జాతివాదం మరియు మతం
“నేను 1978లో అమెరికాకు వచ్చినప్పుడు, అమెరికా తన జాతివాద సమస్యను ఎప్పుడో పరిష్కరించుకుందని, నల్లవారు సమాన పౌరులుగా ఉన్నారని నేను నమ్మాను” అని దక్షిణాఫ్రికాలో జన్మించిన రచయితైన మార్క్ మాటాబానే, టైమ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. “అనేక విధాల్లో, అది నిజమేనని నాకనిపించింది. అమెరికా దక్షిణాఫ్రికా కన్నా వందేళ్లు ముందు కెళ్లిపోయినట్లు అనిపించింది. కాని ప్రజల హృదయాల్లో మాత్రం ఎక్కువ మార్పు రాలేదని తెలుసుకోవడం నాకు దిగ్భ్రమ కలిగించింది.” ఆయన దిగ్భ్రమ చెందడానికి కారణం ఏమిటి?
“అమెరికాలో అత్యంత ప్రత్యేకమైన వేళ, ఆదివారం ఉదయం పదకొండు గంటల వేళ” అని మాటాబానే చెప్పాడు. చర్చిలో కూడా, ప్రజలు మరో జాతి వారితో కలిసి ఆరాధనలో పాల్గొనడానికి వెనుకాడుతున్నారని ఆయన పేర్కొన్నాడు. “వారంలోని ఇతర దినాల్లో వారి భావాలు ఎలా ఉండాలి?” అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. విద్య మార్పుకు ఉత్ర్పేరకం వంటిదని పేర్కొంటూ, మాటాబానే ఇలా చెప్పాడు, “విద్య మూలంగా మీరు మానవుల విశ్వజనీనతను అంగీకరించేలా తయారౌతారు.”
జవాబు విద్యేనని యెహోవాసాక్షులు కూడా అంగీకరిస్తారు కానీ, వాళ్లు ప్రాముఖ్యంగా దేవుని వాక్యంపై ఆధారపడిన విద్యను సిఫారసు చేస్తారు. అవును, చివరికి జాతి వైషమ్యం తీవ్రంగా ఉన్న దేశాల్లో కూడా, జాతి దురభిమాన హద్దులను చెరిపివేయటానికి బైబిలు వారికి సహాయం చేస్తుంది. ప్రతివారం వారి రాజ్యమందిరాల్లో, వివిధ జాతులకు, జాతీయతలకు చెందిన ప్రజలు దేవుని వాక్యమైన బైబిలు కట్టడలూ సూత్రాల్లో విద్యనభ్యసించడానికి సమకూడుతారు. ఈ కూటాల్లో చందాలు సేకరించబడవు. మీరూ ఆహ్వానితులే!