యెహోవా అందించిన నిర్దేశాన్ని ఆనందంగా స్వీకరించాను
యులీసిజ్ వి. గ్లాస్ చెప్పినది
అది అసాధారణమైన సందర్భం. పట్టభద్రులౌతున్న విద్యార్థులు 127 మందే ఉన్నారు, కానీ హాజరులో ఉత్సాహంతో ఉరవళ్లు తొక్కుతున్న 1,26,387 మంది ఉన్నారు. వీరు అనేక దేశాల నుండి వచ్చారు. న్యూయార్క్ సిటీలోని యాంకీ స్టేడియంలో 1953, జనవరి 19న జరిగిన వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ యొక్క 21వ తరగతి స్నాతకోత్సవం సంరంభం అది. అది నా జీవితంలో ఎందుకంత ప్రాముఖ్యమైన ఘట్టమైంది? కాస్త నేపథ్య రంగాన్ని వివరిస్తాను.
నేను అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో విన్సెన్నెస్లో 1912, ఫిబ్రవరి 17న ప్రకటన 12:1-5లో వర్ణించబడిన మెస్సీయా రాజ్యం ఉద్భవించడానికి దాదాపు రెండు సంవత్సరాల ముందు జన్మించాను. నేను పుట్టడానికి మునుపటి సంవత్సరం నా తల్లిదండ్రులు స్టడీస్ ఇన్ ద స్క్రిప్చర్స్ సంపుటుల ఆధారంగా బైబిలును పఠించటం ప్రారంభించారు. ప్రతి ఆదివారం ఉదయం ఆ పుస్తకాల్లో ఒక దాన్ని కాస్త చదివి కుటుంబానికి వినిపించేవారు, తర్వాత దాని గురించి మేము చర్చించుకునేవారము.
మా అమ్మగారు తాను నేర్చుకుంటున్న విషయాలు పిల్లలమైన మా ఆలోచనలను రూపుదిద్దుకునేలా సహాయపడటానికి ఉపయోగించేది. ఆమె చాలా మంచి మనిషి—ఎంతో దయగలది, సహాయం చేయడానికి ఎంతో ఇష్టతను చూపించేది. మేం పిల్లలం నలుగురమయ్యాము, కానీ మా తల్లిగారు పొరుగున ఉన్న పిల్లలకు కూడా తన ప్రేమను పంచేది. ఆమె మాతో సమయం గడిపేది. మాకు బైబిలు కథలను చెప్పటం, మాతోపాటు పాటలు పాడటం ఆమెకు ఎంతో ఆనందంగా ఉండేది.
పరిచర్యలో పూర్తికాలం పనిచేస్తున్న అనేకమందిని అమ్మ మా ఇంటికి ఆహ్వానించేది. వారు ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉండేవారు, మా ఇంట్లో ప్రసంగాలు ఇస్తూ కూటాలు నిర్వహించేవారు. ఉపమానాలు ఉపయోగిస్తూ, మాకు కథలు చెప్పేవారిని మేము ప్రాముఖ్యంగా ఎక్కువ ఇష్టపడేవారము. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన ఒక సంవత్సరానికి 1919లో ఒక సహోదరుడు తన వ్యాఖ్యానాలను పిల్లలమైన మా వైపు ఎక్కుపెట్టాడు. ఆయన పవిత్రీకరణ అనే అంశాన్ని—నేడు మనం సమర్పణ అని మరింత కచ్చితంగా పిలిచే అంశాన్ని చర్చించి, అది మా జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తుందో మేమర్థం చేసుకోవడానికి సహాయం చేశాడు. అటుతర్వాత రాత్రి నేను నిద్రపోవడానికి ముందు నేను నా పరలోకపు తండ్రికి ప్రార్థన చేసి నేనెల్లప్పుడూ ఆయన్నే సేవించాలనుకుంటున్నానని ఆయనకు చెప్పాను.
అయితే, 1922 తర్వాత జీవితంలోని ఇతర చింతలు ఆ నిర్ణయాన్ని వెనక్కు త్రోసిపుచ్చేసినట్లు అన్పించింది. మేము ఒక స్థలం నుండి మరో స్థలానికి కదిలివెళ్లాము, దాంతో యెహోవా ప్రజల సంఘంతో సహవాసం లేకుండా పోయింది. మా నాన్నగారు రైల్వేలో తన పని మూలంగా ఇంటికి దూరంగా ఉండేవారు. మా బైబిలు పఠనం క్రమంగా జరిగేది కాదు. నేనొక కమర్షియల్ ఆర్టిస్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో స్కూల్లో కొన్ని కోర్సులు చేశాను, ఏదైనా గొప్ప విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టాలన్న పథకాలు వేస్తూవున్నాను.
నా ప్రాధాన్యతలను సరిదిద్దుకోవడం
1930ల మధ్య భాగంలో ప్రపంచంపైకి మళ్లీ భౌగోళిక యుద్ధ మేఘాలు ముసురుకోనారంభించాయి. మేము ఒహాయోలోని క్లీవ్‌లాండ్‌లో నివసిస్తున్నాము, అప్పుడు ఒక యెహోవాసాక్షి వచ్చి మా తలుపు తట్టాడు. మేము పిల్లలముగా ఉన్నప్పుడు నేర్చుకొన్న విషయాల్ని గురించి మరింత గంభీరంగా తలంచనారంభించాము. మా అన్న రస్సెల్ మా అందరికన్నా గంభీరవదనుడు, ఆయనే మొట్టమొదట బాప్తిస్మం తీసుకున్నాడు. నేనదో తరహా మనిషిని అంత గంభీరమైన మనిషిని కాను, కానీ 1939, ఫిబ్రవరి 3న నేను కూడా బాప్తిస్మం తీసుకున్నాను. యెహోవాకు సమర్పించుకోవడంలో ఇమిడివున్నదాని పట్ల నా మెప్పుదల అంతకంతకూ పెరగసాగింది. నేను యెహోవా నిర్దేశాన్ని స్వీకరించడం నెమ్మదిగా నేర్చుకుంటున్నాను. అదే సంవత్సరం మా అక్క కాథరిన్, చెల్లి గెర్ట్రూడ్ కూడా బాప్తిస్మం తీసుకున్నారు. మేమందరం పయినీర్లుగా పూర్తికాల సేవను చేపట్టాము.
అయితే దీనర్థం మేము ఇక వేరే విషయాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని కాదు. మా వదినగారు ఆన్ అనే ఒక అందమైన అమ్మాయిని గురించి ప్రస్తావించగానే నా చెవుల అవధానం అటు వెళ్లిపోయింది. ఆ అమ్మాయి సత్యం గురించి విన్నప్పటి నుండి ఆమెకు “భూమ్మీద కాలు నిలువడం లేదనీ” మా ఇంట్లో కూటాలకు వస్తోందనీ మా వదినగారు చెప్పారు. ఆ సమయంలో ఆన్ ఒక లీగల్ కార్యాలయంలో సెక్రెటరీగా పనిచేస్తుంది, ఆమె సంవత్సరానికల్లా బాప్తిస్మం తీసుకుంది. నేను వివాహం చేసుకోవాలని అనుకోలేదు, కానీ ఆన్ నూటికి నూరు పాళ్లు సత్యాన్ని స్వంతం చేసుకుందని స్పష్టంగా కన్పించింది. ఆమె యెహోవా సేవలో పూర్తిగా నిమగ్నం కావాలని ఇష్టపడేది. ఆమె ఎన్నడూ, “నేను అది చేయగలనా?” అనేటువంటి మనిషి కాదు. బదులుగా, “నేనది చేయడానికి భేషైన పద్ధతి ఏమిటి?” అని అడిగేది. అనడం మాత్రమే కాదు దానికి తగ్గ క్రియలు చేయడానికి కావాల్సిన స్థిర నిశ్చయం ఆమెవద్ద ఉంది. ఆ అనుకూల దృక్పథం నన్ను బాగా ఆకర్షించింది. దానికి తోడు, ఆమె చాలా అందంగా ఉండేది, ఇప్పటికీను. ఆమె నా భార్య అయ్యింది, త్వరలోనే పయినీరు సేవలో నా భాగస్వామి అయ్యింది.
పయినీర్లుగా అమూల్యమైన శిక్షణ
పయినీర్లుగా మేము ఇంట్లో వస్తువులు నిండుకున్నప్పుడు కొద్దివాటితోనే ఎలా సంతృప్తిపడాలో నేర్చుకున్నాము, సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా ఎలా సంతృప్తి కలిగివుండాలో నేర్చుకున్నాము. (ఫిలిప్పీయులు 4:11-13) ఒకరోజు రాత్రి కావస్తోంది, కానీ మాకు తినడానికి ఏమీ లేదు. మా ఇద్దరి దగ్గర కలిపితే ఐదు సెంట్లు మాత్రం ఉన్నాయి. మేము మాంసం దుకాణానికి వెళ్లి “ఐదు సెంట్లకు సరిపడా బొలోనా ఇవ్వగలరా?” అని నేనడిగాను. ఆయన మా ఇద్దరివంకా చూసి నాలుగు ముక్కలు కోసి ఇచ్చాడు. అది ఐదు సెంట్లకన్నా ఎక్కువని నాకు తెలుసు, అది అప్పటికి మా ఆకలిని తీర్చింది.
మేము పరిచర్యలో ఉన్నప్పుడు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవడం అసాధారణమేమీ కాదు. న్యూయార్క్‌లోని సిరాకుస్ వద్దనున్న ఒక పట్టణంలో మేము ఒక ప్రత్యేక బహిరంగ కూటంవైపుకి అవధానాన్ని ఆకర్షించడానికి ప్లేకార్డ్లు ధరించి వీధిలో హ్యాండ్బిల్లులను పంచుతున్నాము. ఇద్దరు దృఢకాయులు మీదికి వచ్చి నామీద చెయ్యి చేసుకున్నారు. వారిలో ఒకడు పోలీసాఫీసరు, కానీ యూనిఫారం ధరించలేదు, ఆయన ఐడింటిఫికేషన్ కార్డును చూడాలన్న నా విన్నపాన్ని తిరస్కరించాడు. సరిగ్గా అప్పుడే బ్రూక్లిన్ బేతేలులోని గ్రాంట్ సూటర్ అటుగా వచ్చి, పరిస్థితిని సరిదిద్దడానికి మేం పోలీస్ స్టేషన్‌కి వెళతామని చెప్పాడు. తర్వాత ఆయన బ్రూక్లిన్‌లోని సొసైటీ కార్యాలయానికి ఫోన్ చేశాడు. ఒక టెస్ట్ కేస్కోసం ఆధారాలు సంపాదించడానికి అదే రోజు ప్లేకార్డులను ధరించి హ్యాండ్బిల్లులతో వీధిలోనికి వెళ్లమని మా ఇద్దరికీ నిర్దేశాలు అందాయి. మేము ఊహించిన రీతిగానే అరెస్టయ్యాము. అయితే, మమ్మల్ని అనవసరంగా అరెస్టు చేస్తున్నందుకు పోలీసులపై కోర్టులో దావా వేస్తామని చెప్పినప్పుడు వారు మమ్మల్ని పోనిచ్చారు.
ఆ తర్వాతి రోజు యౌవనస్థులతో కూడిన ఒక రౌడీ మూక ప్రీస్టు ప్రోద్బలంపై మా సమావేశ స్థలంపై దాడిచేశారు, పోలీసుల జాడ ఎక్కడా కానరాలేదు. ఆ మూక చెక్కనేలపై తమ బేస్‌బాల్ బ్యాట్లతో బాదుకుంటూ, ప్రేక్షకుల్లో కొందర్ని బెంచీలమీది నుండి నేలపైకి తోస్తూ ప్లాట్ఫారం మీదికి వెళ్లి ఒక అమెరికా జెండాను ఎత్తి పట్టుకుని “దీనికి సెల్యూట్ చేయండి ! సెల్యూట్ చెయ్యండి !” అని అరిచారు. తర్వాత వారు “బీర్ బ్యారెల్ పోల్కా” అనే జనాదరణ పొందిన పాటను పాడసాగారు. వారు ఆ సమావేశాన్ని పూర్తిగా ఛిన్నాభిన్నం చేశారు. యేసు చెప్పిన మాటలకు అర్థం ఏమిటో మేము ప్రత్యక్షంగా రుచిచూశాము: “మీరు లోకసంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయతే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.”—యోహాను 15:19.
ఆ బహిరంగ ప్రసంగం, నిజానికి అప్పటి వాచ్ టవర్ సొసైటీ అధ్యక్షుడైన జె. ఎఫ్. రథర్పోర్డ్ ఇచ్చిన రికార్డు చేయబడిన ప్రసంగం. నేనూ ఆన్ ఆ పట్టణంలో కొద్ది రోజులుండి ఆ ప్రసంగాన్ని వారి ఇండ్లలోనే వినిపిస్తామని చెబుతూ ప్రజల వద్దకు వెళ్లాము. కొందరు అందుకు సమ్మతించారు.
విదేశీ సేవకై స్వచ్ఛందంగా ముందుకు వెళ్లాము
కొంతకాలానికి సేవకై క్రొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. మా అన్న రస్సెల్, ఆయన భార్య డొరోతీలకు 1943లో గిలియడ్ స్కూలు యొక్క మొదటి తరగతికి జంటగా ఆహ్వానం లభించింది, తర్వాత వారిని మిషనరీలుగా క్యూబాకు పంపించారు. మా అక్క కాథరిన్ నాలుగవ తరగతికి హాజరైంది. ఆమెను కూడా క్యూబాలో నియమించారు. ఆమెను తర్వాత డొమినికన్ రిపబ్లిక్లోను, ఆ తర్వాత ప్యూర్టో రికోలోను నియమించారు. నా సంగతి ఆన్ సంగతి ఏమిటి?
మేము మొదటి సారిగా గిలియడ్ గురించీ, సొసైటీ మిషనరీలను ఇతర దేశాలకు పంపించాలనుకునే విషయం గురించీ విన్నప్పుడు విదేశీ సేవకు మమ్మల్ని మేము అందుబాటులో ఉంచుకోవాలని మేము భావించాము. మొదట్లో మా అంతట మేమే వెళ్లాలని, బహుశ మెక్సికోకు వెళ్లాలని తలంచాము. కానీ తర్వాత, మేము గిలియడ్ స్కూలుకు హాజరైన తర్వాత మమ్మల్ని సొసైటీయే నియమించేంత వరకు వేచివుండటం మంచిదని నిర్ణయించుకున్నాము. ఇది యెహోవా ఉపయోగించుకుంటున్న ఏర్పాటని మేము గ్రహించాము.
మమ్మల్ని గిలియడ్ స్కూలులో నాలుగవ తరగతికి ఆహ్వానించారు. కానీ తరగతి ప్రారంభం కావడానికి కొంచెం ముందు, నా భార్య ఆన్ తన చిన్నతనంలోని పోలియో మూలంగా ఆమెకున్న పరిమితులను అప్పట్లో వాచ్ టవర్ సొసైటీ అధ్యక్షునిగా ఉన్న ఎన్. హెచ్. నార్ పరిగణలోనికి తీసుకున్నాడు. ఆయన దాని గురించి నాతో మాట్లాడి, మమ్మల్ని మరో దేశంలో సేవచేయడానికి పంపించడం జ్ఞానయుక్తం కాదని నిర్ణయించాడు.
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత, నేను ఒక సమావేశానికి సిద్ధపాట్లను చేస్తుండగా బ్రదర్ నార్ నన్ను చూసి గిలియడ్‌కు హాజరు కావాలని మాకు ఇంకా ఆసక్తి ఉందా అని నన్ను అడిగాడు. మేము గిలియడ్‌కి హాజరైనా విదేశీ నియామకానికి వెళ్లమని ఆయన నాకు చెప్పాడు; ఆయన మనస్సులో వేరే ఏదో ఉంది. అలా తొమ్మిదవ తరగతి 1947, ఫిబ్రవరి 26న రిజిస్టర్ అయినప్పుడు మేము అందులో విద్యార్థులముగా చేరాము.
గిలియడ్ స్కూల్లోని ఆ రోజులు ఎన్నటికీ మరపురానివి. పఠన కోర్సులు ఆధ్యాత్మికంగా బలంగా ఉండేవి. చిరకాలం నిలిచే స్నేహబంధాలు ఏర్పడ్డాయి. కానీ స్కూలుతో నా సంబంధం దానికి మించినదే.
వాషింగ్టన్కు గిలియడ్‌కు మధ్యన
గిలియడ్ స్కూలు అప్పట్లో కాస్త క్రొత్తది. అమెరికా ప్రభుత్వానికి ఈ స్కూలు లక్ష్యాల విషయమై అంత పరిచయం లేదు, అందుకని అనేక ప్రశ్నలు తలెత్తేవి. వాషింగ్టన్లో ఒక ప్రతినిధి ఉండాలని సొసైటీ తలంచింది. గిలియడ్ నుండి పట్టభద్రులమైన కొన్ని నెలలకు మమ్మల్ని పంపించింది అక్కడికే. గిలియడ్‌కు హాజరు కమ్మని ఇతర దేశాలనుండి ఆహ్వానించబడిన వారికి వీసాలను సంపాదించడంలోను, పట్టభద్రులైన వారిని మిషనరీ పనికై విదేశాలకు పంపించడానికి అవసరమయ్యే లీగల్ పేపర్లను సంపాదించడంలోను సహాయపడటం నా పని. కొందరు అధికారులు మంచి మనస్తత్వం గలవారు, సహాయపడేవారు. కొంతమందికి సాక్షులంటే చాలా వ్యతిరేక భావాలుండేవి. బాగా రాజకీయ దృక్పథాలున్న కొందరు మాకు సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలున్నాయని వాదించేవారు.
నేను ఒక వ్యక్తి ఆఫీసుకు వెళ్లినప్పుడు, మనం జెండా వందనం చేయనందునా, యుద్ధానికి వెళ్లనందునా మనల్ని తీవ్రంగా అధిక్షేపించాడు. ఆయన పెద్ద గొంతుకతో కాస్సేపు గట్టిగా అరిచిన తర్వాత నేను చివరికి ఇలా అన్నాను: “యెహోవాసాక్షులు ప్రపంచంలోని ఎవరితోనూ యుద్ధాలు చేయరని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను, నిజానికి మీకా విషయం తెలుసు. మేము ఈ లోక వ్యవహారాల్లో తలదూర్చము. మేము వాళ్ల యుద్ధాల్లో పాల్గొనము, వారి రాజకీయాల్లో వేలు పెట్టము. మేము పూర్తిగా తటస్థ స్థానం వహిస్తాము. మీరు ఎదుర్కొంటున్న సమస్యల్ని మేమిప్పటికే అధిగమించాము; మా సంస్థలో మా మధ్య ఐక్యత ఉంది. . . . ఇప్పుడు మీరు మమ్మల్ని ఏమి చేయమంటున్నారు? మేము చేస్తున్నదంతా ఆపేసి మీరు అవలంబిస్తున్న పద్ధతుల్ని మళ్లీ చేపట్టమని మాకు చెబుతున్నారా?” అటు తర్వాత ఆయన ఏమీ అనలేదు.
ప్రభుత్వ కార్యాలయాలతో పని చేయడానికి వారంలో రెండు రోజులు పూర్తిగా కేటాయించబడ్డాయి. దానికి తోడు, మేము ప్రత్యేక పయినీర్లుగా కూడా సేవచేస్తున్నాము. అప్పట్లో, ఈ సేవకై క్షేత్ర పరిచర్యలో ప్రతి నెలా 175 గంటలు వెచ్చించేవారము (తర్వాత దీన్ని 140 గంటలకు మార్చారు), అందుకని మేము దాదాపు ప్రతిరోజు సేవలో రాత్రయ్యేంత వరకు గడిపేవారము. మేమా సేవలో చాలా ఆనందించాము. కుటుంబ సమేతంగా చేసే బైబిలు పఠనాలను మేము చాలా నిర్వహించేవాళ్లము, వాళ్లు చక్కని అభివృద్ధిని కనపర్చేవారు. నేనూ ఆన్ పిల్లలు వద్దని నిర్ణయించుకున్నాము, కానీ ఆధ్యాత్మికంగా చూస్తే మాకు పిల్లలే కాదు మాకు మనవళ్లు, ముని మనవళ్లు కూడా కలిగారు. వారు మా హృదయాలకు ఎంత సంతోషాన్ని కలుగజేస్తారో కదా!
1948 చివర్లో నాకు మరో నియామకం అందింది. గిలియడ్ స్కూల్లోని రిజిష్ట్రార్, ఉపదేశకుడూ అయిన బ్రదర్ ష్రోడర్ మరో ప్రాముఖ్యమైన పనిలో నిమగ్నం కావల్సివుందని బ్రదర్ నార్ వివరించాడు, గనుక అవసరమైనప్పుడు గిలియడ్ తరగతుల్లో బోధించమని నాకు చెప్పడం జరిగింది. నా గుండె దడదడలాడుతుండగా నేను మళ్లీ న్యూయార్క్‌లోని సౌత్ లాన్సింగ్కు ఆన్తోపాటు డిసెంబర్ 18న వచ్చాను. మొదట్లో మేము గిలియడ్‌లో కొన్ని వారాలు గడిపి తిరిగి వాషింగ్టన్‌కి వెళ్లేవాళ్లము. అయితే, చివరికి నేను వాషింగ్టన్లోకన్నా గిలియడ్లోనే ఎక్కువ సమయం గడపనారంభించాను.
నేను ముందు పేర్కొన్నట్లుగా, న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంలో గిలియడ్ 21వ తరగతి స్నాతకోత్సవం జరిగింది ఈ కాలంలోనే. ఉపదేశకుల్లో ఒకడిగా ఆ స్నాతకోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం లభించింది.
ప్రపంచ ముఖ్యకార్యాలయంలో సేవ
1955, ఫిబ్రవరి 12న మా జీవితాల్లో మరో నియామకం ప్రారంభమైంది. యెహోవా దృశ్య సంస్థ ముఖ్యకార్యాలయంలో బేతేలు కుటుంబంలో సభ్యులమయ్యాము. మేమేం చేయాల్సి ఉంది? ప్రాథమికంగా, మాకు నియమించిన పని ఏదైనా దాన్ని చేయడమే, ఇతర సభ్యులతో సహకారం అవసరమయ్యే కార్యకలాపాల్లో భాగం వహించడమే. నిజమే, మేము దాన్ని ఇంతకు ముందు కూడా చేశాము, కానీ ఇప్పుడు మేము మరింత పెద్ద సమూహంలో భాగం కానైవున్నాము—అది ముఖ్యకార్యాలయ బేతేలు కుటుంబము. మేమీ క్రొత్త నియామకాన్ని యెహోవా నిర్దేశానికి ఒక నిదర్శనంగా భావిస్తూ ఆనందంతో స్వీకరించాము.
నా పనిలో చాలా భాగం వార్తా మాధ్యమాలతో వ్యవహరించడం ఉండేది. వార్తాపత్రికలు సంచలనాత్మక కథల వేటలో ఉండటం మూలాన, పక్షపాతంతో విషయాల్ని వక్రీకరించే మూలాల నుండి సమాచారాన్ని పొందటం మూలాన యెహోవాసాక్షుల గురించి చాలా ఘోరమైన విషయాలు వ్రాశాయి. మేమా పరిస్థితిని మెరుగుదిద్దడానికి కృషిచేశాము.
మాకందరికీ చేతినిండా పని ఉండేలా బ్రదర్ నార్ చూసుకునేవారు, అందుకని మాకు ఇతర నియామకాలు కూడా ఉండేవి. ఈ ఇతర నియామకాలకు కమర్షియల్ ఆర్టిస్టుగా నేను గడించిన అనుభవం బాగా ఉపయోగపడింది. సొసైటీకి చెందిన డబ్ల్యుబిబిఆర్ రేడియో స్టేషన్ సంబంధంగా ఇతర పనులు ఉండేవి. సొసైటీ ఉత్పత్తి చేసిన మోషన్ పిక్చర్స్ సంబంధంగా కూడా పనులు చేయవలసి ఉండేది. గిలియడ్ పఠన కోర్సులో దైవపరిపాలనా చరిత్ర సహజంగానే ఒక భాగంగా ఉంది, కానీ ఆ ఆధునికదిన దైవపరిపాలనా సంస్థ చరిత్రకు సంబంధించిన వివరాలతో యెహోవా ప్రజలలో అనేకమంది సుపరిచితులయ్యేలా, అలాగే ఆ చరిత్ర బయటి ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా ఇప్పుడు వివిధ ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. బహిరంగంగా మాట్లాడే విషయంలో శిక్షణ గిలియడ్‌లోని మరో అంశంగా ఉంది. అందుకని బహిరంగంగా మాట్లాడటంలోని అనేక ప్రాథమిక అంశాలు సంఘాల్లోని సహోదరులకు అందుబాటులో ఉంచేందుకు చేయాల్సిన పని ఉంది. దీన్ని బట్టి చూస్తే పని చాలానే ఉంది.
గిలియడ్‌లో పూర్తిగా నిమగ్నం కావడం
1961లో ప్రయాణ పైవిచారణకర్తలకు, బ్రాంచిల్లోని సేవకులకు శిక్షణ మొదలు కానైవుండటంతో గిలియడ్ స్కూలు బ్రూక్లిన్కు తరలించబడింది, వాచ్ టవర్ సొసైటీ ప్రధాన కార్యాలయాలు ఉన్నది అక్కడే. నేను మళ్లీ తరగతి గదిలోనికి ప్రవేశించాను—ఈసారి ప్రత్యామ్నాయ ఉపదేశకునిగా కాదు గానీ బోధనా సిబ్బందిలో ఒక క్రమమైన సభ్యునిగా ప్రవేశించాను. ఎంతటి ఆధిక్యత ! గిలియడ్ స్కూలు యెహోవా నుండి ఒక కానుక అని పూర్తి నిశ్చయతతో ఉన్నాను, ఇది ఆయన పూర్తి దృశ్య సంస్థకు ప్రయోజనాల్ని చేకూర్చిన కానుక.
బ్రూక్లిన్‌లోని గిలియడ్ విద్యార్థులకు మునుపటి తరగతుల్లోని విద్యార్థులు ఎరుగని అవకాశాలు లభించాయి. ఇప్పుడు గెస్ట్ లెక్చరర్లు ఎక్కువమంది ఉన్నారు, పరిపాలక సభతో సన్నిహిత సంబంధం ఉంది, ముఖ్యకార్యాలయ బేతేలు కుటుంబంతో సహవాసం చాలా ఎక్కువగా ఉంది. విద్యార్థులు ఆఫీసు కార్యకలాపాల్లో, బేతేలు గృహ కార్యకలాపాల్లో, ఫ్యాక్టరీ పనిలోని అనేక అంశాల్లో శిక్షణ పొందడానికి సాధ్యమౌతుంది.
సంవత్సరాల తరబడి విద్యార్థుల సంఖ్య వేర్వేరుగా ఉంది, ఉపదేశకుల సంఖ్య కూడా మారుతూ వచ్చింది. స్కూలు స్థలం కూడా అనేకసార్లు మారింది. ఇప్పుడు ఈ స్కూలు న్యూయార్క్‌లో పాటర్సన్లోని అందమైన పరిసరాల్లో స్థాపితమైవుంది.
విద్యార్థులతోపాటు పనిచేయడం
ఈ తరగతుల్లో బోధించడం ఎంతో గొప్ప ఆనందాన్నిచ్చింది ! మా కండ్ల ముందు ఈ పాత విధానంలో ఏమాత్రం ఆసక్తిలేని యువత ఉంది. వారు తమ కుటుంబ సభ్యుల్ని, తమ స్నేహితుల్ని, తమ ఇంటిని, తమ భాష మాట్లాడే ప్రజల్ని విడిచి వస్తారు. వారు ఉండబోయే వాతావరణం, ఆహారం—మొత్తం అంతా వేరుగా ఉండబోతోంది. తాము వెళ్లే దేశం ఏదో కూడా వారికి తెలియదు, కానీ వారి లక్ష్యం మాత్రం మిషనరీలుగా తయారుకావడమే. అలాంటి ప్రజల్ని పురికొల్పడానికి ఒకరు ఏమీ చేయనవసరం లేదు.
నేను తరగతి గదిలోనికి వెళ్లిన ప్రతిసారి విద్యార్థులు ప్రశాంతంగా ఉండేలా చేయడం నా లక్ష్యంగా ఉంటుంది. ఉద్విగ్నంగా, వర్రీలతో ఉన్నప్పుడు ఎవ్వరూ సరిగ్గా నేర్చుకోలేరు. నిజమే నేను ఉపదేశకుణ్నే, కానీ విద్యార్థిగా ఉండటం అంటే ఏమిటో నాకు తెల్సు. నేనూ ఒకప్పుడు ఆ సీట్లలో కూర్చున్నవాణ్నే కదా. వారు గిలియడ్‌లో కష్టపడి పఠించి ఎన్నో విషయాల్ని నేర్చుకుంటారు, కానీ వారు ఇక్కడున్నప్పుడు ఎంజాయ్ చేయాలని కూడా నేను కోరుకుంటాను.
వారు తమ నియామకాలకు వెళ్లినప్పుడు, వారు విజయవంతంగా ఉండాలంటే కొన్ని పనులు చేయాల్సి ఉంటుందని నాకు తెలుసు. వారికి బలమైన విశ్వాసం అవసరం. వారికి నమ్రత అవసరం ఉంటుంది—చాలా నమ్రత. వారు ఇతరులతో సర్దుకుపోవడం నేర్చుకోవల్సి ఉంటుంది, పరిస్థితుల్ని స్వీకరించాల్సి ఉంటుంది, ధారాళంగా క్షమించాల్సి ఉంటుంది. వారు ఆత్మ ఫలాల్ని పెంపొందించుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. వారు ప్రజల్ని ప్రేమించాల్సి ఉంటుంది, తాము పంపించబడిన పనిని ప్రేమించాల్సి ఉంటుంది. విద్యార్థులు గిలియడ్‌లో ఉన్నప్పుడు ఈ విషయాల్ని వారి కండ్ల ముందు ఉంచడానికి నేనెప్పుడూ ప్రయత్నించేవాణ్ని.
నేను నిజానికి ఎంతమంది విద్యార్థులకు బోధించి ఉంటానో నాకు తెలియదు. కానీ నేను వాళ్ల గురించి ఎలా భావిస్తానో నాకు బాగా తెలుసు. వారితోపాటు ఐదు నెలలపాటు తరగతిగదిలో గడిపిన తర్వాత వారితో మానసికంగా దగ్గరకాకుండా ఉండలేను. తర్వాత వారు స్నాతకోత్సవం దినాన ప్లాట్‌ఫారంపై నడుచుకుంటూ వెళ్లి తమ డిప్లొమాలు పొందడం నేను చూసినప్పుడు వారు తమ పఠన కోర్సును విజయవంతంగా ముగించారని నాకు తెలుస్తుంది, త్వరలోనే వాళ్లు వెళ్లిపోతారనీ తెలుస్తుంది. నా కుటుంబంలో ఒక భాగం నన్ను విడిచి వెళ్లిపోతున్న భావన నాకు కలుగుతుంది. తమను తాము అర్పించుకోవడానికి ఇష్టపడే వ్యక్తుల్నీ, ఈ యౌవనులు చేసేలాంటి పనిని చేయడానికి ఇష్టపడే వ్యక్తుల్నీ ప్రేమించకుండా ఎలా ఉండగలరు?
సంవత్సరాల తర్వాత వారు సందర్శించడానికి తిరిగి వచ్చినప్పుడు వారు తమ సేవలో పొందిన ఆనందానుభూతుల్ని చెబుతుండగా విన్నప్పుడు వారు ఇంకా తమ నియామకాల్లో ఉన్నారనీ ఏమి చేయడానికైతే శిక్షణ ఇవ్వబడ్డారో అదే చేస్తున్నారనీ నేను తెలుసుకుంటాను. అప్పుడు నా భావనలు ఎలా ఉంటాయా? నిజం చెబుతున్నాను, నిజంగా నాలో చాలా గొప్ప భావనలు కలుగుతాయి.
భవిష్యత్తులోకి చూస్తూ
ఇప్పుడు నా కండ్లు మందగించాయి, దానివల్ల వచ్చే నిరాశా నిస్పృహలు నాకు అనుభవమే. నేనిక గిలియడ్ తరగతిలో బోధించలేకపోతున్నాను. మొదట్లో, దీనికి సర్దుకోవడానికి చాలా కష్టంగా ఉంది, కానీ నా జీవితమంతా నేను వివిధ పరిస్థితులను స్వీకరించి వాటితో సర్దుకుపోవడం నేర్చుకున్నాను. నేను అపొస్తలుడైన పౌలు గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటాను, ఆయన ‘శరీరములోని ఒక ముల్లు’ను గురించీ ఆలోచిస్తుంటాను. మూడుసార్లు పౌలు ఆ బాధనుండి ఉపశమనాన్నిమ్మని వేడుకున్నాడు కానీ, “నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని” ప్రభువు ఆయనతో అన్నాడు. (2 కొరింథీయులు 12:7-10) పౌలు దానితోనే జీవించడం కొనసాగించాడు. ఆయన విజయం సాధించగలిగినప్పుడు నేను ప్రయత్నమన్నా చేయాల్సిందే. నేనిక తరగతి గదుల్లో బోధించకపోయినా, విద్యార్థులు ప్రతిరోజు వచ్చిపోవడం చూడగల్గుతున్నందుకు కృతజ్ఞతతో ఉన్నాను.
భవిష్యత్తులో ఏముందో ఆలోచించడం ఒక అద్భుతమైన అనుభవం. ఇప్పుడు పునాది పడుతోంది. గిలియడ్ అందులో ఒక ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. మహా శ్రమల తర్వాత, ప్రకటన 20:12లోని గ్రంథములు విప్పబడినప్పుడు యెహోవా మార్గాల్లో వెయ్యేండ్లపాటు తీవ్రతరమైన విద్యాబోధన అదనంగా ఉంటుంది. (యెషయా 11:9) కానీ అది కూడా ముగింపు కాదు. అది కేవలం ప్రారంభం మాత్రమే. యెహోవా సంకల్పాలు ఒక్కొక్కటిగా బయల్పడుతుండగా ఆయన గురించి నేర్చుకోవడానికి ఎంతో అదనంగా ఉంటుంది, చేయడానికి ఎంతో ఉంటుంది. యెహోవా తాను చేసిన అద్భుతమైన వాగ్దానాలను నేరవేరుస్తాడని నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను, అంతేకాదు, మనకు అప్పుడు యెహోవా ఇచ్చే నిర్దేశాలను స్వీకరించడంలో భాగస్తుడను కావడానికి అక్కడ ఉండాలనీ కోరుకుంటున్నాను.
[26వ పేజీలోని చిత్రం]
1953లో న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంలో గిలియడ్ స్నాతకోత్సవం
[26వ పేజీలోని చిత్రం]
గెర్ట్రూడ్, నేను, కాథరిన్, రస్సెల్
[26వ పేజీలోని చిత్రం]
సమావేశ సంస్థీకరణలో ఎన్. హెచ్. నార్తోను (పూర్తి ఎడమవైపు) ఎమ్. జి. హెన్షెల్తోను పనిచేస్తూ
[26వ పేజీలోని చిత్రం]
డబ్ల్యుబిబిఆర్ ప్రసారణ స్టూడియోలో
[29వ పేజీలోని చిత్రం]
గిలియడ్ తరగతిగదిలో
[31వ పేజీలోని చిత్రం]
ఇటీవల ఆన్‌తో