ఉత్తేజపరిచే సంగీతం
1 సత్యారాధనలో పాటలకు, సంగీతానికి ప్రత్యేక స్థానముంది. ప్రాచీన ఇశ్రాయేలులో ఆసాపు, ఆయన సహోదరులు ఇలా పాడారు: “యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. . . . ఆయననుగూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుతక్రియలన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి.” (1 దిన. 16:8, 9) నేడు మనం మన వారపు సంఘ కూటాల్లో గొంతెత్తి యెహోవా గురించి పాడతాం. (ఎఫె. 5:19) ఆయన నామమును స్తుతించడానికి ఇది ఎంత అద్భుతమైన అవకాశమో కదా!—కీర్త. 69:30.
2 వాద్య సంగీతంతో కూడిన కింగ్‌డమ్ మెలొడీస్ వినడం మన మనస్సును ఆధ్యాత్మిక తలంపులతో నింపగలదు. “శ్రావ్యమయిన ఆ సంగీతం వింటున్నప్పుడు, ఆ పాటకు సంబంధించిన పదాలు నా మనస్సులోకి వస్తాయి” అని ఒక సహోదరి అంటోంది. “సంగీతాన్ని ఆస్వాదిస్తూ యెహోవాను నా తలంపుల్లో ఉంచుకోవడానికి ఇది ఎంత చక్కని మార్గమో కదా!”—ఫిలి. 4:8.
3 వాటిని ఆస్వాదించే సందర్భాలు: ఇంట్లో కింగ్‌డమ్ మెలొడీస్ వినడం వల్ల కుటుంబ శాంతికి దోహదపడే ఉత్సాహభరితమైన, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. “మేము దీన్ని [సంగీతాన్ని] మా ఇంట్లో, కారులో పదే పదే వింటుంటాం, ఉత్సాహం కలిగించే విధంగా ఏర్పాటు చేయబడిన ఆ సంగీతం మాకు ఎన్నడూ విసుగు కలిగించదు, క్రైస్తవ కూటాలకు తయారవుతున్నప్పుడు లేదా సమావేశానికి ప్రయాణిస్తున్నప్పుడు కింగ్‌డమ్ మెలొడీస్ తరచూ సరైన ప్రశాంతమైన మనఃస్థితిని కలిగిస్తాయి” అని ఒక కుటుంబం వ్రాసింది. ఒక సహోదరి ఇలా అన్నది: “నేను ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు వాటిని వింటుంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. నేను ఉతికిన బట్టలు మడతపెట్టేటప్పుడు కూడా ఆనందంగా ఉంటానని ఎవరైనా అనుకుంటారా? నాకు నిరుత్సాహంగా అనిపించినప్పుడు నేను వాటిని వినాలనుకుంటాను. ఆ సంగీతానికి ఉత్సాహపరిచే ప్రభావం ఉంది! . . . ప్రతీపాట సంతోషాన్ని కలిగిస్తుంది.” అలాంటి ఉత్తేజపరిచే సంగీతం మీకు ప్రయోజనం కలిగించే సందర్భాలు ఉన్నాయా?
4 ఈ కాలంలోని సంగీతం చాలామట్టుకు ఈ లోకపు వైఖరిని ప్రతిబింబిస్తోంది. తల్లిదండ్రులు కింగ్‌డమ్ మెలొడీస్‌ను తగినవిధంగా ఉపయోగిస్తూ, తమ పిల్లలు ఆరోగ్యవంతమైన సంగీతం పట్ల అభిరుచిని పెంచుకునేలా వారికి సహాయపడవచ్చు. యెహోవాను మహిమపరిచే, మన మనస్సును ఉత్తేజపరిచే శ్రావ్యమైన ఈ ఆధ్యాత్మిక పాటల గురించి తెలిస్తే చాలామంది బైబిలు విద్యార్థులు, ఆసక్తిగలవారు కూడా సంతోషిస్తారు.—కీర్త. 47:1, 2, 6, 7.