పత్రికా మార్గంతో బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడం . . .
1. పత్రికా మార్గం ఏర్పాటుచేసుకోమని యెహోవా సంస్థ చాలాకాలంగా ఎందుకు ప్రోత్సహిస్తోంది?
1 మనతో బైబిలు అధ్యయనం చేయడానికి చాలామంది ఆసక్తి చూపించరు, కానీ మన ప్రచురణలు చదవడానికి మాత్రం ఇష్టపడతారు. అందుకే, అలాంటివాళ్లతో పత్రికా మార్గం ఏర్పాటుచేసుకోమని యెహోవా సంస్థ ఎప్పటినుండో మనల్ని ప్రోత్సహిస్తోంది. చాలా సందర్భాల్లో, మన పత్రికలు చదివే అలవాటు ఉన్నవాళ్లు దేవుని వాక్యంలోని విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటారు. (1 పేతు. 2:1-3) వాళ్లు చదివే ఏదోక విషయం వాళ్ల హృదయాన్ని తాకడం వల్ల కొంతకాలానికి వాళ్లు బైబిలు అధ్యయనానికి అంగీకరించవచ్చు.
2. పత్రికా మార్గంలో మీరు కలిసే వాళ్ల ఆసక్తిని ఎలా పెంచవచ్చు?
2 సత్యపు విత్తనాలకు “నీళ్లు” పోయండి: ఇంటివాళ్లకు ఊరకే పత్రికలు ఇచ్చి వెళ్లిపోయే బదులు, సంభాషణ మొదలుపెట్టి వాళ్లతో అనుబంధం ఏర్పర్చుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల వాళ్ల పరిస్థితుల్ని, ఇష్టాయిష్టాల్ని, నమ్మకాల్ని తెలుసుకోగలుగుతారు; వాళ్లను అర్థంచేసుకొని మాట్లాడగలుగుతారు. (సామె. 16:23) వాళ్లను కలిసే ప్రతీసారి ముందుగానే సిద్ధపడండి. వీలైతే, మీరిచ్చే పత్రికల్లోని ఒకానొక అంశాన్ని గానీ, లేఖనాన్ని గానీ నొక్కి చెప్పి వాళ్ల హృదయంలోని సత్యపు విత్తనాలకు నీళ్లు పోయండి. (1 కొరిం. 3:6) వాళ్లను కలిసిన ప్రతీసారి తేదీ, ఇచ్చిన ప్రచురణలు, చర్చించిన అంశం లేదా లేఖనం వంటి వివరాలు రాసి పెట్టుకోండి.
3. మనం పత్రికా మార్గం ఏర్పాటు చేసుకున్న వాళ్లను ఎంత తరచుగా కలవాలి?
3 ఎంత తరచుగా కలవాలి? మీరు నెలకు ఒకసారి లేదా కొత్త పత్రికలను అందుకోగానే, పత్రికా మార్గంలో కలిసే వాళ్లకు వాటిని ఇవ్వాలి. ఒకవేళ మీ పరిస్థితులు అనుకూలిస్తే, ఇంటివాళ్లకు ఎక్కువ ఆసక్తి ఉంటే వాళ్లను ఇంకా తరచుగా కలవవచ్చు. పత్రికలు ఇచ్చిన ఒకట్రెండు వారాల తర్వాత వాళ్లను మళ్లీ కలిసి ఇలా అనవచ్చు: “మీకు ఇచ్చిన పత్రికల్లో ఉన్న ఒక విషయం గురించి కాసేపు మాట్లాడదామని ఇలా వచ్చాను.” దానివల్ల, ఆ ఆర్టికల్‌ను చదవాలనే కోరిక వాళ్లలో కలుగుతుంది. ఒకవేళ వాళ్లు అప్పటికే దాన్ని చదివేసివుంటే, అది చదివినప్పుడు వాళ్లకెలా అనిపించిందో అడిగి, క్లుప్తంగా దాన్ని చర్చించవచ్చు. ఇంటివాళ్లు మన ప్రచురణలు చదవడానికి ఇష్టపడుతుంటే వాళ్లను కలిసి ఆ నెలలో మనం ఇవ్వాల్సిన కరపత్రాన్నో, బ్రోషుర్నో, పుస్తకాన్నో చూపించవచ్చు.
4. పత్రికా మార్గంలో మనం కలిసేవాళ్లు బైబిలు అధ్యయనానికి ఒప్పుకుంటారో లేదో తెలుసుకోవడానికి అప్పుడప్పుడూ మనం ఏమి చేయవచ్చు?
4 ఇంటివాళ్లు బైబిలు అధ్యయనం కోసం అడిగే వరకు వేచిచూసే బదులు మీరే చొరవ తీసుకోండి. గతంలో వాళ్లు బైబిలు అధ్యయనం వద్దని అన్నా, వాళ్లు ఇష్టపడితే కావలికోట పత్రికలో వచ్చే “ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు” అనే ఆర్టికల్ ఉపయోగించి అప్పుడప్పుడూ చర్చించవచ్చు. బహుశా మీరు ఇంటి గుమ్మం దగ్గరే అధ్యయనం మొదలుపెట్టవచ్చు. ఒకవేళ మీరు అధ్యయనం మొదలుపెట్టలేకపోయినా, పత్రికలు ఇస్తూ వాళ్ల ఆసక్తిని పెంచడానికి ప్రయత్నించవచ్చు.