అసభ్యకరమైన సంగీతం విషయంలో జాగ్రత్తగా ఉండండి
“దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసుకొనుచు, అజ్ఞానులవలెకాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.”—ఎఫెసీయులు 5:15, 16.
1. సంగీతం ‘దేవుని వరము’ అని ఎందుకు పిలువవచ్చును?
“సంగీతం . . . ఇది దేవుని వరం.” ఈ మాటలు లూలూ రమ్సే వైలీ బైబిల్ మ్యూజిక్ అను తన పుస్తకంలో వ్రాసింది. అనాదిగా, దైవభీతి కల్గిన స్త్రీ పురుషులు ఈ మనోభావాన్ని గుర్తించారు. మానవుడు సంగీతంద్వారా తన లోతైన భావాలను అనగా ఆనందము, దుఃఖము, క్రోధము, ప్రేమను వ్యక్తంచేశాడు. ఆవిధంగా సంగీతం బైబిలు కాలంలో ఒక ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహించింది, ఆ పవిత్రగ్రంథం అంతటనూ యిది పేర్కొనబడింది.—ఆదికాండము 4:21; ప్రకటన 18:22.
2. బైబిలు సమయాలలో సంగీతం యెహోవాను స్తుతించుటకు ఎలా ఉపయోగించబడింది?
2 యెహోవా ఆరాధనలో సంగీతం అత్యంత వైభవంగా చిత్రీకరింపబడింది. యెహోవాను స్తుతించుటలో క్రితమెన్నడూ ఉపయోగించని మహోన్నతమైన మాటలుకూడా మొట్టమొదటిగా సంగీతంలో కూర్చబడ్డాయి. “కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదనని” కీర్తనల గ్రంథకర్త దావీదు వ్రాశాడు. (కీర్తన 69:30) ఏకాంతసమయంలో ప్రార్థనాపూర్వక భావాలు ప్రతిబింబించుటకు సహాయకంగా సంగీతం ఉపయోగించబడేది. “నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసికొందును. హృదయమున ధ్యానించుకొందును. దేవా నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకుచున్నదని” ఆసాపు వ్రాశాడు. (కీర్తన 77:6) యెహోవా ఆలయంలో సంగీతం చాలా వైభవంగా కూర్చబడింది. (1 దినవృత్తాంతములు 23:1-5; 2 దినవృత్తాంతములు 29:25, 26) కొన్ని సమయాలలో, ఆలయ ప్రతిష్ఠజరిగినపుడు 120 మంది బూరలు ఊదువారు నియమింపబడినట్లుగా, భారీఎత్తున సంగీతబృందాలు ఏర్పాటుచేయబడేవి. (2 దినవృత్తాంతములు 5:12, 13) హుందాతోకూడిన ఈ సంగీతం ఎలా ధ్వనించిందో వ్రాయబడలేదుగాని, ది మ్యూజిక్ ఆఫ్ ది బైబిల్ అను పుస్తకం ఈవిధంగా అభిప్రాయపడుతుంది: “పవిత్ర సందర్భాలలోని ఆలయ సంగీత ప్రభావం సాధారణంగా ఏవిధంగావుంటుందనే అభిప్రాయం వ్యక్తంచేయడం కష్టమేమీకాదు . . . ఒకవేళ మనలో ఒకరిని ప్రస్తుతం అలాంటి సన్నివేశం మధ్యలోకి పంపినట్లయితే, తప్పనిసరిగా భీకరమైన, మహోత్కృష్టభావాలతో ముంచెత్తబడగలం.”a
సంగీత దుర్వినియోగం
3, 4. దేవునిప్రజలద్వారా, వారి అన్యులైన పొరుగువారిద్వారా సంగీతవరం ఏవిధంగా దుర్వినియోగం చేయబడింది.
3 ఏమైనప్పటికీ, సంగీతం ఎల్లప్పుడూ అంత శ్రేష్ఠంగా ఉపయోగించబడలేదు. సీనాయి పర్వతం దగ్గర, బంగారు దూడకు విగ్రహారాధన చేయుటకు పురికొల్పుటలో సంగీతం ఉపయోగింపబడింది. (నిర్గమకాండము 32:18) త్రాగుబోతుతనంతో, వ్యభిచారంతోకూడా సంబంధంగల్గిన సందర్భంలోకూడా సంగీతం ఉండెను. (కీర్తన 69:12; యెషయా 23:15) ఇశ్రాయేలీయుల పొరుగువారైన అన్యులుకూడా ఈ దైవీకవరాన్ని దుర్వినియోగం చేయుటలో దోషులైయున్నారు. “ఫీనేసియా, సిరియాలలో పేరుపొందిన సంగీతమంతా ఫలాల దేవతయైన ఇష్టారు ఆరాధనను ప్రతిబింబించాయి. ఆవిధంగా, లైంగిక మద్యపానోత్సవాలకు సాధారణంగా ఒక పేరుపొందిన పాట ప్రారంభంలో ఉంటుంది” అని ది ఇంటర్‌ప్రెటర్స్ డిక్షనరీ ఆఫ్ ది బైబిల్ చెబుతుంది. అదేవిధంగా ప్రాచీన గ్రీకులుకూడా “మోహపూరిత నృత్యాలలో” సంగీతాన్ని ఉపయోగించారు.
4 ఔను, కదలించే, మోహింపజేసే, ప్రభావితంచేసే శక్తి సంగీతానికి వుంది. దశాబ్దాల క్రితమే, జాన్ స్టెయినర్ పుస్తకమైన ది మ్యూజిక్ ఆఫ్ ది బైబిల్ కూడా ఈవిధంగా ఆరోపించుటకు సిద్ధపడింది: “ప్రస్తుత సమయంలో మానవజాతిపై సంగీతకళ చూపినంత గట్టిప్రభావం మరేయితర కళకూడా ప్రదర్శించడంలేదు.” ఈనాడు సంగీతం ఒక బలమైన ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. కాబట్టి, చెడు సంగీతం నిజమైన అపాయాన్ని దైవభయం కల్గిన యౌవనులపై తీసుకురాగలదు.
జాగ్రత్త అవసరం
5. (ఎ) చాలామంది యౌవనుల జీవితాల్లో సంగీతం ఎటువంటి ముఖ్యపాత్రను వహిస్తుంది? (బి) యౌవనులు ఆనందించే విషయంలో దేవుని దృక్కోణమేమైయుంది?
5 నీవొకవేళ యౌవనుడవైతే, సంగీతం—ప్రాముఖ్యంగా పేరుగాంచిన రకరకాల పాప్ లేదా రాక్ సంగీతం—చాలామంది నీ వయస్సులోనున్నవారికి ఎంత ముఖ్యమో నీకు బాగా తెలుసు. సంగీతం “యౌవనులకు అత్యంత ప్రాముఖ్యమైనదిగా” చెప్పబడుతుంది. అమెరికాలోని యౌవనుడు, గడచిన తన పాఠశాలలోని ఆరు సంవత్సరాలలో, రోజుకు సరాసరి నాలుగుకంటే ఎక్కువ గంటలు రాక్ సంగీతం వింటాడు! ఖచ్చితంగా అది సమదృష్టి లేకపోవుటను ప్రదర్శిస్తుంది. మిమ్మును సంతోషపరచేది, మీకు మంచి అనిపించేదానితో ఆనందించడం తప్పేమీకాదు. నిజంగా ఉల్లాస సంగీతానికి సృష్టికర్త యైన యెహోవా, యౌవనులు విశాదంగా, దుఃఖపూరితులుగా ఉండాలని కోరడంలేదు. నిజానికి, ఆయన తన ప్రజలను యిలా ఆజ్ఞాపిస్తున్నాడు: “నీతిమంతులారా, యెహోవానుబట్టి సంతోషించుడి ఉల్లసించుడి. యథార్థహృదయులారా, మీరందరు ఆనందగానము చేయుడి.” (కీర్తన 32:11) ఆయన వాక్యం యౌవనులకు ఈవిధంగా చెబుతున్నది: “యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము.”—ప్రసంగి 11:9.
6. (ఎ) యౌవనులు సంగీతం ఎన్నుకొనే విషయంలో ఎందుకు జాగ్రత్తకల్గియుండాలి? (బి) గడచిన తరాల సంగీతంకంటే ఈనాటి సంగీతం చాలామట్టుకు ఎందుకు మరింత అభ్యంతరకరమైనదైయుంది?
6 అయినప్పటికిని, నీవు ఎన్నుకొనే సంగీతంలో జాగరూకత కల్గియుండుటకు ఒక మంచి కారణం కలదు. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులు 5:15, 16 లో యిలా చెప్పాడు: “దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలెకాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.” ఒక యౌవన బాలిక వలెనే కొంతమంది యౌవనులు ఒకవేళ యిలా అభ్యంతరం తెల్పవచ్చును: “మన తలిదండ్రులు యౌవనంలో ఉన్నప్పుడు అప్పుడున్న సంగీతాన్ని వారు విన్నారు, యిప్పుడున్న సంగీతాన్ని మరి మనమెందుకు వినకూడదు?” మీ తలిదండ్రులలో కొందరు మీవయస్సులో నున్నప్పుడు వారు అడ్డుచెప్పవలసి యుండిన సందర్భాలుకూడా ఉండియుండవచ్చును. నిశితంగా పరిశీలించిన మీదట, జనసమ్మతమైన అనేక కట్టడలు ఆశ్చర్యపడునంత అధికంగా లైంగిక దుర్నీతికి సంబంధించిన పదాలు చేర్చబడినట్లు కనబడుతుంది. పూర్వం చూచాయగా మాత్రమే చెప్పబడుతూండే వాటిని ప్రస్తుతం స్పష్టంగా వివరిస్తున్నారు. ఒక రచయిత అభిప్రాయపడిన్నట్లుగా: “మన సంస్కృతి ఎన్నడూ చూడనంత పరిధిలో ప్రస్తుతం ప్రతివిషయం స్పష్టమైన రీతిలో విపరీతంగా పిల్లలకు వివరించబడుతున్నది.”
రాప్ సంగీతం—తిరుగుబాటును పురికొల్పే సంగీతం
7, 8. (ఎ) రాప్ సంగీతం అంటే ఏమిటి, మరి దాని ఖ్యాతికి కారణమేమి? (బి) ఒకవ్యక్తి రాప్ సంగీత జీవితవిధానాన్ని హత్తుకొనియున్నాడని ఏది గుర్తించగలదు?
7 ఉదాహరణకు, ప్రస్తుత రాప్ సంగీత (అరుపులతోకూడిన నిరర్థక సంగీతం) ఉద్వేగాన్ని పరిశీలించండి. టైమ్ పత్రిక ప్రకారం, అమెరికా, రష్యా, జపాన్, యూరప్, బ్రెజిల్లో రాప్ సంగీతం “ఒక ఆమోదయోగ్యమైన, భూగోళ లయబద్ధమైన విప్లవంగా” మారి, బ్రహ్మాండంగా ఖ్యాతిగాంచింది. తరచూ యీ స్వరం పూర్తిగా అదుపుతప్పి పాడదగినవి గాకుండావున్న, దాని గేయకవిత్వాలు భీకరమైన ధ్వనితోపాటు చెప్పబడతాయి. మనస్సునాకర్షించేది కేవలం సంగీతమోత అయినప్పటికి, అదే రాప్ సంగీత వ్యాపారానికి విజయం చేకూర్చుటలో కారకమైనట్లుగా వుంది. “నేను రాప్ సంగీతం వింటున్నప్పుడు, ఉద్రేకపూరితురాలైనట్టు భావించాను, మరి నేను డాన్స్ చేసినప్పుడు ఆ ఉద్రేకం పోయి స్వతంత్రురాలనయినట్లు భావించాను” అని ఒక జపాను యౌవనురాలు చెబుతుంది.
8 రాప్ గేయాలు—తరచూ నీచమైన నైపుణ్యత మరియు చెడుతోకూడిన వివేకంలేని మిశ్రమమే—రాప్ సంగీతం పట్టణప్రజాదరణపొందే పేరుగాంచడానికి మరొక కారణం. యౌవనుల ప్రేమగాథలతో కూడిన సాంప్రదాయిక రాక్ సంగీత గేయాలవలే గాకుండా, రాప్ సంగీతం తరచూ అతి గంభీరమైన శబ్దాలతో కూడివుంది. కొన్ని రాప్ సంగీతాలు అన్యాయానికి, జాతివైషమ్యాలకు, పోలీసుల లాఠీచార్జీలకూ వ్యతిరేకంగా మాట్లాడేవైయున్నవి. కొన్ని సమయాలలో, దీని లయ-పల్లవి చాలా అసభ్యకరమైన, కలతచెందించే భాషలో వివరించబడతాయి. దుస్తులు, తలదువ్వుకొనడం, లైంగిక నీతికి సంబంధించిన ప్రమాణాలకు వ్యతిరేకంగా తిరుగుబాటును పురికొల్పినట్లుగాకూడా కనబడుతుంది. ఈ రాప్ సంగీతం ఒక జీవిత విధానంగా అర్హతను పొందిందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. దీనిననుకరించేవారు వారి తళుకుబెళుకుల అభినయాలతో, ప్రజాదరణతోకూడిన నైపుణ్యంతో, బేగీ జీన్స్‌ల ఉడుపులతో, కాలిచీలమండను దాటిన పొడవాటి లేసులను కట్టకుండావున్న బూట్లతో (పొడవాటి స్నీకర్స్), బంగారు గొలుసులతో, బేస్‌బాల్ టోపీలతో, నల్లని కళ్లజోడులతో గుర్తించబడతారు.
9, 10. (ఎ) రాప్ సంగీతం, దాని జీవితవిధానాలు “ప్రభువుకు ప్రీతికరమైనవేనా” అని నిర్ధారించుటకు యౌవనులు పరిశీలించవలసిన కారకాలేవి? (బి) కొందరు క్రైస్తవ యౌవనులు చులకనగా తీసుకొంటున్నదేమిటి?
9 ఎఫెసీయులు 5:10 లో క్రైస్తవులు “ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుడని” చెప్పబడిరి. రాప్ సంగీతం దానికదే తెచ్చుకున్న చెడ్డపేరును పరిశీలిస్తూ, మీరు దానిలో మునిగిపోవుట “ప్రభువుకు ప్రీతికరమైనదని” మీరు తలంచెదరా? ప్రపంచంలోని చాలామంది ప్రజలకుకూడా అనంగీకారమైనట్టుగా భావిస్తున్న జీవిత విధానంతో గుర్తించబడటానికి ఒక యౌవన క్రైస్తవుడు కోరుకొనునా? ఒక పునర్విచారకుడు రాప్ సంగీత కచేరిని ఏవిధంగా వర్ణిస్తున్నాడో గమనించండి: “నీచమైన, స్పష్టమైన లైంగిక గేయాలతో అత్యంత భయంగొల్పేవిధంగా ఉండుటకు రాప్ సంగీత గాయకులు ఒకరితోనొకరు పోటీపడ్డారు. . . . నృత్యంచేసే ఆడవాళ్లు, మగవాళ్లు రంగస్థలంపైనే లైంగిక అభినయాలను చేశారు.” ఒక ప్రత్యేక నటననుగూర్చి వ్రాయబడిన వార్తాశీర్షికను గూర్చి, ఒక కచేరి నిర్వాహకులు యిలా చెప్పారు: “వారి నోటనుండి వచ్చే ప్రతిమాటకూడా (దుర్భాషయే).”
10 అయినప్పటికి, ఆ సాయంకాలం వాయించిన సంగీతం కేవలం సాధారణమైన రాప్ సంగీతంగా మాత్రమే గుర్తించబడింది. కచేరి సభా నిర్వాహకుడు ఈవిధంగా చెప్పాడు: “సాధారణంగా యౌవనులు షాపుల్లో కొంటున్న రాప్ సంగీతం వంటిదే మీరు వింటున్న యీ రాప్ సంగీతం.” ఆ కచేరిలో 4,000 మందికంటే యెక్కువగానున్న యౌవనులలో కొందరు యెహోవాసాక్షులని చెప్పడం ఎంత దుఃఖకరం! సాతాను “వాయుమండల సంబంధమైన అధిపతి” అనే సత్యాన్ని బహుశా కొందరు చులకనగా తీసుకొనియుండవచ్చును. ఆయన “అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని [లేదా యితరులపై అధికారం చెలాయించే మనస్తత్వం]” తన అధీనంలో ఉంచుకున్నాడు. (ఎఫెసీయులు 2:2) రాప్ సంగీతంలోగాని లేదా రాప్ జీవన విధానంలోగాని చిక్కుకొనియున్నట్లైతే, మీరు ఎవరి అభీష్టాలను నెరవేర్చగలరు? కొన్ని రాప్ సంగీతాలు కచేరిలో తక్కువ నిషేధాన్ని కల్గినవని, మీరనవచ్చును. కాని క్రైస్తవుల ప్రమాణాలకు ప్రబలంగా హానికల్గించే ఏరకమైన సంగీతం యెడలనైనా మక్కువ వృద్ధిచేసుకొనడం భావ్యమేనా?
హెవీమెటల్ సంగీతం—లైంగికత, దౌర్జన్యం, సాతాను ప్రవృత్తి
11, 12. హెవీమెటల్ సంగీతం అంటే ఏమిటి, మరియే అభ్యంతరకర లక్షణాలతో యిది గుర్తించబడుతుంది?
11 హెవీమెటల్ (దద్దరిల్లే ధ్వనులతోకూడిన రాక్ సంగీతం) అనేది మరొక రకమైన పేరుగాంచిన సంగీతం. హెచ్చు డెసిబల్ (అత్యంతధ్వని) ధ్వనితోకూడిన రాక్ సంగీతంకంటే గొప్పది ఈ హెవీ మెటల్ సంగీతం. ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ యిలా నివేదిస్తున్నది: “హెవీమెటల్ సంగీతం . . . ద్వేషాన్ని, దుర్వినియోగాన్ని, లైంగిక తొట్రుపాటును, అప్పుడప్పుడు సాతానుక్రియలను మహిమపరచేదిగా బిగ్గరగా కంపించేధ్వనులతో, గేయాలతో కూడిన లయను చిత్రీకరిస్తున్నది.” అంతెందుకు, పేరుగాంచిన కొన్ని సంగీత గుంపుల పేర్లే, ఈ రకమైన ముద్రగల్గిన రాక్ సంగీతంలోని అవినీతికి సాక్ష్యమిస్తున్నాయి. “విషం,” “తుపాకులు,” “మరణం” అనేపేర్లు వాటిలో యిమిడియున్నవి. అయినను, థ్రాష్మెటల్ సంగీతంతోను, (అత్యంత హానికరమైన దుర్భాషతోకూడిన పంక్ అనే రాక్సంగీతం) డెత్మెటల్ సంగీతంతోను (మరణ అంశాలు గల్గిన హెవీమెటల్ సంగీతం) పోల్చితే హెవీమెటల్ సంగీత స్వరమోతను సులభంగా అదుపులో పెట్టవచ్చు—ఒక రకమైన వికృతసంగీత ధ్వనులు ఈ హెవీమెటల్ సంగీతంద్వారా సృష్టించబడతాయి. “నరభక్షక,” “మరణవార్త” వంటి స్వార్ధపూరిత పేర్లు ఈ గుంపులకు కలవు. యివి ఇంగ్లీషు లేదా వేరే పాశ్చాత్యభాషలో ఉంటాయి గనుక ఈ పేర్లు ఎంత జుగుప్సాకరమైనవో చాలా దేశాల్లోని యౌవనులు గుర్తించలేకపోవచ్చును.
12 ఈ హెవీమెటల్ సంగీతమనేది యౌవనుల ఆత్మహత్య, నిరుత్సాహం, మాదకద్రవ్య వినియోగంతో పదేపదే ముడిపడి ఉంటుంది. దౌర్జన్య ప్రవర్తనతో యిది ముడిపడియున్న కారణంగా ఒక రేడియో సలహాదారుడు దీనికి “తలిదండ్రులను కూడా చంపుటకు పురిగొల్పే సంగీతం” అని మారుపేరుపెట్టుటకు కారణమయ్యింది. పోలీసు అధికారులను—చాలామంది తలిదండ్రులను భయపెడుతున్న సాతాను క్రియలతో యిది సంబంధం కల్గివుంది. ఒక పరిశోధకుడు చెప్పినట్టుగా సాతాను ఆరాధనకు అంటీఅంటనట్లుండు కొందరు యౌవనులు ఈ సంగీతంద్వారా తాంత్రికవిద్యలోనికి చొరబడ్డారు. “వారు దేనిలో చిక్కుకుపోతున్నారో వారికి తెలియదని” ఆయన తేల్చిచెప్పాడు.
13. హెవీమెటల్ సంగీతంలో చిక్కుకొనుటలోనున్న అపాయమేమిటి?
13 అయినప్పటికి, క్రైస్తవ యౌవనులు, “వాని [సాతాను] తంత్రములను . . . ఎరుగని” వారుగా నుండవద్దు. (2 కొరింథీయులు 2:11) ఏది ఏమైననూ, “మనము పోరాడునది . . . ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.” (ఎఫెసీయులు 6:12) ఒకడు ఎన్నుకొన్న సంగీతంద్వారా, ఒకని జీవితంలోనికి దయ్యములను ఆహ్వానించడం ఎంతటి అవివేకమో కదా! (1 కొరింథీయులు 10:20, 21) అయినను, చాలామంది క్రైస్తవ యౌవనులు ఈ సంగీతం యెడల మంచి మక్కువ కల్గియున్నారు. కొందరు వారి సంగీత అభిరుచిని తృప్తిపరచుకొనేందుకు రహస్య పద్ధతులను కూడా ఆశ్రయించారు. ఒక యౌవన బాలిక యిలా ఒప్పుకుంది: “నేను ఎల్లప్పుడూ, కొన్నిసార్లు రాత్రంతా హెవీమెటల్ సంగీతం వింటూ ఉండేదాన్ని. నేను [అభిమాన] హెవీమెటల్ సంగీత పత్రికలు కొని, మా తలిదండ్రుల కంటబడకుండా వాటిని షూపెట్టెలలో దాచిపెట్టేదాన్ని. నా తలిదండ్రులకు నేను అబద్ధం చెప్పాను. యెహోవా నేను చేసేపనితో సంతోషించడని నాకు తెలుసు.” అవేక్! లోని ఒక శీర్షికద్వారా ఆమె తప్పును సరిజేసుకుంది. యితర యౌవనులలో ఎంతమంది యింకనూ అలాంటి సంగీతానికి బానిసలు కాగలరు?
నీవు విత్తిన పంటనే కోయుట
14, 15. అవినీతికర సంగీతం వినడమనేది చెడు ప్రభావాన్ని కలుగజేస్తుందని మనమెందుకు నిశ్చయత కల్గియుండగలం? వివరించండి.
14 అలాంటి సంగీతం తీసుకురాగల అపాయములను తక్కువగా అంచనా వేయవద్దు. వాస్తవమే, నీవు కేవలం ఒక పాటను విన్నంతమాత్రాన నీవు ఎవరినైనా చంపుటకు పురికొల్పబడక పోవచ్చును లేదా లైంగిక అవినీతిని తలపెట్టక పోవచ్చును. అయినప్పటికి, గలతీయులు 6:8 యిలా చెబుతుంది: “తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును.” భూసంబంధమైన, మృగ్యమైన యింకా దయ్యముల సంబంధమైన సంగీతాన్ని వినడమనేది కేవలం మీపైన చెడు ప్రభావాన్ని కలుగజేస్తుంది. (యాకోబు 3:15 పోల్చండి.) సంగీత ప్రొఫెసర్ జోసఫ్ స్టూసే ఇలా చెప్పినట్లు వ్రాయబడింది: “ఏవిధమైన సంగీతమైననూ మన మనోభావాలను, భావావేశాలను, దృక్పథాలను, పర్యావసాన ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది . . . ఎవరైననూ ‘నేను హెవీమెటల్ సంగీతాన్ని వినగలను, కాని అది నాపై ప్రభావం కలుగజేయదని’ చెబితే, అది కేవలం పొరపాటే. ఇది వేర్వేరు ప్రజలను వేర్వేరు స్థాయిల్లో వివిధ రీతుల్లో మాత్రమే ప్రభావితం చేస్తుంది.”
15 ఒక యౌవన క్రైస్తవుడు యిలా అంగీకరిస్తున్నాడు: “నేను థ్రాష్మెటల్ సంగీతంలో చాలా తీవ్రంగా చిక్కుకుపోయాను దాంతో నా వ్యక్తిత్వమే మారిపోయింది.” దాని తర్వాత వెంటనే అతను దయ్యములతో సమస్యలను అనుభవించడం మొదలయ్యింది. ఆయనింకా యిలా చెబుతున్నాడు “నేను చివరకు నా సంగీత టేప్స్ మొదలైనవి వదలించుకుని, దయ్యములనుండి విడుదలయ్యాను.” మరొక యౌవనుడు యిలా ఒప్పుకుంటున్నాడు: “లైంగికతతోగాని లేదా మాదకద్రవ్యాలు, దురాత్మలతోగాని సంబంధమున్న సంగీతాన్ని నేను వినేవాన్ని. చాలామంది యౌవనులు వారిపై ప్రభావాన్ని చూపదని అంటారు, కాని అది నిజంగా ప్రభావం చూపుతుంది. నేను దాదాపు సత్యంనుండి బయటకు వచ్చేసినంత పనయ్యింది.” ఒక సామెత యిలా అడుగుతుంది: “ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా?”—సామెతలు 6:27.
అప్రమత్తంగా ఉండండి
16. ఈనాటి సంగీత రచయితలు, గాయకులను గూర్చి ఏమి చెప్పవచ్చును?
16 పౌలు ప్రాచీన ఎఫెసులోని క్రైస్తవులకు యిలా వ్రాశాడు: “కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయకాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడిన వారై, తమ మనస్సుకు కలిగిన మాయను అనుసరించి నడుచుకొనుచున్నారు.” (ఎఫెసీయులు 4:17, 18) దీనిని ఈనాటి చాలామంది సంగీత రచయితలు, సంగీత వాయిద్యగాళ్లను గూర్చి చెప్పగలమా? ఎన్నడూ లేనంతగా, వివిధరకాల సంగీతాలు “ఈ యుగసంబంధమైన దేవత,” అపవాదియైన సాతాను ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నది.—2 కొరింథీయులు 4:4.
17. యౌవనులు సంగీతాన్ని నిర్ణయించడం, లేదా పరీక్షించడం ఎలా చేయగలరు?
17 “అంత్య దినములను” గూర్చి బైబిలు ముందుగనే ఈవిధంగా తెల్పింది: “దుర్జనులును వంచకులును (ఇతరులను) మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు.” (2 తిమోతి 3:1, 13) కాబట్టి, ఎన్నడూ లేనంతగా, మీరు మీరెన్నుకొనే సంగీతాన్ని జాగ్రత్తగా పరిశీలించ వలసియుంటుంది. తరచూ, సంగీత ఆల్బమ్ దానికున్న అవినీతికరమైన పేరునుబట్టి అనార్హమైందవుతుంది. యోబు 12:11 యిలా అడుగుతున్నది: “అంగిలి ఆహారమును రుచిచూచునట్లు చెవి మాటలను పరీక్షించదా?” అదేవిధంగా, మీరు సంగీతం విలువను తెలుసుకొనే ఉద్దేశ్యంతో నమూనాగా విని పరీక్షించవచ్చును. దీని స్వరం ఎటువంటి భావాలను మీలో ఉత్పన్నం చేస్తుంది? ఇది క్రూరమైన, క్షీణింపజేసే, అల్లరితో కూడిన ఆడిపాడే—ప్రవర్తనను పురికొల్పుతుందా? (గలతీయులు 5:19-21) గేయపదాల విషయమేమిటి? అవి లైంగిక అవినీతిని, మాదకద్రవ్యాల వినియోగం, లేదా “మాటలాడుటయైనను అవమానకరమైన” వేరే తప్పులను పురికొల్పుతాయా? (ఎఫెసీయులు 5:12) దేవుని ప్రజలమధ్య అటువంటి వాటి “పేరైనను ఎత్తకూడదని” బైబిలు చెబుతుంది, సంగీత స్వరం గూర్చి క్లుప్తమైన హెచ్చరికతో, పదేపదే చెప్పబడింది. (ఎఫెసీయులు 5:3) సంగీత ఆల్బమ్ కవరుచిత్రాన్ని గూర్చి ఏమిటి? అది లైంగికంగా పురికొల్పే లేదా మంత్రతంత్రాలను గూర్చిన బొమ్మలు కల్గినదా?
18. (ఎ) సంగీతం విషయానికొస్తే ఎటువంటి మార్పులను యౌవనులు కొందరు చేసుకోవలసియున్నారు? (బి) యౌవనులు ఎక్కువ యోగ్యమైన సంగీతం యెడల అభిరుచిని ఎలా పెంపొందించగలరు?
18 బహుశా మీరెన్నుకొనే సంగీతం విషయంలో మీరు కొన్ని మార్పులను చేసుకోవలసియుంటుంది. అవినీతికరమైన రికార్డులు, వీడియో టేపులు, దయ్యాల సంబంధమైన అవినీతికరమైన మూలంశాలతోనున్న డిస్క్‌లు మీవద్ద ఉన్నట్లయితే వెంటనే వాటిని పారవేయండి. (అపొస్తలుల కార్యములు 19:19 పోల్చండి.) మీరు సంగీత ఆనందాన్ని పొందకూడదని దీని భావంకాదు; జనసమ్మతమైన సంగీతమంతాకూడా అభ్యంతరమైంది కాదు. యౌవనులలో కొందరు వారి సంగీత అభిరుచులను పెంపొందించుటకు నేర్చుకుని, ప్రస్తుతం వారు కొన్ని శాస్త్రీయ, జానపద, చిన్న జాజ్, మరితర రకాల సంగీతాలను వినుటలో ఆనందిస్తున్నారు. చాలామంది యౌవనులకు అత్యుత్తమమైన వాద్యబృందసంగీతం యెడల అభిరుచిని వృద్ధిచేసుకొనుటకు కింగ్డమ్ మెలడీస్ టేపులు సహాయపడ్డాయి.
19. సంగీతాన్ని దానిస్థానంలోనే ఉంచుట ఎందుకు ప్రాముఖ్యము?
19 సంగీతమనేది దేవుని వరమైయున్నది. అయినను, చాలామందికి, యిది అవినీతికరమైన పూర్వాక్రమణగా తయారైంది. ప్రాచీన ఇశ్రాయేలీయులు ఆనందించినట్లుగానే వారు “సితారా స్వరమండల తంబుర, సన్నాయి వాయించుచు, . . . గాని యెహోవా పని యోచింపరు.” (యెషయా 5:12) సంగీతానికి యివ్వవలసిన స్థానమిస్తూనే, మీరు ప్రాముఖ్యంగా యెహోవా పని యెడల శ్రద్ధకల్గియుండండి. మీరెన్నుకొనే సంగీతాన్ని ఎన్నుకొనుటలో జాగ్రత్త వహించండి. తద్వారా మీరు దేవుని వరాన్ని దుర్వినియోగం చేయకుండా—ఉపయోగించగలరు. (w93 4/15)
[అధస్సూచీలు]
a సంగీతకళలో ఇశ్రాయేలీయుల దేశం మేటియైనదిగా కనబడుతుంది. అష్షూరీయులు చెక్కినశిల వివరించినట్లుగా రాజైన సన్హెరీబు హిజ్కియా రాజునుండి పన్నురూపంలో ఇశ్రాయేలు సంగీతవాయిద్యగాళ్లను యిమ్మని ఒత్తిడి చేశాడు. గ్రోవ్స్ డిక్షనరీ ఆఫ్ మ్యూజిక్ అండ్ మ్యుజీషియన్స్ అనే పుస్తకం యిలా వ్రాసింది: “సంగీతవాయిద్యగాళ్లను పన్నుగా కావాలని ఒత్తిడిచేయడం . . . నిజంగా అసాధారణమైనదే.”
మీకు జ్ఞాపకమున్నవా?
▫ సంగీతం దేవుని వరమని ఎందుకు పిలువవచ్చును?
▫ ప్రాచీనకాలంలో సంగీతం ఎలా దుర్వినియోగం చేయబడింది?
▫ రాప్ సంగీతం, హెవీమెటల్ సంగీతం క్రైస్తవ యౌవనులకు ఏ అపాయాలను తెస్తాయి?
▫ క్రైస్తవ యౌవనులు వారెన్నుకొనే సంగీతం విషయంలో ఎలా జాగ్రత్త వహించగలరు?
[బాక్సు]
బైబిలు సమయాలలో, యెహోవాకు స్తుతికి తెచ్చుటకు తరచూ ఉపయోగింపబడేది