వారు యెహోవా చిత్తాన్ని చేశారు
మరియ “ఉత్తమమైనదానిని” ఎంపిక చేసుకోవటం
యేసు కాలంలో, యూదా స్త్రీల స్వేచ్ఛ రబ్బీల ఆచారాలతో పరిమితం చేయబడింది. కాబట్టి వాళ్లు ధర్మశాస్త్రం చదవటానికి ప్రోత్సహించబడే వారు కాదు. వాస్తవానికి, మిష్నాలో ఉదహరించబడిన ఒక అభిప్రాయం ఇలా పేర్కొంది: “ఎవరైనా తన కుమార్తెకు ధర్మశాస్త్ర జ్ఞానాన్ని బోధిస్తే, అతడు ఆమెకు విచ్చలవిడితనాన్ని నేర్పించినట్లే.”—సోటాహ్ 3:4.
ఫలితంగా, మొదటి శతాబ్దంలో యూదయలోవున్న స్త్రీలు చాలామంది అంతగా చదువుకోలేదు. “యేసు పరిచర్యకు మునుపటి కాలంలో స్త్రీలు, ఎవరైనా గొప్ప బోధకునికి శిష్యులయ్యేందుకు ఎన్నడూ అనుమతించబడేవారు కాదు, ఇక అలాంటి బోధకునితో పాటు ప్రయాణించటానికి గానీ తమ పిల్లలకు గాక మరితరులకు ఉపదేశించటానికి గానీ అసలే అనుమతించబడేవారు కాదు” అని ద యాంకర్ బైబిల్ డిక్షనరి పేర్కొంటుంది. స్త్రీలను మరింత చిన్నచూపు చూస్తూ, కొంతమంది మత నాయకులు, పురుషుడు స్త్రీతో బహిరంగంగా మాట్లాడకూడదని ఒక నియమం కూడా విధించారు!
దైవభక్తి రహితమైన అలాంటి దృక్పథాలను యేసు నిరసించాడు. ఆయన స్త్రీలకు అలాగే పురుషులకు బోధించాడు, ఆయన అనుచరుల్లో స్త్రీ పురుషులిరువురినీ కనుగొనవచ్చు. (లూకా 8:1-3) ఒక సందర్భంలో, యేసు మార్తా మరియల అతిథిగా వెళ్లాడు. (లూకా 10:38) ఆ ఇద్దరు స్త్రీలు లాజరు సహోదరీలు, ఆ ముగ్గురూ యేసు శిష్యులు, పైగా ఆయనకు మంచి స్నేహితులు. (యోహాను 11:5) లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియలను ఓదార్చటానికి వచ్చిన పెద్ద గుంపును బట్టి ఈ కుటుంబం ప్రముఖమైనదై ఉండవచ్చుననిపిస్తుంది. ఏదేమైనప్పటికీ, యేసు అతిథిగా విచ్చేసినప్పుడు ఆ ఇంట్లో జరిగిన సంఘటన, వాళ్లకే కాదు మనకు కూడా ఒక విలువైన పాఠాన్ని అందజేస్తుంది.
యేసు పాదాల వద్ద నేర్చుకోవటం
మార్తా మరియలు యేసుకు ఘనమైన విందు భోజనం ఏర్పాటు చేయాలని ఆతురతగా ఉన్నారన్నదాంట్లో సందేహం లేదు, బహుశ అది వారి తాహతుకు మించినది కాకపోవచ్చు. (పోల్చండి యోహాను 12:1-3.) అయితే, తమ అతిథి వచ్చినప్పుడు, మరియ “యేసు పాదములయొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను.” (లూకా 10:39) నేర్చుకోవాలని అంత ఆసక్తి కల్గివున్న ఆ యథార్థతగల స్త్రీకి బోధించకుండా పురుషుల ఏ ఆచారమూ యేసును అడ్డగించలేదు! మరియ యేసు ఎదుట కూర్చుని, తన ప్రభువు బోధిస్తున్నదాన్ని వినడంలో పూర్తిగా నిమగ్నమైపోయిన విద్యార్థి స్థానంలో ఉండటాన్ని మనం ఊహించవచ్చు.—పోల్చండి ద్వితీయోపదేశకాండము 33:3; అపొస్తలుల కార్యములు 22:3.
మరియలా కాకుండా, మార్త “విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందర”పడుచుండెను. రకరకాల వంటకాలు సిద్ధం చేయటంలో, ఆమె ఎన్నో పనులతో సతమతమౌతుంది. పనంతా తనకు ఒక్కదానికే వదిలేసి మరియ యేసు పాదాల వద్ద కూర్చోవటంతో మార్త విసుగుచెందింది! కాబట్టి మార్త, మరియతో మాట్లాడుతున్న యేసును బహుశా మధ్యలో ఆపేసి ఇలా అంది: “ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పు.”—లూకా 10:40.
మార్త అడిగిన దాంట్లో తప్పేమీ లేదు. ఒక గుంపు కోసం వంట చేయటం శ్రమతో కూడిన పనే, మొత్తం భారమంతా ఒక వ్యక్తి మీదే పడకూడదు. అయితే, యేసు ఆమె వ్యాఖ్యానంలో, ఒక విలువైన పాఠాన్ని బోధించడానికున్న అవకాశాన్ని గమనించాడు. “మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని” యేసు అన్నాడు.—లూకా 10:41, 42.
మార్తకు ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తిలేదని యేసు అనటం లేదు. బదులుగా, ఆమె ఎంతో ప్రగాఢమైన దైవభక్తి ఉన్న స్త్రీ అని ఆయనకు తెలుసు.a అసలు అందుకే ఆమె యేసును తన ఇంటికి ఆహ్వానించిందనటంలో సందేహం లేదు. అయితే, మార్త వంట చేయటానికి అధిక శ్రద్ధ నివ్వడంలో, దేవుని కుమారుని నుండి స్వయంగా వ్యక్తిగత ఉపదేశాన్ని పొందే అవకాశాన్ని జారవిడుచుకుంటుందని యేసు సున్నితంగా గద్దించటం ద్వారా సూచిస్తున్నాడు.
నిజమే, ఒక స్త్రీ సామర్థ్యం ఇంటిపనులు చేయటంలో ఆమెకున్న నైపుణ్యాన్ని బట్టే వెల్లడౌతుందన్న తలంపును ఆనాటి సంస్కృతి సమర్థించి ఉండవచ్చు. కాని స్త్రీలు కూడా పురుషుల్లాగే దేవుని కుమారుని పాదముల వద్ద కూర్చుని జీవ వాక్యములను అందుకోవచ్చునని యేసు మాటలు చూపించాయి! (యోహాను 4:7-15; అపొస్తలుల కార్యములు 5:14) దీని దృష్ట్యా, మార్త తాను ప్రభువు పాదముల వద్ద కూర్చుని ఆయన చెప్పేది వినగలిగే అవకాశం తనకు కూడా లభించేలా కేవలం కొన్ని రకాల వంటకాలు లేదా కేవలం ఒకే వంటకం చేసి ఉంటే ఎంతో బాగుండేది.—పోల్చండి మత్తయి 6:25.
మనకు పాఠం
నేడు, “జీవజలమును ఉచితముగా పుచ్చుకొన”మని ఇవ్వబడుతున్న యేసు ఆహ్వానానికి ప్రతిస్పందిస్తున్న వారిలో పురుషులూ, స్త్రీలూ కూడా ఉన్నారు. (ప్రకటన 22:17) ప్రేమచే పురికొల్పబడి, కొందరు మార్తలా తోటి విశ్వాసుల అవసరాలను తీర్చటానికి తాము చేయగలిగినదంతా చేస్తారు. వాళ్లు ఆచరణాత్మక దృక్పథం గలవాళ్లు, సత్వరంగా చర్యలు గైకొంటారు, ప్రేమతో వాళ్లు పడే ప్రయాసలకు ప్రతిఫలమిస్తానని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. (హెబ్రీయులు 6:10; 13:16) ఇతరులు మరింత ఎక్కువగా మరియను పోలివుండవచ్చు. వాళ్లు సాత్వికులైయుండి, ఆధ్యాత్మిక విషయాల్ని ధ్యానిస్తారు. దేవుని వాక్యాన్ని ధ్యానించటం పట్ల వారికున్న ఆసక్తి, విశ్వాసంలో దృఢంగా పాతుకుని నిలబడేందుకు వారికి సహాయం చేస్తుంది.—ఎఫెసీయులు 3:15-19.
రెండు రకాల వ్యక్తులూ క్రైస్తవ సంఘంలో ఒక ప్రాముఖ్యమైన అవసరాన్ని తీరుస్తారు. అయితే, చివరగా, అందరూ ఆధ్యాత్మిక విషయాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ‘ఉత్తమమైనదానిని ఎంపిక చేసుకోవాలి.’ శ్రేష్ఠమైన కార్యములను వివేచించటం ద్వారా, మనం యెహోవా అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొందుతాము.—ఫిలిప్పీయులు 1:9-11.
[అధస్సూచీలు]
a మార్త గొప్ప విశ్వాసంగల ఆధ్యాత్మిక స్త్రీ అన్న విషయం, ఆమె సహోదరుడైన లాజరు మరణం తర్వాత యేసుతో ఆమె చేసిన సంభాషణను బట్టి స్పష్టమౌతుంది. ఆ సందర్భంలో, తన ప్రభువును కలవాలన్న గొప్ప ఆతురతను కనపర్చింది మార్తనే.—యోహాను 11:19-29.