మ్యాగజైన్ రూట్లలో “రాజ్య విత్తనాలను విత్తడం”
1 సింగ్ ప్రెయిజెస్ టు జెహోవాలో పాట నెం. 133 యొక్క శీర్షిక “రాజ్య విత్తనాలను విత్తడం.” శిష్యులను చేసే పనిని విత్తనాలను విత్తడంతో పోల్చిన యేసు ఉపమానం పై ఆ పాట ఆధారపడి ఉంది. (మత్త. 13:4-8, 19-23) ఆ పాట లోని ఒక వాక్యము ఇలా ఉంది: “మంచి నేలపై మీ విత్తనాలు ఎన్ని పడతాయన్నది/చాలా వరకు మీ మీదనే ఆధారపడి ఉంటుంది.” పరిచర్యలో మనం ప్రభావవంతంగా ఉండడాన్ని ఎలా అభివృద్ధి చేసుకోగలము? మ్యాగజైన్ రూట్ ఏర్పరుచుకుని దాన్ని కొనసాగించడం ఒక మార్గం.
2 మ్యాగజైన్ రూట్ ద్వారా చాలా లక్ష్యాలు సాధించవచ్చు. (1) క్రమంగా రెండువారాలకు ఒకసారి దర్శించడం వల్ల ఆసక్తి గల వ్యక్తితో స్నేహ పూర్వక సంబంధాలను ఏర్పరచుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. (2) కావలికోట మరియు తేజరిల్లు!లలో ఉన్న ప్రాణాన్ని రక్షించే సమాచారాన్ని ఆ వ్యక్తికి అందిస్తూ ఉంటారు. (3) మీ సంభాషణ ద్వారా ఆ వ్యక్తి లేఖన సత్యాలను అపేక్షించులాగున మీరు సహాయపడవచ్చు, అది బైబిలు పఠనానికి నడిపిస్తుంది.—1 పేతు. 2:2.
3 మ్యాగజైన్ రూట్ ప్రారంభించడమెలా: ఎవరైనా ఎప్పుడైనా ఆసక్తి కనపర్చినప్పుడు ప్రతి సంచికలోనూ వచ్చే విశేషమైన శీర్షికలను వివరించి ప్రతి రెండు వారాలకు ఒకసారి వాటిని అందించేందుకు సంతోషిస్తున్నానని వారికి తెలియజేయవచ్చు. అక్కడ నుండి విడిచి వచ్చిన తర్వాత, ఆ వ్యక్తి పేరు, చిరునామా, తేదీ, మీరు అందించిన పత్రిక తేదీలు, మీరు వివరించిన శీర్షికలు, ఆ వ్యక్తికి ఏ విషయాల్లో ఆసక్తి ఉంది వంటి వివరాలను వ్రాసిపెట్టుకోండి.
4 చాలా కొద్దిమందితో మీరు మ్యాగజైన్ రూట్ ప్రారంభించవచ్చు. అటుతర్వాత మీ మ్యాగజైన్ రూట్లో మీరు పత్రికలు అందించిన వారిని కూడా చేర్చుకోవచ్చు. ఆ విధంగా దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. మీ మ్యాగజైన్ రూట్ అభివృద్ధి చెందే కొలది మీ ప్రాంతాన్ని బట్టి దాన్ని సంస్థీకరించుకోండి. అలాగయితే మీకు దాన్ని కవర్ చేయడం సులభంగా ఉంటుంది. మీరు సందర్శించిన ప్రతిసారీ ఏ పత్రికలు ఎప్పుడు అందించారు అనే వివరణలను జాగ్రత్తగా వ్రాసుకోవాలి. మీ సంభాషణలను గూర్చీ, అలాగే తర్వాతి సందర్శనంలో ఆ వ్యక్తికి సత్యము ఎడల ఆసక్తిని ఎలా పెంపొందించవచ్చో కూడా వ్రాసుకోండి.
5 వ్యాపార మరియు వృత్తిపరమైన ప్రజలను చేర్చడం: దుకాణదారులు, ప్రొఫెషనల్స్ మన పత్రికలను క్రమంగా తీసుకోవచ్చని అనుభవం చూపుతుంది. ఒక సంఘపెద్ద ఒక మేయరుకు కూడా మ్యాగజైన్ రూట్లో పత్రికలు అందిస్తున్నాడు. పది సంవత్సరాలు వరుసగా పత్రికలు తీసుకెళ్లి ఇచ్చిన తర్వాత, 80 సంవత్సరాల వయస్సు గల ఒక ఇంటి నిర్మాణ సామాగ్రి కంపెనీ ఓనర్‌తో ఒక పబ్లిషర్ స్టడీ చేయడం ప్రారంభించాడు!
6 ఒక పయినీరు సహోదరి ఒక దుకాణానికి వెళ్లి తనను అంతగా ఆహ్వానించని ఒక జంటను కలుసుకుంది. ఏమైనప్పటికి వారు పత్రికలు అంగీకరించారు గనుక, ఆ జంటను తన మ్యాగజైన్ రూట్లో కలుపుకోవాలని నిర్ణయించుకుంది. కొంతకాలానికి ఆ సహోదరి వారి దగ్గరికి వెళ్లడం మానేయాలని నిర్ణయించుకుంది, ఎందుకంటే, వారు స్నేహపూర్వకంగాలేరు, వారి ఉద్దేశాన్ని అడుగుతూ వేసే ప్రశ్నలకు కూడా సరియైన సమాధానాలు ఇచ్చేవారు కాదు. కానీ ఆ సహోదరి ఈవిషయాన్ని గూర్చి ప్రార్థించి చివరికి నిరంతరము జీవించగలరు పుస్తకాన్ని ఆ జంటకు అందించింది. దాన్ని చదివిన తర్వాత, “చివరికి నేను సత్యాన్ని కనుగొన్నాను!” అని భార్య ఆశ్చర్యాన్ని వ్యక్తపర్చింది. బైబిలు పఠనం ప్రారంభించబడింది, ఆ తర్వాత ఆ జంట బాప్తిస్మం తీసుకున్నారు. పయినీర్ పట్టుదల మంచి ఫలితాలను సాధించేలా చేసింది.
7 పునర్దర్శనాలను చేయడం: మీరు ఒక పత్రిక పొందినప్పుడు ప్రతి శీర్షికను చదవండి. మీ మ్యాగజైన్ రూట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నచ్చే విషయాలేవో చూడండి. మీరు తిరిగి వెళ్ళినప్పుడు, “నేను ఈ శీర్షిక చదువుతున్నప్పుడు ఇది మీకెంతో ఆసక్తికరంగా ఉంటుందని తలంచాను” అని మీరు చెప్పవచ్చు. అన్ని వయసుల ప్రచారకులు మ్యాగజైన్ రూట్ కలిగివుండడం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు. చిన్న పిల్లలు కూడా ఇలా చెప్పవచ్చు: “నేను మిమ్మల్ని మరలా కలిసినందుకు సంతోషిస్తున్నాను. కావలికోట, తేజరిల్లు!ల క్రొత్త ప్రతులు వచ్చాయి. . . . అనే ఈ శీర్షిక మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను.”
8 “మా తదుపరి సంచికలో” అన్న పేరు గల బాక్సు చూపించి వారిలో రాబోయే శీర్షికల ఎడల ఆసక్తిని రేపవచ్చు. కొన్ని శీర్షికలు భాగాలుగా వస్తున్నప్పుడు, తదుపరి సంచికల్లో కూడా వచ్చే ఏ భాగాలను తప్పిపోకుండా చదవాలని ప్రోత్సహించండి. మీ మ్యాగజైన్ రూట్లో ఉన్న వారికి మీరు పత్రిక అందజేస్తున్న ప్రతిసారీ దాన్ని పునర్దర్శనంగా లెక్కించవచ్చని మర్చిపోకూడదు. అన్నింటికంటే ప్రాముఖ్యంగా, ఈ పునర్దర్శనాలను గృహ బైబిలు పఠనాలుగా మలచడమే మన లక్ష్యమని గుర్తుంచుకోండి.
9 మీ మ్యాగజైన్ రూట్లో ఉన్న ప్రజలను క్రమంగా దర్శించండి: మీకు వీలుగానున్న ఏ సమయంలోనైనా మీ మ్యాగజైన్ రూట్లో ఉన్నవారిని కలువవచ్చు—అది సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయంగాని, కాస్త ఎండ తగ్గిన తర్వాతగాని, చీకటి పడకముందుగాని కావచ్చు, లేకపోతే శని ఆదివారాల్లో ఇంటింటి పరిచర్య చేసిన తర్వాతగాని చేయవచ్చు. మీరు అనారోగ్యంగా ఉండడం వల్లనో, లేక సెలవులకు వెళ్లినప్పుడో, మీరు మీ మ్యాగజైన్ రూట్లో ఉన్న వారిని కలవలేకపోవచ్చు. ఆ సమయంలో మీ ఇంటిలోనున్న వేరొక పబ్లిషర్ని గానీ, సంఘంలో ఉన్న పబ్లిషర్ని గానీ ఆ పత్రికలు అందజేయమని కోరండి. ఈ విధంగా చేయడం ద్వారా, మీ మ్యాగజైన్ రూట్లో ఉన్న వారు పత్రికలను సమయానికి పొందుతారు.
10 రాజ్య విత్తనాలను విత్తే ఒక మార్గమేమిటంటే కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలను క్రమంగా మీ మ్యాగజైన్ రూట్లో ఉన్న వారికి అందించడమే. మీరు వారికి లేఖన సత్యాలను బోధిస్తుండగా, వారు రాజ్య సందేశాన్ని గ్రహించవచ్చు. చివరికి మీతో పాటు రాజ్య ఫలాలను ఫలించగలరు.—మత్త. 13:8, 23.