కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 9/1 పేజీలు 19-24
  • మీ జీవితాన్ని విజయవంతం చేసుకోండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ జీవితాన్ని విజయవంతం చేసుకోండి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనకు దేవుని నియమాలు ఎందుకు అవసరం
  • ‘దినములు లెక్కించుట’
  • తప్పులు చేసేవారిని చూసి అసూయపడవద్దు
  • మీ సహవాసుల విషయంలో అప్రమత్తంగా ఉండండి!
  • బైబిలు పఠన ప్రయోజనాలు
  • దేవుని మార్గాన్ని అవలంబించడం విజయానికి నడిపిస్తుంది
  • సౌభాగ్యం మీ విశ్వాసాన్ని పరీక్షించగలదు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • యెహోవా హృదయాన్ని సంతోషపరిచే యౌవనులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఇతర యౌవనులు అంత సరదాగా ఎందుకు ఉంటారు?
    తేజరిల్లు!—1996
  • మీరెలా విజయవంతులు కావచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 9/1 పేజీలు 19-24

మీ జీవితాన్ని విజయవంతం చేసుకోండి!

“దుష్టుల ఆలోచన చొప్పున నడువ[నివాడు] . . . ధన్యుడు . . . అతడు చేయునదంతయు సఫలమగును.”—కీర్తన 1:1-3.

1. (ఎ) ఈ లోకంలో అనేకమంది యౌవనులు విజయాన్ని ఎలా దృష్టిస్తారు? (బి) జీవితంలో విజయాన్ని సాధించే వ్యక్తిని బైబిలు ఎలా వర్ణిస్తుంది?

విజయం—అదెంత ప్రాముఖ్యం మీకు? “నా జీవితంలో అతి ప్రాముఖ్యమైన లక్ష్యం, వ్యాపారంలో విజయం సాధించటమే” అంటున్నాడు ఒక యౌవనస్థుడు. ఒక యౌవనురాలు ఇలా అంటుంది: “సంతోషప్రదమైన కుటుంబ జీవితం గడపాలన్నదే నా కోరిక.” కానీ మరో యౌవనస్థురాలు ఏమంటుందో చూడండి: “నాకు ఒక మంచి ఇల్లు, మంచి కారు ఉంటే చాలు . . . నా స్వార్థం చూసుకోవడమే నాకిష్టం.” సమస్యేమిటంటే డబ్బుగానీ, కుటుంబం గానీ, చివరికి మంచి సంపాదన ఉన్న ఉద్యోగం కూడా నిజమైన విజయానికి కొలబద్దలు కావు. కీర్తన 1:1-3లో ఇలా ఉంది: ‘దుష్టుల ఆలోచన చొప్పున నడువనివాడు ధన్యుడు. అతడు యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందిస్తాడు. అతడు చేయునదంతయు సఫలమగును.’

2. నిజమైన విజయం ఎక్కడ లభిస్తుంది, దాన్ని సంపాదించటానికిగల ఏకైక మార్గం ఏమిటి?

2 ఇక్కడ బైబిలు ఏ మానవుడూ ఇవ్వలేనిదొకటి వాగ్దానం చేస్తుంది—అది నిజమైన విజయం! కానీ అది ఆర్థిక విజయం గురించి మాట్లాడటం లేదు. బైబిలే ఇలా హెచ్చరిస్తుంది: “ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము.” (1 తిమోతి 6:10) నిజమైన విజయం దేవుణ్ని ప్రీతిపర్చడంలో ఉంది, అందులో యెహోవా నియమాల్ని పాటించడం కూడా ఉంది. కేవలం ఇది మాత్రమే అసలైన సంతృప్తిని నిజమైన సంతోషాన్ని తీసుకురాగలదు! బహుశ యెహోవా నియమాల క్రింద ఉండటమన్న తలంపు, ఏమి చేయాలో ఒకరిచేత నిర్దేశించబడటమన్న తలంపు అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. అయినా, యేసు ఇలా చెప్పాడు: “తమ ఆధ్యాత్మిక అవసరాల పట్ల శ్రద్ధగలవారు ధన్యులు.” (మత్తయి 5:3, NW) మీరది గ్రహించినా గ్రహించకపోయినా మీరు సృష్టించబడినప్పుడు, ఆధ్యాత్మిక విషయాల పట్ల అవసరం మీలో భాగంగా ఉంది, అందులో దేవుణ్ని తెలుసుకోవాలన్న, ఆయన సంకల్పాల్ని అర్థం చేసుకోవాలన్న ఒక గొప్ప అవసరం ఇమిడి ఉంది. కాబట్టి, మీరు ఆ అవసరాలను తీర్చుకుని, “యెహోవా ధర్మశాస్త్రము”ను అనుసరిస్తేనే నిజమైన సంతోషాన్ని అనుభవించగలరు.

మనకు దేవుని నియమాలు ఎందుకు అవసరం

3. యెహోవా మన ‘ప్రవర్తనను’ నిర్దేశించేందుకు అనుమతించటానికి మనం ఎందుకు సంతోషించాలి?

3 ప్రవక్తయైన యిర్మీయా ఇలా వ్రాశాడు: “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.” (యిర్మీయా 10:23) ఇది మానవులందరి విషయంలో వాస్తవం, యౌవనులైనా వృద్ధులైనా. మనకు మన నడతను నిర్దేశించుకోవటానికి కావాల్సిన బుద్ధి, అనుభవము, జ్ఞానము లేకపోవడమే కాదు; మనకసలు అలా చేసే హక్కే లేదు. ప్రకటన 4:10-11లో బైబిలు ఇలా చెబుతుంది: “ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడ[వు].” మన సృష్టికర్తగా యెహోవా మన “జీవపు ఊట.” (కీర్తన 36:9) గనుక మనం మన జీవితాలను ఎలా ఉపయోగించుకోవాలన్నది వేరే ఎవరికన్నా బాగా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన నియమాలను పెట్టింది మన ఆనందాన్ని దోచేయడానికి కాదు గానీ మన ప్రయోజనం కోసమే. (యెషయా 48:17) దేవుని నియమాలను ఉపేక్షించారా, మీరు మీ భవిష్యత్తునే కాలరాచుకుంటున్నట్లు.

4. అంత పెద్ద సంఖ్యలో యౌవనులు ఎందుకు తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు?

4 ఉదాహరణకు, అంత పెద్ద సంఖ్యలో యౌవనులు మాదకద్రవ్యాల్ని తీసుకోవడం ద్వారా, లైంగిక విచ్చలవిడితనం ద్వారా, మరితర చెడు కార్యాల ద్వారా ఎందుకు తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని మీరెప్పుడైనా ఆలోచించారా? కీర్తన 36:1, 2 ఇలా వివరిస్తుంది: “భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తివలె పలుకుచున్నది, వాని దృష్టియెదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టియెదుట వాని ముఖస్తుతి చేయుచున్నది.” చాలామంది యౌవనస్థులకు ఆరోగ్యకరమైన “దేవుని భయము” లేకపోవడం మూలంగా ప్రమాదకరమైన జీవనశైలిని కొనసాగించడం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఉండవని నమ్ముతూ తమను తామే మోసం చేసుకుంటున్నారు. అయితే చివరికి, వారు మార్పులేని ఈ సూత్రంలోని నిజాన్ని ఎదుర్కోవలసిందే: “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవమను పంట కోయును.”—గలతీయులు 6:7, 8.

‘దినములు లెక్కించుట’

5, 6. (ఎ) యౌవనులు ఎందుకు తమ ‘దినములను లెక్కించాలి,’ అలా చేయడమంటే ఏమిటి? (బి) “సృష్టికర్తను స్మరణకు తెచ్చు”కోవటం అంటే ఏమిటి?

5 మీరు మీ జీవితాన్ని ఎలా విజయవంతం చేసుకుని, “నిత్యజీవమను పంట కోయ”గలరు? మోషే ఇలా వ్రాశాడు: “మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును . . . అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.” (కీర్తన 90:10) మరణం గురించి మీరు అసలంటూ ఆలోచిస్తే చాలా అరుదుగా ఆలోచిస్తుండవచ్చు. నిజానికి చాలామంది యౌవనులు తాము అమరులమన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. కానీ జీవితం క్షణభంగురం అన్న చేదు నిజాన్ని మనకు మోషే గుర్తు చేస్తున్నాడు. మనం కనీసం 70 లేదా 80 సంవత్సరాలు జీవిస్తామన్నది కూడా సందేహమే. “కాలము, అనూహ్య సంఘటనలు” నవయౌవనంతో, పూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారిని కూడా నిట్టనిలువుగా కూల్చేయగలవు. (ప్రసంగి 9:11, NW) అందుకని మీరిప్పుడు అనుభవిస్తున్న మీ అమూల్యమైన జీవితాన్ని ఎలా ఉపయోగిస్తారు? మోషే ఇలా ప్రార్థించాడు: “మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.”—కీర్తన 90:12.

6 మన దినములను లెక్కించుకోవడం అంటే ఏమిటి? మీరింకా ఎంతకాలం జీవిస్తారో చూసుకోవడానికి రోజులు లెక్కపెట్టుకోవడం అని కాదు దానర్థం. యెహోవా తన ప్రజలకు తామింకా జీవించి ఉండే రోజుల్ని ఆయనకు ఘనతను తీసుకువచ్చే రీతిలో ఎలా ఉపయోగించుకోవాలో బోధించాలని మోషే ప్రార్థిస్తున్నాడు. మీరు మీ దినములను లెక్కించుకుంటున్నారా—ప్రతి రోజును దేవునికి స్తుతిని తీసుకువచ్చేందుకైన ఒక అమూల్యమైన వరమన్నట్లుగా దృష్టిస్తున్నారా? బైబిలు యౌవనస్థులకు ఈ ప్రోత్సాహాన్నిస్తుంది: “లేతవయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములోనుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము. నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.” (ప్రసంగి 11:10-12:1) మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడమంటే ఆయన ఉనికిలో ఉన్నాడని మర్చిపోకపోవడం మాత్రమే కాదు. “నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొను[ము]” అని ఆ నేరస్థుడు యేసుకు విజ్ఞప్తి చేసినప్పుడు, ఆయన యేసు తన పేరును జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే కోరుకోవడం లేదు. యేసు చర్య తీసుకోవాలనీ, తనను పునరుత్థానం చేయాలనీ ఆయన కోరుకుంటున్నాడు! (లూకా 23:42; పోల్చండి, ఆదికాండము 40:14, 23; యోబు 14:13.) అదే విధంగా, యెహోవాను స్మరణకు తెచ్చుకోవడం అంటే అందులో చర్యతీసుకోవడం ఉంది, ఆయన్ను ప్రీతిపర్చేది చేయడం ఇమిడివుంది. మీరు యెహోవాను స్మరణకు తెచ్చుకుంటున్నారని చెప్పవచ్చా?

తప్పులు చేసేవారిని చూసి అసూయపడవద్దు

7. కొందరు యౌవనస్థులు తమ సృష్టికర్తను ఎందుకు మర్చిపోయారు? ఒక ఉదాహరణనివ్వండి.

7 చాలామంది యౌవనస్థులు, ఒక యెహోవాసాక్షిగా ఉండటం అంటే చాలా నిర్బంధాలతో కూడినదని భావించడం మూలంగా యెహోవాను మర్చిపోతారు. స్పెయిన్‌లోని ఒక సహోదరుడు తాను యౌవనప్రాయంలో ఉన్నప్పుడు ఏమి చేసేవాడో గర్తుచేసుకుంటున్నాడు: “సత్యము చాలా కష్టమైనదిగా కఠినమైనదిగా కన్పించడం మూలంగా నేను లోకంవైపు ఆకర్షితుణ్ణి అయ్యాను. సత్యంలో ఉంటే, కూర్చోవాలి, పఠించాలి, కూటాలకు వెళ్లాలి, టై కట్టుకోవాలి, అవి నాకిష్టమైనవి కావు.” దేవుణ్ని సేవించడం మూలంగా మీరు ఏదో కోల్పోతున్నట్లు మీరెప్పుడైనా భావించారా? బైబిలు రచయితల్లో ఒకరు సరిగ్గా అటువంటి భావాల్ని వ్యక్తం చేశారని తెలుసుకొని మీరు ఆశ్చర్యపోవచ్చు. దయచేసి మీరు బైబిలును తెరిచి 73వ కీర్తన చదవండి.

8. ఆసాపు ‘గర్వించువారినిబట్టి’ ఎందుకు ‘మత్సరపడ్డాడు’?

8 మనం ఈ కీర్తనను కాస్త కూలంకషంగా పరిశీలిద్దాము. రెండు, మూడు వచనాలు ఇలా అంటున్నాయి: “నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు, గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.” ఈ కీర్తన పైవిలాసమును బట్టి చూస్తే దీన్ని రచించినది ఆసాపు అని తెలుస్తుంది. ఆయన లేవీయుడైన సంగీతకారుడు, రాజైన దావీదు సమకాలీనుడు. (1 దినవృత్తాంతములు 25:1, 2; 2 దినవృత్తాంతములు 29:30) దేవుని మందిరంలో సేవచేసే చక్కని ఆధిక్యత ఆయనకు ఉన్నప్పటికీ, అన్యాయస్థులు తమ అన్యాయాన్నిబట్టి ‘గర్వపడినప్పుడు’ ఆయన వారి విషయమై ‘మత్సరపడ్డాడు.’ వారికి అన్నీ బాగానే ఉన్నట్లుగా కన్పించింది; వారు శాంతిభద్రతలను అనుభవిస్తున్నట్లుగానే ఉన్నారు. నిజానికి, వారి మిథ్యా విజయాలు ‘వారి హృదయాలోచనల్ని మించిపోయాయి.’ (5, 7 వచనాలు, NW) తాము సాధించిన ఘనకార్యాల్ని గురించి “గర్వముగా” అంటే అహంభావంతో మాట్లాడతారు. (8వ వచనం) “ఆకాశముతట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును”—పరలోకంలోనైనా భూమ్మీదైనా వారు ఎవర్నీ ఖాతరుచేయరు.—9వ వచనం.

9. నేడు కొందరు క్రైస్తవులు ఆసాపు ఆలోచించినట్లు ఆలోచించడం ఎలా ప్రారంభించగలరు?

9 బహుశ స్కూల్లోని మీ తోటివారి విషయంలో కూడా అదే వాస్తవమై ఉండవచ్చు. వారు తమ లైంగిక కార్యకలాపాల గురించి, విశృంఖలమైన పార్టీల గురించి, తాము మత్తుపానీయాలు మాదకద్రవ్యాలు తీసుకోవటం గురించీ నిస్సిగ్గుగా చెబుతూ ఉండటం మీరు వినివుండవచ్చు. వారి నామకార్థ ఆహ్లాదకరమైన జీవితాలను, క్రైస్తవులుగా మీరు నడువవలసిన ఇరుకు మార్గానికి పోల్చి తేడాల్ని గమనిస్తే, బహుశ కొన్నిసార్లు మీరు ‘గర్వించువారినిబట్టి మత్సరపడుతుండవచ్చు.’ (మత్తయి 7:13, 14) ఆసాపు ఇలా చెప్పేంత వరకు వచ్చాడు: “నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది.” (13, 14 వచనాలు) అవును, దేవుణ్ని ఎందుకు సేవించాలి, నీతిగా ఎందుకు బతకాలి అని ఆయన ప్రశ్నించడం ప్రారంభించాడు.

10, 11. (ఎ) ఆసాపు తన మనోవైఖరిని మార్చుకోవడానికి ఏది కారణమయ్యింది? (బి) తప్పిదస్తులు “కాలుజారు చోట” ఎలా ఉన్నారు? ఒక ఉదాహరణ ఇవ్వండి.

10 ఆనందకరమైన విషయం ఏమిటంటే, ఆసాపు అదే నిస్పృహ స్థితిలో ఎక్కువసేపు ఉండిపోలేదు. దుష్టులు అనుభవిస్తున్నారన్నట్లు కన్పించే శాంతి నిజానికి ఒక భ్రాంతి మాత్రమేనని అది కూడా తాత్కాలికమైన శాంతి అనీ ఆయన వెంటనే గ్రహించాడు! ఆయన ఆశ్చర్యంతో ఇలా అన్నాడు: “నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు, వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు!” (18, 19 వచనాలు) మీ తోటివారిలో చాలామంది అదే విధంగా “కాలుజారు చోట” ఉన్నారు. దైవభక్తిలేని వారి ప్రవర్తన వారిని ఇప్పుడు కాకపోతే రేపు పట్టుకుంటుంది, ఫలితంగా అవాంఛనీయమైన గర్భధారణ, లైంగికంగా సంక్రమించే వ్యాధులు, చివరికి ఖైదు లేదా మృత్యువు కూడా రావచ్చు! దానికన్నా ఘోరం ఏమిటంటే వారు దేవుని నుండి తమను తాము దూరం చేసుకుంటున్నారు.—యాకోబు 4:4.

11 స్పెయిన్‌లోని ఒక యౌవనురాలైన సాక్షి ఈ సత్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించింది. యౌవనురాలిగా ఆమె ద్వంద్వ జీవితాన్ని గడిపింది, దైవభక్తిలేని యౌవనస్థుల గుంపుతో పూర్తిగా కలిసిపోయింది. ఎంతోకాలం గడువక ముందే ఆమె వారిలో మాదకద్రవ్యాల బానిసగా ఉన్న ఒక యువకునితో ప్రేమలో పడింది. తాను మాదకద్రవ్యాలు తీసుకోకపోయినా ఆయన కోసం ఆమె వాటిని కొనేది. “నేను చివరికి సూదిని ఎక్కించడానికి కూడా సహాయపడ్డాను” అని ఆమె ఒప్పుకుంటుంది. సంతోషకరంగా, ఈ సహోదరి తన విచక్షణా శక్తిని స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి సహాయం అందించబడింది, తర్వాత ఆధ్యాత్మిక ఆరోగ్యం పునరుద్ధరించబడింది. కానీ మాదకద్రవ్యాల్ని తీసుకుంటున్న ఆమె స్నేహితుడు ఎయిడ్స్‌ మూలంగా చనిపోయాడని కొంతకాలం తర్వాత తెలుసుకుని విభ్రాంతికి గురైంది. అవును, కీర్తన గ్రంథకర్త చెప్పినట్లే దైవభక్తి లేని ప్రజలు “కాలుజారు చోట”నే ఉన్నారు. యథేచ్ఛగా జీవించడం మూలంగా కొందరు అకాల మరణాన్ని అనుభవిస్తారు. మిగతా వారి విషయం చూస్తే, వారు తమ జీవిత సరళిని మార్చుకోకపోతే మాత్రం, చాలా త్వరలో “ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు,” ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది.—2 థెస్సలొనీకయులు 1:6-8.

12. తప్పిదస్తులను చూసి అసూయపడటం ఎంత మూర్ఖత్వమో జపాన్‌లోని ఒక యౌవనస్థుడు ఎలా గ్రహించాడు?

12 అందుకని “దేవుని నెరుగనివారి”ని చూసి అసూయపడటం ఎంత మూర్ఖత్వంతో కూడిన పని! నిజానికి, యెహోవాను తెలుసుకుని, నిత్య జీవాన్ని అనుభవించే నిరీక్షణ ఉన్నవారిని చూసి అసూయపడాలి. జపాన్‌లోని ఒక యౌవన సహోదరుడు చివరికి దాన్ని గ్రహించాడు. యౌవనస్థునిగా ఆయన కూడా “మరింత ఎక్కువ స్వేచ్ఛ కావాలన్నాడు.” ఆయనిలా వివరిస్తున్నాడు: “నేను దేన్నో కోల్పోతున్నానని అనుకున్నాను. తర్వాత సత్యం లేని నా జీవితం ఎలాగుంటుందో నేను గ్రహించాను. నేను డెబ్బయ్యో ఎనభయ్యో సంవత్సరాలు జీవించి చనిపోవడం ఒక్కసారి ఊహించుకున్నాను. కానీ యెహోవా నిత్య జీవమనే నిరీక్షణను మనకు అందిస్తున్నాడు కదా! దీన్ని గ్రహించడం నిజానికి నా దగ్గర ఉన్నదాని పట్ల మెప్పుదలను ప్రదర్శించడానికి సహాయపడింది.” అయినా, చుట్టూ దేవుని నియమాల్ని పాటించని ప్రజలు ఉండగా విశ్వసనీయంగా జీవించడమనేది ఎంతమాత్రం సులభం కాదు. ఆ ఒత్తిళ్ళను ఎదుర్కోవడానికి మీరు ఏమేమి చేయగలరు?

మీ సహవాసుల విషయంలో అప్రమత్తంగా ఉండండి!

13, 14. సహవాసుల విషయం వచ్చేసరికి జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

13 విజయవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న వ్యక్తి వర్ణనను మనం మళ్లీ కీర్తన 1:1-3లో చూద్దాము: “దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును, అతడు చేయునదంతయు సఫలమగును.”

14 అన్నింటికన్నా ముందుగా, మీ సహవాసులు ఒక పెద్ద పాత్రను పోషిస్తారని గమనించండి. సామెతలు 13:20 ఇలా అంటుంది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” దీనర్థం, యెహోవాసాక్షులు కాని యౌవనస్థులపట్ల ఉపేక్షతో, మైత్రీభావం లేకుండా, అసభ్యంగా ప్రవర్తించాలని కాదు. మన పొరుగువారిని ప్రేమించమనీ, “సమస్త మనుష్యులతో సమాధానముగా” ఉండాలనీ బైబిలు మనకు ఉద్బోధిస్తుంది. (రోమీయులు 12:18; మత్తయి 22:39) అయితే, మీరు వారితో మరీ సన్నిహితంగా సహవసిస్తే చివరికి బైబిలు ప్రమాణాల్ని పాటించని వ్యక్తుల ‘ఆలోచన చొప్పున నడుస్తారు.’

బైబిలు పఠన ప్రయోజనాలు

15. యౌవనస్థులు బైబిలు పఠనంపట్ల అపేక్షను ఎలా పెంపొందించుకోగలరు?

15 విజయవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న వ్యక్తి దేవుని ధర్మశాస్త్రాన్ని “దివారాత్రము [“తగ్గుస్వరంలో,” NW]” చదువుతూ ఆనందిస్తాడని కూడా కీర్తనల గ్రంథకర్త పేర్కొన్నాడు. (కీర్తన 1:1, 2) నిజమే, బైబిలును చదవడం తేలికైన పని కాదు, అందులోని “కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి.” (2 పేతురు 3:16) కానీ బైబిలును చదవడం అనేది భారమైన పనిగా ఉండనవసరం లేదు. దేవుని వాక్యంయొక్క ‘నిర్మలమైన పాలను అపేక్షించడం’ సాధ్యమే. (1 పేతురు 2:2, 3) ప్రతి రోజు కొంత భాగం మాత్రమే చదివి చూడండి. మీకు అర్థం కాని విషయాలుంటే కాస్త పరిశోధన చేయండి. అటుతర్వాత, మీరు చదివిన దాని గురించి ఆలోచించండి. (కీర్తన 77:11, 12) ఏకాగ్రతను నిలపడం కష్టంగా ఉన్నట్లు అన్పిస్తే “తగ్గుస్వరంలో” పైకి చదివి చూడండి. కొంతకాలానికి బైబిలు చదవడంపట్ల మీ ప్రేమ తప్పకుండా పెరుగుతుంది. బ్రెజిల్‌లోని ఒక యౌవన సహోదరి ఇలా జ్ఞాపకం చేసుకుంటుంది: “యెహోవా నాకెప్పుడూ దూరంగానే ఉన్నట్లు అన్పించింది. కానీ కొన్ని నెలలుగా, నేను నా వ్యక్తిగత అధ్యయనాన్ని బైబిలు పఠనాన్నీ మెరుగుపర్చుకుంటున్నాను. ఇప్పుడు యెహోవాతో నా సంబంధం బలంగా ఉన్నట్లు భావిస్తున్నాను. ఆయన మరింత వాస్తవికమైన వ్యక్తిగా ఉన్నాడు.”

16. సంఘ కూటాల నుండి మనం మరింత ప్రయోజనాన్ని ఎలా పొందగలము?

16 మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి సంఘ కూటాలకు హాజరుకావడం కూడా చాలా ప్రాముఖ్యం. ‘మీరేలాగు వింటున్నారో చూసుకుంటే’ మీరెంతో ప్రోత్సాహాన్ని పొందగలరు. (లూకా 8:18) కూటాలు అంత ఆసక్తికరంగా లేవని కొన్నిసార్లు మీరు భావిస్తారా? అయితే, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘కూటాలు ఆసక్తికరంగా ఉండటానికి నేను ఏమి చేస్తున్నాను? నేను అవధానం నిలుపుతున్నానా? నేను ముందుగానే సిద్ధపడుతున్నానా? నేను వ్యాఖ్యానాల్ని చేస్తానా?’ “ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము” అని బైబిలే మనకు చెబుతుంది కదా. (హెబ్రీయులు 10:24, 25) ఇలా చేయడానికి మీరు భాగం వహించాలి! మళ్లీ, మీరు భాగం వహించాలంటే ముందుగానే అధ్యయనం చేయాలి. ఒక యౌవన సహోదరి ఇలా ఒప్పుకుంటుంది: “సిద్ధపడివుంటే కూటాల్లో భాగం వహించడం నిజంగా చాలా సులభంగా ఉంటుంది.”

దేవుని మార్గాన్ని అవలంబించడం విజయానికి నడిపిస్తుంది

17. బైబిలును శ్రద్ధగా పఠించే వ్యక్తి “నీటికాలువల యోరను నాటబడిన . . . చెట్టువలె” ఎలా ఉన్నాడు?

17 విజయవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న వ్యక్తి “నీటి కాలువల యోరను నాటబడిన . . . చెట్టువలె” ఉంటాడని కీర్తన గ్రంథకర్త వర్ణిస్తున్నాడు. ఇది పండ్లతోటల్లోని చెట్లకు నీరుపెట్టే నీటికాలువల్ని సూచిస్తుండవచ్చు. (యెషయా 44:4) బైబిలును ప్రతి రోజు చదవడం అటువంటి పోషణనూ ఆహ్లాదాన్నీ ఇచ్చే నిరంతరమైన నీటి పారుదల ప్రక్కన ఉండటం లాంటిది. (యిర్మీయా 17:8) శ్రమల్ని సహించడానికీ, కష్టాల్ని అధిగమించడానికీ మీకు కావాల్సిన బలాన్ని ప్రతిరోజు మీరు పొందుతారు. యెహోవా తలంపుల్ని మీరు తెలుసుకుంటే, జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సిన వివేకాన్ని మీరు పొందుతారు.

18. యెహోవాను సేవించే యౌవనస్థుల విజయాన్ని ఏది నిర్ణయిస్తుంది?

18 కొన్నిసార్లు యెహోవాను సేవించడం కష్టంగా ఉన్నట్లు అన్పించవచ్చు. కానీ సహించలేనంత కష్టంగా ఉన్నట్లు ఎప్పుడూ తలంచవద్దు. (ద్వితీయోపదేశకాండము 30:11) మీ ప్రధాన లక్ష్యం యెహోవాను ప్రీతి పర్చడమే, ఆయన హృదయాన్ని సంతోషపర్చడమే అయినంత వరకు, కాలం గడిచే కొలది మీరు “చేయునదంతయు సఫలమగును” అని బైబిలు వాగ్దానం చేస్తుంది. (సామెతలు 27:11) అంతేకాదు, మీరు ఒంటరివారు కారని గుర్తుంచుకోండి. మీకు యెహోవా, యేసుక్రీస్తుల మద్దతు ఉంది. (మత్తయి 28:20; హెబ్రీయులు 13:5) మీరు అనుభవించే ఒత్తిళ్లు వారికి తెలుసు, మిమ్మల్ని వారెన్నడూ విడనాడరు. (కీర్తన 55:22) మీకు “సహోదరుల” మద్దతు, మీ తల్లిదండ్రులు దైవభక్తిగలవారైతే వారి మద్దతు కూడా ఉంది. (1 పేతురు 2:17) ఇంతటి మద్దతుతో, మీ కృత నిశ్చయంతో, మీ కృషితో, మీరు విజయవంతమైన జీవితాన్ని ఇప్పుడే కాదు నిత్యమూ అనుభవించగలరు!

పునస్సమీక్షకు ప్రశ్నలు

◻ నిజమైన విజయం ఏమిటి?

◻ మన నడతను నిర్దేశించడానికి మనకు యెహోవా ఎందుకు అవసరం?

◻ యౌవనస్థులు ‘తమ దినములు ఎలా లెక్కించవచ్చు’?

◻ తప్పిదస్తులను చూసి అసూయ పడటం ఎందుకు మూర్ఖత్వంతో కూడినది?

◻ బైబిలును ప్రతి రోజు పఠించడం, కూటాలకు క్రమంగా హాజరు కావడం యౌవనస్థులు విజయవంతమైన జీవితాన్ని అనుభవించటానికి ఎలా సహాయపడగలదు?

[20వ పేజీలోని చిత్రం]

అనేకమంది యౌవనస్థుల్లో ఆరోగ్యకరమైన “దేవుని భయము” లేకపోవడం మూలంగా వాళ్లు వినాశకరంగా ప్రవర్తిస్తుంటారు

[22వ పేజీలోని చిత్రం]

తమ చర్యలకు పర్యవసానాలుంటాయని యౌవనస్థులు తరచు మర్చిపోతుంటారు

[23వ పేజీలోని చిత్రం]

బైబిలును పఠించడం పట్ల ప్రేమను పెంచుకోండి

[23వ పేజీలోని చిత్రం]

మీరు కూటాల్లో భాగం వహిస్తే వాటిలో ఇంకా ఎక్కువ ఆనందిస్తారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి