అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో యాభై సంవత్సరాలకుపైగా సేవ చేయడం
ఇమ్మాన్యల్ పాటెరాకిస్ చెప్పినది
పందొమ్మిది శతాబ్దాల క్రితం అపొస్తలుడైన పౌలు, “నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయు”మనే అసాధారణమైన ఆహ్వానాన్ని అందుకున్నాడు. “సువార్త ప్రకటించుట” కొరకైన ఈ క్రొత్త అవకాశాన్ని పౌలు ఇష్టపూర్వకంగా అంగీకరించాడు. (అపొస్తలుల కార్యములు 16:9, 10) అయితే నేను అందుకున్న ఆహ్వానం అంత పాతది కాకపోయినా, 50 కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం నేను “చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమ”ని యెషయా 6:8 నందు వ్యక్తపర్చబడిన స్ఫూర్తితో, అవసరత ఎక్కువగా ఉన్న క్రొత్త ప్రాంతాలలో సేవ చేయడానికి అంగీకరించాను. నేను చేసిన అసంఖ్యాకమైన ప్రయాణాల మూలంగా నాకు నిరంతర సందర్శకుడు అనే మారు పేరు వచ్చింది, కాని నా కార్యకలాపాలకు సందర్శనంతో ఏమాత్రం సంబంధం లేదు. ఒకటికంటే ఎక్కువసార్లు, నేను నా హోటల్ గదికి చేరుకుని మోకాళ్లూని, ఆయన కాపుదలనుబట్టి నేను యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేశాను.
నేను 1916, జనవరి 16న, క్రేతులోని యెరాపెట్రెలో మతసంబంధంగా ఎంతో సాంప్రదాయికమైన కుటుంబంలో జన్మించాను. నేను పసివానిగా ఉన్నప్పటి నుండే అమ్మ నన్ను, నా ముగ్గురు సహోదరీలను ఆదివారం నాడు చర్చికి తీసుకువెళ్లేది. మా నాన్నయితే ఇంటిదగ్గర ఉండి బైబిలు చదవడానికి ఇష్టపడేవాడు. నిజాయితీ గలవానిగా, మంచివానిగా, క్షమాగుణం గలవానిగా నేను మా నాన్నను గౌరవించేవాడిని, నాకు తొమ్మిది సంవత్సరాలున్నప్పుడు ఆయన మరణించడం నన్నెంతగానో ప్రభావితం చేసింది.
నాకు ఐదు సంవత్సరాలున్నప్పుడు, “మన చుట్టూ ఉన్న ప్రతిదీ దేవుని ఉనికిని చాటుతుంది” అని నేను పాఠశాలలో ఒక లేఖనం చదివినట్లు నాకు గుర్తుంది. నేను పెద్దవాడినౌతుండగా, అది నాకు పూర్తి నమ్మకాన్ని కల్గించింది. అలా పదకొండేళ్ల వయస్సులో, “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి, నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది” అని కీర్తన 104:24 నందున్న మాటలను ముఖ్యాంశంగా తీసుకొని ఒక వ్యాసం వ్రాయడానికి నేను ఎంపిక చేసుకున్నాను. ప్రకృతి అద్భుతాలను చూసి, తమ తల్లి చెట్టు నీడ నుండి గాలి ద్వారా దూరంగా వెళ్లగలిగేలా చిన్న చిన్న రెక్కలతోవున్న విత్తనాల వంటి స్వల్పమైన విషయాలనుబట్టి కూడా నేను ముగ్ధుడనయ్యేవాడిని. నేను నా వ్యాసాన్ని సమర్పించిన ఒక వారం తర్వాత, మా ఉపాధ్యాయుడు మొత్తం తరగతికి, ఆ తర్వాత మొత్తం పాఠశాలకు దాన్ని చదివి వినిపించాడు. ఆ సమయంలో, ఉపాధ్యాయులు కమ్యూనిస్టు ఉద్దేశాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి దేవుని ఉనికిని నేను సమర్థించడం విని వారు సంతోషించారు. నేనైతే, సృష్టికర్తయందు నాకు గల నమ్మకాన్ని వ్యక్తం చేసేందుకు నేను ఎంతో ఆనందించాను.
నా ప్రశ్నలకు సమాధానాలు
1930వ దశకం తొలిభాగంలో నేను యెహోవాసాక్షులను మొదటిసారి కలవడం నాకు ఇప్పటికీ స్పష్టంగా జ్ఞాపకముంది. ఇమ్మాన్యల్ లియానూడాకీస్ క్రేతులోని పట్టణాలు గ్రామాలన్నిటిలో ప్రకటిస్తున్నాడు. ఆయన దగ్గరి నుండి నేను అనేక చిన్న పుస్తకాలను తీసుకున్నాను, కాని మృతులు ఎక్కడ ఉన్నారు? (ఆంగ్లం) అనే శీర్షిక గలది నిజంగా నా దృష్టినాకట్టుకుంది. మరణం గురించి నాకు ఎంత అనారోగ్యకరమైన భయం ఉండేదంటే నేను మా నాన్న మరణించిన గదిలోకి కూడా వెళ్లేవాడిని కాదు. నేను ఈ చిన్న పుస్తకాన్ని పదే పదే చదివి, మృతుల పరిస్థితి గురించి బైబిలు బోధిస్తున్నదాన్ని తెలుసుకున్నప్పుడు, నా మూఢనమ్మకపు భయం పోయినట్లు నేను భావించాను.
సంవత్సరానికొకసారి వేసవికాలంలో, సాక్షులు మా పట్టణాన్ని దర్శించి, చదువుకోవడానికి నా కోసం ఎంతో సాహిత్యాన్ని తెచ్చేవారు. లేఖనాలను గూర్చిన నా అవగాహన క్రమంగా పెరిగింది, కాని నేను ఆర్థడాక్స్ చర్చికి వెళ్తూనే ఉన్నాను. అయితే, విడుదల (ఆంగ్లం) అనే పుస్తకం ఒక మలుపు వంటిదే. అది యెహోవా సంస్థకు సాతాను సంస్థకు ఉన్న తేడాను స్పష్టంగా చూపించింది. అప్పటి నుండి నేను బైబిలును, నేను సంపాదించుకోగలిగిన వాచ్‌టవర్ సొసైటీ సాహిత్యాన్నంతటినీ మరింత క్రమంగా పఠించడం ప్రారంభించాను. గ్రీసులో యెహోవాసాక్షులు నిషేధించబడ్డారు గనుక, నేను రాత్రి సమయంలో రహస్యంగా పఠించేవాడిని. అయినప్పటికీ, నేను నేర్చుకుంటున్న దాని గురించి నేను ఎంత ఉత్సాహంగా ఉన్నానంటే, దాని గురించి ప్రతి ఒక్కరితో మాట్లాడకుండా ఉండలేకపోయాను. త్వరలోనే పోలీసులు నన్ను గమనించడం ప్రారంభించి, సాహిత్యం కొరకు వెదకడానికి రాత్రి పగలు క్రమంగా నన్ను దర్శించడం ప్రారంభించారు.
1936లో, 120 కిలోమీటర్ల దూరంలో ఇరాక్లాన్లో నేను మొదటిసారి ఒక కూటానికి హాజరయ్యాను. సాక్షులను కలవడాన్నిబట్టి నేనెంతో సంతోషించాను. వారిలో అనేకులు సామాన్యులే, వారిలో ఎక్కువమంది రైతులు, కాని ఇది సత్యమని వారు నన్ను ఒప్పింపజేశారు. నేను అప్పటికప్పుడు యెహోవాకు సమర్పించుకున్నాను.
నా బాప్తిస్మం నేను ఎన్నడూ మరచిపోలేని ఘట్టం. 1938లో ఒక రాత్రి, నా బైబిలు విద్యార్థులిద్దరినీ నన్ను సహోదరుడు సయోనాడాకిస్ కటికచీకటిలో సముద్రం ఒడ్డుకు తీసుకువెళ్లాడు. ప్రార్థన చేసిన తర్వాత, ఆయన మమ్మల్ని నీళ్లలో ముంచాడు.
నిర్బంధింపబడడం
మామూలు మాటల్లో చెప్పాలంటే, నేను ప్రకటించడానికి వెళ్లిన మొట్టమొదటిసారి ఎంతో విశేషమైనది. ప్రీస్టుగా మారిన నా పాత పాఠశాల స్నేహితున్ని కలిశాను, మేమిద్దరం చక్కగా చర్చించుకున్నాము. కాని ఆ తర్వాత ఆయన, బిషప్పు ఆజ్ఞ ప్రకారం తాను నన్ను నిర్బంధింపజేయవలసి ఉందని చెప్పాడు. పొరుగు గ్రామం నుండి పోలీసులు వచ్చే వరకు మేము మేయర్ కార్యాలయంలో వేచివుండగా, బయట ఒక సమూహం సమకూడింది. కాబట్టి నేను అక్కడ కార్యాలయంలోవున్న గ్రీకు క్రొత్త నిబంధన తీసుకుని మత్తయి 24వ అధ్యాయం ఆధారంగా వారికొక ప్రసంగం ఇవ్వడం ప్రారంభించాను. మొదట్లో ప్రజలు వినడానికి ఇష్టపడలేదు, కాని ప్రీస్టు జోక్యం చేసుకున్నాడు. “ఆయనను మాట్లాడనివ్వండి, ఇది మన బైబిలు” అని చెప్పాడు. నేను గంటన్నరసేపు మాట్లాడగలిగాను. అలా పరిచర్యలో నా మొదటి రోజు నేను మొదటిసారి బహిరంగ ప్రసంగమిచ్చిన సందర్భం కూడా అయ్యింది. నేను ముగించే సమయానికి పోలీసులు ఇంకా రాలేదు గనుక, ఒక గుంపు ప్రజలు నన్ను పట్టణం వెలుపలికి తరిమేలా మేయరు మరియు ప్రీస్టు నిర్ణయించారు. రోడ్డులోని మొదటి మలుపులో, వాళ్లు విసురుతున్న రాళ్లను తప్పించుకోవడానికి నాకు సాధ్యమైనంత వేగంగా నేను పరుగెత్తడం ప్రారంభించాను.
మరునాడు బిషప్పుతోపాటు వచ్చిన ఇద్దరు పోలీసులు నా పనిస్థలంలో నన్ను నిర్బంధించారు. పోలీసు స్టేషన్లో నేను వారికి బైబిలు నుండి సాక్ష్యమివ్వగలిగాను, కాని నా బైబిలు సాహిత్యానికి చట్టపరంగా అవసరమైన బిషప్పు ఆమోద ముద్ర లేదు గనుక, నాపై మతమార్పిడి మరియు అనధికారిక సాహిత్యాన్ని పంచిపెట్టడం అనే నేరారోపణలు చేయబడ్డాయి. విచారణ వాయిదా వేయబడి నేను విడుదల చేయబడ్డాను.
ఒక నెల తర్వాత నా విచారణ జరిగింది. ప్రకటించమని క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను నేను అనుసరిస్తున్నానంతే అని నేను నా ప్రతివాదంగా చెప్పుకున్నాను. (మత్తయి 28:19, 20) న్యాయమూర్తి ఎత్తిపొడుపుగా ఇలా అన్నాడు: “నా కుమారుడా, ఆ ఆజ్ఞ ఇచ్చిన వ్యక్తి శిలువవేయబడ్డాడు. దురదృష్టవశాత్తు నీపై అలాంటి శిక్షను విధించడానికి నాకు అధికారం లేదు.” అయితే, నేను ఎరుగని ఒక యౌవన న్యాయవాది, కమ్యూనిజం మరియు నాస్తికత్వం ఇంతగా ప్రబలి ఉండగా దేవుని వాక్యాన్ని సమర్థించడానికి సిద్ధమయ్యే యౌవనస్థులు ఉన్నందుకు న్యాయస్థానం గర్వించాలని చెబుతూ నా తరఫున వాదించడానికి వచ్చాడు. ఆ తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చి నా ఫైలులోవున్న నా వ్రాతపూర్వక ప్రతివాదాన్ని గురించి నన్ను యథార్థంగా అభినందించాడు. నేను అంత చిన్నవయస్సువాడనై ఉండడాన్ని బట్టి ప్రభావితుడై ఆయన ఉచితంగా నా తరఫున వాదిస్తానన్నాడు. మూడు నెలల కనీస శిక్షకు బదులుగా, నాకు పది రోజుల జైలు శిక్ష మరియు 300 డ్రాక్మాల జరిమానా విధించబడ్డాయి. అలాంటి వ్యతిరేకత, యెహోవా సేవ చేస్తూ సత్యాన్ని సమర్థించాలన్న నా తీర్మానాన్ని మరింత బలపర్చింది.
మరో సందర్భంలో నేను నిర్బంధించబడినప్పుడు, నేను బైబిలు నుండి లేఖనాలను ఎంతో సుళువుగా ఎత్తిచూపించడం న్యాయమూర్తి గమనించాడు. “నీ పని నీవు చేశావు, ఆయన సంగతి నేను చూస్తాను” అని చెప్పి ఆయన బిషప్పును తన కార్యాలయంలో నుండి వెళ్లిపోమన్నాడు. ఆ తర్వాత ఆయన తన బైబిలు బయటికి తీశాడు, ఆ మధ్యాహ్నమంతా మేము దేవుని రాజ్యం గురించి మాట్లాడుకున్నాము. కష్టాలున్నప్పటికీ కొనసాగడానికి అలాంటి సంఘటనలు నన్ను ప్రోత్సహించాయి.
మరణ శిక్ష
1940లో నేను సైనిక సేవ కొరకు పిలువబడ్డాను, దానికి నేను ఎందుకు అంగీకరించలేనో వివరిస్తూ నేను ఒక ఉత్తరం వ్రాశాను. రెండు రోజుల తర్వాత నన్ను నిర్బంధించారు, పోలీసులు నన్ను తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత నన్ను ఆల్బేనియా యుద్ధ ప్రాంతానికి పంపారు. నేను పోరాడేందుకు నిరాకరించాను గనుక నన్ను సైనిక న్యాయస్థానంలో నిలువబెట్టారు. నాది తప్పా ఒప్పా అనేది తెలుసుకోవడంకంటే నా ఉదాహరణ సైనికులపై చూపగల ప్రభావం గురించే తాము ఎక్కువ ఆసక్తి కలిగివున్నామని సైనికాధికారులు నాతో చెప్పారు. నాకు మరణ శిక్ష విధించబడింది, కాని ఒక చట్టపరమైన పొరపాటు మూలంగా నాకు ఎంతో ఉపశమనం కలిగేలా అది పది సంవత్సరాల కఠిన శిక్షగా మార్చబడింది. నా జీవితంలోని ఆ తర్వాతి కొద్ది నెలలు నేను గ్రీసులోని ఒక సైనిక చెరసాలలో చాలా కష్టతరమైన పరిస్థితుల్లో గడిపాను, దాని మూలంగా నేను ఇప్పటికీ శారీరక లోపాలను అనుభవిస్తున్నాను.
అయితే ప్రకటించకుండా చెరసాల నన్ను ఆపలేకపోయింది. పూర్తిగా దానికి వ్యతిరేకమైనది జరిగింది! మామూలు పౌరుడు సైనిక చెరసాలలో ఎందుకున్నాడనేది అనేకులకు ఆసక్తికరంగా ఉండేది గనుక సంభాషణలను ప్రారంభించడం సులభంగా ఉండేది. ఇలాంటి చర్చల్లో యథార్థవంతుడైన ఒక యౌవనస్థునితో చేసిన ఒక చర్చ, చెరసాల ఆవరణంలో బైబిలు పఠనం ప్రారంభించడానికి దారితీసింది. ముప్పయి ఎనిమిది సంవత్సరాల తర్వాత నేను ఈ వ్యక్తిని ఒక సమావేశంలో మరలా కలిశాను. ఆయన సత్యాన్ని అంగీకరించి, లెఫ్కాస్ ద్వీపంలో సంఘాధ్యక్షునిగా సేవ చేస్తున్నాడు.
1941లో హిట్లర్ సైన్యాలు యుగోస్లావియాను ఆక్రమించినప్పుడు, మమ్మల్ని దక్షిణంగా ప్రెవెజాలోని చెరసాలకు తరలించారు. ప్రయాణ సమయంలో, మా వాహనంపై జర్మన్ బాంబర్లు దాడి చేశాయి, ఖైదీలమైన మాకు ఆహారం ఇవ్వబడేది కాదు. నా దగ్గరున్న ఆ కొంచెం రొట్టె అయిపోవడంతో, నేను దేవునికిలా ప్రార్థించాను: “మరణ శిక్ష నుండి నీవు నన్ను తప్పించిన తర్వాత నేను ఆకలితో మరణించడం నీ చిత్తమైతే, నీ చిత్తమే నెరవేరనిమ్ము.”
మరునాడు పేర్లు పిలిచే సమయంలో ఒక అధికారి నన్ను ప్రక్కకు పిలిచి, నేను ఎక్కడి నుండి వచ్చాను, నా తలిదండ్రులెవరు, నేను చెరసాలలో ఎందుకున్నాను వంటివి తెలుసుకుని, నన్ను తనతో రమ్మన్నాడు. ఆయన నన్ను పట్టణంలోవున్న అధికారుల భోజనశాలకు తీసుకువెళ్లి, బ్రెడ్డు చీజ్ వేయించిన గొర్రెమాంసం పెట్టివున్న బల్ల దగ్గరికి తీసుకెళ్లి నన్ను తినమన్నాడు. కాని మిగతా 60 మంది ఖైదీలకు తినడానికి ఏమి లేదుగనుక నేను తినడానికి నా మనస్సాక్షి ఒప్పుకోదని నేను వివరించాను. “నేను ప్రతి ఒక్కరికి తినిపించలేను! మీ నాన్న మా నాన్న ఎడల ఉదారంగా ఉన్నాడు. నాకు నీ ఎడల నైతిక బాధ్యత ఉందిగాని ఇతరుల ఎడల కాదు” అని అధికారి సమాధానమిచ్చాడు. “అలాగైతే, నేను వెనక్కి వెళ్లిపోతాను” అని నేను జవాబిచ్చాను. ఆయన ఒక క్షణం ఆలోచించి, నేను తీసుకోగలిగినంత ఆహారం తీసుకోవడానికి ఒక పెద్ద సంచి నాకిచ్చాడు.
చెరసాలకు తిరిగి వచ్చి సంచిని క్రింద పెట్టి, “మహాశయులారా, ఇది మీ కోసం” అన్నాను. కాకతాళీయంగా, ముందు రోజు సాయంకాలం, నేను వారి కన్య మరియ ప్రార్థనల్లో పాల్గొననందున ఇతర ఖైదీల అవస్థకు నేనే బాధ్యున్నని నిందింపబడ్డాను. అయితే, ఒక కమ్యూనిస్టు నా తరఫున వాదించాడు. ఇప్పుడు, ఆహారాన్ని చూసిన తర్వాత ఆయన ఇతరులతో ఇలా చెప్పాడు: “మీ ‘కన్య మరియ’ ఏది? ఈ వ్యక్తి మూలంగా మనం మరణిస్తామని మీరన్నారు, అయితే ఈయనే మన కోసం ఆహారం తెచ్చాడు.” తర్వాత ఆయన నావైపు తిరిగి, “ఇమ్మాన్యల్! వచ్చి ప్రార్థన చెయ్యి” అని చెప్పాడు.
ఆ తర్వాత కొంతకాలానికి, జర్మన్ సైన్యం ముందుకు దూసుకు రావడంతో చెరసాల కాపలాదారులు పారిపోయారు, దానితో ఖైదీలకు విడుదల లభించింది. 1941 మే చివరి భాగంలో ఏథెన్సుకు వెళ్లే ముందు ఇతర సాక్షులను కనుగొనడానికి నేను పాత్రాస్కు వెళ్లాను. అక్కడ నేను కొన్ని బట్టలు, బూట్లు సంపాదించుకుని, ఒక సంవత్సరంకంటే ఎక్కువకాలం తర్వాత మొదటిసారిగా స్నానం చేయగలిగాను. ఆక్రమణ ముగిసే వరకు, నేను ప్రకటిస్తున్నప్పుడు జర్మన్లు నన్ను ఎప్పుడూ ఆపుతుండేవారు కాని వారు నన్ను ఎన్నడూ నిర్బంధించలేదు. వారిలో ఒకరిలా చెప్పారు: “జర్మనీలో మేము యెహోవాసాక్షులను కాల్చివేస్తాము. కాని ఇక్కడ మా శత్రువులందరూ సాక్షులై ఉంటే బావుండునని కోరుకుంటున్నాము!”
యుద్ధానంతర కార్యకలాపాలు
గ్రీసులో జరిగిన పోరాటం చాలదన్నట్లు, వేలాది మరణాలకు కారణమౌతూ 1946 నుండి 1949 వరకు జరిగిన పౌర యుద్ధం మూలంగా అది మరింత ఛిన్నాభిన్నమయ్యింది. కేవలం కూటాలకు హాజరవ్వడమే నిర్బంధింపబడడానికి కారణమౌతున్న సమయంలో దృఢంగా ఉండడానికి సహోదరులకు ఎంతో ప్రోత్సాహం అవసరమయ్యింది. తమ తటస్థ స్థానాన్నిబట్టి అనేకమంది సహోదరులకు మరణశిక్ష విధించబడింది. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ, అనేకులు రాజ్య వర్తమానానికి ప్రతిస్పందించారు, ప్రతివారం ఒకరు లేక ఇద్దరు బాప్తిస్మం తీసుకునేవారు. 1947 కల్లా నేను పగటి సమయంలో ఏథెన్సులోని సంస్థ కార్యాలయాల్లో పనిచేస్తూ, రాత్రి సమయాల్లో ప్రయాణ కాపరిగా సంఘాలను దర్శించడం ప్రారంభించాను.
1948లో, అమెరికాలో వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌కు హాజరయ్యేందుకు ఆహ్వానింపబడే ఆనందం నాకు లభించింది. కాని ఒక సమస్య తలెత్తింది. నా గత దోష శిక్షల మూలంగా నాకు పాస్‌పోర్టు లభించడం లేదు. అయితే నా బైబిలు విద్యార్థులలో ఒకరు జనరల్‌తో స్నేహపూర్వకమైన సంబంధాలు కలిగివుండేవాడు. ఈ విద్యార్థి వల్ల కేవలం కొద్ది వారాల్లో నాకు పాస్‌పోర్టు లభించింది. నేను వెళ్లడానికి కొంచెం ముందు, కావలికోటను పంచిపెట్టినందుకు నేను నిర్బంధించబడినప్పుడు ఎంతో కలత చెందాను. ఒక పోలీసు నన్ను ఏథెన్సులోని రాష్ట్ర భద్రతా పోలీసు ఉన్నతాధికారి దగ్గరికి నన్ను తీసుకువెళ్లాడు. నాకు అమితాశ్చర్యం కలిగేలా ఆయన మా పొరుగువారిలో ఒకడే! నేను ఎందుకు నిర్బంధించబడ్డానో ఆ పోలీసు వివరించి, పత్రికల దొంతరను ఆయనకిచ్చాడు. మా పొరుగు వ్యక్తి తన సొరుగులో నుండి కావలికోట పత్రికల దొంతరను బయటికి తీసి నాతో ఇలా అన్నాడు: “నా దగ్గర ఇటీవలి సంచికలేదు. నేను ఒక ప్రతి తీసుకోనా?” అలాంటి విషయాల్లో యెహోవా హస్తం తోడుగా ఉండడం చూసి నేనెంత ఉపశమనం పొందానో!
1951లో గిలియడ్ యొక్క 16వ తరగతి సుసంపన్నం చేసే అనుభవం. అది ముగిసిన తర్వాత నేను కుప్రకు నియమించబడ్డాను, అక్కడ మతనాయకుల వ్యతిరేకత గ్రీసులో ఉన్నంత తీవ్రంగానే ఉందని నేను త్వరలోనే కనుగొన్నాను. మేము తరచూ ఆర్థడాక్స్ ప్రీస్టులు వెర్రెక్కించిన మతోన్మాద సమూహాన్ని ఎదుర్కొనవలసి వచ్చేది. 1953లో కుప్రకు వెళ్లడానికి నా వీసా రిన్యూ చేయబడలేదు, నేను మళ్లీ టర్కీలోని ఇస్తాన్‌బుల్‌కు నియమింపబడ్డాను. మళ్లీ ఇక్కడ కూడా నేను కొద్ది కాలమే ఉన్నాను. ప్రకటన పనిలో మంచి ఫలితాలు ఉన్నప్పటికీ, టర్కీ మరియు గ్రీసు మధ్యనున్న రాజకీయ ఉద్రిక్తతల మూలంగా నేను మరో నియామకానికి అంటే ఈజిప్టుకు వెళ్లవలసి వచ్చింది.
నేను చెరసాలలో ఉన్నప్పుడు, కీర్తన 55:6, 7 నాకు జ్ఞాపకం వచ్చేది. అక్కడ దావీదు ఎడారికి పారిపోవాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఒకరోజు నేను సరిగ్గా అక్కడే ఉంటానని నేను ఎన్నడూ ఊహించలేదు. రైలులోను, నైలు నదిలో పడవలోను చాలా రోజులు అలసటతో కూడిన ప్రయాణం చేసిన తర్వాత 1954లో, నేను చివరికి నా గమ్యం చేరాను, అది సుడాన్‌లోని కార్టోమ్. నాకు కావలసిందల్లా స్నానం చేసి, పడుకోవడమే. కాని అది మిట్టమధ్యాహ్నమని నేను మర్చిపోయాను. పైకప్పు మీద ట్యాంకులో నిల్వచేయబడివున్న నీరు నా మాడు కాలిపోయేలా చేసింది, దానితో నేను నా మాడు బాగయ్యేవరకు చాలా నెలలపాటు బెండుతో చేసిన శిరస్త్రాణం ధరించవలసి వచ్చింది.
సహారా మధ్యన, సమీపంలోని సంఘానికి పదహారు వందల కిలోమీటర్ల దూరంలో ఉండి నేను తరచూ ఒంటరిగా అయిపోయినట్లు భావించాను, కాని యెహోవా నన్ను ఆదుకొని, కొనసాగడానికి కావలసిన బలాన్నిచ్చాడు. కొన్నిసార్లు ప్రోత్సాహం ఎంతమాత్రం ఎదురు చూడని వారి నుండి వచ్చేది. ఒకరోజు నేను కార్టోమ్ మ్యూజియమ్ డైరెక్టర్‌ను కలిశాను. ఆయన పక్షపాతం లేని వ్యక్తి, మా మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. నేను గ్రీకు వంశపారంపర్యం గలవాడినని తెలుసుకుని, ఆరవ శతాబ్దపు చర్చిలో కనుగొనబడిన కళాకృతులపైనున్న శాసనాలను అనువదించేందుకు తనతోపాటు మ్యూజియమ్‌కు రావడం ఇష్టమేనానని ఆయన నన్ను అడిగాడు. ఐదు గంటలపాటు ఊపిరాడని భూగర్భంలో గడిపిన తర్వాత, చతురక్షర పదమైన యెహోవా నామం ఉన్న ఒక సాసరును నేను కనుగొన్నాను. నా ఆనందాన్ని ఊహించండి! యూరపులో చర్చీల్లో దైవిక నామాన్ని కనుగొనడం అరుదేమికాదు, కాని సహారా మధ్యన దాన్ని కనుగొనడం ఎంతో అసాధారణమైన విషయమే.
1958లో అంతర్జాతీయ సమావేశం తర్వాత మధ్య ప్రాచ్యం, సమీప ప్రాచ్యం మరియు మధ్యదరా చుట్టుప్రక్కల్లో ఉన్న 26 దేశాలు మరియు పాలిత ప్రాంతాలను దర్శించడానికి నేను జోన్ అధ్యక్షునిగా నియమింపబడ్డాను. తరచూ కష్టతరమైన పరిస్థితి నుండి నేను ఎలా బయటపడేవాడినో నాకే తెలియదు, కాని యెహోవా ఎల్లప్పుడూ తప్పించుకోవడానికి మార్గాన్ని చూపించేవాడు.
కొన్ని దేశాల్లో ఏకాంతంగా ఉంటున్న సాక్షుల ఎడల యెహోవా సంస్థ చూపిస్తున్న శ్రద్ధనుబట్టి నేను ఎప్పుడూ ప్రభావితుడనయ్యాను. ఒక సందర్భంలో నేను, చమురు బావుల్లో పని చేసే ఒక ఇండియన్ సహోదరున్ని కలిశాను. ఆ దేశంలో ఉన్న ఏకైక సాక్షి ఆయనేనని స్పష్టమౌతుంది. ఆయన తన సొరుగులో 18 వేరు వేరు భాషల్లో ప్రచురణలను ఉంచుకొని తన తోటి పనివారికి ఇచ్చేవాడు. విదేశీ మతాలన్నీ కచ్చితంగా నిషేధించబడిన ఈ దేశంలో కూడా, సువార్తను ప్రకటించాలనే తన బాధ్యతను మన సహోదరుడు మరిచిపోలేదు. ఆయనను దర్శించడానికి ఆయన మతానికి చెందిన ఒక ప్రతినిధి పంపబడడం చూసి ఆయన సహోద్యోగులు ముగ్ధులయ్యారు.
1959లో నేను స్పెయిన్ మరియు పోర్చుగల్‌లను దర్శించాను. ఆ సమయంలో ఆ రెండూ సైనిక నిరంకుశత్వం క్రింద ఉన్నాయి, అక్కడ యెహోవాసాక్షుల పని పూర్తిగా నిషేధింపబడింది. కష్టాలున్నప్పటికీ విడిచిపెట్ట వద్దని సహోదరులను ప్రోత్సహిస్తూ ఒక నెలలో నేను వందకంటే ఎక్కువ కూటాలు నిర్వహించాను.
ఇక ఒంటరివాడిని కాదు
ఇరవై కంటే ఎక్కువ సంవత్సరాలుగా, నేను ఒంటరివానిగా పూర్తికాలసేవలో యెహోవా సేవ చేస్తూ వచ్చాను, కాని స్థిరమైన నివాసం లేకుండా ఎడతెగక ప్రయాణాలు చేస్తుండడంవల్ల నేను హఠాత్తుగా అలసిపోయినట్లు భావించాను. ఈ సమయంలో నేను టునీష్యాలో ఆనీ బ్యనుకీ అనే ప్రత్యేక పయినీరును కలిశాను. 1963లో మేము వివాహం చేసుకున్నాము. యెహోవా ఎడల సత్యం ఎడల ఆమెకున్న ప్రేమ, పరిచర్య ఎడల ఆమెకున్న అంకితభావంతోపాటు ఆమెకున్న బోధనా కళ, ఆమె భాషా పరిజ్ఞానం ఉత్తర మరియు పశ్చిమ ఆఫ్రికాలలోనూ ఇటలీలోనూ మా మిషనరీ మరియు సర్క్యూట్ పనిలో అవి నిజంగా ఆశీర్వాదకరమని నిరూపించబడ్డాయి.
1965 ఆగస్టులో నేను, నా భార్య సెనెగల్‌లోని డాకార్కు నియమింపబడ్డాము, అక్కడ స్థానిక బ్రాంచి కార్యాలయాన్ని సంస్థీకరించే ఆధిక్యత నాకు లభించింది. సెనెగల్ మతసహనానికి పేరుపొందిన దేశం, నిస్సందేహంగా దానికి కారణం దాని ప్రెసిడెంటైన లీపోల్ సెంగోరే. ఆయన 1970లలో మలావీలో జరిగిన తీవ్ర హింస సమయంలో యెహోవాసాక్షులకు మద్దతుగా మలావీ ప్రెసిడెంటైన బాండాకు వ్రాసిన కొద్దిమంది ఆఫ్రికా అధికారులలో ఒకరు.
సుసంపన్నమైన యెహోవా ఆశీర్వాదం
1950లో నేను కుప్రకు వెళ్లేందుకు గిలియడ్ను విడిచి వెళుతున్నప్పుడు నేను ఏడు సూట్‌కేసులతో ప్రయాణించాను. నేను టర్కీని వదిలే సమయానికి నా దగ్గర ఐదు సూట్‌కేసులు మిగిలాయి. కాని ఎక్కువగా ప్రయాణిస్తుండడం మూలంగా, నేను 20 కేజీల (44 పౌండ్ల) బరువున్న సామానుతోనే సర్దుకోవలసి వచ్చింది, దానిలో నా ఫైళ్లు, నా “చిన్ని” టైప్‌రైటరు ఉన్నాయి. వాచ్‌టవర్ సంస్థ ఆనాటి అధ్యక్షుడైన సహోదరుడు నార్తో ఒకరోజు నేనిలా చెప్పాను: “మీరు నన్ను వస్తుసంపద ఉరి నుండి కాపాడుతున్నారు. నేను 20 కిలోల బరువుతో జీవించేలా మీరు చేస్తున్నారు, నాకలాగే బాగుంది.” ఎక్కువ వస్తువులు లేనందుకు నాకు అవి లేవేయని నేను ఎన్నడూ భావించలేదు.
నేను ప్రయాణిస్తున్నప్పుడు నా ముఖ్య సమస్య ఏమిటంటే, దేశాల్లోకి ప్రవేశించడం మరియు బయటికి వెళ్లడం. ఒకరోజు, పని నిషేధించబడిన ఒక దేశంలో, కస్టమ్స్ అధికారి నా ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించాడు. ఇది దేశంలోని సాక్షులకు ముప్పు తీసుకురాగలదు, కాబట్టి నేను నా కోటులో నుండి నా భార్య వ్రాసిన ఉత్తరం ఒకటి బయటికి తీసి, కస్టమ్స్ అధికారితో ఇలా అన్నాను: “మీకు ఉత్తరాలు చదవడం ఇష్టమని నాకనిపిస్తుంది. ఫైళ్లలో లేని, నా భార్య వ్రాసిన ఈ ఉత్తరాన్ని కూడా చదవడానికి ఇష్టపడతారా?” ఆయన సిగ్గుపడి, ఇక నన్ను వెళ్లనిచ్చాడు.
1982 నుండి నేను నా భార్య దక్షిణ ఫ్రాన్సులోని నైస్‌లో మిషనరీలుగా సేవచేస్తున్నాము. క్షీణిస్తున్న ఆరోగ్యం దృష్ట్యా, నేను మునుపు చేస్తూ వచ్చినంతగా ఇప్పుడిక ఎంతమాత్రం చేయలేను. కాని దాని భావం మా ఆనందం తగ్గిపోయిందని కాదు. ‘మా ప్రయాసము వ్యర్థము కాలేదని’ మేము చూశాము. (1 కొరింథీయులు 15:58) అనేక సంవత్సరాల కాలంలో ఎవరెవరితో పఠించే ఆధిక్యత నాకు లభించిందో ఆ అనేకానేకమంది ప్రజలందరూ, అలాగే నా కుటుంబంలోని 40 కంటే ఎక్కువ మంది సభ్యులూ నమ్మకంగా యెహోవా సేవ చేయడాన్ని చూసే ఆనందం నాకు లభించింది.
‘అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సేవ చేయడంతో’ కూడిన నా జీవితం మూలంగా నేను చేయవలసి వచ్చిన త్యాగాలనుబట్టి నేను ఎంతమాత్రం విచారించడం లేదు. యెహోవా మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగాలతో మనం చేసే ఏ త్యాగాన్ని పోల్చలేము. కాని నేను సత్యం తెలుసుకున్న గత 60 సంవత్సరాల గురించి ఆలోచించినప్పుడు, యెహోవా నన్ను మెండుగా ఆశీర్వదించాడని నేను చెప్పగలను. సామెతలు 10:22 చెబుతున్నట్లుగా, “యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును.”
నిస్సందేహంగా, యెహోవా “కృప జీవముకంటె ఉత్తమము.” (కీర్తన 63:3) వృద్ధాప్యపు అసౌకర్యాలు అంతకంతకూ ఎక్కువవుతుండగా, ప్రేరేపిత కీర్తన రచయిత యొక్క ఈ మాటలు తరచూ నా ప్రార్థనల్లో ప్రస్తావించబడుతుంటాయి: “యెహోవా, నేను నీ శరణుజొచ్చియున్నాను. నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యమునుండి నా ఆశ్రయము నీవే. దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. . . . తల నెరసి వృద్ధునైయుండు వరకు నన్ను విడువకుము.”—కీర్తన 71:1, 5, 17-18.
[25వ పేజీలోని చిత్రం]
నేడు నా భార్య ఆనీతో