సువార్తనందించుట—తటస్థసాక్ష్యమిచ్చుటకు అవకాశములను కలుగజేసికొనుట ద్వారా
1 యేసు తన శిష్యులతో వారి వెలుగును ప్రకాశింపనియ్యుడని ఉపదేశించాడు. (మత్త. 5:14-16) ప్రతి సదావకాశాన్ని వినియోగించి ఇతరులతో దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రకటించాలనీ వారిని ఆయన కోరాడు. ఈ విషయములో యేసే మంచి మాదిరిని చూపాడు. ఇందుకు ఒక ఉదాహరణ యేమనగా సుఖారను ఊరిలోని బావినొద్ద ఆయన సమరయ స్త్రీతో సత్యమునుగూర్చి మాట్లాడే అవకాశాన్ని వినియోగించాడు. (యోహా. 4:5-30) మన విషయమేమిటి? అలాంటి తరుణములను మనము సాక్ష్యమిచ్చుటకు వినియోగిస్తామా?
2 మనలో అందరు ప్రతిరోజు యింటింటి సేవలో పాల్గొనలేరు. అయితే అన్నిరోజులలోను సాక్ష్యమిచ్చు అవకాశము కల్గుతుంది. ఏ విధంగా? తటస్థసాక్ష్యము ద్వారా. దీని ద్వారా వేలమంది సత్యమును నేర్చుకొన్నారు. ఇట్టి అవకాశములను గుర్తించుటకు మెలకువ కలిగియుండి వాటిని ఉపయోగించినట్లయిన అనేకమందికి సాక్ష్యమివ్వవచ్చును.
మనమెవరికి ప్రకటించవచ్చును?
3 యింటింటి సేవ, పునర్దర్శనములు, బైబిలు పఠనాలతోపాటు మనము మన సహ ఉద్యోగులు, తోటి విద్యార్థులు, తోటి వ్యాపారస్థులు, బంధువులు, మరియు ఇతర పరిచయస్థులందరికి తటస్థ సాక్ష్యమియ్యవచ్చును. బస్సు, రైలు, విమాన ప్రయాణాలలో తోటి ప్రయాణీకులతో సంభాషణను ప్రారంభించవచ్చును. సెలవుపై వెళ్లినప్పుడు, హోటలు అధికారులు, పెట్రోలు బంకు పనివారలు, ఫలహారశాల పనివారలు మరియు టాక్సి నడిపేవారికి సువార్తనందించవచ్చును. డాక్టరు కొరకు వేచియున్నప్పుడు లేదా బయట లాండ్రి యొద్ద వేచియున్నప్పుడు అక్కడున్నవారితో మాట్లాడవచ్చును. ఇంటిదగ్గర యిరుగు పొరుగువాళ్లతో వస్తువులు అమ్మేవారు, లోక తెచ్చేవారితో మాట్లాడవచ్చును. మనము ఆస్పత్రిపాలైనప్పుడు కూడ అక్కడున్న డాక్టర్లు, నర్సులు, ఇతర రోగులందరికి సాక్ష్యమియ్యవచ్చును.
ఎలా ఆరంభించాలి
4 మనమెవరినైన కలిసికొనవలసిన నిర్ణీత సమయమంటూవుండి, ఆ సమయముకొరకు వేచియుండాల్సిన అవసరముందని మనకు తెలిస్తే అప్పుడు ఇతరులతో ఏదో ఒక శీర్షికలోని అంశాలనుగూర్చి మాట్లాడుటకు సిద్ధపడి ఉండునట్లు మనతో పాటు కొన్ని క్రొత్త పత్రికలను తీసికొని వెళ్లుట మంచిది. లేదా మనమొక కరపత్రాన్ని లేక బ్రోషూరునుపయోగించి సంభాషణ ఆరంభించవచ్చును. అటువంటి సందర్భాలలో కొందరైతే ఈ మధ్యనే జరిగిన ఒక సంఘటనను ఆధారము చేసుకొని వ్యాఖ్యానిస్తూ ఎదుటి వ్యక్తియొక్క అభిప్రాయాన్ని తెలిసికొని సంభాషణ ఆరంభించుటలో కృతకృత్యులయ్యారు. మరికొందరైతే అప్పుడే జరిగిన ఏదో ఒక సందర్భాన్ని గూర్చి ప్రశ్నిస్తూ మంచి సాక్ష్యమిస్తారు. అన్ని సందర్భాలలోను అనుకున్నవి జరగాలంటే ఆరంభించటానికి చొరవ తీసుకొనుట అవసరము.
ఉద్యోగస్థలములో సాక్ష్యమిచ్చుట
5 ఉద్యోగస్థులు తమ తోటి ఉద్యోగులకు సాక్ష్యమిచ్చే తరుణాలను వెదకవచ్చును. జార్జియా పట్టణములో ఇద్దరు సహోదరీలు, తమ తోటి ఉద్యోగస్థులలో సత్యము యెడల శ్రద్ధ కనపరుస్తారని అనుకున్నవారి పేర్లను వ్రాసుకున్నారు. లిస్టులో వ్రాసుకొన్నవారితోను, ఇంకా కొంతమందితోను వారు మాట్లాడినందువలన 65 రెవలేషన్ క్లైమాక్స్ పుస్తకములను అందించగలిగారు. వారిలో ఎంతో ఆసక్తిని రేకెత్తించారు.
6 మరొక సందర్భములో ఒక సహోదరుడు తనకున్న పదిహేను ని.ల విరామ సమయములో తన ప్రక్కన కూర్చొన్న మొదటి వ్యక్తికి సాక్ష్యమివ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆయన మాట్లాడిన వ్యక్తికి మన సత్యమును గూర్చి తెలుసు. గనుక అతడు ఎక్కువగా చర్చించుటకు యిష్టపడలేదు. అయినప్పటికి అతను సులభంగా తీసుకొనగలిగినచోట మన సహోదరుడు కొంత సాహిత్యాన్ని ఉంచాడు. ఆరునెలలలో అతను అతని కుటుంబీకులంతా బాప్తిస్మము పొందారు.
7 “లోకానికి వెలుగై” యున్న యేసు తటస్థ సాక్ష్యాన్ని యిచ్చే తరుణములను వినియోగించాడు. (యోహా. 8:12) మనము మెలకువుగా వుంటూ మన బైబిలు ఆధారిత నిరీక్షణనుగూర్చి ఇతరులకు చెప్పాలనుకుంటే మనము కూడ సాక్ష్యమిచ్చే అవకాశాలను జారవిడుచుకొనము. అట్లు యేసు శిష్యులవలె మనము ‘లోకములో జ్యోతులవలె వెలిగెదము.’—ఫిలి. 2:15, 16.