కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w00 6/1 పేజీలు 26-28
  • దేవుణ్ణి ప్రీతిపరిచే సంగీతం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుణ్ణి ప్రీతిపరిచే సంగీతం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుణ్ణి అప్రీతిపరచే సంగీతం
  • వివేకంతో సంగీతాన్ని ఎంపిక చేసుకోండి
  • సంగీతం, సమర్పణ
  • దేవుణ్ణి స్తుతించే సంగీతం
  • సంగీతమును ఆనందించుటకు కీలకమేమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • మీకు తెలుసా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • నేను ఎలాంటి మ్యూజిక్‌ వింటున్నాననేది అంత ఆలోచించాల్సిన విషయమా?
    యువత అడిగే ప్రశ్నలు
  • అసభ్యకరమైన సంగీతం విషయంలో జాగ్రత్తగా ఉండండి
    కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
w00 6/1 పేజీలు 26-28

దేవుణ్ణి ప్రీతిపరిచే సంగీతం

సంగీతం, “కళలన్నింటిలోకెల్లా, అత్యంత పురాతనమైన కళ, సహజమైన కళ” అని వర్ణించబడుతుంది. భాషలాగే సంగీతం కూడా ఒక వరం. సంగీతం, మానవులకు జంతువులకు మధ్య ఉన్న భేదాన్ని చూపిస్తుంది. భావోద్వేగాలను పురికొల్పుతుంది. వీనుల విందుగా ఉంటుంది. మనస్సులో మళ్ళీ మళ్ళీ మెదులుతూ ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా అది దేవుణ్ణి ప్రీతిపరచగలదు కూడా.

బైబిలు చూపిస్తున్నట్లు, ఇశ్రాయేలీయులు సంగీత ప్రతిభ గల ప్రజలు. సంగీతం, “ప్రాచీన బైబిలు కాలాల్లో ప్రముఖ కళగా” ఉండేది అని ఉన్గర్‌స్‌ బైబిల్‌ డిక్షనరీ వ్యాఖ్యానిస్తుంది. గాత్రసంగీతమూ, వాద్యసంగీతమూ వాళ్ళ దైనందిన జీవితంలో, ఆరాధనలో భాగంగా ఉండేవి. అయితే ముఖ్యంగా మానవ స్వరమే ఉపయోగించబడేది.

రాజైన దావీదు తన కుమారుడైన సొలొమోను ఆలయాన్ని నిర్మించడానికి మునుపు, దేవుని మందసం దగ్గర “సంగీత సేవ” చేసేందుకు లేవీ ప్రతినిధులను నియమించాడు. (1 దినవృత్తాంతములు 6:31, 32) యెహోవా సాన్నిధ్యానికి ప్రాతినిధ్యం వహించే నిబంధన మందసాన్ని యెరూషలేముకు తీసుకువచ్చినప్పుడు, “యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును” కొంతమంది లేవీయులను దావీదు ఏర్పాటు చేశాడు. వాళ్ళు గాత్రసంగీతంతోపాటు, “స్వరమండలములను సితారాలను” “తాళములను” వాయించారు. “బూరలు” ఊదారు. ‘యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతిచేయుటకే’ ఆ లేవీయులు నియమించబడ్డారు.—1 దినవృత్తాంతములు 16:4-6, 41; 25:1.

బైబిలులో సంగీతంతో ఎక్కువ సంబంధమున్న గ్రంథమైన కీర్తనల్లో, “[యెహోవా] కృప నిరంతరముండును” అనే పల్లవి అనేక సార్లు కనిపిస్తుంది. ఉదాహరణకు, 136వ కీర్తనలో ఉన్న 26 వచనాల్లోను ఆ పల్లవి కనిపిస్తుంది. ఆ పల్లవి “క్లుప్తంగా ఉండడం వల్ల ప్రజల పెదవుల మధ్య ఉండేది, దాన్ని విన్న ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోగల్గేవారు” అని ఒక బైబిలు విద్వాంసుడు అంటున్నాడు.

కొన్ని కీర్తనల ముందుమాటలు, సంగీత ఉపకరణాల విస్తృత ఉపయోగాన్ని సూచిస్తున్నాయి. బూర, స్వరమండలము, సితారా, తంబుర, తంతివాద్యము, పిల్లనగ్రోవి, మరితర మ్రోగు తాళములను 150వ కీర్తన పేర్కొంటోంది. అయినప్పటికీ, వాద్య సంగీతాలన్నింటికన్నా ఆకర్షణీయమైనది మానవుల స్వరమే. “సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. యెహోవాను స్తుతించుడి” అని 6వ వచనం బోధిస్తుంది.

సంగీతం మన అనుభూతులను, దుఃఖపూరితమైన తలంపులను వ్యక్తం చేయగలదు కాబట్టే బైబిలు కాలాల్లో, ప్రలాపగీతాలూ విలాపగీతాలూ రచించబడ్డాయి. అయితే ఇశ్రాయేలీయుల్లో సంగీత బృందాలు మాత్రమే ఈ విధంగా దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ పాడేవి. “విలాపగీతాల్లో లేదా ప్రలాపగీతాల్లో మాత్రమే శ్రావ్యమైన సంగీతం కన్నా, స్వర భేదం కన్నా, స్వచ్ఛమైన మాటకన్నా ఒకే తాళంలోని పునరుక్తికి ప్రాధాన్యం ఇవ్వబడేది” అని బైబిలు విజ్ఞాన సర్వస్వమైన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) పేర్కొంటోంది.a

యేసు మరణానికి ముందటి రాత్రి, ఆయనా నమ్మకస్థులైన ఆయన అపొస్తలులూ యెహోవాకు స్తుతి గీతాలు పాడారు. వాళ్ళు పాడింది హల్లేల్‌ కీర్తనలనే (కీర్తన 113-118) అనడంలో సందేహం లేదు. వాళ్ళు అలా పాడడం, యేసు తమతో లేనప్పటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు వాళ్ళకు సహాయపడివుండవచ్చు. అంతేకాక, “ఆయన కృప నిరంతరము నిలుచును” అని వాళ్ళు ఐదు సార్లు పాడడం వల్ల విశ్వ సర్వాధిపతియైన యెహోవా యొక్క నమ్మకస్థులైన సేవకులుగా కొనసాగాలన్న వాళ్ళ కృతనిశ్చయం మరింత బలపడి ఉండవచ్చు.—కీర్తన 118:1-4, 29.

ఎఫెసులోని, కొలొస్సయిలోని తొలి క్రైస్తవులు, “కీర్తనలతోను సంగీతములతోను” “ప్రభువును” కీర్తించేవారు. వాటికి తోడు, తమ హృదయములలో పాడుకునే “ఆధ్యాత్మిక గేయాల”ను కలుపుకునేవారు. (ఎఫెసీయులు 5:19, పరిశుద్ధ బైబిల్‌; కొలొస్సయులు 3:16) “హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును” అని యేసు చెప్పినట్లు, వాళ్ళు తమకున్న మెప్పుదలను వ్యక్తీకరించేందుకు సముచితంగానే తమ నోటిని ఉపయోగించేవారు. మరో మాటలో చెప్పాలంటే వాళ్ళు తమ మెప్పుదలను పాటల ద్వారా మాటల ద్వారా వ్యక్తీకరించేవారు.—మత్తయి 12:34.

దేవుణ్ణి అప్రీతిపరచే సంగీతం

బైబిలులో పేర్కొన్న కొన్ని సంగీతాలు దేవుణ్ణి ప్రీతిపరచలేదు. సీనాయి కొండ దగ్గర జరిగిన సంఘటననే గుర్తు చేసుకోండి. పది ఆజ్ఞలతో సహా ధర్మశాస్త్రాన్ని పొంది, ఆ కొండ దిగి వచ్చినప్పుడు మోషేకు వినిపించినదేమిటి? “అది జయధ్వనికాదు, అపజయధ్వనికాదు, సంగీతధ్వని.” అది విగ్రహారాధనతో సంబంధం గల సంగీతధ్వని. ఆ సంగీతం దేవునికి అప్రీతి కలిగించింది. దానివల్ల, దాదాపు 3,000 మంది సంగీతజ్ఞులు మరణించారు.—నిర్గమకాండము 32:18, 25-28.

మానవులు అన్ని రకాల సంగీతాలను కూర్చి వాయించి ఆనందించగలరు. అయినంత మాత్రాన అన్ని రకాల సంగీతాలూ దేవుణ్ణి ప్రీతిపరుస్తాయని కాదు. ఎందుకని? “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” అని క్రైస్తవ అపొస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు. (రోమీయులు 3:23) సంతాన సౌభాగ్యం కోసం అన్యులు చేసే ఆచారాలూ, మానవ ఆత్మ అమర్త్యమైనది అన్న సిద్ధాంతమూ, మరియను “దేవుని తల్లి”గా ఆరాధించడమూ సంగీత కూర్పుల అంశాలుగా మారాయి. అయితే, దైవ ప్రేరేపితమైన బైబిలులో సత్య దేవుడు వెల్లడి చేసినదానికి పూర్తి విరుద్ధంగా ఉన్న ఈ నమ్మకాలూ ఆచారాలూ దేవుణ్ణి అవమానిస్తున్నాయి.—ద్వితీయోపదేశకాండము 18:10-12; యెహెజ్కేలు 18:4; లూకా 1:35, 38.

వివేకంతో సంగీతాన్ని ఎంపిక చేసుకోండి

నేడు తికమక పుట్టించేన్ని సంగీతాలున్నాయి. ఎలాంటి సంగీత రికార్డునైనా వినియోగదారులు కొనేలా కాంపాక్ట్‌ డిస్క్‌ల కవర్‌లు రూపొందించబడ్డాయి. దేవుని ఆరాధకుడు దేవుణ్ణి ప్రీతిపరచాలని కోరుకుంటున్నట్లయితే, సంగీతాన్ని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త వహిస్తాడు. అబద్ధమత నమ్మకాల చేత ప్రేరేపించబడిన, లేదా అనైతికతపై, క్షుద్రవిద్యలపై కేంద్రీకరించబడిన గాత్రసంగీతాన్నైనా వాద్యసంగీతాన్నైనా వదిలిపెట్టాలనే నిర్ణయాన్ని వివేకంతో తీసుకుంటాడు.

ఒకప్పుడు ఆఫ్రికాలో క్రైస్తవ మిషనరీగా సేవ చేసిన ఆల్‌బర్ట్‌కు, పియానో వాయించే అవకాశం అక్కడ అంతగా లభించలేదు. అయితే, తనతో పాటు తెచ్చుకున్న ఎల్‌పి రికార్డులను ఆయన మరలా మరలా వినేవాడు. ఆయన ఇప్పుడు స్వదేశంలో ఉన్నారు, ప్రయాణ పైవిచారణకర్తగా క్రైస్తవ సంఘాలను సందర్శిస్తున్నారు. సంగీతాన్ని వినేందుకు ఆయనకు దొరికే సమయం చాలా తక్కువ. “బీతోవన్‌, నా అభిమాన మ్యూజిక్‌ కంపోజర్‌, ఆయన కూర్చిన అనేక సంగీత కూర్పులను సేకరించాను” అని ఆయన అంటున్నారు. వాటిని వినడం ఆయనకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అవును, ప్రతి వ్యక్తికీ సంగీతంలో తనదైన అభిరుచి ఉంటుంది. కాని, “భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి” అని పౌలు చెప్పిన విషయాన్ని క్రైస్తవులముగా మనం మనస్సులో ఉంచుకోవాలి.—1 కొరింథీయులు 10:31.

సంగీతం, సమర్పణ

సూసీకీ సంగీతమంటే ప్రాణం. “నేను ఆరేండ్ల వయస్సులో పియానోనూ, పదేండ్ల వయస్సులో వయోలిన్‌నూ, 12 ఏండ్ల వయస్సులో హార్ప్‌నూ వాయించడం నేర్చుకోవడం మొదలుపెట్టాను” అని ఆమె వివరిస్తోంది. హార్ప్‌ అంటే వీణలాంటి ఒక వాద్యం. తర్వాత, హార్ప్‌ గురించి ఇంకా ఎక్కువగా అధ్యయనం చేయడానికి ఇంగ్లండ్‌లోని లండన్‌లో రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌కి వెళ్ళింది. స్పెయిన్‌కు చెందిన ప్రసిద్ధిగాంచిన హార్ప్‌ విద్వాంసురాలి దగ్గర నాలుగు సంవత్సరాలు అధ్యయనం చేసింది. తర్వాతి సంవత్సరం, పారిస్‌ కన్సర్వేటర్‌లో, సంగీతంలో ఉన్నత శ్రేణి బిరుదునూ, వీణను వాయించడంలోను పియానో నేర్పించడంలోను డిప్లోమాలనూ పొందింది.

ఆ తర్వాత, లండన్‌లో ఉన్న యెహోవాసాక్షులను కలిసి వాళ్ళ సంఘంతో సహవసించడం మొదలుపెట్టింది. తర్వాత, సాక్షులలో ఒకరిపై ఒకరికి నిజమైన ఆసక్తీ, ప్రేమా ఉండడాన్ని ఆమె చూసింది. క్రమేణా, యెహోవా మీద ఆమెకున్న ప్రేమ పెరిగింది. ఆయనకు సేవ చేయడంలో ఆమెకు కలిగిన శ్రద్ధాసక్తులు ఆయనకు సేవ చేసే మార్గాల కోసం ప్రయత్నించేందుకు ఆమెను పురికొల్పాయి. అది సమర్పణకూ, బాప్తిస్మానికీ దారితీశాయి. “సంగీతాన్ని వృత్తిగా చేసుకోవడమంటే అంకిత భావంతో జీవించడమే. కనుక, సమర్పిత జీవితం నాకు క్రొత్తేమీ కాదు” అని సూసీ అంటోంది. ఆమె, యేసు ఇచ్చిన నిర్దేశాలను అనుసరిస్తూ క్రైస్తవ పరిచర్యలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం మొదలుపెట్టడం వల్ల, ఆమె కచేరీలు చేసే సమయం తగ్గింది.—మత్తయి 24:14; మార్కు 13:10.

సంగీతం కోసం తను ఇప్పుడు కేవలం కొంత సమయాన్నే వెచ్చించగల్గుతున్నందుకు ఆమెకు ఏమనిపిస్తుంది? “సంగీతాన్ని అభ్యసించేందుకు నాకు ఎక్కువ సమయం లేనందువల్ల, అప్పుడప్పుడు నిరాశనిస్పృహలకు గురవుతుంటాను” అని ఒకవైపు ఒప్పుకుంటూనే, “అయినా నేను నా సంగీత వాయిద్యాలను వాయిస్తూ, సంగీతాన్ని ఆస్వాదిస్తుంటాను. సంగీతం యెహోవా ఇచ్చిన వరము. నేను నా జీవితంలో యెహోవా సేవకు మొదటి స్థానం ఇచ్చినందుకు సంగీతాన్ని ఇప్పుడు మరెక్కువగా ఆస్వాదిస్తున్నాను” అని ఆమె అంటోంది.—మత్తయి 6:33.

దేవుణ్ణి స్తుతించే సంగీతం

ఆల్బర్టూ, సూసీ, దాదాపు అరవై లక్షల మంది ఇతర యెహోవాసాక్షులతోపాటు యెహోవా దేవుడ్ని సంగీతంతో స్తుతిస్తున్నారు. 234 దేశాల్లో రాజ్యమందిరాల్లోని క్రైస్తవ కూటాల్లో సాధ్యమైన చోట్ల, యెహోవాసాక్షులు తమ కూటాలను ఆరంభించేదీ, ముగించేదీ యెహోవాకు కీర్తనలు పాడుతూనే. లేఖనాధారమైన కావ్యభావాలు గల శ్రావ్యమైన గీతాలు యెహోవా దేవుణ్ణి స్తుతిస్తాయి.

కూటాలకు హాజరయ్యేవారందరూ ఎంతో ఉత్సాహంగా యెహోవా మనపై శ్రద్ధ చూపే దేవుడు అని (44వ పాట) (ఆంగ్లం) స్వరమెత్తి పాడతారు. వాళ్ళు యెహోవాకు స్తుతి గీతము (190వ పాట) (ఆంగ్లం) పాడతారు. వాళ్ళ పాటలు క్రైస్తవ సహోదరత్వపు ఆనందాలనూ బాధ్యతలనూ, క్రైస్తవ జీవన విధానాన్నీ, క్రైస్తవ లక్షణాలనూ తెలియజేస్తాయి. రాజ్య గీతాలకు సంగీతాన్ని కూర్చడంలో, ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్‌, ఉత్తర, దక్షిణ అమెరికాలలో ఉన్న సాక్షులు ఉపయోగించిన వివిధ సంగీత శైలులు రాజ్యగీతాలను పాడడంలోని ఆనందాన్ని రెట్టింపు చేశాయి.b

“యెహోవామీద క్రొత్తకీర్తన పాడుడి సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి” అన్న మాటలు విశ్వసర్వాధిపతిని కీర్తిస్తూ కీర్తన రచయిత కాలంలో వ్రాయబడిన ఒక చక్కని కీర్తనలోని ఆరంభ మాటలు. (కీర్తన 96:1-3) మీ ప్రాంతంలో ఉన్న యెహోవాసాక్షులు చేస్తున్నది ఇదే. యెహోవాకు స్తుతులను పాడడంలో మీరు వాళ్ళతో పాటు కలవాలని వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మీరు వాళ్ళ రాజ్య మందిరాలకు వెళ్ళి, యెహోవాను ప్రీతిపరచే సంగీతంతో ఆయనను ఎలా స్తుతించవచ్చో నేర్చుకోవచ్చు.

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ న్యూయార్క్‌ ప్రచురించినది.

b వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన యెహోవా స్తుతి గీతములు అనే పుస్తకం (ఆంగ్లం)లో ఈ పాటలు కనిపిస్తాయి.

[28వ పేజీలోని చిత్రం]

యెహోవాకు స్తుతులు పాడడం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి