తోటివారి ఒత్తిడి—మీకు ప్రయోజనకరంగా ఉండగలదా?
మన తోటివారు మనల్ని స్వీకరించాలన్న ఒక ప్రాథమికమైన కోరికతో మనమందరం జన్మించాము. తనపట్ల తోటివారు అయిష్టత చూపాలనీ, తిరస్కరించాలనీ ఎవరూ కోరుకోరు. కాబట్టి వివిధ మోతాదుల్లో మన తోటివారు మనల్ని ప్రభావితం చేస్తారు.
తోటివాడు అనేది “సమస్థాయిగల వ్యక్తి; . . . ప్రాముఖ్యంగా వయస్సు, వర్గం, లేదా హోదాల ఆధారంగా ఏర్పడిన ఒకే సామాజిక సమూహానికి చెందిన వ్యక్తి” అని నిర్వచించబడింది. కాబట్టి తోటివారి ఒత్తిడి అంటే మనపై మన తోటివారు చూపించే ప్రభావం, తద్వారా మనకు తెలిసో తెలియకో మనం వారి ఆలోచనా విధానానికీ లేదా వారి ప్రవర్తనా విధానానికి అనుగుణ్యంగా మారిపోతుంటాము. తోటివారి ఒత్తిడి అనేది సాధారణంగా నిష్ప్రయోజనకరమైనదిగా చూస్తుంటాము. అయితే, మనం ఇప్పుడు చూడబోయే విధంగా, దాన్ని మనకు ప్రయోజనకరంగా కూడా మార్చుకోవచ్చు.
అన్ని వయస్సులవారిమీదా ప్రభావం
తోటివారి ఒత్తిడి కేవలం యౌవనస్థులకే పరిమితం కాదు; అది అన్ని వయస్సుల వారినీ ప్రభావితం చేస్తుంది. మనల్ని మనం ఈ క్రింది విధంగా ప్రశ్నించుకున్నప్పుడు దాని ప్రభావం ప్రదర్శితమౌతుంది: “వాళ్లు చేస్తున్నప్పుడు నేను మాత్రం ఎందుకు చేయకూడదు?” “ఎప్పుడూ నేనే వేరుగా ఎందుకుండాలి?” “ఇతరులు ఏమనుకుంటారో, ఏమంటారో?” “నా ఫ్రెండ్స్ అందరూ డేటింగ్ చేస్తున్నారు, పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు, నాకు మాత్రం అవడం లేదు. నాలో ఏదన్నా లోపం ఉందా?”
అనురూపంగా మారాలన్న ఒత్తిడి అన్ని వయస్సుల వారినీ ప్రభావితం చేస్తుండగా, అది కౌమారప్రాయంలో మరింత తీవ్రంగా ఉన్నట్లు కనబడుతోంది. “కౌమారప్రాయంలోని చాలామంది తమ తోటివారి సమూహంలో—అంటే వారి స్నేహబృందంతోను, పరిచయస్థుల గుంపులోను పూర్తిగా కలిసిపోయివుంటారు. ఈ టీనేజర్లు తమ తల్లిదండ్రుల అంగీకారం కాక తమ తోటివారి అంగీకారం కోరుకుంటారు. అంతేగాక వారు ఆ అంగీకారాన్ని పొందడానికి తమ ప్రవర్తనను మార్చుకోవచ్చు” అని ద వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా చెబుతుంది. టీనేజర్లు “తమను తోటివారు అంగీకరించి, ఇష్టపడితేనే తాము లోపంలేకుండా ఎదుగుతున్నట్లు భావిస్తారు” అని కూడా అది జతచేస్తుంది. అందుకోసం వారు “తమ వస్త్రధారణా విధానం, నాయకత్వ సామర్థ్యం, డేటింగ్‌లో సఫలం కావడం వంటివి తమ పాపులారిటీని ప్రభావితం చేస్తాయని తాము భావిస్తున్న వాటిలో నిమగ్నమైపోతారు.”
చాలామంది వివాహిత దంపతులు తాము ఎటువంటి ఇంటిని ఖరీదు చేయాలి లేదా ఎటువంటి ఇంట్లో అద్దెకుండాలి, ఏ మోడల్ కారుని కొనాలి, పిల్లల్ని కనాలా వద్దా వంటి విషయాల్లోనూ, అలాగే మరిన్ని ఇతర విషయాల్లోనూ తమ నిర్ణయాల్ని తోటివారి ఒత్తిడి ప్రభావితం చేస్తున్నట్లు—తమ సమాజంలో, తమ సహచరుల్లో, లేదా తమ సొంత జాతివారిలో ఏది అంగీకారంగా ఉంటుందో అది ప్రభావితం చేస్తున్నట్లు కనుగొంటారు. కొన్ని కుటుంబాలు పొరుగువారితోను తోటివారితోను వస్తుదాయికంగా సమానస్థాయిలో ఉండటానికి చివరికి అప్పుల్లో కూడా కూరుకుపోతాయి. అవును మన లక్ష్యాలు, మన ఆలోచనలు, మన నిర్ణయాలు తరచూ తోటివారి ఒత్తిడి అనే ఒక అదృశ్య శక్తిని వెల్లడిస్తాయి. దానికున్న శక్తి దృష్ట్యా, మనం వెళ్లాలనుకున్న మార్గంలో మనకు సహాయపడేందుకు ఒక ప్రయోజనకరమైన రీతిలో తోటివారి ఒత్తిడితో మనం వ్యవహరించగలమా? తప్పకుండా అలా చేయగలం !
ఆరోగ్యకరమైన తోటివారి ప్రభావాన్ని ఉపయోగించుకోవడం
అనుకూలమైన దృష్టికోణంగల ప్రజలనూ, మరితర ఆరోగ్యకరమైన ప్రభావాలనూ తమ రోగులచుట్టూ కల్గివుండటం వల్ల కలిగే విలువ వైద్యులకూ మరితర ఆరోగ్య కార్యకర్తలకూ తెలుసు. అటువంటి వాతావరణం వారు కోలుకోవడానికి ప్రేరకంగా పనిచేయగలదు. ఉదాహరణకు, కాలో చెయ్యో కోల్పోయిన వ్యక్తులు, అదే విధమైన బాధల్ని అనుభవించిన వ్యక్తుల మంచి మాదిరీ ప్రోత్సాహాల మూలంగా తాము శారీరకంగానూ మానసికంగానూ కోలుకోవడానికి పట్టే సుదీర్ఘమైన కాలమంతటిలో తరచూ సహాయాన్ని పొందడం జరుగుతోంది. దీన్నిబట్టి, ఆశావాదులైన అనుకూలవాదులైన ఆదర్శ వ్యక్తులు ఉండే ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో నిమగ్నం కావడం, సరియైన తోటివారి-ఒత్తిడిని ఉపయోగించుకోవడానికైన ఉత్తమమైన మార్గం అని స్పష్టమౌతుంది.
ఈ సూత్రం క్రైస్తవ సంఘానికి కూడా వర్తిస్తుంది, ఎందుకంటే తన ప్రజలు క్రమంగా సమావేశం కావాలని యెహోవా నిర్దేశించడానికి గల కారణాల్లో ఒకటి, అనుకూలమైన తోటివారి ప్రభావం. ‘ప్రేమ చూపడానికి, సత్కార్యములు చేయడానికి ఒకరినొకరు పురికొల్పాలని’ దేవుడు మనకు ఉద్బోధ చేస్తున్నాడు. (హెబ్రీయులు 10:24, 25) నేటి లోకంలో అనేకానేకమైన నిరుత్సాహాన్ని కలిగించే, బాధను కలిగించే ఒత్తిళ్ళు ఉన్నాయి గనుక అటువంటి ప్రోత్సాహం అమూల్యమైనది. ఈ ఒత్తిళ్ల మూలంగా క్రైస్తవులు ఆధ్యాత్మికంగా బలంగా ఉండటానికి ‘పోరాడాల్సివస్తుంది.’ (లూకా 13:24) అందుకని, తోటి విశ్వాసుల ప్రేమపూర్వకమైన మద్దతు మనకు అవసరం, దాన్ని అభినందించాలి. దానికితోడు, కొందరు ‘శరీరంలో ముల్లుల్ని,’ బహుశ అస్వస్థతల్నో లేదా అశక్తతల్నో సహిస్తుండాల్సి రావచ్చు. (2 కొరింథీయులు 12:7) మరితరులు చెడు అలవాట్లను అధిగమించడానికి, క్రుంగుదల నుండి దూరం కావడానికి పోరాడుతుండవచ్చు, లేదా వారు జీవితపు డిమాండ్లను చేరుకోవడంలో కష్టాన్ని అనుభవిస్తుండవచ్చు. అందుకని మనం, యెహోవా దేవుణ్ని సన్నిహితంగా అంటిపెట్టుకుని ఉండి, ఆయన సేవ చేయడంలో ఆనందాన్ని అనుభవించే ప్రజల చుట్టూ ఉండటం వివేకయుక్తం. అటువంటి తోటివారు మనకు ఉత్తేజాన్ని కలుగజేస్తూ, మనం ‘అంతము వరకు సహించడానికి’ సహాయం చేస్తారు.—మత్తయి 24:13.
అందుకని, మనం సరైన తోటివారిని ఎంపిక చేసుకోవడం ద్వారా వారు మనపై చూపించే ప్రభావాన్ని నియంత్రించగలము. దానికితోడు, మనం తోటివారినుండి పొందుతున్న వ్యక్తిగత ప్రోత్సాహాన్ని, క్రైస్తవ కూటాల్లో అందించబడే చక్కని ఆధ్యాత్మిక ఆహారం, ఆచరణాత్మకమైన నడిపింపులు బలపరుస్తాయి.
నిజమే, క్రైస్తవ కూటాలకు హాజరవ్వడం అన్నిసార్లు సులభమైన విషయం కాదు. కొందరికి తమ వివాహ భాగస్వాముల నుండి చాలా తక్కువ మద్దతు లభిస్తుండవచ్చు లేదా అసలే లభిస్తుండకపోవచ్చు, ఇతరులకు సిద్ధం చేయడానికి పిల్లలుండవచ్చు, మరితరులకు రవాణా ఒక సమస్యగా ఉంటుండవచ్చు. కానీ ఆలోచించండి: మిమ్మల్ని ఆపడానికి ఈ అవరోధాల్ని మీరు అనుమతించకపోతే, అప్పుడు అటువంటి పరిస్థితులతో పోరాడుతున్న మరితరులకు మీ మాదిరి ప్రేరణనివ్వగలదు. మరో మాటల్లో చెప్పాలంటే, మీరూ మీలాంటి ఇతరులూ కేవలం ఒక చక్కని మాదిరిని మాత్రమేగాక, ఒక ఆరోగ్యకరమైన రూపంలో తోటివారి ప్రభావాన్ని కూడా అందిస్తారు—అదీ బలవంత పెడుతున్నారనే ఆలోచనకలగనివ్వకుండానే.
నిజానికి, తానే అనేకమైన కష్టాల్నీ అవరోధాల్నీ అధిగమించాల్సివచ్చిన అపొస్తలుడైన పౌలు, చక్కని తన మాదిరినీ మరితర పరిణతి చెందిన క్రైస్తవుల మాదిరినీ అనుకరించమని క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు. ఆయనిలా అన్నాడు: “సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి; మేము మీకు మాదిరియైయున్న ప్రకారము నడుచుకొనువారిని గురిపెట్టి చూడుడి.” (ఫిలిప్పీయులు 3:17; 4:9) థెస్సలొనీకలోని తొలి క్రైస్తవులు పౌలు చూపించిన చక్కని మాదిరిని అనుకరించారు. వారి గురించి పౌలు ఇలా వ్రాశాడు: “పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి.” (1 థెస్సలొనీకయులు 1:6, 7) మన అనుకూల వైఖరి, అనుకూల మాదిరి మనం సహవసించే వారిపైన అదే విధమైన ప్రభావాన్ని చూపించగలదు.
ప్రతికూల ప్రభావాలకు దూరంగా ఉండండి
మనం తోటివారి నుండి వచ్చే అనారోగ్యకరమైన ఒత్తిడికి దూరంగా ఉండాలనుకుంటే, మనం ‘శరీరమును అనుసరించి నడుచుకునేవారి’ ప్రభావాన్ని నిరోధించాలి. (రోమీయులు 8:4, 5; 1 యోహాను 2:15-17) లేకపోయినట్లైతే, తోటివారి నుండి వచ్చే హానికరమైన ఒత్తిడి మనల్ని యెహోవా నుండీ ఆయన వివేకయుక్తమైన సలహా నుండీ దూరంగా తీసుకుపోతుంది. సామెతలు 13:20 ఇలా చెబుతుంది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” తోటివారి నుండి వచ్చే అనారోగ్యకరమైన ఒత్తిడి మూలంగా చెడిపోయిన వారెవరి గురించైనా మీకు తెలుసా? ఉదాహరణకు, కొందరు క్రైస్తవులు తమ తోటివారి ప్రభావం మూలంగా వస్తుసంపదల వెంబడి పడటంలోను, అనైతికతలోను, లేదా మాదకద్రవ్యాలు మత్తుపానీయాల దుర్వినియోగంలోను పడిపోయారు.
క్రైస్తవ సంఘంలోనూ, మనం ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవారిని సన్నిహిత సహచరులుగా ఎంపిక చేసుకున్నట్లైతే తోటివారి నుండి వచ్చే అనారోగ్యకరమైన ఒత్తిడి క్రిందికి రాగలము. (1 కొరింథీయులు 15:33; 2 థెస్సలొనీకయులు 3:14) తరచుగా అటువంటి వారు ఆధ్యాత్మిక విషయాలను గురించి చర్చించడానికి సుముఖులుగా ఉండరు; అటువంటి చర్చల్లో పాల్గొని ఆనందించేవారిని వారు ఎగతాళి చేస్తుండవచ్చు కూడా. వీరిని మనం మన సన్నిహిత సహచరులుగా ఎంపిక చేసుకుంటే, ఈ తోటివారి ప్రభావం మనం అదే విధమైన మూసలోనికి మలచబడేలా ఒత్తిడి చేస్తుంది. త్వరలోనే మన ఆలోచనలూ మన వైఖరులూ వారి ఆలోచనల్నీ వైఖరుల్నీ ప్రతిబింబిస్తున్నట్లు కనుగొంటాము. తమ విశ్వాసం విషయంలో నిజాయితీగా ఉన్నవారిని గురించీ, ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలని ప్రయత్నిస్తున్నవారిని గురించీ మనం ప్రతికూలంగా కూడా ఆలోచించనారంభించవచ్చు.—1 తిమోతి 4:15.
యెహోవాను ప్రీతిపర్చడానికి కృషిచేసే వారితో, ఆధ్యాత్మిక విషయాల్లో ఆహ్లాదాన్ని అనుభవించే వారితో స్నేహాల్ని పెంపొందించుకోవడం ఎంత జ్ఞానయుక్తం ! “పైనుండి వచ్చు జ్ఞానము”ను ప్రతిబింబించడానికి అటువంటి సహవాసులు మనకు సహాయపడతారు. అది “మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, . . . వేషధారణయైనను లేనిదియునై యున్నది.” (యాకోబు 3:17) దీనర్థం, ఆధ్యాత్మిక విషయాలపట్ల ఉన్ముఖులైన వ్యక్తులకు వాటి గురించి తప్ప మరే ఇతర విషయాలను గురించీ మాట్లాడే అవకాశం లేదని కాదు. వాస్తవం అందుకు పూర్తి విరుద్ధమైనది ! తేజరిల్లు! వంటి వాచ్ టవర్ ప్రచురణల్లో చర్చించబడే వైవిధ్యంతో కూడిన ఆసక్తికరమైన విషయాలను గురించి ఒక్కసారి ఆలోచించండి. చర్చించడానికి ఉన్న ఆరోగ్యకరమైన విషయాల లిస్టుకు నిజంగా అంతులేదు, విస్తారమైన విషయాల్లో ఆసక్తిని కనపర్చడం ద్వారా మనం జీవంపట్లా, యెహోవా హస్తకృతి పట్లా మనకు గల ప్రేమను ప్రతిబింబిస్తాము.
ఒక చక్కని టెన్నిస్ ఆటగాడు వేరే సమర్థులైన ఆటగాళ్లతో ఆడటం ద్వారా తన ఆటకు మెరుగులు దిద్దుకున్నట్లే, సరియైన సహవాసులు మనల్ని మానసికంగాను, భావోద్వేగపరంగాను, ఆధ్యాత్మికంగాను మన స్థాయిని పెంచుతారు. మరోవైపు, తప్పుడు సహవాసులు ద్వంద్వ ప్రమాణాలతో కూడిన జీవితాన్ని జీవించేలా ప్రోత్సహిస్తూ మనల్ని వేషధారణతో కూడిన విధానానికి నడిపించగలరు. ఆత్మగౌరవంతోపాటు నిర్మలమైన మనస్సాక్షిని అనుభవించడం ఎంత శ్రేష్ఠం !
ప్రయోజనం పొందిన కొందరు
బైబిలు సిద్ధాంతాల్ని నేర్చుకోవడం, నైతికంగా ఆధ్యాత్మికంగా అది కోరుతున్న విషయాల్ని నేర్చుకోవడం చాలామందికి అంత కష్టమైన విషయంగా ఉన్నట్లు అన్పించలేదు. అయితే కష్టంగా ఉండగల విషయం ఏమిటంటే ఈ విషయాల్ని ఆచరణలో పెట్టడమే. ఈ క్రింది ఉదాహరణలు చూపిస్తున్నట్లుగా, ఆరోగ్యకరమైన తోటివారి ప్రభావం మనం యెహోవాను పూర్ణమనస్సుతో సేవించేందుకు మనకు సహాయం చేయగలదు.
తన భార్యతోపాటు పూర్తికాల పరిచర్యలో ఉన్న ఒక సాక్షి తన తోటివారి మాదిరులు తన జీవితంలోని లక్ష్యాలను ప్రభావితం చేశాయని చెబుతున్నాడు. ఆయన ఎదుగుతున్నప్పుడు అనారోగ్యకరమైన ప్రభావాలతో ఆయన పోరాడాల్సివచ్చింది. కానీ ఆయన తనను పరిచర్యలోనూ, క్రైస్తవ కూటాలకు హాజరవ్వడంలోనూ క్రమంగా ఉండమని ప్రోత్సహించిన వారినే తన స్నేహితులుగా ఎంపిక చేసుకున్నాడు. ఈ సహవాసులను అంటిపెట్టుకుని ఉండటం, ఆయన ఆధ్యాత్మిక పరిణతికి ఎదిగే మార్గంలో కొనసాగేలా సహాయం చేసింది.
మరో సాక్షి ఇలా వ్రాస్తున్నాడు: “నేనూ నా భార్యా పెండ్లి చేసుకున్న తర్వాత, మా వయస్సే ఉండి క్రమ పయినీరు సేవ చేస్తున్న దంపతులున్న సంఘానికి తరలి వెళ్లాము. వారి మాదిరి మేము కూడా పూర్తికాల పరిచర్యలోనికి అడుగిడటానికి దోహదపడింది. తర్వాత మేము కూడా ఆ సంఘంలో పయినీరు ఆత్మను నింపడానికి పనిచేశాము. దాని ఫలితంగా, చాలామంది పయినీర్లుగా మాతోపాటు చేరారు.”
దైవపరిపాలనా లక్ష్యాలుగల వారితో సహవసించడం యెహోవాకు విధేయత చూపడాన్ని సులభతరం చేయగలదు. ఆరోగ్యకరమైన తోటివారి ప్రభావానికున్న మరో ప్రయోజనకరమైన ఫలితం ఇది. యౌవనస్థునిగా ఉన్నప్పుడు పూర్తికాల పరిచర్యను ప్రారంభించి, అటుతర్వాత ప్రయాణ పైవిచారణకర్త అయిన ఒక సాక్షి ఇప్పుడు వాచ్ టవర్ సొసైటీ బ్రాంచీల్లో ఒకదానిలో సేవ చేస్తున్నాడు. ఆయనిలా వ్రాశాడు: “మా ఇంటికి పూర్తికాల సేవకుల సందర్శనాలు నా తొలి మధుర జ్ఞాపికల్లో కొన్ని. మా ఇంట్లోని డైనింగ్ టేబుల్లో ఎప్పుడూ మరో వ్యక్తికోసం స్థలం ఉండేది. ఒక ప్రాంతీయ పైవిచారణకర్త నాకు పదేళ్ళప్పుడు ఒక ప్రీచింగ్ బ్యాగ్ ఇచ్చాడు. నేనా బ్యాగుని ఇప్పటికీ అమూల్యంగా ఎంచుతాను.”
తను టీనేజ్‌లో ఉన్నప్పటికాలాన్ని తలపోస్తూ ఈ సాక్షి ఇంకా ఇలా అంటున్నాడు: “సంఘంలోని చాలామంది యువకులు సంఘ కార్యకలాపాల్లో నిమగ్నం కావాలని ఇష్టపడేవారు, వారి మాదిరి మాలో చాలామందిమి కూడా అలానే చేసేందుకు పురికొల్పింది.” ఆరోగ్యకరమైన తోటివారు, ఒక చిన్న మొలకలాంటి ఈ యౌవనస్థుడు ఒక వృక్షంలాంటి క్రైస్తవ పురుషునిగా ఎదిగేందుకు సహాయపడ్డారు. తల్లిదండ్రులారా, మీ పిల్లలపై ఒక అనుకూలమైన, క్షేమాభివృద్ధికరమైన ప్రభావాన్ని చూపించగలవారిని మీరు మీ ఇంటికి ఆహ్వానిస్తారా?—మలాకీ 3:16.
నిజమే, పైన ప్రస్తావించబడిన వ్యక్తుల్లా పూర్తికాల పరిచర్యలో మనలో ప్రతి ఒక్కరమూ పాల్గొనలేక పోతుండవచ్చు. కానీ ‘పూర్ణహృదయముతో పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో’ యెహోవాను ప్రేమించడం మనలో ప్రతి ఒక్కరమూ నేర్చుకోగలము. (మత్తయి 22:37) మన తోటివారి ఎంపిక, మనం ఆ ప్రేమను పెంపొందించుకోవడంలోను, తద్వారా నిత్యజీవం కోసరమైన మన ఉత్తరాపేక్షల విషయంలోను ఒక ప్రముఖ పాత్రను పోషించగలదు.
కీర్తనల గ్రంథకర్త జీవితంలో నిజమైన విజయానికి ఒక సరళమైన, అయినా ప్రభావవంతమైన సూత్రాన్నిచ్చాడు: “దుష్టుల ఆలోచనచొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును, అతడు చేయునదంతయు సఫలమగును.”—కీర్తన 1:1-3.
ఎంతటి అద్భుతమైన హామీ! మనం అపరిపూర్ణులమైనప్పటికీ తప్పులు చేస్తున్నప్పటికీ మన జీవితాల్ని నిర్దేశించేందుకు యెహోవాను అనుమతించినట్లైతే, ‘లోకమందున్న మన సహోదరుల’ ఆరోగ్యకరమైన ఆ దైవదత్తమైన తోటివారి ప్రభావాన్ని ఉదారంగా ఉపయోగించుకున్నట్లైతే మన జీవితాలు విజయవంతం అవుతాయి.—1 పేతురు 5:9.
[24వ పేజీలోని చిత్రం]
సంఘం తోటివారి నుంచి వచ్చే ఒక ఆరోగ్యకరమైన ప్రభావాన్ని అందిస్తుంది
[25వ పేజీలోని చిత్రం]
తల్లిదండ్రులారా, మీ పిల్లలు క్షేమాభివృద్ధిని కలుగజేసే తోటివారితో కలిసేలా ప్రోత్సహించండి