కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w05 10/15 పేజీలు 4-7
  • సర్వోత్తమ విద్య నుండి ప్రయోజనం పొందండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సర్వోత్తమ విద్య నుండి ప్రయోజనం పొందండి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిజ క్రైస్తవత్వమే ఒక విద్య
  • మారడానికి ప్రేరణ పొందడం
  • సర్వోత్తమ విద్యను మీరూ పొందవచ్చు
  • విద్య—యెహోవాను స్తుతించేందుకు దానిని వినియోగించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • అదనపు విద్య విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • బైబిలు విద్యాభ్యాసాన్ని నిరుత్సాహపరుస్తుందా?
    తేజరిల్లు!—1998
  • విద్యాభ్యాసాన్ని దాని స్థానంలో ఉంచుట
    తేజరిల్లు!—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
w05 10/15 పేజీలు 4-7

సర్వోత్తమ విద్య నుండి ప్రయోజనం పొందండి!

యెహోవా దేవుడు, మానవులతో సహా సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 1:27; ప్రకటన 4:10) ఆయన మహోపదేశకుడిగా మొదటి మానవ దంపతులైన ఆదాముహవ్వలకు విద్య నేర్పించి, అందమైన ఏదెను తోటలో జీవించడానికి వారిని సిద్ధం చేశాడు. వారికి నిరంతరం విద్య నేర్పిస్తూ వారి గురించి శ్రద్ధ తీసుకోవాలన్నది ఆయన సంకల్పం. (ఆదికాండము 1:28, 29; 2:15-17; యెషయా 30:20, 21) ఆ భావి నిరీక్షణ గురించి ఒక్కసారి ఆలోచించండి!

అయితే విచారకరంగా, మొదటి దంపతులు తమ భావి నిరీక్షణలను పోగొట్టుకున్నారు. వారి అవిధేయతా విధానం మానవజాతి నైతిక, శారీరక పతనానికి దారి తీసింది. (ఆదికాండము 3:17-19; రోమీయులు 5:12) మానవజాతి సృష్టించబడిన తర్వాత, కేవలం కొన్ని తరాలు గడిచాక జీవించిన వారి గురించి బైబిలు ఇలా చెబుతోంది: “నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను.”​—ఆదికాండము 6:5.

మానవుడు ఎప్పుడూ చెడు పనులు చేయడానికే మొగ్గుచూపుతాడని యెహోవా తేల్చి చెప్పి దాదాపు 4,500 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు మానవజాతి పరిస్థితి మునుపటికన్నా దుర్భరంగా తయారైంది. చాలామంది నిర్లజ్జగా అబద్ధాలు చెబుతారు, దొంగతనం చేస్తారు, ఇతరుల మీద దాడిచేస్తారు. తోటి మానవుడిపట్ల శ్రద్ధ సన్నగిల్లిపోతుండగా సమస్యలు రోజు రోజుకూ అధికమవుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉండే సంబంధాలతో సహా చాలా వ్యక్తిగత సంబంధాలు నిజమైన సంక్షోభాన్ని ఎదుర్కోవడం లేదా? అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితికి దేవుడు బాధ్యుడు కాదు, అంతేగాక నేటి సమస్యల గురించి ఆయన పట్టించుకోవడం మానేశాడని చెప్పలేము. యెహోవాకు మానవజాతి సంక్షేమం గురించి ఎల్లప్పుడూ ఆసక్తి ఉంది, సంతోషకరమైన జీవితాన్ని సంపాదించుకోవడం కోసం తన మార్గనిర్దేశం కావాలని కోరుకునేవారికి బోధించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దాదాపు 2,000 సంవత్సరాల క్రితం ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును భూమ్మీదికి పంపించి, తమ జీవితాన్ని విజయవంతం చేసుకోవాలని కోరుకునేవారికి బోధించాలనే ఆసక్తి తనకు ఉందని చూపించాడు. యేసు పరిపూర్ణ విద్య విషయంలో ఒక మాదిరిని ఉంచాడు, ఎందుకంటే లెక్కలేనన్ని యుగాలపాటు మహోపదేశకుడే ఆయనకు బోధించాడు.

నిజ క్రైస్తవత్వమే ఒక విద్య

యేసుక్రీస్తు నిజ క్రైస్తవత్వాన్ని అంటే, ప్రేమపై ఆధారపడిన జీవన విధానాన్ని ప్రారంభించాడు. దానిలో, ఆయన నామానికి ఘనతా మహిమా తీసుకురావాలనే సంకల్పాన్ని నెరవేర్చడానికి తలంపులు, చర్యలు అన్నీ దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి. (మత్తయి 22:37-39; హెబ్రీయులు 10:7) ఈ జీవన విధానం గురించి యేసు బోధించినవాటికి ఆయన తండ్రియైన యెహోవా మద్దతు ఉంది. దేవుని నుండి యేసు పొందిన మద్దతు గురించి యోహాను 8:29లో మనమిలా చదువుతాం: “నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు.” అవును, యేసుకు తన పరిచర్య అంతటిలో తన తండ్రి మద్దతు, మార్గనిర్దేశం లభించాయి. యేసు తొలి అనుచరులు జీవిత సవాళ్ళను మార్గనిర్దేశం లేకుండా ఎదుర్కోవలసి రాలేదు. యెహోవా తన కుమారుని ద్వారా వారికి విద్య నేర్పించాడు. వారు యేసు బోధలను, ఆయన మాదిరిని అనుసరించి ఉత్తమ ప్రజలుగా తయారయ్యారు. అది నేడు ఆయన శిష్యుల విషయంలో కూడా వాస్తవం.​—6వ పేజీలోవున్న, “యేసు, ఆయన బోధలు చూపించిన ప్రభావం” అనే బాక్సు చూడండి.

నిజ క్రైస్తవత్వంలోని ఒక విశేషమైన అంశం ఏమిటంటే, మనుష్యులను లోపలి నుండి మార్చే విధంగా మనస్సును హృదయాన్ని ప్రభావితం చేసే విద్య అందులో ఒక భాగం. (ఎఫెసీయులు 4:23, 24) దానికి ఒక ఉదాహరణగా, ఒకరు తమ జీవిత భాగస్వామిపట్ల యథార్థంగా ఉండడం గురించి యేసు ఏమి బోధించాడో పరిశీలించండి: “వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; నేను మీతో చెప్పునదేమనగా​—ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.” (మత్తయి 5:27, 28) యేసు ఈ మాటలతో, హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ, అనుచితమైన తలంపులు, కోరికలు కార్యరూపం దాల్చకపోయినా వాటికి గంభీరమైన పర్యవసానాలు ఉండవచ్చనీ తన శిష్యులకు బోధించాడు. చెడు తలంపులు దేవుని మనసును నొప్పించే చర్యలకు, ఇతరులను బాధపెట్టే చర్యలకు దారితీస్తాయన్నది నిజం కాదా?

కాబట్టి, బైబిలు ఈ ఉపదేశాన్నిస్తోంది: “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.” (రోమీయులు 12:2) ‘విద్య ద్వారా మనస్సులో మార్పు రావడం నిజంగా సాధ్యమేనా?’ అని మీరు అడగవచ్చు. మనసులో మార్పు తీసుకురావడం అంటే, దేవుని వాక్యంలోని సూత్రాలతో ఉపదేశంతో మనసును నింపడం ద్వారా దాన్ని వేరే దిశలో వెళ్ళేందుకు ప్రేరేపించడమని అర్థం. దేవుడు తన వాక్యం ద్వారా ఇస్తున్న విద్యను అంగీకరించడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది.

మారడానికి ప్రేరణ పొందడం

‘దేవుని వాక్యము సజీవమైనది, బలముగలది.’ (హెబ్రీయులు 4:12) అది ఇప్పటికీ వ్యక్తులపై శక్తిమంతమైన ప్రభావం చూపిస్తూ, ఎన్నటికీ మారని పుస్తకమని నిరూపించుకుంటోంది. ఒక వ్యక్తి తన మార్గాన్ని మార్చుకొని, నిజ క్రైస్తవత్వాన్ని హత్తుకొని, మంచి వ్యక్తిగా మారేందుకు కావలసిన ప్రేరణనిస్తుంది. బైబిలు విద్యా ప్రాముఖ్యతను ఈ క్రింది ఉదాహరణలు తెలియజేస్తాయి.

ముందటి ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన ఎమీల్య ఇలా చెబుతోంది: “మా ఇంటి పరిస్థితి కేవలం నా స్వయంకృషివల్ల మాత్రమే బాగుపడలేదు. నేను యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించినప్పుడు, పరిస్థితులు చక్కబడే ఆశ ఉందని గుర్తించి నా దృక్పథాన్ని మార్చుకోవడం ప్రారంభించాను. నేను మరింత సహనంగా ఉండడం, విపరీతమైన కోపం తెచ్చుకోకుండా ఉండడం నేర్చుకున్నాను. కొంతకాలానికి నా భర్త కూడా నాతోపాటు అధ్యయనం చేయడం ప్రారంభించాడు. త్రాగుడు మానడం ఆయనకంత సులభం కాలేదు గానీ ఆయన మానేశాడు. దానితో మా వివాహానికి క్రొత్త ప్రారంభం లభించింది. మేమిప్పుడు సంతోషంగా ఉన్న క్రైస్తవులం, బైబిలులోని చక్కని సూత్రాలను మా పిల్లల్లో నాటుతున్నాం.”​—ద్వితీయోపదేశకాండము 6:7.

నిజ క్రైస్తవత్వం ఇచ్చే విద్య ఒక వ్యక్తిని చెడు నుండి, అనైతిక జీవన విధానం నుండి కాపాడుతుంది. ఇది వాస్తవమని మాన్వెల్‌a గ్రహించాడు. ఆయన 13 ఏళ్ళ వయస్సులో ఇంటి నుండి పారిపోయి మరివానకు అలవాటుపడ్డాడు. కొంతకాలానికి హెరొయిన్‌కు అలవాటుపడ్డాడు. ఆశ్రయం కోసం, డబ్బు కోసం ఆయన పురుషులతోనూ స్త్రీలతోనూ లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు. మాన్వెల్‌ కొన్నిసార్లు ప్రజలను దౌర్జన్యంగా దోచుకొని డబ్బు సంపాదించుకున్నాడు. ఆయన దాదాపు ఎప్పుడూ మాదకద్రవ్యాల మత్తులోనే ఉండేవాడు. ఆయన తన దౌర్జన్యపూరిత ప్రవర్తన మూలంగా తరచూ జైలుకెళుతుండేవాడు. ఒకసారి ఆయన నాలుగు సంవత్సరాలపాటు జైల్లో ఉన్నాడు, అక్కడ అక్రమ ఆయుధాల వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. వివాహమైన తర్వాత కూడా మాన్వెల్‌ తన చర్యల పర్యవసానాలు ఎదుర్కొన్నాడు. ఆయనిలా చెబుతున్నాడు: “మేము ఒకప్పుడు కోళ్ళ ఫారమ్‌గా ఉన్నదాంట్లో నివసించడం మొదలుపెట్టాం. నా భార్య కొన్ని ఇటుకల మీద వంటచేయడం నాకిప్పటికీ గుర్తుంది. మా పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉండేవంటే, నన్ను విడిచి వెళ్ళిపొమ్మని నా స్వంత కుటుంబమే నా భార్యను ప్రోత్సహించింది.”

మాన్వెల్‌ జీవితాన్ని మార్చిందేమిటి? ఆయనిలా సమాధానమిస్తున్నాడు: “మాకు తెలిసిన ఒక వ్యక్తి బైబిలు గురించి చెబుతూ మా ఇంటికి వచ్చాడు. మనుష్యులపట్ల ఆసక్తిగల దేవుడు ఉనికిలో లేడని ఆ వ్యక్తికి చూపించడానికే, నేను ఆయనను మా యింటికి రానిచ్చాను. మనుష్యులపట్ల దేవునికి ఆసక్తి లేదనడానికి నేనే సజీవ సాక్ష్యమని నేను భావించాను. ఆ సాక్షి చూపించిన సహనానికి, సభ్యతకు నేను ఆశ్చర్యపోయాను, దానితో రాజ్యమందిరంలో కూటాలకు హాజరవడానికి నేను అంగీకరించాను. అక్కడున్న కొందరికి నా గతం గురించి తెలిసినా నన్ను స్నేహపూర్వకంగా పలకరించారు. నేనూ వారిలో ఒకరినని భావించేలా చేశారు. అది నాకు ఎంతో ఓదార్పునిచ్చింది. నేను గౌరవప్రదమైన ఉద్యోగం సంపాదించుకునేందుకు మాదకద్రవ్యాల లోకాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకునేంతగా అది నాపై ప్రభావం చూపింది. బైబిలు అధ్యయనం ప్రారంభించిన నాలుగు నెలల తర్వాత నేను ప్రకటనా పనిలో పాల్గొనడానికి అర్హుణ్ణయ్యాను, ఆ తర్వాత మరో నాలుగు నెలలకు నేను ఒక యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకున్నాను.”

నిజ క్రైస్తవత్వంవల్ల మాన్వెల్‌కు ఆయన కుటుంబానికి ఎలాంటి ప్రతిఫలం లభించింది? “బైబిలు విద్య లేకపోతే నేను ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాల క్రితమే మరణించి ఉండేవాడిని. యేసు బోధించిన జీవన విధానం నా కుటుంబం తిరిగి నాకు దక్కేలా చేసింది. యౌవనస్థుడిగా నేను ఎదుర్కొన్న పరిస్థితులను నా ఇద్దరు పిల్లలు ఎదుర్కోవలసిన అవసరం లేదు. నాకిప్పుడు నా భార్యతో ఉన్న మంచి సంబంధాన్నిబట్టి నేను ఎంతో గర్విస్తున్నాను, దానికి నేను యెహోవాకు ఎంతో కృతజ్ఞుడను. నా మునుపటి పరిచయస్థులు కొందరు నన్ను అభినందించి, నేను ఇప్పుడు అనుసరిస్తున్న మార్గం చాలా మంచిదని తాము భావిస్తున్నట్లు చెప్పారు.”

క్రైస్తవ జీవన విధానంలో, నైతిక పరిశుభ్రతే కాక శారీరక పరిశుభ్రత కూడా అవసరం. దక్షిణాఫ్రికాలోని నిరుపేద ప్రాంతంలో నివసిస్తున్న జాన్‌ ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఆయనిలా వివరిస్తున్నాడు: “మా అమ్మాయి కొన్నిసార్లు వారానికొకసారే స్నానం చేసేది, అయినా మేమెవరం పట్టించుకునేవాళ్ళం కాదు.” తమ ఇల్లు చాలా అపరిశుభ్రంగా ఉండేదని ఆయన భార్య అంగీకరిస్తోంది. కానీ క్రైస్తవ విద్యతో పరిస్థితులు మారిపోయాయి. జాన్‌ కార్లు దొంగిలించే ముఠాతో సహవాసం మానుకొని తన కుటుంబానికి ఎక్కువ శ్రద్ధనివ్వడం ప్రారంభించాడు. “క్రైస్తవులముగా మనం మన శరీరాలను, బట్టలను శుభ్రంగా ఉంచుకోవాలని మేము తెలుసుకున్నాం. యెహోవా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రోత్సహించే 1 పేతురు 1:14 లోని మాటలు నాకెంతో ఇష్టం. ఇప్పుడు మేము కూడా మా చిన్న ఇల్లు చక్కగా కనిపించేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాం.”

సర్వోత్తమ విద్యను మీరూ పొందవచ్చు

పైన పేర్కొన్న అనుభవాలు ఎక్కడో నూటికో కోటికో జరిగే ఉదంతాలు కావు. బైబిలు ఆధారిత విద్య ద్వారా వేలాదిమంది మెరుగైన జీవితాలను జీవించడం నేర్చుకున్నారు. నిజాయితీగా, శ్రమించి పనిచేసేవారిగా ఉండడం ద్వారా వారి యజమానులు వారిని విలువైనవారిగా పరిగణిస్తున్నారు. వారు తమ తోటి మానవుల సంక్షేమం విషయంలో శ్రద్ధ వహిస్తూ మంచి పొరుగువారిగా, మంచి స్నేహితులుగా తయారయ్యారు. వారు చెడ్డపనులను, శారీరక దృక్పథాలను నివారించడానికి నిశ్చయించుకున్నారు, అందుకే వారు తమ శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యం విషయంలో చక్కని శ్రద్ధ తీసుకుంటారు. తమ వనరులను చెడ్డ పనులకు వ్యర్థం చేసుకునే బదులు, వాటిని తమ మంచి కోసం తమ కుటుంబాల మేలు కోసం ఉపయోగించుకుంటున్నారు. (1 కొరింథీయులు 6:9-11; కొలొస్సయులు 3:18-23) నిస్సందేహంగా, బైబిలులో యెహోవా తెలియజేసిన వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా వచ్చే ఫలితాలు, నిజ క్రైస్తవత్వం ప్రకారం జీవించడం సర్వశ్రేష్ఠమైన జీవన విధానమని, అది సర్వోత్తమ విద్యను ఇస్తుందని చూపిస్తాయి. దేవుని సూత్రాలకు అనుగుణంగా జీవించే వ్యక్తి గురించి బైబిలు ఇలా చెబుతోంది: “అతడు చేయునదంతయు సఫలమగును.”​—కీర్తన 1:3.

సర్వశక్తిగల దేవుడైన యెహోవా మనకు విద్య నేర్పించడానికి ఇష్టపడుతున్నాడని తెలుసుకోవడం మనకు ప్రోత్సాహాన్నిస్తుంది. ఆయన తన గురించి తానిలా చెబుతున్నాడు: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.” (యెషయా 48:17) అవును యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు మాదిరి ద్వారా, బోధల ద్వారా మార్గాన్ని చూపించాడు. ఆయన బోధలు, ఆయన భూమ్మీద ఉన్నప్పుడు ఆయన గురించి తెలిసిన అనేకుల జీవితాల్లో పెద్ద మార్పును తీసుకువచ్చాయి, నేడు ఆయన బోధల ప్రకారం జీవించే అనేకమంది విషయంలో కూడా ఇది నిజం. ఈ బోధల గురించి మరింత తెలుసుకోవడానికి ఎందుకు సమయం వెచ్చించకూడదు? అలాంటి విలువైన విద్యను పొందడానికి మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులు మీకు సంతోషంగా సహాయం చేస్తారు.

[అధస్సూచి]

a కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[6వ పేజీలోని బాక్సు/చిత్రం]

యేసు, ఆయన బోధలు చూపించిన ప్రభావం

జక్కయ్య సుంకపు గుత్తదారుడిగా తన స్థానాన్ని ఉపయోగించుకుని అన్యాయంగా డబ్బు వసూలు చేయడం ద్వారా, సామాన్య ప్రజలను దోచుకోవడం ద్వారా ధనవంతుడయ్యాడు. కానీ యేసు బోధలను అన్వయించుకోవడం ద్వారా ఆయన తన జీవన విధానాన్ని మార్చుకున్నాడు.​—లూకా 19:1-10.

తార్సువాడైన సౌలు క్రైస్తవులను హింసించడం మానేసి, క్రైస్తవత్వాన్ని స్వీకరించి, అపొస్తలుడైన పౌలుగా మారాడు.​—అపొస్తలుల కార్యములు 22:6-21; ఫిలిప్పీయులు 3:4-9.

కొరింథులోని క్రైస్తవులు కొంతమంది ముందు ‘జారులుగా, విగ్రహారాధకులుగా, వ్యభిచారులుగా, ఆడంగితనముగలవారిగా, దొంగలుగా, లోభులుగా, త్రాగుబోతులుగా, దూషకులుగా, దోచుకొనువారిగా’ ఉన్నారు. అయినప్పటికీ, నిజ క్రైస్తవత్వాన్ని తెలుసుకున్న తర్వాత, వారు ‘కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై, ప్రభువైన యేసు క్రీస్తు నామమున నీతిమంతులుగా తీర్చబడ్డారు.’​—1 కొరింథీయులు 6:9-11.

[7వ పేజీలోని చిత్రం]

విజయాన్ని ఎలా సాధించవచ్చో బైబిలు మీకు చూపించగలదు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి