జీవిత కథ
అనాథగా మిగిలిన అబ్బాయి ప్రేమగల తండ్రిని పొందాడు
డిమిట్రిస్ సిడిరొపౌలస్ చెప్పినది
ఆ అధికారి నా ఎదుట ఒక తుపాకి ఉంచి, “ఊ కానివ్వు, తుపాకితో కాల్చు” అని కోపంగా అరిచాడు. నేను దానికి నిరాకరించాను. వెంటనే ఆ అధికారి తన తుపాకితో నా భుజంపై నుండి దూసుకువెళ్ళేలా గుళ్ళ వర్షం కురిపించడం చూసి అక్కడున్న సైనికులు నిర్ఘాంతపోయారు. నేను చావడం ఖాయమనిపించింది. సంతోషకరమైన విషయమేమిటంటే, నేను బ్రతికాను. అలా నా ప్రాణాలు ప్రమాదంలో పడడం అది మొదటిసారి కాదు.
మా కుటుంబం టర్కీలోని కప్పదొకియకు చెందిన కేసరి నగరానికి దగ్గర్లో నివసించే మైనారిటీ తెగకు చెందినది. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులు కొందరు సా.శ. మొదటి శతాబ్దంలో క్రైస్తవత్వాన్ని స్వీకరించారని తెలుస్తోంది. (అపొస్తలుల కార్యములు 2:9) అయితే 20వ శతాబ్దపు ప్రారంభానికల్లా అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
శరణార్థినయ్యాను, అనాథనయ్యాను
1922లో నేను పుట్టిన తర్వాత కొన్ని నెలలకు జరిగిన తెగల పోరాటాలవల్ల మా కుటుంబం గ్రీసుకు శరణార్థులుగా పారిపోవలసి వచ్చింది. భీతిల్లిన మా తల్లిదండ్రులు నెలల బాబుగా ఉన్న నన్ను మాత్రమే తీసుకొని పారిపోయారు. తీరని కష్టాలు అనుభవించిన తర్వాత వారు అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉత్తర గ్రీసులోని డ్రామాకు సమీపాన ఉన్న కిర్యా గ్రామానికి చేరుకున్నారు.
నాకు నాలుగు సంవత్సరాలప్పుడు మా తమ్ముడు పుట్టిన తర్వాత నాన్న మరణించాడు. ఆయనకు అప్పుడు కేవలం 27 సంవత్సరాలే, కానీ ఆయన అనుభవించిన ఘోరాతి ఘోరమైన కష్టాలు ఆయనను బలహీనపరిచాయి. అమ్మ కూడా తీవ్రమైన కష్టాలను ఎదుర్కొని త్వరలోనే ఆమె కూడా మరణించింది. నా తమ్ముడు, నేను దిక్కులేని వారిగా మిగిలాము. మేము ఒక అనాథాశ్రమం నుండి మరో అనాథాశ్రమానికి తరలించబడ్డాము, అయితే నాకు 12 సంవత్సరాలు వచ్చేసరికి నేను థెస్సలోనికలోని ఒక అనాథాశ్రమానికి చేరుకున్నాను, అక్కడ ఒక మెకానిక్‌గా శిక్షణ పొందడం ప్రారంభించాను.
ప్రేమానురాగాలకు నోచుకోకుండా అనాథాశ్రమాల్లో పెరుగుతున్న నేను కొంతమంది ఎందుకు ఇన్ని కష్టాలను అన్యాయాన్ని అనుభవిస్తారు అని ఆలోచించేవాడిని. ఇంతటి బాధాకరమైన పరిస్థితులను దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అని నన్ను నేను ప్రశ్నించుకునేవాడిని. మతవిద్యా తరగతుల్లో దేవుడు సర్వశక్తిమంతుడు అని మాకు బోధించబడింది, కానీ దుష్టత్వం ఎందుకింత ప్రబలంగా ఉంది అనేదానికి ఎలాంటి సహేతుకమైన కారణమూ వివరించబడలేదు. గ్రీక్ ఆర్థొడాక్స్ చర్చీ అత్యుత్తమ మతం అని ఒక ప్రఖ్యాత సామెత చెప్పేది. “ఆర్థొడాక్స్ చర్చీ అత్యుత్తమ మతమైనప్పుడు అందరూ ఆర్థొడాక్సుల్లా ఎందుకు లేరు?” అని నేను ప్రశ్నించినప్పుడు నాకు ఎలాంటి సంతృప్తికరమైన సమాధానమూ లభించలేదు.
అయితే మా ఉపాధ్యాయుడికి బైబిలంటే ఎనలేని గౌరవం ఉండేది, బైబిలు ఒక పరిశుద్ధమైన గ్రంథం అని ఆయన మాకు నొక్కి చెప్పేవాడు. అనాథాశ్రమం నిర్వాహకుడు కూడా అదే వైఖరిని ప్రదర్శించేవాడు, కానీ ఆయన ఏదో తెలియని కారణంవల్ల మతపరమైన ఆచారాలకు దూరంగా ఉండేవాడు. నేను దాని గురించి వాకబు చేసినప్పుడు, ఆయన ఒకప్పుడు యెహోవాసాక్షులతో అధ్యయనం చేసేవాడు అని నాకు తెలిసింది, ఆ మతం గురించి నాకు ఏమాత్రం తెలియదు.
థెస్సలోనికలోని అనాథాశ్రమంలో నా విద్య ముగిసేటప్పటికి నాకు 17 సంవత్సరాలు. అప్పటికి రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యింది, గ్రీసు నాజీల ఆధీనంలోకి వచ్చింది. వీధుల్లో ప్రజలు ఆకలితో అలమటిస్తూ మరణిస్తున్నారు. బ్రతికి ఉండడం కోసం నేను మారుమూల గ్రామాలకు పారిపోయి చాలా తక్కువ డబ్బులకు కూలివాడిగా పనిచేయడం ప్రారంభించాను.
నాకు బైబిలునుండి సమాధానాలు లభించాయి
నేను 1945 ఏప్రిల్‌లో థెస్సలోనికకు తిరిగి వచ్చిన తర్వాత, నేను అనేక అనాథాశ్రమాల్లో కలిసి నివసించిన నా చిన్ననాటి స్నేహితుడి అక్క నన్ను కలిసింది. తన తమ్ముడు కనిపించడం లేదని పాస్చాలియా నాకు చెప్పింది, అతని గురించి ఏమైనా తెలుసేమో అని నన్ను అడిగింది. నాతో మాట్లాడుతున్నప్పుడు ఆమె తాను ఒక యెహోవాసాక్షినని చెప్పి, దేవునికి మానవులపట్ల ఉన్న ఆసక్తి గురించి ప్రస్తావించింది.
నేను వెంటనే నా అసమ్మతిని వ్యక్తం చేశాను. నేను చిన్నప్పటి నుండి ఎందుకు బాధలు అనుభవిస్తున్నాను? నేను అనాథగా ఎందుకు వదిలేయబడ్డాను? మనకు ఎంతో అవసరమైనప్పుడు దేవుడు మనకు సహాయం ఎందుకు చేయడు? అని ప్రశ్నించాను. “దేవుడే ఈ పరిస్థితులకు బాధ్యుడని నువ్వు అనుకుంటున్నావా?” అని ఆమె నన్ను అడిగింది. ఆమె తన బైబిలును ఉపయోగించి ప్రజలు కష్టాలు అనుభవించడానికి దేవుడు కారణం కాదని చూపించింది. సృష్టికర్త మానవులను ప్రేమిస్తున్నాడని, ఆయన త్వరలోనే పరిస్థితులను బాగు చేస్తాడని అర్థం చేసుకోవడానికి ఆమె నాకు సహాయం చేసింది. యెషయా 35:5-7 మరియు ప్రకటన 21:3, 4 వంటి లేఖనాలను ఉపయోగించి త్వరలోనే యుద్ధాలు, తగవులు, వ్యాధులు, మరణం నిర్మూలించబడతాయని, నమ్మకమైన ప్రజలు భూమిపై నిరంతరం జీవిస్తారని నాకు చూపించింది.
ప్రోత్సాహకరమైన కుటుంబం లభించడం
గెరిల్లా దళాల పోరాటంలో పాస్చాలియా తమ్ముడు మరణించాడని నాకు తెలిసింది. నేను వారిని ఓదార్చాలనే ఉద్దేశంతో వారి ఇంటికి వెళ్ళాను, అయితే వారే నాకు లేఖనాధారితమైన ఓదార్పును ఇచ్చారు. నేను బైబిలు నుండి ఇంకా కొన్ని ఓదార్పుకరమైన విషయాలు తెలుసుకోవాలని మరోసారి వారి ఇంటికి వెళ్ళాను, ఆ తర్వాత కొంతకాలానికి నేను అధ్యయనం కోసం, ఆరాధన కోసం రహస్యంగా కలుసుకునే యెహోవాసాక్షుల చిన్న గుంపులో భాగమయ్యాను. సాక్షులు నిషేధించబడినా నేను వారితో సహవసిస్తూనే ఉండాలని తీర్మానించుకున్నాను.
వినయస్థులైన ఆ క్రైస్తవుల మధ్య నేను ఎంతగానో ఆశించిన ప్రేమపూర్వకమైన కుటుంబ వాతావరణాన్ని చూశాను. నాకు ఎంతో అవసరమైన ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్ని మద్దతును వారు నాకు ఇచ్చారు. వారిలో నేను నిస్వార్థమైన శ్రద్ధగల స్నేహితులను కనుగొన్నాను, నాకు సహాయం చేయడానికి ఓదార్పునివ్వడానికి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా, సుముఖంగా ఉండేవారు. (2 కొరింథీయులు 7:5-7) అన్నింటికంటే ప్రాముఖ్యంగా, యెహోవాకు సన్నిహితమవ్వడానికి నాకు సహాయం లభించింది, అప్పటికే నేను యెహోవాను నా ప్రేమపూర్వకమైన పరలోక తండ్రిగా దృష్టించడం ప్రారంభించాను. ప్రేమ, వాత్సల్యం, ప్రగాఢమైన శ్రద్ధ వంటి ఆయన లక్షణాలు నన్ను ఎంతో ఆకర్షించాయి. (కీర్తన 23:1-6) చివరకు నాకు ఒక ఆధ్యాత్మిక కుటుంబం, ఒక ప్రేమపూర్వక తండ్రి లభించారు! నా హృదయం చలించింది. త్వరలోనే నేను నా జీవితాన్ని యెహోవాకు సమర్పించుకోవడానికి ప్రేరేపించబడ్డాను, 1945 సెప్టెంబరులో నేను బాప్తిస్మం తీసుకున్నాను.
క్రైస్తవ కూటాలకు హాజరవడం నా జ్ఞానాన్ని అధికం చేయడమే కాక, నా విశ్వాసాన్ని కూడా బలపరచింది. మాకు ఇతర రవాణా సదుపాయాలేమీ లేవు కాబట్టి మాలో చాలామందిమి మా గ్రామం నుండి ఐదు కిలోమీటర్లు నడిచి కూటాలకు వెళ్ళేవాళ్ళం, అలా నడిచి వెళ్ళేటప్పుడు ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకోవడాన్ని నేను ఎన్నడూ మరచిపోలేను. 1945 చివర్లో నేను పూర్తికాల సువార్తికునిగా సేవ చేసే అవకాశం ఉందని తెలుసుకున్నప్పుడు పయినీరు సేవను ప్రారంభించాను. ఆ తర్వాత నా విశ్వాసం, యథార్థతా తీవ్రంగా పరీక్షించబడనున్నాయి కాబట్టి నేను యెహోవాతో బలమైన సంబంధాన్ని కాపాడుకోవడం ఆవశ్యకమైంది.
వ్యతిరేకత బెడిసికొట్టింది
పోలీసులు తరచూ తుపాకులు చూపించి మా కూటాలు జరిగే స్థలంపై దాడి చేసేవారు. గ్రీసులో అంతర్యుద్ధం జరుగుతోంది కాబట్టి ఆ దేశం సైనిక ప్రభుత్వం క్రిందికి వచ్చింది. ప్రతిపక్ష గుంపులకు చెందినవారు క్రూరమైన ద్వేషంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునేవారు. ఆ పరిస్థితిని అదనుగా తీసుకొని మతనాయకులు మేము కమ్యూనిస్టులమని అధికారులను నమ్మించారు, మమ్మల్ని క్రూరంగా హింసించమని ప్రేరేపించారు.
రెండేళ్ళ కాలంలో మేము ఎన్నోసార్లు అరెస్టు చేయబడ్డాము, ఆరుసార్లు మాకు నాలుగు నెలల శిక్ష విధించబడింది. అయితే చెరసాలలు అప్పటికే రాజకీయ ఖైదీలతో నిండిపోయి ఉన్నాయి కాబట్టి మేము విడుదల చేయబడ్డాము. మాకు అనుకోకుండా దొరికిన స్వాతంత్ర్యాన్ని మేము ప్రకటనా పనిని కొనసాగించడానికి ఉపయోగించుకున్నాము, అయితే కొద్ది రోజులకే మేము మళ్ళీ అరెస్టయ్యాం, అలా ఒక్క వారంలోనే మూడుసార్లు అరెస్టయ్యాం. సహోదరులలో చాలామంది నిస్సారమైన ద్వీపాల్లోకి బహిష్కరించబడ్డారని మాకు తెలుసు. అదే పరీక్షను నేను ఎదుర్కొనేంత బలంగా నా విశ్వాసం ఉందా?
నేను కొంతకాలం వరకూ ప్రతిరోజూ వచ్చి పోలీసు స్టేషనులో కనిపించి వెళ్ళాలని చెప్పబడినప్పుడు పరిస్థితులు మరీ కష్టంగా తయారయ్యాయి. నాపై ఓ కన్నేసి ఉంచడానికి వీలుగా అధికారులు నన్ను థెస్సలోనికకు దగ్గర్లో ఒక పోలీస్ స్టేషన్ ఉన్న ఎవాస్మాస్ గ్రామానికి పంపించారు. నేను దగ్గర్లోనే ఒక గది అద్దెకు తీసుకొని నా జీవనోపాధి కోసం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణిస్తూ రాగి గిన్నెలను పాలిష్ చేసే పనిని ప్రారంభించాను. నేను చుట్టుప్రక్కల గ్రామాల్లో పయినీరు సేవ చేసేటప్పుడు, పోలీసులకు అనుమానం రాకుండా సులభంగా ఇంటింటికి వెళ్ళేందుకు నా పనే నాకు సహాయం చేసింది. తత్ఫలితంగా చాలామంది ప్రజలు సువార్తను విని అనుకూలంగా స్పందించారు. చివరకు వారిలో పది కంటే ఎక్కువమంది యెహోవాకు సమర్పిత ఆరాధకులయ్యారు.
పది సంవత్సరాలు, ఎనిమిది జైళ్ళు
1949 చివరి వరకూ నేను పోలీసుల నిఘా క్రింద ఉన్నాను, ఆ తర్వాత నేను పూర్తికాల పరిచర్యలో కొనసాగాలనే కోరికతో థెస్సలోనికకు తిరిగి వచ్చాను. నా కష్టాలు తీరాయి అని అనుకుంటున్న తరుణంలో 1950లో నేను ఊహించని విధంగా సైన్యంలో చేరమనే పిలుపు వచ్చింది. నా క్రైస్తవ తటస్థత కారణంగా నేను ‘యుద్ధము చేయ నేర్చుకోకూడదు’ అని తీర్మానించుకున్నాను. (యెషయా 2:4) అప్పుడు ప్రారంభమైన భయంకరమైన ప్రయాణం నన్ను గ్రీసులో హీనాతిహీనమైన జైళ్ళకు తీసుకొని వెళ్ళింది.
అదంతా డ్రామా నగరంలో మొదలయ్యింది. నేను నిర్బంధంగా సైన్యంలో చేర్చుకోబడిన తర్వాత మొదటి కొద్ది వారాల్లో కొత్తగా చేరిన సైనికులు తమ తుపాకులను గురి పెట్టి కాల్చడాన్ని అభ్యసించడం ప్రారంభించారు. వారు అలా అభ్యసించే స్థలానికి నన్ను ఒకరోజు తీసుకెళ్ళారు. ఒక అధికారి నా ఎదుట తుపాకి ఉంచి దానిని కాల్చమని చెప్పాడు. దానికి నేను నిరాకరించినప్పుడు, అతను నావైపుకు తుపాకి పేల్చడం ప్రారంభించాడు. నేను రాజీపడడానికి సిద్ధంగా లేనని గమనించినప్పుడు ఇతర అధికారులు కూడా నన్ను క్రూరంగా పిడికిళ్ళతో గుద్దడం ప్రారంభించారు. వాళ్ళు సిగరెట్లు వెలిగించి వాటిని నా చేతుల్లో నలిపి ఆర్పారు. ఆ తర్వాత వాళ్ళు నాకు ఏకాంత కారాగార శిక్ష విధించి, మూడు రోజులపాటు అక్కడే ఉంచారు. సిగరెట్లతో కాల్చబడిన చేతులు నన్ను ఎంతో బాధించాయి, ఆ వాతలు నా చేతులపై ఎన్నో సంవత్సరాలపాటు ఉండిపోయాయి.
సైనిక న్యాయస్థానంలో విచారించబడక ముందు నన్ను క్రీట్లోని ఇరాక్లియాన్లోవున్న సైనిక శిబిరానికి బదిలీ చేశారు. అక్కడ నా యథార్థతను బలహీనపర్చాలనే ఉద్దేశంతో వారు నన్ను క్రూరంగా కొట్టారు. రాజీపడిపోతానేమో అని భయపడి నేను నన్ను బలపర్చమని నా పరలోక తండ్రికి తీవ్రంగా ప్రార్థన చేశాను. యిర్మీయా 1:19 లోని ఈ మాటలు నాకు గుర్తుకొచ్చాయి: “వారు నీతో యుద్ధముచేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొందజాలరు; ఇదే యెహోవా వాక్కు.” శాంతింపజేసే ‘దేవుని సమాధానము’ నాకు మనశ్శాంతిని, ప్రశాంతతను కలగజేసింది. యెహోవాపై సంపూర్ణ నమ్మకముంచడం జ్ఞానయుక్తమని నేను అర్థం చేసుకున్నాను.—ఫిలిప్పీయులు 4:6, 7; సామెతలు 3:5.
ఆ తర్వాత జరిగిన విచారణలో నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది. అప్పట్లో యెహోవాసాక్షులు “దేశానికి అత్యంత ఘోరమైన శత్రువులుగా” పరిగణించబడేవారు. నా యావజ్జీవ కారాగార శిక్ష కేనీయాకు వెలుపల ఉన్న ఇట్సిడెయిన్లోని జైల్లో ప్రారంభమయ్యింది, అక్కడ నన్ను ఏకాంత కారాగారంలో పడేశారు. ఇట్సిడెయిన్ ఒక పురాతనమైన కోట, నా గదినిండా ఎలుకలు ఉండేవి. ఎలుకలు నాపై పాకినప్పుడు అవి నా శరీరాన్ని నేరుగా తాకకుండా ఉండడానికి నేను ఒక పాత బొంతను నా తల నుండి కాళ్ళవరకూ కప్పుకునేవాడిని. నాకు నిమోనియా వచ్చి చాలా అనారోగ్యంగా తయారయ్యాను. నేను ఎండలో కూర్చోవాలని డాక్టరు చెప్పాడు, అలా నేను ఆవరణలో ఎంతోమంది ఖైదీలతో సత్యం గురించి చర్చించగలిగాను. అయితే నా పరిస్థితి మరింత క్షీణించింది, నా ఊపిరితిత్తులలో విపరీతంగా రక్తస్రావం కావడంవల్ల నన్ను ఇరాక్లియాన్లోని హాస్పిటల్‌కు తరలించారు.
తోటి క్రైస్తవులతో కూడిన నా ఆధ్యాత్మిక కుటుంబం నాకు అవసరమైనప్పుడు సహాయం చేయడానికి మరోసారి ముందుకొచ్చింది. (కొలొస్సయులు 4:11) ఇరాక్లియాన్లోని సహోదరులు నన్ను క్రమంగా సందర్శించి నాకు ఓదార్పును, ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఆసక్తిగలవారికి సాక్ష్యమివ్వడానికి నాకు సాహిత్యాలు కావాలని నేను వారికి చెప్పాను. వారు నాకు రెండు అరలు ఉన్న పెట్టెను తెచ్చి ఇచ్చారు, నేను దానిలో సాహిత్యాలను సురక్షితంగా దాచుకోగలిగేవాడిని. ఆ జైళ్ళలో నేను గడిపిన రోజుల్లో కనీసం ఆరు మంది ఖైదీలకు నిజ క్రైస్తవులయ్యేందుకు సహాయం చేసినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను!
ఈలోగా అంతర్యుద్ధం ముగిసింది, నా శిక్ష పది సంవత్సరాల జైలు శిక్షకు తగ్గించబడింది. నేను నా శిక్షలోని మిగతా భాగాన్ని రెథిమ్నో, గెంటిక్యూల్, కస్సాండ్రాలలోని జైళ్ళలో గడిపాను. దాదాపు పది సంవత్సరాలపాటు ఎనిమిది జైళ్ళలో శిక్ష అనుభవించిన తర్వాత నేను విడుదల చేయబడ్డాను. నేను థెస్సలోనికకు తిరిగి వెళ్ళినప్పుడు నా ప్రియమైన క్రైస్తవ సహోదరులు హృదయపూర్వకంగా నన్ను ఆహ్వానించారు.
క్రైస్తవ సహోదరుల సహాయంతో ఆధ్యాత్మికంగా వర్ధిల్లడం
అప్పటికి గ్రీసులోని సాక్షులకు ఆరాధన విషయంలో కొంత స్వాతంత్ర్యం లభించింది. నేను వెంటనే ఆ అవకాశాన్ని చేజిక్కించుకొని పూర్తికాల పరిచర్యలో కొనసాగడానికి దానిని ఉపయోగించుకున్నాను. ఆ తర్వాత కొంతకాలానికి నాకు మరో ఆశీర్వాదం లభించింది, యెహోవాను ఎంతో ప్రేమించి ప్రకటనా పనిలో చాలా చురుగ్గా పాల్గొనే కటీనా అనే నమ్మకమైన సహోదరితో నాకు పరిచయమయ్యింది. మేము 1959 అక్టోబరులో పెళ్ళి చేసుకున్నాము. మా కూతురు అగాపే పుట్టడం, నాకు ఒక స్వంత క్రైస్తవ కుటుంబం ఉండడం, నేను అనాథగా ఉన్నప్పుడు అనుభవించినవాటిని మరచిపోవడానికి సహాయం చేశాయి. అన్నింటికంటే ప్రాముఖ్యంగా మా కుటుంబం మా ప్రేమపూర్వక పరలోక తండ్రియైన యెహోవా రక్షణ హస్తం క్రింద సేవ చేయడంలో సంతృప్తిని పొందింది.—కీర్తన 5:11.
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులవల్ల నేను పయినీరు సేవ మానేయవలసి వచ్చింది, అయితే నా భార్య పూర్తికాల సేవను కొనసాగించడానికి నేను మద్దతునిచ్చాను. 1969లో జర్మనీలోని న్యూరెంబర్గ్‌లో యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశం జరిగినప్పుడు నా క్రైస్తవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సంఘటన జరిగింది. నేను అక్కడకు ప్రయాణించి వెళ్ళడానికి సిద్ధపడుతూ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాను. రెండు నెలలకంటే ఎక్కువ సమయం గడిచినా నా పాస్‌పోర్ట్ ఇంకా ఎందుకు రాలేదో కనుక్కోవడానికి నా భార్య పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినప్పుడు ఒక అధికారి తన సొరుగులోనుండి ఒక పెద్ద ఫైల్ బయటకు తీసి ఇలా చెప్పాడు: “ఈ వ్యక్తి జర్మనీకి వెళ్ళి ప్రకటించడానికి అతని కోసం పాస్‌పోర్ట్ అడుగుతున్నావా? అతనికి పాస్‌పోర్ట్ ఇవ్వడం కుదరదు! అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి.”
యెహోవా సహాయంతో, కొంతమంది సహోదరుల మద్దతుతో నా పేరు ఒక గ్రూప్ పాస్‌పోర్ట్‌లో చేర్చబడింది, చివరకు నేను ఆ అద్భుతమైన సమావేశానికి హాజరవగలిగాను. ఆ సమావేశానికి హాజరైన వారి సంఖ్య 1,50,000 కంటే ఎక్కువమందికి చేరుకుంది, ఆ అంతర్జాతీయ ఆధ్యాత్మిక కుటుంబానికి మార్గనిర్దేశం ఇచ్చి దాన్ని ఐక్యపరచడం వెనుక యెహోవా ఆత్మ ఉందని నేను స్పష్టంగా చూడగలిగాను. ఆ తర్వాత నా జీవితంలో నేను క్రైస్తవ సహోదరత్వపు విలువను మరింత ఎక్కువగా గ్రహించాను.
1977లో నా ప్రియమైన భార్య, నా నమ్మకమైన సహచరిణి చనిపోయింది. నేను నా కూతురిని బైబిలు సూత్రాలకు అనుగుణంగా పెంచడానికి శాయశక్తులా ప్రయత్నించాను. అయితే నేను ఒంటరిగా వదిలిపెట్టబడలేదు. మళ్ళీ నా ఆధ్యాత్మిక కుటుంబం నాకు సహాయం చేసింది. ఆ కష్టమైన సమయంలో సహోదరులు అందించిన సహాయానికి నేను ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటాను. వాళ్ళలో కొందరు నా కూతురిని చూసుకోవడానికి కొన్నాళ్ళపాటు మా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు చూపించిన స్వయం త్యాగపూరిత ప్రేమను నేను ఎన్నడూ మరచిపోలేను.—యోహాను 13:34, 35.
అగాపే పెద్ద పెరిగి ఎలియాస్ అనే సహోదరుణ్ణి పెళ్ళి చేసుకుంది. వాళ్ళకు నలుగురు కొడుకులున్నారు, అందరూ సత్యంలో ఉన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో నాకు ఎన్నోసార్లు గుండెపోటు వచ్చి నా ఆరోగ్యం క్షీణించింది. నా కూతురు, ఆమె కుటుంబం నన్ను శ్రద్ధగా చూసుకుంటున్నారు. నా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉన్నా నేను సంతోషించడానికి అనేక కారణాలు ఉన్నాయి. థెస్సలోనికలో కేవలం వందమంది సహోదరులు ఉండి వాళ్ళు కూటాల కోసం రహస్యంగా ఇళ్ళలో కలుసుకోవడం నాకు ఇంకా గుర్తుంది. ఇప్పుడు అదే ప్రాంతంలో దాదాపు ఐదువేలమంది అత్యంతాసక్తిగల సాక్షులు ఉన్నారు. (యెషయా 60:22) సమావేశాల వద్ద యౌవనులైన సహోదరులు నా దగ్గరకు వచ్చి, “మీరు మా ఇంటికి పత్రికలు తెచ్చేవారు, గుర్తుందా?” అని అడుగుతారు. నేను ఇచ్చిన పత్రికలను తల్లిదండ్రులు చదవకపోయినా, పిల్లలు చదివారు, వారు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించారు!
యెహోవా సంస్థ అభివృద్ధిని చూసినప్పుడు నేను అనుభవించిన కష్టాలన్నింటికి ఫలితం దక్కినట్లు నాకు అనిపిస్తుంది. నేను నా మనవళ్ళకు, ఇతర యౌవనస్థులకు తమ యౌవనంలో తమ పరలోక తండ్రిని గుర్తుంచుకొమ్మని, ఆయన వారిని ఎన్నడూ ఎడబాయడని ఎల్లప్పుడూ చెబుతుంటాను. (ప్రసంగి 12:2) యెహోవా తన మాట నిలబెట్టుకుని ‘తండ్రి లేని’ నాకు ‘తండ్రయ్యాడు.’ (కీర్తన 68:5) నా జీవితంలో మొదట్లో నేను అనాథగా మిగిలినా, చివరకు నేను ఒక ప్రేమగల తండ్రిని పొందాను!
[22వ పేజీలోని చిత్రం]
డ్రామా జైల్లో నేను వంటవాడిగా పనిచేశాను
[23వ పేజీలోని చిత్రం]
మా పెళ్ళి రోజున నేను, కటీనా, 1959
[23వ పేజీలోని చిత్రం]
థెస్సలోనికకు దగ్గర్లోని అడవిలో జరుగుతున్న సమావేశం, 1960ల చివరి భాగం
[24వ పేజీలోని చిత్రం]
మా కూతురితో, 1967