పత్రికా మార్గం ద్వారా ఆసక్తిని పెంపొందించండి
1. ఆసక్తిని పెంపొందించడానికి మనం పత్రికా మార్గాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు?
1 పరిచర్యలో మనం కలుసుకొనే చాలామంది మనలను ఆహ్వానించి, మన సాహిత్యాన్ని సంతోషంగా స్వీకరిస్తారు, కానీ క్రమ బైబిలు అధ్యయనాన్ని అంగీకరించేందుకు సంకోచిస్తారు. అలాంటి వారి ఆసక్తిని పెంపొందించే ఒక మార్గం, పత్రికా మార్గం. మీరు పత్రికలను అందించినప్పుడు, వ్యక్తి పేరు, చిరునామా, వారిని కలిసిన తేదీ, వారు తీసుకున్న సంచికలు వంటి వివరాలను వ్రాసుకోండి, చర్చించిన లేఖనమే కాక ఆ వ్యక్తికి ఆసక్తికరమని సూచించగలిగే ఏదైనా విషయాన్ని మీరు గమనిస్తే దానిని కూడా వ్రాసుకోండి. కొత్త పత్రిక వచ్చిన ప్రతీసారి, దానిలో మీ పత్రికా మార్గంలోని వారిని ఆకట్టుకొనే అంశాల కోసం చూసి, మీరు వారిని కలుసుకున్నప్పుడు ఆ అంశాలను నొక్కి చెప్పండి. (1 కొరిం. 9:19-23) తగినకాలంలో, మన పత్రికల్లో చదివిన ఏదో ఒక విషయం వారి ఆసక్తిని రేకెత్తింపజేసి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనే కోరిక వారిలో ఏర్పడవచ్చు.
2. ప్రజలు యెహోవాను వెదకడం నేడు ఎందుకు అత్యవసరం, వారికి సహాయం చేయడానికి మనం ఇంకా ఏమి చేయవచ్చు?
2 అయినా, వారిలో చాలామంది స్వయంగా పత్రికలు చదవడం ద్వారానే యెహోవా సేవకులు కాలేరని మనం గుర్తిస్తాం. ప్రజలు యెహోవాను వెదకడం నేడు అత్యవసరం కాబట్టి వారికి సహాయం చేయడానికి మనం ఇంకా ఏమి చేయవచ్చు? (జెఫ. 2:2, 3; ప్రక. 14:6, 7) మనం పత్రికలను అందించే ప్రతీసారి జాగ్రత్తగా ఎన్నుకున్న ఒక లేఖనాన్ని వారికి చూపడం ద్వారా మనం వారి ఆసక్తిని పెంపొందించవచ్చు.
3. (ఎ) ఒకే ఒక లేఖనాన్ని క్రమంగా చర్చించడానికి మనం ఎలా సిద్ధపడవచ్చు? (బి) మీ క్షేత్రంలోని వారిని ఎక్కువగా కలవరపరుస్తున్న అంశాలు ఏవి?
3 ఒకే లేఖనాన్ని చర్చించడం: మీ పత్రికా మార్గంలో ఉన్నవారి గురించి ఆలోచించి ప్రతీవారి నిర్దిష్ట అవసరాలకు తగిన ఒకే ఒక లేఖనాన్ని క్రమంగా చర్చించడానికి సిద్ధపడండి. (ఫిలి. 2:4) ఉదాహరణకు, ప్రియమైనవారు ఎవరైనా ఇటీవలే మరణించినట్లయితే, వారితో మరణించినవారి స్థితిని గురించీ, పునరుత్థానపు నిరీక్షణ గురించీ బైబిలు చెబుతున్న వాటిని చర్చించేందుకు మీరు అనేక పునర్దర్శనాలు చేయవచ్చు. అలాంటి ఒకే ఒక లేఖనంతో చేసే చర్చలకు సిద్ధపడేందుకు, తర్కించండి (ఆంగ్లం) పుస్తకంలో “డెత్” (మరణం) “రిసరక్షన్” (పునరుత్థానం) అనే ప్రధాన అంశాల కింద ఉన్న సమాచారాన్ని ఉపయోగించవచ్చు. ఆ అంశాలతో సంబంధమున్న అనారోగ్యం, వృద్ధాప్యం, మరణం పూర్తిగా ఎలా తుడిచివేయబడతాయి వంటి అంశాలు సహజంగానే తర్వాత చర్చించడానికి వీలవుతుంది. ఒక వ్యక్తిలో ఆసక్తిని రేకెత్తించే అంశాలను కనుగొని, బైబిలు ఆ అంశం గురించి ఏమి చెబుతుందో క్రమంగా ఆయనకు చూపించడాన్ని లక్ష్యంగా ఉంచుకోవాలి.
4. మనం లేఖనాలను ఉపయోగిస్తున్నప్పుడు ఇతరులు వాటిని అర్థం చేసుకోవడానికి సహాయం చేయడం ఎందుకు ప్రాముఖ్యం, వారికి మనం ఎలా సహాయం చేయవచ్చు?
4 అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి: సాధారణంగా అలాంటి చర్చలను సరళంగా, క్లుప్తంగా ఉంచడం శ్రేష్ఠమైనదే అయినా కేవలం ఎన్నుకున్న లేఖనాన్ని చదవడం కన్నా ఇంకా ఎక్కువే చేయాలి. సువార్త విషయంలో ప్రజల మనస్సులకు సాతాను గ్రుడ్డితనం కలుగజేశాడు. (2 కొరిం. 4:3, 4) బైబిలుతో పరిచయమున్న వారికి కూడా దానిని అర్థం చేసుకొనేందుకు సహాయం అవసరం. (అపొ. 8:30, 31) కాబట్టి దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో మీరు ప్రసంగిస్తున్నప్పుడు ఎలాగైతే లేఖనాన్ని వివరించేందుకు, విశదీకరించేందుకు సమయం తీసుకుంటారో, అలాగే లేఖనాన్ని వివరించి, విశదీకరించేందుకు సమయం తీసుకోండి. (అపొ. 17:2) ఆ వ్యక్తి తన జీవితంలో దేవుని వాక్యానికి ఉన్న ఆచరణాత్మక విలువను గ్రహించేలా చూడండి.
5. ఒక పత్రికా మార్గం బైబిలు అధ్యయనంగా ఎలా మారవచ్చు?
5 ఆ వ్యక్తి నేర్చుకుంటున్నవాటిని ఇష్టపడుతున్నట్లయితే ప్రతీ సందర్శనంలో జరిగే చర్చల్లో క్రమేణా రెండు మూడు లేఖనాలను చేర్చండి. దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్ను గానీ జ్ఞానము పుస్తకాన్ని గానీ ప్రతిపాదించే అవకాశం కోసం ఎదురుచూడండి. ఆ విధంగా పత్రికా మార్గం కొంతకాలానికి బైబిలు అధ్యయనంగా మారవచ్చు.