ఎలాంటి విద్య మీ జీవితాన్ని విజయవంతం చేయగలదు?
మీరెప్పుడైనా సమస్యల సుడిగుండంలో మునిగిపోయేంతగా సమస్యలు మిమ్మల్ని చుట్టుముడుతున్నాయని భావించారా? ఆ సమస్యల్లో ఒకదానితో లేదా వాటిలో కొన్ని సమస్యలతో వ్యవహరించడంలో మీరు పొరపాటు చేస్తే ఎంత బాధ కలుగుతుందో ఒకసారి ఊహించండి. ప్రతీసారి సరైన నిర్ణయాలు తీసుకుంటూ సమస్యలన్నిటినీ విజయవంతంగా పరిష్కరించుకోగల సామర్థ్యంతో ఎవరూ జన్మించరు. అందుకే విద్య అవసరం. జీవిత సమస్యలతో వ్యవహరించడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకునేందుకు, విద్యను ఎక్కడ పొందవచ్చు?
పాఠశాల విద్య ఎంతో ప్రాముఖ్యం అని పిన్నలు, పెద్దలు అనేకులు అంటారు. కొంతమంది నిపుణులు, “కళాశాల డిగ్రీ లేకుండా [మంచి] ఉద్యోగాన్ని సంపాదించుకోవడం అసాధ్యమని విశ్వసిస్తున్నాం” అని కూడా చెబుతారు. అయినా, వస్తుపరమైన సాఫల్యాలను మించిన మానవ అవసరాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు, ఉన్నత విద్య మీరు మంచి తల్లిదండ్రులుగా, మంచి భార్యాభర్తలుగా, మంచి స్నేహితులుగా ఉండడానికి సహాయం చేస్తుందా? వాస్తవానికి, మేధాపరంగా ఎన్నో సాఫల్యాలు సాధించినందుకు ప్రశంసలు అందుకునే వ్యక్తులు, చెడు వ్యక్తిత్వ లక్షణాలను వృద్ధి చేసుకోవచ్చు, కుటుంబ జీవితంలో విఫలం కావచ్చు, చివరకు ఆత్మహత్యకు కూడా పాల్పడవచ్చు.
కొంతమంది మతాన్ని విద్యకు మూలంగా భావిస్తూ నడిపింపు కోసం దానివైపు చూస్తారు, కానీ జీవిత కష్టాలను ఎదుర్కోవడానికి ఆచరణీయమైన సహాయాన్ని పొందలేక వారు నిరాశకు గురవుతారు. దీన్ని, మెక్సికోకు చెందిన ఏమీల్యa సోదాహరణంగా ఇలా చెబుతోంది: “నేనూ నా భర్తా ఇక ఎంతమాత్రం కలిసి జీవించలేమని నేను 15 ఏళ్ళ క్రితం అనుకున్నాను. మేము ఎప్పుడూ వాదించుకునేవాళ్ళం. నేను ఆయన త్రాగుడును మాన్పించలేకపోయాను. నేను తరచూ మా పసిపిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి నా భర్తను వెదకడానికి వెళ్ళాల్సి వచ్చేది. నేను మానసికంగా పూర్తిగా అలసిపోయాను. ఒక పరిష్కారం పొందడానికి సహాయం చేసేదేదైనా లభిస్తుందేమోనని నేను చాలాసార్లు చర్చికి వెళ్ళాను. అక్కడ అరుదుగా బైబిలు ఉపయోగించబడినా, నా పరిస్థితితో సూటిగా వ్యవహరించే ఉపదేశం మాత్రం నేను ఎప్పుడూ వినలేదు; ఏమి చేయాలో చెప్పడానికి ఎవరూ నా దగ్గరికి రాలేదు. కాస్సేపు చర్చిలో కూర్చొని, కొన్ని ప్రార్థనలు పదే పదే వల్లెవేయడం నాకు సంతృప్తినివ్వలేదు.” మరికొందరు తమ ఆధ్యాత్మిక నాయకులు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపకపోవడం చూసి నిరాశ చెందుతారు. ఫలితంగా, విజయవంతమైన జీవితానికి అవసరమైన తర్ఫీదును లేక విద్యను మతం ఇవ్వగలదన్న నమ్మకం చాలామందికి లేకుండా పోతుంది.
కాబట్టి, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోవచ్చు: ‘నా జీవితం విజయవంతం కావడానికి నేను ఏ విధమైన విద్య సంపాదించుకోవాలి?’ ఈ ప్రాముఖ్యమైన ప్రశ్నకు నిజమైన క్రైస్తవత్వంలో జవాబు లభిస్తుందా? తర్వాతి ఆర్టికల్లో ఈ విషయం పరిశీలించబడుతుంది.
[అధస్సూచి]
a కొన్నిపేర్లు మార్చబడ్డాయి.