యెహోవా నా శైలముగా ఉన్నాడు
ఇమ్మాన్వీల్ లియోనూడాకీస్ చెప్పినది
మా అమ్మ కనుబొమలు ముడేసి, నాతో ఇలా అంది: “అదే గనుక నీ నిర్ణయమైతే నీవు ఇల్లు వదిలి వెళ్లాల్సి ఉంటుంది.” నేను దేవుని రాజ్యాన్ని పూర్తికాలం ప్రకటించటానికి నిర్ణయించుకున్నాను. కాని, నేను పదే పదే అరెస్టు కావడం మూలంగా తమకు కల్గుతున్న అవమానాన్ని నా కుటుంబం భరించలేకపోయింది.
తల్లిదండ్రులు నిరాడంబరులు, దైవభయం గలవారు. వాళ్లు డూల్యీనా గ్రామంలో నివసించేవాళ్లు, అది గ్రీసుకు చెందిన క్రీట్ ద్వీపానికి పశ్చిమ భాగాన ఉంది, నేను 1908లో అక్కడే జన్మించాను. నా చిన్నతనం నుండే నాకు, దేవునికి భయపడటం, ఆయనను గౌరవించటం నేర్పించారు. నేను ఉపాధ్యాయుల చేతుల్లో లేక గ్రీకు ఆర్థోడాక్స్ ప్రీస్టుల చేతుల్లో ఎన్నడూ బైబిల్‌ను చూడకపోయినప్పటికీ నేను దేవుని వాక్యాన్ని ప్రేమించాను.
సి. టి. రసెల్ వ్రాసిన స్టడీస్ ఇన్ ద స్క్రిప్చర్స్ సంపుటిలలో ఆరింటినీ, ద హార్ప్ ఆఫ్ గాడ్ అనే పుస్తకాన్నీ చదివిన తర్వాత మా పొరుగింటాయన, వాటిలోని కనువిప్పు కలిగించే లేఖనాంశాలను ఎంతో ఉత్సాహంగా నాతో చెప్పాడు. అప్పట్లో బైబిలు విద్యార్థులని పిలువబడిన యెహోవాసాక్షులు ఆ పుస్తకాలను ప్రచురించారు. నేను ఒక బైబిలును, ఆ పుస్తకాలను ఏథెన్సులోని వాచ్ టవర్ సొసైటీ కార్యాలయం నుండి సంతోషంగా సంపాదించాను. ఆ పొరుగింటాయనతో కలిసి రాత్రి చాలా పొద్దుపోయే వరకు మేలుకుని ఉండి, యెహోవాకు ప్రార్థించటం, దీపం వెలుగులో ఆ ప్రచురణల సహాయంతో లేఖనాలను పరిశోధించటం నాకు ఇప్పటికీ జ్ఞాపకముంది.
నేను క్రొత్తగా కనుగొన్న బైబిలు జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవటం ప్రారంభించేనాటికి నాకు 20 ఏళ్లు, అప్పుడు నేను దగ్గరలో ఉన్న గ్రామంలో స్కూలు టీచరుగా పనిచేస్తున్నాను. త్వరలోనే, నలుగురం డూల్యీనాలో బైబిలు పఠనం కోసం క్రమంగా కూటాలు జరుపుకుంటూ ఉండేవాళ్లం. మానవజాతి ఏకైక నిరీక్షణ అయిన దేవుని రాజ్యం గురించి ఇతరులు తెలుసుకోవటానికి వారికి సహాయం చేయాలని మేము కరపత్రాలు, చిన్నపుస్తకాలు, పుస్తకాలు, బైబిళ్లు కూడా పంచిపెట్టాము.
1931లో ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులనే బైబిలు ఆధారిత పేరును తీసుకున్న వేలాదిమందిలో మేమూ ఉన్నాము. (యెషయా 43:10) తర్వాతి సంవత్సరంలో, మన క్రొత్త పేరును, దాని ప్రాధాన్యతను అధికారులకు వివరించే ఒక సమాచార ప్రచారంలో మేము పాల్గొన్నాము. ఆ ప్రచారంలో భాగంగా, తత్సంబంధిత చిన్న పుస్తకాన్ని మా ప్రాంతంలోని ప్రతి ప్రీస్టుకూ, జడ్జికీ, పోలీస్ అధికారికి, వ్యాపారవేత్తకు పంచిపెట్టాము.
అనుకున్నట్లుగానే, మతనాయకులు హింసను రేకెత్తించారు. నేను అరెస్టయిన మొట్టమొదటిసారి, నాకు 20 రోజుల జైలు శిక్ష విధించబడింది. విడుదల చేయబడిన వెంటనే, నన్ను మళ్లీ అరెస్టుచేసి, నెల రోజుల జైలు శిక్ష విధించారు. ప్రకటించటం మానేయమని ఒక జడ్జి అధికారంతో చెప్పినప్పుడు, “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా” అని ఉన్న అపొస్తలుల కార్యములు 5:29లోని మాటలతో మేము సమాధానమిచ్చాము. తర్వాత, 1932లో, వాచ్ టవర్ ప్రతినిధి ఒకరు మా చిన్న గ్రామమైన డూల్యీనాను సందర్శించాడు, మేము నలుగురం బాప్తిస్మం తీసుకున్నాము.
ఒక ఆధ్యాత్మిక కుటుంబాన్ని కనుగొనటం
ప్రకటనా పనిలో ఇంకా ఎక్కువగా పాల్గొనాలనే నా కోరిక మూలంగా, నేను పాఠశాలలో బోధించే నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను. దానితో మా అమ్మకు కోపం పెల్లుబికింది. ఆమె నన్ను ఇల్లు వదిలి వెళ్లిపోమంది. ఏథెన్స్‌లోని వాచ్ టవర్ బ్రాంచి కార్యాలయం అంగీకారంతో, క్రీట్‌లోని ఇరాక్లోన్ నగరంలో నివసిస్తున్న, ఉదార స్వభావంగల ఒక క్రైస్తవ సహోదరుడు నన్ను ఆనందంగా తన ఇంట్లో చేర్చుకున్నాడు. కాబట్టి 1933 ఆగస్టులో, నాకు వీడ్కోలు ఇవ్వటానికి కొంతమంది ఆసక్తిగలవారితో పాటు నా స్వగ్రామానికి చెందిన సహోదరులు బస్టాప్‌కు వచ్చారు. అది నిజంగా ఎంతో కదిలించి వేసే సమయం, మేమంతా ఒకరినొకరం మళ్లీ ఎప్పుడు చూసుకుంటామో తెలియదు గనుక మేమందరం దుఃఖించాము.
ఇరాక్లోన్‌లో, నేను ఒక ప్రేమగల ఆధ్యాత్మిక కుటుంబంలో భాగమయ్యాను. అక్కడ మరో ముగ్గురు క్రైస్తవ సహోదరులు, ఒక సహోదరి ఉండేవారు, మేము పఠనం కోసం ఆరాధన కోసం క్రమంగా కూడుకునేవాళ్లం. “నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు . . . నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను . . . పొందునని” యేసు చేసిన వాగ్దాన నెరవేర్పును నేను ప్రత్యక్షంగా చూడగలిగాను. (మార్కు 10:29, 30) ఆ నగరంలోనూ, సమీప గ్రామాల్లోనూ ప్రకటించటం నాకివ్వబడిన నియామకం. నేను ఆ నగరంలో ప్రకటించటం ముగించిన తర్వాత, ఇరాక్లోన్, లసీథీయోన్ మండలాల్లో పని చేయటానికి అక్కడికి వెళ్లాను.
ఒంటరి పయినీరు
గ్రామం నుండి గ్రామానికి నడవటంలో నేను చాలా గంటలు గడిపాను. ప్రచురణలను రవాణా చేయటం అంత తరచుగా జరిగేది కాదు కాబట్టి, నేను ఎన్నో కిలోల ముద్రిత సమాచారాన్ని మోసుకు వెళ్లవలసి వచ్చేది. నాకు పడుకోవటానికి స్థలం ఉండేది కాదు గనుక, నేను గ్రామంలోని కాఫీ హోటల్లోకి వెళ్లి చివరి కస్టమర్ వెళ్లిపోయేవరకు వేచి ఉండి ఆ తర్వాత ఒక పరుపు మీద పడుకునే వాడ్ని, సాధారణంగా చివరి కస్టమర్ వెళ్లే సరికి మధ్య రాత్రి అయ్యేది, మరునాడు ఉదయం ఆ హోటల్ యజమాని వచ్చి దాన్ని తెరవటానికి ముందే అంటే చాలా పెందరాళే లేవాల్సి వచ్చేది. లెక్కలేనన్ని కీటకాలు కూడా నాతోపాటు పరుపు మీదికి చేరేవి.
సాధారణంగా ప్రజలు అంత అనుకూలంగా ప్రతిస్పందించకపోయినప్పటికీ, నేను నా యౌవనశక్తిని యెహోవాకు సమర్పించటంలో ఆనందాన్ని పొందేవాడిని. బైబిలు సత్యమందు ఆసక్తిగల వ్యక్తిని నేను కనుగొన్నప్పుడు, ఈ జీవరక్షక పరిచర్యలో కొనసాగాలన్న నా నిశ్చయతను అది పునర్నూతనం చేసేది. నా ఆధ్యాత్మిక సహోదరుల సహవాసం కూడా ఉత్తేజాన్నిచ్చేదిగా ఉండేది. నేను ఇరాక్లోన్ నగరం నుండి ఎంత దూరంలో ప్రకటిస్తున్నాననేదాని ఆధారంగా నేను 20 నుండి 50 రోజుల తర్వాత వారిని కలిసేవాడిని.
ఒకరోజు మధ్యాహ్నం నేను చాలా ఒంటరితనం అనుభవించాను, ప్రాముఖ్యంగా ఇరాక్లోన్‌లోవున్న నా క్రైస్తవ సహోదర సహోదరీలు ఆ సాయంకాలం తమ క్రమ కూటాలను జరుపుకుంటూ ఉంటారన్న తలంపుతో, నేను అనుభవించిన ఒంటరితనం నాకిప్పటికీ స్పష్టంగా జ్ఞాపకం ఉంది. వాళ్లను చూడాలన్న కోరిక ఎంత బలంగా కలిగిందంటే, వాళ్ల నుండి నన్ను వేరుచేస్తున్న 25 కంటే ఎక్కువ కిలోమీటర్ల దూరాన్ని నడిచి వెళ్లటానికి నిర్ణయించుకున్నాను. నేనెప్పుడూ అంత వేగంగా నడవలేదు. ఆ సాయంకాలం నా సహోదరుల ఆహ్లాదభరితమైన సహవాసాన్ని అనుభవించటం ఎంత ఓదార్పు నిచ్చిందంటే, ఒక విధంగా చెప్పాలంటే నా ఆధ్యాత్మిక జలాశయాన్ని మళ్లీ నింపుకున్నట్లయ్యింది!
త్వరలోనే, శ్రమతో కూడిన నా ప్రకటనా ప్రయాసలు ఫలించనారంభించాయి. అపొస్తలుల కాలంలోలాగే, ‘యెహోవా రక్షణ పొందుచున్నవారిని మాతో చేర్చుచుండెను.’ (అపొస్తలుల కార్యములు 2:47) క్రీట్‌లో యెహోవా ఆరాధకుల సంఖ్య పెరగటం మొదలెట్టింది. ఇతరులు పరిచర్యలో నాతో కలవటంతో, నేను ఇక ఎంతమాత్రం ఒంటరితనం అనుభవించలేదు. మేము శారీరక కష్టాన్ని, తీవ్రమైన వ్యతిరేకతను సహించాము. మా అనుదిన ఆహారం బ్రెడ్డు, దానికి తోడుగా గ్రుడ్లు, ఓలీవ పండ్లు, లేదా కూరగాయలు ఉపయోగించేవాళ్లం, మేము ప్రకటించింది విన్నవారు సాహిత్యాన్ని తీసుకుని దానికి మారుగా అవి ఇచ్చేవాళ్లు.
క్రీట్ దక్షిణ ప్రాంతంలో ఉన్న లీరపెట్రా పట్టణంలో, నేను మీనోస్ కొక్కినాకీస్ అనే బట్టల వ్యాపారికి సాక్ష్యమిచ్చాను. ఆయనతో బైబిలు పఠనం ప్రారంభించాలని నేను ఎంత తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఆయన బిజీ జీవితాన్ని బట్టి ఆయనకు ఎక్కువ సమయం దొరికేది కాదు. అయితే, చివరికి ఆయన తన పఠనం గురించి గంభీరంగా తలంచటానికి నిర్ణయించుకున్నప్పుడు, ఆయన తన జీవితంలో తీవ్రమైన మార్పులు చేసుకున్నాడు. ఆయన ఎంతో ఆసక్తితో చురుగ్గా సువార్త ప్రకటించటం మొదలెట్టాడు. కొక్కినాకీస్ వద్ద పని చేస్తున్న ఇమ్మాన్యల్ పాటెరాకిస్ అనే 18 ఏళ్ల ఉద్యోగి ఆ మార్పులను చూసి చాలా ప్రభావితుడై, త్వరలోనే బైబిలు సాహిత్యం కోసం అడిగాడు. ఆయన చాలా త్వరగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది చివరికి మిషనరీ కావటం చూసి నేనెంతగానో పొంగిపోయాను!a
నా స్వగ్రామంలోవున్న సంఘం బాగా అభివృద్ధి సాధించింది, ఇప్పుడు 14 మంది ప్రచారకులున్నారు. మా అక్క డెస్పీనా అలాగే మా తల్లిదండ్రులు కూడా సత్యాన్ని స్వీకరించి ఇప్పుడు బాప్తిస్మం తీసుకుని యెహోవా ఆరాధకులుగా ఉన్నారని తెలియజేసే, మా అక్క వ్రాసిన ఉత్తరాన్ని చదివిన ఆ రోజును నేనెప్పటికీ మరిచిపోలేను!
హింసను సహించటం, దేశబహిష్కరణ
గ్రీకు ఆర్థడాక్స్ చర్చి మా ప్రకటనా పనిని నాశనం కలుగజేసే మిడతల మహమ్మారిలా దృష్టించి, మమ్మల్ని అణచివేయటానికి నిశ్చయించుకున్నారు. 1938 మార్చిలో, నన్ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదుటకి తీసుకువెళ్లారు, ఆయన నేనా స్థలాన్ని వెంటనే విడిచిపోవాలని చెప్పాడు. మా ప్రకటనాపని నిజానికి ప్రయోజనకరమైనదనీ, మా పని అంతకన్నా ఉన్నత అధికారీ మా రాజూ అయిన యేసుక్రీస్తు ఆజ్ఞాపించినదనీ నేను జవాబిచ్చాను.—మత్తయి 28:19, 20; అపొస్తలుల కార్యములు 1:8.
మరునాడు, నన్ను స్థానిక పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. నేను ప్రజలకు ప్రమాదకారినని తీర్మానించి, నన్ను ఒక సంవత్సరంపాటు బహిష్కరించి, ఏజియన్ సముద్రంలోని అమోర్గోస్ ద్వీపానికి పంపించివేశారు. కొన్నిరోజుల తర్వాత, నా చేతులకు బేడీలు వేసి పడవలో ఆ ద్వీపానికి తీసుకువెళ్లారు. అమోర్గోస్‌లో ఇతర యెహోవాసాక్షులెవరూ లేరు. ఆర్నెల్ల తర్వాత, మరో సాక్షిని కూడా బహిష్కరించి అదే ద్వీపానికి పంపారని తెలుసుకున్నప్పుడు ఎంతగా ఆశ్చర్యపోయానో ఊహించండి ! ఆయనెవరై ఉండవచ్చు? క్రీట్‌లో ఉన్న నా బైబిలు విద్యార్థి అయిన మీనోస్ కొక్కినాకీస్. ఒక ఆధ్యాత్మిక సహవాసిని పొందగల్గినందుకు నేనెంతో సంతోషించాను! కొంతకాలం తర్వాత, ఆయనకు అమోర్గోస్ నీళ్లలో బాప్తిస్మమిచ్చే ఆధిక్యత నాకు లభించింది.b
నేను క్రీట్‌కు తిరిగివచ్చిన వెంటనే నన్ను మళ్లీ అరెస్టు చేశారు, ఈసారి నన్ను బహిష్కరించి ఆ ద్వీపంపైనే ఉన్న నియోపోలీస్ అనే చిన్న పట్టణానికి ఆర్నెల్లపాటు పంపించారు. నా ఆర్నెల్ల బహిష్కరణ తర్వాత, నన్ను నిర్బంధించి పది రోజులపాటు జైల్లో ఉంచి, బహిష్కరించబడిన కమ్యూనిస్టుల కోసం కేటాయించబడిన ద్వీపానికి నాలుగు నెలలపాటు పంపించారు. “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు” అన్న అపొస్తలుడైన పౌలు మాటలు ఎంత నిజమో నేను గుర్తించాను.—2 తిమోతి 3:12.
వ్యతిరేకత ఉన్నా అభివృద్ధి
1940-44 సంవత్సరాల్లో గ్రీసును జర్మన్లు స్వాధీనం చేసుకోవటంతో, మా ప్రకటనా పని దాదాపు నిలిచిపోయింది. అయితే, గ్రీసులోని యెహోవా ప్రజలు వెంటనే పునఃసంస్థీకరించబడ్డారు, మేము మా ప్రకటనా పనిని మళ్లీ క్రొత్తగా ప్రారంభించాము. సమయం చాలా వ్యర్థమైపోయింది గనుక, మేము రాజ్య పనిలో చురుగ్గా, ఆసక్తితో పాల్గొన్నాము.
అనుకున్నట్లుగానే, మళ్లీ మతసంబంధమైన వ్యతిరేకత విజృంభించింది. చాలా తరచుగా, గ్రీకు ఆర్థడాక్స్ ప్రీస్టులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవారు. ఒక గ్రామంలో, ఒక ప్రీస్టు మా పైకి ఒక గుంపును ఉసిగొల్పాడు. ప్రీస్టు స్వయంగా నన్ను కొట్టడం ప్రారంభించాడు, అతని కొడుకు కూడా నన్ను వెనుక నుండి కొడుతున్నాడు. నేను రక్షణ కోసం దగ్గరలో ఉన్న ఇంట్లోకి పరుగెత్తాను, నాతోపాటు ప్రకటనపనిలో పాల్గొంటున్న వ్యక్తిని గ్రామ చావడిలోకి లాక్కుపోయారు. అక్కడ, ఆ గుంపు ఆయన దగ్గరున్న సాహిత్యాన్ని చింపేసింది, ఒకామె తన ఇంటి ముంగిట్లో నుండి “వాణ్ని చంపండి!” అని అరుస్తూనే ఉంది. చివరికి ఒక డాక్టరు, అటుగా వెళ్తున్న ఒక పోలీసు వచ్చి మమ్మల్ని కాపాడారు.
తర్వాత, 1952లో, మళ్లీ నన్ను నిర్బంధించి నాలుగు నెల్లపాటు బహిష్కరించి, క్రీట్‌లోని కెస్తాలి కిస్సామోస్‌కి పంపించారు. తర్వాత వెంటనే, సంఘాలను దర్శించి వాటిని ఆధ్యాత్మికంగా బలపర్చేందుకు నేను శిక్షణ పొందాను. రెండు సంవత్సరాలపాటు ఈ విధమైన ప్రయాణ పనిలో గడిపిన తర్వాత, నేను ఒక నమ్మకమైన క్రైస్తవ సహోదరిని వివాహం చేసుకున్నాను, ఆమె యెహోవాకు యథార్థతగల ఆరాధకురాలిగా ఉంది, మా అక్కలాగే ఆమె పేరు కూడా డెస్పీనాయే. మా వివాహం తర్వాత నేను క్రీట్‌లోని హనీయా అనే పట్టణానికి ప్రత్యేక పయినీరుగా నియమింపబడ్డాను, ఇప్పటికీ నేనిక్కడే సేవచేస్తున్నాను.
దాదాపు డెబ్భై సంవత్సరాల పాటు పూర్తికాల సేవలో గడిపిన కాలమంతటిలో, నేను దాదాపు క్రీట్ మొత్తంలో ప్రకటించాను, క్రీట్ ద్వీప వైశాల్యం 8,300 చదరపు కిలోమీటర్లు, 250 కిలోమీటర్ల పొడవు. ఈ ద్వీపంలో 1930లలో పిడికెడు మందిగా ఉన్న సాక్షులు, నేడు 1,100 కంటే ఎక్కువగా ఉన్న చురుకైన దేవుని రాజ్య ప్రచారకులుగా పెరగటాన్ని చూడటమే నాకు అత్యంత అధిక ఆనందాన్ని తీసుకువచ్చింది. వీరిలో అనేకులు బైబిలు నుండి కచ్చితమైన జ్ఞానాన్ని పొందటానికి, భవిష్యత్తు కోసం అద్భుతమైన నిరీక్షణను పొందటానికి సహాయం చేసేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను యెహోవాకు కృతజ్ఞుడిని.
యెహోవా, “నన్ను రక్షించువాడు”
ప్రజలు సత్యదేవుడ్ని తెలుసుకోవటానికి వారికి సహాయం చేసేందుకు ఓర్పు సహనం అవసరమని అనుభవం నాకు బోధించింది. ఎంతో అవసరమైన ఈ లక్షణాలను యెహోవా ఉదారంగా ఇస్తాడు. 67 ఏళ్లపాటు పూర్తికాల సేవలో గడిపిన కాలమంతటిలో, అపొస్తలుడైన పౌలు వ్రాసిన ఈ మాటలను నేను పదే పదే మననం చేసుకున్నాను: “శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పుగలవారమై, . . . దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము.” (2 కొరింథీయులు 6:4, 5) ప్రాముఖ్యంగా నేను సేవ ప్రారంభించిన తొలికాలంలో, నా ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. అయితే, యెహోవా ఎన్నడూ నన్నూ, నా కుటుంబాన్నీ విడిచిపెట్టలేదు. ఆయన ఎల్లప్పుడూ, శక్తివంతమైన సహాయకునిగా ఉన్నాడు. (హెబ్రీయులు 13:5, 6) తన గొర్రెలను సమకూర్చటంలోనూ, వాళ్ల అవసరాలను తీర్చటంలోనూ మేము ఎల్లప్పుడూ ఆయన ప్రేమగల హస్తాన్ని చూశాము.
నేను వెనుదిరిగి చూసినప్పుడు, ఆధ్యాత్మిక భావంలో, ఎడారిలో పూలు పూసినట్లు అనిపిస్తుంది, నా ప్రయాస వ్యర్థం కాలేదన్న నమ్మకం నాకుంది. నేను నా యౌవన బలాన్ని అత్యంత ప్రయోజనకరమైన విధంగా వెచ్చించాను. పూర్తికాల సేవలో నేను గడిపిన సమయం మరే ఇతర పనిలో గడిపినా అంత అర్థవంతమైనదిగా ఉండేదికాదు. ఇప్పుడు వృద్ధుడనై, “నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము” అని యౌవనస్థులను హృదయపూర్వకంగా ప్రోత్సహించగలను.—ప్రసంగి 12:2.
నాకిప్పుడు 91 సంవత్సరాలున్నప్పటికీ, నేను ప్రతి నెల 120 కంటే ఎక్కువ గంటల్ని ప్రకటన పనికోసం వెచ్చించగల్గుతున్నాను. ప్రతిరోజు, నేను ఉదయం 7:30కి లేస్తాను, వీధుల్లోనూ, షాపుల్లోనూ లేదా పార్కుల్లోనూ ప్రజలకు సాక్ష్యమిస్తాను. సగటున నేను ప్రతి నెల 150 పత్రికలు అందజేస్తాను. వినికిడి శక్తి మందగించటం, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం జీవితాన్ని కష్టతరం చేస్తున్నప్పటికీ, ప్రేమగల నా ఆధ్యాత్మిక సహోదర సహోదరీలు అంటే నా పెద్ద ఆధ్యాత్మిక కుటుంబం, అలాగే మా ఇద్దరు కుమార్తెల కుటుంబాలు నిజమైన మద్దతు నిచ్చాయి.
అన్నిటికంటే ముఖ్యంగా, నేను యెహోవా యందు నమ్మకం ఉంచటం నేర్చుకున్నాను. జీవితమంతటిలోనూ ఆయనే “నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు.”—కీర్తన 18:2.
[అధస్సూచీలు]
a ఇమ్మాన్యల్ పాటెరాకిస్ జీవితకథ కోసం, కావలికోట, నవంబరు 1, 1996, పేజీలు 22-7 చూడండి.
b మీనోస్ కొక్కినాకీస్‌కు సంబంధించి సాధించబడిన చట్టబద్ధమైన విజయం కోసం కావలికోట సెప్టెంబరు 1, 1993, 27-31 పేజీలను చూడండి. మీనోస్ కొక్కినాకీస్ 1999 జనవరిలో మరణించారు.
[26, 27వ పేజీలోని చిత్రం]
క్రింద; నా భార్యతో; ఎడమ: 1927లో; ప్రక్క పేజీ: 1939లో, దేశ బహిష్కరణ నుండి తిరిగి వచ్చిన తర్వాత అక్రోపోలీస్‌లో (ఎడమ) మీనోస్ కొక్కినాకీస్‌తో, మరో సాక్షితో