1 కొరింథీయులు 1:19-21; 3:19, 20; కొలొస్సయులు 2:8.
మూల్యాన్ని లెక్కించుట
16. (ఎ) ఇంకా విద్య అవసరమా అనే విషయాన్ని ఎవరు తీర్మానిస్తారు, దేనిని అన్నింటికంటె ఉన్నతంగా మనస్సులో ఉంచుకోవాలి? (బి) దేనిని పరిగణలోనికి తీసుకోవాలి?
16 ఒక యౌవన క్రైస్తవుడు మరింత చదువుకోవాలా లేదా శిక్షణ పొందాలా వద్దా అనేది ఎవరు తీర్మానిస్తారు? ఇక్కడ బైబిలు సూత్రమగు శిరసత్వము ముఖ్యపాత్ర వహిస్తుంది. (1 కొరింథీయులు 11:3; ఎఫెసీయులు 6:1) దీని ఆధారంగా ఎంచుకునే వృత్తి లేదా ఉద్యోగానికి అనువైన విద్యను తమ పిల్లలకు యిప్పించాలని తలిదండ్రులు నిశ్చయంగా కోరుకోవాలి. అనేక దేశాలలో విద్యకు, వృత్తికి సంబంధించిన విషయాలను మాధ్యమిక విద్యాభ్యాస కాలంలోనే ఎంచుకోవాల్సి ఉంటుంది. మదిలో రాజ్యసక్తులను ఉన్నతంగా వుంచుకొని జ్ఞానయుక్తమైన ఎంపిక చేసుకొనుటలో క్రైస్తవ తలిదండ్రులు, యౌవనులు యెహోవా నడిపింపును వెదకాల్సిన సమయమదే. వివేకవంతులైన తలిదండ్రులు వీటిని పరిగణలోకి తీసుకుంటారు. నమ్మకంగా చేసే ఏ పనినైనను శ్రామికునిగానైనను, అధికార ఉద్యోగిగానైనను అది గౌరవప్రదమైనదే. కార్యాలయంలో పనిచేయడాన్ని ప్రస్తుతించి, చేతులతో కష్టించి పనిచేయడాన్ని లోకం చిన్నచూపు చూడవచ్చు, అయితే బైబిలు నిశ్చయంగా అలా చేయడం లేదు. (అపొ. కార్యములు 18:3) కాబట్టి, క్రైస్తవ తలిదండ్రులు, యౌవనులు నేడు లాభనష్టాలను జాగ్రత్తగా, ప్రార్థనాపూర్వకంగా పరిశీలించిన పిదప, మాధ్యమిక విద్యానంతరం పై చదువుకు వెళ్లాలా వద్దా అని తీర్మానించుకున్నప్పుడు సంఘమందలి ఇతరులు వారిని విమర్శించకూడదు.
17. కొంతమంది తలిదండ్రులు తమ పిల్లల కొరకెట్టి ఎంపిక చేస్తారు?
17 ఉన్నత విద్య తర్వాత తమ పిల్లలను ఇంకా చదివించాలని క్రైస్తవ తలిదండ్రులు బాధ్యతాయుతంగా తీర్మానించుకుంటే అది వారి స్వంత విషయం. ఎంచుకున్న వృత్తి లేదా ఉద్యోగాన్ని బట్టి ఆ విద్యాభ్యాస విధానాలు మారుతుంటాయి. ఆర్థిక కారణాలను బట్టి మరియు సాధ్యమైనంత త్వరగా పూర్తికాల సేవలో పాల్గొనేటట్లు చేయుటకు అనేకమంది క్రైస్తవ తలిదండ్రులు తమ పిల్లలకు కొద్దికాల వృత్తిశిక్షణా విద్య లేదా సాంకేతిక శిక్షణా పాఠశాలకు పంపుటకు ఎంచుకున్నారు. యెహోవాకు ఎల్లకాలం పూర్ణ జీవిత సేవచేయాలనే ధ్యేయంతో, కొన్ని సందర్భాలలో యౌవనులు ఏదొక ఉపాధిశిక్షణ పొందాల్సి వుంటుంది.
18. అదనపు కోర్సులు తీసుకున్నట్లయితే, దేనిని మనస్సులో ఉంచుకోవాలి?
18 అదనపు విద్య చేపట్టినట్లయిన, దాని ఉద్దేశం నిశ్చయంగా పండితులుగా విరాజిల్లాలనో లేదా ప్రతిష్ఠాకరమైన లౌకిక ఉద్యోగమేదో చేయాలనో ఉండకూడదు. ఆ కోర్సులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. పెద్ద చదువుల వలన కలిగే ప్రమాదాలను ఈ పత్రిక నొక్కితెల్పింది, అది సమర్థనీయమే ఎందుకంటే పెద్ద చదువులు బైబిలు “హితబోధను” వ్యతిరేకిస్తాయి. (తీతు 2:1; 1 తిమోతి 6:20, 21) అంతేకాదు, 1960వ దశాబ్దం నుండి అత్యున్నత విద్యా పాఠశాలలు అక్రమాలకు, లైంగిక దుర్నీతికి అనుకూల స్థానాలైనవి. అటువంటి పర్యావరణంలో ప్రవేశించరాదని “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు” బహుగా నిరుత్సాహపరచెను. (మత్తయి 24:12, 45) అయితే అంగీకరించాల్సిన విషయమేమంటే, ఈ రోజుల్లో అటువంటి ప్రమాదాలనే ఉన్నత పాఠశాలల్లో, సాంకేతిక విద్యా కళాశాలల్లో, చివరకు ఉద్యోగస్థలాల్లో యౌవనులు ఎదుర్కొంటున్నారు.—1 యోహాను 5:19.a
19. (ఎ) అనుబంధ విద్యనభ్యసించుటకు తీర్మానించుకొనువారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? (బి) తమ విద్యను కొందరెట్లు ప్రయోజనార్థకముగా ఉపయోగించారు?
19 ఒక యెహోవాసాక్షి అనుబంధ విద్యనభ్యసించాలని తీర్మానిస్తే ఒక యౌవన సాక్షి అలాచేయుట మంచిదే. ఒకవేళ సాధ్యమైతే తన సాధారణ పఠన అలవాట్లను కాపాడుకొనుటకు, కూటములకు, ప్రకటించే కార్యక్రమానికి క్రమంగా హాజరయ్యేందుకు వీలగునట్లు ఇంటివద్ద ఉండే అలా చేయుట మంచిది. ముందుగా బైబిలు సూత్రాల విషయంలో కూడ సరియైన స్థానం తీసుకోవాలి. చెరలో ఉన్నప్పుడు దానియేలు అతని ముగ్గురు సహవాసులు బబులోను ఉన్నత విద్యనభ్యసించే బాధ్యత కలిగియున్ననూ, వారు నిలకడగా తమ యథార్థతను కాపాడుకున్నారని మనం గుర్తుంచుకోవాలి. (దానియేలు 1వ అధ్యాయం) ఆత్మీయాసక్తులను ముందుంచుతూ, అనేక దేశాలలోని యౌవన సాక్షులు తమ ప్రాథమిక వృత్తియగు పయినీరు సేవకు సరిపడ మద్దతునిచ్చేందుకు అక్కౌంటెంట్లుగా, వృత్తిపనివారుగా, ఉపాధ్యాయులుగా, అనువాదకులుగా, భావంచెప్పేవారిగా లేదా ఇతర పనులలో పార్ట్ టైం పనికి వారిని సంసిద్ధులుగా చేసే కోర్సులు తీసుకున్నారు. (మత్తయి 6:33) ఈ యౌవనులలో అనేకమంది ఆ తర్వాత ప్రయాణ కాపరులుగా లేదా బేతేలు స్వచ్ఛంద సేవకులుగా తయారయ్యారు.
ఐక్యపర్చబడిన, విద్యావంతులైన ప్రజలు
20. లోకంలోవుండే ఏ తారతమ్యానికి యెహోవా ప్రజల మధ్య తావు లేదు?
20 యెహోవా ప్రజలలో ఒక వ్యక్తి అధికార ఉద్యోగియైనను, కార్మికుడైనను, కర్షకుడైనను లేదా యితర సేవలుచేసే వాడైనను, అందరూ దేవుని వాక్యపు మంచి విద్యార్థులై యుండి, సమర్థులైన ఉపదేశకులై యుండాలి. చదువుటయందు, పఠించుటయందు, బోధించుటయందు సాధించిన నైపుణ్యత లోకంలోవుండే కార్మికుల, కార్యాలయ ఉద్యోగుల మధ్యవుండే తారతమ్యాన్ని పారద్రోలాలి. దీని ఫలితంగా, అత్యంత ప్రాముఖ్యమైన, అందరి నుండి కోరబడే ఆత్మీయ లక్షణాలతో బేతేలు గృహాలలో, వాచ్‌టవర్ సొసైటి నిర్మాణ స్థలాల్లో పనిచేసే స్వచ్ఛంద పనివారిలో స్పష్టంగా కన్పించే ఐక్యత, పరస్పర గౌరవం లభిస్తుంది. ఇక్కడ, అందరు ఒకరియెడల ఒకరు ప్రశంసాపూర్వకమైన ప్రేమను కనబరుస్తూ, అనుభవంగల కార్యాలయ పనివారు నైపుణ్యతగల శ్రామికులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు.—యోహాను 13:34, 35; ఫిలిప్పీయులు 2:1-4.
21. యౌవన క్రైస్తవుల ధ్యేయమేమై యుండాలి?
21 తలిదండ్రులారా, నూతన ప్రపంచ సమాజంలో ఉపయుక్తమగు సభ్యులుగా తయారయ్యే గమ్యంవైపు మీ పిల్లలను నడిపించండి! క్రైస్తవ యౌవనులారా, యెహోవాను సేవించుటలో మీ ఆధిక్యతలను మరియెక్కువగా చేపట్టుటకు సంసిద్ధులయ్యేందుకు విద్య కొరకైన మీ అవకాశాలను ఉపయోగించండి! ఉపదేశింపబడిన వారిగా మీరందరు ఇప్పుడును, శాశ్వతముగాను దేవుడు వాగ్దానం చేసిన “క్రొత్త భూమియగు” దైవపరిపాలనా సమాజపు సర్వసన్నద్ధులైన సభ్యులుగా నిరూపించుకొందురు గాక.—2 పేతురు 3:13; యెషయా 50:4; 54:13; 1 కొరింథీయులు 2:13.
[అధస్సూచీలు]
a ది వాచ్‌టవర్ సెప్టెంబరు 1, 1975, పుటలు 542-4 కూడా చూడుము.
మీ జ్ఞాపకశక్తిని పరీక్షించుకోండి
◻ నిజ క్రైస్తవులెందుకు విద్యయందు శ్రద్ధ కలిగియున్నారు?
◻ క్రైస్తవులు ఎటువంటి తీవ్రమైన దృక్కోణాలను విసర్జించాలి?
◻ అదనపు విద్యయొక్క ఏ ప్రమాదాల్ని పరిగణలోనికి తీసుకోవాలి, ఏ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి?
◻ యెహోవా ప్రజల మధ్య లోకంలోవుండే ఏ తారతమ్యానికి తావు లేదు?
[16వ పేజీలోని చిత్రం]
పట్టుదలతో పఠించుట ద్వారా, యౌవన క్రైస్తవులు నూతన ప్రపంచ సమాజంలో ఉపయుక్తమగు సభ్యులుగా తయారు కాగలరు
[19వ పేజీలోని చిత్రం]
ఒకవేళ అదనపు విద్య ఎంపిక చేసికొంటే, అది యెహోవాను మరి శ్రేష్ఠముగా సేవించు కోరికచే పురికొల్పబడునదై యుండాలి