గిలియడ్ పాఠశాల—50 ఏళ్లనాటిదే, ఇంకనూ వర్థిల్లుతోంది!
“రాజ్యాన్ని గూర్చి పూర్తిగా సాక్ష్యమివ్వని ప్రాంతాలు మరెన్నో వున్నాయని” ఫిబ్రవరి 1, 1943లో ఎన్. హెచ్. నార్ మొదటి గిలియడ్ తరగతి ప్రారంభ దినాన చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే, “క్షేత్రమందు మరింతమంది శ్రామికులున్నట్లయితే, వందల వేల సంఖ్యలోనున్న వారికి సువార్త చేరవచ్చు. ప్రభువు కృపవలన మరెంతోమంది వస్తారు.”
ఎంతోమంది, అవును లక్షల సంఖ్యలో ఆ శ్రామికులున్నారు! ఆ 1943లో 54 దేశాల్లోని 1,29,070 మంది రాజ్య ప్రచారకుల సంఖ్య 1992లో 229 దేశాల్లో 44,72,787కు పెరిగింది. ఈ పెరుగుదలకు కారణమైన సాక్ష్యపు పనికి గిలియడ్ పాఠశాల ఎంతగానో దోహదపడింది. ప్రపంచమంతటా అవసరమైన ప్రాంతమందు సేవచేయుటకు మిషనరీ శ్రామికులకు శిక్షణనిచ్చుటలో 50 సంవత్సరాల తర్వాతకూడా అది కీలకపాత్ర వహిస్తూనేవుంది.
మార్చి 7, 1993న 94వ తరగతి పట్టభద్రుల కార్యక్రమానికి న్యూజెర్సీలోని, జెర్సీ సిటీ అసెంబ్లీ హాల్లో ఆహ్వానిత అతిథులు, అమెరికా బేతేలు కుటుంబ సభ్యులు 4,798 మంది సమకూడారు. నిజంగా ఈ ప్రత్యేకమైన సందర్భము 50 సంవత్సరాల గిలియడ్ పాఠశాల చరిత్రను పునఃసమీక్షించే చక్కని తరుణమిచ్చింది. ఆ కార్యక్రమాన్ని గూర్చి మీరుకూడా కొంత తెలుసుకోవాలని అభిలషిస్తున్నారా?
ప్రారంభ పాట తర్వాత, పరిపాలక సభ సభ్యుడైన జార్జి డి. గాంజెస్ భావగర్భితంగా ప్రార్థించారు. ఆ పిమ్మట సభాధ్యక్షుడైన కారీ డబ్ల్యు. బార్బర్ పరిచయ వాక్యాల్ని పలికిన తర్వాత, చేయబడిన క్లుప్త ప్రసంగాల పరంపరను గిలియడ్ పట్టభద్రులు, ఆలాగే హాజరైన వారందరు జాగ్రత్తగా విన్నారు.
“మీరెన్నడూ ఒంటరివారు కారు” అనే మూలాంశంపై రాబర్ట్ డబ్ల్యు. వాలెన్ మొదట మాట్లాడారు. ఆప్యాయతా స్వరంతో ఆయనిలా అన్నారు: ‘రానైయున్న దినాల్లో, కుటుంబ సభ్యులనుండి స్నేహితులనుండి దూరంగా ఒంటరిగా వున్నామనే భావాలు మీలో ఉత్పన్నమయ్యే సందర్భాలుంటాయి.’ అలాంటప్పుడు, “మీరెన్నడూ ఒంటరివారు కారు” అని ఎలా చెప్పగలము? ఆయనిలా వివరించారు: ‘ఎలాగంటే, మీలో ప్రతివారు యెహోవా దేవునితో తక్షణమే మాట్లాడగల సాధ్యత కలదు.’ ప్రార్థనాధిక్యతను కాపాడుకొని, ప్రతిదినము ప్రార్థించుడని ఆయన పట్టభద్రులకు ఉద్బోధించాడు. అప్పుడు వారు యేసువలెనే యిలా చెప్పగలరు, “నేను ఒంటరిగా లేను.” (యోహాను 16:32) పట్టభద్రులకు ఆ మాటలెంత ప్రోత్సాహకరముగా ఉండెనో!
ఆ తర్వాత, (మార్చి 7, దినవచనంపై ఆధారపడిన) “మీ నిరీక్షణకు హత్తుకొని యుండుడి” అనే మూలాంశంపై పరిపాలక సభలోని మరో సభ్యుడైన లేమెన్ ఎ. స్వింగెల్ మాట్లాడి, రెండు లక్షణాలను అనగా సహనమును, నిరీక్షణల అవసరతను తెల్పారు. ‘నిందలు, విరోధ స్వభావము, ద్వేషము, చెరసాల, చివరకు మరణమనే కారణాల్నిబట్టి క్రైస్తవులు సహనము కలిగియుండాలి. అవసరమైన సమయాల్లో యెహోవాయొక్క నమ్మకమైన సాక్షులు పొందగల బలాధిక్యతకు హద్దు లేదని, ఇది ప్రత్యేకంగా పట్టభద్రులకు ఒక నిశ్చయమైన అభయానిస్తుందని’ ఆయన చెప్పారు. మరి నిరీక్షణ విషయమేమి? ‘నిరీక్షణ అత్యవసరమని’ ఆయన వివరించారు. ‘శిరస్త్రాణం ధరించువారిని అదెట్లు కాపాడుతుందో, అదే ప్రకారం రక్షణయనే నిరీక్షణ ఒక క్రైస్తవుని మానసిక శక్తులను సంరక్షించి, కాపాడుతూ తన యథార్థతను కాపాడుకొనుటకది శక్తివంతున్ని చేస్తుంది. కావున నిరీక్షణెంతో అగత్యమని’ ఆయన వివరించారు.—1 థెస్సలొనీకయులు 5:8.
తర్వాతి ప్రసంగీకుడైన, రాల్ఫ్ ఇ. వాల్స్ “మనము తప్పించుకొని రక్షితమగు ‘విశాలమైన స్థలమునకు’ ఎట్లు పారిపోగలము?” అనే ఆసక్తికరమైన మూలాంశంపై మాట్లాడారు. ఈ “విశాలమైన స్థలము” ఏమిటి? (కీర్తన 18:19) అది మనస్సుకు సమాధానమును, హృదయానికి సంరక్షణను తీసుకొచ్చే విడుదలనే ఒక పరిస్థితని’ ఆ ప్రసంగీకుడు వివరించాడు. మనకు దేనినుండి విడుదల అవసరం? ‘మననుండి, అనగా మనస్వంత లోపాలనుండే కాదు, సాతాను ఆజ్యంపోసే బయటి పరిస్థితులనుండి కూడా మనకు విడుదల అవసరమని’ ఆయన అన్నారు. (కీర్తన 118:5) మనమెట్లు ఆ విశాలమైన స్థలమిచ్చే కాపుదలను పొందగలము? ‘మనం చేసే ప్రతిపనిలో యెహోవా ఆజ్ఞల కొరకు వెదకి, మన చింతలన్నింటి విషయంలో యెహోవాకు విన్నవించుకొనుట ద్వారానే.’
“భవిష్యత్తులో మీకొరకు ఏమి వేచియున్నది?” అనే మూలాంశాన్ని డాన్ ఎ. ఆడమ్స్ ఎన్నుకున్నారు. క్రొత్త మిషనరీలకు భవిష్యత్తులో ఏమి వేచియున్నది? అది వారు సవరణలు చేసుకునే సమయమని, “ఆలాగే వారియెదుట అనేక ఆశీర్వాదములు ఉన్నవని” ఆయన వివరించారు. దానికొక ఉదాహరణగా, తాము నియమింపబడిన ప్రాంతంలో స్థిరపడ్డాక ఉత్తరం వ్రాసిన క్రొత్త మిషనరీ దంపతులను గూర్చి ఆయన పేర్కొన్నారు. ఆ ఉత్తరంలో వారిలా వ్రాశారు: “సేవలో మీరు గడిపిన శ్రేష్ఠమైన దినాన్ని గూర్చి ఆలోచించండి, మాకిక్కడ ప్రతిదినం అలానేవుంది. అన్ని సమయాల్లో మేము తీసుకెళ్లగలిగిన దానికంటే ఎక్కువ సాహిత్యాలు అవసరమౌతున్నాయి, ప్రజలు ఎడతెగక పఠనముల కొరకు అడుగుతున్నారు.” పట్టభద్రుల కుటుంబ సభ్యులు, స్నేహితుల విషయంలో కూడా ప్రసంగీకుడు వ్యాఖ్యలు చేస్తూ యిలా అన్నారు: ‘ఈ పట్టభద్రులను గూర్చి మీరు చింతించాల్సిన అవసరం లేదు. వారికి ప్రోత్సాహకరమైన మాటలు వ్రాస్తూ మీరు వారికి సహాయం చేయవచ్చును.’—సామెతలు 25:25.
ఆ పిమ్మట పాఠశాల ఉపదేశకులు ప్రసంగించారు. జాక్ డి. రెడ్ఫోర్డ్ “మీరు ఎవరినుండి ఏదీ ఆశించకండి” అనే మూలాంశంపై ప్రసంగించారు. ప్రజా సహజీవనమే పట్టభద్రులకు ఒక సవాలు విసురుతుందని ఆయన వివరించారు. వారికేది సహాయపడ గలదు? “వారి లోపాల్ని ఎంచవద్దు. ఇతర ప్రజలనుండి అధికంగా దేనినీ అపేక్షించవద్దు. మీరనుకున్నట్లే ప్రతిదీ పూర్తిగా జరగాలని ఎప్పుడూ ఎదురుచూడవద్దు. ఇతర ప్రజల అసంపూర్ణతకు ఎడమియ్యండి, అలా మీరు చూపే దయ, మీరు సాఫీగా సాగిపోయేందుకు దోహదపడుతుంది. ఇతర ప్రజలతో సహజీవనం గడిపే మీ సామర్థ్యం, మీ పూర్ణసిద్ధికి కొలమానంగా పనిచేస్తుందని” ఆయన చెప్పారు. (సామెతలు 17:9) ఈ జ్ఞానయుక్తమైన సలహాను అన్వయించుట పరదేశమందు మిషనరీలుగా ఉండుటకు జయప్రదంగా సవరణలు చేసుకోవడానికి పట్టభద్రులకిది నిశ్చయముగా సహాయపడ గలదు.
“మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు” అని 2 కొరింథీయులు 4:7 చెప్పుచున్నది. గిలియడ్ పాఠశాల రిజిష్ట్రార్ అయిన యులైసెస్ వి. గ్లాస్ “నిరూపించబడిన, నమ్మకమైన మీ సహోదరులను నమ్మండి” అనే మూలాంశంపై ప్రసంగిస్తూ ఈ వచనంపై వ్యాఖ్యానించారు. ఈ “మంటి ఘటములు” ఏమిటి? “మనం అసంపూర్ణ మానవులమని అవి సూచిస్తున్నవని” ఆయన అన్నారు. మరి ఈ “ఐశ్వర్యమేమిటి”? “అది మన క్రైస్తవ పరిచర్య” అని ఆయన వివరించారు. (2 కొరింథీయులు 4:1) కాగా ఈ ఐశ్వర్యంతో మనమేం చేయాలి? “యెహోవా మనకప్పగించిన ఈ ఐశ్వర్యాన్ని మనం కూడబెట్టకూడదు. కాబట్టి, ప్రియమైన మిషనరీలారా, మీరెక్కడికి వెళ్లినా దాన్ని మీరు పంచండి, ఆలాగే దానినెలా పంచాలో ఇతరులనేకులకు నేర్పించండి.”
ఆల్బర్ట్ డి. ష్రోడర్ ప్రసంగించ నారంభించినప్పుడు అది గతస్మృతుల్ని జ్ఞాపకానికి తెచ్చిన సమయమైంది. ఎందుకంటె, ఆయన గిలియడ్ పాఠశాలను ప్రారంభించినప్పుడు ఆయనే దానికి రిజిష్ట్రార్‌గా ఉండెను. “దైవపరిపాలనా శిక్షణా అర్ధశతాబ్దం” అనే మూలాంశంపై ఆయన ప్రసంగించారు. “సమర్థవంతమైన శిక్షణ ఎలా యివ్వాలో యెహోవాకు తెలుసు, అది ఇవ్వబడింది కూడ” అని ఆయనన్నారు. ఎలా? యాభై సంవత్సరాల క్రితం నెలకొల్పబడిన రెండు పాఠశాలలు అనగా దైవపరిపాలనా పాఠశాల, గిలియడ్ పాఠశాల ద్వారా పొందిన శిక్షణను సహోదరుడైన ష్రోడర్ సూచించారు. కచ్చితమైన జ్ఞానాన్ని సమకూర్చుటలో న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఒక విలువైన సాధనంగా ఉండెనని ఆయన సూచించారు. ఆయన పట్టభద్రులకిలా అభయమిచ్చారు: “యెహోవా సంకల్పాల్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని సొసైటి మీకు మెండుగా సమకూర్చుననే గొప్ప నమ్మకంతో మీరు నియమించబడిన దేశాలకు మీరు వెళ్లవచ్చును.”
వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ పెన్సిల్వేనియా అధ్యక్షుడగు మిల్టన్ జి. హెన్షెల్ “అత్యధిక విజయము పొందుట” అనే మూలాంశంపై ప్రసంగించారు. “మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము” అనే 1943 సంవత్సరపు వార్షిక వచనాన్నుండి సహోదరుడైన హెన్షెల్ తన మూలాంశాన్ని తీసుకున్నారు. (రోమీయులు 8:37, కింగ్ జేమ్సు వర్షన్) అది యుక్తమైన వార్షిక వచనమై యుండెను, ఎందుకంటె రెండవ ప్రపంచ యుద్ధం జరుగుచుండగా, అనేక దేశాల్లోని మన సహోదరులు తీవ్ర హింసను అనుభవిస్తుండిరని ఆయన వివరించారు. ఆ వార్షిక వచనాన్ని చర్చించిన ది వాచ్‌టవర్ నుండి అక్కడక్కడి అంశాలను చదివి ఆ తర్వాత సహోదరుడైన హెన్షెల్ యిలా వివరించారు: “ఈ వాచ్‌టవర్ శీర్షికను [జనవరి 15, 1943] ఫిబ్రవరి నెలలో మొదటి గిలియడ్ తరగతి వారు పఠించారు, కాగా అది భవిష్యత్ సేవకై వారిని సిద్ధపరచింది.” గడచిన 50 సంవత్సరాలలో అనేకమంది పట్టభద్రులు ఇప్పటికే తాము విజయులమని నిరూపించుకున్నారని ఆయన వివరించారు. మరి 49వ తరగతి విషయమేమి? “యెహోవాను హత్తుకొనియుండండి, ఆయన ప్రేమకు హత్తుకొనియుండండి అప్పుడు మీకు తప్పక విజయం సిద్ధిస్తుంది.”
ఉదయకాల ప్రసంగాల తర్వాత సభాధ్యక్షుడు వివిధ దేశాలనుండి వచ్చిన అభినందనా ఉత్తరాలను చదివి విన్పించారు. ఆ వెంటనే ఆ 24 మంది వివాహిత జంటలు ఉత్కంఠతతో ఎదురుచూసిన సమయం అనగా వారి యోగ్యతా పత్రాలిచ్చే సమయం రానేవచ్చింది. గిలియడ్ విద్యార్థులు ఇప్పుడు గిలియడ్ పట్టభద్రులని పిలువబడతారు. వారు 5 దేశాలనుండి వచ్చారు, అయితే వారిప్పుడు 17 దేశాలకు నియమించబడ్డారు. ఆ దేశాల్లో హాంకాంగ్, తైవాన్, మొజాంబిక్, తూర్పు ఐరోపాలోని కొన్ని ప్రాంతాలున్నాయి.
విరామం తర్వాత, సంక్షిప్త వాచ్‌టవర్ పఠనంతో మధ్యాహ్న కార్యక్రమం మొదలైంది. దీన్ని రాబర్ట్ ఎల్. బట్లర్ నిర్వహించారు. ఆ తర్వాత పట్టభద్రులు, న్యూయార్క్‌లో వాల్కిల్ సమీపాన సాక్ష్యమిస్తుండగా తమకు కలిగిన విశేష అనుభవాల్ని నటించి ప్రదర్శించారు. వారిని నిస్సందేహంగా గిలియడ్‌కు రప్పించిన ఒక సంగతిని అనగా ప్రాంతీయసేవ యెడల వారికున్న మిక్కిలి ప్రేమను ఆ కార్యక్రమం ప్రతిబింబించింది.
విద్యార్థుల కార్యక్రమం తర్వాత, ప్రేక్షకుల్లోని అనేకులు 50 సంవత్సరాల గిలియడ్ పాఠశాల చరిత్రను పురస్కరించి ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ఉండకపోతుందాని అనుకున్నారు. వారి ఆశ అడియాస కాలేదు.—దీనితోపాటు ఉన్న “యాభై సంవత్సరాల గిలియడ్ పాఠశాలను పునఃసమీక్షించుట” అను బాక్సు చూడండి.
యాభై సంవత్సరాల క్రితం, సహోదరుడైన నార్ తానొక విశ్వాసంగల, భవిష్యత్ యెడల సదుద్దేశంగల వ్యక్తియని ప్రదర్శించాడు. గిలియడ్ పాఠశాల విజయవంతమౌతుందనే ఆయన నమ్మకం, మొదటి తరగతి నుద్దేశించి ఆయన చేసిన ప్రారంభ ప్రసంగమందు వ్యక్తపర్చబడింది. ఆయనిలా అన్నాడు: “‘సాక్షి కుప్ప’ అని దానికున్న పేరుకు తగ్గట్టే యిక్కడ నుండి ప్రపంచమందలి అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది, కాగా ఆ విధంగా ఇవ్వబడిన సాక్ష్యం, ఎన్నటికీ నాశనము చేయబడని దేవుని మహిమ కొరకైన ఒక శిలాఫలకంగా నిలుస్తుంది. సర్వోన్నతుడు మిమ్మును నడిపిస్తాడని, అవసరమైన ప్రతి సమయమందును ఆయన మిమ్మును నిర్దేశిస్తాడని తెలిసికొన్నవారై నియమిత పరిచారకులుగా మీరాయనయందు సంపూర్ణ నమ్మకం ఉంచండి. అంతేకాకుండా ఆయన ఆశీర్వదించే దేవుడని కూడా మీరు తెలుసుకుంటారు.”a
యాభై సంవత్సరాల తర్వాత కూడ, గిలియడ్ పాఠశాల ఇంకనూ వర్థిల్లుతోంది. ఈ 94వ తరగతిలో పట్టభద్రులైన వారు వారికంటే ముందు పట్టభద్రులైన 6,500 మందిని అనుసరించే అధిక్యతనిప్పుడు కలిగియున్నారు. యెహోవా దేవుని మహిమార్థమై ఒక శిలాఫలకంగా నిలిచియుండగల “సాక్షికుప్పను” మరింత పెంచుటలో తమ పాత్ర నిర్వహిస్తుండగా, వారు సర్వోన్నతునియందు తమ సంపూర్ణ నమ్మకం ఉంచుదురు గాక.
[అధస్సూచీలు]
a హెబ్రీ భాషలో “గలేదు” అనే పదానికి “సాక్షికుప్ప” అని భావము—ఆదికాండము 31:47, 48.
[25వ పేజీలోని బాక్సు]
ఈ తరగతి గణాంక వివరాలు
విద్యార్థుల సంఖ్య: 48
ప్రాతినిధ్యం వహించబడిన దేశాల సంఖ్య: 5
నియమించబడిన దేశాల సంఖ్య: 17
సగటు వయస్సు: 32
సత్యమందు సగటు సంవత్సరాలు: 15.3
పూర్తికాల పరిచర్యలో సగటు సంవత్సరాలు: 9.6
[26, 27వ పేజీలోని బాక్సు]
“యాభై సంవత్సరాల గిలియడ్ పాఠశాలను పునఃసమీక్షించుట”
ఆ పాఠశాలలో పాలుపంచుకొనిన వారు అనగా, గతకాలపు పట్టభద్రులు, ఉపదేశకులు, దాన్ని వ్యవస్థీకరించుటకు సహాయపడిన ఇతరుల అనుభవాలకంటె గిలియడ్ చరిత్ర పునఃసమీక్షకు మరింకేది శ్రేష్ఠమై ఉంటుంది? థియోడర్ జారస్ నిర్వహించిన “యాభై సంవత్సరాల గిలియడ్ పాఠశాలను పునఃసమీక్షించుట” అనే భాగాన్ని వినుటకు ప్రేక్షకులెంతో మురిసిపోయారు.
పాఠశాల నెలకొల్పడానికి నడిపిన పరిస్థితులేమిటి? పాఠశాలను వ్యవస్థీకరించుటకు తనకూ తనతోపాటు ఉన్న మరియిద్దరు ఉపదేశకులకు కేవలం నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఇవ్వబడిందని, “అయితే ఫిబ్రవరి 1, 1943 సోమవారానికల్లా పాఠశాలను ప్రతిష్ఠించడానికి మేము సిద్ధపడ్డామని” సహోదరుడైన ష్రోడర్ వివరించారు.
వివిధ ప్రాంతాలకు పంపబడిన మొదటి మిషనరీలకు అది ఎలాంటి అనుభవమై యుండింది? సహోదరుడైన హెన్షెల్ అప్పటి విషయాల్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ యిలా చెప్పారు: “మేము తీసుకెళ్లాలనుకున్న వస్తువులన్నింటిని సొసైటి షిప్పింగ్ డిపార్టుమెంటు వారు చెక్కపెట్టెల్లో పెట్టేసేవారు. మేము వెళ్లాల్సిన ప్రాంతం చేరుకున్న తర్వాత, వాటిని జాగ్రత్తగా తెరచి మా వస్తువులన్నింటిని బయటకు తీసుకునేవారం. ఆ తర్వాత ఆ చెక్కపెట్టెల్ని మాక్కావల్సిన ఫర్నిచర్ తయారుచేసుకునేవారం.” నెమ్మదిగా సొసైటి యుక్తరీతిలో సిద్ధపర్చిన మిషనరీ గృహాల్ని ఏర్పాటుచేసిందని ఆయన అన్నారు.
కార్యక్రమంలో తర్వాత, ప్రస్తుతం అమెరికా బేతేలు కుటుంబమందు సభ్యులుగావున్న గిలియడ్ తరగతి తొలిసభ్యులు కొందరు వారికి గుర్తున్న విషయాల్ని, వారి భావాల్ని, అనుభవాల్ని పంచుకున్నారు. వారి వ్యాఖ్యలు నిజంగా ప్రేక్షకులందరి హృదయాల్ని స్పర్శించాయి.
“మొదటి తరగతికి హాజరుకావల్సిందిగా నాకు ఆహ్వానం అందిన తర్వాత, మా అమ్మకు క్యాన్సరు వుందని నాకు తెలిసింది. అయితే ఆమె తన 16వ ఏటనుండే పయినీర్ సేవ చేసినందున, నేను అట్టి ఆహ్వానమును అంగీకరించవలసిందిగా నాకు దృఢమైన సలహానిచ్చింది. కాబట్టి, ఎటూ పాలుపోని భావాలతో, యెహోవా యందలి నమ్మకంతో, నేను దక్షిణ లాన్సింగ్కు ప్రయాణమయ్యాను. గిలియడ్ శిక్షణ నాకెంతో ఆనందాన్నిచ్చింది, నేను దాన్నెంతగానో హర్షించాను. నేను పట్టభద్రురాలైన కొద్దికాలానికే మా అమ్మ తనువుచాలించారు.”—మెక్సికో, ఎల్సాల్వడార్లలో సేవచేసిన షార్లెట్ ష్రోడర్.
“ఇప్పటికే యెహోవా నేనున్న ప్రాంతంలో నాయెడల శ్రద్ధవహించినందున, నేనెక్కడికి వెళ్లినా ఆ ప్రాంతము కూడా ఆయనదే కాబట్టి అక్కడకూడ ఆయన నాయెడల శ్రద్ధవహిస్తాడని నేను నమ్మాను. అందువలన మొదటి తరగతి కొరకు నాకివ్వబడిన ఆహ్వానాన్ని నేను సంతోషంగా స్వీకరించాను.”—మెక్సికో, ఎల్సాల్వడార్లలో సేవచేసిన జూలియా వైల్డ్మేన్.
“అది మహాద్భుతం! మేము ప్రతి ఇంట మాట్లాడగల్గేవాళ్లం. మొదటి నెలలో నేను 107 పుస్తకాలు అందించి, 19 బైబిలు పఠనాలు నిర్వహించాను. రెండవ నెలలో నాకు 28 బైబిలు పఠనాలు ఉండెను. నిజమే, మేము అలవాటు పడాల్సిన సంగతులు కొన్ని అనగా, వేడి, ఉక్కపోత, క్రిమికీటకాలు. అయితే అక్కడ సేవచేయడం అద్భుతమైన ఆధిక్యత. అది నేనన్నివేళలా ప్రేమించే సేవయే.”—రెండవ తరగతికి హాజరైన మేరీ ఆడమ్స్, క్యూబాలో తన నియామకాన్ని గూర్చి అలా తెల్పింది.
“అలస్కాలో మేము తట్టుకోవాల్సిన ఒక పెద్ద సంగతేమంటే, అక్కడి వాతావరణం. ఉత్తర భాగంలో ఉష్ణోగ్రత సున్న డిగ్రీల ఫారన్హిట్కంటే తక్కువగా 60 డిగ్రీలు పడిపోవడంతో వాతావరణం అత్యంత శీతలంగా ఉంటుంది. అలస్కాలో ఆగ్నేయదిక్కుగానున్న ఇండియన్ గ్రామాలను, అక్కడక్కడున్న చిన్నప్రాంతాల్ని మేము పడవలు లేదా విమానం ద్వారా చేరుకునేవాళ్లం.”—మూడవ తరగతికి హాజరైన జాన్ ఎరికెట్టి.
“నాకు గిలియడ్ అంటే, మనల్ని ఆత్మీయంగా బలపరచి, అద్భుతమైన జీవమార్గాన్ని చూపడానికి యెహోవా తన భూసంస్థ ద్వారా యిచ్చిన ఆహ్వానమే.”—11వ తరగతికి హాజరై, ఐర్లాండ్‌లో సేవచేసిన మిల్డ్రెడ్ బార్.
ఆ తర్వాత హృద్యంగమైన మరెన్నో పరిచయాలు చేయబడ్డాయి—లూసెల్ హెన్షెల్ (14వ తరగతి, వెనిజ్యులాలో సేవచేశారు), మార్గరెట్టా క్లెయిన్ (20వ తరగతి, బొలీవియాలో సేవచేశారు), లూసిల్లీ కోల్ట్రెప్ (24వ తరగతి, పెరూలో సేవచేశారు), లారెన్ వాలెన్ (27వ తరగతి, బ్రెజిల్లో సేవచేశారు), విలియమ్, సాండ్రా మాలెన్ఫాంట్ (34వ తరగతి, మొరాకోలో సేవచేశారు), గెరెట్ లోష్ (41వ తరగతి, ఆస్ట్రియాలో సేవచేశారు), డేవిడ్ స్ప్లాన్ (42వ తరగతి, సెనెగల్‌లో సేవచేశారు).
మరి ఉపదేశకులుగా సేవచేసిన సహోదరుల విషయమేమి? వారిలో కూడ చాలామంది పరిచయం చేయబడ్డారు—రస్సెల్ కుర్జెన్, కార్ల్ ఆడమ్స్, హెరాల్డ్ జాక్సన్, ఫ్రెడ్ రస్క్, హారి పెలియోన్, జాక్ రెడ్ఫోర్డ్, యులైసెస్ గ్లాస్. వారు తమకివ్వబడిన ఆధిక్యతను ప్రస్తావిస్తూ, అది నేటివరకు తమపై ఎలాంటి ప్రభావం చూపిందో వ్యక్తపర్చారు.
గిలియడ్ శిక్షణపొందిన మిషనరీల సమర్థవంతమైన సేవను గూర్చిన ఉత్కంఠభరితమైన సాక్ష్యాన్ని జపాన్‌లో సేవచేసిన లాయిడ్ బారీ తెలియజేశారు. అక్కడకు 1949లో 15 మంది మిషనరీలు పంపబడినప్పుడు, జపానంతటిలో కేవలం 10 కంటె తక్కువమంది ప్రచారకులు మాత్రమే ఉండిరి. అయితే 44 సంవత్సరాల తర్వాత ఇప్పుడా దేశంలో 1,75,000 కంటే ఎక్కువమంది రాజ్య ప్రచారకులున్నారు. పనామాలో 45కు పైగా సంవత్సరాలు సేవచేసి 125 మంది వ్యక్తులు సమర్పించుకొని బాప్తిస్మం పొందుటకు సహాయపడిన ఒక మిషనరీ సహోదరి అనుభవంతో సహా, సత్యం నేర్చుకోవడంలో ప్రజలకు సహాయపడిన కొంతమంది మిషనరీల అసాధారణ విజయాన్ని గూర్చి రాబర్ట్ వాలెన్ వివరించారు.
ప్రేక్షకులలో కూర్చొనియున్న గిలియడ్ పట్టభద్రులందరు స్టేజిపైకి రావల్సిందిగా ఆహ్వానమివ్వడంతో యావత్ కార్యక్రమం ముగింపుకు చేరుకుంది. నిజంగా అదెంత మధుర క్షణం! సహోదర సహోదరీల గుంపు అనగా, సందర్శించవచ్చిన పట్టభద్రులు, వారికితోడు బేతేలు కుటుంబమందలి 89 మంది హాలు మధ్యగా స్టేజిపైకి వెళ్లారు. అనేక సంవత్సరాలుగా ఉపదేశకులుగా సేవచేసిన సహోదరులు, 94వ తరగతికి చెందిన పట్టభద్రులు వారితో కలిశారు. అలా స్టేజీపై చేరిన వారిసంఖ్య మొత్తం 160కు చేరుకుంది.
“విదేశాల కొరకు గిలియడ్ శిక్షణపొందిన మిషనరీల సేవ నిశ్చయంగా సఫలమైందా?” అని సహోదరుడైన జారస్ ప్రశ్నించారు. “దానికి గడచిన 50 సంవత్సరాల రుజువు అవును అని బిగ్గరగా సమాధానమిస్తుంది!”
[25వ పేజీలోని చిత్రం]
వాచ్‌టవర్ గిలియడ్ పాఠశాల 94వ తరగతి నుండి పట్టభద్రులైన వారు
క్రింద ఇవ్వబడిన పట్టికలో, ముందు నుండి వెనుకకున్న వరుసలలోని పేర్లు, ప్రతివరుసలో ఎడమనుండి కుడికి ఇవ్వబడినవి.
(1) డి లా గార్సా, ఎస్.; బార్గ్, ఇ.; అర్యాగా, ఇ.; చూ, ఇ.; పర్విస్, డి.; ఫోస్బెరి, ఎ.; డెల్గాడో, ఎ.; డ్రెషర్, ఎల్. (2) స్కాట్, వి.; ఫిడ్లెండ్, ఎల్.; కెటూలా, ఎస్.; కోప్లెండ్, డి.; అర్యాగా, జె.; టిడా, జె.; ఓల్సెన్, ఇ.; విడెగ్రెన్, ఎస్. (3) డెల్గాడో, ఎఫ్.; కీజెన్, ఎస్.; లానెనెన్, ఎ.; ఫినిజెన్, ఇ.; ఫోస్బెరి, ఎఫ్.; హాల్బ్రుక్, జె.; బెర్గ్లెండ్, ఎ.; జోన్స్, పి. (4) వాట్సన్, బి.; ఫ్రియస్, సి.; చూ, బి.; హాల్బ్రుక్, జె.; పర్విస్, జె.; ఫిన్నిగాన్, ఎస్.; జోన్స్, ఎ.; కుచీయె, ఎమ్. (5) స్కాట్, జి.; కోప్లెండ్, డి.; డ్రెషర్, బి.; డి లా గార్సా, ఆర్.; లానెనెన్, ఐ.; కీజెన్, డి.; వాట్సన్, టి.; కెటూలా, ఎమ్. (6) విడెగ్రెన్, జె.; బార్గ్, ఎస్.; కుచీయె, ఎల్.; బెర్గ్లెండ్, ఎ.; ఓల్సెన్, బి.; ఫ్రియస్, జె.; ఫిడ్లెండ్, టి.; టిడా, పి.